హిరణ్యగర్భతనయా! సూర్యవంశంలో సగరుడు అనే మహారాజు ఉన్నాడు. అతడికి వైదర్భి శైబ్య అని ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు. వైదర్భి సంతానం కోనం శివుణ్ణి ఆరాధించింది. శివుడి అనుగ్రహంతో గర్భిణి అయ్యింది. నూరేళ్ళు మోసి ఒక మాంసపిండాన్ని ప్రసవించింది. ఆ పిండాన్ని చూసి వైదర్భి చలించిపోయింది. దారుణంగా విలపిస్తూ శివుణ్ణి ధ్యానించింది. శివుడు బ్రాహ్మణరూపంలో వచ్చి ఆ పిండాన్ని ఆరవైవేల తునకలు చేసి ప్రాణాలు పోశాడు. అందరూ మహాబలపరాక్రమసంపన్నులైన పుత్రులు అయ్యారు. ఒక్కొక్కడూ గ్రీష్మమార్తాండుడిలా ప్రజ్వరిల్లుతున్నారు. ఒకనాడు కపిలనుహార్షి శాపంవల్ల అందరూ భస్మమైపోయారు. సగరుడు దుఃఖం పట్టలేక రాజ్యం వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయాడు గంగానదిని ఆ భస్మరాశులపై ప్రవహింపజేస్తే తన సోదరులు సజీవులవుతారని తెలుసుకున్న అసమంజుడు గంగాదేవికోసం తపస్సు ప్రారంభించాడు. లక్ష సంవత్సరాలు తపస్సు చేసి కాలధర్మం చెందాడు. అతడి కొడుకు అంశుమంతుడు ఇదే దీక్షతో తపస్సు కొనసాగించాడు.
అతడూ ఒక లక్ష సంవత్సరాలు తపస్సు చేసి గతించాడు. అటుపైని అతడి పుత్రుడు భగీరథుడు తపస్సు చేశాడు. ఇతడికి శ్రీకృష్ణుడు కోటిసూర్యప్రభలతో దర్శనమిచ్చాడు. ద్విభుజుడై మురళీ ధరుడై కిశోరగోపవేషంలో త్రిమూర్తి సంస్తుతుడై దర్శనమిచ్చిన ఆ స్వేచ్చామయపరబ్రహ్మను పరిపూర్ణతమ ప్రభువును చిరునవ్వులు చిందిస్తున్న ఆ నిర్లిప్త నిర్గుణ పరప్రకృతిని చూస్తూనే భగీరథుడు మోకరిల్లి భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. తన వాంఛితాన్ని విన్నవించాడు. సగరపుత్రులను ఉద్ధరించి వంశాన్ని తరింపజెయ్యమని ప్రార్థించాడు.
అప్పుడు శ్రీ కృష్ణపరమాత్మ గంగాదేవిని ఆజ్ఞాపించాడు. హే గంగే! సరస్వతీశాపం ఉందికదా! వెంటనే బయలుదేరి భారతభూమికి అవతరించు. సగరపుత్రులను ఊద్ధరించు. ఇది నా ఆజ్ఞ. నీ నీరు సోకినా నీ గాలి తాకినా అందరూ పరిపూతులవుతారు. కోటిజన్మార్జితాలైన పాపాలు నశిస్తాయి. నా రూపాలు పొంది నాలోకంలో విహరిస్తారు. మౌసలస్నానం చేస్తే చాలు బ్రహ్మహత్యాది మహాపాతకాలుకూడా అంతరిస్తాయి. పుణ్యాహస్నానానికి ఉన్న ఫలమెంతో వేదాలుకాదు త్రిమూర్తులైనా చెప్పలేరు. సామాన్య దివసస్నానంకన్నా మౌసలస్నానం వల్ల పుణ్యం పదింతలు ఎక్కువ లభిస్తుంది. సూర్యసంక్రమణం నాడు గంగాస్నానం చేస్తే ముప్ఫయిరెట్లు అధికంగా పుణ్యం వస్తుంది. అమావాస్యనాడైనా అంతే. దక్షిణాయన పుణ్యదినాన చేస్తే ద్విగుణంగా పుణ్యం చేకూరుతుంది. ఉత్తరాయణకాలంలో అయితే పదిరెట్లు అధికపుణ్యం. చాతుర్మాస్యదీక్షలో పున్నమినాడయితే అనంతంగా లభిస్తుంది. అక్షయ పుణ్యదినాన అక్షయపుణ్యమే. ఉగాది మాఘసప్తమి భీష్మాష్టమి అశోకాష్టమి హరినవమి సూర్యచంద్రగ్రహణాల రోజున పట్టు విడుపుల నమయాలలోనూ చేసే గంగాస్నానాలు అశేష పుణ్యప్రదాలు. గంగా! ఇవి నీకు నేను ఇస్తున్న వరాలు - అని చెప్పి శ్రీకృష్ణుడు విరమించాడు.
