Friday, March 6, 2026

Sukadeva Provides a Detailed Account of the Narakalokas - శుకయోగి పరీక్షిత్తునకు దెలిపెడి నరకలోక వర్ణనము

శుకయోగి పరీక్షిత్తునకు దెలిపెడి నరకలోక వర్ణనము

మూడులోకాలకు ఆవల దక్షిణదిశలో మిక్కిలి భయంకరాలై, భూమ్యాకాశాల నడుమ విజృంభణంగా నెలకొని నరక లోకాలున్నాయి.

అంతేగాకుండా దక్షిణంలోనే ఉన్న అగ్నిష్వాత్తులు మొదలయిన పితృదేవతలు కూడా తమతమ గోత్రాలలో పుట్టినవారికి శుభం కలగడంకోసం సత్యమయిన దీవనలు ఇస్తుంటారు. అక్కడ పితృపతి అయిన యముడు కూడా తన లోకం చేరుకొనే జీవులకు జీవితకాలంలో వారు వారు చేసిన కర్మలకు తగినట్లు ఫలం ప్రసాదిస్తూ శిక్షిస్తుంటాడు. ఆ యమలోకంలో తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటక శాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయాదనం, అవీచిరయం, రేతఃపానం అనే ఇరువదొక్క నరకాలున్నాయి. అవేగాకుండా క్షారకర్దమం, రక్షోగణ భోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే మరి ఏడు నరకాలున్నాయి. వెరసి దక్షిణంలో ఇరవై ఎన్మిది నరకాలున్నాయని కొందరు చెబుతారు.

ఇతరుల బిడ్డలూ, భార్యలూ అనే ఆదరభావం ఏమాత్రం లేకుండా అకారణంగా వారిని అపహసించే పాపాత్ముణ్ణి యమకింకరులు తాళ్ళతో బంధించి పరిపరివిధాల బాధిస్తారు.

అంతేగాకుండా వారిని తామిస్రమనే నరకంలో పడవేస్తారు. అన్నం పెట్టక, కొండపై నుండి తోసివేస్తూ, కర్రలతో చావబాదుతూ, బెదరిస్తూ యమకింకరులు నానావిధాలుగా శిక్షిస్తారు. ఆ బాధలకు తాళలేక జీవులు భయకంపితులై మూర్చపోతుంటారు.

మగడు ఉండగానే అతణ్జి మోసగించి అతని ఇల్లాలిని కామించి అనుభవించినవాణ్ణి పట్టుకొని యమకింకరులు సంకోచం లేకుండా అతణ్ణి పట్టరాని కోపంతో అంధతామిస్రం అనే నరకంలో తోస్తారు.

ఓ రాజా! ఎవరయితే తన కుటుంబ పోషణకోసం ఇతరులకు ద్రోహం చేస్తారో అటువంటివారు రౌరవ నరకంలో పడతారు. ఎవరయితే ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఇతరులకు ఏ మాత్రం అపకారం తలపెట్టని పశుపక్షి మృగాదులను బాధిస్తారో అటువంటి పాపాత్ములను ఆయా మృగాలు భయంకర రూపాలతో నానాబాధలు పెడతాయి. అటువంటి వారు రౌరవ మహారౌరవ నరకాలంలో పడతారు. ఎవరయితే తమ కడుపు నింపుకోవడం కోసం ఎలుకల కన్నాలు మూసి వాటిని చంపుతారో అటువంటి నిర్థయులను కుంభీపాక నరకంలో పడవేసి హింసిస్తారు.

('పాపాత్ములు రురునామక జంతువులుగా పుడతారు. రురువు అంటే నల్లచారల దుప్పి. మిక్కిలి క్రూరమయిన జంతువు. 'రురు' కారణంగా నరకానికి రౌరవమని పేరు వచ్చింది అనే వివరణ కనిపిస్తుంది (26-11).)

