Friday, March 6, 2026

Surya(Ravi and Stars (Nakshatras) in the Kala Chakra details - భగణ విషయము

భగణ విషయము

బ్రహ్మాండం మధ్యలో ప్రకాశించే సూర్యుడు తన వెలుగుతో, వేడిమితో ముల్లోకాలనూ ముంచెత్తుతూ ప్రకాశింపజేస్తాడు.

సూర్యునికి ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువత్తులనే మూడు గమనాలు ఉన్నాయి. ఉత్తరాయణంలో ఆగమనం మందకొడిగా, దక్షిణాయనంలో తీవ్రంగా, విషువత్తులలో సమానంగా ఉంటుంది. సూర్యుని ఈ మూడు గమనాలను అనుసరించి ఆరోహణ, అవరోహణ సమస్థానాలలో రాత్రింబవళ్ళు దీర్ఘాలుగా హ్రస్వాలుగా సమానాలుగా మారుతుంటాయి

(రాత్రి, పగలు సమానంగా ఉన్న దినాలకు విషువు / విషువత్తులు అని పేరు= మేష తుల సంక్రమణములు.

మేషరాశిలోనూ, తులారాశిలోనూ సూర్యుడు సంచరించేవేళ పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య ఈ ఐదు రాసులలో సంచరించే సమయాలలో ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి కాలం తగ్గుతూ వస్తుంది. పగలు పెరుగుతూ ఉంటుంది.

ఆలాగే సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే ఐదు రాసులలో ఉన్నప్పుడు ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి పెరుగుతుంటుంది. పగటికాలం తగ్గిపోతుంది.

ఈ ప్రకారంగా అహోరాత్రాలను ఉత్తరాయణ, దక్షిణాయనాలలో పెంచుతూ తగ్గించుచూ ఒక్కొక్క దినంలో తొమ్మిదికోట్ల యాభై ఒక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం పలువైపులా సూర్యరథం తిరుగుతుంటుంది. ఆ పర్వతం తూర్పున దేవధాని అనే ఇంద్రుని పట్టణం. దక్షిణంలో సంయమని అనే యముని పట్టణం, పశ్చిమంలో నిమ్లోచని అనే వరుణుని పట్టణం, ఉత్తరంలో విభావరి అనే సోముని పట్టణం ఉన్నాయి. ఈ నాలుగు పట్టణాలలోనూ సూర్యుడు క్రమంగా ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం అనే కాలభేదాలను కల్పిస్తుంటాడు. ఈ ఉదయాదులు అచ్చటి జీవుల ప్రవృత్తినివృత్తులకు కారణాలవుతుంటాయి. సూర్యుడు ఇంద్రనగరం నుండి యమనగరానికి పయనించేటప్పుడు పదునైదు గడియలలో రెండుకోట్ల ముప్పది ఏడు లక్షల డెబ్బది ఐదువేల యోజనాలు అతిక్రమించి యమనగరానికీ, ఇదేవిధంగా అక్కడనుంచి వరుణ, సోమ నగరాలకూ, చంద్రాది గ్రహాలతో నక్షత్రాలతో సంచరిస్తాడు. పన్నెండు ఆకులూ, ఆరు కమ్ములూ, మూడుకుండలు(నాభి  ప్రదేశాలు) కలిగి ఏకచక్రంతో కూడి సంవత్సరాత్మకమైన సూర్యునిరథం ఇక ముహూర్తకాలంలో ముప్పది నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు ప్రయాణం చేస్తుంది.

(సూర్యుని రథం వేదాత్మకం. ఇరుసునకు అమర్చబడిన సూర్యుని రథం 'తైలయంత్రచక్రవత్‌' 21-13 తిరుగుతుందని మూలంలో వర్ణన. మూలంలో ఇంద్రనగరం పేరు దేవధాని. సూర్యుడు నెలకు ఒక్కొక్క గడియ= 24 నిమిషాల చొప్పున సమయం పెరగగా రాసులలో సంచరిస్తాడు. 'దేవధాని' నే 'అమరావతి' అనికూడ అంటారు.

సూర్యరథ చక్రానికి ఒక ఇరుసు అమర్చబడి ఉన్నది. ఆ ఇరుసుకు ఒకవైపు మేరుపర్వతమూ, రెండవవైపు మానసోత్తర పర్వతమూ ఉన్నాయి. రెండువైపులా వాయుపాశాలతో గట్టిగా బిగింపబడి ఉన్నాయి. ఇవి భూమి రెండు ధ్రువాలకూ అంటి ఉన్నాయి. అటువంటి సూర్యరథానికి అమర్చబడిన కాడి ముప్పయి ఆరు లక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ కాడి సూర్యరథానికి కట్టిన గుర్రాల మెడలపై మోపబడి ఉంటుంది.

ఆ సూర్య రథానికి గాయత్రి, బృహతి, ఉష్ణిక్‌, జగతి, త్రిష్టుప్‌, అనుష్టుప్‌, పంక్తి అనబడే ఏడు ఛందస్సులు గుర్రాలుగా ఉన్నాయి. సూర్యునికి అరుణుడు సారథి. అతడు సూర్యుని ముందుభాగంలో కూర్చుండి రథాన్ని నడుపుతుంటాడు. బొటనవేలి కణుపు పరిమాణ దేహం కలిగిన వాలఖిల్యులనే ఋషిపుంగవులు అరవై వేలమంది జ్యోతిర్మయ స్వరూపాలు ధరించినవారు సూర్యునికి ముందుండి వేదసూక్తాలతో స్థోత్రం చేస్తుంటారు. ఎందరో మునులు, గంధర్వులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, గరుడులు మొదలయిన వారు క్రమం తప్పకుండా సూర్యుణ్ణి సేవిస్తుంటారు. తొమ్మది కోట్ల ఏబది యొక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన భూమండలం చుట్టూ సూర్యుడు క్షణానికి రెండువేల యాభై యోజనాల చొప్పున అహోరాత్రంలో సంచరిస్తుంటాడు అని చెప్పిన శుకయోగీంద్రుని చూచి పరీక్షిత్తు కుతూహలంతో ఈ విధంగా ప్రశ్నించాడు.

