Saturday, July 25, 2026

Chaturmasya Vratam - Gopadma Vratam - Rules - చాతుర్మాస్య వ్రతం - గోపద్మ వ్రతం - నియమాలు

చాతుర్మాస్య వ్రతం - గోపద్మ వ్రతం - నియమాలు

పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిలో చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ కాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. ఈ నేపథ్యంలో దేవశయని ఏకాదశి రోజున చాతుర్మాసం ప్రారంభమవుతుంది.

శాస్త్రాల ప్రకారం, ఈ ఏకాదశి రోజు నుంచి శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ సమయం నుంచి చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభించొచ్చు. ఇలా శయన ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహా విష్ణువు, కార్తీక మాసంలో ఉద్దాన ఏకాదశి రోజున తిరిగి మేల్కొని, గరుడ వాహనంపై వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తాడని పండితులు చెబుతారు.

ఈ మధ్య కాలంలో ఉండే ఆషాఢం, శ్రావణం, భాద్రపద, అశ్వీయుజ మాసాన్ని కలిపి నాలుగు మాసాలను చాతుర్మాసంగా చెబుతారు. ఈ సందర్భంగా చాతుర్మాస దీక్షను ఎవరు చేపట్టాలి, ఈ వ్రతం ఎవరు చేయాలి, ఈ వ్రత నియమాలు, విశిష్టతలేంటి. ఈ నాలుగు నెలల పాటు ఏయే పనులు చేయాలి, ఏయే పనులు చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చాతుర్మాసం దీక్ష:
ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనైకాదశి అంటారు. ఆరోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు. చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్ధం. కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధచాతుర్మాస్యం అనే పేరుతో చేస్తారు. ఈ వ్రతాచరణకు స్త్రీ, పురుష భేదం కానీ, జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగినులు మొదలైనవారెవరైనా చేయవచ్చును. ఇది హిందువులతో పాటు జైన, బౌద్ధ మతస్థులు ఉండే సమాజములోను ఆచరణలో కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు గానీ, వీలుకాకపోతే కటక సంక్రాంతి, కాకపొతే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి విధిగా ఆచరించాలని చెప్తారు.

చరిత్ర
ఈ చాతుర్మాస వ్రతం ఆచరించడమనేది ఇటీవలి కాలంలో వచ్చినది కాదు. యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య, స్కాంద పురాణాలలోని కథనాల వలన అవగతమవుతుంది. ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలలుపాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట. అనంతర కాలంలో రెండేసి నెలల పాటు ఉండే ఆరు ఋతువులుగా అవి మారాయి . తొలినాళ్ళలో వర్ష, హేమంత, వసంత - అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి. వర్ష ఋతువుతోనే సంవత్సరము ఆరంభామవుతూ ఉండేది. ఈ కారణం వల్ల సంవత్సరానికి " వర్షం" అనే పేరు వచ్చింది. సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలములో ఒక్క ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు. ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుండి సాకమేద యజ్ఞం, ఫాల్గుణ పూర్ణిమ నుండి వైశ్వ దేవయజ్ఞము చేస్తూ ఉండేవారు. ఆ నాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి చాతుర్మాస్య వ్రతముగా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. 

చాతుర్మాస వ్రతము పాటించేవారు. ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును ఆశ్వయుజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి. వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును. ఈ ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడు కోవటానికి బాగా ఉపకరిస్తాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస్య వ్రతదీక్ష అనేది - మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాఙ్మయం వివరిస్తోంది.

ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః

చాతుర్మాస దీక్ష ఎందుకు:
ఈ నాలుగు నెలల కాలంలో ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాతుర్మాస దీక్షను ఏర్పాటు చేసినట్లు పండితులు చెబుతారు. ఈ వ్రతాన్ని యతులు నాలుగు నెలల పాటు కఠిన నియమాలు పాటిస్తూ ఒకే చోట దీక్ష వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని చేసేవారు ప్రతిరోజూ తెల్లవారుజామునే స్నానం చేసి శ్రీ మహా విష్ణువు ఎదుట కూర్చుని పూజలు చేయాలి. ఈ కాలంలో విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను, కనకధార స్తోత్రం పఠించాలి. ఇష్టదేవతలకు సంబంధించిన మంత్రాలను పఠించాలి. 

