Friday, March 20, 2026

The Tripurasura story - త్రిపురాసురోపాఖ్యానం

త్రిపురాసురోపాఖ్యానం

పూర్వం మహాబలవంతుడు, మాయావి అయిన “మయుడు” అనే రాక్షసుడుండేవాడు. అతడు దేవతలతో యుద్ధం చేసి ఓడిపోయాడు. తిరిగి ఎలాగైనా వారిని జయించాలని ఘోరమైన తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ విషయం తెలసి మయుడి మిత్రులైన విద్యున్మాలి, తారకాక్షుడు అనే ఇద్దరు అసురులు కూడా అతడితో పాటే తపస్సు చేయాలని భావించారు. ఒకనాడు ఆ ముగ్గురూ కలిసి కఠోరదీక్షతో తీవ్రమైన తపస్సు చేయటం ప్రారంభించాడు.

తమ శరీరం సంపూర్ణంగా కృశించిపోయేలా అన్ని ఋతువుల్ని తిరస్కరిస్తూ వారు చేసిన తపోశక్తికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. వారి వేడికి అగ్ని సూర్యులు కూడా తట్టుకోలేకపోయారు. లోకాలన్నీ తగలబడటం ప్రారంభించాయి. వెంటనే ప్రజాపతి బ్రహ్మదేవుడు వారి ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.

తమ తపస్సుకి ప్రసన్నుడైన బ్రహ్మదేవుణ్ణి చూసి ఆ అసురులు ముగ్గురూ ఎంతో సంతోషించారు. మయుడు ఆయనతో “బ్రహ్మదేవా! పితామహా! పూర్వం దేవతలతో జరిగిన యుద్ధంలో మా దానవులు ఎందరో మరణించారు. మిగిలిన దానవులంతా తలో దిక్కుకీ పారిపోయి తలదాచుకున్నారు. కొంతకాలం తరువాత వారంతా నా దగ్గరకి వచ్చి శరణు వేడారు. నావారందరినీ కాపాడాల్సినబాధ్యత నాదే కదా స్వామీ! అందుకే నా వారందరి కోసం నేను నీ దివ్యానుగ్రహంతో దేవతలెవరూ చొరబడలేని ఒక మహా దుర్గాన్ని నిర్మించాలనుకుంటున్నాను. ఆ దుర్గాన్ని సకలలోకాలలో వున్న ఎలాంటి శక్తులు, ఆయుధాలు ఛేదించని విధంగా వుండాలి. మా అందరికి అమరత్వం కావాలి. ఇదే నా కోరిక” అని నమస్మరించాడు.

మయుడి కోరిక విన్న బ్రహ్మ దేవుడు "దైత్యగణాధిపా! మయా! పుట్టినవారికి మరణం తప్పదు. అమరత్వం కోరుకోవటం నీకు సమంజసం కాదు. అయితే నీవు కోరినట్టు నీ దుర్గాన్ని నిర్మించుకో. అది శత్రుదుర్భేద్యమవుతుంది" అన్నాడు. అందుకు మయుడు "పితామహా సరే! నీవన్నట్టు మాకు
అమరత్వం వద్దు. అయితే మేము నిర్మించిన దుర్గాన్ని ఒకేసారి విడిచిన ఒకే బాణం మాత్రమే  భేదించగలగాలి. ఆ బాణం ద్వారా మాత్రమే మేమంతా మరణించాలి. అంతవరకూ మాకు అమరత్వాన్ని ప్రసాదించు” అని కోరాడు. బ్రహ్మ 'తథాస్తు' అని వరాన్ని ప్రసాదించి అదృశ్యమయ్యాడు.

బ్రహ్మ ఇచ్చిన వర ప్రభావంతో మయుడికి అతడి అనుచరులకి రెట్టింపు ఉత్సాహం వచ్చింది. వెంటనే మయుడు శత్రుదుర్భేద్యమైన విధంగా వంద యోజనాల పొడవు వెడల్పు కొలతలతో మూడు శక్తివంతమైన పురాలని నిర్మించాడు. ఆ మూడు పురాలు పుష్యయోగంలో నిర్మించబడ్డాయి.
అవి తిరిగి పుష్యయోగంలో మాత్రమే పరస్పరం కలుసుకుంటాయి. మయుడు తన నిర్మాణ చాతుర్యంతో ఆ మూడు పురాలలో ఒక దాన్ని అయో(ఇనుము) దుర్గంగా చేసి భూమండలం మీద ఉంచాడు. రెండోదాన్ని రజతం(వెండి) తో నిర్మించి అంతరిక్షంలో వుంచాడు. మూడో దుర్గాన్ని బంగారంతో నిర్మించి అంతరిక్షానికి పైన నిలిచేలా చేసాడు.

