Sunday, July 26, 2026

Ganapati's vehicle is the mouse - గణపతి వాహనం మూషికం

గణపతి వాహనం మూషికం

పురాణాల ప్రకారం, గంధర్వుడైన క్రౌంచుడు అనేవాడు పొరపాటున వామదేవ మహర్షిని కాలితో తొక్కాడు. దానికి ఆ మహర్షి, క్రౌంచుడుని భూమిపై ఎలుకగా జన్మించమని శపించారు. శాపం వల్ల అతడు చాలా బలమైన, భారీ మూషికంగా మారి యజ్ఞాలు, ఆశ్రమాలు ధ్వంసం చేస్తూ ఋషులను ఇబ్బంది పెట్టేవాడు.

ఒకరోజు ఆ మూషికం గణపతి స్వామి వద్దకు వచ్చింది. తన బలంతో గణపతిని కూడా ఎదిరించాలని ప్రయత్నించింది. కానీ విఘ్నేశ్వరుడు తన పాశాయుధంతో దానిని బంధించాడు. తన శక్తి ముందు తాను ఏమీ కాదని గ్రహించిన మూషికం, గణపతిని క్షమించమని ప్రార్థించింది.

అప్పుడు గణపతి స్వామి దానిని శిక్షించకుండా, "ఇక నుంచి నువ్వే నా వాహనం అవ్వాలి" అని అనుగ్రహించాడు. ఆ క్షణం నుంచి మూషికం గణపతి వాహనంగా మారింది.

రెండో కథ:
ఒకరోజు దేవతలంతా ఇంద్ర సభలో సమావేశమయ్యారు. ఇందులో గంధర్వులు, కిన్నెరలు, అప్సరసలు సైతం పాల్గొన్నారు. ఓ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుండగా, క్రౌంచుడు అనే గంధర్వుడు సభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు. చర్చలో అనేకమంది పాల్గొన్నా, అప్సరలతో పరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు. క్రౌంచుడి తీరును శ్రీమహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించినా అతడు పట్టించుకోలేదు. దీంతో ఇంద్రుడు ఆగ్రహించి, తక్షణమే ఎలుకగా మారమని శపించాడు. తన తప్పును మన్నించమని గంధర్వుడు కోరినా, ఫలితం దక్కలేదు.

మూషికంగా మారిన తర్వాత కూడా తన ప్రవర్తనతో దేవతలకు విసుగు తెప్పించాడు. దీంతో ఇంద్రుడు అతడిని దేవలోకం నుంచి తరిమేయాలని ఆదేశించాడు. భటులు దాన్ని తరిమేయడంతో భూలోకంలో పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమంలోనూ రుషులకు ఇబ్బందులు కలిగించి, ఒకరోజు ఆశ్రమానికి విచ్చేసిన వినాయకుడ్ని విడిచిపెట్టలేదు. విసిగిపోయిన పరాశరుడు అతనిని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుని అడిగాడు. పరాశరుని కోరిక మన్నించిన వినాయకుడు అతడిపై దాడికి సిద్ధమయ్యాడు.

క్రౌంచునిపై వినాయకుడి దాడి
గణేషుడు తన పాశాన్ని మూషికంపై ప్రయోగించగా అది క్రౌంచుని మెడకు చుట్టుకుని ఆయనకు చెంతకు తీసుకొచ్చింది. భయపడిపోయిన క్రౌంచుడు క్షమించమని కోరాడు. క్రౌంచుడిని క్షమించిన వినాయకుడు, మళ్లీ పొరపాటు చేయరాదని హెచ్చరించాడు. అయితే, క్రౌంచుడు తనకు శాపవిముక్తి కలిగించమని ప్రాధేయపడ్డాడు. క్రౌంచుడే మూషికమని తెలుసుకుని, అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు.

ఇంద్రుని శాపానికి తిరుగులేకపోవడంతో మూషికం కూడా అంగీకరించడంతో తన వాహనంగా చేసుకున్నాడు. ఏ కార్యం ప్రారంభించినా ఆదిదేవుడు వినాయకుని పూజించడం ఆనవాయితీ, కాబట్టి గణేశుడితోపాటటు పూజలందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు. దీంతో గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు. ఇక్కడ మరొక సమస్య వచ్చింది. వినాయకుడి బరువును మోయలేను కాబట్టి తేలికగా మారమని కోరాడు. వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి వాహనంగా మారిన సమయాన తన బరువుని మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు.

ఈ కథలోని గొప్ప సందేశం ఏమిటంటే...
మూషికం మనలోని కోరికలు, అహంకారం, చంచలమైన మనసుకు ప్రతీక. వాటిని జయించినవాడే నిజమైన విజేత. అందుకే గణపతి స్వామి మూషికంపై ఆసీనుడై కనిపిస్తాడు.

అంటే మన కోరికలు, అహంకారం మనల్ని నడిపించకూడదు. మనమే వాటిని నియంత్రించాలి అనే ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ కథ తెలియజేస్తుంది.

అందుకే గణపతి స్వామిని పూజించడం అంటే విఘ్నాలను తొలగించుకోవడమే కాదు, మన అహంకారాన్ని జయించి సద్బుద్ధితో ముందుకు సాగాలని సంకల్పించడం కూడా.

No comments:

Post a Comment