Tuesday, March 3, 2026

Sree Maha Bhagavathamu Part 5 - శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీరస్తు శీమహాభాగవతము పంచమస్కంధము - ప్రథమాశ్వాసము

శ్రీకర! కరుణాసాగర!, ప్రాకటలక్ష్మీకళత్ర! భవ్యచరిత్రా!
లోకాతీతగుణాశయ!, గోకులవిస్తార! నందగోపకుమారా!


సంపదలను ప్రసాదించేవాడవూ, దయాసముద్రుడవూ, లక్ష్మీదేవిని గృహలక్ష్మిగా కలవాడవూ; భక్తులకు శుభ పరంపరలను ప్రసాదించు సుసంపన్నమయిన ప్రవర్తనలు కలిగినవాడవూ; ఆలమందలను పెంచినవాడవూ, నందగోపుని కుమారుడవయిన కృష్ణా! అవధరించు.

అన్ని పురాణాల్లోని పరమార్థ జ్ఞానాన్ని గ్రహించి విఖ్యాతుడయిన సూతుడు శౌనకాది మహామునులతో ఈ విధంగా చెప్పాడు.

ప్రియవ్రతుని చరిత్రము

భగవంతుండగు నారాయణుండు ఋషభావతార మెత్తుట








Lord Vishnu Impressed The Prachetas Meditation and Gave Blessings/Boons - ప్రచేతసుల తపంబునకు భగవంతుండు మెచ్చివరంబు లిచ్చుట

ప్రచేతసుల తపంబునకు భగవంతుండు మెచ్చివరంబు లిచ్చుట

వారు దైవేచ్చ ననుసరించి శ్రీమహావిష్ణువునకు ఎల్లవేళలా ప్రియుడైన మహేశ్వరుని కలిసికొని అతని దయవలనమోక్షం పొందారని నీవు చెప్పి ఉన్నావు. అది నిజం. ఇంకా.

ఆ రాజకుమారులందరూ శ్రీహరిని దర్శించు కొనటానికి ముందు ఈ లోకంలో, పరలోకంలో ఏ గొప్ప ప్రయోజనాలను మిక్కిలి ఆసక్తితో పొందారు? మహర్షీ! మైత్రేయా! నాకు తెలియజెప్పు.

విదురా! విను. తండ్రి ఆజ్ఞను వారు సంతోషంతో స్వీకరించి సముద్రగర్భంలో ఉండి సాటిలేని జపయజ్ఞాన్ని అవలంబించి చక్కగా తపస్సు చేస్తూ సంతోషంతో ఉన్నారు. అలా ఉండగా

వారు చెదరనిస్థితితో పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు దయతోనిండిన హృదయం కలవాడు, అభయం ఇచ్చేవాడూ, శాశ్వతుడూ అయిన శ్రీమహావిష్ణువు

(సనాతనుడు- సర్వకాలాలలో 'ఉండుటయే' లక్షణం అయినవాడు - నిత్యుడు - జీవులకులాగా చావు పుట్టుకలు లేని వాడు పరమాత్మ - అని అర్థం.)

ఆ సమయంలో అచ్యుతుడు తన సాటిలేని, శాంతములైన దేహప్రభలతో ఆ రాజకుమారుల తపస్సువలన కలిగిన దుఃఖాలను పోగొడుతూ స్పష్టంగా వారికి కానవచ్చాడు.

గొప్పదైన మేరుపర్వత శిఖరంతో కూడియున్న నీలమేఘం సొంపులతో గరుత్మంతుని మూపుపై ఉన్నవాడూ, చాలా అందమైన తన దేహకాంతితో చీల్చి వేయబడిన, భయంగొాలిపే, సర్వదిక్కులమధ్యనున్న అంధకారం కలవాడూ; చాలా గొప్పవి అయిన ఎనిమిది ఆయుధాలతో, దేవతలతో, మహర్షులతో, భక్తులతో, పరిజనులతో కూడియున్నవాడూ, ప్రకాశిస్తున్న సువర్ణ కుండలాలు బుజ్జగిస్తున్న చెక్కిళ్ళ తావులు కలవాడూ, సుందరమైన నవరత్నాలు గల దివ్యమైన కిరీటం ధరించినవాడూ, కాస్తుభమణి వేలాడుతున్న శుభమైన కంఠంకలవాడూ, సుకుమారమైన పచ్చని వస్త్రం ధరించినవాడూ, హారాలూ, అంగదాలు, కంకణాలు, అందెలు అనే ఆభరణాలతో అలరారుతున్నవాడూ.

(అష్టాయుధాలు : 1. శంఖం, 2. చక్రం, 3. డాలు, 4. ఖడ్గం, 5. గద, 6. బాణాలు, 7. విల్లు, 8. పాశం - ఈ ఎనిమిదింటినీ, ఎనిమిది చేతులలో ధరించి ఉన్నవాడు.)

ఆయన ఎనిమిది చేతులు సుకుమారంగా, పొడవుగా అలరారుతున్నాయి. ఆ చేతుల మధ్యభాగం ఒక వృత్తం ఆకారంతో ఒప్పుతున్నది. ఆ నడుమ శ్రీదేవి అలరారుతున్నది. ఆమె కాంతులతో పోటీపడుతున్నదా అన్నట్లు ప్రకాశిస్తున్న వైజయంతి అనే వనమాలతో ఆ స్వామి వెలుగొందుతున్నాడు.

(వనమాల- ఆకులు, పువ్వులు కలిపికూర్చిన పెద్దమాల. అది కంఠసీమనుండి పాదాలవరకు వ్యాపించి ఉంటుందని ప్రసిద్ధి.)

ఆయన కీర్తిని దేవతలు, గరుడులు, యక్షులు, కిన్నరులు, సాటిలేని విధంగా పాటలరూపంతో కొనియాడుతున్నారు. ఆ సవ్వడి అన్ని దిక్కుల మధ్యభాగాలను నింపివేస్తున్నది. అది ఆయన గొప్పతనాన్ని మనస్సునకు తెలియజేస్తున్నది. అట్టి సనాతన పురుషుడు విష్ణువు ప్రీతితో

లక్ష్మీపతి అయిన నారాయణుడు దయను వెలార్చే చూపులతో ఆ రాజకుమారులను చక్కగా చూచి ఉరుమువలె గంభీరంగా ఉండే తీయని మాటలను ప్రేమానురాగాలు ఉట్టిపడే విధంగా ఇలా పలికాడు.

(అంబుదగంభీరం అనటంచేత వరాలు కురుస్తాయి అనే అర్ధం స్ఫురిస్తుంది.)

తాపస శ్రేష్ఠులైన ప్రచేతసులారా! సంతోషంగా వినండి. మీరు చెలిమిలో ఒకే భావం కలవారు. అటువంటి మీ మంచితనానికి నాకు చాలా ఆనందం కలిగింది.

(సమతన్‌ - ఆత్మసామ్యంతో - తనయందు తనకు ఎంత ప్రీతి ఉంటుందో అటువంటి ప్రీతితో అని తాత్పర్యం.)

నేను తప్పక మీ కోరికను తీరుస్తాను. స్పష్టంగా చెప్పండి. మిమ్ములను సుఖంగా నిద్రకు పోయేసమయంలో తలచుకొనే నరుడు ఎల్లవెళలా అన్నదమ్ములయందు చెలిమీ, భూతదయా, స్వచ్చమైనబుద్ధీ, మంచివారియందు ప్రీతీ కలిగి, సమస్త పాపాలూ పోయినవాడై విశ్వంలో సుఖిస్తాడు.

ఇంకను, రుద్రుడు గానం చేసిన నా స్తోత్రాన్ని ప్రతిదినం చదివిన వారికి కోరిన వరాలిస్తాను. శుభాలను కలిగించే బుద్ధి విశేషాన్ని కూడా ఇస్తాను. మీరు సంతోషంతో కూడినవారై మీ తండ్రి ఆజ్ఞను అనుసరించటంవలన మీ కీర్తి లోకాలలో వ్యాపిస్తుంది. మీకు గొప్ప బ్రహ్మగుణాలు కలవాడూ, తన సంతతివల్ల మూడులోకాలను నిండించే మంచిగుణాలకు గనియైనవాడూ అయిన కుమారుడు జన్మిస్తాడు. కండుమహాముని తపస్సును పాడుచెయటానికి ఇంద్రుడు పంపిన ప్రమ్లోచ అనే అప్సరః కాంత గర్భం ధరించి ఆ మునివరుని వీడ్కొని స్వర్గానికి పోయేసమయంలో పుట్టిన ఆమె పుత్రికను చెట్లలో ఉంచి పోగా,

ఆ బిడ్డ అప్పుడు ఆకలితో నోరు పెద్దగా తెరచి ఏడువగా విని అక్కడకు వచ్చి రాజైన చంద్రుడు చక్కగా అమృతాన్ని కురిపించే తన చూపుడు వేలిని నోటిలో ఉంచాడు. దానితో ఆమె పెరిగింది. చంద్రునివంటి మోముతో అలరారుతున్న ఆ కన్యను, ఉత్తమస్త్రీని మీ తండ్రి ఆదేశాన్ననుసరించి మీరందరూ సంతానం కోసం పెండ్లి చేసుకోండి అని చెప్పి పద్మనయనుడైన విష్ణువు ఇంకా ఇలా అన్నాడు.

పుణ్యాత్ములారా! మీరు ఒకే విధమైన ధర్మాన్ని పాటించే శీలం కలవారు. కనుక మీకందరికీ ఈసన్నని నడుముగల సుందరి ఏకధర్మశీల, మీకు అర్పించుకొన్న మనస్సు కలదీ అయి భార్య అవుతుంది. మీ తేజస్సుకు ఎదురు ఉండదు. పెక్కువేల దివ్యవత్సరాలు భూలోక, దేవలోక సుఖాలు అనుభవిస్తారు. అటుపిమ్మట నాయందలి భక్తితో ఈ సుఖాలన్నీ నరకంవంటివి అని మీరు భావించి నిర్మలమైన మనస్సు కలవారై నా స్థానాన్ని చేరుకొంటారు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

(భగవంతుని మీద భక్తి హృదయాన్ని మాలిన్యం లేనిదిగా చేస్తుంది. దానితో వారు సంసారంనుండి విముక్తి పొందుతారని తాత్పర్యం.)

రాజకుమారులారా! సంసారంలో ఉన్నవారయినా కర్మలను, కర్మఫలాలను నాకు సమర్పించుకొని మిక్కిలి మనోహరాలైన, అమృతం వంటి నాకథలను వినటంలో ఆసక్తి కల మనస్సుతో కాలం గడిపేవారయితే వారికి సంసారాలు తెంచుకోరాని భవబంధాలకు కారణాలు కావు.

నాయనలారా! ప్రచేతసులారా! బ్రహ్మమును గూర్చి మాత్రమే నిరంతరం వాక్కులను ఉపయోగించే మహాత్ములైన యోగిజనులు నిరంతరంగా నా కథలను గానం చేస్తూ ఉంటారు. అందు నాకు వేడుక ఎక్కువ. కాబట్టి, వారునా వారు. నేను ఎప్పటికప్పుడు నవీనంగా వారిలో నివసిస్తాను. ఆ మహిమవలన వారికి ఈ ఇళ్ళూ వాకిళ్ళూ మొదలైనవి సంసారబంధానికి కారణాలు కావు. ఇదంతా విచారించి చూస్తే సత్యం.

నేను రసస్వరూపుడను. కాబట్టి, నన్ను చేరుకొన్న మానవులకు శోకం, మోహం, సంతోషం మొదలైన భావాలు కలుగవు. కనుక పరిశీలిస్తే నేను ముగ్గురు పురుషులకు ప్రభుడను. బ్రహ్మము అయిన వాడను. 

అనీ ఈ విధంగా మాట్లాడుతున్న పురుషార్థాలను మానవులకు అందించే జనార్దనుని దర్శించి, ఆదర్శనంచేత మొత్తంగా నశించిన రజస్తమోగుణాలు కలవారైన ప్రచేతసులు

అందరికి రక్షకుడు, అప్రమేయుడు, లక్ష్మీపతి, జయించడమే సహజ లక్షణంగా గలవాడు, అంతం లేనివాడు, దోషాలు లేని చరిత్రకలవాడు, పరిశుద్దుడు, అచ్యుతుడు, పరుడు, పరమేశుడు, ఈశుడు, సంసారబంధాలనుండి జీవులకు విముక్తి కలిగించేవాడు, పద్మాలవంటి కన్నులున్నవాడు అయిన శ్రీహరిని ఆ ప్రచేతసులు పద్మాలవంటి చేతులను దగ్గరకు చేర్చుకొని గొంతుకనుండి స్వరం ఆనందపారవశ్యంతో చక్కగా రానిస్థితితో తెమల్చుకొంటూ ఇలా స్తుతించారు.

కేశవా! నీవు ఎల్లప్పుడు ప్రాణులకు కలిగే కష్టాల నన్నింటిని నశింపజేసేవాడవు. ఎవరి మనస్సులకు, మాటలకు అందనివాడవు. నీ గుణాలు, నీ పేర్లూ, పెక్కు విధాలైన గొప్ప కోరికలకు కారణం అవుతూ ఉంటాయి. అన్నిలోకాల పుట్టుక, పెరుగుట, గిట్టుట అనే విషయాలను పట్టినిలిపే గొప్పది అయిన మాయా గుణం నీమూర్తి. ఇంద్రియ మార్గాలు గొప్పవే కానీ వానికి చిక్కని చక్కని దారి నీది. మిక్కిలి శాంతమైన మనస్సు కలవాడవు. సంసారమనే అజ్ఞానాన్ని హరించే మేధా సంపద నీది. నీవు దేవదేవుడవు. వాసుదేవుడవు. అన్ని నీలో నివసిస్తూ ఉంటాయి. నీవు సకల ప్రాణులలో ఉంటావు. సర్వసాక్షివి. అటువంటి కృష్ణా! నీకు నమస్కారం.

స్వామి బొడ్డులో పద్మం ఉంది. స్వామి సంసార దుఃఖాన్ని రూపుమాపువాడు. పరులకు ఈశ్వరుడు, పరుడైన ఈశ్వరుడు. తామర పూవులోని కేసరాలవంటి పచ్చనిది, స్వచ్చమైనది, దివ్యమైనది అయిన బంగారు వస్త్రం ధరించినవాడు. పద్మాలవంటి పాదాలు కలవాడు; పద్మమాలను తాల్చినవాడు, పరుడు, అపరుడు, గొప్ప మంచిగుణాలు కలవాడు; రక్కసులను సంహరించేవాడు, సృష్టికి కారణమైనవాడు అయిన మనోహరమైన నల్లని వన్నెతో అలరారుతున్న శ్రీమవావిష్ణువునకు నమస్కారం, నమస్కారం.

ఈ విధంగా స్తుతిచేసి పద్మదళనయనా! భక్తుల ప్రయోజనాలను చక్కగా అనుగ్రహించే స్వామీ! నీ దర్శనం మా దుఃఖాలన్నీ రూపుమాసి పోవటానికి కారణమైంది. తోలగించుకొనరానివీ, భరించటానికి అలవి కానివీ అయిన కష్టాల అవస్థతో దుఃఖం పొందుతున్న మాకు నీ గొప్పదైన మంచి కరుణను చూపటం కంటె మించిన అనుగ్రహం భావిస్తే లోకంలో మరొకటి ఏముంటుంది?

స్వామీ! నీవు అశుభాలను తొలగిస్తావు. ఐశ్వర్యంతో కూడిన వాడవు; మహాత్ముడవు. లోకాలనన్నింటినీ ఏలే దేవరవు. అట్టి నీవు దీనులను కాపాడుటయే పనిగా పెద్దకాలానికి ఆనందంతో వీళ్ళు మావాళ్ళు అని బుద్ధిలో అనుకొనటమే మాకు గొప్ప సత్కారం. అదే చాలు. కానీ, దానితో ఆగక స్వయంగా మాకు సాక్షాత్కరించినావు.

ప్రభూ! నీవు భక్తుల సముదాయాల హృదయాలలో ఉండే కోర్కెల నన్నింటినీ తీర్చేవాడవు. మోక్షానికి నడపించేవాడవు. భావన చేయగా చిన్నిప్రాణుల హృదయాలలో కూడా అంతరాత్మవై స్థిరంగా ఉంటావు. కాగా నీ పాదపద్మాల జంటను పూజించటం తప్ప మరొక పనిలేని మాకు శుభాలను కూర్చి నీవు మాకోరికలేవో తెలియనివాడవా?

వనజాక్షా! అయినా విను. నీవు మోక్షమార్గంలో భక్తులను నడిపించేవాడవు. పురుషార్థాల గొప్ప వ్యాప్తియే నీ స్వరూపం. అటువంటి నీవు మా యందు అనుగ్రహం చూపుతున్నావు. ఇంతకంటె కోరదగిన వరం మరొకటి లేదు. అయినా నీవు పరాపరుడవు. అట్టి నిన్ను ఏదైనా ఒక వరం కోరదామంటే నీ విభూతులకు అంతం లేదు. అందువలననే నిన్ను అనంతుడు అని తత్త్వం తెలిసినవారు అంటారు. పరమపురుషా! అట్టి నిన్ను ఏమి కోరగలం? దాహం కలిగిన పిల్లవాడు సముద్రజలాన్ని ఎంత తాగగలడు.

స్వామీ! మేమునీ పాదపద్మాల పాదులను ఆశ్రయించి ఉండేవారం. బుద్ధిసంపదకు నెలవైన ఓ దేవా! నీ చూపు కాక మరొక్క దానిని మేము కోరగలమా? మన్నన కెక్కిన పారిజాతపుష్పమకరందాన్ని పేరాసతో క్రోలి విరాజిల్లే తుమ్మెద వేరు పుష్పాలను చేరుతుందా?

స్వామీ! లక్ష్మీపతీ! మేము నీదైన మాయకు లోబడి ఎన్నో పనులు సంసారం కొరకు చేస్తున్నాం. మిక్కిలి ఆసక్తితో ఏది చివరి లక్ష్యంగా మేము తిరుగుతున్నామో అది లభించే వరకూ మాకు దొడ్డబుద్ధితో నీ పరమభక్తుల చెలిమిని ప్రసాదించు.

లక్ష్మీపతీ! సర్వమునిశ్రేష్ఠులు పూజించే పాద పద్మాలు కలవాడా! ఉత్తముల రసవంతములైన మాటలకు ఆనందించే బుద్ధికల దేవా! నీ భక్తుల చెలిమి ఎంత కొంచెమైనది అయినా, దానితో సమానంగా స్వర్గం మొదలైన సుఖాలను కూడా మేము భావించం. ఇక మానవలోక సుఖాలమాట చెప్పటం ఎందుకు?

అంతేకాదు, భగవంతుని భక్తుల తోడి సాంగత్యమందు దాహాన్ని రూపుమాపేవి అయిన సంతృప్తిని కలిగించే కథలు ఉంటాయి. కాబట్టి, వానిని వినటం వలన ఏ ప్రాణి యందూ పగగానీ, ఉడుకుమోతుతనంగానీ ఉండవు.

స్వామీ! నీవు అడవులలో భౌతిక సంబంధాల అంటు సొంటులు లేకుండా తిరిగే మునులు కొనియాడుతూ ఉండగా ప్రకాశిస్తూ ఉంటావు. కాబట్టి, భూమిమీద పుణ్యతీర్థాలలాగా పవిత్రం చేయబూని కాలి నడకతో తిరుగాడుతూ భూమిపై సంచరించే నీ భక్తులతో సహవాసం ఘోరమైన సంసారభయంలో ఉన్నవాని బుద్ధికి ఎలా ఇష్టం కాకపోతుంది?

తామర రేకులవంటి చక్కని కన్నులున్న స్వామీ! ప్రభూ! నీప్రాణమిత్రమైన పరమేశ్వరునితోడి క్షణమాత్రమైన చెలిమి కలిగిన సమాగమం వలన పెద్దపుండు అనదగినదై చికిత్సకు అసాధ్యమైన జన్మరోగాన్ని మానిపే మేటి వైద్యుడవైన నిన్ను దర్శించి కృతార్ధులమయ్యాం. బాగా బతుకుతున్నాం.

(నీ సందర్శనం వల్ల మా సంసారజాడ్యం రూపుమాసిపోతుందని ప్రచేతసుల హృదయం. వారికి ఈ భాగ్యం పరమేశ్వరుని వలన కలిగింది. శివకేశవులు పరస్పరం సఖులు అంటే ఏకప్రాణులు. వారియందు భేదబుద్ధిని పెట్టుకోవటం ఆత్మవినాశన కారణం అవుతుందని ఇక్కడ ధ్వని.)

దేవా! మా వేదాల అధ్యయనం, గురువుల అనుగ్రహమూ, విప్రలైన జ్ఞానవృద్దుల నడవడిని బట్టి మెలగటమూ, మహాత్ములకు నమస్కరించటమూ, సకల ప్రాణులయందు అసూయ లేకుండుటయూ, ఆహారం తీసుకోకుండా చాలాకాలం నీళ్ళలో నిలిచి శరీరాన్ని ఎండగట్టి తపస్సు చేయటమూ అనే ఇవన్నీ సనాతనుడవైన నీకు సంతోషాన్ని కలిగించుగాక అని మేము విన్నవించుకుంటున్నాం- అని ఇంకా ఇలా అన్నారు.

అసూయ అంటే గుణాలను దోషాలుగా చెప్పటం. అది బుద్ధిని పాడుచేస్తుంది. కాబట్టి, అసూయను మూలముట్టుగా 
రూపుమాపుకోవాలి.

దేవా! వరదా! మనువు, బ్రహ్మ, శివుడు మొదలైన గొప్ప ప్రజ్ఞకల మహానుభావులు, తపస్సు, జ్ఞానం, సత్త్వం అనే మహాగుణాలు పుష్కలంగా ఉన్నవారు కూడా పూర్వం నీ మహిమను తుది దాకా స్తుతించలేకపోయారు. అయినా శక్తి ననుసరించి స్తుతించారు. మేము కూడా అలాగే కోరికోరి మా బుద్ధి శక్తుల ననుసరించి నిన్ను స్తుతించుకుంటూ ఉంటాము.

(భగవంతుని మహిమను తుదిముట్టా తెలిసినవాడు భగవంతుడు మాత్రమే. అయితే అమృతభాండం నుండి ఒక బొట్టు పుచ్చుకున్నా అమృతఫలం సిద్ధిస్తుంది.)

స్వామీ నీవు అందరియందూ ఏకరూపంగా ప్రవర్తించేవాడవు. సనాతనుడవు, పరిశుద్దుడవు, శ్రేష్ఠుడవు, వాసుదేవుడవు, సత్త్వమే మూర్తి అయిన వాడవు, భగవంతుండవు- అట్టి నీకు నమస్కరించెదము. అని యిట్లు ఆ ప్రచేతసులు స్తుతించగా శరణుకోరినవారియందు వాత్సల్యంగల మహావిష్ణువు తృప్తి పొందిన భావనకలవాడై వారు కోరినవరాలు ఇచ్చాడు.

