Thursday, March 19, 2026

A White Elephant named Airavata (or Airavat) and Others Emerged During the Samudra Manthan - పాలకడలిం దరుచునెడ నైరావతాదులు జనించుట

పాలకడలిం దరుచునెడ నైరావతాదులు జనించుట

ఇలా సముద్రాన్ని చిలుకుతుండగా పాలసముద్రంలో నుండి మొదట కామధేనువు పుట్టింది. అది తెల్లటి శరీరమూ; పాలను జిల్లుమంటూ ధారగా కార్చగల పొదుగునూ చక్కని కొమ్ముల్నీ కల్గి ఉంది; కోరినవారి కోరికలను తీర్చ వేల్పుటావు అది.

ఆ కామధేనువు హోమకార్యాలకు తగిందని ముందుగానే గుర్తించిన దేవమునులు, దేవతలకు తగిన విధంగా యాగహవిస్సులు సమర్పించడానికి కావలసిన (పాలు, పెరుగు, నెయ్యి - గోమూత్రం - పేడ - ఇత్యాది పంచగవ్యాన్ని) సామగ్రిని సమకూరుస్తుందని గ్రహించారు.

తరువాత స్వచ్చమైన తెల్లని చంద్రకాంతితో ఉచ్చైశ్రవమనబడే గుర్రం సముద్రంలోంచి పుట్టింది. దాన్ని దైత్యచక్రవర్తి బలి గ్రహించాడు. మునుపు విష్ణువు బోధించి ఉండటం వల్ల 'కామరోషాలకు' పోకూడదని ఇంద్రుడు దాన్ని గ్రహించలేదు.

ఆ గుర్రానికి అందమైన రొమ్ము, చిక్కనైన పిరుదు, చక్కని తోకా, లక్షణమైన కాంతులీనే ముఖమూ, స్వచ్చమైన గిట్టలు, కురుచైన చెవులు, శుభ్రమైన కన్నులు, నిగనిగలాడే మూపు కలిగి చూడ ముచ్చటగా ఉంది.

అంతలో ఆ క్షీరసాగరంలో, ఐరావతమనే ఏనుగు జన్మించింది. దానికి నాలుగు దంతాలున్నాయి. వాటిలో కొండల శిఖరాల్ని కూడా కూల్చివేయగల ఆ గజరాజు వెండి కొండలా అతిమనోహరంగా విరాజిల్లుతూ ఉంది.

ఆ ఐరావతం గొప్ప అతిశయమైన సౌందర్యం తడబాటులేని వేగం గల నడక; పెద్దకుంభస్థలం, పొడవైన పెద్ద తొండం కలిగి, ప్రాయపు ఆడవారి కులుకునడకలకు ఒజ్జబంతి అనే తీరుగా ప్రకాశించింది.

ఇంకా ఆ సముద్రాన్ని మథిస్తున్న సమయంలో, కల్పవృక్షం పుట్టింది. అది అన్ని ఋతువులలోనూ విరబూసి రాలిపోని పూలతో అలరారుతూ ఇంద్రుని నందనవనానికి శోభగూర్చేది, కోరినవారి కోర్కెలు నెరవేర్చిది.

ఇంకా మందర పర్వతం సాయంతో ఆ సముద్రాన్ని చిలకగా అప్సరసలు పుట్టారు.

ఆ అప్సరసల దేహాలు వాన కాలంలోని మెరపుతీగల్లా ఉన్నాయి. చిక్కని చక్కని స్తనాలు, సన్ననైన నడుములు, నిండైన కొప్పులు, అందమైన చూపులు వారికి అమరి ఉన్నాయి.

ఇంకా ఆ సముద్రంలో చంద్రుడు పుట్టాడు. బ్రహ్మ అనుమతితో తన తొలిస్థానానికి వెళ్ళిపోయి అక్కడ నిలిచాడు.

