దేవ వృత్రాసుర సంగ్రామము
వృత్రాసురుడు రాక్షసవంశాన పావనుడు. లోకాలను కబళించి మింగివేయడమే తన మార్గంగా ఎన్నుకున్నవాడు; శత్రువును చంపడంగాని, జాలితో వదలివేయటంగాని మాటప్రకారం చేసి చూపేవాడు. దేవతలు అనే పాములను మింగడానికి తగిన కొండగుహవంటి నోరు గలవాడు - అంటే మింగేసేవాడు. శత్రువినాశకరుడు. అటువంటి వృత్రుడు తన విరోధిరాకను చూచి యుగాంతాన యమునివలె రాక్షసనాయకులు అనేకులు తనను వెన్నంటిరాగా, మదపుటేనుగుల మధ్య నడిచి వస్తున్న కొండవలె వృత్రుడు కోపంతో, గర్వంతో శత్రువును ఎదుర్కొన్నాడు.
రాజా! రుద్రుడు కోపంతో వడివడిగా యముని పైకి వెళ్ళినట్లు, ఆ వృత్రుడు పెద్ద అరుపుతో తూర్పు దిక్కు పిక్కటిల్లేలా ఎదురు నడిచాడు.
ఇంద్రసేనలలో రుద్రులు, మరుత్తులువంటి ఆరు దేవజాతుల గుంపులు, అగ్ని యముడువంటి దిక్పాలకులు, సిద్దులు, సాధ్యులవంటి మహాయోధులు; వృత్రుసేనలలో, నముచి, శంబరుడు, అనర్వుడు వంటి ఇరవై తొమ్మిదిమంది మహాయోధులు, దైతేయులు, యక్షులు, రాక్షసులు వంటి లెక్కలేనంతమంది యోధులు పరస్పరం తలపడి పోరాడారు. అప్పుడు
దేవదానవులకు గొప్ప యుద్ధం జరిగింది. వారు రోకళ్ళు, గదలు, కత్తులు, ఇనుపగుళ్ళు, శూలాలు, చక్రాలతో ఒకరినొకరు మోదుకొంటూ పెద్దగా బొబ్బలు పెట్టి, ఆ శబ్దాలు ఆకాశాన్ని నింపివేయగా తమను తాము పరస్పరం ఆయుధాలతో ముంచెత్తుకొన్నారు.
దేవాసురులు పరస్పరం మించిపోతూ బాణాఘాతాలతో ఆకాశాన్ని ముంచెత్తారు. అప్పుడు ఆ వినువీధిలోని బాణపరంపర ప్రళయకాలపు గొప్ప ఉల్కాపాతాన్ని(తోకచుక్కలు భూమిపై పడటాన్ని) గుర్తుకు తెస్తూ అందంగా కనిపించింది.
దేవతలు కంటికి కనిపించకుండా తమ బాణపరంపరతో ఆకాశస్థలమంతటినీ ఆక్రమించి సంధ్యాసమయాన్ని కల్పించారు. రాక్షసవీరులు దానికి బదులుగా తమ బాణాలవరుసలతో వారి బాణాలను రూపుమాపి, ఆ సాయం సమయాన్ని విశాలమైన చీకటిగా మార్చి వేశారు.
యుద్ధమదంతో కన్నుగాననివారైన దేవదానవయోధులు తమ తమ కాళ్ళు భూమిని ఒరిపిడి చేసినందువలన పైకెగసిన దుమ్మురేణువులు యుద్ధభూమినంతటినీ చీకటిగా మార్చివేయగా, మనస్సులలో క్రోధమనే నిప్పుల సెగ లెగయగా, తమ తమ కళ్ళు ఆ చీకట్లలో చికాకుపడగా, తెగని పట్టుదలతో పోరు సాగించారు.
యుద్ధభూమిలో సేనలు తమ దేహాలనుండి ఎక్కువగాకారే నెత్తురుతో కూడిన దెబ్బలతో చూపరులకు తమ తమ తనువులలో ఎగసిపడే కోపపు నిప్పుల రవ్వలు ఆ రూపంగా పైకి కనిపిస్తున్నాయా అన్నట్లు ఉన్నారు.
రాక్షసులు దేవతలు యుద్ధం చేస్తున్న ఆ సంగరరంగంలో పెద్దగా ధ్వనించే వీరుల ధనుష్ఠంకారాలు వారి సింహనాదాలను మించుతున్నాయి. అశ్వరాజాల భీషణ హేషారావాలు ఏనుగుల ఘీంకారాలను ఆక్రమిస్తున్నాయి. విశృంఖలంగా మోగుతున్న శంఖధ్వానాలు రథచక్రధ్వనులను కిందు పరుస్తున్నాయి. సంకులంగా చెలరేగిన దుందుభి నినాదాలు వీరుల వికటాట్టహాసాలను మరుగు పరుస్తున్నాయి. శస్త్రాస్త్రాల పరస్పర ఘర్షణవల్ల ఉద్భవించిన అగ్నికణాల కాంతులు వారి కిరీటాలలోని రత్నాల కాంతులను తిరస్కరిస్తున్నాయి.