ఆ విధంగా సకల రక్షణా వ్యవస్థలతో, వివిధ ఆయుధాలు ధరించిన సైనికులతో ఆ మూడు నగరాలు శత్రువులు జయించటానికి వీలు లేనంత పటిష్టంగా రూపొందాయి. ఆ మూడు పురాలనీ మయుడు, విద్యున్మాలి, తారకాక్షుడు నిత్యం సంరక్షిస్తున్నారు.

త్రిపుర దుర్గంలో అసురుల ప్రవేశం: అసుర శిల్పి మయుడు నిర్మించిన ఆ దివ్య పురాలలోకి సకలలోకాలలో వున్న అసురులంతా తండోపతండాలుగా వచ్చిచేరారు. ఆ దుర్గాలలో మహా పర్వతాలు, నదులు, సముద్రాలు, సుందరమైన స్థలాలు ఎన్నో వున్నాయి. మొత్తం ఆ మూడు పురాలలోకి వంద కోట్ల మంది దైత్యులు ప్రవేశించారు. అక్కడ వారికి ఎలాంటిలోటు లేదు. ఏది కోరితే అది లభిస్తుంది. అద్భుతమైన అందంతో విరాజిల్లే కాంతలు నిత్యం దైత్యుల్ని ఆనందంలో ముంచెత్తుతుంటారు. అయితే అన్ని రకాల సుఖాలు లభిస్తున్నప్పటికీ త్రిపురాలలో వున్న దైత్యులు ఎవ్వరూ ధర్మాన్ని వీడలేదు. అందరూ ధర్మబద్ధంగా నీతివంతంగా జీవిస్తుండేవారు. పెద్దల్ని గౌరవిస్తూ, గురువుల్ని పూజిస్తూ బ్రాహ్మణులకి నమస్కరిస్తూ ధర్మార్ధకామమోక్షాలని ఆచరిస్తూ నియమబద్దంగా కాలం గడుపుతున్నారు.

త్రిపురాలలో కలి ప్రవేశం: ఒకనాడు ఒకేసారి లోభం, క్రోధం, కలహం అనే రూపాలతో కలిపురుషుడు త్రిపురాలలోకి ప్రవేశించాడు. అది మొదలు త్రిపురంలో వున్న వారందరినీ వ్యాధులు పీడించటం ప్రారంభించాయి. ఆ కలి సంధ్యాకాలంలో ప్రవేశించాడు. మర్నాడు ఉదయం దానవులందరికీ ఎన్నో ఉత్పాతాలు, దుఃశకునాలు కనిపించాయి. ఏమిటీ విపరీతం? అసలేం జరుగుతోంది? ఎందుకిన్ని మార్పులు వస్తున్నాయి? అని పరస్పరం విమర్శించుకోసాగారు.

సూర్యోదయమైన తరువాత మహాతేజస్సుతో వెలిగిపోతున్న మయుడు రాజసభలోకి ప్రవేశించాడు. ఆ సభలో విద్యున్మాలి, తారకాక్షుడు కూడా కూర్చొనివున్నారు. అందరూ కొలువుదీరిన తరువాత మయుడు వారందరినీ ఉద్దేశించి "సభాసదులారా! ప్రియమైన దైత్యప్రముఖులారా! ప్రజలారా! నిన్న రాత్రి నాకు దుఃస్వవ్నం వచ్చింది. మహాబలం, క్రోధం, ఉగ్రమైన ముఖం కలిగిన ముగ్గురు పురుషులు, ముగ్గురు స్త్రీలు మన దుర్గంలోకి ప్రవేశించారు. వారు ముగ్గురూ రోషంతో ఆవేశంతో ఎన్నో రకాల శరీరాలు ధరించి ఇక్కడున్న వారి ఇళ్ళలో ప్రవేశించారు. దానితో త్రిపుర దుర్గమంతా అంధకారమై పోయింది. ఎన్నో దుశ్శకునాలు నాకు కనిపించాయి. అంతలో నాలుగు పాదాలతో స్త్రీలాగా పోలికలున్న వాడొకడు నన్ను హఠాత్తుగా మేలుకొల్పాడు. ఇదీ నాకు వచ్చిన దుఃస్వప్నం.

ప్రజలారా! ఈ దుఃస్వప్నం మనకి రాబోయే అరిష్టాల్ని సూచిస్తోంది. భవిష్యత్తులో మనకి ఇంకెన్ని కష్టాలు రాబోతున్నాయో! మీరంతా నేటి నుంచి నేను చెప్పినట్టు దయచేసి వినండి. మీరంతా మీ మనసుల్లో కోపాన్ని ఈర్ష్యని, కామాన్ని విడిచిపెట్టండి. సత్యం, దమం, శమం అనే సద్గుణాల్ని ఆశ్రయించండి. నిత్యం ఆ పరమేశ్వరుణ్ణి అర్చించండి. చూస్తుంటే మనందరికి ఇష్టదైవమైన ఆ త్రిలోచనుడు మనమీద అలిగాడేమో అనిపిస్తోంది. ఏదేమైనా మీరందరూ పరస్పరం కలహించుకోకుండా శాంతిగా వుండండి” అని ప్రకటించాడు.