(సూర్యచంద్రులు ఇప్పటివారు కారు. సృష్ట్యాది నుంచి ప్రవర్తిస్తున్నవారే. కనుకనే చంద్రుడు తన లోకానికి వెళ్ళిపోయాడని చెప్పటం. అంటే దూర్వాసుని శాపం వల్ల సంపదలో భాగంగా చంద్రుడూ సముద్రంలోకి వెళ్ళిపోయాడని సాంకేతికార్థం.)

తరువాత ఆ సముద్రంలో నుండి తళతళమని మెరుస్తున్న శరీరంతో; ధగధగలాడుతూ సంపదల్ని వర్షించే చూపులతో, అందచందాల పెన్నిధి అయిన శ్రీమహాలక్ష్మి పుట్టింది.

(మూలంలో 'సాక్షాత్‌ శ్రీరమా భగవత్‌ పరా' అని వ్యాసుడు అన్నారు (8-8-8). పుట్టినది శ్రీహరిని రంజింపచేసే శ్రీదేవి. ఆమె భగవంతుని యందు పరిపూర్ణమైన అనురాగం కల్గింది- అని అర్థం. ఈ విషయాన్ని ఇలా ప్రారంభంలో పోతన చెప్పలేదు. ఈ ఘట్టాన్ని ఎంతో వర్ణించి కావ్యసౌందర్యాన్ని ఆపాదించారు. శ్రీసూక్తంలో లక్ష్మి 'హిరణ్యవర్ణ' అని చెప్పబడింది. అదే ఈ కాంతిశోభ.)

బ్రహ్మదేవుడు అలసత్వం వీడి పాలసముద్రం పైన తేలిన మీగడ మిసమిసలతో ఈమె దేహాన్ని నేర్పుగా తీర్చిదిద్దాడు. వర్షాకాలంలోని తొలి మెరుపుల అంచులలోని సరికొత్త కాంతిరేఖలతో మెరుగు పెట్టి కోమలమైన తీగల నున్నటి చెలువంతో నిత్యమూ చెలిమిచేయించి; విరిసిన ఎర్రతామరల కొలనులో ఉదయాననే వెదజల్లే సువాసనలతో కలిపి, బంగారు సంపెంగల దండ అందాన్ని సమకూర్చి; బాలచంద్రుని సొగసుతో పదునుపెట్టి ఈ అందాలరాశిని సృష్టించాడా అన్నట్టు లక్ష్మీదేవి ఒప్పారింది.

ఆ తల్లికి ఎర్రని పెదవి, సన్నబారిన నడుము, మెరపు కాంతులతో ప్రకాశించే ముఖము, కన్నులు; సమృద్ధంగా ఉన్న కొప్పు, పిరుదులు, కుచాలు అమరి ఉన్నాయి.

అని జనులందరూ పొగడుతూ ఉండగా

అప్పుడే ప్రభవించిన లక్ష్మీదేవికి మంగళస్నానం చేయించడానికి సంకల్పించి ఇంద్రుడు అమూల్యమైన రత్నమయపీఠం సమకూర్చాడు. సుమంగళులైన దేవకాంతలు పుణ్యాహ స్నానానికి నదీతీర్థాలను కడవలతో నింపి తెచ్చారు. భూదేవి పంచపల్లవాలను ఇచ్చింది. గోవులు పంచగవ్యాలను సిద్ధం చేశాయి. మేఘాలు పణవాలు, గోముఖాలు, బాకాలు, తప్పెటలు, మృదంగాలు, శంఖాలు, వీణలు, ప్లిలనగోవులూ పుట్టించే శబ్దాలను అనుకరిస్తూ గద్జించాయి. గంధర్వులు పాడగా, గంధర్వకాంతలు నృత్యం చేశారు.