ప్రళయకాలాన ఎత్తెన అలలతో, భయంకర ధ్వనులతో ఎగసిపడే మహాసముద్రాలవలె, యుగాంతాన ఝంఝా అనే గాలులతో విజ్బంభిస్తూ, నేలను కుదిపివేసే భీకర మేఘాలవలె, రెండుసేనలు కలియబడిన సమయంలో యుగాంతాన యముడు భూమిపై గల సకల ప్రాణిసమూహాన్ని కబళింపజూసే విధంగా సేనలు రెండూ పరస్పర సంహారానికి సమకట్టాయి. పదాతులు, ఆశ్వికులు, గజయోధులు, రథయోధులు - అనే నాల్గు విధాల సేనలు (రథ గజ తురగ పదాతులు) పరస్పరం భీకరరీతిలో బాణాలతో, గదలతో, కత్తులతో, ఈటెలతో, గండ్రగొళ్ళతో, రోకళ్ళతో, ఇనుప గుదియలతో, చక్రాలతో, శూలాలతో, పరస్పరం నరుకుకొంటూ, మోదుకొంటూ కాళ్ళు, చేతులు, మోకాళ్ళు, తొడలు, నడుములు, పక్కటెముకలు పరస్పరం ఖండించుకొంటూ, మెడలు కోసి, ముక్కులు త్రుంచి, ఒకరినొకరు క్రూరకర్మలతో హింసించుకొంటూ, ఎదిరిసేనల రథాలను, రథికులను, గొడుగులను, ధనుస్సులను విరిచివేస్తూ, ధనుస్సుల అల్లెత్రాళ్ళను తెంచుకొంటూ, ఎదిరిసేనల జంతుజాలాలను తునుమాడుతూ, వైరులను తుండెములుగా ఖండములుగా కకావికలు చేస్తూ ఎదుటివారి ఛత్రచామరాలను తునాతునకలు చేస్తూ, రణరంగాన్ని రక్తమాంసాలతో, కొవ్వులతో బురదమయంగా మార్చివేశారు. ఆ సమయంలో
దేవదానవుల సైన్యాలు రెండూ సమానమైన పరాక్రమం కలవి. సమానమైన యుద్ధనైపుణ్యం కలవి. సమానమైన శస్త్రాస్త్ర సముదాయం కలవి. అందువల్ల జయాపజయాలుకూడా సరిసమానంగానే ఉన్నాయి. దేవేంద్రుని సేనానాయకులతో తలపడి వృత్రాసురుని అండదండలు గల రాక్షససేనానాయకులు ఘోరాతి ఘోరంగా పోరాడసాగారు.
అక్కడ నెత్తురు ఏరులై పారింది. ఆ ఏరులలో భూతాలు ఉత్సాహంతో దుమికి మెడల వరకు మునిగి తెగ సంబరపడినాయి. శాకినులు నృత్యాలు చేస్తూ, ఎర్రని మాంసాలను మత్తుగా తింటూ సంతోషించాయి. డాకినులు నాట్యం చేస్తున్నట్లు పేగులతో పరస్పరం సరసాలాడుతూ, మెత్తని మెదళ్ళను ఆరగిస్తూ, చూపరులకు భీతిగొల్పుతుండగా ఆ యుద్ధం సాగింది.
ఈ విధంగా నర్మదానదీతీరంలో కృతయుగంలో ప్రారంభమైన దేవదానవుల పోరాటం త్రేతాయుగం ప్రేవేశించేవరకు భయంకరంగా సాగుతూనే ఉంది. వృత్రాసురుని బాహుబలసంపదతో పెంపొందిన రక్కసి గుంపులు తెంపుచేసి విజ్బంభీంచి దేవతలమీద పెద్ద పెద్ద వృక్షాలనూ, రాళ్ళనూ, కొండశిఖరాలనూ కురిపించగా
రాక్షసులు కొండలూ బండలూ చెట్లు తమమీద వర్షిస్తూ ఉంటే, దేవతలు కఠోరమైన బాణాలను గుంపులు గుంపులుగా ప్రయోగించి వాటిని ముక్కలు ముక్కలుగా ఖండించారు. ఈ విధంగా తమ బలప్రయోగాలన్నీ భగ్నం కాగా దానవసేనాపతులు మదోద్రేకంతో మరింత చెలరేగారు.
సురసైన్యాల మీద అసురవీరులు ఎడతెరిపి లేకుండా శరపరంపరలు కురిపించారు. ఐతే సజ్జనుల విషయంలో దుర్జనుల దూషణలు లాగా రాక్షసుల బాణాలు దేవతలను స్పృశింపలేక వృథా అయిపోయాయి.
రక్కసులు శక్తు లుడిగి, సిగ్గుమాలి, దేవతల శస్త్రాస్త్రాలకు తాళలేక, వెనుకటి పంతాలు మాని దేవతలు అరుస్తూ ఉండగా ఎగిరెగిరి పారిపోయారు.
కొండలవంటి పెద్ద దేహాలు గల రక్కసులు శక్తి నశించి, తమ ధనుస్సులు మొదలయిన ఆయుధాలనన్నింటినీ యుద్ధరంగంలో దిగవిడిచి, ఒకరినాకరు దాటుకుంటూ పారిపోయారు. అది చూచి దేవతలు జయజయధ్వానాలు చేశారు.
ఈ విధంగా తన బలాన్ని శంకించినట్లు యుద్ధరంగం నుండి పారిపోయే సేనానులతో పకపక నవ్వుతూ వృత్రుడు ఇలా అన్నాడు.
ఈ నీచ ప్రవృత్తి మీవంటి యోధులకు తగునా? కీర్తిని సంపదలను కలిగించే శూరునికి యుద్ధమరణం కోరినా కలుగుతుందా? ఈ విధంగా భయపడి యుద్ధధర్మం మాని తొలగిపోవడం న్యాయమా? అయినా మహామల్లయోధుడైన వృత్రుని అండను మీరు ఎరుగరా? నేనుండగా మీకు చావెక్కడిది.
జీవికి చావు నిత్యసత్యం, తప్పించుకోలేనిది. అయినపుడు లోకాన రెండు చావులు శ్రేష్ఠాలు. ఒకటి యుద్ధరంగాన పోరి చావడం, రెండు యోగమార్గాన కోరి కావలసినపుడు చావడం. ఈ రెండువిధాలుకాని చావు చావుగాదు. వ్యర్థం.
