Wednesday, April 15, 2026

Chapter 97 Mahishunaku Sridevi's Hithamulu - అధ్యాయము 97 మహిషునకు శ్రీదేవి హితములు

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము - అధ్యాయము 97

మహిషునకు శ్రీదేవి హితములు

మహిషుని మంత్రి పలికిన మాటలు విని మహామాయ యగు రమణీమణి విహసించి గంభీర వాక్కుల నతని కిట్లు పలికెను: 

'ఓ మంత్రివర్యా! నన్ను దేవతల తల్లిగ నెఱుగుము. నేను దానవాంతకురాలగు శ్రీ మహాలక్ష్మిని. దైత్యపతి దేవతలను నానా బాధలు పెట్టెను. వారి యాగ భాగములు వారి కందనీయలేదు. అందులకు దేవతలెల్లరు మహిష వధకు నన్ను ప్రార్థించిరి. 

కనుక నే నిపు డతనిని హతమార్చుటకు వచ్చితిని. నాకు సేనతోడ బనిలేదు. నాకు ముందుగ ప్రయత్నము నక్కరలేదు. నీవు తీయని సామ వచనములతో నాకు స్వాగతము పలికితివి. నన్ను గౌరవించితివి. అందుచేత నేను నీయెడల సంతుష్టి జెందితిని. కానిచో కాలానలము వంటి నా చూడ్కుల మంటలతో నిన్నెప్పుడో దహించియుండెడి దానవే. 

తీపిమాటల తీపి యెవనికి తీపిగ నుండదు? నీవిపుడు మహిషుని జేరి నా మాటగ వానికిట్లనుము: 

'నీకు బ్రదుకుపై తీపి యున్నచో నీవిపుడే పాతాళ మేగుము. కానిచో దుష్టుడవు పాపాత్ముడవు నగు నిన్నిపుడే రణాంగణమున దునుమాడుదును. నా బాణములచే నీ శరీరము చిల్లులు పడును. నీవు యమునింటి కేగుదువు. నీపై దయపూనితినని యెఱుగుము. నీవు వెంటనే పాతాళ మేగుము. నీవు చచ్చినచో దేవతలు సత్వరమే స్వర్గ మలంకరింప గలరు. 

కనుక మూఢాత్మా! నా కఱకుటమ్ములు తగులక మునుపే జలనిధితో చుట్టబడిన యీ భూమిని వదలిపెట్టుము. రసాతలమున కేగుము. కాక నీకు యుద్ధకాంక్షయే యున్నచో రమ్ము. మహాబలులైన వీరులను వెంటగొని రమ్ము. అందఱను యమునింటి కతిథులుగ పంపుదును. 

ఓరీ మహామూఢా! యుగయుగమున నా చేతిలో నీవంటివారు లెక్కకు మిక్కిలిగ నిహతులగుదురు. అట్లె నిన్నిపుడు రణరంగమున నంతమొందింతును. ఓ మన్మధ పీడితా! నాతో బోరుము. నేను శస్త్రములు దాల్చినందులకు నా శ్రమ సఫల మొనరింపుము.

మూర్ఖా! దుష్టా! విధివరము గలదని విఱ్ఱవీగకుమురా! నీవు స్త్రీవధ్యుడవు. అందుచే సురలింతగ పీడితులైరి. బ్రహ్మవాక్కు వ్యర్థము గారాదు. కనుక సాటిలేని మేటి స్త్రీ రూపము దాల్చి పాపివగు నిన్ను చంపవచ్చితిని. 

మందమతీ! నీకు బ్రతుకు యున్నచో స్వర్గము విడువుము. పన్నగము లుండు పాతాళ మేగుము అను హితములు హేతుగర్భములు నగు పలుకులు విని మంత్రి సత్తముడు దేవి కిట్లనియెను: 

'ఓ దేవీ! నీవు మదగర్వముతో నున్నావు. ఆడుదానికి తగినట్లు పలుకుచున్నావు. అతడెక్కడ? నీవెక్కడ? మీ యిరువురి యుద్ధ మసంభావ్యమని తలతును. నీవొక యబలవు-కోమలవు-ఒంటిదానవు. ఆ మహిషుడు మహాకాయుడు. ఇట్టి మీకు పరస్పరము సమరమెట్లు వొసగును? అతని రథ-గజ-అశ్వ-పదాతి బలములు పెక్కు రీతులతో పెక్కాయుధములతో నెసగుచున్నవి. 

