అలా శరణాగతులైన దేవతల దురవస్థను చూసి, దాసజనుల కోరికలు నెరవేర్చే ఆ పరమేశ్వరుడైన శ్రీమహావిష్ణువు వారిలో “మీరు దుఃఖపడవద్దు. నేను నా మాయా బలంతో మీకు అమృతాన్ని మళ్ళీ సాధించి పెడతాను అని అన్నాడు. ఆ సమయంలో ఈ అమృతరసాన్ని మనమే తాగేద్దాం అని రాక్షసులు తమలో తాము కలహించుకోవడం ప్రారంభించారు. వారిలో బలవంతులైన వారు ఈ విషయంలో అసూయ పడ్డారు. మనమే తాగేద్దాం అని వారి భావన. కాని వారిలో దుర్బలులైన వాళ్ళు కొందరున్నారు. వారు తమకు అమృతం రానివ్వరేమో అనే మాత్సర్యం పుట్టి ధర్మసూక్ష్మాన్ని లేవనెత్తారు. “దీర్ఘసత్రయాగాలు జరిగేటప్పుడు పాటించే విధానాన్నే ఇప్పుడూ పాటిద్దాము. యాగం లాంటి ఈ సాగరమథనంలో మనతోపాటు సమానంగా శ్రమించిన దేవతలకు ఈ అమృతంలో భాగం ఇవ్వడం మన కర్తవ్యం. ఇది సనాతన ధర్మం. అంచేత అమృతకలశాన్ని వదలండి, వదలండి” అంటూ నిరసన తెలిపారు.
ఒకడి చేతిలో ఉన్న అమృతకలశాన్ని ఇంకో బలవంతుడు లాగుకొన్నాడు. వాడి కన్నా బలవంతుడు ఇంకొకడు వాడిని చిక్కపట్టుకొని ఆ కలశాన్ని ఎత్తుకొని పరిగెత్తాడు. తక్కిన వాళ్ళు కేకలు వేయడం ప్రారంభించారు.
శ్రీమహావిష్ణువు తనలో తాను నవ్వుకొంటూ అసురుల్ని అణచివేయడానికి జగన్మోహనమైన స్త్రీ రూపాన్ని ధరించి ప్రత్యక్షమయ్యాడు. ఆ మాయామోహినికి మెత్తని అడుగులు, నిగనిగలాడే మోకాళ్ళు, అరటి బోదెల్లాంటి తొడలు, పెద్దవైన పిరుదులు, మిక్కిలి సన్నని నడుము; చిగురుటాకుల వంటి లేత (ఎర్రని) చేతులు; పెద్దవైన వక్షోజాలు; శంఖంలాంటి కంఠం; దొండపండు వంటి పెదవి, చంద్రబింబం లాంటి ముఖం, వెలుగులు చిమ్ముతున్న కన్నులు, తుమ్మెదల బారువంటి వెండ్రుకలు; నెలవంకవంటి నుదురు ఒప్పుగా, కర్ణాభరణాలతో, బాహుపురులతో, వివిధ రత్నహారాలతో, గాజులతో, కాలి అందెల సవ్వడితో అందరినీ మోహింపచేస్తూ ఆమె వారిమధ్యకు వచ్చింది.
(ఈ రూపం ఎందుకు స్వామి ధరించాడన్నది ముఖ్యమైన ప్రశ్న మూలంలో ఇలా ఉంది.
ఏతస్మిన్నంతరే విష్ణుః సర్వోపాయవిదీశ్వరః
యోషిద్రూపమనిర్దేశ్యం దధార పరమాద్భుతమ్ (8-8-41)
(అంతలో సర్వోపాయ విదుడు - (తెలిసినవాడు) అయిన శ్రీమహావిష్ణువు కలహించుకొంటున్న రాక్షసులమధ్య వర్ణించడానికి వీలుకాని పరమాద్భుత స్త్రీ రూపాన్ని పొందాడు)
అమృతాన్ని దేవతలకే పంచాలి అంటే రాక్షసుల్ని మాయామోహంలో పడవేయక తప్పదు. అందుకే దేవతారక్షకుడైన స్వామి ఈ 'మోహినీ' రూపాన్ని దాల్చాడు. ఎవరిని చూస్తే బుద్ధి పనిచెయ్యకుండా కొయ్యబారిపోతుందో - ఆ రూపలక్షణం 'మోహనం'.)
ఆ సమయంలో స్వామి జగన్మోహనమైన రూపంతో.