ఈ విధంగా వాసుదేవుని తేజోవిశేషంవల్ల దావాగ్ని జ్వాలలవలె వెలుగుతూ అసుర సైనికుల వెంటబడి తరుముతున్న అమరవీరులను చూసి వృత్రాసురుడు అహంకారంతో హుంకారం చేసి ఇలా అన్నాడు. "ఓరీ! మీకు నాలుగు కాలాలపాటు స్వర్గంలో సుఖంగా జీవించాలని కోరిక లేకపోతే రండి. నా ముందుకు వచ్చి నిలబడండి. నన్ను ఎదుర్కొనండి" అంటూ ఆ దానవవీరుడు కల్పాంత కాలమేఘం లాగా గంభీర కంఠస్వరంతో కఠోరంగా గర్జించాడు. ప్రళయకాల ప్రభంజనంవల్ల భగభగ మండే అగ్నికీలలను తృణీకరించే కుటిల వీక్షణాలు ప్రసరింపజేస్తూ లయకాల మహారుద్రునివలె రౌద్రాకారం ధరించి మహోద్రేకంతో బ్రహ్మాండభాండం బద్దలయ్యేటట్లు పెద్ద శబ్దం చేయగా
వృత్రుని అరుపుకు అన్ని లోకాలూ ఒక్కటయ్యాయి, సూర్యచంద్రులు అస్తమించారు. కొండలు కదలాడాయి. ఆకాశం బద్దలయింది. సముద్రాలు ఇంకిపోయాయి. నక్షత్రాలు, గ్రహాలు తమ తమ స్థానాలు తప్పిపోయాయి. దిక్కులు పగిలాయి, భూమి కుంగింది. బ్రహ్మాండం ఒక కుండవలె అల్లాడింది. బ్రహ్మదేవుడు భయపడ్డాడు.
రాజా! వృత్రాసురుని బొబ్బకు ఖేచరులు పడిపోయారు. దిక్పాలకులు ఒరిగిపోయారు. దేవతలు కిందపడిపోయారు. సర్పరాజులు తూలిపోయారు, మరుత్తులు అనే దేవగణం ఛిన్నాభిన్నమైంది. అశ్వినులు దీనులైపోయారు. రుద్రులు చేష్టలుడిగి బాధపడ్డారు. సూర్యచంద్రులు స్థానాలు తప్పారు. తమ కీళ్ళు ఊడినట్లు దేవతల సమూహాలు తమ చేతి ధనుస్సులు నేలకు విడిచి, వాటితోపాటు తామూ కిందపడి మూర్చపోయారు.
రక్కసుని ఆ కేకకు, పిడుగు పడినపుడు జీవులు కిందబడినట్లుగా దేవతలు తమ ఒడలు మరచి యుద్ధరంగాన పడి మూర్చపోయారు. అపుడు ఆ కఠినుడు తన కాలి తన్నులతో భూమండలాన్ని వణికింపజేస్తూ, వాడి శూలమొకటి చేతబూని, మదించిన రాచ ఏనుగు తామరకొలనులో ప్రవేశించి దానిని అతలాకుతలం చేసినట్లు కళ్ళు మూసికొని, కాళ్ళతో దేవతల ఆకారాలు నశించేట్లు తన్నుతూ, స్వేచ్చగా యుద్ధక్రీడ సాగించాడు. ఆ రాక్షసునిజూచి ఇంద్రుడు వజ్రశత సమానమైన గొప్ప గదను, యుగాంతాన సూర్యుని చుట్టూ కనిపించే వెలుగువలె గిరగిర తిప్పి అతనిపై వేయగా,
ఇంద్రుని గద గగనమండలం నిండా పెనుమంటలు కక్కుతూ మహావేగంతో వచ్చి దనుజేంద్రుణ్ణి తాకింది. వృత్రాసురుడు ఆ గదాదండాన్ని ఎడమచేతితో అవలీలగా పట్టుకొని ఇంద్రుని వాహనమైన ఐరావతం కుంభస్థలం మీద గట్టిగా ఒక్క పెట్టు పెట్టాడు.
రక్కసుని కఠోర ఘాతానికి, ఆ ఐరావతం గిర గిర తిరిగి, నెత్తురులు కారగా, తల పగిలి ఓటమిని ఒప్పుకున్నట్లుగా ఎగురుకుంటూ పరుగుపెట్టింది.
రక్కసుని దెబ్బతో పారిపోతున్న ఐరావతాన్ని ఇంద్రుడు తన అంకుశంతో అదిలించి నిలిపి, అమృతరసాన్ని ఆస్వాదించే తన చల్లని హస్తంతో మెల్లగా నిమిరాడు.
ఈ విధంగా ఐరావతాన్ని ఓదారుస్తూ తన ఎదుట నిలబడి ఉన్న ఇంద్రుణ్ణి చూసి, తన సహోదరుణ్ణి చంపిన తెగువను స్మరించి, మోహం శోకం రెండూ ఏకకాలాన కలగడంతో తారుమారై, తబ్బిబ్బుతో నవ్వుతూ, తాను యుద్ధం కోసమే వచ్చినట్లు తేటపరుస్తూ వృత్రుడిలా అన్నాడు.
నీకు సద్గురువు, నాకు అన్న, దీనులకు ప్రాపు, అయిన అందరికీ మేలుకూర్చే చల్లనిచూపు గలవాణ్ణి; పాపబుద్ధితో, పేరాసతో చంపావు. ఇపుడు ఇక్కడ లోకులందరూ చూచినవ్వగా, నా భుజబలానికి చిక్కి ఉన్నావు. నిన్ను ఈ శూలంతో దడదడ కొట్టుకొంటున్న నిన్ను గుచ్చి కడదేర్చి, నేను మా అన్నగారి ఋణం తీర్చుకొని ఆనందిస్తాను.
లోకాన ఎంత నీచుడైనా తన బతుకుకోసం, తనకు బంధువు, గురువు మీదు మిక్కిలి పుణ్యమూర్తి, బ్రహ్మవంశాన పుట్టినవాడూ అయినవానిని పశువును చంపినట్లు నీవలె చంపగలడా?
ఓరీ! ఇంద్రా! దయాదాక్షిణ్యాలు కోల్పోయి, సత్యాన్ని పరిత్యజించి, ధర్మాన్ని విడిచి, కీర్తిని పోగొట్టుకొని, సిరిసంపదలను దూరం చేసుకొని పౌరుషాన్ని పారదోలి, పదిమందీ చీవాట్లు పెట్టే పాడు పని చేశావు. ఇటువంటి నీచుడవయిన నీ చావుకు సజ్జనులైన వారెవ్వరూ బాధపడరు. నిర్భాగ్యుడవైన నీ మృతకళేబరాన్ని నక్కలు కూడా ముట్టుకోవు. రాబందులు, గద్దలు సైతం అంటుకోవు.