మునీంద్రా! సూర్యుడు మేరువుకూ, ధ్రువనికీ ప్రదక్షిణంగా తిరుగుతుంటాడని చెప్పావు గదా! బ్రహ్మ స్వరూపుడయిన సూర్యుడు పన్నెండు రాసులలోనూ అభిముఖుడై తిరుగుతాడని కూడా అన్నావు. ఇది ఎలా పొసగుతుంది? నా సందేహాన్ని తీర్చు.

పరీక్షిత్తు కుతూహలంతో కూడిన సందేహాన్ని విన్న శుకయోగి ఒకమారు కళ్ళు మూసుకొని శ్రీహరిని తలచుకొని ఈ విధంగా సమాధానం చెప్పాడు.

ఓ రాజా! కుమ్మరిసారె వేగంగా తిరుగుతుంటుంది. ఆ సారెమీద చీమల బారులు తిరుగుతుంటాయి. అయితే వాటి గమనం ఆ చక్రభమణానికి భీన్నంగా ఉంటుంది. అదేవిధంగా నక్షత్రాలతో రాసులతో నిండిన కూడిన కాలచక్రం తిరుగుతున్నది. ఆ కాలచక్రం ధ్రువమేరువుల్ని ప్రదక్షిణం చేస్తూ తిరిగేటప్పుడు ఆ కాలచక్రం వెంట తిరిగే సూర్యాదిగ్రహాలు నక్షత్రాలతోను, రాసులలోనూ సంచరిస్తుంటాయి. అందువల్ల సూర్యాది గ్రహాలకు కాలచక్రగమనమూ, స్వగమనమూ అనే రెండు రకాల గమనాలు కలుగుతున్నాయి. అంటే తమంత తాము తిరగడమున్నూ, కాలచక్రగమనంతోపాటు తిరగడమున్నూ. ఆదినారాయణుడే సూర్యుడుగా ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యభగవానుడు సమస్త లోకవాసుల యోగక్షేమాలు కోరేవాడు. అతడు ఋగ్యజుస్సామ వేదస్వరూపుడు. మానవులు నిర్వహించే కర్మలకు సిద్ధిప్రదాత. ఆ దేవుని స్వరూపాన్ని దేవర్షిగణాలు వేదాంత పరంగా భావించి సంభావిస్తుంటారు. అటువంటి సూర్యుడు తన స్వరూపాన్ని పన్నెండు విధాలుగా విభజించి వసంతం, గ్రీష్మం మొదలయిన ఋతువులను ఆయా కాలాలలో కలుగజేస్తుంటాడు. అటువంటి పరమపురుషుని మహిమను అర్ధం చేసుకొన్న మహాత్ములు వర్ణాశ్రమాచారాలు పాటిస్తూ వేదాలలో చెప్పబడ్డట్టు. అతిశయమయిన భక్తితో ఆయనను ఆరాధిస్తూ క్షేమంగా ఉంటారు.

సూర్యరూపుడయిన ఆదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రంలో తిరుగుతూ తన తేజస్సుతో గ్రహగోళాదులను వెలిగిస్తూ ద్వాదశరాసులలో ఒక సంవత్సరకాలం సంచరిస్తుంటాడు. ఆ ఆదిపురుషుని గమన విశేషాన్ని లోకులు అయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు అనే పేర్లతో వ్యవహరిస్తుంటారు. రాసులలో ఆరవభాగం సంచారం చేసే కాలాన్ని ఋతువని వ్యవహరిస్తారు. ఆ రాసులలో సగభాగం సంచరిస్తూ ఆరు రాసులలో తిరిగే కాలాన్ని అయనమంటారు. రాసులన్నిటిలోనూ పూర్తిగా తిరిగే కాలాన్ని సంవత్సరమని నిర్ణయిన్తారు. ఆ సమగ్రరాశి సంచారంలో మూడురకాలయిన గమనాలు ఉంటాయి. మొదటిది శీఘ్రగతి. రెండవది మందగతి. మూడవది సమగతి. ఈ గతులు కారణంగా సంవత్సరంలో కలిగిన మార్పులను వరుసగా వత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని ఐదువిధాలుగా చెబుతారు. ఇదే పద్ధతిలో చంద్రుడు సూర్యమండలం మీద లక్ష యోజనాల దూరంనుండి సంవత్సరం, పక్షాలు, రాసులు, నక్షత్రాలు భుక్తులను గ్రహిస్తూ ముందుండి వేగంగా సంచరిస్తుంటాడు. చంద్రుని వృద్ధి క్షయాలవల్ల పితృగణాలకు పూర్వపక్షం, అపరపక్షం అనేవి ఏర్పడతాయి. వీటివల్లనే పగలు, రాత్రి ఏర్పడతాయి. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో ముప్పది సుముహూర్తాల కాలం సంచరిస్తాడు. పదునారు కళలతో మనోమయ, అన్నమయ, అమృతమయ దేహంతో ఒప్పుతుంటాడు. దేవతలకూ, పితృగణానికీ, మానవులకూ, భూతాలకూ, జంతువులకూ, పక్షులకూ పాములు మొదలయిన వాటికీ, తీగలకు, పొదలకూ, ప్రాణప్రదమయిన తాపస్పర్శవల్ల సంతృప్తి కలిగిస్తూ చంద్రుడు సర్వసముడుగా ప్రకాశిస్తాడు.

చంద్రునికి పైన లక్ష యోజనాల ఎత్తు ప్రదేశంలో నక్షత్రమండలం ఉంది. అందలి నక్షత్రాలన్నీ అభిజిత్తుతో కూడా కలిసి మేరుశైలానికి ప్రదక్షిణం చేస్తుంటాయి.

నక్షత్ర మండలానికి రెండు లక్షల యోజనాల ఎత్తున శుక్రుడు సంచరిస్తుంటాడు. ఈతడు సూర్యునికి ముందూ, వెనకా ఉదయిస్తూ సూర్యునివలె సంచారం చేస్తాడు. ఈతని గమనం కొన్నిసార్లు మెల్లగా, కొన్నిసార్లు మృదువుగా మరికొన్నిసార్లు తొందరగా సాగుతుంటుంది. ఈ శుక్రుడు ప్రజలకందరికి అనుకూలుడై వర్షం కురిపిస్తాడు. వర్షాలకు ఆటంకం కలిగించే గ్రహాలకు శాంతి చేసినట్లయితే శుక్రుడు సంతుష్టి పొంది శుభం కలుగజేస్తాడు. శుక్రునికంటె పైన రెండు లక్షల యోజనాల దూరంలో బుధుడు తిరుగుతుంటాడు. అతడు సూర్యమండలాన్ని వదలి దూరంగా కనిపించినా ప్రజలకందరికి కరువు కాటకాలు, దోపిడీల భయం కలిగిస్తాడు.