ఈ మాటలు విన్న గంగాదేవి సవినయంగా తన సందేహాన్ని వెలిబుచ్చింది. నాథా! సరన్వతీశాపం వల్లనైతేనేమి ఈ రాజేంద్రుల తపన్సువల్లనైతేనేమి నీ ఆజ్ఞమేరకు నేను భరతభూమికి వెడతాను. బాగానే ఉంది. అయితే నేను అక్కడ ఎంతకాలం ఉండాలి? మళ్ళీ నీ సన్నిధికి రావడం ఎప్పుడు? పాపాత్ములందరూ వచ్చి నాలో మునిగి పాపాలు సమర్పిస్తూంటే నాకు వాటినుంచి విముక్తి ఎలాగ? ఇంకా నా మనస్సులో ఉన్న సంశయాలేమిటో అన్నీ ఎరిగినవాడవు. నువ్వే తగిన ఉపాయం ఉపదేశించు - ఆంది.
గంగాదేవి! నీ వాంఛితమేమిటో నాకు తెలుసు. ద్రవరూపంలో భూమికి అవతరిస్తున్న నీకు అక్కడ సముద్రుడు భర్త అవుతాడు. సముద్రుడు నా అంశావతారమే. నువ్వు లక్ష్మీస్వరూపిణివే. నెరజాణకు నెరజాణ దొరకడం ఆనందదాయకమేకదా! భారతభూభాగాన సరస్వతీ ప్రభృతి నదులు ఎంతకాలం ఉంటాయో అంతకాలమూ నువ్వూ వారితోపాటు సౌభాగ్యసంపదలతో ఉంటావు. దేవీ! ఈనాటినుంచి కలియుగంలో అయిదువేల సంవత్సరాలు గడిచేవరకూ నువ్వు భారతావనిలో ఉండక తప్పదు. నిత్యమూ నీకు సముద్రుడితో రహస్య సంగమం జరుగుతూనే ఉంటుంది. అతడు రసికుడు, నువ్వు రసికవు.
భారతీయులందరూ నిన్ను భాగీరథిగా స్తుతిస్తారు. అర్చిస్తారు. కణ్వశాఖోక్తపద్ధతిలో ధ్యానిస్తారు, పూజిస్తారు. నిన్ను స్తుతించిన వారికి అశ్వమేథఫలం లభిస్తుంది. స్తుతించలేక దర్శించలేక యోజనాల దూరంనుంచే గంగా! గంగా! అంటే చాలు అతడు పాపవిముక్తుడై వైకుంఠం చేరుకుంటాడు.
వెయ్యిమంది పాపాత్ములు నీలో మునగనీ. ఒక్క విష్ణుభక్తుడు మునిగితే చాలు నువ్వు మళ్ళీ పరిపూతవు అవుతావు. ఎన్ని శవాలు నీలో తేలినా విష్ణు మంత్రోపాసకుడి స్నానంతో పాపప్రక్షాళన అవుతుంది. దోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వు అఘమోచనకు అధిష్టాత్రివి. నిన్ను తలుచుకుంటూ ఏ నదిలో ఏ రేవులో మునిగినా అది గంగాతీర్థమే అవుతుంది. నీ రేణువు సోకితే చాలు మహాపాతకికూడా పరిపూతుడవుతాడు. జ్ఞానులు నా నామాన్ని జపిస్తూ నీలో మునిగి ప్రాణాలు వదిలితే సరాసరి నా సాయుజ్యం పొందుతారు. నాకు శాశ్వతంగా పార్షదులవుతారు. ఎంతో పుణ్యం చేసుకున్నవాడి శవమే నీలో కలుస్తుంది. అతడు సరాసరి వైకుంఠం చేరుకుంటాడు. అతడికి సారూప్యం ఇచ్చి పార్షదుణ్ణి చేసుకుంటాను. తెలియక ఆజ్ఞానంతో నీలో మునిగినా నీలో ప్రాణాలు విడిచినా అతడికీ సాలోక్యం ఇస్తాను. పార్షదుణ్ణి చేస్తాను. నీపేరు జపిస్తూ ఎక్కడ ప్రాణాలు విడిచినా వారికికూడా శాశ్వతంగా సాలోక్యం అనుగ్రహిస్తాను. రత్నాల పల్లకీలో గోలోకానికి తోడ్కొని వెడతాను. నా మంత్రాన్ని ఉపాసించేవారూ నాకు నివేదన చేసి భుజించేవారూ ముల్లోకాలనూ పవిత్రం చెయ్యగల సమర్థులు. వారినీ ఇలాగే రత్నాలపల్లకిలో గోలోకానికి తీసుకువెడతాను. వారి బంధువులూ వారి పెంపుడు జంతువులూ వారి సేవకులూ అందరికీ ఇదే మన్నన జరుగుతుంది.