నిజమైన పాపాలతో నా పాలబడినావు. నిన్నిపుడు నా ఈ వాడి శూలపు మొనకు గుచ్చి చంపి, నీ మాంసాన్ని నక్కలు, కుక్కలు తినేటట్లు చేస్తాను.
నీకు దిక్కున్నవా డెవడైనా ఉంటే ఇక్కడికి రమ్మను. దుర్వారమైన గర్వోద్రేకంతో కదనరంగంలో దూకి నా పదునైన శూలం అంచున భగ భగమండే అగ్విజ్వాలలో సోమయాజి మేకలను వేల్చినట్లు నిన్ను వేల్చి పిశాచాల కన్నింటికీ తృప్తిగా విందు చెస్తాను.
ఒకవేళ ఎదుర నిల్చి వాడిగల వజ్రాయుధంతో నీవే నన్ను నిర్జింప గలిగినట్లయితే ఈ పంచభూతాలలో కలిసిపోయి రణవీరుల పవిత్ర పాద పద్మపరాగంలో భాగం సంపాదించుకొని కృతార్థుణ్ణి అవుతాను.
ఇంద్రా! సందేహించక భయంకరమైన నీ చేతిలోని వజ్రాయుధాన్ని నామీద ప్రయోగించు. లోభి దానానికి ఆలసించినట్లుగా కాలయాపన చేయకు. ఆ ఆయుధం వ్యర్థంగాదు. కారణం - దానికి విష్ణుతేజస్సు, దధీచి దానవీర్యం తోడై, ప్రాభవాతిశయంతో ప్రాకాశిస్తున్నది. కాబట్టి విష్ణువు ఆదేశాన్ని పాటించి శత్రువులను నశింపజేసి, గెలుపొందుము. విష్ణువు ఎక్కడుంటే అక్కడ విజయమూ, సౌభాగ్యమూ స్వయంగా వచ్చి వరిస్తాయి. కాబట్టి నన్ను కడతేరిస్తే, నేను ఆ సర్వేశ్వరుని పాదాలమీద మనస్సును లగ్నం చేస్తాను.
"ఇప్పుడు నీ వజ్రాయుధం వేటుకు నా సంసార బంధాలన్నీ తెగిపోతాయి. పాంచభౌతికమైన ఈ శరీరాన్ని పరిత్యజించి సర్వేశ్వరుని సన్నిధికి చేరుకుంటాను. నేను నారాయణ భక్తపరాయణుడను. నాకు స్వర్గ మర్త్య పాతాళ లోకాలలో గల భోగభాగ్యాలు ఏవీ రుచించవు. ధర్మార్థ కామాల జంజాటాలు ఏమాత్రం లేని మహైశ్వర్యాన్ని ప్రసాదించే భగవంతుని అనుగ్రహం అనుపమానమైంది. అన్యులకు అగోచరమైంది. నేను ఆ దేవాదిదేవుని పాదాలు సేవించే దాసులకు దాసాను దాసుడను" అని వృత్రాసురుడు పరమేశ్వరుణ్ణి గురించి
స్వామీ! నా హృదయం భక్తులను పరిపాలించే భవదీయ సద్గుణ సముదాయాన్ని సర్వదా సంస్మరణం చేయాలి. నా వాక్కు నిన్నే ఎల్లప్పుడూ సన్నుతించాలి. నా శరీరం నిత్యమూ నీకు సేవ చేయాలి. ఇదే నా కోరిక. ఇంతకుమించి నేను ధ్రువలోకాన్ని గాని, ఇంద్రభోగాన్ని గాని, బ్రహ్మపదాన్ని గాని ఆశించను.
శ్రీహరీ! దూడలు ఆకలితో తల్లి ఆవులకై వేచినట్లు, ఈకలురాని పిట్టలు తల్లి పక్షులకై ఎదురు చూచినట్లు, మదన బాధ కలిగిన ఒక యువతి దేశం విడిచి వెళ్ళిన మగనికోసం నిరీక్షించినట్లు, నా మనస్సు నిన్ను చేరడానికి తహతహలాడుతున్నది.
శ్రీహరీ! నాకు స్నేహం సజ్జనులతో, సత్కీర్తిమంతులతో మాత్రమే కలిగించు. అంతేగాని జ్ఞానహీనులతోనూ, నిరంతరం సంసారమే జీవిత పరమావధిగా ప్రవర్తించే వారితోనూ ఏర్పడకుండా చూడు.
అనంత కల్యాణగుణుడు, సర్వాంతర్యామి అయిన శ్రీహరిపై వృత్రాసురుడు తన మనస్సును లగ్నం చేశాడు. సంతోషంతో శరీరమంతా పొంగిపోగా మరణాన్ని రణవిజయాన్ని సమానంగా భావించాడు. సంతోషంతో చూపరులకు భయం కలిగిస్తూ, పొగరుతో తనకు ఎదురులేనివాడై, తన బరువు భరించలేక నేల వణకగా, దిక్కులు అదిరిపడగా, యుద్దొత్సాహం అతిశయించగా, ప్రళయకాలపు అగ్నివలె రగులుతూ ఇంద్రునిపై కురికాడు.
సృష్టికి ముందు అనంతమైన జలరాశిపై కైటభుడనే రాక్షసుడు విష్ణువుపై పోరాటానికి దుమికినట్లుగా, హుంకరిస్తూ వృత్రుడు రోషావేశంతో శూలపాణియై ఇంద్రుని మీదికి కుప్పించి దూకాడు.
వృత్రుడు ప్రళయాగ్నివలె జ్వాలలు ఎగసిపడే తన శూలాన్ని తిప్పుతూ, 'ఓ నీచుడా! దీనితో చావు' అంటూ ఇంద్రుని పైకి విసరివేయగా, అది ఆకాశాన కోటి సూర్యుల కాంతితో తనపైకి రావడం చూచిన ఇంద్రుడు వెంటనే దాన్ని తన వజ్రాయుధంతో ఆశ్చర్యకరంగా ఖండించాడు. అది చూచి దేవతలు ఆనందంతో పొంగిపోయారు.