(మూలంలో అతివాత, అభ్రప్రాయ, అనావృష్టి, ఆదిభయమ్‌ - పెనుగాలి, మేఘములతోనిండిన ఆకాశం మరియు అనావృష్టి మొదలగువాని వలన భయములు చెప్పబడ్డాయి. ఏ కాలమందయితే సూర్యునికంటె బుధుడు దాటి ముందుకు పోవునో అపుడు ఈ అశుభాలని వర్ణితం (22-18). డామరమునకు రూపాంతరం డాంబరం.)

బుధునికన్న పైన రెండు లక్షల యోజనాల దూరంలో అంగారకుడు ఉన్నాడు. అతడు మూడుపక్షాలకాలంలో ఒక్కొక్క రాశి దాటుతూ సంచారం చేస్తాడు. ఆ విధంగా అంగారకుడు పండ్రెండు రాసులలోను రాజసంతో సంచరిస్తాడు. వక్రగతిలోగాని, వక్రగతిలో లేనప్పుడుగాని అంగారకుడు ప్రజలకు పీడలే కలిగిస్తాడు. అతనికి రెండులక్షల యోజనాల దూరంలో బృహస్పతి సంచరిస్తుంటాడు. ఆ అమరగురువు ప్రతి ఒక్కరాశిలో ఒక్కొక్క సంవత్సరం చరిస్తుంటాడు. ఈ గురువు వక్రగతిలో ఉన్నా బ్రాహ్మణులకు ఎప్పటికప్పుడు శుభపరంపరలను ప్రసాదిస్తుంటాడు.

బృహస్పతికన్న రెండు లక్షల యోజనాలకుపైన శని తిరుగుతుంటాడు. అతడు ప్రతి రాశిలోనూ ముప్పయి మాసాలు చరిస్తాడు. ఈ ముప్పయి మాసాలలోను శని ప్రజలకు కష్టాలే కలిగిస్తాడు.

శనికి పదునొకండు లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంది. ఆ మండలంలోని ఋషులు బ్రాహ్మణులకూ, ప్రజలకూ తత్తరపాటునొంది మేలు కోరుతుంటారు.

రాజా! సప్తఋషి మండలానికి పదమూడు లక్షల యోజనాల ఎత్తులో శింశుమార చక్రం ఉంది. ఇదే ఆకాశంలో అన్నిటికన్నా పైన ఉన్న చక్రం.

ఆ శింశుమార చక్రంలో పరమభక్తాగ్రేసరుడయిన ధ్రువుడు ఉన్నాడు. అతడు ఇంద్రుడు, వరుణుడు, కశ్యపుడు, యముడు మొదలయిన దేవతలతో, ప్రజాపతులతో విష్ణుపదానికి ప్రతినిత్యం ప్రదక్షిణం చేస్తుంటాడు. అతడు కల్పం చివరిదాకా జీవిస్తాడు. ఉత్తానపాదుని కుమారుడయిన ఆ ధ్రువుడు పూజ్యుడు, మహాత్ముడు. ఆయన మహిమలను బ్రహ్మకూడా వర్ణించలేడు. నాకు తెలిసిన విశేషాలన్నీ ముందే నీకు తెలియజేశాను. ఒకసారి ఆ కథలన్నీ గుర్తుకు తెచ్చుకో.

ధాన్యం నూర్చే కళ్లంలో పశువులను కట్టడంకోసం మధ్య పాతిన గుంజ లాగున ధ్రువుడు ఆ శింశుమార చక్రం నడుమ ప్రకాశిస్తూ ఉన్నాడు. అతనిచుట్టూ గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ కాలవిభాగాలలో నిమేషమాత్రం కూడా ఏమరుపాటులేక ధ్రువుని చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి. ఆకాశంలో మేఘాలు, డేగలు మొదలయిన పక్షులు కర్మానుసారంగా గాలికి లోబడి ఆకాశంలో ఎలా పరిభ్రమిస్తున్నాయో అలాగే జ్యోతిర్గణాలు కర్మను అవలంబించి ప్రకృతి పురుషులకు లోబడి గగనాన తిరుగుతూ ఉంటాయి. ఈ కారణంవల్లనే గ్రహాలు నేలమీద పడడం లేదు.

ఏలాంటి తక్కువలేని గొప్పతనం కల సచ్చరిత్రుడవయిన రాజా! జ్యోతిర్గణాలన్నీ శింశుమార చక్రంలో ఉన్నాయని కొందరు చెబుతుంటారు; ఆ శింశుమారచక్రస్వరూపం నీకు వివరిస్తాను విను.

నిర్మల చరిత్రా! శింశుమార చక్రం తలక్రిందుగా గుండ్రంగా అందంగా ఉంటుంది. ఆ చక్రం తోకచివర ధ్రువుడు సర్వదా ప్రకాశిస్తూ ఉంటాడు.

(మూలంలో నక్షత్ర మండలం నీటికోతి రూపంలో నిలబెట్టబడియున్నదని వర్ణితం. ఇది కూడా వాసుదేవభగవానుని యోగధారణచే అని ఉల్లేఖితం.)

