Sunday, April 26, 2026

Hari Varshamu - హరి వర్షము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - హరి వర్షము

శ్రీనారాయణు డిట్లనెను: ఇక హరి వర్షము నందు యోగయుక్తుడు భక్తానుగ్రహకారకుడు పాపనాశనుడు నగు లక్ష్మీనరసింహ భగవానుడు నెలకొని యుండును. అచటి ఆ నరసింహస్వామి దివ్యరూపము సందర్శించి విష్ణుగుణతత్త్వ మెఱింగిన యసురుడగు ప్రహ్లాదభాగవతోత్తముడు భక్తితత్పరత నిట్లు సంస్తుతించును. 

ప్రహ్లాదు డిట్లనును : నరసింహ భగవానునకు నమస్కారము. తేజస్సునకును తేజస్సగు దేవునకు నమస్కారము. అతిప్రకటుడవు గమ్ము. ఓ వజ్రదంష్ట్రా! మా వాసనలు నిర్దహించుము. మాయజ్ఞానమును మ్రింగుము మ్రింగుము. నాయందభయము నెలకొనుగాత: సర్వ విశ్వమునకు మేలగుత! దుష్టుడు శిష్టుడగు గాక ! ఎల్ల భూతములు సహయోగముతో శుభమును ధ్యానించు గాత ! మనస్సు భద్రము గోరుత ! అధోక్షజునందు నా నిర్హేతుకమైన మతి తగుల్కొనుత! నాకు భార్యా-గృహ-పుత్ర-ధన-బంధులందు సంగము లేకుండుత! ఏ ప్రొద్దును పరమ భాగవతోత్తముల సత్సాంగత్యము గల్గుత ! 

ఆత్మవంతుడు తన ప్రియ ప్రాణములను హరియందే నిల్పి యత్యానందమున రసమోదమొందును. ఇంద్రియ విషయలోలు డాత్మసుఖమునకు నోచుకొనడు. పుణ్యతీర్థములందు మాటిమాటికి గ్రుంకినచో నొడలి మురికిపోవును. హరిభక్తుల సత్సంగతియను దివ్యతీర్థసంగమున హరికీర్తనలు చెవులకు సోకినంతనే మనస్సులోని వాసనలనెడు మురికి తొలగును. అట్టి పుణ్యతీర్థుడగు హరి నెవడు సేవింపకుండును ! ఎవ్వానికి భగవానునందకించన (నిర్వ్యాజ) భక్తిపాదుకొనునో యట్టి మహనీయుని సురగణములును భుజించుచుండును. 

సువిమలతీర్థుడగు విష్ణునందు నిర్మలభక్తిలేనివానికి సుగుణములబ్బవు. అట్టివాడు బయటి విషయమనో రథములను వెంటాడును. శ్రీహరియే సాక్షాత్తుగ భగవంతుడు. చేపలకు నీరువలె నారాయణుడెల్ల ప్రాణులకు జీవనాధారము-జగదీశుడు-ప్రభువు. అంతటి మహాత్ముని వదలి గృహములందు తగుల్కొన్న దంపతుల బ్రదుకు నిరర్థకము. కనుక రజో రాగములు-విషాద భయములు-కోపమానములు-దైన్యము-స్పృహ-మున్నగువానికి నెలవగు నీ సంసారచక్రవాళమగు నింటిని వదలి శ్రీనరహరి దేవపదనులు గొల్చువారికి భయమెక్కడిది? 

ఇట్లు ప్రహ్లాదుడు. భక్తుడు పాపగజహరియును హృదయకమల విహారియునగు శ్రీహరిని పరమభక్తితో రేయింబవళ్ళు సంస్తుతించును. 

ఇంక కేతుమాలవర్షమున శ్రీహరి మన్మథరూపమున చెన్నొందుచుండును. అతడా వర్షమందలి భక్తులచేత నిత్య పూజలందుకొనును. కడలిరా పట్టియగు లక్ష్మీదేవి యచటి భక్తుల కోర్కులు దీర్చుచు శ్రీహరి నిట్లు సంస్తుతించుచు నుపాసించుచుండును.