(1. సముడు- 'మా' అంటే లక్ష్మి. ఆమెతో కూడినవాడు అని విశేషార్థం.

2. ఆదిపురుషుదు- సృష్టికి పూర్వం నుండి ఉన్న 'సత్' పదవాచ్యుడు.

3. శుద్దుడు- పుట్టుక, ఉండటం, గిట్టటం అనేవి ప్రాణులకు కర్మబంధదోషాలవలన ఏర్పడేవి. అట్టి దోషాలు లేనివాడు.

4. పరుడు- లోకాలు, లోకేశులు, లోకస్థులు అయినవారికి అతీతంగా పెనుచీకటికి ఆవల ఉండేవాడు.

5. వాసుదేవుడు- వస్‌ అంటే ఉండటం, దివ్‌ అంటే విరాజిలటం- అందరిలో ఉంటూ విరాజిల్లే వాడు. అందరూ అతనిలో ఉంటారు అని వాసుదేవపదానికి అర్ధం అని శ్రీమహాభారతం.

6. 'సత్త్వం' అంటే ఉండటం. రజస్సు తమస్సు అనే గుణాలు లేని నిర్మలతత్త్వం. అదే ఆయనమూర్తి)

ఆ రాజకుమారులు సంతోషం పొంగి పొరలగా మరిమరీ సన్నుతి చేయగా లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణుడు మనస్సులో నిండుమోదం పొంది భక్తులను పాలించే శీలం కలవాడు కనుక ఆ పని ముగించి, తన్ను చూడటమందే గొప్ప కోరికగల ఆభక్తులు తృప్తి తీరని వారై చూస్తూ ఉండగా తన స్టానానికి వడివడిగా పోయాడు.

పిమ్మట ఆలస్యం చేయకుండా ప్రచేతసులు భగవంతుని ఆజ్ఞను భక్తితో పాటించి సముద్రజలాల నుండి వెలుపలికి వచ్చి, ఆ రాజకుమారులు స్వర్గద్వారానికి అడ్డం వచ్చే విధంగా పెద్ద ఎత్తున బాగుగా పెరిగినవి, భూమినంతటినీ కప్పివేసినవీ అయిన ఆ చెట్లను చూచి ఆ ప్రచేతసులకు చాలా తీవ్రమైనకోపం వచ్చింది. ప్రళయ కాలపు శివుని వలె భయంకరులయ్యారు. భూచక్రాన్నంతటినీ చెట్లు లేనిదిగా చేయాలని సంకల్పించారు. వారి పద్మాలవంటి ముఖాలనుండి అగ్నిని చిమ్మే గాలులు పుట్టుకొని వచ్చాయి. ఆ చెట్ల నన్నింటినీ దహించబోతూ ఉండగా

(కుజము- కు అంటే భూమి- దానినుండి పుట్టినది- చెట్టు.)

అప్పుడు బ్రహ్మదేవుడు ఆ చెట్లకు కలుగబోతున్న ఘోరమైన వినాశనాన్ని గమనించాడు. అక్కడికి వచ్చి ఆ రాజకుమారులను మంచి మాటలతో శాంతింపజేస్తూ ప్రేమతో మాట్లాడి ఆ రాజకుమారుల కోప తీవ్రతను పోగొట్టిన తరువాత.

మిగిలిన చెట్లన్నీ భయపడి బ్రహ్మ ఆజ్జననుసరించి మారిష అనే ఉత్తమురాలైన తమకూతురిని ఆ ప్రచేతసులకు భార్యగా ఇచ్చినవి. మునుపు దక్షుడు ఈశ్వరుని విషయంలో చేసిన అపరాధానికి అతడు రాజుగా పుట్టవలసి వచ్చినది. దానికి కారణం అయినది యీ మారిషయే. అట్టి ఆ కాంతను ప్రచేతసులందరూ వరుసగా శాస్త్రవిధానాన్ని అనుసరించి పెండ్లి చేసుకున్నారు. దైవసంకల్పాన్ని ఎవరూ ఎక్కడా దాటలేరు కదా?

(పూర్వం దక్షుడు ఒక యాగం చేసి అందులో శివుణ్ణి అవమానించాడు. ఆ కారణంగా బ్రహ్మపుత్రుడైన దక్షుడు ఈ మారిష అనే స్త్రీయందు రాజుగా పుట్టవలసి వచ్చింది- ఇది పూర్వగాథ)

లోకంలో వినటానికైనా ఇటువంటిది ఎక్కడైనా ఉన్నదా? ఒక స్త్రీ విషయంలో పదిమంది రాజులకు పొంతన కుదురుతుందా? ఇదంతా బ్రహ్మాదేవుని గొప్పమాయ. దాని వలన కలిగే ఆశ్చర్యాలకు నమస్కారాలు చేయవలసినదెే.

చాక్సుషమన్వంతరంలో దైవం ఏర్పాటు చేయగా తనకు ఇష్టమైన విధంగా ప్రజలను సృష్టిస్తూ ప్రసిద్ధుడైన దక్షుడు వెనుకటిదేహం కాలాన్ననుసరించి జారిపోగా ప్రచేతసులకు ఆ మారిష అనే ఇల్లాలియందు మళ్ళీ పుట్టాడు. అతని తేజస్సులో గొప్పగొప్పవారి తేజస్సులు అణగిపోయాయి. కార్యాలను దక్షతతో చేస్తాడు కనుక దక్షుడు అయ్యాడు. అతనిని బ్రహ్మ సృష్టికార్యంలో నియోగించాడు. అతడు మరీచి మొదలైన ప్రజాపతులను ఆయా పనులలో నియోగించి ఉన్నాడు. అప్పుడు

(మరీచి మొదలైనవారు తొమ్మండుగురు. వీరిని నవబ్రహ్మలు అంటారు- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరిచి.)

ఆ ప్రచేతసులకు విజ్ఞానం నిండుగా కలిగింది. వెంటనే నారాయణుని పలుకును స్మరించారు. తమ కొడుకు దగ్గర ఇల్లాలిని ఉంచారు. అడవులలో నివాసం ఏర్పరచుకొన్నారు. పూర్వం జాబాలి అనే మునిశ్రేష్ఠుడు తపస్సిద్ధి పొందిన గొప్పది అయిన పడమటి సముద్రం తీరంలో ఆత్మ విజ్ఞానం గురించి విశేషంగా భావన చేయటానికి సంకల్పించారు. అప్పుడు వారి దగ్గరకు వివేకం పండించుకొన్నవాడు, నరులు, దేవతలు, రక్కసులు, యక్షులు, కిన్నరులు మొదలగువారిచే గొప్పగా పూజించబడుతున్నవాడు, వివేకశీలి అయిన నారదుడు ఏతెంచాడు.

నారదుడు ఆ రాజకుమారుల దగ్గరకు వచ్చాడు. వారు ప్రాణ, మనో, వాక్‌ శక్తుల్ని దర్శించి పూర్తిగా తమ అదుపులో ఉంచుకొనిన ఋషులు. ఆసననిష్ఠకల శాంతులు. సాటిలేని ఆకారం గలవారు. పరబ్రహ్మమునందు నెలకొల్పిన అంతఃకరణం కలవారు.

వచ్చిన నారదమునిని చూచి రాజకుమారులు లేచి వేడుకతో నమ్రులై చక్కని వినయంతో మిక్కిలి యోగ్యమైన పూజనములతో అతనికి సంతోషం కలుగజేశారు.

(పూజ్యులు వచ్చినపుడు లేచి ఎదురువెళ్ళీ మంచిమాటలు మొదలైన వానితో సత్కరించి కూర్చుండబెట్టటం సదాచారం.)

పుణ్యాత్మా! మునిశ్రేష్ఠా! లోకపావనా! పూజ్యులైన తమరి రాక అన్ని లోకాలకూ మంగళాన్ని కలిగించేది. మా అదృష్ట విశేషం చేత ఈనాడు తమరిని చూడగలిగితిమి. తమరు లోకాలలో సంచరిస్తూ ఉంటారు. దానిని అడ్డుకొనే శక్తి ఎవరికీ లేదు. సూర్యుని గమనం లాగా ప్రాణులందరి అన్ని భయాలను అది తీసివేస్తుంది.

'పుణ్యాత్మా! భగవంతులైన విష్ణువు శంకరుడు ఉపదేశించిన ఆత్మతత్త్వం సంసారంలో ఉన్న మాకు మరపునపడింది. అట్టి తత్త్వార్దాన్ని ప్రకాశింపజేసేదీ, పెద్దదీ, భయంకరమైనదీ అయిన సంసారసముద్రాన్ని తరింపజేసేదీ అయి మిక్కిలి ఒప్పారే ఆత్మతత్త్వాన్ని ఇప్పుడు మాకు సుస్థిరమైన దయాబుద్ధితో మాలో వెలుగొందునట్లు చేయండి' అని ఇట్లు పలుకగా నిరంతరం భగవంతునియందే సమర్పించిన హృదయం కలవాడు, మిక్కిలి ఉత్తమములైన గుణాలు కలవాడు, సర్వలోకాలలో లోకకల్యాణంకోసం సంచరిస్తూ ఉండేవాడు అయిన నారదుడు ఆ రాజకుమారులతో ఇలా పలికాడు.

నాయనలారా! మానవులకు భగవంతుడు పుట్టుక, సంస్కారాలు, ఆయువు, మనస్సు, మాట ఇచ్చాడు. వానిని దేవదేవుడైన గోవిందుని సేవకు వినియోగించినపుడె సార్ధకత కలుగుతుంది. బ్రహ్మపుట్టుకకు కారణమైన పద్మం నాభియందు గల శ్రీమహావిష్ణువు సేవకు కాని జాతకర్మం, ఉపనయనం మొదలైన సంస్కారకార్యాలతో ఏర్పడిన పుట్టుకలు వ్యర్థం. 'పెద్దకాలం బదకటం వృథా. వేదం చేయమంటున్న యజ్ఞాది కర్మలు పనికిమాలినవి అవుతాయి. జపం, తపం, విద్య, చక్కగా మాట్లాడగలగటం మొదలైనవన్నీ ప్రయోజనం లేనివి. పెక్కింటి మీద ఏక కాలంలో బుద్ధి నిలపడంలో నేర్పు వ్యర్థం.

విష్ణుభావనలేని ఇంద్రియాల గొప్పశక్తీ, ఆరితేరిన బుద్ధీ, ప్రాణాయామం మొదలైన యోగమూ, దేహం మొదలైన వానికంటె వేరయిన జ్ఞానమూ, సన్న్యాసమూ, వేదాల పఠనమూ, తక్కిన వ్రతాలు, వైరాగ్యాలూ మొదలైన శ్రేయస్సును సాధించే కార్యాలూ పనికి మాలినవి. భగవంతుడు సర్వశ్రేయస్సుల స్వరూపమైనవాడు. సమస్తశ్రేయస్సులకు చిట్ట చివరిహద్దు. సర్వభూతాలకు నెలవైనవాడు. సర్వభూతాలకు బుద్ధి శక్తులను ప్రసాదించేవాడు. సర్వభూతాలకు ప్రియమైనవాడు. అంతటా వ్యాపించి ఉండేవాడు. కాబట్టి

రాజకుమారులారా! నిండైన ప్రీతితో శ్రీమహావిష్ణువును పూజ చేయటం ప్రాణాలను సమర్పించుకోవటం తృప్తికి కారణం. బుద్ధితో భావనచేస్తే చెట్టు పాదులో నీరు నింపటం ఎక్కడనో పై భాగాన ఉన్న కొమ్మల పుష్టికి కారణమైన విధంగా ఆ విష్ణుపూజ సర్వదేవతా సమర్చన విధానమై అలరారుతుంది.

(కొమ్మలకు పుష్టి కావాలంటే పాదులో నీళ్ళు నిండుగా పోయాలి. అలాగే దేవతలందరు కొమ్మలవంటివారు. శ్రీమహావిష్ణువు ఆలవాలం. కాబట్టి అతడు తృప్తి పొందితే దేవతలందరూ తృప్తి పొందుతారు.)

వర్షాకాలంలో సూర్యునివలన ఆవిరై మేఘంగా మారిన నీరు భూమికి వస్తుంది. తిరిగి ఆ నీరే ఎండలకాలంలో మరల సూర్యుని యందే లయమవుతుంది. ఆ విధంగా భూమి నుండి పుట్టిన చరాచర ప్రాణికోట్లు భూమిలోనే కలసిపోవటం చూస్తూ ఉన్నాం. అలాగే శ్రీహరినుండి పుట్టిన విశ్వమంతా శ్రీహరియందే లయం పొందుతుంది. అది ఎలా అంటే-

(సృష్టి అంతా చరాచరాలైన ప్రాణికోటితో నిండి ఉన్నది.)

చూడగా చూడగా ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టినప్పుడు చీకట్లు కమ్ముకుంటాయి. కొంచెం సేపట్లో ఆ చీకట్లు అక్కడనే అణగిపోతాయి. అలాగే సత్త్వం, రజస్సు, తమస్సు అనే గుణాలు ప్రవాహాలలాగా సాగిపోతూ ఉండగా వాని శక్తులు కూడా బ్రహ్మంనుండి ఏర్పడతాయి. మళ్ళీ హరియైన విష్ణువులో కలసిపోతాయి.

నాయనలారా! ఆ పరమాత్మ అన్ని విధాల దేహాలు కలవారికి ఆత్మ అయినవాడు, అన్నింటికి కారణమైనవాడు, అతనికి పోలిక చెప్పటానికి వీలయిన మరొక వ్యక్తి కానీ వస్తువు కానీ లేదు. ఎల్లవేళల ప్రకాశిస్తూ ఉంటాడు. అతడు ప్రధానమనే తత్త్వం అయిన పరమపురుషుడు. తన తేజస్సు చేత రూపు మాసిపోయిన గుణాలప్రవాహం కలవాడు. మనస్సు, బుద్ది, సుఖం, కోరిక, ద్వేషం మొదలైన రెండు తీరుల వ్యవహారాలు లేనివాడు. జీవులను బంధించి నిలిపే గుణాల అంటుసొంటులు అతనికి లేవు. దేహమే ఆత్మ అనేది భ్రమ. అంటే సత్యం కాని జ్ఞానం. దానిని తొలగించుకోవటమే అతనిని పొందటానికి సాధనం. ఆయనకు జీవులకు వలె పుట్టుక, ఉనికి, చావు అనే వికారాలు లేవు. ఎల్లవేళలా ఆనందంగా ఉండటమే ఆయన స్వరూపం. సర్వమును సర్వులను ఎఱిగిన జ్ఞానస్వరూపుడు. పరమప్రభువు. అట్టి నారాయణుని భేదం లేని బుద్ధితో సేవించండి. సర్వప్రాణులయందు గొప్ప దయగలవారూ, ఏది దొరికితే దానితో మాత్రమే సంతోషపడేవారూ, ఇంద్రియవికారాల నన్నింటినీ అణచివేసుకొన్నవారూ అయిన మానవులవిషయంలో ఆ స్వామి సంతుష్టుడై ఉంటాడు- అని పలికి ఇంకా ఇలా అన్నాడు.

ఆ భగవంతుడు సజ్జనులు తొలగించుకొన్న కోరికలన్నింటి చేత స్వచ్చమైన అంతరంగంలో కలసిపోయి ఉంటాడు. ఇదిగో నీకు దగ్గరలోనే నీలోనే ఉన్నాను అన్నట్లు ఉంటాడు. ఆయన గుణాలన్నీ అంత సులభంగా అర్థమయ్యేవి కావు. అందుకే గంభీరమైనవి. అయినా దయకు గనులవంటివి. అంటే భక్తులకు అర్థంకావటానికి అయిన అనుగ్రహం కలిగినవి. ఇవి గమనించి తనను ఆశ్రయించిన భక్తులకు పరతంత్రుడై ఉంటాడు. ఎల్లవేళల భక్తుల యందే విడువకుండా ఉంటాడు.

కొందరికి విద్యవలన, మఱికొందరికి ధనంవలన, ఇంకా కొందరికి కులధర్మాలవలన పొగరు పెరిగిపోయి ఉంటుంది. దానితో ఉత్తములైన భగవద్భక్తులకు కీడు చేస్తూ ఉంటారు. ఆ విధంగా బుద్దిని పాడు చేసుకొన్న నీచులు ఒకవేళ ఆ విష్ణువునకు కోరికోరి పూజలు చేసినా స్వామి ఎప్పుడూ, ఎక్కడా వానిని పట్టించుకోడు.

నాయనలారా! మీ బుద్ధి చాలా రమణీయమైనది. రాజపుత్రులారా! ఆ లక్ష్మీదేవి సర్వకాలాలలో శ్రీమహావిష్ణువును వదలక మెలగుతూ ఉంటుంది. ఆమెకు సంబంధించిన సంపదలను గట్టిగా కోరుతూ దేవేంద్రుడు మొదలగువారు ఆమె వెంటబడి తిరుగుతూ ఉంటారు. కృతజ్ఞతగల భక్తుడు వారిని అనుసరించడు. (ఎందుకంటే బిచ్చగాణ్సి వేడుకొనే బిచ్చగాని ప్రవృత్తి వంటిది అది) కనుక నిరంతరం తన బుద్ధిలో శ్రీమన్నారాయణుని సేవించక ఉండలేడు. ఆయన సర్వస్వతంత్రుడు. తన భక్తులకు కోరినది ఇస్తాడు. దీనులయందు తల్లిలాగా వ్యవహరిస్తాడు. గుణాలన్నింటికి మహాప్రభువు. ఎందును పుట్టుక అనేది లేనివాడు. ఉత్తమపురుషుడు అయి పరమాత్మగా తెలియువాడు. లోకాలన్నింటినీ తనలో నింపుకొన్నవాడు. సర్వేశ్వరుడు. నారాయణుడు. పండిన జ్ఞానమే ఆనంద స్వరూపం అయినవాడు. అపజయంలేనివాడు. చ్యుతి లేనివాడు. తెల్లతామరలవంటి వెడదకన్నులుకలవాడు. కనుక నిజమైన భక్తిరసం రుచిమరగినవాడు నిలువెల్లా ఆనందమే కాగా ఆయనను సేవించక ఎలా ఉంటాడు?

అని నారదుడు ఇంకా ఇలా చెప్పాడు. మీ వంశ గౌరవాన్ని చక్కగా పెంపొందించిన చిత్రరథుడనే ధ్రువుడు సవతి తల్లి పలుకుల ములుకులకు వికలమైన మనస్సు కలవాడై అయిదేండ్ల పసితనంలోనే తపోవనానికి పోతుండగా దారిలో నేను ఉపదేశించిన విధంగా భగవంతుడైన పుండరీకాక్షుని ఆరాధించాడు. దానివలన ఇతరులకెవ్వరకు అందరాని సర్వోన్నతమైన పదానికి చేరుకున్నాడు. కాబట్టి, మీరుకూడా రుద్రదేవుడు ఉపదేశించిన పద్ధతితో సర్వభూతాలలో సంచరించే పరమాత్మను సంసారబంధాలు తెగిపోవటం కోసం ఆరాధించండి.

అని ఈ విధంగా నారదమహర్షి రాజకుమారులకు సంతోషం ఉప్పొంగే విధంగా శ్రీమహావిష్ణువు మెలగిన గొప్ప విధానాన్ని వినిపించి తన తండ్రియగు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.

అలా చెప్పి నారదుడు వెళ్ళిన వెంటనే రాజకుమారులు ప్రచేతసులు నారదుని మోమునుండి వెలువడిన మనోహరం, మంగళకరం, పుణ్యం, లోకుల అజ్ఞానం అనే మాలిన్యాన్ని తొలగించేదీ అయిన శ్రీమహావిష్ణువు గొప్ప యశస్సును భక్తితో స్తోత్రం చేసి, నారాయణునే భావించటం అనే సాటిలేని భక్తిని పొంది, గొప్పగా శ్రీహరి శాశ్వతస్టానాన్ని చేరుకున్నారు.

ఇలా మైత్రేయుడు విదురునకు తెలియజెప్పి ఇంకా ఇలా అన్నాడు. మహాత్మా! నీవు నన్నడిగిన ప్రచేతసులకు నారదునితో సంవాదంగా అయిన శ్రీహరి మాహాత్యాన్నీ, మనువు కుమారుడైన ఉత్తానపాదుని వంశం వరుసనూ నీకు చెప్పాను. అని ఇంకా ఇలా అన్నాడు. నారదుడు ఉపదేశించగా ప్రియవ్రతుడు ఆత్మవిజ్ఞానం పొంది భూవలయాన్ని పాలించి తరువాత రాజ్యం భాగాలుగా చేసి కొడుకులకు ఇచ్చి పరలోకానికి వెళ్ళాడు అని చెప్పగా

(“ఆత్మవిజ్ఞానం పొంది, మహీమండలంబు పరిపాలించి” అనటంలో ఒక విశేషం ఉన్నది. ఎంత జ్ఞాన సంపన్నునికైనా 'స్వధర్మం' విధ్యుక్తంగా నిర్వహించకపోతే కలిగేది దుర్గతియే అని చెప్పటం ఇక్కడ తాత్పర్యం.)

విదురుడు తాపసులలో గొప్పవాడైన మైత్రేయుని మహిమగల పాదాలను తన తలమీదా, శ్రీ మహావిష్ణుని పాదపద్మాలను హృదయంలోనూ నిలుపుకొని మైత్రేయునితో ఇలా అన్నాడు.

మహర్షి వరేణ్యా! దయాశాలీ! భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణుని తత్త్వాన్ని నీ వలన తెలుసుకున్నాను అని ఆయన పాదాలకు మరొకసారి నమస్కరించి వినయంతో

ఆ మహర్షిచేత ఆహ్వానింపబడినవాడై ఆనందం నిండుగా కలుగగా బుద్ధిశాలి అయిన విదురుడు హస్తిపురానికి బంధుజనులను చూడాలి అనే కోరికతో వెళ్ళాడు.

అని శుకమహర్షి దయతో పరీక్షిన్నమహారాజునకు ఈ ఉపాఖ్యానాన్ని తెలియజెప్పాడు. దీన్ని విన్నవానికి ఐశ్వర్యం, ఆయువు, సంపద, కీర్తి, శుభం, సద్గతి కలుగుతాయి.

ఈ విధంగా శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు చెప్పిన కథను సూతమహర్షి పరమానందంతో శౌనకుడు మొదలైన మహర్షులకు తెలియజేసినాడు.

రసవంతాలైన వాక్కులతో విరాజిల్లు స్వామీ! గుణాలకు సముద్రమైనవాడా! సాగరమే మొలనూలుగాగల భూమిని భరించే ఎట్టి బరువునైనా అలవోకగా తాల్చగల మేలైన భుజం అనే సర్పరాజు (శేషుడు) కలవాడా! రాజులలో శ్రేష్ఠుడా! ఖరుడు దూషణుడు మొదలైన రాక్షసులు అనే దట్టమైన చీకట్లకు మిక్కిలి తీవ్రమైన కాంతికిరణాలుగల సూర్యుడా! శివుని వింటిని విరవటం క్రీడగా అయినవాడా! భక్తులను కాపాడే ప్రభూ!

