Tuesday, May 5, 2026

Tulasi Sankha Chudula Sanvadam - తులసీ - శంఖచూడుల సంవాదం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - తులసీ - శంఖచూడుల సంవాదం

అంతలోకీ శంఖచూడుడు అనే తరుణవయస్కుడు అటువైపు వచ్చాడు. పుష్కరక్షేత్రంలో జైగీషవ్యుని ఉపదేశంపై నిష్ఠగా తపస్సుచేసి శ్రీకృష్ణ మహామంత్రంవల్ల సిద్దుడైన యోగీశ్వరుడతడు. సర్వమంగళ ప్రదమైన కవచాన్ని కంఠసీమలో హారంగా ధరించి బ్రహ్మదేవుడి ఆజ్ఞమేరకు అక్కడికి వచ్చాడు. మనోవాంఛాసిద్ధిరస్తు - అని విరించి వరమిచ్చి ఆశీర్వదించి మరీ పంపించాడు.

తనవైపు నడిచివస్తున్న శంఖచూడుణ్ణి చూసింది తులసీదేవి. నవయౌవన సంపన్నుడు. సాక్షాత్కరించిన మన్మథుడు. సంపెంగ పువ్వులాగా ఉన్నాడు. రత్నభూషణభూషితుడు. శరత్పూర్ణిమనాటి చంద్రబింబంలాంటి ముఖం శరత్పంకజాల్లాంటి కన్నులు. దివ్యరత్నవిమానం నుంచి దిగివస్తున్నాడు. కదలాడుతున్న రత్నకుండలాల కాంతులు చెక్కిళ్ళ పై లాస్యం చేస్తున్నాయి. అలంకరించుకున్న పారిజాత పుష్పమాలికల పరిమళాలు బహుపరాకులు పలుకుతున్నాయి. చిరునవ్వులు చిందిస్తున్నాడు. నొసటనున్న బొట్టు కస్తూరీచందనగంధాలను వెదజల్లుతోంది. మదగజగమనంతో ఆ మనోహరుడు చేరువకి వచ్చి నిలబడ్డాడు.

తులసీదేవి తానెప్పుడు లేచి నిలబడిందో తనకే తెలియలేదు. మేలిముసుగులో ముఖం దాచుకుని తలవంచి చిరునవ్వులు చిందిస్తూ కాలికొనగోట నేలను గీరుతూ క్రీగంట పులుకుపులుకున తిలకిస్తూ పులకించిపోతోంది.

శంఖచూడుడు తులసీదేవిని సన్నిహితంగా చూశాడు. శరచ్చంద్రుణ్ఞి నిందించే ఆమె ముఖం. మాలతీపుష్పమాలికలు అలంకరించిన కబరీభారం. రత్నాలు పొదిగిన అమూల్య విచిత్ర కుండలాలు. ఆ కాంతులలో బుగ్గలు మరీ మెరిసిపోతున్నాయి. రత్నతారహారాలు పీనోన్నతవక్షఃస్తలంమీద నిట్టూర్పులకు కదలాడుతున్నాయి. రత్నకంకణాలు. రత్నకేయూరాలు. చిన్ని చిన్ని సంకులు కూర్చి కట్టిన దండ. (సంకువు = శంఖం). అన్నివేళ్ళకూ రత్నాంగుళీయకాలు. పాదాలకు మణిమయమంజీరాలు. కాలు కదుపుతూంటే మనోహరంగా సవ్వడి చేస్తున్నాయి. లాక్షాలంకృత పాదపద్మాలు. రాసిబోసిన సౌందర్యంలాగా ఉన్న ఆ లలితసుందరమూర్తిని ఆపాదమస్తకం తిలకించాడు. కామభావపరవశుడయ్యాడు. మధురంగా పలకరించాడు.

కల్యాణీ! ఎవరి అమ్మాయివి ? నీపేరేమిటి ? కన్యకామణులలోకెల్లా ధన్యురాలివి, మాన్యురాలివి, సర్వకల్యాణదాయినివిగా కనిపిస్తున్నావు. నేను నీ సేవకుణ్ణి. సుందరీ! దయచేసి సంభాషించి నన్ను అనుగ్రహించు.

