Thursday, March 12, 2026

The Story of Prahlada - ప్రహ్లాద చరిత్రము

ప్రహ్లాద చరిత్రము

ఓ ధర్మరాజా! రాక్షస కుమారుడైన ప్రహ్లాదుడు సమస్త జీవులను తనతో సమానంగా భావించేవాడు. పెద్దలు కనిపిస్తే సేవకునిలా వారిని చేరి నమస్కరించే తత్త్వం గలవాడు. ఇతర స్త్రీలు కన్పడ్డ వేళ మాతృభావంతో వారినుండి భక్తితో దూరంగా వెళ్ళేవాడు. దీనులను తలిదండ్రులమాదిరిగా వాత్సల్యంతో ఆదరించేవాడు. స్నేహితులను సోదరులుగా భావించేవాడు. గురువులను దైవాలుగా భావించేవాడు. ఆడే మాటల్లో అసత్యాలు పలుకని వాడు. ఇటువంటి చక్కని మర్యాద కలవాడు ప్రహ్లాదుడు.

(ధర్మవత్సలత ఆ సంస్కారసంపన్నుడైన మానవుడికి సంబంధించిన అనేకాంశాలు ప్రహ్లాదుని నెపంతో వ్యాసభగవానుడు అందించగా పోతన వాటికి మెరుగులు దిద్ది 'ధర్మవత్సలత' అనే పదాన్ని కొత్తగా చేర్చాడు. కన్న సంతానంపై వాత్సల్యం ఉండడం సహజం. ఏ దిక్కులేనివారిని, దీనులను తల్లిదండ్రులవలె కాపాడి పోషించేవాడు ధర్మవాత్సల్యం కలవాడని పోతన అభిప్రాయం. ఈ ధర్మవాత్సల్యం అనే పదాన్ని పోతనగారే తొలిసారి ప్రయోగించారు. ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటగా ఇటువంటి పదప్రయోగం జరిగిందని విజ్ఞుల అభిప్రాయం. ఏ వయస్సు వారికైనా ఇవే గుణాలుండాలని వ్యాసుల నిర్ణయం.)

అంతేగాక, ధర్మరాజా! ఆకారంలో జన్మలో విద్యలో సంపదలో ప్రహ్లాదుడు గొప్పవాడైనప్పటికీ అతడు ఎన్నడూ గర్విష్ఠికాడు. అనేక విషయభోగాలు తన ముందున్నప్పటికీ అతడు పంచేంద్రియాలకు లొంగడు. యౌవన ప్రాభవం తనకున్నప్పటికీ కామరోషాదులకు లొంగిపోడు. స్త్రీలు మొదలైన భోగములెన్ని ఉన్నా అతడు వ్యసనాలకు లోనుగాడు. ప్రపంచంలో తాను ఎన్ని విషయాలు చూచినా విన్నా అతడు ఆ విషయాలను కోరుకోడు. అతడు సర్వదా బ్రహ్మ భావనలోనే ఉంటాడు. అంతేకాక హరిపై మాత్రమే లగ్నమనస్కుడై ఇతర విషయాసక్తుడు కాకుండా ఉంటాడు.

ఓ నిర్మలమైన అంతఃకరణంగల ధర్మరాజా! సమస్త సద్గుణాలు గుంపులు గుంపులుగా వచ్చి రాక్షస కుమారుడైన ప్రహ్లాదుణ్ణి చేరాయి. అవి యీ నాటికీ విష్ణుమూర్తిని వదిలిపెట్టని విధంగానే అతనిని ఆశ్రయించి ఉన్నాయి అవి తొలగిపోవు.

ఓ ధర్శజా! ప్రహ్లాదుణ్ణి, శత్రుపక్షంవారైన దేవతాశ్రేష్ఠులు కూడా వారి వారి ప్రసంగాల్లో "ప్రహ్లాదునితో సమానమైన దైవభక్తులను మే మెరుగము" అంటూ సాధుపురుషుల గాథలను ప్రశంసించే సందర్భంలో ప్రహ్లాదునిగూడా అతని గుణగణ ప్రశంసలు చేయు వృత్తాలతో గాథలుగా కీర్తిస్తుంటారు. ప్రహ్లాదుని వివిధ ఛందోబంధాలతో కీర్తిస్తారని కూడా చెప్పవచ్చు. (మత్తేభ, చంపకమాల, ఉత్పలమాలాది వృత్తాలతో) అలాంటప్పుడు మీబోటి భగవద్భక్తులు దానవపుత్రుడైన ప్రహ్లాదుని గొప్పవానినిగా గణనచేసి కీర్తింపక ఉండగలరా!

సుగుణములకు నెలవైన ప్రహ్లాదుని గుణములు అనేకము లున్నాయి. ఆ గుణాలెన్ని ఉన్నాయంటే ఎంతకాలం లెక్కించినా ఆదిశేషునకు గాని, బృహస్పతికి గాని, చదువులతల్లిభర్త బ్రహ్మకు గాని శక్యం గావు.

సుగుణశ్రేష్ఠుడయిన ప్రహ్లాద కుమారుడు నిరంతరం భగవానుడైన విష్ణుమూర్తిపై భక్తి సహజంగా ఏర్పడి పెరిగి పెద్దదయిన విష్ణుధ్యానంలో మాత్రమే ఆసక్తి గలవాడై.