ఆ సమయాన ఇంద్రుడు శూలాన్ని తుంచివేయడంతో ఆగక, వెంటనే వృత్రుని ఎదుర్కొని, అతని భుజాన్ని ఖండించాడు. రాక్షసుడు కోపించి ఒంటి చేతితోనే ఇనుపగుదియను తీసికొని ఇంద్రునిపై పడి అతని దౌడలు పగులగొట్టాడు.
వృత్రుడు ఇనుపగుదియను తిప్పుతూ ప్రళయకాలాన కలిగే కాంతివలయంవలె రోషంతో జ్వలిస్తూ ఆ పరిఘతో, ఐరావతం తలను పగులగొట్టి, ఇంద్రుని దౌడలను ముష్టి ఘాతాలతో నొప్పించగా
వృత్రుని దెబ్బతో ఐరావతం శక్తి నశించి గుండ్రంగా తిరుగుతూ పెద్దగా ఘీంకారం చేస్తూ ఉండటం చూచిన ఇంద్రుడు తానూ విభ్రాంతుడై, తన చేతనున్న వజ్రాయుధాన్ని నేలపై వదలివేశాడు. ఈ దృశ్యం చూచిన లోకాలు రాక్షసుని పరాక్రమానికి గజిబిజిగా భీతిల్లాయి.
గరుత్మంతుణ్ణి చేజిక్కిన పామువలె, వృత్రాసురుని పరాక్రమానికి లోబడిన ఇంద్రుని దురవస్థ చూచిన లోకాలు అయ్యో! అంటూ దుఃఖించాయి.
ఐరావతం అసురుని దెబ్బతో పెద్దగా బొబ్బలు పెడుతూ గిరగిర తిరిగింది. దీనుడై తాను చేతి ఆయుధాన్ని రణరంగాన జారవిడిచాడు - అంటే, నిరాయుధుడై నిలిచాడు. ఆ సమయంలో సామాన్య విరోధి ఎవడైనా మీదబడి కడతేరుస్తాడు. కాని వృత్రుడు యుద్ధధర్మం పాటించి మిన్నకున్నాడు. ఇది చూచిన ఇంద్రుడు సిగ్గుతో తల వంచుకొన్నాడు.
రణరంగంలో శుత్రువు ముందు తనచేతినుండి జారిపడిన వజ్రాయుధాన్ని తిరిగి తీసికోకుండా ఆశ్చర్యంతో నిశ్చేష్టుడై ఉన్న ఇంద్రునితో వృత్రాసురుడు ఇలా అన్నాడు.
ఇంద్రా! యుద్దాన ఆయుధం వదలినవారిని, శరణుజొచ్చినవారిని చంపము. అంతగా ఎందుకు భయపడతావు? వజ్రాయుధం తీసుకో. నిరాయుధుడవైన నిన్ను నేను తాకను.
ఇంద్రా! ఈ విధంగా భయపడటానికి ఇది వేళగాదు. వజ్రాయుధంచేత బూని విరోధిని గెలువు. ఎక్కడైనా అన్నింటికీ ఏలికైన విష్ణువును గాదని, ఈ మరణశీలురైనవారికి గెలుపులు కలుగునా? జ్ఞానదృష్టితో పరికించు. ఈ లోకపాలకులందరూ ఎవనికి వశమై తమ తమ విధులను నిర్వర్తిస్తున్నారో చూడు. తెలివిమాలి, విష్ణుని లీలలను గ్రహించక, ఈ మరణించే సేనలవలన గలిగే జయం తమ దనుకొంటున్నారు.
దేవేంద్రా! యంత్రనిర్మితమైన జంతువుల వలె, కొయ్యతో కూర్చబడిన యువతివలె ఈ ప్రపంచంలోని ప్రాణులందరూ మహావిష్ణువు మాయాతంత్రంవల్ల కదులుతున్న జంత్రపు బొమ్మలని తెలుసుకో.
సృష్టిలోని పంచభూతాలకు - పృథివి - మట్టి, అప్ - నీరు, తేజస్ - కాంతి, వాయు - గాలి, ఆకాశ - ఆకసం ఈ ఐదింటికి, పంచ - ఇంద్రియాలకు - కన్ను ముక్కు చెవి నాలుక చర్మాలకు బానిసై నరుడు దేవుని దయకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా బ్రతుకుతూ, అజ్ఞానిగా, తనను తాను స్వతంత్రునిగా భావించుకొంటూ ప్రకృతి సుఖాలను అనుభవిస్తుంటాడు. జీవులనుండి జీవులుపుట్టి, మళ్ళీ వాటితోడనే నశిస్తుంటాయి. ఇది ప్రకృతి లక్షణం. జీవుడు తనకు సంక్రమించిన పుణ్యాన్ననుసరించి కీర్తిని, సుఖాన్ని సంపదను పొందినవాడై, అది తీరిన తరువాత, ఎంత ఆరాటపడినా మరలవాటిని పొందలేడు. చావుబ్రతుకులు, మంచిచెడులు, సుఖదుఃఖాలు, గెలుపు ఓటములు సమానంగా జీవికి ప్రాప్తిస్తాయి. పరిశీలిస్తే ఈ ద్వంద్వాలు - సుఖదుఃఖాదులు, వాటికి కర్త, భోక్త సర్వమూ ఆ నారాయణుడే. ఇతరమేదీ లేదు. ఇప్పుడు నేను ఒకే చేయి కలిగి ఆయుధహీనునిగా ఉన్నా నిన్ను చంపగలిగి ఉన్నాను చూడు అంటూ వృత్రుడు మరల ఇంకా ఇలా అన్నాడు.
ఈ యుద్ధం ఒక జూదం. దీనిలో వాహనాలైన ఏనుగులు, గుర్రాలు, రథాలు జూదపుగళ్ళు; బాణాలే పాచికలు. ప్రాణాలే పందెములు, ఈ ఆటలో గెలుపు ఓటమి ఎవరిదో తెలియదు.
వృత్రుని మాటలు విన్న దేవేంద్రుడు ఆశ్చర్యపడ్డాడు. శత్రువులోని గొప్పతనానికి, తన మనస్సులో చెడు తలపు మాని, శత్రువును తన పాలిట దేవుడుగా భావించి, తాను జారవిడిచిన ఆయుధాన్ని తిరిగి చేతపట్టినాడు. ఆ సమయంలో లోకాలన్నీ దేవతలసమూహంతోపాటుగా సంతోషించాయి.