(ఇంద్రాదులు క్షీరసాగరమథనాన్ని సంకల్పించడానికి 'సంపద' సముద్రంలో కలిసిపోవటం మొదటి కారణం. రాక్షసులచేత దేవతలు చనిపోతూ ఉండటం రెండవ కారణం. అందువల్ల లక్ష్మి ఆవిర్భవించగానే వారి సంపదలన్నీ తిరిగి వచ్చినట్టే - అందుకే సముద్రంలో పడి ఉండిన దోషప్రాయశ్చిత్తం కోసం 'పుణ్యాహవాచనం' ఇంద్రుడు సంకల్పించాడు. దానికి ముందు మంగళస్నానం కావాలి. ముత్తయిదువను పీఠం మీదనే అభిషేకించాలి. కనుక అమూల్యమైన రత్నపీఠం సిద్ధం చేశారు.

లక్ష్మీపూజలో పంచపల్లవాల ప్రసక్తి ఉంది. రావి, మర్రి, మామిడి, మేడి, జువ్వి అనేవి పంచ పల్లవాలు. పంచ పల్లవాలను కలశంలో నిక్షిప్తం చేసి పూజించటం సంప్రదాయం.

పంచగవ్యం - ఆవుకు సంబంధించిన ఐదు వస్తువులు (గవ్యం= గోసంబంధం ఉన్నది) - పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం - వీటిని మిశ్రమం చేస్తే 'పంచగవ్య' మంటారు. శుచిత్వ సిద్ధికోసం పంచగవ్య ప్రాయశ్చిత్తం చేసుకొంటారు. యజ్ఞం ముందు ఈ ప్రాయశ్చిత్తం తప్పకుండా ఉంటుంది)

దేవమునులు వేదమంత్రాలు చదువుతుండగా, దిగ్గజాలు పుణ్యతీర్థాలలోని పవిత్రజలాలను తమ తొండాలు సాచి కుండలతో గ్రహించి అమ్మవారికి అభిషేకం చేశాయి.

సముద్రుడు లక్ష్మీదేవికి ధరించడానికి పట్టుబట్టల జతను సమర్పించాడు. వరుణుడు తుమ్మెదలు మూగిన వైజయంతీమాలను ఇచ్చాడు. విశ్వకర్మ అమ్మవారికి బంగారుతో చేసిన బాజుబందీలు, గాజులు, గజ్జెలు, కడియాలు సమర్పించాడు. సరస్వతీదేవి మంచిముత్యాల హారాన్ని ఇచ్చింది. వేదాలు మంగళప్రదమైన మంత్రాలను సమర్పించాయి.

దిక్కులన్నీ కలిసి 'అన్ని లోకాలకూ మహారాజ్ఞిగా జీవిస్తావు' అని దీవించాయి.

ఇంకనూ (ఈ లక్ష్మీదేవి వైభవం ఎలా ఉందంటే) 

అమృతం ఒలుకుతూ ఈమె ఎవరితో మాట్లాడుతుందో వాడు బ్రహ్మదేవుడు. ఎవరిని తన ఎర్రని చేతులతో వరిస్తుందో వాడు ఈ ప్రపంచానికి చక్రవర్తి. తీగవంటి తన దేహాన్ని ఎవరితో చేరుస్తుందో వాడు సర్వజ్ఞుడు. ఎవని ఇంట ఈమె ఎల్లప్పుడూ నివసిస్తుందో వాడి ఇల్లు వైకుంఠమే. ఈ స్త్రీ చూపులు ఎక్కడ ప్రసరిస్తాయో ఆ చోటు ఇంద్రుడికీ, కుబేరుడికీ, యమధర్మరాజుకూ నివాసమవుతుంది. ఈ మగువ చిరునవ్వు గొప్పదుఃఖాన్ని కూడా నశింపచేస్తుంది. సకలసృష్టీనీ ఈమె వెలిగిస్తుంది.