శ్రీమహావిష్ణువు తనను చేరినట్లు భావించినప్పుడు ప్రహ్లాదుడు తన స్నేహితుల దగ్గరకు వెళ్ళడం మరిచిపోతాడు. ఆ దైత్యాంతకుడైన విష్ణువు తనముందు ఆడినట్లు అనిపించగా రాక్షసబాలురతో ఆటలకు వెళ్ళడం మరచిపోతాడు. భక్తులంటే దయగల స్వామి తనతో మాట్లాడుతున్నట్లు భావించినప్పుడు ఇతరుల మాటలకు సమాధానాలు ఇవ్వడం మరిచిపోతాడు. దేవతా బృందంచేత నమస్కారాలు స్వీకరించే విష్ణుమూర్తిని తనలో చూచినట్లు భావన పొందినప్పుడు ఇతర ప్రపంచాన్ని విస్మరిస్తాడు. తన అంతరంగం శ్రీహరియొక్క పదపద్మచింతన అనే అమృతంతో నిండిపోగా అతడు నిత్యపూర్ణుడై అన్నిటిని మరచి తనకు జడత్వం లేకపోయినా జడునిగా ఉండిపోతాడు.

ఓ ధర్మరాజా! ప్రహ్లాద కుమారుడు. పానీయాలు త్రాగినా, భోజనాదులు చేసినా, మాట్లాడినా, ఆటపాటలలో, నిద్రించే వేళలలో, అటు ఇటు తిరిగేటప్పుడూ, సర్వకాల సర్వావస్థలయందు శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మ ద్వయాన్ని తన హృదయంతో అనుసంధానం చేస్తూ బాహ్యంగా కన్పడే ఈ సమస్త ప్రపంచాన్ని మరచిపోయాడు.

ప్రహ్లాదుడు ఒక్కొక్కచోట విష్ణుమూర్తిని గూర్చి యోచించే స్థితిలో ఉండి ఇతర క్రియలు మాని విలపిస్తూ ఉంటాడు. నిరంతరం హరిని ధ్యానించటం మాత్రమే మనసులో నిలుపుకొని ఒక్కొక్కచోట ఉప్పాంగి పాడుతూ ఉంటాడు. విష్ణువు ఒక్కడే ఇంతే సుమా! వేరొకటి లేదని ఒకచోట నవ్వుతూ ఉంటాడు. పద్మాక్షుడనే పెన్నిధిని కనులార కన్నానని ఒకచోట హర్షాతిశయంతో గంతులు వేస్తుంటాడు. ఒకచోట పరమేశ్వరుడైన విష్ణువుపై ప్రేమభావంవల్ల మేను గగుర్పాటును పొందగా, ఆనందాశ్రువులు రాలుతుండగా, కండ్లు మూసుకొని పాడుతూ ఉంటాడు. ఒకచోట మౌనంగా నిలబడి ఉంటాడు. ఇలా హరిభావనతో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తాడు ప్రహ్లాదుడు.

ప్రహ్లాదునకు పూర్వజన్మలోగల పరమ భాగవతులతోడి స్నేహం వలన విష్ణు పదకమల సేవాభాగ్యంబు అధికమై ముముక్షుమార్గంలో ప్రయాణింప చేసింది. ఈ ప్రహ్లాద జన్మలో దుర్జనరాక్షసుల స్నేహంవల్ల తన మనసు ఇతర విషయాల మీదకు పోనివ్వకుండా తన అధీనంలోనే ఉంచుకొని, ప్రమాదరహితుడై, సంసారంనుండి విడివడి, పండితులకు అణకువగా ఉంటూ మంచి అదృష్టవంతుడై, సుగుణమణులచే గొప్పవాడై, గొప్ప భగవద్భక్తులలో ఉత్తముడై కర్మబంధాలనే లతలను తెంచుకొని, పవిత్రుడుగా ఉన్నాడు ప్రహ్లాదుడు. అటువంటి పుత్రునిపై హిరణ్యకశిపుడు శత్రుత్వం వహించి దయ లేకుండా కన్న కొడుకును చంపటానికి భటులను పంపాడు అని నారదుడు చెప్పగా ధర్మరాజు ఇలా అన్నాడు.

లోకంలో తలిదండ్రులు తమ కుమారులు విద్యాది విషయాలను నేర్చుకున్నా, నేర్వకున్నా పోషిస్తారు. ఎప్పుడూ స్నేహభావాన్ని వహిస్తూ మంచి బుద్దులు చెప్పి తమ పిల్లల పాపపు బుద్ధిని నివారిస్తారు. ఎటువంటి శత్రుత్వం వహించరు. అటువంటిది అనంత సుగుణాల నిలయుడు, లోక పవిత్రుడు అయిన ప్రహ్లాద కుమారుణ్ణి కష్టపెట్టడానికి తండ్రికి మనసెలా ఒప్పిందో!

No comments:

Post a Comment

Hiranyakashipu tortured his son Prahlad for worshipping Vishnu - హిరణ్యకశిపుండు ప్రహ్లాదుని వివిధోపాయంబుల హింసించుట

హిరణ్యకశిపుండు ప్రహ్లాదుని వివిధోపాయంబుల హింసించుట వయస్సు అయిదేండ్లు, అయినా కన్నతండ్రి నయిన నా పద్ధతిని నిందిస్తున్నాడు, ఏ  కొద్దిభాయమూ లేకు...