ఆ శింశుమార చక్రం తోకభాగంలో ప్రజాపతి అగ్ని ఇంద్రుడు, ధర్ముడు అను వారుంటారు. తోకముందు భాగంలో ధాత, విధాత ఉన్నారు. నడుముభాగంలో సప్తర్షులున్నారు. దక్షిణావర్తమై కుడివైపుకు చుట్టుకొని, కుండలీభూతంగా ఉన్నదానికి ఉత్తరభాగంలో ఉత్తరాయణ నక్షత్రాలు, దక్షిణభాగంలో దక్షిణాయన నక్షత్రాలు, వీపుమీద దేవమార్గం అనబడే తారకాసముదాయమూ, అక్కడే ఆకాశగంగ కూడా ఉన్నాయి. ఉత్తరభాగంలో పునర్వసు, పుష్యమి నక్షత్రాలు, దక్షిణభాగంలో ఆర్ద్ర ఆశ్లేషలు, కుడిపాదంలో అభిజిత్తు, ఎడమపాదంలో ఉత్తరాషాఢ, కుడివైపు ముకుపుటంలో శ్రవణం, ఎడమవైపున పూర్వాషాఢ ఉన్నాయి. కుడి ఎడమ నేత్రాలలో ధనిష్ఠ మూల నక్షత్రాలున్నాయి. కుడి ఎడమ చెవులలో మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు ఉన్నాయి. ఎడమప్రక్క దక్షిణాయన నక్షత్రాలు, కుడిప్రక్క కృత్తిక, రోహిణీ, మృగశిర అనే మూడు నక్షత్రాలు ఉన్నాయి. ఇవి గాక ఉత్తరాయణ నక్షత్రాలు కూడా అక్కడే ఉన్నాయి. ఎడమ కుడివైపు మూపులయందు శతభిషం, జ్యేష్ట నక్షత్రాలున్నాయి. పై దవడ ప్రదేశంలో అగస్త్యుడు, క్రింది దవడ స్థానంలో యముడు, ముఖమందు అంగారకుడు, మర్మావయవ స్థానంలో శని, పురుషాంగంగా బృహస్పతి ఉన్నారు. వక్షోభాగంలో సూర్యుడు, నాభిలో శుక్రుడు, మనసులో చంద్రుడు, స్తనాలయందు అశ్వినులు, ప్రాణాపానములందు బుధుడు, కంఠభాగంలో రాహువు ఉన్నారు. అయితే కేతువు మాత్రం అన్ని అవయవములను ఆవరించి ఉంటాడు. ఈ శింశుమార చక్రానికి రోమాలుగా ఇంకా ఎన్నో నక్షత్రాలున్నాయి. ఇది సర్వదేవతామయమయిన నారాయణుని దివ్యస్వరూపం. ఇది స్థిరమైనది. ఇది ధ్రువమైనది.

రాజేంద్రా! ఈ దివ్యశరీర సందర్శనంవల్ల కలిగే ఫలితాలను చెబుతాను విను. ఈ శింశుమార చక్రం శ్రీమన్నారాయణుని దివ్యశరీరం. ఎవరు ప్రతిదినమూ సంధ్యాకాలంలో ఈ దివ్యశరీరాన్ని మనసులో నింపుకొని దీక్షతో, నియమంతో భక్తితో స్మరిస్తారో, తత్వాన్ని గ్రహించి మౌనవ్రతం చేబట్టి ఈ చక్రదర్శనం చేస్తూ ఎవరు ఈ స్తోత్రాన్ని ప్రీతితో జపియించి నమస్కరిస్తారో, ఎవరు ప్రశస్తమూ, మునీంద్రసేవ్యము, జ్యోతిస్పరూపము అయిన శింశుమార చక్రానికి వందనం వందనం అంటూ మ్రోక్కులు చెల్లిస్తారో అటువంటి వారికి ఇహలోకంలో సకల సిద్ధులూ లభిస్తాయి. పరలోకంలో ముక్తి ప్రాప్తిస్తుంది.

ఓ రాజా! సూర్యమండలానికి దిగువ పదివేల యోజనాల దూరంలో రాహుమండలం ఉన్నది. ఈ రాహువు అపసవ్యంగా నడుస్తుంటాడు.

రాహువు రాక్షసులలో అధముడు. అయితే అతనికి బ్రహ్మదేవుని వరం ఉంది. ఆ వరం కారణంగా అతడు అమరత్వం పొంది గ్రహాలతోపాటు తానొక గ్రహమై విహరిస్తుంటాడు.

రాహువు యొక్క జన్మ కర్మలను గూర్చి సవిస్తరంగా చెబుతాను. ఆ రాహువు సామాన్యుడు కాదుసుమా. పదివేల యోజనాల విస్తృతి కలిగిన సూర్యమండలాన్ని, పండ్రెండువేల యోజనాల విస్తృతి కలిగిన చంద్రమండలాన్ని రాహువు కప్పేస్తాడు. రాహుమండలం పదమూడు వేల యోజనాల వైశాల్యం కలిగి ఉంది. పూర్ణిమ పర్వదినంలో చంద్రుని, అమావాస్య పర్వదినంలో సూర్యుని రాహువు మాటు పరుస్తాడు. దీనినే గ్రహణం అంటారు. ఆ గ్రహణకాలంలో జనులందరు తమ తమ జపతపోరూపాలయిన ధర్మాలను చక్కగా ఆచరించుకొంటారు. అయితే దయామయుడైన శ్రీహరి సుదర్శన చక్రం సూర్యచంద్ర మండలాలను రక్షించడానికి వస్తుందేమో అనే భయంతో ఐదారు గడియలలోనే రాహువు వారిని వదలిపెట్టి తొాలగిపోతాడు.

పరీక్షిన్మహారాజా! ఆ రాహుగ్రహానికి కిందివైపున సిద్దులు, చారణులు, విద్యాధరులు అను దేవయోనులవారు పదివేల ఆమడల దూరంలో స్థిరంగా నివసిస్తూ సవిలాసంగా అక్కడ సంచరిస్తుంటారు.

సిద్ద విద్యాధరుల నివాసస్థానానికి కింద పదివేల యోజనాల దూరంలో రాక్షసులు. పిశాచులు సేవిస్తుంటే యక్షులూ, భూతప్రేతాలూ తిరుగుతుంటారు.

వారి కింద మేఘమండలం ఉంది. ఆ మబ్బులన్నీ గాలికి చలిస్తూ ఉంటాయి. మేఘమండలం పై భాగంలో ఉంటే దానికి కింది భాగంలో భూమండలం ఉన్నది. వారికింద అంటే భూతప్రేతయక్షనివాసాల కిందట అని అభిప్రాయం.