(లోకమంతా ఈమెను గురించి ఇలా అనుకొంటోందని కవి చెబుతున్నాడు. ధనమున్నవాడు అన్నీ చేయగలుగుతాడు (బ్రహ్మ). అన్నిటికీ అధికారి అవుతాడు (విష్ణువు); అన్నీ తెలిసినవాడని లోకం అంటుంది(శివుడు - సర్వజ్ఞుడని శివుడికే పేరు). ఎవడిని ఆమె కూడుతుందో వాడి చోటు పరమపదమే (వైకుంఠమే). యమునికి నిలయం (ధర్మం) : ఇంద్రుడు (వైభవం) కుబేరుడు (ధనం) - ఈమె లక్షణాలు. డబ్బు దుఃఖాన్ని మరిపిస్తుంది. చివరికి సృష్టిలోని కళాకాంతులన్నీ 'ధన' మూలం కల్గినవే. (ధనమూల మిదం జగత్‌))

ఇంకాఆ స్త్రీ తన మనస్సులో ఇలా అనుకొంటోంది.

ఆ లక్ష్మీదేవి తన మనస్సులో ఈ బ్రహ్మాండాన్ని బొమ్మరిల్లుగా ఒకసారి భావించేది. ఆమెకు లోకాలన్నీ తన ఇంటిలోని దొంతుల్లాగా కనిపించేవి. బ్రహ్మాది దేవతలు తన ఇంటిలోని ఆటబొమ్మలుగా భాసించేవారు. భూమండల మంతా ఒక బొమ్మలకొలువు లాగా కనిపించేది. ఆమె కంటికి సూర్యచంద్రులు చిరుదీపా లనిపించేవారు. సరస్వతి పార్వతులు ఆమెకు ఇష్టసఖు లనిపించేవారు.

ఆ తరువాత

తుమ్మెదల ఝంకారంతో కూడిన కలువపూలదండను చేతబట్టి మేఘ సమూహం మధ్యలో ప్రకాశించే మెరుపు తీగలాగా బంగారు కాంతులీనుతూ దేవతలమధ్య ఆ అందగత్తె నిలిచింది.

లక్ష్మీదేవి సౌందర్యం అపురూపమైంది. ఆమె కన్నులు, స్తనాలు, వెండ్రుకలు, పిఱుదులు, ఆ ముఖము, ఆ కొంగ్రొత్త రూపాన్నిచూసి శ్రీమహావిష్ణువు తప్ప తక్కిన దేవతలందరూ ధైర్యం సడలిపోయి అయోమయంలో పడ్డారు.

ఆ విధంగా నిలబడి, తనచుట్టూ అన్నివైపులా ఉన్న యక్షులు, రాక్షసులు, సిద్దులు, సాధ్యులు, దేవతలు, గరుడులు, గంధర్వులు, చారణులు మొదలైన వారినందరినీ చూసి ఆ ప్రౌఢురాలైన ఆదిమ కన్యారత్నం తన మనస్సులో ఇలా అనుకొన్నది.

ఒకచోట సుమంగళిగా ఉండటానికి వీలుండదు. మరోచోట సవతిపోరు, ఇంకోచోట నిత్యవైభవం ఉండదు. ఒకచోట వేడిమి ఉండనీయదు. ఇంకొకచోట 'కరుణ' అన్నమాటే కనిపించదు (దయచూపరు). ఇంకోచోట దగ్గరికి పోవడానికే వీలుండదు. ఇంకోచోట నిలకడ ఉండదు. ఇంకోస్థలంలో భరించరాని అలసత్వం. కొన్నిచోట్ల 'కామం' తప్పా మరోటి ఏమీ కనిపించదు. కొన్నిచోట్ల క్రోధమే ప్రధానం. ఇంకొన్నిచోట్లు మోహ లోభాలతోటి అసమగ్రంగా ఉంటాయి. ఇంకా కొన్నిచోట్లు మదమాత్సర్యాలే నిండి ఉంటాయి. (ఇలాంటి చోట్ల నేను ఉండగలనా! అని ఆలోచిస్తున్నది).

అని అలాంటిచోట్ల కనిపించిన గొప్పగొప్పవారి నడతల్ని ఆలోచించి వారిని వదిలిపెట్టండి.