ఇలా శ్రీకృష్ణుడు గంగాదేవిని ఊరడించి భగీరథా! ఈ గంగాదేవిని భక్తితో స్తుతించు. శ్రద్ధతో అర్చించు అన్నాడు. భగీరథుడు భక్తిశ్రద్దలతో స్తుతిపూజనలు నిర్వహించాడు. కాథుమశాఖోక్తంగా సామవేద మంత్రాలతో మళ్ళీ మళ్ళీ స్తుతించాడు. శ్రీకృష్ణపరమాత్మనూ స్తుతింతి ప్రణమిల్లాడు. గంగాదేవీ స్తుతించి నమస్కరించింది. శ్రీకృష్ణుడు ఆంతర్జానం చెందాడు - అని నారాయణమహర్షి చెప్పగానే, భగీరథుడు చేసిన పూజావిధానాన్నీ స్తుతినీ తెలియజెప్పమని నారదుడు అభ్యర్థించాడు.
నారదా! భగీరథుడు స్నానంచేసి ధౌతవస్త్రాలు ధరించి శుచిగా నిత్యక్రియలు అనుష్టించి ఏకాగ్ర చిత్తంతో భక్తితో దేవషట్కాన్ని ఆరాధించి అప్పుడు గంగాదేవిని స్తుతించాడు. విఘ్నవినాశం కోనం గణేశ్వరుణ్ణి, ఆరోగ్యంకోసం సూర్యుణ్ణి, శౌచంకోసం అగ్నినీ, లక్ష్మికోసం విష్ణువునూ, జ్ఞానంకోసం శివుణ్ణి ముక్తికోసం శివానినీ పూజించాలి. ఈ ఆరుగురు దేవతలనూ ముందుగా పూజించినవాడికే ఏ పూజ చెయ్యడానికైనా అధికారం లభిస్తుంది. లేకపోతే విషమఫలితాలు తప్పవు.
కణ్వశాఖోక్తమైన గంగాధ్యానం పాపప్రణాశకం. గంగాదేవి తెల్లకలువలాగా ఉంటుంది. కృష్ణమూర్తి నుంచి ఆవిర్భవించింది. కృష్ణతుల్య. అగ్నిజ్వాలలాంటి ఆంశుకాన్ని ధరిస్తుంది. రత్నభూషణాలు ఆలంకరించుకొంటుంది. ఒక్కసారిగా శరత్పూర్ణిమా చంద్రబింబాలు నూరు ఉదయించినంత ఆహ్లాదకరంగా ఉంటుంది. చిరునవ్వులు పండిస్తూ ఉంటుంది. ఎప్పుడూ యౌవనంలోనే ఉంటుంది. నారాయణప్రియ, శాంతన్వరూప, సౌభాగ్యసమన్విత, విశాలమైన కబరీభారం అందులో మాలతీపుష్పమాలికలు. చెక్కిళ్ళమీవ సిందూర చందన కస్తూరీ బిందువులతో మకరికా పత్రాలంకరణ. దొండపండుల్లాంటి పెదవులు. ముత్యాలకోవలాంటి పలువరుస. అందమైన ముఖం. అందమైన బొట్టు. అందమైన కన్నులు. క్రీగంటి వాలుచూపులతో మరింత మనోహరంగా ఉంటుంది. ఉన్నతమైన వక్షఃస్థలం. విశాలమైన జఘనభాగం. మెట్టతామరలవంటి పాదాలు. వాటికి రత్నపాదుకలు. లత్తుకతో పారాణి దిద్దిన పాదాలు. దేవేంద్రుడి శిరస్సుమీద ఉన్న మందారపుష్పం నుంచి జారిపడిన ఎర్రని మకరంద బిందువుతో పారాణి దిద్దుకున్నట్టుంటుంది.
సురసిద్ధమునింద్రగణాలు సమర్పించిన అర్ఘ్యలతో ఆర్ద్రంగా ఉండే పాదపద్మాలు. తపస్వుల శిరస్సులు అనే తుమ్మెదలు బారులుతీరి మూగే పాదపద్మాలు. ముముక్షువులకు ముక్తిప్రదాలు. బుభుక్షువులకు భోగప్రదాలు. వరేణ్య, వరద, భక్తానుగ్రహకారిణి. శ్రీ విష్ణుపదదాత్రి. విష్ణుపది. అటువంటి గంగాదేవికి నమస్కరిస్తున్నాను - అనే ధ్యానశ్లోకాలతో ఆ త్రిపథగను ధ్యానించాలి. షోడశోపచారాలు చెయ్యాలి. ఆసన - పాద్య - అర్ఘ్య - స్నాన - అనులేపన - ధూప - దీప - నైవేద్య - తాంబూల - శీతోదక - వసన - భూషణ - మాల్య - గంధ - ఆచమనీయ - తల్ప సమర్పణలు షోడశోపచారాలు.
