Wednesday, April 15, 2026

Chapter 86 The miraculous story of Lord Krishna - అధ్యాయము 86 శ్రీ కృష్ణుని యత్యద్భుత చరిత్రము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 86

శ్రీ కృష్ణుని యత్యద్భుత చరిత్రము

వ్యాస సంయమి యిట్లు పలికెను : రాజా! గోకులమందు నింట నుదయమున పుత్రోదయ మహోత్సవము కనుల పండువుగ జరుగు చుండెను. ఆ వార్త కంసుడు తన చారుల వలన వినెను. వసుదేవుని భార్యయు నతని పశువులును గోకులమందు వసించుచున్న వార్త కంసుడు చారులవలన నెఱిగెను. 

కంసునకు గోకులముపై ననుమానము గల్గెను. మున్ను నారదుడును వారికి గోకులముతో సంబంధమున్నట్లు తెలిపెను. దేవకీ వసుదేవాదులును వారి భార్యలును దైవాంశ సంభూతులు - వారు నీ శత్రువులని నారదుడు చెప్పెను. నారదుని పలుకుల వలన పాపాచారుడు - కులాధముడునగు కంసుడు ప్రబుద్ధుడై క్రుద్ధుడయ్యెను. 

మహా విక్రముడైన శ్రీకృష్ణుడు పూతన రక్కసిని పరిమార్చెను. అతడు బలశాలురైన బక వత్సక ధేనుకుల నంతమొందించెను. ప్రలంబాసురుని చెండాడెను. మహా శక్తుడగు కృష్ణుడు గోవర్ధగిరిని లీలగ నెత్తెను. ఇదంతయును విని కంసుడు తన చావు నిక్కమని తలపోసెను. పిమ్మట కేశియను రక్కసుడు నిహతుడయ్యెను. 

దాని నెఱిగి దుర్మనస్కుడైన పాపమతి యగు కంసుడతుల విక్రములగు రామకృష్ణులను వధింప తలచెను. ధనుర్యాగము నెపముగ రామ కృష్ణులను పిలిపించెను. ఆ క్రూరాత్ముడు అందుల కక్రూరుని పంపెను. గాందినీ సుతుడగు నక్రూరుడు కంసునాదేశమున గోపబాలురను రథ మెక్కించుకొని గోకులము నుండి మధురకు తోడుకొని వచ్చెను. 

వారచటి కేతెంచి మొట్ట మొదట ధనుర్భంగ మొనరించిరి. వారు పిమ్మట రజకుని కువలయా పీడమను గజమును చాణూర ముష్టికులను చంపిరి. దేవేశుడగు కృష్ణుడు పిదప లీలగ కంసుని జుట్టిపట్టి యీడ్చి చంపివేసెను. శత్రు నిఘాదనుడగు కృష్ణుడు తన తలిదండ్రులను కారాముక్తులను గావించి వారి దుఃఖ ముడిపెను. 

పిమ్మట నుగ్రసేనుని మధురకు రాజుగ నొనరించెను.

అంత మహా మనసుడగు వసుదేవుడు రామకృష్ణులకు మౌంజీ బంధనము లొనరించి యుపనయన సంస్కారము లోనరించెను. వారుపనీతులై సాందీపనియగు గురునొద్ద సకల విద్యలు కళలు నభ్యసించి మధుర కేతెంచిరి. వసుదేవ నందనులు మధురలో వసింపసాగిరి. 

వారి కపుడు పండెండ్రేండ్లు. వారు మహా విద్వాంసులు మహా బలశాలురు మహా వీర్యులునై వాసి కెక్కిరి. అంత మగధరాజుగు జరాసంధుడు తన యల్లుని మృతికి వగచి సైన్యము గూర్చుకొని మధరపై దండెత్తెను. అతడు పదునేడుమార్లు మధురానివాసి ధీశాలి యగు శ్రీకృష్ణునితో బవర మెనర్చి యోడిపోయెను. 

పిమ్మట యాదవుల పాలిటి యముడు శూరుడు వ్లచ్ఛాధినాథుడు కాలయవనుడను వానిని కృష్ణునిపైకి పురికొల్పెను. యవనుడెత్తి వచ్చుట విని కృష్ణుడు సకల యాదవులను బలరాముని బిలిపించి వారితో నిటు పలికెను : 

ఓ మహాశయులారా! ఇపుడు మహాబలుడగు జరాసంధుని వలన మనకు ఘోరవిపత్తు ముంచుకొని వచ్చుచున్నది. అదే యవనుడు సమీపించు చున్నాడు. ఇత్తఱి మన కర్తవ్యమేమి? ఇపుడు మన యిండ్లు ధనము బలములు విడనాడి మన ప్రాణములు గాపాడుకొనుట ముఖ్య కర్తవ్యము. ఎచట సుఖము గలుగునో యది పైతృక స్థానము గదా! ఎచట వసించిన నుద్వేగము గలుగునో యచ్చోటు కులోచితమైనను విడువదగినది. 