ఇతనివద్దనైతే సౌభాగ్యవతిగా ఉండవచ్చు. వంతుకు వచ్చే సవతులు ఉండరు. ఇతని మందిరం ఎడతెగని సంపదకు నిలయం. ఇతడు అందగాడు. మీదు మిక్కిలి చందనంలాగా చల్లగా ఉంటాడు. ఎప్పుడూ కలత పొందడు (దుఃఖించడు); ఇతడు సంపూర్ణ దయామయుడు. అత్యంత పరిశుద్దుడు. ఇతనిని సమీపించి సేవించవచ్చు. ఇతడు ఆడినమాట తప్పడు. ఇతనికి స్థిరత్వముంది. ఏ పనిలోనూ ఆలస్యం చేయడు. సజ్జనుల్ని కాపాడే గొప్ప గుణముంది. కామక్రోధాదులితనిలో లేవు. ఇతడు భర్త అయితే హాయిగా జీవించవచ్చు. ఇతడే నాకు తగిన భర్త - అని అనుకొంటూ లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు మెడలో పూలమాల వేసి పూజించింది.

అలా కలువ పూలమాలతో ముకుందుని పూజించి ఆయన విశాల వక్షఃస్థలాన్నే ఆమె సిగ్గుతో కూడిన చూపులతో చూస్తూ నిలబడింది.

విష్ణువు మీది ప్రేమ పెల్లుబికి మోహంతో ఆయన్ని చూడటానికి తల పైకెత్తింది. మళ్ళీ సిగ్గుతో తల వాల్చుకొంది. ఆ మహాపురుషుని, ప్రాణవల్లభుని చూచిన ఆశ్చర్యంతో తొట్రుపడి ముఖం వంచలేదు. పైకెత్తలేదు.

విష్ణువు చూస్తే లక్ష్మి సిగ్గుతో ఆయనను చూడదు. లక్ష్మిచూస్తే కొత్తవరుడైన విష్ణువు సిగ్గుపడి ఆమెను చూడడు. కానీ ఒకరినొకరు సరిగా చూచుకోగానే మన్మథుడు తొందరపెట్టాడు.

జగత్తుకు తండ్రియైన శ్రీమహావిష్ణువు జగన్మాతయైన శ్రీమహాలక్ష్మిని తన వక్షఃస్థలంపై చేర్చుకొన్నాడు. ఆమె కరుణారస దృష్టిచేత ప్రజలు మునుపటిలాగా మంగళాతిశయము, అధిపతిని కలిగియుండుట అను సంపదచేత ప్రకాశించే లోకాలను చూశారు. అప్పుడు అనేక శుభాలు పొందారు.

అప్పుడు ముందుగా తన అల్లునికి సముద్రుడు(మామగారు - లక్ష్మి సముద్రం నుంచి పుట్టింది కాబట్టి ఆయన కూతురు) కౌస్తుభమనే అమూల్యమైన రత్నాన్ని కానుకగా ఇచ్చాడు. దానిని శ్రీమహావిష్ణువు వక్షఃస్థలం పైన ధరించాడు. అప్పుడు లక్ష్మీదేవి శ్రీవత్సం(పుట్టమచ్చ); కౌస్తుభం; వైజయంతిమాల, వనమాల, ముత్యాల సరాదులలో శోభిస్తున్న స్వామివారి ఎదపై నివసించసాగింది.

ఆటా పాటా వేడుకలతో దేవతలు విలసిల్లారు. సర్వలోక పూజ్యులు బ్రహ్మాది దేవతలు విష్ణునామాంకిత మంత్రాలతో స్తుతిస్తూ పుష్పవర్షం కురిపించారు.

ఆ సముద్రరాజ తనయ తన చల్లని చూపులతో ప్రజల్ని చూడగానే దానితో ప్రజలకు వైభవమూ శుభమూ చేకూరాయి. లోకం సుఖించింది. జగత్తుకు మళ్ళీ జీవం వచ్చింది.

('ధనమూలమిదం జగత్‌ అంటే అర్ధం ఇదే. ధనహీనుడు మృతప్రాయుడని అర్థం.)