కామవాంఛాపరిప్లుతుడై శంఖచూడుడు ఇలా పలకరించేసరికి ఆ వామలోచన తానూ ఆదే పరిస్థితిలో అదే ఉద్దేశంతో ఉంది కనక తలవంచుకునే బదులు పలికింది.

నేను ధర్మధ్వజుడి కన్నకూతిరిని. ఈ తపోవనంలో చాలాకాలం నుంచీ తపన్నుచేస్తూ తపస్వినిగానే ఉంటున్నాను. నువ్వు ఎవరివో! ఇటు ఎందుకు వచ్చావో! నీ దారిన నువ్వు సుఖంగా వెళ్ళు. ఉత్తమ వంశంలో పుట్టిన శీలవతులను ఏకాంతంలో ఇలా పలకరించడం నీవంటి సజ్జనులకు తగదు. ఇది శాస్త్ర విరుద్ధంకూడా,

వేదం తెలియనివాడూ లంపటుడూ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినవాడూ అసత్కులంలో పుట్టినవాడూ మాత్రమే ఇలా ఏకాంతంలో కాముకుడై కామినీమణులతో సంభాషణకు దిగుతాడు. ఆటువంటి పురుషులు మెచ్చుకునేదీ ఇష్టపడేదీ అటువంటి కాంతలనే.

నీకు తెలుసో తెలీదో, అసలు స్త్రీలు అంటేనే పయోముఖ విషకుంభాలు. ఆపాతమధురంగా మాట్లాడతారు. హృదయంలోమాత్రం మదమత్తలై ఉంటారు. వాళ్ళ మనస్సు మంగలికత్తిలా ఉంటుంది. వచస్సు పూలగుత్తిలా ఉంటుంది. తమ కోరికలు తీర్చుకోవడం తప్ప వారికి మరొక ధ్యాస ఉండదు.

పని ఉంది అంటే స్వామికి వశవర్తినులై ఉంటారు. పని తీరిపోయిందంటే తల ఎగరేస్తారు. హృదయంలో మాలిన్యమూ ముఖంలో మాటల్లో ప్రసన్నత వీరి లక్షణం. పురాణగాథలు చూడు. స్త్రీల చరిత్రలు ఎంత దూషితాలో తెలుస్తాయి. అటువంటి స్త్రీలను తెలివైనవాడు ఎవడూ నమ్మడు. నమ్మాడు అంటే వాడు మూర్ఖుడైనా అయ్యుండాలి, దుష్టుడైనా అయ్యుండాలి.

ఆడవారికి హితులూ అహితులూ అని రెండు విభాగాలు ఏమీ ఉండవు. ఎప్పటికప్పుడు కొత్తవాడు కావాలి. అందగాడూ యువకుడూ అయితే చాలు. శత్రువా మిత్రుడా అనే తేడా ఏమీ లేదు.

వీళ్ళు ప్రదర్శించే పాతివ్రత్యమంతా కేవలం బాహ్యాడంబరమే. ప్రయత్నపూర్వకంగా ఆ ప్రదర్శన చేస్తారు. మనసుల్లో నిరంతరం కామవాంఛలే. బాహ్యశరీరాన్ని లోకం కన్నుగప్పడానికి పాతివ్రత్యంతో ఖేదపరుచుకుంటూ అంతరంగంలో మదనక్రీడలు సాగిస్తుంటారు. రహస్యంగా ప్రియుడిమీదకి నవ్వులు రువ్వుతూ బహిరంగంలో సిగ్గరితనం నటిస్తుంటారు.

మైథునం లేనివేళ వీళ్ళకోపానికి అవధులుండవు. సివంగులై కయ్యాలకు దిగుతారు. సుదీర్ఘ సంభోగానికి సంతసిస్తారు. స్వల్పసంభోగానికి దుఃఖిస్తారు. మృష్టాన్నపానీయాదులకన్నా వీరు తహతహలాడేదీ ఆరాటపడేదీ సుందరుడూ రసికుడూ గుణవంతుడూ అయిన యువకుడికోసమే.