మహారాజు మయుడు హితబోధచేసినప్పటికీ అరిష్టం దాపురించినందు వల్ల అతడి మాటలు వారి తలకెక్కలేదు. పైగా ఆ మాటలు విన్న వెంటనే ఆగ్రహంతో ఒకరినొకరు చూసుకుంటూ, దూషించుకోవటం ప్రారంభించారు. అంతే ఆ నాటి నుంచి కలి విజృంభణ త్రిపురాలలో ప్రారంభమయ్యింది. నిత్యం దానవులందరూ నగరంలో వున్న బ్రాహ్మణులని ద్వేషించటం, 
హింసించటం ప్రారంభించారు. పరస్పరం కలహించుకుంటూ గురువుల్ని పెద్దల్ని నిందించటం ప్రారంభించారు. యజ్ఞయాగాలకి విఘాతాలు కల్పించటం, మునుల్ని ఋషుల్ని హింసించటం, దేవాలయాల్ని ధ్వంసం చేయటం లాంటి ఆకృత్యాల్ని చేయసాగారు.

శివుణ్ణి ప్రార్థించిన దేవతలు: అప్పటిదాకా ఎంతో శీలవంతులుగా నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్న త్రిపురాలలోని దానవులు దురాత్ములై బైటికివచ్చి అన్నిలోకాల్నీ నాశనం చేయటం ప్రారంభించారు. వాటి ధాటికి ముల్లోకాలలోని వారు చింతాక్రాంతులయ్యారు. వెంటనే ఆదిత్యులు, అష్టవసువులు, సిద్దులు, సాధ్యులు, పితృదేవతలు, మరుద్గణాలు భయపడిపోయి పరుగున వెళ్ళీ బ్రహ్మదేవుణ్ణి శరణువేడుకున్నారు.

బ్రహ్మదేవుడు దేవతల్ని ఓదార్చి! దేవతలారా! పూర్వం నేను మయుడికి వరాన్నిచ్చాను. దాని ప్రభావం ఎవరూ తప్పించలేరు. అయితే వాడు కోరిన చేటుకాలం ఇప్పుడే సమీపించింది. వాడు నన్ను "త్రిపురాలన్నీ ఒకే బాణంతో భేదించబడాలి. అప్పుడే నా వినాశనం జరగాలి" అని కోరుకున్నాడు. మనలో ఒక్క పరమేశ్వరుడే ఆ త్రిపురాలన్నీ ఒక్క బాణంతో పడగొట్టగల సమర్షుడుగా నాకు కనిపిస్తున్నాడు. కనుక మన మందరంపోయి ఆయన్నే వేడుకుందాం" అన్నాడు. అందరూ అంగీకరించి బ్రహ్మని వెంటబెట్టుకుని పరమేశ్వరుడి దగ్గరకి వెళ్ళారు. స్వామిని దర్శించి ముందుగా ఆయన్ని భక్తితో ఇలా స్తుతించారు.


దేవతాకృత శివస్తుతి

॥ ఓం నమోభవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ ॥

పశూనాం పతయే నిత్యముగ్రాయచకపర్దినే
 ।
మహాదేవాయ భీమాయ త్య్రంబకాయ నిశాంపతే ॥

ఈశ్వరాయ భగమ్నాయ నమస్త్వన్ధక ఘాతినే
 ।
నీలగ్రీవాయ భీమాయ వేదసే వేదసాంపతే ॥

కుమార శత్రువిఘ్నాయ కుమారజననాయచ ।
విలోహితాయ ధూమ్రాయ ధరాయ క్రధనాయచ ॥

నిత్యం నీల శిఖండాయ శూలినే దివ్యశాయినే
 ।
ఉరగాయ సూక్షేత్రాయ హిరణ్యవసురేతసే
 ॥

అంచిత్యాయాంబికా భర్త్రే సర్వదేవస్తు తాయచ ।
వృషధ్వజాయ చండాయ జటినే బ్రహ్మచారిణే
 ॥

తప్యమానాయ నలినే బ్రహ్మణ్యాయా జతాయ చ ।
విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమాధృత్య తిష్ఠతే
 ॥

నమో
స్తు దివ్య సేవ్యాయ ప్రభవే సర్వ సంపదాం ।
అభిగమ్యాయ కామ్యాయ సవ్యాపారాయ సర్వదా ॥