ఆ లక్ష్మీదేవిశుభదృష్టి తమపై పడకపోవడాన్ని రాక్షసులు అశుభ సూచకంగా భావించారు. మిణుకుమిణుకుమనే తీరులో కాంతివిహీనులై, దుఃఖంతో తహతహలాడుతూ చిన్నబోయారు.

ఇక సముద్రాన్ని మళ్ళీ చిలకటం ప్రారంభించగా 'వారుణి' అనే పేరుతో ఒక కన్య బయల్పడింది. శ్రీహరి సమ్మతితో ఆ కమలాక్షిని రాక్షసులు తామే కోరుకొని గ్రహించారు(ఎవరూ అడ్డు చెప్పలేదు).

ఇంకా సముద్రాన్ని చిలుకుతూ పోగా పోగా ఆ సముద్రంలో

ఆ తరువాత సముద్రంలో నుండి అమృత కలశాన్ని చేతబట్టి ధన్వంతరి అనే పేరున్న ఆయుర్వేద వైద్యుడు బయటకి వచ్చాడు. అతనికి ఆయుర్వేదాది సకలవైద్య శాస్త్రాలూ తెలుసు. దేవతలకు వైద్యుడాయన. అతని ఆకారం స్వచ్చంగా ఉంది. మంచి ప్రాయంలో ఉన్నాడు. ఆజానుబాహువులున్న వాడు. అతని కంఠం శంఖం లాగా ఉంది. పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించాడు. పూలమాలతో శోభిస్తున్నాడు. మెరుస్తున్న బంగారు నగలలో ప్రకాశిస్తున్నాడు. అతని కండ్లు ఎర్రగా ఉన్నాయి. రొమ్ము ఉన్నతంగా ఉంది. అతడు సర్వశ్రేష్ఠుడుగా అనిపిస్తున్నాడు. అతనికి నల్లటి కేశపాశం ఉంది. నీలమేఘవర్ణంతో విరాజిల్లుతున్నాడు. సింహంలాంటి పరాక్రమంతో శోభిల్లుతున్నాడు. అతనికి మణులు పొదిగిన కుండలాలు, రత్నాలు పొదిగిన అందెలున్నాయి. శ్రీహరి అంశంలో అంశమైన దివ్యమైన పుట్టుక అతనిది. పవిత్రమైన యాగంలో పెద్ద భాగాన్ని పొందే యోగ్యత ఉన్నవాడు. అలాంటి దివ్యపురుషుడు ఉద్భవించాడు.

(ఆయుర్వేదం మనిషిని సుదీర్ఘకాలం యౌవనలక్షణాలతో జరామరణాలకు దూరంగా ఉంచడానికి ఉద్దేశించింది. ధన్వంతరి విష్ణువు - అంశలో - అంశ అన్న విషయం తెలుసుకోదగినది.

వేదం - అనంతమైన విభాగాలు కల్గి ఉంది. అందులో భాగమే ఆయుర్వేదం. అందుకే ఆయనకు కూడా ఇతర దైవతాలతోపాటు యజ్ఞహవిస్సులో పెద్ద (భూరి) భాగం ఉందని అర్థం.)

ఆ తరువాత, రాక్షస శ్రేష్ఠులు ఆ ధన్వంతరి చేతిలో ఉన్న అమృత కలశాన్ని చూసి, సాటిలేని బలంతో చెలరేగి, దేవతల్ని మోసగించి ఆయన చేతుల్లోంచి ఆ కలశాన్ని లాక్కున్నారు.

అటు పిమ్మట, చావును తప్పించుకునే మందు చక్కగా మనకు దొరికింది చాలులే అనుకొంటూ రాక్షసులు అతని చేతిలో నుండి అమృత కలశాన్ని లాక్కుపోగా; భయపడి పోయిన దేవతలు “అమృతం కలశం పోయింది. పోయింది అయ్యో!” అంటూ శ్రీహరికి మొరపెట్టుకొన్నారు.

శ్రీ విష్ణుమూర్తి మోహినీస్వరూవంబు నొందుట


No comments:

Post a Comment