రసికుడంటే వీళ్ళకి కొడుకుమీదకన్నా ప్రేమ. సంభోగ కుశలుడైన ప్రియుడు వీళ్ళకి ప్రాణాధికుడు, మగడు ముసలివాడైనా సంభోగచతురుడు కాకపోయినా అతడే వీళ్ళకి ప్రథమశత్రువు. అనుక్షణమూ అతడిని తిట్టిపోస్తూ జగడాలాడుతుంటారు. పెనుసర్పం ఎలకపిల్లను తిన్నట్టు సూటిపోటిమాటలతో దెప్పరాలతో కొరుక్కుతినేస్తుంటారు. స్త్రీ అంటే దుస్సాహసస్వరూప. సర్వదోషాలకూ నిలయం. బ్రహ్మాది దేవతలకుకూడా దుస్సాధ్య. కేవలం మోహస్వరూపిణి. మోక్షద్వారానికి తలుపుచెక్క. తపస్సులకి అడ్డగడియ. విష్ణుభక్తికి అడ్డుపుల్ల. సమస్తమాయలకూ దాపుడుకుండ. సంసారకారాగారంలో ఇనపసంకెల. ఇంతి అంటే అదొక ఇంద్రజాలం. అదొక మిథ్య. అదొక స్వప్నం. పైకి కనిపించే అవయవాలన్నీ ఆందంగానే ఉంటాయి. లోపల అంతటా కుళ్ళే. మలమూత్రసంకులమై దుర్గంధభూయిష్టమై నెలకు మూడునాళ్ళు రక్తసిక్తమై సంస్కారవిరహితమై ఆ రహస్యాంగం కుత్సితంగా ఉంటుంది.

బ్రహ్మదేవుడు మాయావులకోసమని ఈ మాయారూపాన్ని సృష్టించాడు. అందుకే ముముక్షువులు ఈ స్త్రీని విషరూపంగా తిరస్కరిస్తారు. భోగలాలసులు మాత్రం కామవాంఛలతో ఎగబడి అందుకోలేక తృప్తిపాందలేక బోరగిలబడతారు.

నారదా! తులసీదేవి తాను స్త్రీఅయినా ఇంత సుదీర్హంగా స్త్రీనింద చేసింది. మనస్సులో అనురాగం ఉన్నా మాటల్లో కాఠిన్యాన్ని ప్రదర్శించింది. శంఖచూడుడు నిబ్బరంగా బదులు పలికాడు.

దేవీ! నువ్వు అన్నది పూర్తిగా అసత్యమూ కాదు, అలాగని పూర్తిగా సత్యమూ కాదు. సగం అదీ, సగం ఇదీ. కనక నేను చెప్పేదికూడా కొంచం విను.

బ్రహ్మదేవుడు స్త్రీలను రెండు రకాలుగా సృష్టించాడు. కొందరు సుగుణవతులు. కొందరు దుర్గుణవతులు. సృష్టి అన్నాక ఆన్ని రకాలూ ఉంటాయి. లక్ష్మి- సరస్వతి - దుర్గ - సావిత్రి - రాధిక వీరంతా స్త్రీరూప సృష్టికి ప్రథమావతారాలు. సృష్టిసూత్రస్వరూపిణులు. కాబట్టి నిజానికి సృష్టిలో స్త్రీ రూపం వీరి అంశమే. స్త్రీలందరూ వీరి అంశావతారాలే. కనక స్త్రీమూర్తి సర్వమంగళకారకం. శతరూప, దేవహూతి, స్వధాదేవి, స్వాహాదేవి, దక్షిణాదేవి, ఛాయావతి, రోహిణి, వరుణాని, శచి, కుబేరపత్ని, దితి, అదితి, లోపాముద్ర, అననూయ, తులసి, అహల్య, అరుంధతి, మేనాదేవి, తార, మందోదరి, దమయంతి, వేదవతి, గంగ, మనసాదేవి, పుష్టి తుష్టి సతి మేధా దేవతలు, కాళిక, వసుంధర, షష్టీదేవి, మంగళచండీక, ధర్మకామిని, స్వస్తి శ్రద్దా శాంతి కాంతి క్షాంతి దేవతలు, నిద్రా క్షుత్‌ పిపాసా సంధ్యా రాత్రి దేవతలు, సంపత్తి ధృతి కీర్తి క్రియా శోభా శివామూర్తులు - వీరంతా ఉత్తమాంగనలు. పతివ్రతలు. శక్తి స్వరూపిణులు. యుగయుగాలుగా వీరు స్త్రీమూర్తులై అవతరిస్తూనే ఉన్నారు. పవిత్రంగా జీవితాలు గడుపుతూనే ఉన్నారు. కానీ నువ్వన్నట్టు కొందరు పుంశ్చలీరూపిణులూ ఉన్నారు. వారిని నిందించడం తగునుగానీ సత్వగుణ ప్రధానలైన సాధ్వీమణులనుకూడా వారితో సమంగా జమచేసి మొత్తం స్త్రీజాతినే నిందించడం తగదుగాక తగదు.