ఈ భూమండలం కింద ఒకదానికొకటి కిందుగా అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం అనే లోకాలున్నాయి. ఆ లోకాలలో ఒక్కొక్కదానికి మధ్య పదివేల యోజనాల దూరం ఉంటుంది. ఇవి కింద ఉన్నా స్వర్గం వంటివే. నిజం చెప్పాలంటే ఈ కింది స్వర్గాలు పైనున్న స్వర్గాలకంటే ఎంతో గొప్పవి. ఇక్కడ దైత్యులూ, దానవులూ, నాగులూ మొదలయినవారు దేవజాతికి చెందినవారు ఉంటారు. వారందరూ ఐశ్వర్యంవల్ల సంక్రమించిన ఆనందానుభవంతో సుఖభోగాదులతో తులతూగుతూ జీవిస్తారు. సర్వాంగసుందరాలయిన ఉద్యానవనాలలో, క్రీడాప్రదేశాలలో విహరిస్తుంటారు. దైత్యులు, దానవులూ, నాగులూ మొదలైన దేవజాతి విశేషాలు భార్యలతో, బిడ్డలతో, చెలికాండ్రతో, చుట్టాలతో, దాసదాసీజనంతో మణులు చెక్కిన రమణీయమయిన గృహాలలో సర్వదా సంతోషం అనుభవిస్తుంటారు. ఈశ్వరుని కరుణవల్ల వారికి దైహికమయిన ఎటువంటి వ్యాధులు లేవు. మాయతో నిర్మింపబడిన కొంగొత్త కేళీగృహాలలో, విహార మండపాలలో చిత్రవిచిత్రమయిన ఉద్యానవనాలలో క్రీడావినోదాలతో విహరిస్తుంటారు.

అటువంటి పాతాళలోకంలో మయుడు సృష్టించిన మాయాపట్టణాలు ఎన్నో ఉన్నాయి. ఆ పట్టణాలలో నానావిధ రత్నాలతో నిర్మించిన ప్రాకారాలూ, గోపురాలూ, సౌధాలూ, విశాలమయిన సభాసమావేశ స్థలాలు, చైత్యాలూ ఉన్నాయి. వాటియందూ నాలుగుబాటలు కలిసే చత్వర ప్రదేశాలయందూ, దైత్యదానవ నాగదంపతులు విహరిస్తుంటారు. మాయతో వారు నిర్మించుకొన్న విహారప్రదేశాలలో చిలుకలూ, కోకిలలూ, గోరువంకలూ కిలకిలారావాలు చేస్తుంటాయి. పూలవాసనలు, చిగురుటాకుల గుత్తుల బొత్తులు, రకరకాల ఫలసమృద్ధిగల ఆ ఉద్యానవనాలలో లతాసుందరులు పెనవేసుకొన్న తరుశాఖలు కన్నుల పండువు చేస్తుంటాయి.

మనసుకూ, ఇంద్రియాలకూ ఆహ్లాదం కలిగించే సరస్సులు కూడా అక్కడే ఉన్నాయి. ఆ సరోవరాలలో రకరకాలయిన నీటిపక్షుల జంటలు విహరిస్తుంటాయి. అక్కడ నీరు నిర్మలంగా ఉంటుంది. చేపలు ఈదుతూ కోనేటిలో కదలికలు కలిగిస్తాయి. ఆ సరోవరాలలో తెల్లకలువలూ, నల్లకలువలూ, ఎర్రకలువలూ, ఎర్ర తామరపూవులూ ఉన్నాయి. అటువంటి సరస్సులు కలిగిన ఉద్యానవనాలలో వారు ఇళ్ళు ఏర్పరచుకొంటారు. స్వర్గ భూములను మించిన తావులలో వారు విహరిస్తుంటారు. వారికి పగలూ, రాత్రి అనే కాలభేదాలు ఉండవు. శేషుడు మొదలయిన సర్పరాజుల పడగల మీద ఉన్న మణుల కాంతులవల్ల వారికి చీకట్లు ఉండవు. అక్కడ ఎప్పుడూ పట్టపగలులాగే ఉంటుంది. అక్కడివారు దివ్యమయిన మూలికల రసాలను, రసాయనాలను ఆహారంగా స్వీకరించడం వల్ల దేహవ్యాధులుగానీ, మనోవ్యాధులు గానీ వారికి ఉండవు. దేహం పాలిపోదు. ముడుతలు పడదు. జుట్టు నెరిసిపోదు. ముసలితనం రాదు. రోగాలు లేవు. చెమట దుర్వాసనలు ఉండవు. ఆకర్షణీయమయిన ఆకారాలు కలిగి ఉంటారు. వారికి సుదర్శనచక్ర భయం తప్ప మరే మృత్యుభయమూ ఉండదు.

అటువంటి పాతాళలోకంలో విష్ణుభగవానుని సుదర్శనచక్రం ఎపుడు ప్రవేశిస్తుందో అపుడే రాక్షస స్త్రీలకు గర్భస్రావం కలుగుతుంటుంది.

అతలమనే లోకంలో మయుని కుమారుడయిన బలాసురుడు స్వేచ్చగా విహరిస్తుంటాడు. అతడు తొంబైఆరు విధాలయిన మాయలతో వినోదిస్తుంటాడు. ఆ మాయలకు భూలోకంలోని వారు కొందరు లొంగిపోయి సమ్మోహితాత్ములై చరిస్తుంటారు.

బలాసురుని ఆవులింతలనుండి స్వైరిణులు, కామినులు, కులటలు అనే స్త్రీసమూహాలు పుట్టారు. ఆ స్త్రీలు పాతాళంలో ప్రవేశించిన పురుషునికి హాటకరసమనే సిద్ధ ఘుటికను ఇచ్చి అతనిని శృంగారరససిద్దుని చేస్తారు. తమ తళుకుబెళుకు చూపులతో, హావభావ ప్రదర్శనలతో, చిరునవ్వులతో, సరససల్లాపాలతో, కౌగిలింతలతో అతనిని లోబరచుకొంటారు. తమకు నచ్చిన రీతిలో ఆ పురుషునితో విహారం సాగిస్తారు. పాతాళం ప్రవేశించిన ఆ పురుషుడు తానే సిద్ధపురుషుడనని భావిస్తాడు. దర్పంతో అతని కళ్ళు నెత్తికెక్కుతాయి. తాను పదివేల ఏనుగుల బలం కలవాడనని భావించుకొని రకరకాల రతిక్రీడలతో పరమానందం అనుభవిస్తుంటాడు.