ఈ వ్రతంలో భాగంగా వర్షాకాలంలో నాలుగు నెలలపాటు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు.ఈ దీక్షను చేపట్టిన వారు బ్రహ్మచార్యాన్ని పాటించాలి. నేలపైనే నిద్రించాలి. ఈ కాలంలో మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు వస్త్రదానం, అన్నదానం, దీప దానం, శ్రమ దానం చేయాలి.

చాతుర్మాస్య వ్రతంలో భాగంగా వర్షాకాలపు నాలుగు నెలల్లో ఆకుకూరలు, పెరుగు, పాలు మరియు పప్పు పదార్థాలను ఒక్కో మాసంలో విధిగా వర్జించాలి.

మాసాల వారీగా ఆహార నియమాలు (ఆహార నిషేధాలు)
శ్రావణ మాసం: పచ్చని ఆకుకూరలు పూర్తిగా తినకూడదు.
భాద్రపద మాసం: పెరుగు వినియోగాన్ని పూర్తిగా వదిలివేయాలి.
ఆశ్వయుజ మాసం: పాలను పూర్తిగా వర్జించాలి.
కార్తీక మాసం: వివిధ రకాల పప్పు పదార్థాలు తినడం నిషేధం.

వ్రత నియమాలు:
చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస) వారు పాటించవచ్చు. కుల, వర్గ నియమాలు కానీ, లింగ వివక్ష కానీ లేదు. చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించింది. చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ మొదటి నెలలో కూరలు, రెండవ నెలలో పెరుగు, మూడవ నెలలో పాలు, నాల్గవ మాసంలో పప్పు దినుసులూ తినకూడదు. భాగవతం వంటి గాథలు వింటూ ఆథ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలూ గడపాలి. వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఎక్కువగా సన్యాసులు, వృద్ధులు ఈ వ్రతం ఆచరిస్తారు.

ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు. ఈ కాలంలో అరుణోదయవేళ స్నానం చేయడం అవసరం. వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి. ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి. ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి. యోగసాధన చేయడం శ్రేయస్కరం. దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి.

వ్రత వృత్తాంతము:
చతుర్మాసాలు అంటే, ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం నాలుగు నెలలు. ఆషాఢ, శ్రావణ, బాధ్రపద, ఆశ్వయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే కాలంలో సాధకులు భూశయనం చేయటం, ఆకుకూరలు, వెల్లుల్లి, సొరకాయ, టమాట, ఆవనూనెల సేవనం మానివేయటం, నిరంతర జప, తప, హోమ, పురాణ కథా శ్రవణాల్లో కాలం గడపటం, రోజూ ఒకే పూట భోజనం చేయటం, ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయటం వంటి దీక్షా ధర్మాలను పాటిస్తారు. పీఠాధిపతులు, దీక్షితులు ఒకే స్థానంలో నివసించటం, క్షురకర్మలు నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు. శ్రావణ, బాధ్రపద మాసాలు గృహస్థుల నియమాలకు సరైనవని పద్మపురాణం తెలుపుతోంది. బాధ్రపద కృష్ణ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను తొలగిస్తుందంటారు. హరిశ్చంద్ర మహారాజు సత్యం, ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్ల పాలైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని మరువలేదని, చివరికి విజయం చేకూరిందని చెబుతారు. చాతుర్మాస్య దీక్షలో గోపద్మవ్రతం గురించి మూడు పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి.

నారేళ్ళనాచి కథ:
ఒకసారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి- చేయి మెత్తగా, మృదువుగా ఉండటానికి కారణం అడిగింది. పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు. అందుకే 'ఎముక లేని చెయ్యి' అని దానం చేసేవారిని వర్ణిస్తారు. 

పార్వతికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది. మారువేషంతో భూలోకానికి వెళ్లింది. నారేళ్ళనాచి అనే పేరు గల గర్భిణికి చేయూతనిచ్చి, సేవచేసి, 11 రోజుల తరువాత సకలైశ్వర్యాలు కలగజేసి, చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది. 