స్త్రీలలోగానీ పురుషులలోగానీ గుణాధిక్యాన్ని బట్టి ఉత్తమ మధ్యమ అధమ భేదాలు ఏర్పడతాయి సత్త్వగుణ ప్రధానులది ఉత్తమశ్రేణి. రజోగుణులది మధ్యమశ్రేణి. తమోగుణులది అధమశ్రేణి. పండితుడై ఉత్తమవంశంలో పుట్టి సత్త్వగుణ ప్రధానుడైన వాడెవడూ ఎంతటి అవకాశం లభించినా పరస్త్రీ వాంఛించడు.

అయితే అథముడివా, ఇక్కడికి ఇలా ఎందుకు వచ్చావు? అని నువ్వు అడగవచ్చు. నా రాకకు తగినంత కారణం ఉంది. బ్రహ్మదేవుడి ఆజ్ఞమేరకు నేను వచ్చాను. నిన్ను గాంధర్వవివాహం చేసుకుంటాను. నేనే శంఖచూడుణ్ణి. ప్రస్తుతం దానవుణ్ణి. దేవతలకు శత్రువుని. పూర్వజన్మలో గోలోకాన హరి సాన్నిధ్యాన్ని అనుభవించిన సుదాముణ్జి. శ్రీకృష్ణుడికి అత్యంతాప్తులైన ఎనమండుగురు పార్షద గోపకులలో ఒకడిని, రాధికాదేవి శాపంవల్ల ఇప్పుడిలా రాక్షసుణ్ణి అయ్యాను. కృష్ణమంత్రప్రభావంవల్ల జాతిస్మరుణ్ణి. నువ్వూ జాతిస్మరవే. తులసివి. పూర్వజన్మలో శ్రీకృష్ణుని సాహచర్యాన్ని అనుభవించినదానవు. రాధికా శాపంవల్ల భూలోకంలో అవతరించావు.

గోలోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి ఎంతగానో అనురక్తుణ్ణి అయ్యాను. నీ దర్శనంకోపం నీ స్పర్శనంకోసం ఉవ్విళ్ళూరే మనస్సుతో అనుక్షణం పరితపించేవాడిని. అయితే రాధికాదేవికి భయవడి నా అనురాగాన్ని నాలోనే అణుచుకునేవాణ్ణి. దేవీ! నేనెవరో నువ్వెవరో రాధాశాపమేమిటో శ్రీకృష్ణుడి వరమేమిటో బ్రహ్మదేవుడి ఆజ్ఞ ఏమిటో అంతా వివరించాను. ఇక నీ ఇష్టం. నీదయ, నా ప్రాప్తం. - ఆని ముగించాడు శంఖచూడుడు.