వీటిని చేసి భక్తితో సాష్టాంగనమస్కారం చెయ్యాలి. ఇలా పూజ చేస్తే అది అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది. నారదా! ఇరవైయొక్క శ్లోకాలలో విష్ణుమూర్తి చేసిన గంగాస్తవం మరింత పుణ్యప్రదం. ఆలకించు -
శివుడి సంగీతానికి పరవశించిన విష్ణుమూర్తి శరీరంనుంచి ఆవిర్భవించింది. రాధాశరీరంనుంచి జాలువారిన జలంతో వరదగట్టింది. సృష్టికన్నా ముందు గోలోకంలో రాసమండలంలో శంకరుడి సన్నిధానంలో జన్మించింది. గోపగోపీజనంతో కోలాహలంగా జరుగుతున్న రాధామహోత్సవంలో కార్తిక పూర్ణిమ రోజున అవతరించింది. కోటియోజన విస్తీర్ణమూ అంతకన్నా లక్షరెట్లు పొడుగూ ఉండి గోలోకమంతటా వ్యాపించిన గంగమ్మకు వందనాలు.
ఆరవైలక్షల యోజనాల విస్తీర్ణమూ అంతకు నాలుగురెట్లు పాడవూగా వైకుంఠంలో వ్యాపించిన గంగమ్మకు దండాలు. ముప్పయి లక్షల యోజనాల విస్తీర్ణమూ అంతకు అయిదు రెట్లు పాడవుగా బ్రహ్మలోకంలో ప్రవహించే గంగమ్మకు ఏటికోళ్ళు. అంతే విస్తీర్ణమూ అంతకు నాలుగురెట్లు పాడవుతో శివలోకంలో సంచరించే గంగమ్మకు నమస్సులు. ఇలాగే ధ్రువలోక - చంద్రలోక - సూర్యలోక - తపోలోక - జనలోక - మహర్లోక - కైలాస - ఇంద్రలోక - పాతాళలోకాలలో ప్రవహించే గంగాదేవికి నమోవాకాలు. ఇంద్రలోకంలో మందాకినిగా పాతాళంలో భోగవతిగా కీర్తింపబడే గంగాభవానికి నమస్కారాలు. ఒక క్రోశమాత్ర విస్తీర్ణంతో అక్కడక్కడా ఇంకా క్షీణించి అలకనందగా భూలోకంలో ప్రవహించే గంగమ్మకు డింగిడీలు.
సత్యయుగంలో పాలనురువులాగా, త్రేతాయుగంలో వెన్నెలలాగా, ద్వాపరయుగంలో మంచిగంధంలాగా, కలియుగంలో నీళ్ళలాగా, స్వర్గంలోమాత్రం అన్నియుగాల్లొనూ పాలలాగా ప్రవహించే గంగమ్మకు నతులు. గంగా జలకణాన్ని రవ్వంత స్పృశిస్తే చాలు పాపాత్ములకుకూడా జ్ఞానోదయమవుతుంది. కోటి జన్మల పాపాలు నశిస్తాయి, బ్రహ్మహత్యామహాపాతకంకూడా అంతరిస్తుంది.
నారదా! ఈ గంగాలహరిని (లహరి = స్తోత్రం) నిత్యం భక్తితో పఠించి గంగమ్మను అర్చించినవారికి అశ్వమేధయాగఫలం దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అవివాహితులకు వివాహమవుతుంది. రోగులకు ఉపశమనం రోగవిముక్తి లభిస్తాయి. మూర్ఖుడుకూడా పండితుడవుతాడు. యశస్వి అవుతాడు. ప్రాతఃకాలంలో పఠిస్తే దుఃస్వప్నదోషాలు నశిస్తాయి. గంగాస్నానఫలం దక్కుతుంది.
శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం భగీరథుడు ఇదే స్తోత్రాన్ని చేసి గంగానదిని తన వెంట తీసుకువెళ్ళాడు. సగరపుత్రుల చితాభస్మాలమోద ప్రవహింపజేశాడు. వెంటనే వారందరూ వైకుంఠానికి చేరుకున్నారు. భగీరథుడు తెచ్చాడు కనక అప్పటినుంచీ ఈ నదికి భాగీరథి అనే పేరు ఏర్పడింది. బ్రహ్మనందనా! ఇది గంగావతరణ గాథ. పుణ్యప్రదం, మోక్షప్రదం. ఇంకా ఏమేమి కథాసారాలు తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను - అని ముగించాడు నారాయణ మహర్షి
No comments:
Post a Comment