తల్లిదండ్రులకూ, బ్రాహ్మణులకూ కీడు తలపెట్టేవాడు, కాలసూత్రమనే భయంకర నరకంలో పడతాడు. అక్కడ పదివేల యోజనాల పొడవుగల లోహపాత్రలలో అతణ్జి పడవేస్తారు. పైన ఎండ మండిపోతుంటుంది. కింద మంటలు భగ భగ మండుతుంటాయి. అతడు పరుగెత్తుతూ పడుతూ లేస్తూ నిలబడుతూ పక్కకు తప్పుకొంటూ ఆకలితో దప్పికతో అలమటిస్తుంటాడు. ఆవు ఒంటిమీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు అక్కడ యమకింకరులు వాణ్ణి బాధిస్తారు.

వేదమార్గాన్ని వదలిపెట్టి పాషండమార్గం అవలంబించే పురుషుని అసిపత్రవనమనే నరకంలో పడవేస్తారు. అక్కడ కత్తులవంటి ఆకులు గల ఆ చెట్ల నడుమ పరుగెత్తుమని ఆదేశిస్తూ పరిహాసం చేస్తూ కొరడాలతో కొడుతుంటారు. ఇరుప్రక్కల కత్తులవంటి చెట్ల ఆకులు తగిలి శరీర భాగాలు తెగిపోతుంటాయి. అపుడా జీవుడు అడుగడుగునా మొరపెడుతున్నా వినకుండా యమకింకరులు వాణ్ణి వేధిస్తుంటారు.

దండించ తగని సాధువులను దండించినా, బ్రాహ్మణ శ్రేష్ఠులను శారీరకంగా హింసించినా అటువంటి దుర్మార్గుల్ని కాలసూత్రనరకంలో పడవేసి కఠినంగా దండిస్తారు.

అక్కడ ఆ దుర్మార్గుణ్ణి పట్టుకొని యమభటులు చెఱకుగడ విరిచినట్టుగా నడిమికి రెండుగా విరిచి హింసిస్తుంటే వాడు అరుస్తూ, ఆక్రోశిస్తూ, మూర్చపోతూ, మొరపెడుతూ ఉంటాడు.

నరేంద్రా! విధి నియమించిన విధంగా తమ బతుకు తాము గడుపుతున్న జంతువులను హింసించేవాణ్ణి అంధకూప నరకంలో పడతోస్తారు. అక్కడ తాము చేసిన ద్రోహం కారణంగా ఆ నరకకూపంలో దొరలుతూ ఏ జీవులనయితే తాను బాధించాడో క్రూరాలైన ఆ పక్షులు, మృగాలు, పశువులు, పాములు, దోమలు, నల్లులు, ఈగలు వాణ్ణి పీక్కు తింటాయి. కటిక చీకటిలో నిదురకు నోచుకోక తిండికి మొగం వాచి కుత్సిత శరీరంలోని జీవునిలాగా సగం చచ్చి పడి ఉంటాడు.

తాను కూడబెట్టిన సంపదలో ఎవ్వడైనా తన బంధుగణంతోకూడి తగిన రీతిలో ఆరగించకుండా, తాను కూడా కాకి తినేవిధంగా తినేవాడు. తాను కూడబెట్టిన సంపదలో ఏ కొంచెం కూడా తనవారికి పెట్టకుండా తానొక్కడే భక్షించినవాణ్ణి క్రిమి భోజనమనెే నరకంలో తోస్తారు. అక్కడ వాడు పురుగై సుమారు లక్ష యోజనాల విస్తీర్ణం కలిగిన పురుగుల గుంటలో కూరుకుపోయి పురుగులను ఆహారంగా తింటూ ఉంటాడు.

ఈ భూలోకంలో ఎవడయితే తనకు ఎటువంటి కష్టమూ లేకపోయినా దొంగతనంగా బ్రాహ్మణాదుల బంగారాన్ని రత్నాలు మొదలైన విలువ గల వస్తువులను అపహరిస్తాడో అటువంటివాణ్ణి అగ్ని తప్త నరకంలో పడవేస్తారు. మండుతున్న ఇనుపగుండ్లను అతని శరీరంపై విసరివేస్తారు. ఎర్రగా కాలిన ఇనుపచువ్వలు గుచ్చుతారు. మోహంతో కామంతో కళ్ళు కనబడక వావివరుసలు లేకుండా ప్రవర్తించిన స్త్రీ పురుషులను యమలోకంలో తీవ్రమయిన కొరడాలతో కొట్టి గనగన కాలుతున్న ఉక్కుబొమ్మల్ని కౌగిలించుకొనేటట్లు చేస్తారు.