(ఇందులో భగవంతుని మూడు కర్తవ్యాలైన శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మస్థాపన అనేవి ప్రసక్తాలయ్యాయి. శివధనుర్భంగం మొదలైనవి లీలలు. భుజాన్ని శేషునితో అభిన్నంగా చెప్పటం వలన రూపకం. అలాగే ఖరదూషణాదుల విషయంలో దట్టమైన చీకట్లను, రాముని విషయంలో భాస్కరత్వాన్నీ రూపించారు.)

స్వామీ! శ్రీరామచంద్రా! నీవు ఒక బాణంతో మారీచుడనే మాయలేడిని మట్టుబెట్టావు. నీ కంటి కొనలో కారుణ్యం ఎల్లవేళలా జాలువారుతూ ఉంటుంది. భక్తులు ఒక పెద్ద సముద్రం అయితే దాని అలవు నీవు. పాపాలనే చీకట్లకు నీవు భాస్కరుడవు. దొడ్డ ఇల్లాలు సీతాదేవితో సంగం కలవాడా! సముద్రుని అహంకారాన్ని అణచినవాడా!

(తరంగం సముద్రాన్ని విడిచి ఉండనట్లే భగవంతుడు భక్తులను వదలి ఉండడు.)

స్వామీ శ్రీరామచంద్రా! నీవు పెక్కండ్రు రక్కసులను మట్టుపెట్టిన వాడవు. సుందరి అంటే సీతగా అవతరించిన లక్ష్మియే. ఆమెకు నీవే మన్మథుడవు. రసహృదయులైన విద్వాంసులు నిన్ను మహావిద్వాంసునిగా కొనియాడుతారు. సర్వలోకాలకూ ఉపకారం చేసే శీలం నీది. నీ గుణాలవంటి గుణాలు లోకంలో మరెందూ లేవు. వానితో నీవు చక్కగా అలంకరించబడిన వాడవు. (మహోదాత్తగుణాలతో అందరి హృదయాలను ఆకట్టు కొంటావు). నిర్మలమైన ఆనందాన్ని భక్తులకు కలిగిస్తావు. గొప్పయుద్ధంలో విలాసంగా సంచరించగల మహిమ నీకు ఉన్నది. అతిక్రూరచిత్తులైన రక్కసులను చంపివేశావు.


 శ్రీ కృష్ణార్పణమస్తు  


శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

Puranjanopakhyanam Puranjana Story - పురంజనోపాఖ్యానము

పురంజనోపాఖ్యానము

రాజా! విను. వెనుకటి కాలంలో పురంజనుడనే ఒక రాజు ఉండేవాడు. అతనికి అవిజ్ఞాతుడు అనే మిత్రుడొకడు ఉన్నాడు. అతని చేష్టలు అందరికీ తెలుస్తూ ఉంటాయి. ఆ పురంజనునకు ఒక పురం (నగరం) కావలసి వచ్చింది. దాని కోసం వెదకి భూమండలమంతా కలయదిరిగాడు. తనకు తగిన పురం అతనికి ఎక్కడా కనిపించలేదు. కనిపించిన పురాలు తాను కోరే కోరికలను తీర్చుకోవటానికి తగినవిగా లేవు. ఆ స్థితిలో అతడొకనాడు వెళ్తూ ఉండగా హిమాలయపర్వతం దక్షిణపు చరియలలో

ఆ పురంజనుడు అక్కడ ఒక గొప్పనగరాన్ని చూచాడు. దానికి మేలైన వాకిళ్ళు, తలుపులు, కిటికీలు, తోరణాలు(పూలమాలలు, మామిడాకుల దండలు మొదలైనవి కట్టుకోవటానికి రెండు వైపుల స్తంభాలతో ఏర్పాటు చేసే కట్టడాలు) గుమ్మాలు, గోపురాలు అనే వాటితో అలరారుతున్నది. పెద్దచుట్టుగోడలు, శతఘ్ని మొదలైనయంత్రాలు, కోటలు, రాచబాటలు, గవనులు, బురుజులు, పూలతోటల సముదాయాలు అనేవానితో ఒప్పారి ఉన్నది. (గవను- కోటదారి). బంగారంతో, వెండితో, ఇనుముతో నిర్మించిన పెద్ద గోపురాలతో చూడముచ్చట అయిన పెక్కుతీరుల ఇండ్లు అక్కడ ఉన్నాయి. పెద్దవీథులు, శాలలు, కూడలులు, పతాకలు, ఆటస్థలాలు, మంచి దేవాలయాలు మొదలైనవి కళకళలాడుతూ ఉన్నాయి. వేలకొలదిగా ఉన్న గరుడపచ్చలతో, స్ఫటికాలతో, వైడూర్యాలతో, కొంగ్రొత్తముత్యాలతో కూర్చిన పెద్దభవంతులు ఉన్నాయి. పగడాల చెట్లతో అల్లుకొని ఉన్న అరుగులు విరాజిల్లుతున్నాయి. అటువంటి ఒకపురాన్ని భోగవతిని తలపించేదానిని, ఆ పురంజనుడు చూచాడు.

తరువాత అక్కడ ఒక ఉద్యానవనం అతనికి కనబడింది. దాని చుట్టూ గొప్పచెట్లు లతలూ దట్టంగా అల్లుకొని ఉన్న పొగరెక్కి కూస్తున్న పక్షుల, తుమ్మెదల గుంపుల కలకలనాదంతో శోభిల్లే సరస్సు ఒకటి ఉన్నది. చల్లని నీటితుంపురులు బొట్లుబొట్లుగా పడుతుంటే చక్కగా కదలుతున్న తామరలుగల కొలనులు ఉన్నాయి. బాటసారుల మనస్సులను ఆకట్టుకుంటూ స్వాగతం చెబుతున్నాయా అన్నట్లున్న కలహంసల, గొప్ప చిలుకల, కోకిలల కమ్మని కూతలలో విరాజిల్లుతూ ఉన్నదీ, మునుల వ్రతాలను పాటిస్తున్న పెక్కువిధాలైన అడవి మృగాలమందలవలన ఎట్టి బాధలూ లేకుండా ఉన్నదీ అయిన నగరం వెలుపల ఉన్న పూలతోటయందు ఒక ఇంతిని చూచాడు. ఆమె వెనుక పదిమంది అనుచరులు ఉన్నారు. ఒక్కొక్క అనుచరునకూ నూరుగురు పరిచారకులు ఉన్నారు. అయిదు తలల పాము అనే ద్వారపాలకుడు వెంట వస్తున్నాడు. ఆమె భర్తగా పొందటానికి తగిన వానిని వెదకుకుంటూ వస్తున్నది. కోరిన రూపం పొందగల సామర్ధ్యం ఆమెకు ఉన్నది. యౌవనంలో ఉన్నది కానీ ఆ దశ ఇంకా పరిణతికి రాలేదు. అటువంటి ఒక స్త్రీని పురంజనుడు చూచాడు.

ఆ తరుణి చక్కగా ఎత్తైన సమంగా ఉండేవిధంగా పెట్టుకొన్న కర్ణకుండలాల కాంతులు చెక్కిళ్ళమీద నిండి వ్యాపిస్తూ ఉన్నాయి. తామరపూల రేకుల శోభను మించిపోయే మెరుగు కన్నులు తలచుట్టివస్తున్నాయా అన్నంత విశాలంగా ఉన్నాయి. పిరుదుల మీద చక్కగా అతుకుకొని ఉన్న గోరోచనం వన్నెగల పోకముడి వెలుగు బంగారు మొలనూలికాంతిని మరింత ఎక్కువ చేస్తున్నది. పద్మాలవంటి పాదాలమీద వెలుగొందుతూ కదలాడుతున్న అందెల కమ్మని నాదం తక్కిన నాదాలను వెక్కిరిస్తున్నదా అన్నట్లు ఉన్నది. అప్పుడప్పుడే ఏర్పడిన పరువంయొక్క శోభతో విరాజిల్లుతూ కాంతులను విరజిమ్ముతున్న బలిసిన, సమంగా ఉన్న నడుమ సందు ఏమాత్రమూలేని పాలిండ్ల మొగ్గలను సిగ్గుతో పైటతో కప్పుతూ ఉన్నది. అటువంటి లేతచందురుని వంటి మోముగల ఆ యువతి చిన్నవయస్సులో ఉన్నది. తెల్లని కాంతులతో విరాజిల్లుతున్న పలువరుసతో అలరారుతున్నది. ఏనుగు నడకవంటి నడకతో ఒప్పారుతున్నది. అటువంటి మేలుజాతి స్త్రీని పురంజనుడు చూచి.

అతనికి వెంటనే ప్రేమ పుట్టుకొని వచ్చింది. మన్మథుని వింటిబద్దలలాగా ఉన్న ఆ ఇంతి సరసమైన చూపులనే బాణాలు తన దేహంలో బాగా గుచ్చుకొన్నాయి. అటువంటి స్థితిలో ఆ రాజు ఆమెతో ఇలా అన్నాడు.

మృగాక్షీ! నీవెవ్వరిదానవు? తండ్రి ఎవరు? నీ పేరేమిటి? ఈ సేవకులు పదిమందీ ఎవరు? ఈ ఆడువారెవ్వరు? ఈ అడవిలో ఉండటానికి కారణం ఏమిటి?

నీ ముందు నడచివస్తున్న ఆ పాపరాజు ఎవడు? మిక్కిలి దయగల బుద్ధితో నాకు వివరించి చెప్పు అని మళ్ళీ తెల్లని కాంతుల కన్నులుగల ఆమెతో ఇలా అన్నాడు.

చక్కగా కదలుతున్న కన్నులున్న ఓ యువతీ! నీవు ధర్ముని వెదకుతూ తిరుగుతున్న హ్రీ దేవివా? రుద్రుని వెదకుతున్న ఉమా దేవివా? బ్రహ్మను వెదకుతున్న భారతీదేవివా? నారాయణుని భక్తితో కోరి వెదకుతున్న లక్ష్మీదేవివా? కాక ఎవ్వరు నీవు. నీ పాదాలను కోరటంచేత అన్ని కోరికలను తీర్చుకొన్న ఎలాంటి సరసుని వెదకుతున్నావు? నీ చేతి చివర విలాసంగా ఉండే పద్మంమొగ్గ ఎక్కడ పడిపోయింది? వివేక ప్రవృత్తిగల ఓ ఇంతీ! నాకు చెప్పాలి - అని రాజు ఆమెతో ఇంకా ఇలా అన్నాడు.

తరుణీ! నీ విలా నేలమీద తిరుగాడుతూ ఉండటం వలన హ్రీ, శివ, శారద, లక్ష్మీదేవి అనేవారలలో ఒకతెవు కావు అని గుర్తించాను. అని ఇంకా ఇలా పలికాడు.

పద్మాక్షీ! నేను ఇపుడు గట్టి ప్రయత్నంతో నీచమైన పనులు లేకుండా ఈ పురాన్ని ఏలుతూ ఉన్నాను. ఇట్టి పురాన్ని శ్రీమహావిష్ణుని భుజాలచే పాలింపబడు వైకుంఠాన్ని లక్ష్మీదేవిలాగా నీవు అలంకరించు. అంతేకాదు. నీ కడకంటిచూపులు నన్ను మోహపెడుతున్నాయి. గొప్పదైన సిగ్గుతో కూడిన చిరునవ్వుల అందమైన కదలికలుగల నీ కనుబొమలు పురికొల్పుతుండగా విజృంభిస్తున్న మన్మథుడు నన్ను వదలకుండా బాధిస్తున్నాడు.

చిన్నదానా! నీమోము చక్కని కనుపాపలతో కూడిన కన్నులతో అలరారుతున్నది. చాలా అందమైన, అమృతంవంటి మెత్తని పలుకులతో కూడి ఉన్నది. సుకుమారంగా వ్రేలాడుతున్న అందమైన ముంగురులతో అలరారుతున్నది. గొప్పగా ఉన్నది. అటువంటి నీ మోము అనే పదాన్ని చూడముచ్చట అయ్యే విధంగా ఎత్తి నన్ను చూడు. నీవు ఇప్పుడు సిగ్గుపడడమెందుకు?

ఆ పురంజనుడు గుండె దిటవులేనివాడై పలుకుతున్నాడు. ఆమె కాంతలలో మేలుబంతి అయినది; వీరుడు వరించినది. కనుక చిరునవ్వు మోముపై చిందులాడుతూ ఉండగా ఆనందం పొంది ఇలా పలికింది.

పురుష శ్రేష్ఠా! నాకూ నీకూ గురువైన వానినీ, పేరునూ కులాన్నీ నేనెరుగను. ఈ పురంలో ఉంటాను కానీ దీనిని ఎవరు కట్టించారో నాకు తెలియదు.

(ఈ పురంజనోపాఖ్యానం ఒక తాత్త్వికార్థాన్ని ప్రతీకగా చెబుతున్న కథా భాగం. 'పురం' ఇక్కడ దేహమే. పురంజనుడు దేహి, అనగా జీవుడు. ఈ పలుకుతున్న స్త్రీ వ్యక్తిని 'బుద్ది'గా సంభావించాలి. దేహంలో ఉన్న జీవునకూ, బుద్ధికీ ఆ దేహం ఎలా ఏర్పడిందో, అజ్ఞానం వలన తెలియదు. 'గురువు' ఇక్కడ పరమాత్మయే. అతని తత్త్వం తెలియకుండానే జీవుడు దేహంలో కాలక్షేపం చేస్తూ ఉంటాడు.

మంచి గుణాలుగల ఓ రాజా! ఈ స్త్రీలూ, ఇంకా కనపడుతున్న మగువలూ నా చెలికత్తెలు. ఈ ముసలిపాము నేను నిద్రపోతున్నప్పుడు ధైర్యంతో, పట్టుదలతో ఈ పట్టణాన్ని కాపాడుతూ ఉంటుంది.

ఇంకా ఆ ఇంతి ఇలా అన్నది, రాజా! నీవునా అదృష్టం కొద్దీ ఇక్కడకు వచ్చావు. ఇప్పుడు నీకు శుభం కలుగుతుంది. నీవు చాలా గొప్పవి అయిన ఇంద్రియవర్గం తృప్తిపడే సుఖాలను పొందుతావు. ఇది తొమ్మిది వాకిళ్ళతో ఏర్పడిన నగరం. దీనిని స్వాధీనం చేసుకొని పాలించు. ఇందుకు నీకంటె తగినరాజు మరొకడు లేడు. నేను సమకూర్చ సౌఖ్యాల నన్నింటినీ అనుభవిస్తూ ఇక్కడ నూరేండ్లు ఉండు. పరిశీలించి చూస్తే నీ కంటె నాకు ఇష్టులయినవారు లేరు.

(ఈ పురం దేహమే. ఇందులోని తొమ్మిది వాకిళ్ళు, రెండు కన్నులు, రెండు చెవులు, రెండు ముక్కులు, ఒకనోరు, మలమూత్ర విసర్దనావయవాలు రెండు. మాయారూప అయిన బుద్ధి వీటికి కోరినవన్నీ అందిస్తూ సుఖం కలిగిస్తున్నట్టు ఉంటుంది. ఈ ప్రతీకలన్నింటినీ ముందుముందు పూర్తిగా వివరించి సమన్వయిస్తారు.)

కామభావాలు లేనివాడు, శాస్త్రరహస్యాలు తెలియనివాడూ, ఈలోకపు, పరలోకపు భావాలులేనివాడూ, గొడ్డువంటివాడూ అయిన మరొక్కనిని నేను వరిస్తానా? గృహస్థ ఆశ్రమంలో ధర్మార్థకామమోక్షాలతోపాటు సంతానసౌఖ్యం కూడా లభిస్తుంది. కీర్తి యతులకు తెలియరాని రజస్తమోగుణాల సంపర్కంలేని పుణ్యలోకాలు కలుగుతాయి. ఈ ఆశ్రమంలో పితృదేవతలకు, దేవతలకు, ఋషులకు, మానవులకూ, ఇతర జంతువులకూ, తనకూ అన్ని విధాలైన క్షేమాలు కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి గొప్పదాతవు, వీరుడని పేరు పొందినవాడవు, చూడముచ్చటగా నున్నవాడవూ, నీ అంత నీవై వచ్చిన వాడవూ, ఆదిశేషుని పడగలవంటి దృఢమైన బాహువులతో అలరారుతున్నవాడవూ అయిన నీ వంటివానితో సంగం ఏర్పరచుకొని నా వంటిది వరింపకుంటుందా? అని ఇంకా ఇలా అన్నది.

రాజా! నీ కన్నులలో జాలిభావం నిండుగా వెలుగొందుతూ ఉన్నది. అది నీ చిరునగవులో తెలియవస్తున్నది. అటువంటి చూపులు నిరంతరం వెలుగొందుతూ ఉండగా యాచకుల భయాలన్నింటిని పోగొడుతూ అన్ని లోకాలలో తిరుగుతూ ఉండు.

అని ఆమె ఇలా పలుకగా పురంజనుడు ఆమెను భార్యగా స్వీకరించి పరస్పరప్రీతితో ఒప్పుతూ ఆ పురంలోనికి ప్రవేశించి ధన్యుడైనాడు.

(1) అన్యోన్య ప్రీతిన్‌ - భార్యాభర్తల అనురాగం రెండు వైపులా నిండి ఉండాలి. అదే సరియైన దాంపత్యలక్షణం.

2) ధన్యుడు - ధనం అంటే పుణ్యం. అది కలవాడు ధన్యుడు. సర్వసమయాలలో పుణ్యకార్యాలు మాత్రమే చేస్తూ ఉండేవాడని తాత్పర్యం.

ఆ రాజు నూరేండ్లు ఆ నగరంలో ఎడతెరపి లేకుండా చాలా గొప్పవీ, అన్ని విధాలయినవీ అయిన సుఖాల పొందులతో ఒప్పారుతున్నాడు. వందుల స్తుతిపాఠాలూ, గాయకుల సంగీత కాలక్షేపాలతో ప్రమోదం పొందుతూ ఉన్నాడు. అందగత్తెలయిన సుందరులెందరో అతనిని సేవిస్తున్నారు. రాజులకే యోగ్యాలయిన చక్కని తావులలో క్రీడలు సలుపుతూ ఉన్నాడు.

ఇంతలో లోకభయంకరంగా వేసవికాలం వచ్చింది. అప్పుడా రాజు తరంగాలు కదలాడుతూ ఉన్న మనోహరమైన మేలైన కొలను నీటిలో ఉన్నాడు.

ఈ విధంగా ఉండి కొన్ని రోజులు గడచిన తరువాత

రాజా! విను. ఆ నగరానికి నాలుగువైపులా నాలుగు కోటద్వారాలు ఉన్నాయి. అందులో తూర్పుదిక్కున అయిదు, దక్షిణ ఉత్తరదిక్కులలో రెండూ, పడమట రెండూ ఉన్నాయి. వానిలో ఏడు పైభాగాన, రెండు క్రింది భాగాన ఉన్నాయి.

వానిలో వేరు వేరు విషయాలు పొందడానికి ఈశ్వరుడొకడు ఉన్నాడు. అట్టి పురాన్ని పాలిస్తున్నవాడు పురంజనుడు. అందులో తూర్పు ద్వారంలో ఉన్న అయిదింటిలో వరుసగా

(ఈ పురానికి తొమ్మిదివాకిళ్ళు ఉన్నాయి. పురమంటే ఇక్కడ దేహమే. అందులో తూర్పువైపున అయిదు ఉన్నాయి. అవి రెండు కన్నులు, రెండు ముక్కురంధ్రాలు, ఒక నోరు అనేవి. దక్షిణంగా ఒకటీ, ఉత్తరంగా ఒకటీ అయిన రెండూ రెండువైపులా ఉన్న చెవులు. వానిలో వేరు వేరు విధంగా ప్రవేశించే విషయాలంటే 1. రూపం 2. గంధం 3. రసం 4. శబ్దం, 5. స్పర్శ అనేవి. పురరూపంలో అంతటానిండి ఉన్న చర్మాన్ని ఒక ద్వారంగా ఇక్కడ ప్రత్యేకించి పేర్కొనలేదు. దానిని కూడా మనం గ్రహించి 'స్పర్శ' అనే దానిని కూడా లెక్కించుకోవాలి.

ఈ తొమ్మిదింటిలో పురానికి పై వైపుగా ఏడూ, క్రింది వైపుగా రెండూ ఉన్నాయి. పై వైపుగా అంటే ముఖభాగంలో అని అర్థం. కన్నులు, ముక్కులు, నోరూ, చెవులూ అనేవి ఆ ఏడూ. క్రింది భాగంలో అంటే నడుం కింద రెండు ఉన్నాయి. మొదటిది పాయువు - మలవిసర్జన ద్వారం. రెండవది ఉపస్థ. జననేంద్రియం.)

పురంజనుడు తూర్పుద్వారంలో ఉన్న అయిదువాకిళ్ళలో ఖద్యోత, హవిర్ముఖి అనే రెండింటిలో ద్యుమత్తు అనే చెలికానితో కలసి విభ్రాజితం అనే జనపదాన్ని పొందుతాడు. నళిని, నాళిని అనే మరొకరెండు వాకిళ్ళ దగ్గర అవధూత అనే మిత్రునితో కూడి పరిమళ సంబంధమైన విషయాలను పొందుతాడు. ఆ తూర్పుదిక్కు వాకిళ్ళలో ప్రధానమైనది ముఖ్యం. అందులో రసజ్ఞ, విపణ అనేవారితో కలిసి ఆపణం, బహూదనం అనే విషయాలను పొందుతాడు. దక్షిణంవైపు వాకిలియైన పితృహువునందు శ్రుతధరునితో కలిసి దక్షిణపాంచాలాన్నీ ఉత్తరంవైపు ఉన్న దేవహువునందు శ్రుతధరునితో కలిసి ఉత్తరపాంచాలం అనే రాష్ట్రాన్నీ పొందుతాడు. అంతేకాదు. పడమటివాకిళ్ళు రెండు ఉన్నాయికదా! అందులో ఒకటి ఆసురి. అక్కడ దుర్మదుడనే వానితో కూడి గ్రామకం అనే పేరుగల విషయాన్నీ రెండవదైన నిరృతియందు, లుబ్ధికునితో కలసి వైశసం అనే విషయాన్నీ పొందుతాడు. ఇంతేకాక పురంజనుని ఆ పురంలోని నగరవాసులలో నిర్వాక్కు పేశస్కరుడు అనే ఇద్దరు గుడ్దివారున్నారు. వారి ద్వారా గమనం, కరణం అనే క్రియలను పొందుతూ ఉంటాడు. ఆ సమయంలో రాణివాసానికి చేరుకొని విషూచీనునితో కూడి ఆలు బిడ్డల వలన కలిగిన మోహం, ప్రసాదం, హర్షం అనే భావాలను పొందుతాడు. ఈ విధంగా కర్మల తగులమూ, కోరికలే తన స్వరూపమూ కాగా బుద్ది అనే పట్టపురాణి చేత వంచితుడై పోయాడు. ఆ వనిత కూడా!