 భక్తానుకంపితే తుభ్యం దిశతేజన్మనో గతమ్‌ ॥
(అధ్యా-130, శ్లో-22-29)

ఇది మాతృకా సంఖ్యలో అనగా 5 నామాలతో దేవతలు చేసిన శివస్తుతి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది. ఇందులోని నామాలు 51 ఉంటాయి

1.భక్తులకి శుభకరుడు 

2.పాపులకి హింసకరుడు 
3.బాధలు తొలగించేవాడు 
4.వరాలు ప్రసాదించేవాడు 
5.జీవులకి అధిపతి 
6. భయంకరుడు
7.జటాజూటధారి 
8.మహాదేవుడు 
9. దుష్టభయంకరుడు 
10. త్రినేత్రుడు
11.ప్రజలకి అధిపతి
12. ఈశ్వరుడు 
13.భగుడు 
14.ఆదిత్యుని కొట్టినవాడు
15.అంధకాసురుణ్ణి చంపినవాడు 
16. నీలకంఠుడు
17. సూర్యాదులతో కూడా పనుల్ని చేయించేవాడు 
18. లోకకర్తలకి అధిపతి 
19.కుమారస్వామి శత్రువుల్ని నాశనం చేసేవాడు 
20.కుమార స్వామికి తండ్రి 
21. ఎర్రని జటాజూటంకల వాడు 
22.ధూమ్రవర్ణుడు 
28. లోకాల్ని ధరించేవాడు 
24. పాపుల్ని నరికేవాడు
25.నీలకేశాలు కలవాడు 
26.శూలధారి 
27 దివ్యశయనుడు 
28. సర్పభూషణుడు
29.మంచి నేత్రాలు కలిగినవాడు 
30. హిరణ్మయుడు 
31. వసువురేతస్సుగా కలవాడు 
32. అచింత్యుడు 
38. అంబికాదేవికి భర్త 
34.అందరుదేవతల చేతా స్తుతించబడేవాడు 
35. వృషభధ్వజుడు 
36. చండస్వరూపుడు 
37. జటాధారి
38. బ్రహ్మచారి 
39. నీటిలో వుండి తపస్సు చేసేవాడు 
40. బ్రహ్మవేత్త 
41. అజితుడు
42. విశ్వస్వరూపుడు 
43. విశ్వాన్ని సృష్టించినవాడు 
44. విశ్వమంతా ఆవరించి ఉండేవాడు. 
45. దివ్యపురుషుల సేవలందుకునేవాడు. 
46. సకల సంపదలకి ప్రభువు 
47. ఆశ్రయించతగినవాడు 
48.కోరికలు కోరదగినవాడు 
49. ఎప్పుడూ పనిలో మునిగి ఉండేవాడు. 
50. భక్తుల్ని అనుగ్రహించేవాడు 
51.జన్మకి తగిన ఉత్తమగతుల్ని ప్రసాదించేవాడు.

ఈ విధంగా పరమేశ్వరుడికి ప్రీతికరమైన నామాలతో ఆయన్ని స్తుతించారు. తరువాత వారంతా త్రిపురాలలోని దైత్యుల ద్వారా తాముపడ్డ కష్టాలన్నిటినీ వరుసగా ఏకరువు పెట్టారు. వారి బాధల్ని కష్టాల్ని విన్న శంకరుడు వారితో ఇలా అన్నాడు.

శివరధం: దేవతలారా! మీరు ఆ దానవుల వల్ల భయపడాల్సిన అవసరం లేదు. నేను త్రిపురాలనీ దగ్ధం చేసి మీ కష్టాల్ని పోగొడతాను. అయితే మీరు నేను చెప్పినట్టు ఇలా చేయండి. ముందుగా నాకు యుధ్ధం చేయటానికి తగిన రథాన్ని సిద్ధం చేయండి అన్నాడు. వెంటనే దేవతలు దివ్యమైన రథాన్ని సిద్ధంచేసారు. ఆరథం ఎలా వుందంటే భూమి శివుడు అధిరోహించే రథం. శివుడి పక్కన వుండే అనుచరులిద్దరూ దాని కాడికి కొనలు. మేరు పర్వతశిఖరం ఆయన కూర్చుండే స్థానం. మందర పర్వతం ఆ రథానికి ఇరుసు. సూర్య చంద్రులిద్దరూ రథచక్రాలు. శుక్షకృష్ణపక్షాలు రెండూ ఆ రథానికి నేమి ద్వయం. నాగులలో శ్రేష్థులైన తక్షకుడు, కంబళీశ్వతరుడు అనే సర్పాలని తాళ్ళుగా చేసి, శుక్ర, బృహస్పతి, బుధ, అంగారక, శనైశ్చరుల్ని రథంలోని వివిధ భాగాలుగా ఏర్పరిచి, ఆ భాగాల్ని ఆ తాళ్ళతో బిగించి కట్టారు. ఆకాశం ఆ దివ్యరథానికి చెక్కతో నిర్మించిన రక్షణపంజరం. మరో ముగ్గురు నాగులు (సర్పాలు)ఆ రథానికి బంగారు త్రివేణువు(రథానికి ముందుభాగంలో త్రిభుజాకారంలో ఏర్పరిచే అమరిక), గంగ, సింధు, చంద్రభాగా, ఐరావతి, వితస్త, విపాశ, గండకి, సరస్వతీ, దేవికా, సీతా, సరయూ అనే నదులు శివుడికి అమ్ములపొదులు. ధార్తరాష్ట్ర కర్కోటక, వాసుకి, ఐరావత అనే జాతి సర్పాలు తూణీరంలో వున్న శరాలు. సురస, సరమ, కద్రువ, వినత, శుచి, త్వష్ట, బుభుక్షా, ఉగ్రవేదన, చిత్రసంభవ, బ్రహ్మహత్య, గోహత్య, అశ్వహత్య అనే భయానక తత్త్వాలన్నీ గదలుగా శక్త్యాయుధాలుగా మారి ఆ రథం మీద నిలిచాయి.