తన వక్షోజాలమీద ఉన్న పైటను జారుస్తుంది. అలా జార్చి సుతారంగా చక్కజేసుకొంటుంది. తళతళలాడే తన చెక్కిళ్ళను చేతులలో తాకుతుంది. తాకి వెంటనే వదిలిపెడుతుంది. జిగేలుమనిపించే కడగంటి చూపుల్ని ప్రసరింపజేసి వెంటనే రెప్పలు మూస్తుంది. చిరునవ్వులనే వెన్నెలను చిలికిస్తుంది. వెంటనే తన ఎర్రని పెదవిని మెలికపెడుతుంది. వికసించిన తన కొప్పులోని పూల గుబాళింపును నలుగడలా వ్యాపింపజేస్తుంది. కడియాల గలగలల్ని, అందెల మువ్వల సవ్వడిని దిక్కులకు వ్యాపింపజేస్తుంది. సన్నగా ఉన్న తెల్లటి పైట ఎగురగా తన మేనికాంతులు ఒకచోట నిలువకుండా అందరిమీద వ్యాపించాయి.
ఈ విధంగా ఆ కపటవనిత జగత్తును మోహింపజేసే దేవతలాగా తన ముఖంలోని సుగంధాన్ని ఆశించివచ్చిన తుమ్మెదల్ని అదిలిస్తూ, చిగురాకు పొదరిండ్లలో దూరదూరంగా తిరుగుతూ వినోదిస్తుండగా రాక్షసవీరులు ఆమెను చూచి
ఓ వనితా! నీవు ఏ లోకంనుండి వచ్చావు? మా నుండి నీకు ఏం కావాలి? నీ పేరేమిటి? నీ లావణ్యం ఓహో! నీ రూపం అతిమధురం. నవయౌవనంలో ఉన్న నీ అవయవాలకు జోహారు! అవును! ఇంత అందమేమిటో నీకు! దేవతలలో, గంధర్వులలో, సిద్దులలో, రాక్షసులలో, మనుష్యులలో ఏ కన్యకైనా నీ సౌందర్యగరిమ ఉందా! ప్రాణాలను, చిత్తాన్ని ఇంద్రియాలను వికారాలకు గురి చేసేలా నీ మీద ప్రత్యేకమైన ప్రీతిలో బ్రహ్మ నిన్ను మలిచాడు కాబోలు! ఇక మేమంటావా! కశ్యపప్రజాపతి కుమారులం. వరుసకు దేవతలకు సోదరులం. స్వచ్చమైన పరాక్రమశాలులం. ఒక ప్రయోజనం కొరకు మేము మా దాయాదులు ఇక్కడ చేరాం. మాలో మాకు పంపకాలు తెగని ఈ పదార్థాన్ని పంచిపెట్టు.
ఓ గజగమనా! మేము, దేవతలం అందరం కలసి బారులుగా సభతీర్చి కూర్చుంటాము. 'నీవు నీవారు - పరాయివారు' అనే తేడా పాటించని మనస్సుతో ఏ మాత్రం సంకోచం లేకుండా నీకు సముచితమనిపించిన విధంగా, ఉభయులకూ సరిగా అమృతం అందేలా పంచిపెట్టు.
ఈ విధంగా రాక్షసులు గదమాయించినట్టు అభ్యర్థించగా; మోహినీ రూపంలో ఉన్న శ్రీహరి అందమైన తన తీక్షణమైన వాలుచూపుల బాణాలతో వారి ఓర్పును సడలించి, పైకి చిరునవ్వొకటి నవ్వి, మొగం పైకెత్తి ఇలా అన్నాడు.
(మూలంలో ఈ మాయావి 'నవ్వు' ఎలా ఉందో వ్యాసుడు చెప్పాడు.
'ప్రహస్య రుచిరాపాంగైర్నిరీక్షన్నిదమబ్రవీత్ (8-9-8))
దేవతలకు శత్రువులైన ఓ రాక్షసులారా! నేను ఇష్టం వచ్చినట్టు తిరిగేదాన్ని. నాకు నచ్చిన మగవాళ్ళ పొందు పొందేదాన్ని. అలాంటి నాపైన మీలాంటి వీరులకు నమ్మకం కుదిరేనా! పెద్దలైనవారు నాలాంటి వారిని నమ్మరు. దగ్గరికి చేర్చరు.
అందగత్తెలు తేనెల ఊటల్లా మాట్లాడతారు. కాని వారి ఆలోచనలు కార్చిచ్చుల్లా ఉంటాయి. వారి స్నేహాలు తోడేళ్ళ చెలిమిలాంటిది. ఇలాంటి స్త్రీలను నమ్మవచ్చని వేదాలు చెబుతాయా! (చెప్పవు - వేదసమ్మతం కాదు)
'అలాగే! నా శక్తివంచన లేకుండా, చక్కగా పంచిపెడతాను లెండి. ఏ అనుమానం పెట్టుకోకండి' అని మోహిని చెప్పగానే, రాక్షసులు ఆమెకు అమృత కలశాన్ని ఇచ్చారు.