ఇపుడు క్షేమము గోరుకొనువాడు పర్వతముల - సాగరముల సన్నిధిలో నుండుట భద్రము. ఎచ్చోట వైరి భయము గలుగదో యచ్చోట నుండదగునని పండితులందురు. మధుసూదనుడు సముద్రముపై శేషశయ్యపై పవ్వళించును. అటులే త్రిపురారియు భయపీడితులై కైలాసగిరిపై వసించును గదా! 

కనుక నిపుడు శత్రుపీడితులమగు మనము నిచ్చోట నుండ గూడదు. మనమెల్లరము వలసినవన్నియు తీసికొని ద్వారావతి కేగుదుము. ఆ పురి రమ్యమైనదని మున్ను నాకు గరుటామంతుడు చెప్పెను. సముద్ర తీరమున రైవతా చలమను కొండకు దగ్గరగా ద్వారక చెన్నొందును.'' 

వ్యాసుడిట్లనెను : కృష్ణుని హితవచనములు విని యాదవ పుంగవులామోదము వెలిపుచ్చిరి.

వారెల్లరును సకుటుంబముగ ద్వారక కేగ నిశ్చయించుకొనిరి. వారు శకటములు లొట్టిపిట్టలు మహిషములు అశ్వములు వెంట తీసికొనిరి. వారు వానినిండ వలసిన ధనసామగ్రులుంచుకొని నగరము వెడలిరి. వారికి ముందుగ రామకృష్ణులు నడచిరి. ప్రజానీకమెల్లను రామకృష్ణులకు ముందుగ యాదవులు వారికి వెనుకగ నడచుచుండగ వారు కొలది నాళ్ళలోనే ద్వారక జేరిరి. 

ఆ పురము నిర్జనమై యుండెను. రామకృష్ణులు శిల్పులచే దానిని చక్కగ సంస్కరింపజేసి యచట యాదవాదుల నుంచిరి. వారు వేగముగ నిర్జనమైన మధురాపురికేగి యట వసించిరి. అదే సమయమునందు బలశాలియగు యవనపతి యచ్చటికి వచ్చెను. యవనుని రాక విని శాశ్వత బ్రహ్మమగు కృష్ణుడు నగరము వెడలి పాదచారియై యతని ముందటికేగెను. 

అతనిని గని పీతాంబరధారి మొలక నవ్వులు నవ్వెను. కమలలోచనుడగు మధుసూదనుడు యవనుని ముందుగ ముందునకు సాగుచుండెను. యవను డపుడు తనముందు కృష్ణుని గని అతనిని వెన్నాడుచు ననుసరించెను. ఒకచోట మహా విక్రముడు రాజర్షి యగు ముచుకుందుడు నిదురించు చుండెను. 

కృష్ణ భగవానుడు తన్ను వెంబడించు యవనునితో ఆ రాజర్షియున్న యెడ కరిగి యంతర్ధానము నందెను. అచ్చోట నిద్రించు ముచుకుందుని వాసుదేవునిగ భావించి యవనుడు ఆతనిని కాలదన్నెను. ఆ తాపునకు మహితబలశాలియగు ముచుకుందరాజర్షి మేలుకొని క్రోధ రక్తాక్షుడై యవనుని తన కంటి మంటతో కాల్చివేసెను. 

పిమ్మట కమలలోచనుని దర్శించెను. దేవదేవుడగు వాసుదేవునకు ప్రణమిల్లి తత్‌క్షణమే ముచుకుందుడు వనముల కేగెను. కృష్ణుడు బలదేవునిగూడి ద్వారక కరిగెను. ఉగ్రసేనుని రాజుగ నొనరించి తాను యథేచ్ఛముగ విహరించు చుండెను.

ఒకసారి రుక్మిణీ వివాహము శిశుపాలునితో జరుగుట కేర్పాటులు జరిగెను. అపుడు హరి స్వయంవరము నుండి రుక్మిణిని హరించెను. ఆపైని రాక్షస వివాహ విధిగ ఆమెను వివాహమయ్యెను. 

పిదప శ్రీకృష్ణుడు జాంబవతి మిత్రవింద సత్యభామలను పెండ్లాడెను. మఱియు కాళింది లక్ష్మణ నాగ్నజితియనువారలను వేర్వేరుసమయములందు పరిగ్రహించెను. ఈ యెనమండుగురు పరమ పవిత్రులు శ్రీకృష్ణుని పత్నులు. వారిలో రుక్మిణి ప్రియదర్శనుడు ప్రద్యుమ్నుని గనెను. 

కృష్ణుడు ప్రద్యుమ్నునకు జాతకర్మాది సంస్కారము లొనరించెను. ఒకసారి బలశాలియగు శంబరారి బాలుని ప్రద్యుమ్నుని పురిటింట నపహరించెను. అతడు తన పురి కరిగి బాలుని మాయావతి చేతిలో నుంచెను. తన పుత్రు డపహృతుడగుటచే కృష్ణుడు శోకించెను. పద్మనాభుడు భక్తి ప్రపత్తులతో చిత్తమందు శ్రీ భువనేశ్వరీదేవిని శరణు వేడెను. 