రమ యిట్లనును : హృషీకేశ భగవానునకు-సుగుణ లక్షణలక్షితుడగు సర్వాత్మునకు క్రియాజ్ఞానసంకల్ప విశేషణముల కధిపతికి -షోడశకళాత్మునకు-ఛందోమయునకు-అన్నమయునకు - అమృతమయునకు-సర్వమయున కోజోమయునకు-బలకాంతి కామయుతునకు-భగవానునకు నమస్కారములు. లోకమందు స్త్రీలు వ్రత నియమములతో విశ్వపతి హృషీకేశుడు నగు హరి నారాధించియు నితరుని గొలిచినచో నట్టి స్త్రీలను వారి భర్తలుగాని సంతతిగాని గాపాడజాలరు. ఏలన వారు ధన సంపాదనమున నాయువున స్వతంత్రత లేనివారు.

స్వయముగ భయము లేనివాడును ఇతరుల భయము బాపువాడును నిజమైన పతి యనబడును. భగవానుడొక్కడే నిజమైన పతి. ఇతరులు స్వార్థము తప్ప వేరు తలంపరు. స్త్రీలు నీ పాదకమలములను నిష్కామముగసేవింతురు. అంతే కానివారు విషయలంపటలే నిన్ను గొల్వరు. వారు ఫలమాశించి నిన్ను సేవించినచో ఫలబోగము తర్వాత భగ్నకాములై మరల బాధలు పడుదురు. నా దయకొఱకు బ్రహ్మ-శివుడు-సురాసురులు-విషయకామరతితో ఘోరముగతపింతురు. కాని అజితా! నేను నీహృదయకమలమందు నెలకొనియుండుటవలన నీ దివ్యపదపద్మ పరాయణులుగాని వారికి నేను లభింపను. 

ఓ యచ్యుతా ! సర్వపతీ! నీవు భక్తులచేత నుతింపబడి వరదాయకమగు నీకరకమలము వారికి చేయూతగా నందింతువు. అట్టిచేయి నాపై నుంచుము. నన్ను నీ వక్షఃస్థలమున ధరింతువు గదా ! ఈశ్వరుడవగు నీ మాయాచేష్టలెవడెఱుగ గలడు! ఇట్లు త్త్రైలోక్యకుటుంబినియగు లచ్చి వరేణ్యుడగు హరిని సంస్తుతి సేయుచుండును. అట్లే యావర్షమందలి వారును కోర్కులు తీరుటకు శ్రీహరిని సన్నుతిజేయుదురు.

ఇక రమ్యకవర్షమునందున్న మత్స్యమూర్తి దేవాసురులచేత పూజింపబడుచుండును. అచటి యర్చామూర్తిని మను వీరీతిగ నిరంతరను పూజించుచుండును.

విశ్వాగ్రణి-మహాసత్త్వడు-ఓజస్వి-మహోజ్జ్వలుడు-ప్రాణబలుడు-నగు మత్స్యభగవానునకు నమస్కారములు. ఏ దేవుడు లోన బయటనే లోకపాలురకు సైతము కానరాక మహావిక్రమముతో విహరించునో యట్టి యీశ్వరుడవు నీవు. నీ వీ విశ్వమును జంత్రగాని చేతి కీలుబొమ్మవలె నాడింతువు. లోకపాలు రహంకారరోగపీడితులై నిన్ను వదలినచో వారికి గతి లేదు. 

వారందఱొక్కటిగ కలిసియును ద్విపాత్‌-చతుష్పాత్తులను సరీసృపములను కనబడు స్థావర జంగమములనెల్లను రక్షింపజాలరు. యుగాంతమైనప్పు డువ్వెత్తుగలేచు సంద్రము కెరటాలపైని నీవు విహరింతువు. ఈ సకలౌషధులు తీగలు గల భూమిని నన్నును మహాపరాక్రమముతో దాల్చితివి. అంతటి విశ్వ ప్రాణాత్మకుడవగు నీకు నాప్రణామములు. ఈ విధముగ సంశయ నివారకుడు దేవేశుడు మత్స్యావతారుడునగు శ్రీహరిని నరదేవుడగు మనువు సంస్తుతించును. 

ఈ ప్రకారముగమహాభాగవతోత్తముడగు మనువు శ్రీహరిధ్యానమున కల్మషములు పాసి పరమభక్తితో శ్రీపతిని సేవించుచు కాలము గడపుచుండును.

హిరణ్మయ వర్షము






No comments:

Post a Comment