వితలమనే లోకానికి హాటకేశ్వరుడనే పేరు గలవాడూ, పార్వతీపతియైన శివుడు అధిపతి. అధిదేవత. భూతగణ సమేతుడయిన శివుడు బ్రహ్మసృష్టిని వృద్ధి పొందించటంకోసం పార్వతీ సంభోగపరుడు కాగా వారి వీర్యంనుండి హాటకి అనే నది పుట్టింది. ఆ నదిలోని జలరూపమయిన వీర్యాన్ని వాయువుతోకూడా అగ్ని ఆహారంగా తీసుకొని ఉమియగా హాటకం అనే పరిశుద్ధమయిన బంగారం పుట్టింది. ఆ వితలంలోని వారికందరికిని ఆభరణరూపంలో ఆ కనకం ఉపయోగపడుతున్నది.

వితలం కింద సుతలం ఉంది. సుతలంలో బలిచక్రవర్తి ఉన్నాడు. అతడు పుణ్యవంతుడయిన విరోచనుని కుమారుడు. శ్రీమన్నారాయణుడు ఇంద్రుని సంతోషపెట్టాలనుకొని అదితిగర్భంలో వామనుడై పుట్టాడు. త్రివిక్రమ రూపం ధరించి ముల్లోకాలను ఆక్రమించాడు. చివరకు విష్ణువు బలిచక్రవర్తికి సుతలంలో ఇంద్రత్వం అనుగ్రహించాడు. ఆ బలిచక్రవర్తి ఎన్నో పుణ్యకర్మలు చేశాడు. శ్రీహరి పాదపద్మాలను సేవించవలెననే అభిలాష కలవాడు. అతడు ఎంతో ఉత్సాహంతో లక్ష్మీశుడయిన శ్రీమన్నారాయణుని ఆరాధిస్తుంటాడు.

ఓ రాజా! వాసుదేవుడు అన్ని ప్రాణులలోనూ అంతర్యామిగా ఉండేవాడు. పైగా పుణ్యతీర్ధంలాగున పవిత్రుడు. అటువంటి వాసుదేవుని మనసులో నిలుపుకొని బలిచక్రవర్తి భూదానం చేశాడు. అటువంటి భూదానానికి శ్రీమన్నారాయణుడు మెచ్చుకొని సాక్షాత్కరించాడు. ఆ సాక్షాత్కారానికి మోక్షమే ఫలం. అంతేగాని, స్వర్గ రాజ్యంగాని పాతాళ రాజ్యంగాని ఫలాలు కావు. అయితే ముక్తి అన్నది ఎవరికీ కనిపించేది కాదు. అందువల్ల, శ్రీహరి బలిచక్రవర్తికి లోకప్రదర్శనార్థం పాతాళస్వర్గ రాజ్యాలు ఇచ్చాడు.

తుమ్మినపుడూ, పడినప్పుడూ, కాలు జారినపుడూ, తెలివి తప్పినపుడూ శ్రీమన్నారాయణుని నామస్మరణంచేసే పురుషునికి కర్మబంధాలు ఉండవు. ఆ బంధాలనుండి విముక్తి పొంది సుజ్ఞానవంతుడవుతాడు. ఆత్మజ్ఞానం అనుగ్రహించే వాసుదేవుడు మాయామయమయిన ఇహలోక సుఖభోగాలనూ, అనశ్వరమయిన ఐశ్వర్యాలను ఏ విధంగా ప్రసాదిస్తాడనే సందేహం వద్దు. శ్రీహరి యాచన నెపంతో బలిచక్రవర్తి సర్వసంపదలను హరించాడు. బలిని కేవలం శరీరమాత్రావశిష్టుని చేశాడు. వారుణ పాశాలతో బంధించి చివరకు వదలిపెట్టినపుడు బలిచక్రవర్తి ఈ విధంగా అన్నాడు.

భగవంతునికి ఎటువంటి పదార్థాలపైన కూడా కాంక్షలేదని తెలుసు. ఇంద్రుడు మొదలయిన దేవతలు ఉపేంద్రుని ప్రార్ధించడంవల్ల ఆ స్వామివచ్చి నిన్ను యాచించాడు. అంతేకాని అసలు శ్రీహరికి కోరికలనేవి లేవు. అదే గంభీరమయిన ఆయన స్వభావం. ఈ దృష్టి ఉన్నవారికి మన్వంతరాధిపత్యమెంత? త్రిలోకాధిపత్యమెంత? మా పితామహుడు ప్రహ్లాదుడు అభిమానవంతుడు. నరసింహావతారంలో ఆ స్వామి ఎంతో సంతోషంతో మా తాతనుచూచి ఏది అడిగితే అది ఇస్తానని అన్నాడు. అప్పుడు మహానుభావుడైన ప్రహ్లాదుడు ఈశ్వరాజ్ఞలోని అంతరార్థం తెలుసుకొన్నాడు.

అందువల్ల ఆయన ఎవరివల్లా భయంలేని తన తండ్రి రాజ్యం కావాలని కోరలేదు. పరమేశ్వరుని దాస్యాన్ని కోరాడు. అప్పుడు 'నీ తండ్రికంటె నీకంటె విశేషంగా ఏ పురుషుడు భగవదనుగ్రహం పొందగలుగుతాడు అంటూ ఆ పుండరీకాక్షుడు పలికిన పలుకుల సారాన్ని తరువాతిభాగంలో (సప్తమ స్కంధంలో) విస్తరించి చెబుతాను. సకల సద్గురుడైన శ్రీమన్నారాయణుడు తనవారిపట్ల దయ కలిగినవాడై శంఖం చక్రం మొదలయిన ఆయుధాలతో గదను ధరించి ఆ బలిచక్రవర్తి గృహద్వారంలో ఇప్పటికి కూడా కాపలా కాస్తున్నాడు. అటువంటి బలిచక్రవర్తి ఉండే సుతల లోకాన్ని జయించాలనే వాంఛగొన్న రావణుడు అనుజ్ఞలేకుండా సుతలంలోనికి ప్రవేశించినపుడు ఆ శ్రీమన్నారాయణుండు తన కాలి బొటనవ్రేలితో లంకేశ్వరుణ్లి పదికోట్ల యోజనాలదూరంలో పడేటట్లు చిమ్మివేశాడు.

ఆ సుతలానికి కిందిభాగంలో తలాతలం ఉంది. ఆ తలాతలానికి మయుడు ప్రభువు. రాక్షసుల పట్టణాలు నిర్మించిన మహాశిల్పిగా ప్రసిద్ధుడయిన మయుడు తలాతలాన్ని పాలిస్తుంటాడు.