ఒక మాలతీ సుమమును మర్దించుటకు గజరాజున కెట్టి శ్రమకలుగునో నిన్ను చంపుటకు మహిషున కట్టి శ్రమ గల్గును. నీతో పరుషము లేమాత్రమును బలుకను. అవి శృంగార విరుద్ధములు-రసభంజకములు నగునని భయపడుచున్నాను. మా రాజు సురవైరి. నీకు భక్తుడు. కునుక నేను నీతో సామదాన యుక్త వచనములే పలుకవలయును. 

కానిచో-మిథ్యాభిమానపు-మృషావాక్కులలో చతురవు-రూప¸యవన గర్వితవునగు నిన్నిపుడే నా బాణములతో చంపియుండెడివాడనే. నా స్వామి లోకాతీతమైన నీ లావణ్యపు సంద్రపుటలలలో మునగి ముగ్ధుడయ్యెను. అతని ప్రియము కొఱకు నేను నీతో ప్రియ వాక్యములే పలుకవలయును. 

ఓ విశాలక్షీ! ఆ మహిషుని రాజ్యము-ధనము నీ సొత్తు. అతడు నీ చరణదాసుడు. చావును కలిగించు కోప ముడుగుము. రాగ భావములు పూనుము. 

భామినీ! శుచిస్మితా! నేను నిశ్చల భక్తి భావముతో నీ పాదములు పట్టుకొందును. నీవు వేగమే మహిష మహారాజునకు పట్టమహిషివి కమ్ము. ఆతని చేపట్టినచో నీ వీ త్రైలోక్యమందలి సంసారసుఖసంపదలు పడయగలవు.'

దేవి యిట్లనెను : 'మంత్రివరా ! నీవు శాస్త్రమార్గానుసారముగ చతురతతో సారవంతములగు మంచి పలుకులు పలుకుచున్నావు. ఇక నా మాట వినుము. ఇపుడు నీ మాటలబట్టి నా బుద్ధికి తోచునదేమనగ నీవు మహిషుని ప్రధానుడవు. నీవు మహిషబుద్ధి గలవాడవే. అతనికి నీవంటి మంత్రియుండగ నతడు సారమతి యెట్లు గాగలడు? 

బ్రహ్మ మీ యిరువురిని తగినట్లుగనే తగుల గూర్చినాడు. ఓరీ మూఢా! నన్ను నీవు స్త్రీ స్వభావము గలదానవంటివి. నీవేమి తెలిసియంటివిరా? నేను పురుషుడను గాను. నిజమే. కాని, నేను స్త్రీ రూపము దాల్చిన తత్పురుష స్వభావము గలదానను. మునుపు నీ ప్రభువొక స్త్రీ చేతిలో చచ్చునట్లు వరము బడసెను. దానినిబట్టి యత డతిమూర్ఖుడు - వీర రస మెఱుగనివాడు నని తలతును. 

ఒక యువతి చేతిలో చచ్చుట వీరులకు దుఃఖము-నపుంసకులు సంతసము గల్గించును. కనుక నీ మహిష ప్రభు విట్టి వరము కోరుకొనెను. అందులకే నేను స్త్రీ రూపము దాల్చి యీ కార్యము సాధింపవచ్చితిని. ఇంక నీ శాస్త్రవిరుద్ధములైన వాక్యములకు నేనేల భయపడుదును? దైవము ప్రతికూలమైనచో వజ్రముగూడ మెత్తని దూదిపింజెగ నగును. చావు దాపురించినవానికి విపుల సైన్యములు-ఆయుధములు-గట్టి దుర్గరక్షణ-యెన్ని యున్ననేమి ఫలము? 

ఈ జీవకోటికి దేహసంబంధముండునంతవఱకు కాలయోగమున సుఖదుఃఖములు-చావు మున్నగునవన్నియును గలుగుచుండును. ఎవని చావు దైవ నిర్మితమై యెట్టులుండునో యట్టుల జరుగును. కాని, వేరు విధముగ జరుగదు. బ్రహ్మాదులకు సైతము చావుపుట్టుకలు తప్పవు. అట్లే నీకును చావు తప్పదు. ఇంక వేరుగ చింతింప నేటికి?

మరణశీలురైన ప్రాణులు వరగర్వముతో క్రొవ్వి మేము చావమని తలంతురు. అట్టివారిని మూఢులు మందమతులు ననవలయును. నీవిపుడు నీ రాజు చెంత కేగుము. వేగమే నా మాటలన్నియు నతనికి దెలుపుము. పిదప నీ రాజాజ్ఞాపించినట్లు నీవు చేయవలయును. అతనికి ప్రాణముల తీపి యున్నచో పాతాళ మేగవలెను. ఇంద్రుడు స్వర్గమలంకరించును. సురకోటులు హవిర్భాగములు గొందురు. 