ఆ దివ్యరథానికి నాలుగు వేదాలు నాలుగు గుర్రాలయిన్నాయి. తక్షకుడు కర్కోటకుడు, ధనుంజయుడు అనే సర్పాలు ఆ గుర్రాలకి పగ్గాలుగా మారాయి. ఆరు ఋతువులతో చిత్రించిన సంవత్సరం ధనుస్సుగా అయ్యింది. అంబికా దేవి ఆ బాణాలకి మొనగామారింది. కాళరాత్రి ఆ విల్లుకి నారి అయ్యింది. విష్ణువు, సోముడు, అగ్ని కలిసి ఒక్కటై ప్రధాన బాణంగా రూపొందారు.

ఆ విధంగా దేవతలందరూ కలిసి తమ దివ్య ప్రభావంతో గొప్పరథాన్ని నిర్మించి పరమేశ్వరుడికి సమర్పించారు. సర్వాలంకార శోభితంగా కనిపిస్తున్న ఆ రథాన్ని చూసి శివుడు ఎంతో ఆనందించాడు. దేవతలతో "నేను త్రిపురాలతో యుద్ధం చేయటానికి సిద్ధంగా వున్నాను. సరే? ఈ రథాన్ని తోలే సారధి ఎవరు?" అని ప్రశ్నించాడు. అది విని దేవతలంతా ముఖాముఖాలు చూసుకున్నారు. సాక్షాత్తు శివుడి రథాన్ని తోలగలిగే సమర్థుడు ఎవ్వరు? అని ఆలోచించసాగారు.

అంతలో బ్రహ్మదేవుడు ఉత్సాహంగా లేచి శివరధానికి నేను సారధిగా వుంటాను అని ముందుకి వచ్చాడు. ఆ మాటవిని దేవతలంతా ఆనందంతో హర్షధ్వానాలు చేసారు. వెంటనే రథాన్ని ఎక్కి పగ్గాలు పట్టుకున్నాడు బ్రహ్మ. అది చూసి ఆనందించిన శివుడు తాను కూడా విజయదరహాసం చేస్తూ రథాన్ని అధిరోహించాడు. బ్రహ్మదేవుడు ఒక్కసారిగా రథాన్ని ముందుకి దూకించాడు. అంటే రథం పరుగులు తీయటం ప్రారంభించింది. శివుడి రధం వెంట మంగళనాదాలు, సింహనాదాలు చేస్తూ సకల ప్రమథగణాలు, సకలదేవతాగణాలు కోలాహలంగా బయలుదేరాయి. అందరు దేవతా గణాలతో వారివారి వాహనాలతో, ఆకాశం నిండి పోయింది.

నారదుడి హిత బోధ: శివరథం మహోత్సాహంతో సకలసైన్య పరివేష్టితంగా దూసుకువస్తున్న సమయంలో, నారదమహర్షి హఠాత్తుగా త్రిపురాలలోకి ప్రవేశించాడు. ఎన్నో దుశ్శకునాలతో చింతాక్రాంతులైవున్న మయుడి సభలో నారదమహర్షి ప్రత్యక్షంకాగానే వారంతా వినయంగా లేచి ఆయనకి స్వాగతం పలికారు. వారి సత్కారాలు స్వీకరించిన నారదుడు "ఓ మయాసురా! దుర్మార్గులతో సహవాసం చేసిన వాడికి కూడా దుష్టగుణాలు అంటుకుంటాయి. నీవు సన్మార్గుడివే అయినప్పటికీ ఈ మహర్షులందరి సహవాసంలో చాలా చెడ్డ పనులు చేస్తున్నావు. అవి నీకు తెలియటం లేదు. నీవు నీ దానవులు చేసిన దోషాలకి పరిహారంగా శివుడు మహారథాన్ని అధిరోహించి మిమ్మల్ని సంహరించటానికి వస్తున్నాడు. నీవు ఆయన్ని శరణు వేడుకో లేదంటే నీవు నీ పురాలు, నీ వారందరూ మరణిస్తారు" అని హెచ్చరించి వెళ్ళిపోయాడు.