(ఈ వచనం అంతా అద్భుతమైన ప్రతీకలతో విరాజిల్లుతున్నది. దీనిని కవియే తరువాత విప్పి చెబుతాడు. అయినా రేఖా మాత్రంగా ఇక్కడ వివరించుకోవాలి. జాగ్రదవస్థలోని దేహస్థితిని ప్రతీకలతో వివరిస్తున్నారు.

1.తూర్పుదిక్కున ఉన్నవాకిళ్ళు అయిదు. ఇక్కడ పురం అంటే దేహమే కనుక, దేహంలో ప్రధానావయవం ముఖం. దానిలోని అయిదు వాకిళ్ళు 2 కన్నులు, 2 ముక్కులు, 1 నోరు. అందులో మొదటగా రెండు కన్నులను చెబుతున్నారు. 1. ఖద్యోత 2. హవిర్ముఖి

ఖద్యోతం అంటే మిణుగురుపురుగు - దానివలె కొంచెం పాటి వెలుగుకలది ఎడమకన్ను

ఆవిర్ముఖి - మూలంలో ఆవిర్ముఖి అని ఉన్నది. తెలుగులో హవిర్ముఖి అని పాఠం. ఏమైనా ప్రకటమైన ముఖంకలది. గొప్ప వెలుగుకలది అని అర్ధం. అది కుడికన్ను.

2. విభ్రాజిత మనే జనపదం - రూపమనే ఊరు. కంటికి రూపం విషయం కదా!

3. ద్యుమత్సఖుడు - రూపాన్ని గ్రహించే శక్తితో కూడినవాడు.

4. నళిని, నాళిని - నలం, నాలం అనేవి రంధ్రం అనే అర్థం కలవి. రంధ్రం కలవి నళిని, నాళిని - అంటే ముక్కురంధ్రాలు. ఎడమ, కుడి ముక్కులు. ఇందులో కూడా ఎడమదానికంటిె, కుడిదానికి శక్తి ఎక్కువ. కనుక దానిని తెలియజేసే 'న', 'నా' అనే హ్రస్వదీర్ఘాక్షరాలను ప్రయోగించారు.

5. అవధూత అంటే వాయువు అధిష్టానంగాగల ఘ్రాణేంద్రియం.

6. సౌరభం అంటే గంధం. ఘ్రాణేంద్రియానికి విషయం.

7. ముఖ్య అంటే ప్రధాన - ముఖంలో ఉందేది నోరు అని అర్థం.

8. రసజ్ఞం అంటే నాలుక

9. ఆపణము - పలకటం

10. బహూదనం - చిత్రమైన అన్నం. నిజానికి బహ్వోదనం అనాలి. కానీ గూఢభాషణం కనుక అలా అనలేదు.

11. దక్షిణద్వారం - కుడిచెవి.

12. శ్రుతధరుడు - శాస్త్రాన్ని పట్టుకొనేవాడు. పట్టుకొనే కుడిచెవికి సంబంధించిన ఇంద్రియాంశం.

13. దక్షిణ పాంచాలం - అయిదు విషయాలు. అవి మరొక మార్గంతో తెలియరావు. శాస్త్రంతో మాత్రమే తెలుస్తాయి. కనుక అయిదింటి ప్రకాశానికి చాలినది(అలమ్‌) పంచాలమ్‌ అంటే శాస్త్రం. శాస్త్రమునందు కూడా మొదట వినదగినది కర్మకాండం కనుక దానికి సంబంధించిన మంత్రాలు కుడి చెవియందే గురువులు నిక్షేపిస్తారు కనుక అది దక్షిణ పాంచాలం అయినది.

14. కర్మకాండ మంత్రాలను కుడి చెవిద్వారా విని వాటి అర్థాలను చక్కగా తెలుసుకొని పితృదేవతలను ఆహ్వానిస్తారు కనుక కుడిచెవి పితృహువు.

15. పితృహువు కంటె వేరైనది దేవహువు అంటే ఎడమచెవి. దీనిని ముందు ఇలా వ్యాఖ్యానించనున్నారు.

"పితృహూ ర్థక్షిణః కర్ణః ఉత్తరో దేవహూః స్మృతః ప్రవృత్తం చ నివృత్తం చ శాస్త్రం పఞ్చాలసంజ్ఞితమ్‌, పితృయానం దేవయానం శ్రోత్రాచ్చ్రుతధరా ద్వ్రజేత్‌" - భాగ. 4.29. 12, 13శ్లో.

'పితృహువు కుడిచెవి. దేవహువు ఎడమచెవి. ప్రవృత్తం, నివృత్తం అయిన శాస్త్రం పంచాలం. పితృయాన దేవయానాలను శ్రుతధరమైన శ్రోత్రం వలన పొందాలి.'

16. పడమటి వాకిళ్ళు - ఉపస్థ, పాయువు - జననేంద్రియం, మలవిసర్జనేంద్రియం.

17. ఆసురి - అసురములు అంటే ఇంద్రియముల నెలవులు. వానికి సంబంధించినది ఆసురి. శిశ్నద్వారం.

18. దుర్మదుడు - గుహ్యమనే ఇంద్రియం.

19. గ్రామకం - గ్రామంలో ఉన్న జనాలకు కం - అంటే సుఖం ఇచ్చేది. రతికి సంబంధించిన ఆనందం. గ్రామం అంటే సముదాయం అని అర్థం.

20. నిరృతి అంటే గుదం. అది మృత్యుద్వారం.

21. వైశసమంటే మలవిసర్జనం.

22. లుబ్ధకం అంటే పాయువు - మల విసర్జనావయవం.

23. నిర్వాక్కు - పాదం

24. పేశస్కృత్తు - చేయి.

ఈ రెండూ గుడ్డివి అంటే ఛిద్రాలు - రంధ్రాలు లేనివి. ఈ రెండూ నడకకూ, పనులకూ ఉపయోగపడతాయి. జ్ఞానక్రియాశక్తి వీటికి లేదు.

వీటిలో త్వగింద్రియం చర్మం గురించి చెప్పలేదు. ఎందుకంటే అది అన్నింటిలో అంతర్భవించి ఉంటుంది కనుక.)

ఆ పురంజనుడు ఆ కామిని చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. ఆమె ఏమి చేస్తే అదే చేస్తూ తన కొక వ్యక్తిత్వం ఉన్నదని మరచిపోయి ప్రవర్తించాడు. అంటే సర్వవిషయాలలో తన ఇష్టం ఇష్టం కాదు. ఆమె కదలికలే సర్వమూ అయిపోయాడు. ఆమె త్రావితే త్రావటం, ఆమె తింటే తినటం, ఆమె చిరుతిండికి పూనుకుంటే తానూ పూనుకోవటం, నడిస్తే నడవటం, నవ్వితే నవ్వటం, ఏడిస్తే ఏడవటం, వింటే వినటం, చూస్తే చూడటం, కూర్చుంటే కూర్చుండటం, దుఃఖిస్తే దీనుడై దుఃఖించటం, నిలిస్తే నిలవటం, నిద్రిస్తే నిద్రించటం, తాకితే తాకటం, వాసన చూస్తే వాసన చూడటం, పలికితే పలకటం, వాలితే వాలటం, హర్షం పొందితే పొందటం, మోదం పొందితే మోదం పొందటం చేశాడు.

(పురంజనుడు ఒక ప్రాణం ఉన్న మరబొమ్మలాగా అయిపోవటాన్ని ఈ భావం తెలియజేస్తున్నది. దీనినే పతనావస్థ అంటారు.

1. కుడుచుట, భక్షించుట అనే రెంటికీ స్థూలంగా అర్ధం ఒకటే. రెండూ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కుడవటమంటే ప్రధాన భోజనం తినటమనీ, భక్షించటం అంటే మధ్యమధ్య తీసుకొనే చిరుతిండి తినటం అనీ భావించాలి.

2. అలాగే నిదురించు, పవ్వళించు అనేవానికి కూడా నిద్రపోవటం, ఊరకే మేనును వాల్చటం అనే అర్థాలను భావించాలి.

3. హర్షం అంటే ఏదైనా కోరినది సిద్ధిస్తే కలిగే తృప్తి, మోదం అంటే నిలువెల్లా కలిగే ఆనందం.)

ఈ విధంగా అతడు తనరాణి చేసిన మోసానికి బలి అయిపోయాడు. తన స్వభావం మీద తనకు అదుపాజ్ఞలు లేనివాడయ్యాడు. తెలివి మాలినవాడయ్యాడు, ఇతరమైన సంకల్పాలు లేనివాడయ్యాడు. పెంపుడు జంతువులాగా మెలగటం, తిరగటం చేస్తూ ఆ పురంలో కాపురం ఉంటున్నాడు. ఒక రోజున ఆ పురంజనుడు విల్లుపట్టుకొని బయలుదేరాడు.

(జీవుడు వివేకంతో తన మీద తనకు అధికారం కలవాడైతే సద్గతికి చేరుకుంటాడు. పరాధీనుడైతే ఎవరో తిప్పే యంత్రం లాగా అయిపోతాడు. అది దుర్గతి.)

ఏడు గుర్రాలూ, అయిదు కట్లూ, రెండు చక్రాలూ, రెండు కాడులూ, గొప్ప వేగమూ, ఒక ఇరుసూ, రెండు నొగలూ, మూడు పతాకలు, ఒక పగ్గమూ, ఒక సారథీ, ఏడు సాయమేకులూ, బంగారు నగలూ, అయిదు విధాలైన గతులూ, ఒక గూడూ, బాగా కన్పిస్తున్న అయిదు ఆయుధాలూ కలది అయిన రథం ఎక్కి బంగారు మైతొడుగును తాల్చి, ఒప్పారుతున్న తరుగువోని అంపపొదిని కూర్చుకొని గట్టి పట్టుదల ప్రకాశిస్తూ ఉండగా పదకొండు విధాలైన గొప్ప సేనలు వెంటరాగా ఆర్భాటంగా బయలుదేరాడు.

(ఈ రథం మామూలు రథం కాదు. దేహమే ఇచట రథం. దానిని బట్టి అయిదు గుర్రాలూ మొదలైనవానిని వివరించుకోవాలి.)

ఆ పురంజనుడు నగరంనుండి వెలుపలికి వచ్చి పంచ ప్రస్థం అనే పేరుగల అడవిలోనికి చేరుకున్నాడు. అక్కడ విడవరాని తన పట్టమహిషిని విడిచిపెట్టాడు. విల్లమ్ములు పట్టుకొని వేటమీది తమకంతో పొగరెక్కినవాడై క్రూరమైన మనస్సుతో దయలేనివాడై వాడిబాణాలతో అక్కడి పశువుల మందలను చంపి వేశాడు.

రాజులకు వేటను శాస్త్రం ఏర్పరచినదియే కదా! మరి అది రాక్షసవృత్తి ఎందుకవుతుంది అంటావేమో, విను. ఇక్కడ ఇతని ఈ వేట రాగం అంటే మమకారంతో ఏర్పడినది. కాబట్టి శాస్త్రం విధించినది కాదు. శ్రాద్దాలలో, ప్రసిద్ధమైన శ్రాద్ధ దినాలలో రాజైనవాడే యజ్ఞాలకు పనికి వచ్చే పశువులనే అడవియందే, అవసరానికి తగినంతగానే చంపాలి అనే నియమం ఉన్నది. కాబట్టి జ్ఞానంగల విద్వాంసుడు ఇట్టి వేటను చేయడు. చేసినా కర్మలను అనుష్ఠించగా పుట్టిన జ్ఞానం చేత అందులో తగులం పొందడు. అలా కాక నియమాలను కాదని కర్మానుష్ఠానం చేసేవాడు నేను చేస్తున్నాను అని తానే కర్తను అనుకొని కర్మలందు చిక్కుకొని, గుణాల ప్రవాహాలలో పడిపోతాడు. అతని తెలివి నశించిపోతుంది. చివరికి నరకలోకంలోనికి పడిపోతాడు. కాబట్టి సత్పురుషులకు రాక్షసవర్తనం పనికిరాదు. అని పలికి ఇంకా ఇలా అన్నాడు. అప్పుడా పురంజనుడు ఆ అడవిలో

ఆ రాజు వింత వింతరంగుల ఈకలు కల వాడిబాణాలతో కుందేళ్ళను, అడవిపందులను, చమరీమృగాలను, నల్లచారల దుప్పులను, అడవిదున్నలను, గురుపోతులను, ముండ్ల పందులను, లేళ్ళను, ఏనుగులను, సింహాలను, తోడేళ్ళను, బెబ్బులులను, కోతులను, ఖడ్గమృగాలను చంపి ఇంకా,

క్రమంగా మేలుజాతికి చెందినవీ, హీనమైనవీ అయిన మృగాలను జాలి లేకుండా విలాసంగా చంపివేశాడు. అలసత పొందాడు. వేటను చాలించాడు. భవనానికి తిరిగి వచ్చాడు. తగు విధంగా స్నానం, భోజనం మొదలైన పనులను ముగించాడు. బడలిక తీరటం కోసం పడుకున్నాడు. సువాసనలు వెదజల్లే సాంబ్రాణి మొదలగు వాని వాసనలను అన్ని అవయవాలకూ పట్టించుకున్నాడు. పూలదండలు, మైపూతలు, పెక్కువిధాలైన ఆభరణాలు, వస్త్రాలు ధరించాడు. తృప్తి, సుఖం, గుండె దిటవు కలవాడయ్యాడు. మన్మథుని భావం పైకొనగా రతిక్రీడ మీదకు మనస్సు పోయింది.

(ఇందులో వివరించిన కార్యాలన్నీ భౌతిక సుఖాలకు సంబంధించినవి. వీటిని సవిస్తరంగా వర్ణించటంచేత పురంజనునిలో పరమార్థభావన ఏమాత్రమూ అంకురించలేదనే విషయం తెలియవస్తున్నది.)

అప్పుడు తన ప్రాణప్రియ అయిన రాణియందు మనస్సు పెట్టి, సుందరాంగి, తన భోగాలకు ఆధారం అయినదీ అయిన ఇల్లాలు కనబడకపోతే మనస్సు మనస్సులో లేనివాడై తన అంతఃపురకాంతలను చూచి ఇలా అన్నాడు.

గుంపులుగా తిరుగుతున్న కాంతలారా! ఉత్తమ వనితయు, స్త్రీలకు తలమానికం అయినదీ అయిన నాభామ దయపొంది మెలగుతూ ఉంటారా? ఆమెకు కుశలమేనా?

మంచివివేకం కల ఓ కాంతలారా! నా కీ సంసారంలో భోగభాగ్యాలు మునుపటిలాగా రుచించటం లేదు. గృహస్థాశ్రమంలో అమ్మ గానీ, సంసారసుఖానికి అనుకూలంగా వ్యవహరించే భార్య గానీ తన పట్ల ఇష్టంగా లేకపోతే ఆ గృహస్థుడు సౌఖ్యాలు పొందగలడా?

పిల్లలను చక్కగా తీర్చి దిద్దింది అని నలుగురూ కొనియాడే తల్లిగానీ, ధర్మమార్గంలో మెలగే ఇల్లాలు కానీ లేని ఇంటిలో ఉండటం, రెండు చక్రాలూ లేని బండిలో ఉండటం వంటిది అవుతుంది.

ఆ నా భార్య నాకు అడుగడుగునా తెలివి కలిగించి స్థిరత్వం లేనిది, గొప్పదీ, భరించటానికి అలవికానిదీ అయిన దుఃఖాల కడలిలో మునిగి ఉన్న నన్ను స్థిరమైన బుద్ధితో పైకి లేవనెత్తింది. ఆ విధంగా నాకు ఎల్లవేళలా ప్రియురాలైనది. అట్టి నా భార్య ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నదో దయతో సంకోచం లేకుండా చెప్పండి.

(ఇందులో భార్యయొక్క ధర్మం ఏమిటో వ్యంగ్య రూపంలో చెప్పారు.)

అప్పుడు రాజు అలా అనగా ఆ స్త్రీలు ఇలా ఆ రాజుకు చెప్పారు. అదిగోనయ్యా! నీ ఇల్లాలు చీరచెరగైనా పరచుకోకుండా పెక్కు దుఃఖాలతో నేలమీద పొరలుతున్నది. చూడు.

ఆమె ఏ కారణంగా అలా ఉన్నదో మాకు తెలియదు. నీవే చూడు అనగా ఆ రాజు నేలమీద పడి పొరలుతున్న తన ఇల్లాలిని చూచి గుండెలో శోకతాపం ఎక్కువ కాగా.

ఆమె మిక్కిలి ప్రేమవలన కలిగిన రోష భావంతో వంకర చూపులు చూస్తున్నది. అది చూచి రాజు బ్రతిమాలటంలో గొప్ప తెలివికలవాడై ఆమె దగ్గరకు వచ్చాడు.

ఆమెను తన ఒడిలో పెట్టుకున్నాడు. ఆమె పాదాల జంటను మెల్లగా నిమిరాడు. ఇంపైన మెత్తని మాటలతో ఆమెను బుజ్జగిస్తూ ఇలా అన్నాడు.

ఓ సుందరాంగీ! సేవకులు ఏవో తప్పులు చేస్తూ ఉంటారు. వారిని ఏలేవారు వీరు మనవారలే అని వారికి మిక్కిలి భయంకరమైన శిక్ష వేయరు. ఒకవేళ మనస్సులో విజృంభించిన కోపంతో శిక్షవేస్తే అది అనుగ్రహించటమే అవుతుంది కానీ శిక్షించటం కాదుకదా!

పద్మముఖీ! చుట్టాలయందు చూపవలసిన ప్రేమాదరాలు చూపకుండా కోపంతో నిండిన కుటిల బుద్ధిని, అహంకారిని, వినయప్రవృత్తి లేనివానిని పసివాడుగా భావించాలి. అనగా అజ్ఞాని అనుకోవాలి. అని ఇంకా,

విరిబోణీ! నీ మోము సరసాలు, ఉదారాలు అమృతానితో పోలిక చెప్పదగినవీ అయిన మాటల నేర్పుల సౌభాగ్యం కలది. ఇంద్రనీలమణులవంటి కోమలములైన ముంగురులు కలది. అందంగా కదలాడుతున్న కనుబొమలు గలది. చక్కని చిరునవ్వుతో కూడిన చూపులు కలది. అట్టి పద్మంవంటి నీ ముఖాన్ని నీ సేవకుడనై నాకు దయతో చూపించవా?

వీరపత్నీ! వనితా! బ్రాహ్మణులు, హరిభక్తులు కాక ఇతరులు ఎంతవారైనా నీ విషయంలో తప్పు చేస్తే వారిని కఠినంగా దండిస్తాను.

సుందరమైన కన్నులతో ఒప్పారే ఓ కాంతా! నాకు కోపం వస్తే భయంలేకుండా సుఖంగా ఉండగలవాడు ఈ మూడు లోకాలలోనూ లేడు.

పద్మాలవంటి కన్నులున్న ఓ కాంతా! నేనెప్పుడూ బొట్టులేనిదీ, మాసినది, సంతోషం లేనిది, అనురాగం లేనిదీ, మిక్కిలి కోపంతో ఉడికిపోయేది అయిన నీ మోమునూ, కన్నీటి బొట్టులు నిండి చక్కగా ఒప్పారుతున్న నీ చిక్కని చక్కని పాలిండ్ల ప్రదేశాన్నీ సుందరమైన తాంబూలపు ఎర్రదనం లేని బాగాపండిన దొండపండువంటి క్రీబెదవినీ ఎప్పుడూ చూడలేదు. నీవిలా ఉండటానికి కారణం ఏమిటి? నాకు తెలుపు. వేట తమకంతో నీకు చెప్పకుండా వెళ్ళిన నా అపరాధాన్ని సహించు. నన్ను కాపాడు.

స్త్రీలకు దాసుడైపోయి, మన్మథుని బాణాల బాధలను పొందుతున్న మనస్సుగల వానినుండి తగిన సేవలు పొందకుండా తప్పించుకొనిపోయే వనితలు ఉండరుగదా!

అంటూ ఆమె విలాసచేష్టలకు వశమై పోయినవాడై పలుకుతున్న వాని మాటలు విని.

పద్మపురేకులవంటి ఆర్ద్రమైన కన్నులతో అలరారే ఆ వనిత పురంజనుని మీద కోపం తగ్గించుకొని, ఇంపుగా, భాగ్యం తొణికిసలాడే, సుందరమైన మెత్తని పలుకులతో అతని హృదయాన్ని అలరిస్తూ అనురాగపూర్వకంగా మాట్లాడింది.

అంతలో ఆ మహాదేవి చక్కగా మంగళస్నానం చేసింది. మెత్తని వస్త్రాలు కట్టింది. పూలమాలలు, గంధపుపూతలు, ఆభరణాలు ధరించింది. గొప్ప సౌందర్యంతో మోహం కలిగించే ఆకారం తాల్చింది. భర్త దగ్గర నిలిచింది. అతని అంతరంగం పరమసంతోషం పొందింది. అంతఃపురంలో నిరంతరంగా సరసాలైన గట్టి కౌగిలింతలతో వాళ్లిద్దరు కాలం గడుపుతున్నారు. రాగంతో కూడి పైకి చెప్పటానికి వీలులేని మాటలు ఆడుకుంటున్నారు. అలా స్త్రీ సంగమం అనే తగులంతో అతని వివేక మంతా జారిపోయింది. ఇది రాత్రి, ఇది పగలు అనే భేదం కూడా వారికి తెలియకుండా పోయింది. ఇలా ఆయువు తరిగిపోతూ ఉండటం కూడా అతడు గమనించలేదు.

అతడు జారిపోవటానికి వీలులేని మదంకలవాడయ్యాడు. అదే గొప్ప జీవితం అనుకున్నాడు. గొప్ప పానుపుల మీద పడి దొరలాడు. రాణి భుజమే దిండుగా చేసుకున్నాడు. అజ్ఞానం పైకొన్న కారణంగా తన స్వరూపమే అయిన ముక్తి అనే పురుషార్థం తెలియనివాడయ్యాడు. తన రాణినే పరమపురుషార్థంగా భావించాడు. ఆమెతోనే ఆనందం పొందుతూ కామంతో మలినమైన మనస్సు కలవాడయ్యాడు. ఆ విధంగా ఆతనికి నవ యౌవనానికి చెందిన కాలం అర క్షణంలా గడచిపోయింది. అప్పుడు.