వజ్రాయుధం ధరించిన దేవేంద్రుడు గ్రహణానంతరం రాహుగ్రహం ముఖంనుండి వెలువడి కిరణ సముదాయంతో ప్రకాశించే సూర్యవింబంలాగా విరాజిల్లాడు.
ఇంద్రుడు కిందబడ్డ ఆ ఆయుధాన్ని తిరిగి చేతబట్టి, దాని కాంతి వలయాలతో దిక్కులన్నీ వెలుగులు చిమ్ముతుండగా, ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు చిందే పద్మంవంటి ముఖంతో పరికిస్తూ వృత్రునితో ఇలా అన్నాడు.
రాక్షస రాజా! నీ బుద్ది ఉపనిషత్సారాన్ని నిండుగా గ్రహించి, తత్త్వజ్ఞాన వికాసంతో ఒప్పారుతున్నది. నీవు పురాణ పురుషుడు, కమలాక్షుడు అయిన విష్ణుదేవునకు గొప్ప భక్తుడవు.
లోకాలలో విష్ణమాయచేసే లీలలన్నీ నీ వెరుగుదువు. అది జగత్తులతో నిండిపోయి, తనలోనే జగాలను నింపుకొని, జీవులకు కష్టసుఖాలు, సరాగవిరాగాలు కల్పిస్తూ క్రీడించే తీరును నీ సూక్ష్మబుద్ధితో గ్రహించావు. మరి ఇపుడు ఈ రాక్షసపు తీరు తెన్నులెందుకు? రాక్షసరూపాన్ని వదలి పరమపవిత్రమైన నారాయణుని స్వరూపాన్ని సంతోషంగా ధరించు.
ఏ దీక్షను, ఏ గొప్ప తపస్సును చేశావో! రజోగుణంతో నిండిన, ద్వేషరోషాలకు నెలవైన నీ బుద్ధిలో అద్భుతంగా విష్ణుభక్తి కలిగింది. అది మనస్సులను - వాటి ప్రవృత్తులను నిగ్రహించి నిలిచిన వారికిగాని కలుగనిది. అట్టి మహానుభావుల మనస్సులు అనే కొలనులలో నారాయణుడు రాజహంసయై విహరిస్తుంటాడు. విష్ణువు ప్రశాంతచిత్తులలో నివసిస్తాడు.
మహాత్మా! విష్ణువుయొక్కరూపం అనే అమృత సముద్రంలో విహరించే భక్తుడు గుంటలలోని నీళ్లతో తృప్తిపడగలడా?
ఈ విధంగా తనను పొగడుతున్న ఇంద్రుణ్ణి చూచి వృత్రుడు యుద్ధసంఘర్షణను కోరినవాడై, శత్రువును ప్రేరేపిస్తూ, తన ఎడమచేతితో ఇనుప గుదియను తిప్పుతూ, క్రోధంతో ఎగసిపడుతూ, బ్రహ్మాండభాండాన్ని ఘోరశబ్దాలతో పగులగొడుతూ, బలిసిన మదపుటేనుగు ఎద్దుపైకి ఉరికినట్లు ఇంద్రునిపైకి ఎగసి, అతడి వక్షఃస్థలాన్ని గురిచూచి మోదగా, ఇంద్రుడు తన వజ్రాయుధంతో దాన్ని మసిజేసి, వెంటనే వృత్రుని ఎడమచేతిని కూడా నరికాడు. ఇలా రెండు చేతులూ పోయి, నెత్తురులొలుకుతూ వృత్రుడు పూర్వకాలాన ఇంద్రుడు రెక్కలు నరకగా జారిపడుతున్న కొండవలె, లయకాలపు చూడరాని భయంకర భ్రుకుటితో, తన రెండు దౌడలను పైదవడతో ఆకాశాన్ని కిందిదానితో భూమిని అదిమిపట్టి, తన తుదిమొదలు కానరానీయక, వికారంగా నోరుదెరచి, మందరపర్వతంతో దేవదానవులు సముద్రమథనం చేసినపుడు వెలువడిన భీకర విషజ్వాలవంటి నాలుకతో ఆకాశాన్ని నాకుతూ, యుగాంతపు యమునిచేతి దండాల వంటి కోరలతో ముల్లోకాలను మింగబోయేవానివలె మహాకాయుడై, కొండలను అటూ ఇటూ త్రిప్పుతూ, నడిచే కొండలాగా నేలనూ నింగినీ ఆక్రమించాడు. ఆ సమయంలో
ప్రళయకాలంలో మృత్యుదేవత ముఖంనుండి వెలువడినట్లు, తన నోటినుండి అగ్నిజ్వాలలు వెలువడుతుండగా, దేవసమూహం భయంతో వణుకుతుండగా, లోకాలన్నీ 'ఆహా' అంటూ అరుస్తుండగా ఐరావతాన్ని ఆయుధంతో చుట్టివేసి, పట్టుకొని ఇంద్రుణ్ణి మహా ఆశ్చర్యకరంగా మింగివేశాడు వృత్రుడు.
అపుడు లోకాలన్నీ చీకాకుపడ్డాయి. చీకటి ముసిరింది. ఆకాశంనుండి చుక్కల గుంపులు నేలరాలిపడ్డాయి. చిరుజల్లు కురిసింది. సూర్య చంద్ర అగ్నుల కాంతులు నశించాయి. దిక్కులు తబ్బిబ్బుపడ్డాయి.
వృత్రుడు మింగినా ఇంద్రుడు అతడి కడుపులో చెక్కుచెదరకుందా, నిబ్బరంగా ఉన్నాడు. ఎందుకంటే, అతనిని శ్రీహరి రక్షిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు గూడ జయాన్ని ఆనందాన్ని అందించే వైష్ణవీ విద్యను మనస్సులో నిలిపి, కందకుండా, భయపడకుండా, వణకకుండా, తత్తరపడకుండా, ఏ విశేషాన్నీ చెప్పకుండా నిశ్చలంగా ఉన్నాడు.