నారదుడు వెళ్ళిపోయిన మయుడు తనవారందరితో "అసురవీరులారా! మీరు భయపడకండి. మనం యుద్ధమే చేద్దాం. విజయమో వీర స్వర్గమో! మీరంతా వెంటనే ఆయుధాలు ధరించి మీమీ స్థానాల్లో నిలవండి. దేవతల్ని మీ బల పరాక్రమాలతో తరిమి కొట్టండి" అని వారందరినీ ఉత్సాహపరిచి తాను రాజమందిరంలోకి ప్రవేశించాడు. లోపల పూజా మందిరంలోకి వెళ్ళీ త్రిలోచనుడైన శంకరుణ్ణి హృదయపూర్వకంగా శరణువేడుకున్నాడు. శివుడు అతడి ప్రార్ధన మన్నించి ధ్యానంలో అభయాన్ని ప్రసాదించగా దాన్ని గ్రహించిన మయుడు నిశ్చింతగా నిర్భయంగా మనసులో శివుణ్ణి స్తుతిస్తూవున్నాడు. 

దేవదానవ సంగ్రామం: దివ్య రథాన్ని అథిరోహించి బయలుదేరిన శివుడు సకలసైన్యసమేతంగా త్రిపురాలకి సమీపానికి వచ్చాడు. ఆయనకి అల్లంతదూరంలో త్రిపురదుర్గం కనిపించింది. వెంటనే రథాన్ని నిలిపి ఇంద్రుణ్ణి పిలిచి, "ఇంద్రా! అదిగో త్రిపురదుర్గం ఎంతో ఉన్నతంగా, ధ్వజాలతో
అసురులకోలాహంతో కనిపిస్తోంది. నీవు వెంటనే నీ ప్రమథగణాలని నీ దేవతాగణాలని తీసుకుని ఆ దుర్గాల మీదకి దండెత్తు. నేనిక్కడ సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటాను. పుష్యయోగకాలం వస్తే గానీ ఆ మూడుపురాలు ఏకంకావు. ఆ సమయం రాగానే నేనా మూడు పురాల్నీ నా బాణంతో ఛేదిస్తాను. నీవు వెంటనే బయలుదేరు” అని ఆజ్ఞాపించాడు.

శివాజ్ఞవిన్న ఇంద్రుడు తన సైన్యాన్ని తీసుకుని సింహనాదాలు చేస్తూ త్రిపురదుర్గం మీదకి దండెత్తారు. దానవులు, దేవతల మధ్య భయంకరమైన పోరు ప్రారంభమయ్యింది. ఏనుగులతో, గుర్రాలతో, రధాలతో పరస్పరం అత్యంతభీకరంగా యుద్ధం చేయసాగారు. తారకాక్షుడు, విద్యున్మాలి ఎన్నో మాయోపాయాలు ప్రయోగించి దేవసైన్యాల్ని చికాకు పరిచారు.

తారకాక్షవధ: మయుడి సన్నిహితుడైన తారకాక్షుడు మహాబలవంతుడు. తనపురం మీదకి దండెత్తిన దేవతాసైన్యాన్ని ఛిన్నా భిన్నం చేశాడు. సాక్షాత్తు విష్ణుమూర్తే వృషభరూపంలో తనని చంపటానికి రాగా ఆయన్ని కూడా తరిమివేశాడు. తన బలగర్వంతో సరాసరి శంకరుడి రథం దగ్గరికి వచ్చి రథసారధిగా వున్న బ్రహ్మదేవుణ్జి తన గదతో మోదాడు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడే వున్న నందీశ్వరుడికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. తారకాక్షుణ్ణి ఎదుర్కొన్నాడు. ముందుగా తారకాక్షుడిదే పై చేయి అయ్యింది. తన చేతిలోని గొడ్డలితో నందీశ్వరుణ్ణి చెక్కేశాడు. నందీశ్వరుడు ఆ గాయాల్ని తట్టుకుని తన దివ్య ఖడ్గంతో శరభమృగంలా దూకి ఒక్కసారిగా తారకాక్షుణ్ణి అడ్డంగా నరికేశాడు. ఆవిధంగా మహాబలుడైన తారకాక్షుడు నందిచేతిలో మరణించటంతో దేవతలంతా జయజయ ధ్వానాలు చేసారు.