ఆ రాజు సముద్రమంత స్వచ్చమైన కీర్తి కల ఆ చంద్రముఖి అయిన భార్యవలన ఇష్టపూర్వకంగా పదకొండు వందలమంది యుద్దాలలో రాటుదేలిన కొడుకులను పొందాడు. ఇంకా ఉత్సాహంతో

ఆ పురంజనుడు గొప్పశీలమూ, ఉదారత్వమూ అనే గుణాలతో మేలుబంతులన దగినవారూ, సుకుమార గుణాల సముదాయాలు కలవారూ, వంశాన్ని పవిత్రం చేసేవారూ అయిన నూటపదిమంది కూతుండ్రను ఆ సతి వలన పొందాడు.

ఈ విధంగా కొడుకులను, కూతుండ్రను పొంది ఉండగా 

వినవయ్యా! ఇలా ఆ రాజు ఆయువులో సగభాగం కడచిపోయింది. అప్పుడు ఆ రాజు కులాన్ని పెంపొందించే కుమారులకు ఈడూజోడైన ఇంతులతో పెండ్లిండ్లు చేశాడు.

ఆ రాజు తన కూతుండ్రను చక్కని రూపం, ప్రాయమూ, దేహసంబంధమైన ముచ్చట గొలిపే సాగసులూ కల తన కుమార్తెలతో అన్ని విధాలా సాటి వచ్చే వరులకు ఇచ్చి మిక్కిలి ప్రీతితో పెండ్లిండ్లు చేశాడు.

ఆ విధంగా ఆ రాజు కొడుకులకూ, కూతుండ్రకూ పెండ్లి చేసి ఉన్న సమయంలో

విను. ఆ కొడుకులు పాంచాలదేశంలో ఉన్నారు. వారికి ఒకరి తరువాత ఒకరుగా ఒక్కొక్కరికే గొప్పబల పరాక్రమాల ప్రసిద్ధిగల కొడుకులు నూరుగురు చొప్పున పుట్టారు.

(పాంచాలదేశం అంటే ఇక్కడ శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఇంద్రియవిషయాలు. అవి విహరించే భూమి - దేహమే.

పుణ్యాత్మా! ఈ విధంగా ధనాన్ని కొల్లగొట్టేవారూ, ఇల్లూ ధనాగారాలూ, పరిచారకులూ అనేవారితో లంకె పెట్టుకొన్నవారూ అయిన కొడుకులు మొదలగువారి యందు ఏర్పడిన మమకారంతో ఆ పురంజనుడు కట్టుబడిపోయాడు.

ప్రాచీనబర్హీ! ఆ పురంజనుడు గట్టి నిష్ఠతో యజ్ఞసంకల్పాన్ని నిర్వహిస్తాననే ప్రతిజ్ఞవంటి దానిని చేపట్టి వరుసగా పశువులను చంపేవీ, చాలా భయంకరమైనవీ అయిన యాగాలనెన్నింటినో చేసి, నీలాగా ఆయా యజ్ఞాల వలన కలిగే గొప్ప ఫలాలను కాంక్షిస్తూ దేవతలను, పితృదేవతలనూ, ప్రాణికోటినీ సేవిస్తూ వచ్చాడు. ఇందులో కొట్ట వచ్చినట్లుగా కనపడేది అసూయ.

(అసూయ అంటే గుణాలను దోషాలుగా లెక్కగట్టేబుద్ది.)

ఈ విధంగా ఆ పురంజనుడు తనకు మేలుకూర్చే పనులయందు శ్రద్ధ లేనివాడూ; సంసారమునందే తగులం పొందిన చిత్తం కలవాడూ అయిఉండగా అతనికి విరోధి, అతనికి ప్రియకాంతలకు ఇష్టం కానిది అయిన కాలం దాపురించగా చండ వేగుడనే ప్రసిద్ధిగల గంధర్వరాజు మూడువందల అరవై సంఖ్యగల గంధర్వులూ, అంతే సంఖ్యగల గంధర్వ స్త్రీలు తెల్లని, నల్లని రంగులతో జంటలుగా ఏర్పడి వెంటరాగా వచ్చి, తాను తిరుగుతూ ఉండటంవలననే అన్ని విధాలైన కామాలూ ఏర్పడుతూ ఉండగా ఆపురాన్ని ముట్టడించాడు. అప్పుడు ఆ చండవేగుని సేవకులైన గంధర్వులు ఆ పురంజనుని పురాన్ని గందరగోళంగా చేసి వేశారు. దానిని కొల్లగొట్టటానికి పూనుకున్నారు. అప్పుడు పురంజనుని పురానికి రక్షకులైన ఉద్యోగుల అధ్యక్షుడు ప్రజాగరుడు ఆ ఏడువందలఇరవై సంఖ్యగల గంధర్వులను, గంధర్వస్త్రీలనూ నిలువరించాడు. బలం పుంజుకొన్నవాడై నూరేండ్లు యుద్ధం చేశాడు. తాను ఒక్కడే అయినా పెద్ద సంఖ్యగల ఆ అందరితో పోరాడి నీరుగారిపోయాడు. పురంజనుడు తన్ను తాను నిలుపుకొని ఆపురంలో చిన్ని చిన్ని సుఖాలనుభవిస్తూ పాంచాల దేశాలలో తన సేవకులు తెచ్చి అందిస్తున్న పదార్థాలను తీసుకుంటూ కామినులతో కూడి, భయానికి కారణం ఏమిటో విచారణ చేయలేక రాష్ట్రంతో, పురంతో చుట్టపక్కాలతో వేదన పొంది కుమిలిపోతూ ఉన్నాడు. అప్పుడు

రాజశ్రేష్ఠ! విను. కాలపుత్రిక అనే ఒక కామిని వరుని కోసం తిరుగుతూ లోకమంతటినీ చుట్టబెడుతూ ఉన్నది.

పుణ్యాత్మా! ప్రాచీనబర్హీ! వినండి. ఆ కాలపుత్రికను మునుపు రాజర్షియైన యయాతి కుమారుడు పూరుడు వరించాడు. ఆమె అతనికి అనుకూలంగా వరం ఇచ్చింది. అతడు తండ్రి ముసలితనాన్ని తీసుకున్నాడు కనుక వారి దాంపత్యం ఫలం లేనిదయింది. ఆ విధంగా ఆమె 'దుర్భగ' - అని ప్రసిద్ధి కెక్కింది. ఆమెను మగసిరి కలవాడెవడూ పరిగ్రహించలేడు. ఒకనాడు ఆమె బ్రహ్మలోకం నుండి తిరిగివస్తూ గొప్పవ్రతాలలో మునిగి తేలుతున్న నన్ను భర్తగా పొందగోరింది. మన్మథుని బాణాలు ఆమెను ఎక్కువగా బాధించాయి. దానితో వివేకం పోయినదై నన్ను బతిమాలింది. నేను ఒప్పుకోలేదు. ఆమెకు నా మీద పెద్దగా కోపం వచ్చి.

(యయాతి నిజానికి రాజులలో ఉత్తముడు. ఋషి అయినవాడు. కానీ భార్య దేవయాని వలన శుక్రుని శాపంతో ముసలితనం పొందవలసి వచ్చింది. శుక్రుడు శాపం తప్పించుకోవటానికి ఒక మార్గం చెప్పాడు. తన కొడుకులలో ఎవరైనా ముసలితనం కొంతకాలంపాటు తీసుకుంటే ఇతనికి వార్ధక్యంనుండి విడుదల కలుగుతుంది. అతనికొడుకులలో పూరుడు దానికి ఒప్పుకున్నాడు.)

ఆ కాలపుత్రిక నాతో ఇలా అన్నది. 'మునివరా! నా ఆశను చెడగొట్టావు కనుక నీకు ఒకచోట ఉండే స్ధితి కలుగకుండా పోతుంది.' ఇలా శపించి నామాట మీద యవన ప్రభువు భయుడనె పేరుగల వాని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నది.

(నారదుడు ఒకచోట నిలకడలేనివాడు. త్రిలోకసంచారి. దక్షుని శాపంవల్ల అతనికాస్థితి యేర్పడిందని మరొక కథ. ఇక్కడ దుర్భగవల్ల కల్గిన శాపమని కల్పన.)

రాజా! భయా! విను. యవనులకు గొప్పపాలకుడవైన నిన్ను మగనిగా కోరి, పంచభూతాలు అలా సంకల్పించాయి కనుక వినయంతో నీ దగ్గరకు వచ్చాను.

అయ్యా! నా కోరిక పంచభూతాల సంకల్పం వలన కలిగినట్టిది. లోకం ధర్మం, వేదం ధర్మం ప్రకారం ఇవ్వటానికీ, పుచ్చుకోవటానికీ యోగ్యమైన పదార్ధాన్ని కోరినప్పుడు ఇవ్వనివాడూ, ఇస్తానంటే వద్దనేవాడూ ఈ ఇద్దరూ మొద్దుబారిన స్వభావం కలవారయ్యారే అని ఉత్తములు దుఃఖిస్తూ ఉంటారు. కాబట్టి నీ దగ్గరకు చేరుకుంటున్న నన్ను జాలిగల మనస్సుతో స్వీకరించు. ఇటువంటి దీనులమీది జాలి కూడా పురుషులకు ధర్మమే అవుతుంది. అని ఆ కాలపుత్రిక పలుకగా విని యవనరాజు దేవతల రహస్యాన్ని(మరణాన్ని) చేయబూనిన ఆమెను చూచి చిరునవ్వు మోమునందు చిందులాడుతుండగా ఇలా అన్నాడు.

(దేవగుహ్యము అంటే ఇక్కడ మరణం. దానిని దేవతలు వైరాగ్యం పుట్టనివానికి రహస్యంగా ఉంచుతారు.)

ఓ తరుణీ! కోరదగినదే అయిన ఈ లోకంలో నీవు శుభలక్షణాలు లేనిదానవు. ఉత్తములకు ఇష్టం కానిదానవు. కాబట్టి ఎవ్వరూ నిన్ను ప్రీతితో ఆదరించరు.

కాబట్టి నేను నీకు భావనా దృష్టిలో పతిని సూచిస్తాను. ఆ తీరు ఏమిటంటే నీవు నా సేనల తోడ్పాటును పొంది ప్రజలను రూపుమాపుతూ, తెలియరాని రాకపోకలు కలదానవై, కర్మలతో ఏర్పడిన లోకాన్ని అనుభవిస్తూ ఉండు. ఈ ప్రజ్వారుడనేవాడు నాకు తమ్ముడు. నీవు నాకు చెల్లెలవు. మీ ఇద్దరితో కలసి నేను లోకంలో ఎవరికీ తెలియరాకుండా, భయం కలిగించే సైనికులు కలవాడనై మెలగుతూ ఉంటాను.

అని పలుకగా భయనామం కల యవనరాజు అదృష్టానికి కారకులైన సైనికులు ప్రజ్వారునితో, కాల కన్యకతో కూడి భూభాగమంతా తిరుగుతూ ఒక్కనాడు తీవ్రమైన వేగంతో భూలోకభోగాలతో ప్రసిద్ధి కెక్కినదీ, ముసలిపాము రక్షణలో ఉన్నదీ అయిన పురంజనుని పురాన్ని చుట్టుముట్టారు. తన అభిమానాన్ని తానే తక్కువ చేసుకొనే మగవానికి నీరసాన్ని కలిగించే కాలకన్యక ఆ పురంజనుని పురాన్ని అనుభవించింది. కాలకన్య అనుభవిస్తున్న ఆ పురపు వాకిళ్ళన్నింటినుండీ, అన్ని వైప్రులనుండీ అసంఖ్యాకంగా యవనులు పురంలోనికి చొరబడినారు. పురాన్ని పీడించారు. ఆ విధంగా పీడ పొందుతున్న పురాన్ని చూచి ఆత్మాభిమానం గల పురంజనుడు (ముందుకు అన్వయం.)

(1. దిష్టకారులు - మృత్యువు ఆదేశాన్ని పాలించేవారు.

2. ముసలిసర్పం - సత్తువలేని ప్రాణం.

3. కాలకన్యక - ముసలితనం.

4. యవనులు - రోగాదులు.

5. వాకిళ్ళు - కన్ను మొదలైన ఇంద్రియగోళాలు.

6. పురంజనుని పురం - జీవుని దేహం.)

పుణ్యాత్మా! ప్రాచీనబర్హీ! పురంజనుడు మమకారంతో చెదరిపోయిన చిత్తం కలవాడయ్యాడు. పెక్కు బాధలు పొందాడు. కుటుంబం చాలా పెరిగిపోయింది; ముసలితనం దేహమంతా ఆవరించింది; సంపదలు పోయాయి. బుద్ధి నిలువటం లేదు. ఎటు చూచినా ఇంద్రియగుణాలు అల్లుకొని పోయాయి. పాలించే అధికారం నాశనమై పోయింది. దీనుడూ, దరిద్రుడూ అయ్యాడు, దుఃఖం నిలువెల్లా ఏర్పడి మనస్సును నిలుకడగా ఉండనీయటం లేదు. ఇంద్రియాలూ, రోగాలూ చెదరగొట్టిన అతని నగరం అస్తవ్యస్తం అయిపోయింది. తనను పట్టించుకోనివారూ, తన యందు ద్వేషం కలవారూ అయిన కొడుకులనూ, మనుమలనూ, పరిచారకులనూ, మంత్రులనూ, పురోహితులనూ, తన ఇల్లాలినీ చూచాడు.

(ప్రతికూలురు - తనకు హాని కలిగించే విషయ సుఖాలను కూర్చేవారు; అనాదరణయుతులు - తనపై ఆదరణ లేనివారు; అనుచరులు - తన వెంట తగిలి ఉండే ఇంద్రియాలు; సచివులు - ఇంద్రియదేవతలు;)

కాలకన్య తన్ను ఆక్రమించుకొని ఉన్నది. తన ఇంద్రియాల బలాలన్నీ పగవారిచేత పాడయిపోయాయి. తన దుఃఖానికి ఒక తీరం కానరావటం లేదు. ఏమి చేస్తే ఈ దుఃఖం పోతుందో తెలియటం లేదు. కోరికలు కామకన్య దెబ్బకు సత్తువలేని వయ్యాయి. అయినా వానినే కోరుతూ ఉన్నాడు. పొందలేక జాలితో కుంగిపోతున్నాడు. మమకారంతో కొడకులనూ, భార్యనూ ముద్దు చేయటమే పనిగా పెట్టుకున్నాడు. తన పురం అనే ఒడలిని కాలకన్య తుక్కు దూగరగా నలుగగొట్టింది. దానిని ఇంద్రియాలూ, రోగాలూ వశం చేసుకున్నాయి. అయినా విడవటానికి మనసొప్పటం లేదు. కానీ తప్పక విడిచిపెట్టగోరాడు. ఆ సమయంలో;

రాజా! భయుడు అనే పేరుగల వాని అన్న ప్రజ్వారుడు అప్పుడు వచ్చి నగరాన్ని ఒక వరుసగా పెట్టుకొని, అన్నకు ప్రీతి కలిగే విధంగా కాల్చివేశాడు.

(భయము - చావు; ప్రజ్వారుడు - కాలస్వరూపుడైన యముడు; పురము - దేహం; కాల్చివేయటం అంటే దేహం లేకుండా చేయటం.)

ఇలా నగరం కాలిపోతుండగా పౌరుల, పనివారల మూకలతో కూడి, కుటుంబం అంటి పెట్టుకొని ఉండగా, కొడుకులు మొదలగువారు తనతో ఉండగా, యవనులు ఆక్రమించిన నివాసాలు కలవాడై, కాలకన్యకు చిక్కి ఆ నగరంలో ప్రజ్వారుడు తన్ను నిలువెల్లా కాల్చివేస్తూ ఉండగా వదలని వేదనతో, దానిని కాపాడుకొనే శక్తి లేక భయంకరమైన గొప్పవణుకు కలవాడై ఆ నగరంలో ఉండలేక పోయాడు.

దావాగ్ని చుట్టుకొన్న చెట్టు తొర్రలో ఉండే పాములాగా తన నగరాన్ని వదలిపోవటానికి ప్రయత్నం చేస్తూ పట్టుసడలిన అవయవాలు కలవాడు అయ్యాడు. పైగా తన పరాక్రమాన్ని గంధర్వుల మూకలు చిత్తుచిత్తుగా చేశాయి.

అన్ని శక్తులూ ఉడిగిపోయిన ఆ పురంజనునకు గొంతులో గురగుర సవ్వడి ఏర్పడింది. హృదయంలో కుమిలిపోతున్నాడు. కొడుకులను, కోడళ్ళను, కూతుండ్రను, అల్లుండ్రను, మనుమలను, ఆత్మీయులను, పరిచారకులను తలచుకుంటున్నాడు. వెనుక మహావైభవంగా ఉన్న తన ఇల్లూ, బొక్కసమూ, పరిచారకవర్గమూ అంతా ఇప్పుడు ఏదో ఉన్నది అన్నట్లయిపోయింది. మనస్సులో తపన ఎక్కువ అయిపోయింది. అయ్యయ్యో! నేను చస్తే నా భార్య దిక్కులేని దవుతుంది. కుమారులను ఎలా కాపాడుతుంది? అని కుమిలిపోతున్నాడు.

ఇంకా ఇలా అనుకొంటున్నాడు.

నా ఇల్లాలు నేను తినకముందు తినదు. నేను నిద్రపోకముందు నిద్రపోదు. నేను స్నానం చేయకుండా స్నానం చేయదు. నేను కోపంతో కసరినా భయపడుతుంది. కొట్టినా తిట్టినా మాటకు మాటా అనేది కాదు. నేను ఆయా పనులలో ఒక్కొక్కప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోతే నాకు చక్కని నిర్ణయాన్ని ఉపదేశించేది. ఇటువంటి ప్రియభార్యను వదలి నేను మరొక బొందిలోనికి పోతే ఈమె సంతానం కలది కాబట్టి వారి సంరక్షణ కోసం తనలో తాను కుమిలిపోతూ బదికి ఉంటుందా? లేక నా వెంట సహగమనం చేస్తుందా? అని మనస్సులో దిగులుపడ్డాడు.

నా కొడుకులు; మనుమళ్లూ నేను తప్పని సరిగా వెళ్ళిపోతే ఏ ఆధారమూ లేనివారై నట్టనడి సంద్రంలో పగిలిపోయిన నావలాగా ఎలా బ్రతుకుతారో కదా!

ఇలా దిక్కుమాలినవానివలె పెనుశోకంతో వణకిపోతూ శోకించే శక్తి లేకపోయినా దుఃఖిస్తూ ఉన్న పురంజనుని తీసుకొని పోవటానికే(భయుడు) నిర్ణయించుకొన్నాడు.

ఆ సమయంలో భయనాము డక్కడకు వచ్చాడు. పురంజనుని గుండె గుభేలుమన్నది. యవనుడు ఆతనిని బలికోసం గుంజుకొని పోయే పశువులాగా తీసుకొని వెళ్లాడు.

(భయుడు - యముడు; యవనుడు - యమునికింకరుడు.)

తన వారందరూ వెంటబడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. నిలువరించబడిన పాము స్థానం నుండి పోయిన వెంటనే పురం ఛిన్నాభిన్నమైంది. గొప్ప బలంగల యవనుడు బలమంతా ఉపయోగించి గుంజుకొని పోతూఉండగా పురంజనుడు చీకటి కమ్ముకొన్నవాడై వెనుకటి చెలియైన ఈశ్వరుణ్ణి గుర్తించ లేకపోయాడు. వెనుక తాను యజ్ఞాలలో హింసించిన యజ్ఞపశువులన్నీ సమీపించి గొడ్డళ్ళతో అతనిని ముక్కలు ముక్కలు చేశాయి. ఈ అనర్ధం అంతా స్త్రీ తగులం అనే తప్పువలన కలిగింది. గాఢమైన అజ్ఞానమనే చీకటి అతనిని అలముకొన్నది. జ్ఞానం నశించింది. ఈ విధంగా పరలోకంలో పురంజనుడు పడరానిపాట్లు పడ్డాడు. అయినా తన భార్య అయిన ఆ గొప్ప ఇల్లాలినే నిరంతరం భావిస్తూ ఉన్నాడు. ఆ స్మరణ వలన తరువాతి పుట్టువులో విదర్భరాజు గృహంలో ఉత్తమకాంతగా జన్మించాడు.

రాజా! ఆ విదర్భరాజతనయకు స్వయంవరం ఏర్పాటు చేశారు. వరుని బలపరాక్రమాలే అక్కడ మూల్యం. పాండ్యదేశపురాజు మలయకేతనుడు అప్పటికే శత్రువుల పురాలను పెక్కింటిని గెలిచినవాడు. తక్కిన రాజులనందరినీ ఓడించి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. మహాభుజబలంగల ఆ రాజు విదర్భరాజతనయయందు నీలికన్నులతో అలరారుతున్న ఒక కన్యను కూతురుగా పొందాడు. అలాగే ద్రవిడదేశాలకు రాజులైన ఏడుగురు కొడుకులను పొందాడు. వారికి ఒక్కొక్కరికీ పదికోట్లమంది చొప్పున పుత్రులు పుట్టారు. అతని కూతురు ధృతవ్రతను అగస్త్యుడు వరించి పెండ్లి చేసుకొన్నాడు.

(పురంజనుడు పుణ్యవశంచేత విదర్భరాజు కూతురుగా పుట్టాడు. ధార్మికులతో చక్కని అనుబంధం గలవాడు కావటంవలన భగవద్భక్తుడైన మలయకేతనునితో ఆమెకు వివాహం అయినది. భాగవత సంబంధంచేత విష్ణుభక్తి ఏర్పడింది. దానివలన వైరాగ్యం కలిగింది. భర్తనే గురువుగా నిష్ఠతో కొలిచి పాతివ్రత్య ధర్మంచేత జ్ఞానం పొంది తత్ఫలంగా మోక్షాన్ని పొందింది. తక్కిన దంతా కథానిర్మాణం కోసం ఏర్పడిన విషయం.)

ఆ అగస్తుడు విదర్భరాజతనయ యందు దృఢచ్యుతుడు అనే గొప్పమహర్షిని పొందాడు. అతని కొడుకు ఇధ్మవాహుడు. తరువాత మలయధ్వజునకు బుద్ధిలో వైరాగ్యం కలిగింది.

ఆ మలయధ్వజుడు తనవశంలో ఉన్న భూమినంతటినీ భాగాలుగా చేసి కొడుకులకు ఇచ్చివేశాడు. విష్ణుని పాదపద్మాలను ఆరాధించటానికి అన్ని ఏర్పాటులు చేసుకొని కులపర్వతాన్ని చేరుకున్నాడు. మత్తెక్కినట్లున్న కన్నులు గల ఉత్తమశీలం గల ఆ విదర్భరాజ తనయ

ఆ ఇల్లాలు ఇళ్ళనూ, సర్వ భోగాలనూ వదలివేసి చంద్రుని వెంట వెళ్ళే వెన్నెలలాగా, భక్తితో ఆ మలయధ్వజమహారాజు వెంటనంటి వెళ్ళింది.