జంతువులతో సంగమం చేసినవాణ్ణి పట్టుకొని వజ్రాల మెకులుగల బూరుగు చెట్లకు కట్టి చితక గొడతారు.

ఓ రాజేంద్రా! ఎవడయితే పాషండదర్శనంపట్ల ఆసక్తి పెంచుకొని ధర్మమార్గాన్ని పరిత్యజిస్తాడో అటువంటివాడు నరకలోకంలో వైతరణీ నదిలో పొరలుతుంటాడు.

ఆ వైతరణీ నదిలోని మొసళ్ళు పాషండమతంపట్ల మోజు పెంచుకొన్నవాణ్ణి పీక్కుతింటాయి. అటువంటి పాషండులు ప్రాణాలు పోతుంటే తాము చేసిన తప్పుల్ని తలచుకొంటూ మలమూత్రాలు, చీమూ నెత్తురు, వెంట్రుకలూ, గోళ్లు, ఎముకలు, కొవ్వు, మాంసం, మూలుగు కలిసిన ప్రవాహంలో మునిగి తేలుతూ పడికొట్టుకొంటుంటారు. ఎవడయితే బ్రాహ్మణుడయి యుండి కూడా శుచిత్వం. సదాచారం వదలిపెట్టి సిగ్గు బిడియం లేకుండా శూద్రస్త్రీలతో పశువువలె ప్రవర్తిస్తాడో అటువంటివాడు నరకలోకంలో మలమూత్రాలు, లాలాజలం, కఫంతో కూడిన ప్రవాహంలో త్రోయబడి అసహ్యకరమైన ఆ వస్తువులనే భుజిస్తూ కాలం గడుపుతాడు.

ఎవడయితే వేటకుక్కల్ని పెంచి ఎప్పుడు పడితే అపుడు వేటకు పోతూ మాంసంకోసం అడవిలోని మృగాలను వధిస్తాడో, అటువంటి నీచుణ్ణి యమలోకంలో పదునైన ఆయుధాలతో నలిగిపోయేట్లుగా పొడుస్తారు.

ఎవడయితే డాబు దర్పంకోసం పశువుల్ని చంపి ఆడంబరంగా యాగాలు నిర్వహిస్తాడో, అటువంటివాణ్ణి యమకింకరులు పొలికేకలు వేస్తూ ఱంపాలతో పరపర కోస్తుంటారు.

ఎవడయితే కామంతో కళ్ళు మూసుకుపోయి తన భార్యచేత రేతపానం చేయిస్తాడో ఆ పాపాత్ముని రేతస్సుతో నిండిన మడుగులో ద్రోసి ఆ రేతస్సునే వానిచేత త్రాగిస్తారు. రాజభటులయినా, దొంగలయినా గ్రామాలపై పడి ఇళ్ళకు నిప్పు అంటించేవారిని, మందు మాకులు పెట్టి ఇతరుల్ని చంపేవారిని, వజ్రాల కోరలున్న ఏడువందల ఇరవై కుక్కలు ప్రతిదినమూ చుట్టుముట్టి పీక్కుతింటాయి.

లంచం పుచ్చుకొని దొంగ సాక్ష్యం చెప్పి ఎదుటివారిని మోసగించిన పాపాత్ముని అవీచి అనే నరకంలో పడవేస్తారు. అక్కడ వానిని పట్టుకొని బంధించి నూరు యోజనాల ఎత్తయిన కొండ శిఖరంనుండి తలక్రిందుగా క్రిందికి విసరివేస్తారు. అపుడు వాడు పెడబొబ్బలు పెడుతూ అలలు లేని కొలనువలె నున్నగానున్న చట్రాతిమీద పడిపోతాడు. అట్లాపడి శరీరం ముక్కలు ముక్కలై మరల అవి కలుసుకొంటూవుంటే చావురాక బ్రతుక లేక ఆకులపాటుతో అవస్థపడుతుంటాడు.

(అవీచి - తరంగములు లేని జలంలో ముంచెత్తడం - 'అవీచి నామక నరకం'. భృగుపతనం / శైలపతనం మాటిమాటికి పర్వత శిఖరం మీదికి ఎక్కించి మరల పడతోయుట. గాలియాడని, ఊపిరి సలుపడానికి వీలులేని దిగ్భంధనాన్ని కూడ 'అవీచి' అంటారు.