తులసీదేవికి సందేహాలు తీరి సంతృప్తి కలిగింది. మరింత విలాసంగా నవ్వుతూ - దానవేంద్రా నీవంటి సజ్జనుడు ఎంతటి ప్రశంసకైనా అర్హుడు. ఇటువంటి అందగాడినే ఏ కాంతామణి అయినా కోరుకుంటుంది. ఇష్టపడుతుంది. నిజానికి ఇప్పుడు నువ్వు బుద్ధికుశలతతో నన్ను ఓడించావు. ఇది సత్యం అందుచేత సర్వాత్మనా అభినంద్యుడివి. ఇలాకాక - రూపవిలాసాలకు సమ్మోహితుడై స్త్రీ  చేతిలో ఓడిపోయి దాసుడుగా మారినవాడు పరమ నింద్యుడు. మిత్ర బంధు దేవగణాలందరూ అతడిని నిందిస్తారు. తల్లీ తండ్రీ సోదరులూ ఆంతా మనస్సులో అసహ్యించుకుంటారు. దూషిస్తారు.

పురుడు మైలలాంటి ఏ అశౌచాలు వచ్చినా బ్రాహ్మణుడు పదిరోజులకీ క్షత్రియుడు పన్నెండు రోజులకీ వైశ్యుడు పదిహేనురోజులకీ శూద్రుడు నెలనాళ్ళకీ శుద్ధిపాందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. స్త్రీజితుడు మాత్రం శ్మశానంలో కట్టెల్లో కాలేదాకా శుద్ధిపాందడు. ఆంతటిది సుమా ఆ అశౌచం. వాడుపెట్టిన పిండాలను పితృదేవతలు ముట్టరు. అతడిచ్చే పాద్యాలనూ నైవేద్యాలనూ దేవతలు స్వీకరించరు. పరస్త్రీ లంపటుడు ఎంత జ్ఞాని అయితేనేమీ ఎంత తపస్వి అయితేనేమీ! అతడి జపమూ తపమూ పూజలూ హోమాలూ చదువులూ పేరూ ప్రఖ్యాతీ అన్నీ వ్యర్థం.

ఈ తెలివిడి ఉన్నదానను కనక నిన్ను పరీక్షిద్దామని స్త్రీనింద చేశాను. నిన్నూ నిష్టురాలు ఆడాను. పరీక్షించకుండా ఏ కామినీ ఎవ్వరినీ వరించదుగదా! కన్యకలేకాదు కన్యాదాతలుకూడా వరుణ్ణి పరీక్షించకుండా పిల్లనిచ్చి పెళ్ళిచేస్తారా? గుణహీనుడు వృద్ధుడు అజ్ఞాని దరిద్రుడు మూర్ఖుడు రోగిష్టి కుత్సితుడు కోపిష్టి దుర్ముఖుడు ఆంగవికలుడు కుంటివాడు అంధుడు బధిరుడు (చెవిటి) జడుడు (చైతన్యం లేనివాడు) మూగవాడు నపుంసకతుల్యుడు పాపాత్ముడు - ఇలాంటి వరుడికి కూతురు నిచ్చినవాడు బ్రహ్మహత్యా మహాపాతకి అవుతాడు. అందుచేత బాగా వాకబుచేసి పరీక్షించి శాంతస్వభావుడూ గుణవంతుడూ యువకుడూ పండితుడూ సజ్జనుడూ అయిన వరుడికే పిల్లను ఇవ్వాలి. ఆలా ఇచ్చి వివాహం జరిపించిన కన్యాదాత పది మహాయజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతాడు.

కూతురిని పెంచి పెద్దచేసి ధనలోభంతో అమ్ముకునేవాడు కుంభీపాకనరకానికి పోతాడు. అక్కడ కన్యామూత్ర పురీషాలు తింటూ పురుగుకాట్లు భరిస్తూ కాకి పోట్లు చవిచూస్తూ - ఇంద్రులు పధ్నాలుగు మంది మారేటంతకాలం నరకయాతన ఆనుభవిస్తాడు. అటుపైని రోగిష్టిగా జన్మించి మాంసం అమ్ముకుంటూ నీచంగా జీవయాత్ర సాగిస్తాడు.

తులసీ - శంఖచూడుల పరిణయం


No comments:

Post a Comment