పాండ్యరాజు మలయధ్వజుడు తన ధర్మపత్ని వెంటరాగా చంద్రమస, తామ్రపర్ణి, నవోదక అనే నదుల పుణ్యజలాలలో స్నానమాడి, లోపలి వెలుపలి మలాలను కడిగి వేసికొని, దుంపలు, పండ్లు, గింజలు, పువ్వులు, ఆకులు, గడ్డిపరకలు, నీరు అనే వానినే ఆహారంగా తీసుకుంటూ; శరీరాన్ని ఎండగట్టే గట్టి తపస్సును చేస్తూ వచ్చాడు. చలి, వేడి, వాన, గాలి, ఆకలి దప్పి, ఇష్టం ఇష్టం కానిది, సుఖం దుఃఖం మొదలైన జంటలలో ఒకే భావనకలవాడై వాని త్రిప్పులకు లోబడక ఒక మొద్దువలె వేయిదేవతా సంవత్సరాలు తపస్సు చేశాడు. భగవంతుడైన వాసుదేవునియందే ప్రీతిని నిలుపుకొన్నాడు. మరియొకటి ఉన్నది అనే భావన కూడా లేనివాడై మెలగుతూ ఉన్నాడు. కలలో ఇదిగో నాతల తెగిపడింది అన్న స్థితిలో తాను తనకంటె వేరైనవాడనీ, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడని అంతఃకరణపు కదలికయే సాక్షిగా తెలిసి ఉన్నాడు.

(ఆ మలయధ్వజుడు చాలా కఠోరమైన తపస్సు చేశాడు. అందులో అతని స్థితిని ఇందు వర్ణిస్తున్నారు.

1. సమదర్శనుడు - సమమనగా పరమాత్మ, దానిని చూడ గలిగినవాడు.

2. అంతఃకరణ, వృత్తి సాక్షిగాన్‌ - అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు అంతరింద్రియాలు. వాని వృత్తి అంటే కదలిక, అదియే సాక్షిగా కలవాడు.)

ఆ మలయధ్వజుడు చేసిన తపస్సునకు పరమాత్మ, సర్వేశ్వరుడు, భగవంతుడు, కృపకు వశమైన వాడూ అయిన హరి సాక్షాత్కరించాడు. ఆయన అతనికి పరబ్రహ్మతత్త్వాన్ని ఉపదేశించాడు. అది అన్ని వైపులకు వెలుగులను ప్రసరించగలది, తనంత తాను వెలుగొందునట్టిది. గొప్పది, శుద్ధ జ్ఞానరూపమైనది. అట్టి దీప ప్రకాంతుల సముదాయంతో తనయందు పరమాత్మనూ, పరమాత్మయందు తన్నూ కలిసిపోవటాన్ని తెలుసుకున్నాడు. కాలిబూడిద అయిన కట్టెలుగల అగ్నిలాగా ఈషణాలను వదలివైచి, అనేక మహాకష్టాల కడలి అయిన సంసారమందు తగులం లేనివాడయ్యాడు. కనుకనే అతడు మహిమ కలవాడూ ఉన్నతుడుగా పరిగణనకు వచ్చాడు. అప్పుడతని భార్య

(1. శుద్ధ జ్ఞానదీపము - నిర్గుణపరబ్రహ్మమును తెలిపే జ్ఞానమనే దీపం.

2. ఈషణములు - తొందరలు; ఏషణములు సరియైనపదం. గాఢమైన కోరికలు అని అర్థం. అవి మూడుగా ప్రసిద్ధములై ఉన్నాయి. దారేషణ - భార్యయందలి కోరిక; ధనేషణ - ధనం గడించాలనే గాఢవాంఛ; పుత్రేషణ - కొడుకులు కావాలి అనే తీవ్రమైన కోరిక)

ఆ మలయధ్వజుని భార్య పతియే దైవం అని భావించటమే శీలంగా కలది. సన్నని పాయగా అయిన జుట్టుకలది. నారచీరలు ధరించి ఉన్నది. మంచి నోములు ఆచరిస్తూ దేహాన్ని కృశింపజేసినట్టిది. ఏ దోషాలూ లేనిది.

(విగతదోష - రజస్సు మొదలైన దేహంలోని దోషాలు పోయినట్టిది.)

ఆ కమలాక్షి సర్వభోగాలనూ వదలివేసింది. పరమాత్మ ధర్మాన్ని చక్కగా ఎరిగిన మలయధ్వజుని చేరుకొన్నది. సాటిలేని పతివ్రతానియమాలను పాటిస్తూ ఉత్తమవనితయై అతనికి సేవచేస్తూ ఉండిపోయింది.

ఆమె పతివ్రత. స్వచ్చమైన బుద్ధితో భర్త దగ్గర, పొగలేని అగ్నిజ్వాలవలె ప్రకాశిస్తూ ఒప్పారి ఉన్నది.

(ఈ ఉపమానంచేత ఆమె తన భర్తతో తాదాత్మ్యం పొందినదని తెలియవస్తున్నది.)

తన ప్రాణేశ్వరుడైన భర్త చేష్టలు ఉడిగినవాడు అయ్యాడని మనస్సులో తలపక వెనుకటి తీరుననే ఎన్నటికీ చెదరని భక్తితో అతనికి సేవలు చెయ్యాలి అని తలచింది.

ఆయన సాటిలేని నియమంతో కూర్చుని ఉన్నాడు. ఆమె అతని దగ్గరకు చేరుకొని వెనుకటి మాదిరిగానే వినయపూర్వకంగా సేవచేయగోరి అతని పద్మాలవంటి పాదాలను అంటి సేవచేస్తూ ఉండగా అతని పాదాలలో

ఆ ఇల్లాలు భర్తపాదాలు సేవించుకోవటానికి మెల్లగా తాకింది. కాళ్ళు చల్లబడి ఉన్నాయి. సాధారణంగా ఉండ వలసిన వేడి లేదు. అప్పుడు బెదరిపోయి, దిక్కులేనిదై గొల్లున ఏడ్చింది.

కమలాల రేకులవంటి కన్నులుగల ఆ ఇంతి ఈ తీరున దుఃఖంతో పొంగుకొనివస్తున్న కన్నీటి బిందువులతో తడిసిన, మన్ననకెక్కిన పాలిండ్ల జంటకలదియై ఎడబాటు కలిగించిన దుఃఖంచేత హృదయం మాడిపోగా, చక్కని కోమలమైన నూతన తామరవంటి కిందిపెదవి కందిపోగా గొంతెత్తి ఆ అడవిలో ఆపేవారు లేనిదై ఏడ్చింది.

అయ్యో రాజా! దొడ్డబుద్ధి గలమహానుభావా! ఉత్తమగుణాలతో అలరారే పుణ్యపురుషా! ఇటుపై సముద్రమే మొలనూలుగా గల ఈ భూమి ధర్మభావన లేని రాజుల, దొంగల పీడలు ఆగకుండా జరుగుతూ బక్కచిక్కిపోతుండగా. దానిని పట్టించుకోవద్దా? నీవు ఉత్తమ నీతితో విరాజిల్లేవాడవు. ప్రజలకు ఏలికవు. లే దీనిని ఏలుకో.

ఇలా ఆర్తనాదం చేస్తూ ఆ కాంత తన భర్త పాదపద్మాలను తన నెన్నుదురు తాకునట్లుగా చేసి పరమదుఃఖంతో పెద్దగా, ఎక్కువగా ఏడుస్తూ కట్టెలతో చితిని పేర్చి దానిపై అతని గొప్ప దేహాన్ని ఉంచి అగ్నిని రగులుకొల్పింది.

ఆమె భర్తతోపాటు పరలోకాలకు వెళ్ళిపోవటానికి నిశ్చయించుకొన్నది. అంతలోనే వెనుకటి మిత్రుడు, విజ్ఞానమే స్వరూపం అయినవాడూ అయిన ఒక బ్రాహ్మణుడు ఆమె దగ్గరకు చేరుకున్నాడు.

ఆ పూర్వసఖుడైన బ్రాహ్మణుడు వచ్చి మంచి వివేకంగల పలుకులతో ఆమెతో ఇలా అన్నాడు. 'అమ్మా! నీవు ఎవరు? ఎవరికి సంబంధించిన దానవు? ఇతడెవరు? ఎందుకు దుఃఖీస్తున్నావు'?

అని అడుగుతూ అతడు ఇంకా ఇలా అన్నాడు. 'సృష్టికి ముందుకూడా నీవు ఎవనితో స్నేహసుఖాన్ని అనుభవించావో అటువంటి సఖుడను నేను'.

ఓ పడతీ! ఇప్పుడు నేనెవరో నీకు తెలిసినా తెలియకపోయినా నీకు నేను పాతకాలపు మిత్రుడను అని అయినా నీకు తెలియదా? చెప్పు.

ఓ వనితా! నీవూ నేనూ వెనుక మానససరోవరంలో నివసించే హంసలం. ఇల్లు వదలి వేలసంవత్సరాలు ప్రాణమిత్రులమై మెలగినాము. ఇంతలో నీవు నన్ను వదలి భూమికి సంబంధించిన భోగాల తగులం పొంది ఒక స్థానం కావాలని కోరి భూమండలమంతా తిరిగినావు. ఒక కామిని ఏర్పరచిన తావు నీకు దొరికింది. అందులో అయిదు పూలతోటలు, తొమ్మిది వాకిళ్ళు, ఒక తోటమాలి, మూడు ప్రాకారాలూ, ఆరు అంగడి వీథులూ, అయిదు అంగళ్ళూ, అయిదు మూలద్రవ్యాలూ, నాయిక అయిన ఒక ఆడుదీ ఉన్నాయి. అది ఒక పురం. అంటే ఏమిటో తెలియజేస్తాను విను. అయిదు తోటలంటే అయిదు ఇంద్రియవిషయాలు. తొమ్మిది వాకిళ్ళంటే తొమ్మిది ఇంద్రియాదుల రంధ్రాలు. ఒక్క పాలకుడు ప్రాణం. మూడు ప్రాకారాలంటే అగ్ని నీరు, అన్నం అనేవి. ఆరు అంగళ్లు అంటే ఇంద్రియాల సముదాయం. అంగళ్ళు అంటే ఆయా కర్మములను చెసే ఇంద్రియాలు. అయిదు ప్రకృతులు అంటే అయిదు భూతాలు. ప్రకృతి అనే పడతి బుద్ధి. ఇట్టి పురంలో ప్రవేశించినవాడు ఆడువారి చేతిలో కీలుబొమ్మ అయి, తెలివిమాలిన వాడవుతాడు. ఆ విధంగా అయిన నీవు ఆ పురంలో కామినుల తగులంలో వినోదంగా కాలక్షేపం చేస్తూ వారుపెట్టే త్రిప్పులకు లోబడి స్మృతి శక్తిని కోల్పోయావు. కొన్నాళ్ళు పురంజనుడు, కొన్నాళ్ళు వైదర్భి అని జనులు నిన్ను వ్యవహరించారు. ఆ కామినులు అందించినవన్నీ నీకు పైకి సుఖాలుగా అనిపించాయి కానీ నిజానికి అవి దుఃఖాలే. అందువలన అది ఘోరమైన పాపాలతో కూడిన స్థితి. దానిని నీవు అనుభవించావు. కాబట్టి

నీవు విదర్భరాజతనయవు కావు. ఈ మలయధ్వజుడు నీ భర్త కాడు. నీవు వెనుక పురంలో బంధించినప్పటి పురంజనుడవు కావు. ఇప్పుడు ఇతని అంగనననీ, వెనుకజన్మలో మగవాడననీ అనుకోవటం కూడా అబద్ధమే. ఇదంతా నేను చేసిన మాయతో ఏర్పడినది. చక్కగా విచారిస్తే మనం పూర్వం హంసలం. ఇది నీకు తెలియజెప్పాను. ఇప్పుడు తిరిగి ఆ వెనుకటి రూపం చూపుతాను. చూడు.

నీవే నేను, నేనే నీవు. మనం ఒకరికంటె ఒకరం వేరైనవారం కాము. జ్ఞానతత్త్వం తెలిసినవారు మన ఇద్దరిలో తేడాను చూడరు. ఒక మనిషి తానొక్కడే అద్దంలో ఇతరుల కన్నులలో మరొక విధంగా చూస్తాడు. అలాగే మన ఇద్దరికీ భేదం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అని ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న పురంజనునకు 'అతడు మునుపు నాకు చెలికాడైన హంసయే' అనే జ్ఞానం కలిగించాడు. పురంజనుడు అజ్ఞానమనే రోగంనుండి తేరుకున్నాడు. ఆ సఖుని ఎడబాటు వలన పోయిన జ్ఞానాన్ని తిరిగి పొందాడు - అని నారదుడు ప్రాచీనబర్హీని చూచి ఈ పరమార్థతత్త్వాన్ని నీకు రాజకథావ్యాజంతో తెలియజేశానయ్యా! అన్నాడు.

(అధ్యాత్మ తత్త్వంబు - ఆత్మ అనగా దేహం- దానియందుండే తత్త్వం అధ్యాత్మ తత్త్వం. అంటే పరమాత్మకు సంబంధించిన శుద్ధ జ్ఞానం.)

ఆ మాటలు విని ప్రాచీనబర్హీ నారదమహర్షితో ఇలా అన్నాడు. 'అయ్యా! మీ మాటలు ఉత్తమపండితులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. కానీ కర్మల వలన అజ్ఞానంలో చిక్కుకొన్న మావంటివారు ఎలా తెలుసుకోగలరు?'

ప్రాచీనబర్హీ పలుకు విని నారదుడతనితో ఇలా అంటున్నాడు. రాజా! ఆత్మ ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఇంకా ఎక్కువ పాదాలు కలదీ, అసలు పాదాలే లేనిదీ అయిన పురంజనుని దేహంలోనికి ప్రవేశించింది. ఆ కారణంగా అతనికి పురుషుడు అనే పేరు కలిగింది. ఆతనినే మనం జీవుడు అని వ్యవహరిస్తున్నాం. పేరుగానీ, పనిగానీ, గుణాలుగానీ లేని కారణంగా తెలియరానివాడు మిత్రుడగు ఈశ్వరుడు. అందువలననే అతనిని అవిజ్ఞాతుడు అంటారు. జీవుడు అన్ని లక్షలతో కలిసి దేహాన్ని గ్రహించే సంకల్పం కలవాడైతే తొమ్మిది వాకిళ్ళూ, రెండేసి చేతులూ, కాళ్ళూ కల నగరం ఒకటి ఉన్నది. అది మేలైనది అని భావించాడు. అందులోనికి ప్రవేశించాడు. ఆ పురుషుడు బుద్ధికారణంగా ఇంద్రియాల ద్వారా శబ్దం మొదలైన విషయాలను అనుభవిస్తున్నాడు. దానిలోనే అహంకారమమకారాలను పొందుతున్నాడు. ఆ బుద్ధియే ఈ ఉపాఖ్యానంలోని స్త్రీ. దానికి చెలులే జ్ఞానాలకూ, కర్మలకూ కారణాలైన ఇంద్రియాల గుణాలు. చెలికత్తెలు వానివృత్తులు. అయిదు తలల పామంటే అయిదుతీరులైన గతులు గల ప్రాణం. పదకొండు మంది భటులు గలది, గొప్పబలం కలది, రెండు విధాల ఇంద్రియాలను నడిపించేది అయిన మనస్సు. తొమ్మది వాకిళ్ళుగల ఆ పురాన్ని చుట్టి వచ్చిన పాంచాల దేశం అంటే అయిదు విషయాలు- శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనేవి. తొమ్మది ద్వారాలు రెండు కన్నులు, రెండు ముక్కులు, రెండు చెవులు, ముఖం, ముడ్డి, లింగం అనేవి. వానిలో కన్నులు, ముక్కులు, నోరు అనే అయిదూ తూర్పు వాకిళ్ళుగా మన్నన పొందినవి. కుడి ఎడమ చెవులు దక్షిణంవైపు, ఉత్తరం వైపూ ఉన్న ద్వారాలు. మల, మూత్ర విసర్దనావయవాలు పడమటి వాకిళ్ళు. అందు ఒక తావులో ఏర్పడ్డ ఖద్యోతమూ, ఆవిర్ముఖమూ అనేవి కన్నులు. నలిని, నాళిని అనేవి ముక్కురంధ్రాలు. ముఖ్య అంటే నోరు. అంగడి అనేది వాక్కు రసజ్ఞుడు రసం. ఆపణం అంటే వ్యవహారం. బహూదనం అంటే పెక్కుతీరులైన వంటకం. పితృహువు కుడిచెవి. దేవహువు అంటే ఎదమచెవి. చండమైన వేగం కలవాడు అంటే కాలానికి సూచకమైన సంవత్సరం. గంధర్వులు పగళ్ళు. గంధర్వీజాతిస్త్రీలు అంటే రాత్రులు. అవి తిరుగుతూ ఉండటం అంటే ఆయువును తగ్గిస్తూ ఉండటం. కాలకన్యక అనేది ముసలితనం. యవనేశ్వరుడనేవాడు మృత్యువు. అతని సేనాభటులే మనోరోగాలు, దేహరోగాలు. ప్రజ్వారుడు అంటే జ్వరం. ఇది రెండు విధాలు. శీతజ్వరం, ఉష్ణజ్వరం. వానికి గొప్పవేగం ఉంటుంది. దక్షిణ పాంచాలం అంటే పితరుల లోకాన్ని పొందించేదీ, ప్రవృత్తి రూపకమూ అనే పేరుగలదీ అయిన శాస్త్రం. ఉత్తరపాంచాలమంటే దేవలోకాన్ని పొందించేది, నివృత్తి రూపకమూ అయిన శాస్త్రం. శుతధరుడంటే చెవి. ఆసురి అనే పేరుగల పడమటి వాకిలియే లింగం. గ్రామకం అంటే మిథున సుఖం. దుర్మదుడు అంటే యోని. 'నిరృతి' అనే పేరుగల పడమటి ద్వారం గుదం (ముడ్డి). వైశసం అంటే నరకం. లుబ్దకుడు అంటే మలద్వారం. గుడ్దివారు కాళ్ళూ చేతులు. అంతఃపురం హృదయం. విషూచి అంటే మనస్సు - అని ఇంకా ఇలా చెప్పాడు.

(ప్రాచీనబర్హీ ఉపాఖ్యానంలోని వ్యక్తులుగా చెప్పిన అవయవాదుల స్వరూపాన్ని వివరించవలసినదిగా నారదుని ప్రార్ధించాడు. ఆ రూపకార్థాన్ని నారదుడు ఒక్కొక్కటిగా విడదీసి ఏది ఏ అవయవానికి గుర్తుగా చెప్పారో ఈ వచనంలో స్పష్టం చేసి చెబుతున్నారు.

1. పురం - కథలో నగరం - తత్త్వంలో దేహం.

2. పురంజనుడు కథలో రాజు - తత్త్వంలో రాజు.

3. పురంజనుడు అంటే పురాన్ని రూపొందించేవాడు.

4. అవిజ్ఞాతుడు అనే సఖుడు ఈశ్వరుడు. లోకంలోలాగా పేర్లు మొదలైన భేదాలచేత తెలియరానివాడు అని ఆ పదానికి అర్థం.

5. పంచ వృత్తులు కలది కనుక అయిదు తలలు గలది అనీ, సర్పంవలె ప్రాకుతూ పోతూ ఉంటుంది కనుక పాము అనీ అన్నారు. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనేవి అయిదు విధాలైన వాయువులే ఇక్కడ ప్రాణానికి చెందిన వృత్తులు.

6. ప్రాక్‌.ద్వార, పురస్కృతంబులు - తూర్పు వాకిళ్ళుగా చేయబడినవి.

7. ఖద్యోత.ఆవిర్ముఖులు - ఖద్యోతం అంటే మిణుగురుపురుగు. దానివలె కొంచెంపాటి ప్రకాశంకలది; ఆవిర్ముఖం- ఆవిః అంటే ప్రకటమైన ముఖం కలది. అంటే అధిక ప్రకాశం కలది.

8. విభ్రాజితం - అంటే బాగా ప్రకాశించేది - రూపం.

9. నలము, నాలము - అంటే రంధ్రాలు. అవి కలవి నళిని, నాళిని

10. అవధూత - వాయువును చెదరగొడుతూ ఉండదే లక్షణం కలది - ముక్కు

11. బహూదనం - బహు+ఓదనం - బహ్వోదనం అనాలి. కానీ గూఢంగా చెప్పటం కోసం బహూదనం అన్నారు. "పరోక్షప్రియా ఇవ హి దేవాః" అని శ్రుతి. దేవతలు పరోక్షప్రియులు. ఆ దృష్టితో ఈ మాట ఏర్పడినది.

12. పితృహువు - పితృదేవతల ఆహ్వానం దీనిచేత అవుతుంది కనుక పితృహువు.

13. దేవహువు - పితృహువు కంటె వేరైనది. అంటే ప్రవృత్తి మార్గానికి సంబంధించినదని శాస్త్రం చెబుతున్నది.

14. ఆసురి - అసురం అంటే ఇంద్రియాలతో రమించే శీలం. వానికి సంబంధించినది ఆసురి. అది శిశ్నద్వారం.

15. గ్రామకం - గ్రామంలో ఉన్నజనులకు సుఖాన్ని కలిగించేది. రతిక్రీడ.

16. దుర్మదము - గుహ్యేంద్రియం.

17. నిరృతి - అంటే ఆసనం. అది మృత్యుద్వారమని చెబుతారు.

18. వైశసం - మలవిసర్జనం.

19. పాయువు - అనే అవయవాన్ని లుబ్దకుడు అన్నారు. దానినుండి వెలువడే పదార్ధానికి దుఃఖం కలుగుతుంది. కనుక అది వేటకాని వంటిది.

20. అంధులు - చేతులు, కాళ్ళు తక్కిన అవయవాలలాగా రంధ్రాలు లేనివి కనుక అంధులుగా పరిగణన.

21. విషూచి - అంటే మనస్సు. అన్ని వైపులకు ప్రసరించేది అని శబ్దార్థం.)

పుణ్యాత్మా! విను. యోగులలో గొప్పస్థితిగల ఆ నారదుడు పురంజనునకు భార్యగా అయిన బుద్దిని గురించి, కొడుకులుగా చెప్పబడిన బుద్ధివికారాలను గురించి వివరించి, ఆ బుద్ధితత్త్వం ఎలా వికారాలను కలిగిస్తుందో; ఇంద్రియాలు ఏవిధంగా వికారాలను పొందుతాయో; ఆ గుణాలసంపర్కం వలన ఆ బుద్ధికి, ఇంద్రియాలకూ సంబంధించిన కదలికలకు జీవుడు గొప్పస్థితి కలవాడైనా సాక్షిమాత్రంగా ఎలా ఉంటాడో; తన పట్టపురాణి అయిన బుద్ధి ఆ కదలికలను తాను అనుకరించే విధంగా బలాత్కారం చేయగా అతని ప్రవృత్తి ఎలా ఉంటుందో; ఆ విషయాన్నంతా చక్కగా తెలిసేవిధంగా చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.