సోమయాజి పెళ్ళాన్ని కామించి అనుభవించినవాణ్ణి, సోమపానమంటూ దొంగచాటుగా మద్యపానం చేసే వైశ్యులను, క్షత్రియులను, బ్రాహ్మణులను వదలిపెట్టరు.

అటువంటి వారిని యమదూతలు బంధించి యాతనలకు లోను చేస్తారు. గుండెలపై కాలుమోపి తొక్కుతారు. దిమ్మ తిరిగే లాగున ముఖంమీద మొత్తుతారు. స్పృహరాగానే ఎర్రగా సలసల కాగే ఉక్కుద్రవాన్ని నోటినిండా పోస్తారు.

తక్కువ కులంవారు ఆడంబరంతో కూడిన నిష్ఠలతో తపస్సు, దానం, విద్య, ఆచార వ్యవహారాలతో అహంకరించి పెద్దలను అవమానించినట్లయితే అటువంటి వారిని క్షారకర్దమం అనే నరకంలో తలకిందుగా వేలాడదీసి బాధలు పెడతారు. ఆడవారుగాని, మగవారుగాని తమ ప్రాణాలు కాపాడుకోవడానికి క్షుద్ర దేవతలకు జంతువులనుగాని, మనుష్యులనుగాని బలి ఇస్తే అటువంటి దుర్మార్గులను యమకింకరులు చురకత్తులతో పొడిచి రక్తం తాగుతారు. ఊళ్ళలోనూ, అడవులలోను ఉండే జంతువుల కడుపులలో శూలాలు గ్రుచ్చి హింసిస్తూ ఆ జంతువులు గిలగిల తన్నుకొని బాధపడుతుంటే గంతులువేస్తూ సంతోషించేవారిని యమకింకరులు శూలప్రోతమనే నరకంలో త్రోసి శూలంతో గ్రుచ్చుతారు. అక్కడివారు ఆకలిదప్పులతో నకనకలాడుతుంటే రాబందులూ, గ్రద్దలూ పదునైన ఉక్కుముక్కులతో వారి దేహాలను పొడుచుకొని తింటాయి. ఇంతేగాక నిర్దాక్షిణ్యంగా నోరులేని జంతువుల్ని పీడించే పాపాత్ములను దందశూకమనే నరకంలో పడవేస్తారు. అక్కడ ఐదు తలలూ, ఏడు తలలూగల సర్పాలు వాళ్ళను కరుస్తుంటాయి.

నరేంద్రా! ఇళ్ళలోగాని, పెరళ్ళల్లోగాని తిరిగే పశువుల్ని, పక్షుల్ని జింకలను పట్టి హింసించే పాపాత్ములను నిప్పులతోనూ, విషంతోనూ, పొగలసెగలతోను నిండిన నరకాలలో విసరివేస్తారు.

తన ఇంటికి అతిధిగా అరుదెంచిన మానవుని ఆదరించకుండా చీదరించుకొని కోపోద్రేకంతో చూచిన దుర్మార్గుల కన్నులను వజ్రాల కోరలుగల రాబందులు గ్రద్దలు పొడుచుకొని తింటాయి.

రాజా! ధనరాసులున్న భాగ్యవంతుడు ధర్మకార్యాలు చేయకుండా ఇతరులకు ఏమాత్రం ఉపకారం చేయకుండా ధనం కూడబెట్టడమే ధ్యేయంగా భావించినవాడు చనిపోతే వాణ్ణి యమభటులు 'సూచీముఖ' మనే నరకంలో పడతోస్తారు. అక్కడ భయంకరులయిన యమకింకరులు 'డబ్బుకు కాపలా ఉన్న దయ్యమా' అంటూ వాణ్ణి పట్టి తాళ్ళతో కట్టీ నానా బాధలు పెడతారు.

నరులలో శ్రేష్ఠడయినవాడా! ఇటువంటి నరకాలు యమలోకంలో వేలసంఖ్యలో ఉన్నాయి. ఆ నరకాలలో యమదూతలు అధర్మపరులను ఎల్లప్పుడూ బాధిస్తుంటారు.