శ్రీ మహావిష్ణువు ముల్లోకాలకు హితం కలిగించడంకోసం శివునిచేత త్రిపురాలను బూడిద చేయించాడు. అప్పుడు మయుడు విష్ణువును శరణు పొందాడు. శ్రీహరి మయుని కరుణించి తలాతలానికి రాజుగా చేశాడు. అతనికి విష్ణుదేవుని సుదర్శనచక్రంవల్ల తప్ప మరి దేనివల్లనూ మరణభయం లేదు.

తలాతలానికి కింద మహాతలం ఉంది. ఆ మహాతలంలో కద్రువ కొడుకులయిన సర్పరాజులు ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి పెక్కు పడగలున్నాయి. ఆ సర్పగణం క్రోధంతో ఉద్రేకంతో ప్రవర్తిస్తూ ఉంటుంది.

ఆ మహాతలంలో కుహకుడు - తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలయిన సర్పముఖ్యులున్నారు. వారు సాటిలేని మేటిరూపం కలవారు. ఆదిపురుషుడయిన నారాయణుని వాహనమయిన గరుత్మంతుని భయంవల్ల కలవరపడుతూ ఎల్లప్పుడూ భార్యలతో, బిడ్డలతో, మిత్రులతో, బాంధవులతో కలిసి ఉంటారు. మహాతలం కింద రసాతలం ఉన్నది. ఆ రసాతలంలో దైత్యులు, దానవులూ అయిన హిరణ్యపురవాసులు, నివాతకవచులు, కాలకేయులు అనువారు నివాసం చేస్తుంటారు. వారు దేవతలపట్ల శత్రుత్వం వహించి ఉంటారు. మహాసాహసవంతులు, తేజస్సు కలవారు అయినా అన్ని లోకాలకూ ప్రభువయిన శ్రీహరి తేజస్సుకు లొంగిపోయినవారై పుట్టలలో దాగిన సర్పాల మాదిరిగా భయంతో బతుకుతుంటారు. ఇంద్రుని దూతి అయిన సరమ ఉచ్చరించే మంత్రాలకు బద్దులై దిగులుదిగులుగా జీవిస్తారు.

చంద్రవంశంలో పుట్టిన మహారాజా! విను. అన్నిటికన్నా దిగువ పాతాళలోకముంది. ఆ పాతాళలోకంలోని నాగజాతివారు ఎంతో తెలివిగలవారయి ఎంతో ఉత్సాహంగా తిరుగుతుంటారు.

వాసుకి, శంఖుడు, కులికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు పాతాళలోక వాసులయిన మహానాగులు. వారిలో కొందరు ఐదుతలలవారు. కొందరు ఆరు తలలవారు. మఱికొందరు పది తలలవారు. ఇంకా కొందరు నూరు తలలవారు, వేయితలలవారు కూడా ఉన్నారు. వారి పడగలమీద మణులు మెరుస్తుంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను బారదోలుతుంటాయి.

పాతాళలోకం అడుగున ఆదిశేషుడు ఉన్నాడు. అతడు ముప్పదివేల యోజనాల వెడల్పున తన శరీరాన్ని చుట్ట చుట్టుకొని ఉంటాడు. విష్ణు మహాదేవుని మహత్తర శరీరమయిన ఆదిశేషునికే అనంతుడు, సంకర్షణుడు అని పేర్లు. అనంతుడని పేరు గల ఆదిశేషుని తలమీద ఆవగింజలాగున ఈ భూమండలం ఉన్నది. ప్రళయకాలంలో లోకాలను సంహరించే నిమిత్తం ఈ ఆదిశేషుడు ప్రచండమయిన కోపంతో పదునొకండు మంది రుద్రులను సృష్టిస్తాడు.

ఆ రుద్రమూర్తులందరూ మూడుకన్నులు కలవారు. త్రిశూలధరులు. ఆ లోకంలోని సర్పరాజగణం శేషుని పాదపద్మాలను భక్తితో సేవిస్తూ ఉంటుంది.

అణకువగలవారై, ప్రతిరోజు మిక్కిలి సంతోషంతో, తమ కోరికలీడేరగా, పడగలమీదనున్న మణులతో నిరంతరం ఆసక్తితో హారతులిస్తుంటారు.

సంకర్షణ మూర్తి అయిన ఆ ఆదిశేషుని దగ్గరికి తమ కోరికలు తీర్చుకోవడానికి నాగకన్యకలు వస్తుంటారు. ఆయన సమక్షంలో తమ శరీరవిలాసాలు ప్రదర్శిస్తుంటారు. అగరు, చందనం, కుంకుమపువ్వుతో కలిపి మెత్తని ముద్దగా తయారు చేసిన సుగంధ లేపనాలతో ఆయనను అర్చిస్తారు. ఆ తరువాత ఆ అనంతుని అపురూపమయిన రూపాన్ని తనివితీరా చూడడంవల్లనూ, ఆ మూర్తిని తాకడంవల్లనూ కామోద్రేకం కలిగిన వారవుతారు. ఆ కారణంగా చిరునవ్వులు చిందిస్తూ సిగ్గు లొలకబోస్తూ, క్రీగంటి చూపులు ప్రసరింపజేస్తూ ఆయన వంక చూస్తుంటారు. అప్పుడు అనంతగుణ సంపన్నుడయిన అనంతుడు తన సహజ కోపాన్ని వదలిపెట్టి శాంతుడవుతాడు. లోకాలన్నిటికి క్షేమాన్ని కాంక్షిస్తాడు. దేవతలు, అమరులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు, అనంతుని సదా ధ్యానం చేస్తుంటారు. అపుడు అనంతుడు సంతోషంతో అరగన్ను మోడ్పులతో, లలితగీతాలతో కూడిన మనోహరమయిన వాద్యధ్వనులకు ఆనందిస్తుంటాడు. తన పరిజనాన్ని ప్రీతితో తిలకిస్తుంటాడు. వైజయంతీ మాలికలను ధరిస్తుంటాడు. ఆ మాలికలు అపుడే కూర్చిన తులసీమంజరులతో కూడినవై ఉంటాయి. ఆ మంజరుల మకరంద సుగంధాలకు క్రమ్ముకొన్న తుమ్మెదలు జుమ్ముజుమ్మని పాటలు పాడుతుంటాయి.