ఆ దేవి మున్ను వృత్రాసురాదులను సంహరించెను. కృష్ణుడు యోగమాయను పరమోదారములైన లలితాక్షరములతో నిట్లు స్తుతించెను: 

'జగజ్జననీ! తొంటి జన్మమున నేను ధర్ముని కొడుకనై బదరీవనమందు తపించితిని. అపుడు నీవు నా తపమునకు సంతసించితివి. నేను నిన్ను పూలతో నర్చించితిని. నీయందలి యానాటి నా భక్తి తత్పరతను మఱచితివా తల్లీ! నా పుత్త్రుడు పురిటింట నపహరింపబడెను. 

ఏ దుష్టుడైన వినోదమున కట్లొనరించెనో! కాక నన్న వమానించుటకు చేసెనో! తల్లీ ! నీవు భక్త సులభవు. ఇది నీకుగూడ నవమానకరముగదా! నా నగరము సురక్షితముగా నున్నది. నగర దుర్గము దృఢమైనది. నగరము నడుమ నా భవనము గలదు. దాని యంతిపురమున పురిటిల్లు గలదు. అందున్న నా పుత్త్రుడు నా దోషమున నపహరింపబడెను గదా! 

నేనుగాని యావులుగాని యన్యాయముగ శత్రు పురములై దండెత్త లేదు. నా నగరము వీరయోధులచేత సురక్షితము. ఇదంతయును నీ మాయా ప్రభావమని తెలియుచున్నది. నా బాలు డేమోసగానిచే నపహరింపబడెనో!

ఓ అమ్మా ! నీ రహస్య చరిత్ర మహత్త్వము నాకే తెలియదు. ఇంక దేహాభిమాని మందమతి యగు సామాన్యుని కెట్లు తెలియును? నా బాలకు నెవరపహరించిరో నా భటులకు గనబడ కతడెచటి కేగెనో ఇదంతయును నీ చే కల్పితమైన మాయ తెరమాత్రమే. తల్లీ! ఇది నీ లీలా విలాసమా! మున్ను నా తల్లి గర్భమందలి శిశువునైదవ నెలనే అప్పటికే పతిసంగతి పాసి యెక్కడనో యున్న రోహిణీ గర్భమందుంచి యామెను ప్రసవింప జేసితివే! అదియును లోకవిదితమే కదా! 

అంబికా! నీవు నీ మహత్తర గుణగణములతో నిరంతరముగ లోకములు పుట్టించి పెంచి యడంచు చుందువు. నీ దురిత దూరమగు పరమ పావన చరిత మెవ్వడెరుగజాలును? ఈ విశ్వ ప్రవృత్తి నీమూలముననే జరుగుచున్నది కదా! జననీ! నాకు మొదట పుత్రసంతాన మొసగితివి. పుత్త్ర జనన ప్రమోదము కల్గించితివి. 

పిదప పుత్త్ర వియోగ దుఃఖమును గల్గించితివి. దీనిబట్టి నీవు లలిత వినోద విహారముల నాడుకొనుచుందువని నాకు దోచుచున్నది. 

కాన నా పుత్రోత్సాహము వ్యర్థము గాదని తలతును. మాతా! ఆ బాలుని తల్లి కురరివలె పుత్త్ర శోకమున వలవల ఏడ్చుచు నా చెంతకు వచ్చి గుండె బాదుకొనుచున్నది. 

ఓ లలితాంబా! మా కడగండ్లు నీ వెరుగనివా? భవరోగ పీడితులకు నీవేకదా శరణ్యము! 

ఓ జననీ! పుత్త్ర జననము సుఖ సంసారమున చివరిమెట్టు పుత్రనాశము దుఃఖములకు చివరిమెట్టు. అని బుధులందురు. తొలి కుమారుడే నష్టుడుగాగా నింక నేనేమి చేయుదును? నా యెడద బ్రద్దలగుచున్నది. 

అమ్మా! నిన్ను దేవీ యాగములతో వ్రతములతో పూజలతో సంతోషపఱతును. నీవొక్కతెవే శోకములెల్ల బాపగలదానవు. నా కొడుకు బ్రతికియున్నచో నాకు వేగమే చూపుమమ్మా! అని యీ విధముగ నద్భుతకర్ముడు జగద్గురువు నగు శ్రీకృష్ణుడు సంస్తుతింపగా జగదంబ ప్రత్యక్షమై యతని కిట్లు పలికెను: 

'దేవేశా! శోకింపకుము. నీకు వెనుకటి శాపమొకటి కలదు. ఆ కారణమున శంబరుడు మాయాబలమున నీబాలు నపహరించెను. నీ బాలునకు పదారేండ్ల వయసు రావలయును. అపుడతడు నా యనుగ్రహ బలమున శంబరాసురుని సంహరించి తిరిగి రాగలడు అని యిట్లు చండ విక్రమయు దయాతరింగిణియు నగు చండికాదేవి పలికి యంతర్ధాన మొందెను. కృష్ణభగవానుడు శోకముడిగి సుఖముందెను.

అధ్యాయము 87 శ్రీకృష్ణుడు పుత్రప్రాప్తికి తపమొనరించుట

No comments:

Post a Comment