ఆ చల్లని చూపులు, చల్లని మాటలు, ఆ బుజ్జగింపులు, దొంతర దొంతరలుగా తాళ్ళతో కట్టినట్టుగా వారి నోళ్ళను మూసివేశాయి.
అలా ఆ మోహినీ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు అమృతకలశాన్ని తన చేతిలోకి తీసుకొని చిరునవ్వు చిందే పలుకులతో "నేను పంచిపెట్టే విధంగా మంచి-చెడు అనకుండా మీరు అంగీకరించాలి” అని వారితో చెప్పగా వారుకూడా 'అలాగే కానిమ్ము' అన్నారు. తరువాత సురాసురులు, దైత్యదానవులు అందరూ ఉపవాసంచేసి, స్నానాలు పూర్తిచేసి, అగ్నికార్యం నిర్వహించి, బ్రాహ్మణులకు గో భూ హిరణ్యదానాలు చేసి, వారి ఆశీర్వచనాలను గ్రహించి, తెల్లటి వస్త్రాలు ధరించి, రత్నాలు తాపిన బంగారు సభామంటపంలో చేరారు. ఆ మండపం గంధమాల్యాలతో, ధూప దీపాలతో శోభాయమానంగా ఉంది. అందులో వారు తూర్పుముఖంగా కొసలున్న దర్భాసనాల మీద తూర్పుముఖంగా బారులు తీర్చి కూర్చున్నారు.
ఆ మోహినీ దేవి పద్మంవంటి తన హస్తంలో అమృతకలశాన్ని పట్టుకొని, కటిభారంతో; కుచభారంతో; శిరోజభారంతో అలసిపోయి, తాను ధరించిన ఆభరణాల గలగల ధ్వనులతో ఒయ్యారంగా సభామండపంలోకి అడుగుపెట్టింది.
ఆమె కర్ణాభరణాలు ధరించింది. అవి ప్రకాశిస్తుండగా వాటి తళతళల చేత ఆమె ముక్కు ముఖము, చెవులు, చెక్కిళ్ళు, కనుగొనలు ధగధగలాడుతున్నాయి. ఆమెను చూస్తే లక్ష్మీదేవికి సాటిగా కనిపిస్తోంది. ఆమె అందచందాలు చూసి దేవాసురులు మోహంలో మునిగిపోయారు.
(ఎంత మోహినీ అవతారం దాల్చినా విష్ణువు తన దివ్యప్రభావాన్ని దాచుకోలేకపోయారు.
శ్రీసతియను సతి; శ్రీసతి= లక్ష్మీదేవి; అగు= అయిన; సతి= మరోస్త్రీ - ఇది మామూలు అర్థం. మూలంలో చూస్తే 'శ్రీసతి' అనే మాట వెనుక పోతనగారు భావించింది పరదేవతా రూపిణినే అని స్పష్టంగా చెప్పవచ్చు.)
ఆమె ఇలా ఆలోచించింది. 'ఈ రాక్షసులకు అమృతం పోయటం పాములకు పాలు పోయటంలాంటిది. ఆపదను కల్గిస్తుంది. అంచేత అలా జేయరాదు' అనుకొని రాక్షసుల్ని ప్రత్యేకంగా మరోవైపు కూర్చోబెట్టింది.
ఈ విధంగా వారిని రెండు పంక్తులలో వేరువేరుగా కూర్చోబెట్టింది.
'రాక్షసులారా! తొందరపడకండి. వినండి, ఇప్పుడే వచ్చేస్తాను. అటువైపు నిమ్మళంగా కూర్చోండి; అంటూ కన్నులు అల్లార్చింది. చనుగవ మీది పయ్యెదను జారవిడిచింది. వదిన మరుదుల వరుసలు కల్పించి వారిని వంచించింది. మర్మస్థానాల మరుగులు తీసి మళ్ళీ కప్పుకొన్నది. చిరునవ్వులతో మైమరిపించింది. నెరజాణలాగా మాట్లాడి వారిని లొంగదీసుకొంది. వారు మాట్లాడే స్థితిలో లేరు. దేవతల్ని 'ఆలస్యం చేయకుండా తాగండి' అని నేర్పుతో అమృతజలాల్ని ఇవ్వగా దానితో దేవతలంతా తృప్తిపడి పొగడుతుండగా ఆ మోహినీదేవి వారికే పంచివేసింది.