విద్యున్మాలివధ: తారకాక్షుడి మరణంతో యుద్ధంలో ప్రధాన పదవిని విద్యున్మాలి చేపట్టాడు. తన దానవసైన్యాన్ని ఉత్సాహపరుస్తూ శత్రువులైన దేవసైన్యాన్ని చీల్చి చెండాడటం ప్రారంభించాడు. గదలు, ముసలాలు, తోమరాలు, ప్రాసాలు, గుర్రాలు, వజ్రాలు,శూలాలు, ఋషులు(చిన్న ఖడ్గాలు),
పెద్ద పెద్ద కొండరాళ్ళు ఆ యుద్ధంలో దేవతలతో దానవులతో ప్రయోగించబడి నిప్పుకణికల్లా పొగలుకక్కుతూ మహారాసులుగా సముద్రంలో పడుతున్నాయి. విద్యున్మాలి యుద్ధరంగం నుంచి బైటికి వచ్చి సరాసరి "నంది" దగ్గరకి వెళ్ళాడు. నందితో "ఓయీ! నందీ! నీవు మా తారకాక్షుణ్జి వధించానన్న గర్వంతో వున్నట్టున్నావు. నీ ఆటలు నా దగ్గర సాగవు. నిన్ను అంతం చేయటానికే
వచ్చాను. చూడు నా ప్రతాపం" అని ఒక్కసారిగా నంది మీదకి దాడిచేశాడు.

విద్యున్మాలి ఏనుగు తన తొండంతో మేఘాన్ని చీల్చినట్టు ఒక పదునైన బాణంతో నందిని గుచ్చాడు. ఆ బాణం తాకిడికి నంది శరీరం నుంచి రక్తం ధారలుగా కారింది. క్షణంలో తమాయించుకున్న నంది దెబ్బతిన్న ఏనుగులాగా ఒక మహావృక్షాన్ని పెకలించి విద్యున్మాలిపై విసిరాడు. ఆ వృక్షం విద్యున్మాలి మీదకి రాబోయేంతలోనే అతడు ఒక బాణంతో ఆ వృక్షాన్ని ఛిన్నాభిన్నం చేసాడు. వెంటనే నంది తన దివ్యఖడ్గాన్ని తీసుకుని అత్యంత వేగంగా విద్యున్మాలి వైపు పరుగెత్తాడు. తనవైపు దూసుకొస్తున్న నందిమీదకి వందలాది శస్త్రాల్ని ప్రయోగించాడు విద్యున్మాలి. అయినా సరే ఆ బాణాల్ని తప్పించుకున్ననంది విద్యున్మాలి ఎక్కిన రధాన్నిపైకెత్తి గిరగిరా తిప్పి భూమిమీదకి విసిరికొట్టాడు. మహామాయావి అయిన విద్యున్నాలి రథంలో నుంచి తప్పించుకుని అక్కడే నిల్చున్న నందీశ్వరుణ్ణి తన శక్త్యాయుధంతో గాయపరిచాడు. ఇక ఆగ్రహం
తట్టుకోలేని నంది తనని గాయపరిచిన శాక్త్యాయుధాన్నే తీసి విద్యున్మాలి గుండెల్లోకి బలంగా దించాడు. ఆ దెబ్బకి హాహాకారాలు చేస్తూ విద్యున్మాలి నేలకొరిగాడు.

విద్యున్మాలి మరణంతో దేవతల్లో ఆనందం వెల్లివిరిసింది. అందరూ నందీశ్వరుడికి జయజయ ధ్వానాలు పలికారు. శంకరుడు కూడా తారకాక్షుణ్ణి, విద్యున్మాలిని వధించిన నందీశ్వరుడి పరాక్రమాన్ని ప్రశంసించాడు.

త్రిపుర విధ్వంసం: దేవ దానవుల మధ్య పోరు భయంకరంగా కొనసాగుతూనే వుంది. దేవతల చేతిలో తనకి అత్యంత ఆప్తులైన తారకాక్షుడు, విద్యున్నాలి ఘోరంగా సంహరించబడటంతో మయుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనే స్వయంగా యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. అతన్ని ఇంద్రుడు, కుబేరుడు, నంది, షణ్ముఖుడు తదితర ప్రమథగణాలు మూకుమ్మడిగా ఎదుర్కొన్నారు.
సర్పాల్ని గరుత్మంతుడు చీల్చినట్టు మహాబలసంపన్నుడైన మయుడు తనని చుట్టు ముట్టిన వారందరినీ దివ్యశస్త్రాలతో చీల్చిచెండాడాడు.