అయిదేళ్ళ తరువాత అమ్మకు నారేళ్ళనాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేళ్ళనాచి గోపద్మవ్రత ఉద్యాపన చేసుకొంటోంది. పార్వతి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచి నీళ్ళడిగింది. నారేళ్ళనాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తనవారితో చెప్పింది. అవమానపడిన పార్వతి తిరిగి శివుని దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది. అది సాధ్యపడదన్నాడు శివుడు. విష్ణువూ తానేం చేయలేనన్నాడు. 

చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ళనాచికి తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం చేసి, క్షమించమని కోరింది. పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు.

రాజు రాణి కథ
ఇదే విధంగా ఒక రాజు సంతానం లేని కారణంగా చెరువులు, బావులు తవ్వించడం, బాటలు వేయించడం, బాటల పక్క చెట్లు నాటించడం చేసి తన రెండో భార్యకు అయిదుగురు సంతానాన్ని పొంది, తన మొదటి భార్యలో గల ఈర్ష్య వల్ల రెండో భార్య గోపద్మ వ్రతానికి భంగం కలగకుండా చేశాడు. 

సుభద్ర వ్రతాచరణ:
ఒకనాడు యముడు గోపద్మ వ్రతం చేయనివారి వెన్నెముక చర్మాన్ని తెచ్చి జయభేరి మోగించాలని తన భటులను కోరాడట.

తన చెల్లెలు ఈ వ్రతాన్ని చేయలేదని తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే సుభద్ర వద్దకు వెళ్ళి అయిదేళ్ళ వ్రతాన్ని ఒకేరోజు జరిపించాడట. దాంతో యమభటులకు జయభేరిని మోగించడానికి చర్మం లభించలేదట. తూర్పు దిక్కుకు తలపెట్టి పడుకొన్న ఓ జీవి వెన్నెముక చర్మాన్నైనా తెచ్చి జయభేరి మోగించాలన్నాడట యముడు. అప్పుడు ఓ దున్నపోతు అలా నిద్రిస్తుండటం చూసి దాని చర్మాన్ని తెచ్చి డోలు వాయించారని కథనం.

ముత్తైదువులు:
చాతుర్మాస్య గోపద్మ వ్రతంలో ముత్తైదువలు తొలి ఏకాదశి నుంచి ప్రతిరోజు కొన్ని చొప్పున 1100 వత్తులు, 11 వందల ముగ్గులు పెట్టుకుంటారు. అయిదేళ్ళు నోము నోచుకున్నాక కన్నెముత్తైదువకు పసుపు, కుంకుమ, గాజులు, బట్టలు, భోజనం, బియ్యం, నువ్వుపిండి పెట్టి నమస్కరిస్తారు. గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు. దూర్వాలతో గౌరమ్మను పూజించి, తులసికోటవద్ద దీపం వెలిగిస్తారు. జామపండ్లు, సీతాఫలాలు, చెరకు, ఖర్జూర పండ్లు వంటివాటితో కన్నె పిల్లల ఒడినింపి, గౌరమ్మకు నమస్కరిస్తారు. 

పరోపకారం, సేవాభావం, పరులను గౌరవించడం, చాతుర్మాస్య నియమాలు పాటించడం- మానవాళికి ఎంతో శుభం, ఆనందం చేకూరుస్తాయని అందరి నమ్మకం.


Friday, July 24, 2026

Shayana Ekadashi - Toli Ekadashi - Devashayani Ekadashi - శయన ఏకాదశి - తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి

శయన ఏకాదశి - తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి

శయన ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి రోజున వస్తుంది. ఈ పర్వదినం శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే సమయాన్ని సూచిస్తుంది

హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే పండుగ తొలి ఏకాదశి.

ఈ పండుగ తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. దీన్ని ‘'శయనైకాదశి'’ అని, 'హరి వాసరం'’, ‘'పేలాల పండగ'’ అని కూడా పిలుస్తారు. ఆషాఢమాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి జరుపుకుంటారు.