ఈ విధంగా శ్రీహరి కృపనే కవచంగా ధరించినవాడై ఇంద్రుడు, వృత్రుని పొట్టను వజ్రాయుధంతో చీల్చి, ఐరావతంతో కూడా బయటపడి, శత్రువు మెడను నరకడానికి వజ్రాన్ని ప్రయోగిస్తే అది అతివేగంతో తిరుగుతూ సంవత్సరపు సంధికాలాన, సూర్యాది గ్రహనక్షత్రాలు, దక్షిణాయనం - ఉత్తరాయణం అంటూ తిరిగే కాలానికి మధ్యలో, పగటికి చీకటికి నడుమ, వృత్రుని చేరి అతని తలను పెద్ద కొండనువలె త్రుంచి నేలగూల్చింది. అప్పుడు,
ఆ సమయంలో ఆకాశంలో దేవదుందుభులు మ్రోగాయి. గంధర్వులూ, దేవతలూ, సాధ్యులూ, సిద్దులూ, మునీంద్రులూ మిక్కిలి ఆనందించి వృత్రసంహారం చేసిన ఇంద్రుడి తేజో వైభవాన్ని ప్రకాశింపజేసే ప్రశస్తతర మంత్రాలు పఠిస్తూ పూలవానలు కురిపించారు. వృత్రుని తలతెగిన పిదప అతని శరీరం నుండి దివ్యకాంతి ఒకటి బయల్వెడలి, లోకులలెల్లరూ చూస్తుండగా అంతవరకు చూడని లోకమైన విష్ణులోకానికి చేరి విష్ణువులో లీనమైంది.
ఇలా వృత్రుని చావుతో ఎల్లలోకాలూ కష్టాలుపోయి శాంతించాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, రాక్షసగణంతో కలిసి, ఇంద్రునకు చెప్పకుండా తమ తమ నెలవులకు వెళ్ళారు. అని శుకుడు పరీక్షిత్తునకు చెప్పగా ఆయన శుకునితో ఇలా అన్నాడు.
సురలు ఇంద్రునితో చెప్పకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? అలాంటప్పుడు వారు ఎలా సుఖశాంతులు పొందారు? ఇంతకూ, ఇంద్రునికి కీడు ఎలా జరిగింది? చెప్పవయ్యా శుకయోగీ!
పరీక్షిన్మహారాజుతో శుకుడిలా అన్నాడు- వృత్రుని శక్తికి భీతిల్లిన దేవతలు, ఋషులు పూర్వం వృత్రుని చంపమని ఇంద్రుని వేడగా, అతడు బ్రాహ్మణహత్య చేయలేక, "ముందుగూడ విశ్వరూపుణ్ణి చంపినపాపాన్ని భరించలేక, దాన్ని స్త్రీలకు కొంత, నేలకుకొంత, నీటికికొంత, చెట్లకుకొంత అప్పగించాను. ఇపుడు మళ్లీ మరొక బ్రహ్మహత్యచేస్తే, దాని పాపఫలితాన్ని ఎట్లా తొలగించుకోవాలి" అన్నాడు. అపుడు దేవమునివర్గం ఈ పాపాన్ని అశ్వమేధయాగం చేయించి, యాగపురుషుడైన విష్ణువును మెప్పించి, నిన్ను పాపవిముక్తుని చేయగలం. సహజంగానే బ్రాహ్మణులను, తండ్రులను, ఆవులను, తల్లులను చంపినవారే అయినా, శ్రీహరిని సేవించి పాపవిముక్తులవుతారు. అశ్వమేధయాగ నిర్వహణతో శ్రీహరిని సేవిస్తే వృత్రుని చంపినందువల్ల కలిగిన పాపం నిన్ను ఏమిచేస్తుంది అని ఇంద్రుణ్జి అంగీకరింపజేశారు. ఇంద్రుడు అంగీకరించి వృత్రుణ్ణి వధించి, దానివలన పాపం పొంది, ఆ పాపాన్ని భరించలేని దుర్దశను పొందాడు.
బ్రహ్మహత్య భయంకరాకారంతో దేవేంద్రుణ్ణి వెంబడించింది. ఆ మహాపాపం చండాలరూపం ధరించి ముసలితనంతో ఒడలంతా ముడతలుపడి గడగడ వణుకుతూ నడచి వస్తున్నది. క్షయరోగంతో కుష్టరోగంతో దాని శరీరమంతా నెత్తురు చిమ్ముతున్నది. నెరసిన జుట్టు విరబోసుకొని 'ఆగు ఆగు!', 'పోకు పోకు!', 'ఉండు ఉండు!' అంటూ వెంటాడసాగింది. దేహమంతా దుర్గంధంతో వాంతి వచ్చి పేగులు తరుక్కుపోయే కంపుకొడుతున్నది. ఇంద్రుడు ఏ పక్కకుపోతే ఆ పక్కకూ పరుగెత్తుతూ వెంటబడి తరుముతున్నది. 'ఇదిగో! నాకు లోబడకుండా నన్ను అనుభవించకుండా ఎక్కడికి పోతావో ఎట్లా పోతావో చూస్తాగా. నీవెంత!' అంటూ అరుస్తున్నది. వెంట పరుగిడుతూ వస్తున్న బ్రహ్మహత్యను తిరిగి తిరిగి చూస్తూ భయంతో సిగ్గుతో దేవేంద్రుడు పారిపోసాగాడు.