అతడెప్పుడూ నల్లని వస్త్రాలు ధరించి నాగలిని ఆయుధంగా పట్టుకొని ఉంటాడు. అతణ్ణి మహేంద్రుడో, శివుడో అని అసలు జనులు భావిస్తుంటారు. ఆయన ఒక్కొక్కసారి బంగారు వస్త్రాలతోప్రకాశిస్తుంటాడు. ఆ శేషుడు మోక్షార్థులై తనను ధ్యానించేవారి హృదయగ్రంథిని తొలగించి అధ్యాత్మ విద్యతో కూడిన ఆనందాన్ని కలిగిస్తాడు. అందువల్లనే ముక్తిని కోరేవారు అనంతుని భక్తితో ఆరాధిస్తుంటారు. ఇన్ని మహిమలు కలిగినవాడు కావడం వల్లనే బ్రహ్మ మానస పుత్రుడయిన నారదుడు, తుంబురుడు మొదలయిన ఋషిపుంగవులతో కూడి బ్రహ్మదేవుని పేరోలగంలో అనంతుణ్ణి ఈ విధంగా స్తుతిస్తుంటాడు.

ఎవని లీలావినోదాలు సృష్టి స్థితి సంహారాలకు హేతువులవుతాయో, ఎవని చూపులవల్ల సత్త్వరజస్తమోగుణాలు పుట్టాయో, ఎవని రూపం లోకాలను అనేక విధాలుగా కాపాడుతుంటుందో, ఎవని పేరును తెలియకపోయినా స్మరించిన మాత్రాన పాపాలు పటాపంచలవుతాయో అటువంటి సంకర్షణుడూ అవ్యయుడూ అయిన ఆదిశేషుని పొగడడం ఎవరికీ సాధ్యం కానీ పని. ఆ అనంతుడు వాక్కుకూ, మనస్సుకూ అందనివాడు. ముల్లోకాలవారికి అంతు చిక్కనివాడు.

మావంటివారిని కాపాడడంకోసం ఆ ఆదిశేషుడు సత్త్వగుణస్వభావుడై ఉన్నాడు. అటువంటి అనంతునికి ప్రతిదినం నమస్కరిస్తాను.

ఆ ఆదిశేషుణ్ణి ఎవరయినా సరే హఠాత్తుగా తలచుకొన్నాా బాధలలో చిక్కుకొని మొరపెట్టినా అటువంటి వ్యక్తుల పాపాలను పోగొడతాడు. సకల శ్రేయస్సులూ ప్రసాదిస్తాడు. అందువలన ముక్తి కోరేవారు అనంతుని ఆశ్రయించి ధ్యానించి భవబంధాలకు దూరమవుతారు. అతని పడగలమీద భూగోళం అణుమాత్రంగా నిలిచి ఉంటుంది. ఆ అనంతుని మహిమలు లెక్కించడం వేయినాలుకలున్న వానికి కూడ అలవి గాని పని. ఆ అనంతుడు పాతాళంలో నివసిస్తూ అన్ని లోకాలకూ మేలు కోరువాడై భూమిని ధరిస్తాడు. అంటూ లోకాల స్వరూపాలూ, జంతువుల స్వభావములూ, మానవుల నైజాలను శుకుడు పరీక్షిత్తుకు విశదంగా వినిపించి, ఇంకా ఏమేమి వినదలచుకొన్నావో అడుగవలసిందని పలికాడు. అప్పుడు పరీక్షిన్నరేంద్రుడు శుకయోగీంద్రునితో ఈ విధంగా అన్నాడు.

మునీంద్రా! అతలవితలాది లోకాల స్వరూప స్వభావాలను నా మనసులో నాటేవిధంగా నీవు విశదీకరించావు. ఆ లోకాలన్నీ ఒకదానికొకటి సాటిలేనివి. పైగా చాలా చిత్రమయినవి.

పరీక్షిత్తు ఈ విధంగా పలుకగా శుకమహర్షి ఇలా అన్నాడు.

ఓ రాజా! ఈ లోకంలోని జీవులకు సత్త్వరజస్తమోగుణాలను అనుసరించి ఆసక్తులు వేరువేరుగా ఉంటాయి. సాత్విక శ్రద్ధ, రాజసశ్రద్ధ, తామసశ్రద్ధ అనేవానికి అనుగుణంగా వారి కార్యకలాపాలు కూడా వివిధంగా ఉంటాయి. ఈ తారతమ్యాలు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి.

నరేంద్రా! వేదం ఏ పనులను చేయవద్దని చెప్తుందో ఆ పనులు అధర్మాలు. అటువంటి ప్రతిషిద్ధ లక్షణమయిన అధర్మాన్ని ఆచరించే మానవుని శ్రద్ధ విపరీతంగా ఉంటుంది. శ్రద్ధయే భిన్నంగా ఉండడంవల్ల కర్మఫలాలు కూడా భిన్నంగా ఉంటాయి. అందువల్ల అనాదినుండి ఉన్నవి, అజ్ఞానంవల్ల ఏర్పడేవి, స్వేచ్చాప్రవర్తనలవల్ల కలిగేవి, అయిన నానావిధ కర్మగతులను సంగ్రహంగా చెబుతాను. విను. అనగానే పరీక్షిత్తు శుకునితో ఈ విధంగా అన్నాడు.

మునులలో శ్రేష్ఠడవయిన శుకయోగీంద్రా! నరకాలు ఉన్నాయని అంటారు. అవి ఎక్కడ ఉన్నాయి. ముల్లోకాలలోనా? లేక రెండు లోకాల నడుమనా? ఈ రెండూగాక వెలుపల వేరే ప్రదేశంలోనా? ఎక్కడ ఉన్నాయి? నరకమంటూ ప్రత్యేకంగా ఏవయినా లోకాలు ఉన్నాయా? నాకు వివరించి చెప్పు. వినాలని చాల కుతూహలపడుతున్నాను.

పరీక్షిన్మహారాజు ప్రశ్నలు విని శుకమహర్షి ఈ విధంగా అన్నాడు.

శుకయోగి పరీక్షిత్తునకు దెలిపెడి నరకలోక వర్ణనము

No comments:

Post a Comment