అంతలో పుష్యయోగం రానే వచ్చింది. ఆయోగ ప్రభావం కారణంగా త్రిపురాలు మూడూ ఒక్నటిగా అయ్యాయి. ఆ విషయాన్ని రధం మీద వున్న త్రిలోచనుడు గమనించాడు. దానికోసమే ఆయన ఎదురుచూస్తున్నాడు. సరిగ్గా ఆ మూడుపురాలు ఒకేచోటికి వచ్చి చేరే సమయంలో తన చేతిలో వున్న దివ్యశరాన్ని ఆ పురాల మీదకి ప్రయోగించాడు. పరమేశ్వరుడు ప్రయోగించిన ఆ బాణం
ఆకాశంలో రెల్లు పూవులాగా తరువాత బంగారంలాగా దివ్యకాంతితో ప్రకాశిస్తూ దుసుకుపోతుంది. అదిచూసి శివుడు ఒక్కసారిగా "అయ్యో! నేనెంతపని చేసాను. అని దుఃఖించటం ప్రారంభించాడు" అక్కడే వున్న నందీశ్వరుడు ఆవిషయాన్ని గమనించి ప్రభూ! ఎందుకు మీరిలా దుఃఖిస్తున్నారు అని ఆందోళనగా అడిగాడు. "నందీ నేను ప్రయోగించిన బాణంతో త్రిపురాలతో పాటు అందులో వున్ననా ప్రియభక్తుడు మయుడు కూడా నశిస్తాడు" అందుకే బాధపడుతున్నానని అన్నాడు.

శివుడి మాటలువిన్న నంది "ప్రభూ! మీరేమీ చింతించకండి ఆ మయుణ్జి నేను తప్పిస్తాను". అని పలికి వాయువేగంతో శివుడు ప్రయోగించిన బాణం కన్నా ముందుగా త్రిపురాల్లో వున్న మయుడి దగ్గరకి వెళ్ళాడు. అతడితో "వెంటనే నీవు వుంటున్న ఈ ఇంటితో సహా త్రిపురాల్ని విడిచి వేరేచోటకి వెళ్ళి ప్రాణాలు కాపాడుకో. ఇది శివాజ్ఞ" అని చెప్పి వేగంగా తిరిగి వచ్చాడు. మయుడు తక్షణమే తన దివ్య శక్తితో ఇంటితో సహా త్రిపురాల్ని విడిచి వెళ్ళిపోయాడు. వెంటనే మహేశ్వరుడు ప్రయోగించిన బాణం నారాయణ-అగ్ని-చంద్ర అనే మూడు బాణాలుగా మారి వరుసగా మూడు పురాలనీ ఏకకాలంలో దగ్ధం చేశాయి. సర్వాంగ సుందరంగా మహాసౌధాలతో నిర్మించబడ్డ ఆపురాలు మూడూ భయంకరమైన శివాస్త్రాల ధాటికి తట్టుకోలేక ఆ అగ్ని జ్వాలల్లో ఆహుతైపోయాయి. ఆ విధంగా త్రిపురాలు దగ్గమౌతున్న వేడికి భూలోకమే కాకుండా పాతాళలోకం కూడా వేడెక్కిపోయింది.

తను ఎంతో కష్టపడి తపస్సుచేసి వర ప్రభావంతో నిర్మించుకున్న త్రిపురాలు మూడూ ఒకే సారి దగ్గమైపోవటం చూసి మయుడు ఎంతో దుఃఖించాడు. అయితే తనకి మహాభక్తుడు సహజంగానే యోగ్యుడు అయిన మయుడికి, వేరొకచోట నూతన గృహాన్ని నిర్మించుకుని సుఖంగా కాలం  గడుపమని శివుడు వరమిచ్చాడు. ఆ వర ప్రభావంలో మయుడు ఒక శిలాగృహాన్ని నిర్మించుకుని నిరంతరం భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ కాలంగడపసాగాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే అతన్ని అనుగ్రహించటంతో ఆనాటి నుంచి దేవేంద్రుడు కూడా మయుడితో వైరం మాని స్నేహాన్ని ప్రకటించాడు.

త్రిపురాలని దగ్ధంచేసి త్రిపురవైరిగా త్రిపురాంతకుడిగా ప్రసిద్ధిచెందిన శివుడి వీరచరిత్రని పఠించినా, విన్నా బోధించినా, వృషభధ్వజుడైన శివుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ త్రిపురాసురోపాఖ్యానాన్ని పితృశ్రాద్ధం, తర్పణాలు విడిచేసమయంలో వినిపిస్తే అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. సకలశుభాల్ని కలిగించే ఈ దివ్యచరిత్ర పారాయణ చేస్తే రుద్రలోకప్రాప్తి కలుగుతుంది.

మంత్రద్రష్టలైన ఋషులు

No comments:

Post a Comment