('జాయ' అంటే పురుషునకు సంతానాన్ని ప్రసాదించేది. ఇక్కడ జాయ - బుద్ది. దానివలన కలిగిన పుత్రులు ఇంద్రియాలు. జీవుడు ఈ రెండింటితో సంసారంలో ప్రవృత్తి పొందుతున్నాడు. దానివలననే బంధం కలుగుతున్నది. ఆ విషయాల నన్నింటినీ నారదుడు ప్రాచీనబర్హీకి తెలియజెప్పాడు.

వృత్తులు అంటే కదలికలు. ఇంద్రియాలు విషయాలపై ప్రసరించటం. వానివలన అనుభూతులు పొందటం మొదలైనవి. ఇవన్నీ భార్య స్థానంలో ఉన్న బుద్ధివలన కలిగేవి.

ముక్తిని కాంక్షించేవాడు ఈ అన్నింటినీ తత్త్వరూపంగా తెలుసుకొని వదలివేయాలి. దానినే శాస్త్రాలు సంన్యసనం అంటాయి. దీనిని పై పద్యం స్థూలంగా నిరూపిస్తున్నది.)

రాజా! రథమంటే దేహం. గుర్రాలు ఇంద్రియాలు. ఏడికోలలు ఏడాది, వయస్సులు. రెండు చక్రాలు పుణ్య పాపకర్మములు. మూడుబొంగులు అంటే మూడుగుణాలు. అయిదు బంధాలు అంటే అయిదు ప్రాణాలు. పగ్గం మనస్సు. సారథి బుద్ధి. రథికుడు కూర్చుండేచోటు హృదయం. రథికుడంటే ఇక్కడ జీవుడు. బండినాగలు అనేది శోకం, మోహం. అయిదు ఆయుధాలు అంటే అయిదు ఇంద్రియాల ప్రసారాలు. అయిదు విక్రమాలు అంటే కర్మేంద్రియాల ప్రవృత్తి ఏడుకవచాలు అంటే ఏడు ధాతువులు. బంగారు సామగ్రి అనేది రజోగుణం. తరుగువోని అంపపొది అంటే అంతులేని వాసనలతో ఏర్పడిన అహంకారమనే ఆధారభూమి. ఏకాదశచమూపతి అంటే పదకొండు ఇంద్రియాల సముదాయమైన మనస్సు. ఆసురీవృత్తి అంటే జీవుడు దేహం వెలుపల చూపించే పరాక్రమం. జీవుడు అయిదు ఇంద్రియాలతో వేటకాడు వేటవినోదం పొందినట్లుగా హింసమొదలైన పనులవంటి శబ్దాదుల అనుభవాలను పొందటం మృగయాచరణం. జీవుడు ఇలా ఉండి దేహంలో కల, గాఢనిద్ర, మెలకువ అనే దశలలో ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలైన పెక్కుతీరుల దుఃఖాలతో కష్టాలనుభవిస్తూ అజ్ఞానం కమ్ముకోగా నూరేండ్లు కర్మలనాచరిస్తూ బదుకుతున్నాడు. నిజానికి అతనికి ఈ గుణాలు లేని లక్షణమే పరమాత్మకు వలె ఉన్నది. కానీ ప్రాణాలూ, ఇంద్రియాలూ మనస్సూ అనే వాని ధర్మాలను తనయందు ఉన్నవిగా భావించటంచేత ఇట్టి దుఃస్థితి కలిగింది. వానివలన అల్పాలైన కోరికలనే నిరంతరమూ భావిస్తూ నేను, నాది అనే భావనలను నిండా నింపుకోవటం వలన ఈ దశ కలిగింది.

(పుణ్య, పాప, కర్మ, ద్వయంబు- పుణ్యాన్ని కలిగించే దానాదులు పుణ్యకర్మలు. పాపాన్ని కలిగించే హింసాదులు పాపకర్మలు. ఈ రెండూ దేహం అనే రథానికి రెండు చక్రాలు.)

జీవుడు నిజానికి తనంత తాను ప్రకాశించే పరమాత్మ లక్షణం కలవాడే. కానీ అప్రమేయుడూ, అనంతుడూ, కర్మఫలాల అంటులు లేనివాడూ, భగవంతుడూ సర్వలోకాలకూ గురువూ అయిన ఆ పరమాత్మను తెలిసికోలేక ప్రకృతిగుణాలలో తగులుకొని దుఃఖం పొందుతున్నాడు.

జీవుడు ప్రకృతిగుణాల సంపర్కం పొందినపుడు గుణాలయందు అభిమానం కలవాడవుతాడు. కర్మలకు వశమై పోతాడు. ఆ విధంగా మూడు గుణాలవలన కలిగిన పరమాత్మ లక్షణాలకు విరుద్ధమైన కర్మలు అతనిని బంధించి వేస్తాయి.

(గుణాలు సత్త్వం, రజస్సు, తమస్సు అనేవి ఘనం అనటంచేత అవి సులభంగా వదలించుకోవటానికి సాధ్యం కానివనే భావం కలుగుతుంది. గుణ అభిమానం అంటే సత్త్వరజస్తమస్సులనే నిజమైనవిగా భావిస్తూ వానినుండి విడివడాలి అనే భావం కలగకుండా ఉండటం.

సత్త్వగుణ సంబంధంకల కర్మల నాచరించాలి అంటే ధృతి-పట్టుదల కావాలి. అట్టివానిచేత గొప్పవెలుగులతో నిండిన లోకాలను జీవుడు పొందుతాడు. రజోగుణం ఎక్కువగా కల పనులవలన దుఃఖమే కలుగబోయే ఫలం అయినవీ, ఊగులాటతో కూడినవీ, ఆయాసం కలిగించేవీ అయిన లోకాలను చేరుకుంటాడు. తమోగుణానికి సంబంధించిన కర్మవలన చీకటి(అజ్ఞానం), శోకం, మోహం అధికంగాగల లోకాలను పొందుతాడు. ఇలా కర్మలకు తగినవిధంగా జన్మ లెత్తుతూ పుట్టి చస్తూ, మళ్ళీ జన్నిస్తూ కోరికలతో నిండిన మనస్సు కలవాడై జీవుడు ఉన్నత, అధమ స్థానాలకు చేరుకుంటూ ఉంటాడు.

(సత్త్వగుణానికి ప్రకాశ శక్తీ, రజోగుణానికి విక్షేపశక్తీ, తమోగుణానికి ఆవరణశక్తీ ఉన్నాయి.)

అని ఇంకా ఇలా అన్నాడు, ఒక కుక్క ఆకలిబాధను తట్టుకోలేక ఇల్లిల్లూ తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కచోట అదృష్టం లేకపోవటంవలన కర్రదెబ్బ తగులుతుంది. అదృష్టం బాగుంటే దొంగతిండి లభిస్తుంది. ఇదంతా దైవయోగం. అలాగే జీవుడు కూడా తన అదృష్టాన్ని బట్టి ప్రియాన్నీ అప్రియాన్నీ మూడులోకాలలో పొందుతూ ఉంటాడు.

(ఇక్కడ దైవికం, దైవయోగం అనేవానికి తాను చేసుకున్న కర్మల ఫలితంగా ఏర్పడిన అదృష్టం, దురదృష్టం అనేవాని సంబంధం అని అర్థం.

రాజా! జీవుడు ప్రయత్నపడి కలిగే దుఃఖాలను పోగొట్టుకోవటానికి మారుపనులు చేస్తూ ఉంటాడు. తలమీద ఒక పెద్ద మోపు పెట్టుకున్నాడు. బరువును తట్టుకోలేక ఆమోపును భుజంమీదికి దింపుకోవటం ప్రతిక్రియ. కానీ అలాచేసినా బరువు వల్ల కలిగిన దుఃఖం మనస్సు నుండి తొలగిపోదుకదా! అలాగే జీవుడు మూడు విధాలైన దుఃఖాలను ఎప్పటికీ తొలగించుకోలేడు.

(అధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మికములనే తాపత్రయాలే త్రివిధ దుఃఖాలు.)

ఒక కర్మ గొప్ప దుఃఖాన్ని కలిగిస్తుంది. దానిని తొలగించుకోవటానికి జీవుడు ప్రతిక్రియగా ఏదో చేస్తూ ఉంటాడు. ఈ రెండూ మాయవలన ఏర్పడినవే. అది కలలో కల వచ్చినట్టి వ్యవహారం.

ఆ కర్మ వ్యవహారం వాసనలతోపాటు తెగి నాశనమైపోయేది కాదు. అని ఇంకా ఇలా అన్నాడు

(వాసనలు-కర్మలకు సంబంధించిన జ్ఞాపకాలు. ఇవి దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన - అని మూడు విధాలు.)

రాజా! కలలాగా అజ్ఞానంచేత భాసిల్లే అబద్ధం అనదగిన దేహంమొదలైన మళ్ళీ సంభవించడం మొదలైన శ్రమతో పనియేమి అంటావేమో! దానినిగూర్చి విను. కోరదగిన పదార్ధం లేకపోతే ఏదో ఒక ఆధారంలో చిక్కుకొన్న మనస్సు కోరికోరి కలలలో తేలియాడుతూ ఉంటుంది. దానివలన జీవుడు మెలకువ పొందిన తరువాత ఆధారమైనది అలాగే ఉంటుంది కాబట్టి స్వప్నంలోని సంసారాన్ని వదలిపెట్టడు. అంటే కలలోని సంసారం అలానే ఉంటుంది. తత్త్వజ్ఞానంచేత అజ్ఞానం మరలిపోయినట్లు భార్యాబిడ్డలు, శరీర వ్యామోహం మొదలైనది తననుండి తొలగిపోకపోతే సంసారం మరలిపోదు. కాబట్టి నివృత్తిని ఆ ప్రయోజనంకోసం పాటించాలి.

నిజానికి జీవుడు పరమపురుషార్థ రూపమైన ఆత్మయే; కానీ అన్ని అనర్థాలకు కారణమైన సంసారం జీవునకు ఏ కారణంవలన కలుగుతుందో ఆకారణం చేతనే ఆ అనర్థాన్ని తొలగించే జ్ఞానంవలన, వాసుదేవపదభక్తి కూడా కలుగుతుంది.

పుణ్యాత్ముడా! భక్తితత్త్వం సరైన తీరులో తెలియాలి అంటే పెద్దకాలంసాగే విష్ణుభక్తిని పెంపొందించే భక్తికి ఆలవాలమైన గోవిందుని మెలైన కథలను పట్టుకోవటమే గతి.

భక్తి తీరుతెన్నులు గోవిందభక్తుల కథలద్వారా సరిగా తెలుసుకోవచ్చు అని భావం.

కాబట్టి భగవంతుని కథలను ఎల్లవేళలా చెప్పుకొనేవాడూ, పాడుకొనేవాడూ అయిన వ్యక్తికి భక్తి కలుగుతుంది.

మంచివారు, నిర్మలమైన మనస్సుకలవారు, భగవంతుని గుణాలకు సంబంధించిన కథలను ఒకదాని తరువాత ఒకటిగా పలుకుతూ ఉండటం, వింటూ ఉండటంతో ప్రకాశించే హృదయం కలవారు, పాప స్పర్శ ఏ మాత్రమూ లేనివారూ అయిన భక్తుల సభలో

(అనుకథనం అంటే వ్యవధానం లేకుండా చెప్పుకొంటూ ఉండటం.)

సరసులు, ఉదారులు అయిన మహాత్ములు చక్కగా పలికే శ్రీమహావిష్ణుని మనోహరమైన గుణాల సముదాయంచేత చాలా రుచికలదిగా చేయబడిన కథలనే అమృతంతో నిండిన నదులను మిక్కిలి ప్రీతితో మనసారా చెవులనే దోసిళ్ళతో భగవంతుని చరితామృతాన్ని త్రావే పుణ్యాత్ములను ఆకలి, దప్పి, గొప్ప భయం, దుఃఖం, ఒడలు తెలియనితనం మొదలైనవి ఎన్నటికీ తాకవు.

(సరసులు- రసగ్రహణంలో నిండైన ఆసక్తి కలవారు.)

కాబట్టి, భక్తులతో కలసిమెలసి ఉండక తనకు తానై భగవంతునికీ, భాగవతులకూ సంబంధించిన కథలను చెప్పుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే ఆలస్యం మొదలైన దోషాలు కలుగుతాయి. ఆ పరిస్థితిలో ఈ ప్రాణిలోకం తనతోపాటు ఏర్పడిన ఆకలి మొదలైన వానిచేత ఆపదలు పొందినదై భగవంతుని కథలు అనే అమృత ప్రవాహం విషయంలో ఆసక్తి పొందదు. ఇది సందేహం లేని మాట అని ఇంకా ఇలా అన్నాడు.

(శ్రీశంకరులు దీనినే 'సత్సంగత్వే నిస్సంగత్వం' ఇత్యాదిగా చెప్పారు. సజ్జనుల కలయిక వలన ప్రాపంచికమైన తగులములు నశిస్తాయి. దానితో మోహం-అంటే అజ్ఞానం రూపుమాసిపోతుంది. దానివలన నిశ్చలమైన భక్తి కలుగుతుంది. అది జీవన్ముక్తికి సోపానం అవుతుంది.)

గొప్పగా కొనియాడదగిన శీలం కలవాడా! బ్రహ్మ శివుడు, మనువులు, దక్షుడు మొదలైన ప్రజాపతులు; పరమనిష్ఠగల సనకుడు మొదలైన జ్ఞానసంపన్నులు; పులస్తూడు, భృగువు, పులహుడు, క్రతువు, అత్రి, మరీచి, అంగిరసుడు, వసిష్ఠుడు ఇంకా ప్రసిద్ధికెక్కిన గొప్ప పుణ్యాలపంట పండించుకొన్నవారు; నేను తుదిగా ఉన్న బ్రహ్మవాదులందరూ వాక్కుల సమితికి ప్రభువులై కూడా సమస్తమైన బుద్ధితో తపస్సు, యోగం, విద్య, మనోనియమం మొదలైన వానిని గూర్చి తర్కించి నిగ్గు తేల్చుకొన్నవారై ఉండికూడా ఎంతవెదకినా సర్వసాక్షి అయిన ఈశ్వరుని కానలేరు.

(మోక్షసాధన సామగ్రియందు భక్తియే గరీయసి అనే విషయాన్ని ఇందులో నిరూపిస్తున్నారు. భక్తి లేకపోతే ఎన్ని ఉన్నా భగవంతుని పొందటం సాధ్యం కాదని అర్థం).

అది ఎలాగయ్యా అంటావేమో! వేదం చాలా గొప్పది. ఎంతో వ్యాప్తి కలది. దానికి అంతం లేదు. అటువంటిది మరొకటి లేదు. అటువంటి దానిని వల్లెవేస్తూ వేరువిధాలైన మంత్రాలను జోడించి దేవ నామం గల శుభాన్ని కూర్చ సామర్థ్యంగల ఇంద్రుడు మొదలైన నానా దేవతలను ఇష్టదైవంగా ఎంచుకొని ప్రీతితో పూజిస్తూ ఉంటారు. అట్టివారికి నిజమైన పరమాత్మతత్త్వం ఎలా తెలిసివస్తుంది?

(వేదాలలో చాలాభాగం అర్ధవాదం. అది లక్ష్యం ఏర్పడటం కోసం మహిమను విసృతంగా ప్రశంసిస్తూ ఉంటుంది. అలా పూజ్యతను పొందినవారు ఇంద్రాది దేవతలు. వారు దేవతలే కానీ వారికి కూడా ఆరాధించదగిన తత్త్వం ఒకటి ఉంది. ఆ పరమాత్మ స్థాయికి పోలేక కిందిస్థాయిలోనే నిలిచి పోయేవారు గమ్యాన్ని చేరుకోలేరు అని చెప్పటం ఇక్కడ ఉద్దేశం)

రాజా! విను. ఆత్మగా భావించబడే ఆ భగవంతుడు ఎప్పుడు ఎవరిని అనుగ్రహిస్తాడో అప్పుడు ఆ భాగవతుడు పూజ్యమైన ఆత్మకలవాడై, మహాత్ముడై ధీరబుద్ధితో లోకవ్యవహారాన్ని యజ్ఞాదులైన కర్మాచరణలతో గట్టి నిలుకడ కలదై దృఢపడిన బుద్ధిని ప్రయత్నంతో విడిచి వేస్తాడు.

(ఆత్మ భావితుడు- ఆత్మయందు భావించబడినవాడు అని శ్రీధరీయం. జీవుడు తన హృదయంలో ఏ చైతన్యాన్ని భావిస్తాడో ఆ చైతన్యమే 'ఆత్మ' అని తాత్పర్యం.)

రాజా! కాబట్టి నీవు కూడా పరమార్థాలుగా కనిపించేవీ, మనస్సును ఆకర్షించేవీ, వినటానికి ఇంపుగా ఉండేవీ, పరమాత్మను తాకనివీ అయిన పెక్కు విధాలయిన యజ్ఞాది కర్మలందు అవే పురుషార్థాలు అనే బుద్దిని పెట్టుకోకు. మరి గొప్ప తెలివితేటలు గలవారు శ్రీమహావిష్ణువును మాత్రమే నిరూపించే వేదాన్ని కర్మపరంగా వక్కాణిస్తూ ఉంటారు. వారిని వేదతత్త్వం తెలిసినవారు అనటానికి వీలులేదు. వారు నిత్యం సత్యం అయిన పరమాత్మతత్త్వాన్ని పట్టుకొనే సామర్థ్యం కలవారు కారు.

(ప్రరోచమానంబులు - కేవలం చెవికి మాత్రమే రుచిని పుట్టించేవి; అస్పృష్ట వస్తువులు- వస్తువు అంటే ఇక్కడ పరమాత్మ అనే అర్జాన్ని గ్రహించాలి. పరమాత్మను తాకనివి. అంటే అనిత్యమైన ప్రపంచాన్ని మాత్రమే తాకేవి అని తాత్పర్యం.)

కాబట్టి, నీవు తూర్పునకు చివళ్ళు కలుగునట్లుగా దర్భలను పరచి, భూమండలాన్నంతా యజ్ఞవేదికగా చేసి నేనింతవాడను అనుకొంటూ, వినయాన్ని వదలివేసి చాలా పశువులను చంపటం తెలుసుకున్నావు, కానీ నిజమైన కర్మతత్త్వం ఏమిటి? విద్యాస్వభావం ఏమిటి? అనేది తెలిసికోలేదు. ఆ కర్మ, విద్యా స్వభావాలు ఏమిటంటే సర్వేశ్వరుని సంతోషపెట్టేదే కర్మం. సర్వేశ్వరునియందు బుద్ధిపుట్టించేదే విద్య. ఆ సర్వేశ్వరుడే దేహం ధరించిన జీవులకు ఆత్మయు పాలకుడున్నూ కాబట్టి, మానవులకు క్షేమాన్ని కలిగించేది ఆయన పాదాలను ఆశ్రయించటమే. అతడు మిక్కిలి ప్రియమైనవాడూ, మనసేవలందుకొనేవాడూ అయితే దుఃఖం అణువంత కూడా కలుగదు. అటువంటి ఆ భగవంతుని తత్త్వాన్ని తెలుసుకొని బోధించగలవాడే పండితుడు, గురువు, హరి - అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

(హరియందు బుద్ధిపుట్టించేదే విద్య. ఎందుకంటే దానివలన కలిగేది మహాఫలం కనుక.

స్వచ్చమైన శీలంకల ఓరాజా! నీ సందేహాన్ని ఈ విధంగా తీర్చాను. చాలా పూనికతో మరొక్క రహస్యమైన విషయాన్ని నీకు తెలియజేస్తాను. మదిలో నిలుపుకో.

రాజా! విను. ఒక జింక పూలతోటలలో తిరుగుతూ ఉంటుంది. కొద్దిపాటి పూలవాసన వెంటబడి మనస్సులో పొంగిపోతూ తిరుగుతూ ఉంటుంది. వెంటకొన్ని ఆడుజింకలు ఉంటాయి. దాని మనసంతా వాని మీదనే అంటి పెట్టుకొని ఉంటుంది. తుమ్మెదలు ఝంకారాలతో చెవులకు విందు చేస్తూ ఉంటాయి. దాని ముందు తన ప్రాణాలను లాగివేయటానికి తోడేళ్ళ మంద ఉత్సాహంతో నిలబడి ఉంటుంది. వేటకాడు మిక్కిలి వాడిబాణాలతో పిరుదులను చీల్చివుంటాడు. గుండెలో చావుభయం కలుగుతూ ఉంటుంది. తప్పించటానికి ఒక్క ఉపాయం కూడా కానరాదు. పిచ్చి తిరుగుళ్ళతో అతలాకుతలం అయిపోతూ ఉండే ఆ లేడిలాగా జీవుడు సర్వకాలాలలో ఏదో అయిపోతూ ఉంటాడు.

జీవుడు స్త్రీల నివాసాలలో చాలా నీచమైన తిండీ, శరీరసుఖమూ మొదలైన కొద్దిపాటి సుఖాలను వెదకుతూ స్త్రీలతో కలసి ఉన్నవాడూ, వారియందే ఉంచిన మనస్సు కలవాడూ అయి, చాలా ఇంపుగా ఉండే ఆడువారి మాటలను వినటమే పని అయినవాడై, ఎదురుగా ఆయువును దొంగిలించే పనికి కారణాలైన రాత్రిబవళ్లను లెక్కించటం అనే పని పెట్టుకోకుండా, చాటుమాటుగా వచ్చిపడే యముని ఆయుధాలకు ఒడలంతా చీలిపోగా, వినోదంగా తిరుగుతూ ఉంటాడు. ఇదంతా ఒక పశువు చేష్టవంటిది. నీవు దానిని బాగా మనస్సుకు పట్టించుకొని చెవులు మొదలైన ఇంద్రియాలలో ఉన్న శబ్దం మొదలైన వానినిలాగా, వేదాలూ స్మృతిగ్రంథాలూ చెప్పిన వెలుపలి విషయాల వంటివి అయిన యజ్ఞం మొదలైన కర్మలను హృదయంలోనే అణచి ఉంచుకొంటూ మంచివారు కాని మానవుల మందల మాటలకు సంబంధించిన గృహాశ్రమాన్ని విడిచిపెట్టు. జీవులన్నింటికీ అందరికీ ఆశ్రయించదగినవాడయిన ఈశ్వరుని సేవించుకో. క్రమక్రమంగా భౌతికమైన సర్వవిషయాలనుండీ విరక్తిని పొందు- అని నారదుడు ఉపదేశించగా ప్రాచీనబర్హి ఇలా అన్నాడు.