బ్రహ్మహత్యాపాపం చండాల రూపంతో తనను వెంటాడి తరుమగా, ఇంద్రుడు దిక్కుతోచక, నింగిని నేలను అంతటను తిరిగి తిరిగి, నిట్టూర్పులతో పరుగెత్తి ఈశాన్యదిక్కుకు చేరాడు. అది ఈశ్వర రక్షితం గాబట్టి, ఆ చోటికి ఈ పాపరూపచండాల చేరలేకపోయింది. ఇంద్రుడు దాక్కోవడానికి చోటు వెతుక్కుంటూ, మానస సరోవరంలో ప్రవేశించి అందులో ఒక తామర తూడులోని దారమై శ్రీహరిధ్యానంలో వేయేళ్ళు గడిపాడు. ఆ సమయంలో స్వర్గాన్ని నహుష మహారాజు తన విద్య, తపస్సు, యోగాల బలంతో పాలిస్తూ, పొగరు తలకెక్కి శచీదేవిని తాను ఇంద్రస్థానాన ఉన్నాడు గాబట్టి తనకు భార్య కావాలని ఆశించాడు. బృహస్పతి సూచనతో బ్రహ్మర్షిగణం తన పల్లకిని మోస్తుండగా నహుషుడు శచిని జేరబోతుండగా అగస్త్య శాపగ్రస్తుడై కొండచిలువగా పుట్టాడు. అప్పుడు బ్రహ్మఋషుల పిలుపు మేరకు ఇంద్రుడు స్వర్గానికి మరలివచ్చాడు. శ్రీహరిస్మరణ, శివకృప కారణంగా ఆ పాపంనుండి విముక్తుడై, అశ్వమేధ యాగానికి దీక్ష తీసికొన్నాడు. దేవతలు, మహర్షులు పొగడగా తిరిగి తన ముల్లోకాల రాజరికాన్ని గైకొని భోగభాగ్యాలతో విలసిల్లాడు.
ఈ ప్రకారంగా దేవేంద్రుడు మరీచి మొదలైన మహామునుల సహాయంతో యథావిధిగా అశ్వమేధయాగం చేసి యజ్ఞేశ్వరుడూ జగదీశ్వరుడూ పరమేశ్వరుడూ అయిన శ్రీహరిని సేవించి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకొని పరిశుద్దుడై ప్రకాశించాడు.
శ్రీమన్నారాయణుడు పునర్జన్మకు కారణాలైన క్రూరకృత్యాలనే సముద్రాన్ని తాగివేసే అగస్త్యమహర్షి వంటివాడు. మహాపాతకాలనే అరణ్యాలను భస్మంచేసే అగ్నిహోత్రునివంటివాడు. భక్తజనుల కల్మషాలనే కాలకూటాన్ని అలవోకగా కబళించే పరమశివునివంటివాడు. అంతులేని కలుషరాసులనే కటికచీకట్లను పటాపంచలు చేయటంలో ప్రభాకరునివంటివాడు. ఆ నారాయణదేవుని నామసంకీర్తనం సమస్తమైన మోక్షసామ్రాజ్యాన్ని సంపాదించి పెట్టి సకల భోగభాగ్యాలను సమకూరుస్తుంది.
పాపరహితుడవైన ఓ పరీక్షిన్మహారాజా! ఈ పురాణకథ ప్రభావమిది. ఎల్లబాధలనూ హరిస్తుంది; అన్ని ప్రయోజనాలనూ సంతోషంగా నెరవేరుస్తుంది; నిర్మలమైన భక్తి ప్రభావాతిశయాన్ని చూపిస్తుంది; సాటిలేని భక్తులను గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తుంది; పండితులకు అనేక విజయాలను సమకూరుస్తుంది; వృత్రుడు మింగగా ఇంద్రుడు విడుదల అయిన తీరుతెన్నులు వివరిస్తుంది; బ్రహ్మహత్య వలని కష్టనష్టాలను విశదీకరిస్తుంది; సత్పురుషులకు సర్వదా కాంక్షింపదగినది. అలాంటి ఈ పురాణకథను విన్నా ప్రతిదినం చదివినా, వ్రాసినా, అట్టివారికి ఆయుస్సు, ఆరోగ్యం, గెలుపు, సంపదలు పెరుగుతాయి, దుష్కర్మలు తొలగిపోతాయి. తుదకు ముక్తి లభిస్తుంది.
వృత్రాసురుని వృత్తాంతం అంతా విన్న అనంతరం పరీక్షిత్తు శుకమహర్షితో ఇలా అన్నాడు. యోగీంద్రా! వృత్రుని వృత్తాంతం విన్నది మొదలు నా హృదయం ఆశ్చర్యంతో కళవళపడుతున్నది. ఏమంటే వృత్రుడు రజోగుణమూ తమోగుణమూ ప్రధానంగా ప్రవర్తించేవాడు. దుష్టస్వభావుడు. అటువంటి వానికి నారాయణుని పాదపద్మాలపై భక్తి ఎలా సంభవించింది? సత్వగుణ సంపన్నులు, సమబుద్దులు, తపోనిష్ఠులు, నిర్మల స్వభావులు, ధర్మమూర్తులు ఐన మహానుభావులకు, దేవతలకు, మహర్షులకు సైతం అలభ్యమై మోక్షానికి మూలకారణమైన భగవద్భక్తి పరమరాక్షసుడైన వీనికి ఎలా పట్టుబడింది?
ఈ భూతలంపై ఎన్ని రేణువులున్నాయో లెక్కింపలేము. అలాగే ఈ భూమిపై లెక్కలేనన్ని జీవసమూహాలు ఉన్నాయి. ఇన్ని జీవకోట్లలో ధర్మమార్గంలో వసించేవారు మానవులు. ఈ మనుష్య సమూహంలో కోరికలను విడిచిపెట్టి మోక్షాన్ని కోరేవారు తక్కువ. ఈ మోక్షం ఆత్మమూలం అని గ్రహించే ముక్తులైన వారు దొరకరు. ఆలోచించి చూస్తే ప్రశాంతపరుడు, పరమసుజ్ఞాని, భద్రగుణుడు, ప్రేమతో వాసుదేవ పరాయణుడు అయిన ముక్తుడు అరుదుగా కనిపిస్తాడు.
సకలలోక కంటకుడూ, దుస్సాంగత్యం కలవాడూ అయిన వృత్రాసురుడికి ఇంతటి దివ్యమైన జ్ఞానం ఎలా కలిగింది? రణరంగంలో ధర్మయుక్తమైన పౌరుషంతో దేవేంద్రుణ్ణి ఎలా మెప్పించగలిగాడు? ఈ విషయమంతా నాకు వివరించి చెప్పు.
చిత్రకేతూపాఖ్యానము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
పంచాంగం
No comments:
Post a Comment