ఆ సమయంలో, ఆ రాక్షసులు ఇలా ఆలోచించసాగారు. ఈమె మనకూ దేవతలకూ గొడవలేకుండా పంచిపెడతానని చెప్పి ఈ పనికి పూనుకొన్నది. ఆ పనిచేయకుండా తప్పుతుందా! తప్పదు. తప్పించుకోదు. కానీ మనం సాహసించి రమ్మని పిలిస్తే మారు పలకదేమో! తిరిగి చూడకుండా వెళ్ళిపోతుందేమో!; చనుదోయిపైన పైట మళ్ళీ వేసేసుకొంటుందేమో; మనతో ఇక చాలనుకొంటుందేమో! మరోమాట కలిపి మాట్లాడితే భయపడి వెనుదిరిగి పోతుందేమో! మనపై కోపగిస్తుందేమో! మనల్ని విశ్వసించదేమో! అనుకొంటూ ఆమె చూపులకు వాళ్ళు కరిగిపోయారు. మాట్లాడి బెదిరిస్తే తమపై ఆమె ప్రేమ ఎక్కడ భంగపడుతుందో అని మిన్నకుండిపోయారు తప్పా 'మగువా! తొందరగా తీసుకురా' అంటూ అడగలేకపోయారు.
ఇంత జాగ్రత్తగా శ్రీహరి పంచుతున్నా కూడా రాహువు అనే అసురజాతికి చెందినవాడు దేవతల గుంపులోకి చొరబడి, దేవతల్లాగానే అమృతపానం చేయడం సూర్యచంద్రులు చూశారు. నారాయణునికి సైగచేశారు. వెంటనే శ్రీహరి సుదర్శన చక్రం ప్రయోగించి వాడి తలను ఛేదించాడు. అమృతంతో తడిసిన అతడి తల మృత్యువు లేనిదయింది. మిగిలిన మొండెం నేలమీద పడిపోయింది.
('సింహిక' అనే అమరకాంతకు జన్మించినవాడు 'రాహువు'. ఇతనికి 'స్వర్భాను'వనిపేరు (చూ.మూలం 8-9-24). అందుకే 'అర్ధకాయుడని” పేరు పొందాడు.
అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యవిమర్దనమ్
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ - అని వ్యాసుడు చేసిన రాహుస్తుతి.
మొండానికి కేతువని పేరుందని కొందరంటారు - కాని కేతువును 'ఛాయా' (రాహువు నీడగా) గ్రహంగా చెప్పడమే శాస్త్రీయమని పెద్దలంటారు.
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ - అని కేతు గ్రహస్తుతి. అయినా సుర (అమృతం) స్పర్శవల్ల రాహు-కేతువులు నవగ్రహాలలో స్థానం పొందారు.
అప్పుడు బ్రహ్మదేవుడు ఆ శిరస్సును గ్రహించి అంబరవీథిలో రాహుగ్రహంగా నిలిపాడు. ఆ రాహువే తన శత్రుత్వాన్ని వదలకుండా అమావాస్యనాడు సూర్యుని, పూర్ణిమనాడు చంద్రుని - ఆయా పర్వదినాలలో మీంగుతూంటాడు. వాటినే సూర్యచంద్రగ్రహణ 'పర్వ' దినాలంటారు.
(గ్రహసంబంధమైన పుణ్యదినం 'పర్వం'. సంక్రాంతి (మంకర) ఉగాది (సూర్య) లాగా అమావాస్య / పూర్ణిమలూ పర్వదినాలే.)
ఈ విధంగా శ్రీహరి ఒక చుక్క కూడా రాక్షసులకు చిక్కకుండా అమృతాన్ని అంతా బాహాటంగానే దేవతలకు పోశాడు. తరువాత తన మొదటి దివ్యమంగళ విష్ణురూపాన్ని ధరించాడు. దీన్ని చూస్తున్న రాక్షసవీరులు భయపడ్డారు.
దేవతలు రాక్షసులు శ్రమలో, బలంలో, శక్తిసామర్థ్యాలలో, ధనసంపదలో, ఆత్మగౌరవంలో అన్నింటా సములే. కాని వారివారికి లభించిన ఫలితాలు మాత్రం వేరయ్యాయి. దేవతలు శ్రేయస్సును పొంది ధన్యులయ్యారు. తమ భుజబల గర్వంతో మిడిసిపడిన రాక్షసులు ఎన్నో కష్టాలు చవిచూశారు. అంచేత విష్ణుదేవుని శరణుపొందని వారు శుభాన్ని పొందజాలరు.
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
No comments:
Post a Comment