పుణ్యచరితా! ధర్మపరులయిన మానవులందరు స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తారు. వారు వారు చేసుకొన్న పుణ్యపాపాలను బట్టి వాటిని అనుభవించడానికై భూలోకంలో పుడుతూ ఉంటారు.

ఓ రాజా! మోక్షమార్గం నీకు ముందే వినిపించాను. ఈ బ్రహ్మాండంలో పధ్నాలుగు లోకాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి బ్రహ్మాండం శ్రీమన్నారాయణుని స్థూలశరీరం. అందువల్ల బ్రహ్మాండ వర్ణన చేసేవారూ, అది విన్నవారూ అన్నిరకాల శుభాలను అనుభవిస్తారు. ఈశ్వరుని స్థూలశరీరం తెలిసినవారికి శ్రద్ధవల్లనయితేనేం, భక్తివల్ల నయితేనేం భగవానుని సూక్ష్మరూపం తెలుసుకోవడానికి వీలుంది. భూగోళమందలి సప్తద్వీపాలు, తొమ్మది వర్షాలు, వాటిలోని నదులు, పర్వతాలు, ఆకాశం, సముద్రం, పాతాళం, దిక్కులు, నరకం, నక్షత్ర సముదాయం మొదలైన సకల జీవరాసులతోకూడి అద్భుతమైన శ్రీమన్నారాయణుని స్టూలశరీర స్వరూపాన్ని నీకు వినిపించాను.

(మూలంలో చివర 'యతనశీలుడయిన సాధకుడు భగవానుని స్థూల రూపాన్ని గురించి, సూక్ష్మమైన స్వరూపాన్ని గురించి శ్రవణం చేసి, స్థూలరూపంలో మనస్సును ఏకాగ్రంచేసి మెల్లగా బుద్ధితో మనస్సును సూక్ష్మమైన స్వరూపం (ఆత్మ)లో విలీనం చేయాలి అని వివరణ ఇవ్వబడింది.

బ్రహ్మ మొదలయిన దేవతలూ, ఋషులూ స్తుతించేవి పుణ్యతీర్థాలవలె పవిత్రమయినవి అయిన పాదపద్మాలు కలవాడవూ, నవరత్నాలతో ప్రకాశించే కాలిఅందెలు కలవాడవూ, కౌస్తుభమణిని భూషణంగా ధరించినవాడవూ, వెల్లివిరిసే తులసీదళాల పరిమళాలూ, కస్తూరీ సుగంధాలూ గుబాళించే దివ్యదేహం కలవాడవూ, లక్ష్మీదేవికి నివాసమయిన వక్ష స్ధలం కలవాడవూ, భూభారాన్ని వహించేవాడవూ, సూర్యచంద్రులే కన్నులుగా కలవాడవూ అయిన శ్రీకృష్ణా! నీకు నమస్కారం.

లక్ష్మీదేవి హృదయంలో నివసిస్తూ నిత్యం జీవుల పాపాలను హరిస్తూ లోకాలన్నిటిని పవిత్రం చేస్తూ అలౌకిక గుణాలకు ఆశ్రయమయినవాడవై ప్రసిద్ధి గలవాడై, దేవతలచేత అర్చింపబడే పాదపద్మాలు కలవాడవై కంసుని సంహరించిన వాడవయిన శ్రీకృష్ణా! నీకు నమస్కారం.

శత్రు బృందాలను రూపుమాపేవాడవు. భక్తుల పాలిటి పెన్నిధివీ, దానశీలుడవూ, సూర్యమండలం మధ్యలో ప్రకాశించువాడవూ, సత్యస్వరూపుడవూ, గద, ఖడ్గం, ధనుస్సు, శంఖం, చక్రం అనే పంచాయుధాలు ధరించినవాడవూ, భూమండలాన్ని ఉద్ధరించినవాడవూ, ఆర్తులను ఆదుకొనేవాడవూ, మదోన్మత్తులయిన రాక్షసులను అణగదొక్కువాడవూ అయిన శ్రీకృష్ణా! నీకు నమస్కారం.

 శ్రీకృష్ణార్పణమస్తు 

No comments:

Post a Comment