(దీనినే యుక్త అయుక్త వివేకజ్ఞానం అంటారు. సాధారణంగా జీవుడు తనకు శాశ్వత ప్రయోజనాన్ని కలిగించేదానిని పట్టించుకోడు. అప్పటికి సుఖంగా ఉన్నట్లు కనిపించే దాని వెంటబడతాడు. దానితో రెండు వైపులా నష్టమే కలుగుతుంది. సంసారం ఎన్ని జన్మలకైనా పెరుగుతూనే ఉంటుంది. ఇది పెద్ద అనర్థం.)

మహర్షివరేణ్యా! నీవు సాక్షాత్తు భగవంతు డనదగినవాడవు, సాటిలేని విజ్ఞానమంతటికీ నిధి అయిన వాడవు. ఇట్టి నీవు వివరించిన ఈ ఆత్మతత్త్వం నాచేత వినబడినది. చక్కగా విచారించబడినది. కర్మలయందే స్థిరంగా నిలిచి ఉన్న వారయిన గురువులు కూడా ఈ ఆత్మకు సంబంధించిన తత్త్వాన్ని ఎరుగరు. తెలిసి ఉండినా ఇతరులకు ఉపదేశించరు. కాబట్టి, దానివలన కలిగే సంశయం చాలా గొప్పది. దానిని నీవు తీర్చావు! అని ఇంకా ఇలా అన్నాడు.

(ఇక్కడ శశుతం అంటే శ్రవణం అనీ, విచారితం అంటే మననం అనీ భావించాలి.)

పుణ్యాత్మా! గొప్పతపస్సు చేసిన మహర్షులకైనా పరమాత్మయందు ఇంద్రియాల ప్రవృత్తులు ప్రవర్తించక పోవటం వలన వారుకూడా మోహపడుతూ ఉంటారు. అటువంటి తత్త్వవిషయంలో ఒక సంశయం కలుగుతుంది. అది ఏమంటే జీవుడు ఏ దేహంతో చేసిన కర్మలు ఆ దేహంలోనే ఇక్కడ- ఈ లోకంలో- విడిచివేసి మరొక దేహం ఏర్పాటు చేసుకొని మరొక లోకంలో ఆ కర్మఫలాన్ని అనుభవిస్తాడు అని వేదం తెలిసినవారు ప్రకటంగా పలుకుతూ ఉంటారు. అది ఎలా కుదురుతుంది?

అంతేకాదు. చేసిన పని ఆ క్షణంలోనే నశిస్తుంది. కాబట్టి, జీవుడు మరొకదేహంతో, మరొకలోకంలో ఏర్పడే ఫలాన్ని ఎలా అనుభవిస్తాడు - అని ప్రాచీనబర్హి తన సంశయాన్ని నారదునకు తెలియజేశాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు. రాజా! కలవచ్చిన స్థితిలో జీవుడు లింగదేహాన్ని ఆశ్రయించి ఉన్నాడు. అప్పుడు అతనికి మేలుకొని ఉన్నప్పటి దేహం నాది అనే భావన ఉండదు. అటువంటిదో, అటువంటిది కానిదో అయిన మరొక శరీరాన్ని పొందుతాడు. అంతకు ముందు చేసిన కర్మలన్నీ సంస్కార రూపంలో అతని మనస్సులో ఉంటాయి. (ఇసుకలో వేసిన వెనుకటి పాదపుగుర్తుల వంటివి సంస్కారాలు). వానినే కలలో అనుభవిస్తూ ఉంటాడు. అదేవిధంగా జీవుడు ఏ లింగదేహంతో కర్మం చేస్తాడో ఆ దేహంతోనే మరొకలోకంలో ఇంకొక దేహం అనే దానితో భేదాన్ని పొందకుండా ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. అది సరేనయ్యా! దానం ఇవ్వటం, పుచ్చుకోవటం మొదలైన పనులు ఉన్నాయి. వానికి స్టూలశరీరంతోనే కదా సంబంధం అంటావేమో! నేను, నాది అనే భావాలతో కూడిన జీవుడు మనస్సుతో ఏ దేహాన్ని గ్రహిస్తాడో ఆ దేహంతోనే ఏర్పడి ఉన్న కర్మాన్ని అనుభవిస్తాడు. అలా కాకపోతే కర్మం పునర్జన్మకు కారణం కావటం కుదరదు. కాబట్టి, మనస్సు ప్రధానం అయిన కారణశరీరానికే కర్తృత్వం కుదురుతుంది అని ఇంకా ఇలా అన్నాడు.

జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చేసిన పనులన్నీ మనస్సులో ముద్రపడినట్లుగా ఉంటాయి. కాబట్టి వెనుకటి దేహాలతో చేసిన కర్మలు చిత్తపు కదలికలలో గుర్తించబడుతూ ఉంటాయి.

అది ఎలాగంటే ఈ దేహంలో ఇది వరకు అనుభవించనిదీ, కనబడనిదీ, వినబడనిదీ అయిన ఒక విషయం ఎప్పుడో, ఎక్కడనో ఏ రూపంతోనో, ఏ విధానంగా జరిగి ఉంటుందో. అది వాసనలను బట్టి పూర్వదేహంలో అనుభవానికి వచ్చినది అనుకోవాలి. ఈ మనస్సులో అనుభవించనిది ఎప్పుడూ కానరాదు. ఈ మనస్సు జీవులకు మంచివీ, చెడువీ అయిన ఫలాలకు కారణమైన వాటి వెనుకటి, ఇప్పటి దేహాలలో ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఈ మనస్సునందు కనబడని, వినబడని విషయం కలలో అనుభవానికి వస్తున్నది కదా అంటే అది దేశాన్ని కాలాన్ని కర్మనూ అనుసరించి తెలియవస్తుందని ఊహించాలి. ఇవన్నీ మనస్సులో క్రమాన్ననుసరించి భోగించదగినవి. అని ఇంకా ఇలా చెప్పాడు.

మనస్సు శుద్ధమైన సత్త్వగుణంతో అలరారుతున్నది. శ్రీమహావిష్ణువు ఉత్తమగుణాలను భావించటమే ఏక లక్ష్యం అయినదీ, భాగ్యవంతమైనదీ అయినప్పుడు అందులో ఈ సమస్తప్రపంచమూ గోచరిస్తుంది. అది ఎలాగంటే గ్రహణ సమయంలో చంద్రునిలో రాహువు కనబడినట్లు.

ఇంకా నారదుడు ఇలా అన్నాడు. సూక్ష్మదేహానికి కర్తృత్వం, భోక్తృత్వమూ అనేవి స్థూలదేహం ద్వారా కలిగేవి కాన స్థూలదేహం నశిస్తే జీవునకు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. కాబట్టి, ముక్తి కలుగుతుంది అంటావేమో అది కాదు. ఎందుకంటే స్థూలదేహంతో సంబంధం కల బుద్ది, మనస్సు, మోక్షం, గుణం, వ్యూహం, రూపం మొదలైనవి లింగశరీరం పాడైపోయేదాకా ఉంటాయి. నిద్ర, మూర్చ మొదలైనవాటి యందు, ఇష్టులైనవారితో, ఇష్టమైనవస్తువులతో ఎడబాటువలన కలిగిన దుఃఖమందూ 'అహంకారం' అనేది ఉంటుంది. ఇంద్రియాలు నశించిపోతాయి కాబట్టి, అహంకారం అమావాస్యనాటి చంద్రునిలా కళాకాంతులు లేకుండా పోతుంది. పసివానికి, తల్లికడుపులో ఉన్నప్పుడు ఇంద్రియాలు తగినంత నిండుదనం లేకుండా ఉంటాయి కనుక, పదకొండు ఇంద్రియాల వికాసానికి సమర్థమైన అహంకారం ప్రకాశించదు. కాబట్టి, స్థూలదేహం నశించటం ఉండదు. వస్తువు వెనుకటిది అయింది అనే భావం లేకపోతే, విషయాలమీద ఆసక్తి ఉన్న జీవునకు సంసారం మరలిపోదు. ఈ విధంగా పంచతన్మాత్రలూ, మూడుగుణాలూ, పదునారు వికారాలూ స్వరూపంగా అయిన లింగదేహాన్ని ఆశ్రయించి చైతన్యంతో కూడి ఉన్నవానికి జీవుడు అని వ్యవహారం. కాబట్టి, ముక్తి నీవు అనుకొన్న విధంగా కలుగదు.

జీవుడు ఒక దేహం నుండి పెక్కు దేహాలలోనికి పయనిస్తూ ఉంటాడు. ఒక దానిని వదలి సుఖం, దుఃఖం, భయం, మోహం, శోకం అనే లక్షణాలతో కూడిన అటువంటి దేహాలనే గ్రహిస్తూ ఉంటాడు. అది ఎలాగంటే, గడ్డిపరకలమీద తిరుగుతూ ఉండే జలగ ఒక పరకమీద చివరి భాగానికి చేరుకొంటుంది. అటుమీద ఉన్న గడ్డి పరకను అందుకుంటుంది. పూర్తిగా అది తనకు దొరికింది అన్న స్థితిలోనే వెనుక తానున్న గడ్డి పరకను వదలివేస్తుంది. అలా వదలటమే మరణం. పట్టుకోవటమే మరుజన్మ జీవుని ప్రయాణం కూడా అటువంటిదే. జన్మకు మనస్సే కారణం.

రాజా! జీవులందరికీ మనస్సే సంసారానికి కారణమైనది. అటువంటి కర్మబంధంచేత ఇంద్రియాలు తిప్పినట్లు జీవుడు తిరుగుతూ ఉంటాడు. దాని వలన అజ్ఞానం కలుగుతుంది. ఎడతెగని ఆ అజ్ఞానం విజ్బంభించటం వలన పెక్కు జన్మలూ, దేహాలూ, వానికి సంబంధించిన కర్మములు చుట్టుకొని పెనవేసుకొని ఉంటాయి.

రాజా! ఈ ఘోరమైన ఆపదకు మూలకారణం అవిద్య - అంటే అజ్ఞానం. అది లయించిపోవాలి. అంటే అది అంటూ ఒకటి ఉన్నది అనే భావన కూడా లేకుండా నశించిపోవాలి. దానికి శ్రీపతి అయిన నారాయణుని పాదపద్మాలను నిరంతరమూ సేవించుకోవాలి. ఆయన జీవుల పుట్టుకకు, ఉనికికీ, సంపూర్ణంగా నశించిపోవటానికి కారణమైనవాడు. ఇంద్రుడు మొదలైన ప్రభువులకు కూడా ప్రభువు. అందరినీ కాపాడే ఈశ్వరుడు. జగత్తంతా అతని స్వరూపమే అనే భావంతో దర్శించుకుంటూ ఎల్లప్పుడు సేవించు.

ఈ విధంగా భగవంతుడు, పాపం ఏ మాత్రమూ లేనివాడు, భక్తులలో శ్రేష్టుడు అయిన నారదుడు గొప్ప కృపతో జీవ, ఈశ్వరుల గతిని తెలియజెప్పి సిద్ధగతితో వెళ్ళిపోయాడు.

రాజర్షియైన ప్రాచీనబర్హి చక్కగా ప్రజలను పాలించటానికి కొడుకులను ఏర్పాటు చేసి తపస్సు చేసుకోవటానికి త్వరలో కపిలమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నియమాలు పాటిస్తూ మనస్సును పరమాత్మయందే నిలిపి, తగులముల నన్నింటినీ వదలివైచి, గొప్పధైర్యం అలవరచుకొని భక్తి యోగంతో శ్రీమహావిష్ణువు పదారవిందాలను భావించటమే అమృతం కాగా దానితో విశిష్టమైన చిత్తం కలవాడై బ్రహ్మరుద్రాదులైన మహాత్ములకు కూడా అందరాని తరుగువోని ఆనందమయస్థానానికి చేరుకొన్నాడు అని మైత్రేయముని విదురునకు తెలియజెప్పాడు.

(కర్తవ్య నిర్వహణ, తపస్సు, తగులములకు బానిస కాకపోవటం, నియమపాలన, ఏకాగ్రత, ధైర్యం, భక్తియోగం, భగవద్భావన అనేవి సిద్ధికి వరుసమెట్లు అని నిరూపిస్తుంది.)

ఇంకా ఇలా అన్నాడు. ఇట్లు ముకుందుని కీర్తితో కూడిన ఈ కథ లోకాలను పవిత్రం చేస్తుంది. మనస్సును శుద్ధంగా చేస్తుంది. అన్నింటికంటె గొప్పది అయిన ఫలాన్నిస్తుంది. దేవఋషి అయిన నారదుని ముఖంనుండి వెలువడినది. ఇది అధ్యాత్మవిద్యారహస్యం. దీనిని పఠించినవాడు, వినినవాడు లింగదేహాన్ని వదిలించుకుంటాడు. దానితో బంధాలన్నీ ఊడిపోతాయి. అతనికి విదేహ ముక్తి కలుగుతుంది; సంసారచక్రంలో పిచ్చి తిరుగుళ్ళు తిరుగడు అని మైత్రేయుడు చెప్పగా విదురుడిలా అన్నాడు.

మునీశ్వరా! పుణ్యాత్మా! ప్రచేతసులనువారు శివుడు ఉపదేశించిన విష్ణుస్తుతితో ఆ కమలాక్షుడు సంతోషించగా ఏ స్థానాన్ని చేరుకొన్నారు?

(ప్రచేతసులు ప్రాచీనబర్హికి శతధృతి అను స్త్రీ యందు కలిగిన పుత్రులు. వీరు అయిదుగురు. వీరు తపస్సుతో రుద్రుని మెప్పించి యోగాదేశం అనే రుద్రగీతను ఉపదేశంగా పొందిన విషయం పురంజనోపాఖ్యానానికి ముందు ఉంది.

ప్రచేతసుల తపంబునకు భగవంతుండు మెచ్చివరంబు లిచ్చుట

Holi Chandra Grahanam - హోలీ (హొళీ) చంద్ర గ్రహణం

హోలీ (హొళీ) చంద్ర గ్రహణం 

2026 మార్చి 3న హోలీ (హోలికా దహన్) రోజే చంద్రగ్రహణం (పాక్షిక/బ్లడ్ మూన్) రావడం అరుదైన విషయం. ఈ ఏడాది మధ్యాహ్నం గ్రహణం ఉంటుంది. కాబట్టి హోలికా దహన్ (మంటలు వేయడం) గ్రహణానికి ముందు ఉదయం లేదా మధ్యాహ్నం లోపే ముగించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. రంగులతో ఆడే వేడుకలను కూడా గ్రహణ సూతక కాలం ముగిశాక జరుపుకోవాలి.

హోలికా దహన్:
చంద్ర గ్రహణం దృశ్యమానతసూతక కాలం దృష్ట్యాహోలికా దహన్ ఆచారాలను మార్చి 3 ఉదయం లేదా మధ్యాహ్నం (గ్రహణ సమయానికి ముందే) పూర్తి చేయడం శ్రేయస్కరం.

శతాబ్దాలుగా హోలీని భారత ఉపఖండంలో జరుపుకుంటారు, 4వ శతాబ్దపు నాటి వేడుకలను సూచిస్తుంది. ఇది సుదీర్ఘ శీతాకాలం తర్వాత వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది, చెడుపై మంచి విజయానికి ప్రతీక. ఇది హిందూ క్యాలెండర్ నెల ఫాల్గుణకు అనుగుణంగా మార్చిలో జరుపుకుంటారు.

పురాతన భారతీయ సాహిత్యంలోని అనేక రచనలలో హోలీ యొక్క మూలం గురించి వివిధ కథనాలు ఉన్నాయి. కథ యొక్క ఒక ప్రసిద్ధ సంస్కరణ ప్రకారం, ఒక దుష్ట రాజు చాలా శక్తివంతం అయ్యాడు, అతను తన ప్రజలను వారి దేవుడిగా ఆరాధించమని బలవంతం చేశాడు.

కానీ రాజు యొక్క కుమారుడు ప్రహ్లాదుడు హిందూ దేవత అయిన విష్ణువు యొక్క గొప్ప భక్తుడిగా కొనసాగాడు. కోపోద్రిక్తుడైన రాజు తన కుమారుడిని చంపడానికి తన సోదరి హోలికతో కలిసి పథకం వేశాడు.

అగ్నికి అతీతమైన హోలిక ప్రహ్లాదుని తనతో పాటు చితిలో కూర్చోబెట్టింది. చితి వెలిగించినప్పుడు, విష్ణువు పట్ల బాలుడి భక్తి అతనికి క్షేమంగా నడవడానికి సహాయపడింది, అయితే పండుగకు పేరు వచ్చిన హోలిక, ఆమె రోగనిరోధక శక్తి ఉన్నప్పటికీ కాల్చి చంపబడింది.

Phalguna Purnima - ఫాల్గుణ పూర్ణిమ

ఫాల్గుణ పూర్ణిమ

పౌర్ణమి రోజులను ఉత్తర భారత రాష్ట్రాల్లో పూర్ణిమ అని, దక్షిణ భారత రాష్ట్రాల్లో పౌర్ణమి అని మరియు గుజరాత్లో పూనం అని పిలుస్తారు. సహజంగా అన్ని పూర్ణిమ రోజులు ముఖ్యమైనవి, ఎందుకంటే పూర్ణిమ రోజులు ముఖ్యమైన పండుగలు లేదా జయంతి రోజులతో సమానంగా ఉంటాయి.

పండుగలు మరియు జయంతి రోజులు కాకుండా, చాలా కుటుంబాలు సాంప్రదాయకంగా సంవత్సరంలో పూర్ణిమసి రోజులలో ఒక రోజు ఉపవాసాన్ని పాటిస్తారు. పౌర్ణమి రోజులు కూడా సత్య నారాయణ పూజ చేయడానికి చాలా ముఖ్యమైనవి.

దక్షిణ భారత రాష్ట్రాల్లో, అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలలో, ఫాల్గుణ పూర్ణిమను కామదహనంగా జరుపుకుంటారు. కామ దహనం యొక్క ఆచారాలు హోలికా దహనం యొక్క పురాణం వలె ఉంటాయి. సాధారణంగా హోలీని ఉత్తర భారతీయ పండుగగా పరిగణిస్తారు.

పౌర్ణమి సందర్భంగా, చాలా మంది భక్తులు ఉపవాసం ఉండి ఆ శ్రీ మహా విష్ణువును పూజిస్తారు. "పూర్ణిమ" అనే పదం సంస్కృత పదం, దీని అర్థం 'పూర్ణ చంద్రుడు.' 

ఫాల్గుణ పూర్ణిమ ఫాల్గుణ మాసంలో శుక్ల పక్షం చివరిలో వస్తుంది. ఇది సంవత్సరంలో చివరి మాసం కూడా. ఫాల్గుణ పూర్ణిమ ఉత్తరాది వారు సంవత్సరం చివరగా భావిస్తారు. వారు తెలుగువారి ఫాల్గుణ బహుళ పాడ్యమిని చైత్ర మాసంగా భావిస్తారు కావున వారికీ అప్పటినుండి  కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఫాల్గుణ మాసం సంవత్సరంలో చివరి నెల. అందువల్ల, ఫాల్గుణ పూర్ణిమ ని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు.

హోలికా దహన్ లేదా హొళీ పండుగను ఈ రోజునే జరుపుకుంటారు. ఈ రోజు వసంత రాకను సూచిస్తుంది మరియు ఈ రోజున చంద్రుడు తన శక్తులతో భూమిని బలంగా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు.

ఈ రోజు సంవత్సరంలో చివరి పౌర్ణమి కావున భక్తులు ఉపవాసం ఉండి, చంద్రుడిని మరియు శ్రీ మహా విష్ణువును ఆరాధిస్తే, గత జన్మ పాపాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు.

మోక్షం అనేది భూమిపై మానవ జీవితానికి పరమావధి.

ఫాల్గుణ పూర్ణిమ రోజును లక్ష్మీ జయంతిగా కూడా జరుపుకుంటారు. లక్ష్మీ దేవి అదృష్టం, సంపద మరియు సమృద్ధి యొక్క దేవత. కావున లక్ష్మీ దేవి జన్మదినోత్సవం 

శ్రీ మహావిష్ణువు యొక్క నాల్గవ అవతారంగా భావించే నరసింహ స్వామిని ఫాల్గుణ పూర్ణిమ రోజున పూజిస్తారు. ఈ రోజున నరసింహస్వామీ, శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఇంట్లో ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు.


Monday, March 2, 2026

The discourse between Sage Narada and King Prachinabarhi (Pracheena Barhi) - నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట

నారదుండు ప్రాచీన బర్హికి జ్ఞాన మార్గమును దెలియంజేయుట

ప్రాచీనబర్హి అనే రాజు గొప్పవి అయిన యజ్ఞం మొదలైన కర్మలలో తగులుకొన్న చిత్తంతో ఉన్నాడు. అతని దగ్గరకు తత్త్వం తెలిసినవాడు, దయగలవాడూ అయిన నారదుడు వచ్చి అతనికి జ్ఞానాన్ని బోధించటం కోసం ఇలా అన్నాడు. రాజా! నీవు కోరుకొనే శ్రేయస్సు కీడులను తొలగించేదీ, ఇష్టాన్ని సమకూర్చేదీ కావాలి. కానీ అది ఈ కర్మలవలన కలుగదు అని పలుకగా ప్రాచీనబర్హి అతనితో ఇలా అన్నాడు.

పుణ్యాత్మా! మునివరా! మహాభాగా! నేను కర్మలచే నశించిన జ్ఞానం కలవాడనై మోక్షమంటే ఏమిటో తెలియని వాడనయ్యాను. ఇట్టి నాకు ఇప్పుడు స్వచ్చమైనదీ, కర్మబంధాలను నాశనం చేసేదీ అయిన జ్ఞానబోధచెయ్యి. దయాస్వరూపా! కపట ధర్మాలైన ఇల్లూ వాకిలీ ఆలూ, కొడుకూ, ధనమూ మొదలైనవన్నీ గొప్పపురుషార్థాలుగా తలపోసే బుద్ధిహీనుడు సంసారపు దారులలోనే దిక్కులేక గమ్యంలేక తిరుగుతూ ఉంటాడు. ప్రయత్నించి మోక్షపదాన్ని పొందలేడు.

అన్నంతనే ప్రాచీనబర్దితో నారదుడిలా అన్నాడు. పుణ్యాత్మా! ఈ యజ్ఞాలలో దయాదాక్షిణ్యాలు లేక నీవు చంపిన పశువులు వేలకొలదిగా ఉన్నాయి. చూడు.

కాబట్టి, నీవు యజ్ఞాలలో హింసించిన పశువులన్నీ నీ వల్ల కల్గిన హానిని స్మరిస్తూ నిన్ను చంపటానికి ఇనుపయంత్రాల కొమ్ములతో, నీవు ఎప్పుడు చనిపోతావో అని యెదురు చూస్తున్నాయి. ఇటువంటి పెద్ద ఆపద నీకు రాబోతున్నది. దీనినుండి దాటుకోవటానికి వీలు కలిగించే ఒక పాతకాలపుకథను నీకు చెబుతాను విను. అని ఇలా అన్నాడు.

పురంజనోపాఖ్యానము

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...