దురాత్ముడగు మూఢ మహిషుని బుద్ధి దీనికి భిన్నముగ నున్నచో చావునకు నాతో యుద్ధము చేయుమనుము. ఒకవేళ విష్ణువు మున్నగు దేవతలును సంగరమునుండి పారిపోయిరని దలతువేని దానికి కారణము బ్రహ్మవరము-దైవబలము నని యెఱుగుము. 

శ్రీదేవి హితములు విని దానవుడిట్లు తలపోసెను : నేనిపుడు రణ మొనర్పవలయునా? లేక రాజు చెంత కేగవలయునా? నా రాజు కామాతురుడు - నే నతని పెండ్లి జరిపించుట కాజ్ఞాపింపబడితిని. ఈ రీతిగ రసభంగ మెనర్చి తిరిగి యతని దరికే మొగము పెట్టుకొని వెళ్ళగలను? ఐనను కయ్యమునకు కాలు త్రవ్వక వచ్చిన దారినే వెళ్ళి రాజున కన్నియు నివేదించుట తగిన యాలోచన మని నేను దలతును. 

నా రాజు కార్యకుశలుడు. ధీమంతులలో శ్రేష్ఠుడు. కనుక నతడు కుశలురగు మంత్రులతో చక్కగ నాలోచించి చేయగలడు. ఆమెతో తొందఱపాటుతో పోరాటము సలుపరాదు. ఈ సమయమున రాజునకు జయాపజయములు ప్రియములుగావు. నే నా సుందరిని చంపినను నామె నన్ను చంపినను నా రాజునకు నా మీదనే కోపము వచ్చును. కావున నే నచ్చటికే వెళ్ళి దేవి పలికన మాటలన్నియును రాజుతో బలుకుదును. అతడు తనకు దోచినట్లుగ చేయగలడు అని యాలోచించుకొని తెలివిగల యా మంత్రి నత రాజు చెంతకేగి చేతులు జోడించి యతని కిట్లనియెను :

'రాజా! ఆ సుందరాంగి యష్టాదశ భుజములతో దివ్యాయుధములతో సింహవాహనముపై విరాజిల్లుచున్నది. ఆమెతో నేనిట్లంటిని : 

భామినీ! ఆ మహిషుని సేవింపుము. త్రైలోక్యపతి యగు మా రాజునకు ముద్దులపట్టమహిషిని గమ్ము. నీవు పట్టపుదేవి వగుటలో నెట్టి సందియమును లేదు. అతడు నీ చెప్పుచేతల నుండగలడు. మహిషుని పతిగ బడసి ముల్లోకముల సంపద లనుభవించి స్త్రీలలో సౌభాగ్యవతివి గమ్ము అను నా యీ మాటలు విని యా విశాలాక్షి గర్వమోహమున పెద్దగ నవ్వుచు నాతో నిట్లు పలికెను : 

'వాడు మహిషి కడుపు చెడపుట్టినవాడు. పశువులలో నధమాధముడు. నేను వానిని దేవతల మేలుగోరి ఆ పరాదేవతకు బలిపశువుగ నర్పింతును. ఓరీ మూఢా! మందమతీ! ఏ మానిని మహిషుని పతిగ గోరునురా? నావంటి సాధ్వి పశు భావమెట్లు పొందునురా? ఓరి శఠా! మహిషికి కొమ్ములుండును. అది తనవలె శృంగములు కల మహిషమును పతిగ కామించును. దానితో నా కెక్కడి పోలికరా? నీవు సురవైరివి. నిన్ను రణమున సమూలముగ హతమార్తును. నీకు బ్రదుకుపై నాస యున్నచో నిపుడే పాతాళమున కేగుము అని మదవతియగు ఆ యువతి నాతోపరుషముగ బల్కినది. అది విని నేనెంతయో విచారించి తుదకు నీ దరి చేరితిని. రసభంగ మగునేమో యని నేను పోరునకు దిగలేదు. మీ యానతి లేకూరకేల యుద్ధమునకు యత్నింపవలయును? ఆ భామిని తన మహా తేజో మహిమచే నున్మత్తురాలుగనున్నది. ముందెట్లు జరుగునో కాని భవితవ్యము నర్ణయింపలేము. ఈ విషయము నిర్ణయింప నీవే సమర్థుడవు. ఈ యాలోచనము కఠినమైనది. ఇపుడు యుద్ధమో-పలాయనమో-రెంట నేది మంచిదో నిర్ణయింపలేకున్నాను.

అధ్యాయము 98 మహిషుడు దేవికడకు రాయబారులను పంపుట

No comments:

Post a Comment