యోగనిద్ర: ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు .( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది).

ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే 'ప్రబోధినీ ఏకాదశి' ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.

తొలి ఏకాదశి అనేది అత్యంత పవిత్రమైన పండుగ, ప్రధానంగా వైష్ణవులు ఈ రోజున ఉపవాసం ఉండటం, ప్రార్థన చేయడం మరియు ఈ రోజున విష్ణువు యొక్క భజనలు పాడటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు జరుపుకుంటారు. ఈ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని "తొలి ఏకాదశి" లేదా "శయన ఏకాదశి" అని పిలుస్తారు, ఇది దేవతల నిద్రా కాలం (వారికి రాత్రి ప్రారంభమవుతుంది) మరియు మహావిష్ణువు క్షీరసాగరంపై నిద్రపోయే రోజును సూచిస్తుంది. పంచాంగం ప్రకారం, మొత్తం ఏకాదశిలలో ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు మరియు పగటి సమయం తగ్గడం మరియు రాత్రి సమయం పెరగడం ప్రారంభమవుతుంది.

ఏకాదశి అంటే పదకొండవ రోజు అని అర్థం. పంచాంగంలో ఒక సాధారణ చాంద్రమాన మాసంలో, రెండు ఏకాదశులు ఒకటి శుక్లపక్షం మరియు మరొకటి కృష్ణ పక్షం సమయంలో సంభవిస్తాయి. విష్ణు ఆరాధనకు ఏకాదశిలు ముఖ్యమైనవి. అధిక సంఖ్యలో ప్రజలు ఏకాదశి వ్రతాన్ని క్రమం తప్పకుండా పాటిస్తారు. ప్రతి ఏకాదశి ఏదో ఒక విధంగా ప్రత్యేకమైనది. దేవశయని ఏకాదశి ఆషాడ మాసంలో (జూన్-జూలై) శుక్లపక్ష సమయంలో వస్తుంది. దీన్నే మాసం పేరుతో ఆషాడి ఏకాదశి అని కూడా అంటారు.

చాతుర్మాస్య ప్రారంభం: ఈ ఏకాదశి నుంచే పవిత్రమైన నాలుగు నెలల చాతుర్మాస దీక్ష మొదలవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి.

హరి జాగరణ: విష్ణుమూర్తి మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) నాడు మేల్కొంటాడు.

మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. 

వ్రతంలోని ప్రధాన నియమాలు
ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. 

రోజంతా విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు అష్టోత్తరం (108 పేర్లు), విష్ణు సహస్రనామావళి (108 నామాలు) వంటి విష్ణు మంత్రాలను జపిస్తూ ఉపవాసం ఉంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువు ఆలయాలను సందర్శిస్తారు.

ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది.

భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, శ్రీ లక్ష్మీనారాయణుడిని భక్తితో పూజిస్తారు. ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు.

జాగరణ: రాత్రి సమయంలో జాగరణ చేసి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు.

పారణ: తొలి ఏకాదశి తర్వాత ఉపవాసం విరమించడాన్ని 'పారణ' అంటారు. ఏకాదశి తర్వాతి రోజైన ద్వాదశి తిథి ఉదయం పూజ ముగించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఉపవాసం విరమిస్తారు.

సూర్యోదయానికి ముందు ద్వాదశి ముగియని పక్షంలో ద్వాదశి తిథిలోగా పారణ చేయాలి. హరి వాసర సమయంలో పారణ చేయరాదు - "శ్రీ హరి దినం". ఉపవాసం విరమించే ముందు హరి వాసరా వచ్చే వరకు వేచి ఉండాలి. హరి వాసర ద్వాదశి తిథి యొక్క మొదటి నాల్గవ వ్యవధి. ఉపవాసం విడిచిపెట్టడానికి అత్యంత ఇష్టపడే సమయం ప్రాతఃకాల్ (ఉదయం). మధ్యాహ్న సమయంలో (మధ్యాహ్నం) ఉపవాసం విరమించకుండా ఉండాలి.

తొలి ఏకాదశి (శయన ఏకాదశి) రోజున చాలామంది పేలాల పిండి (వేయించిన బియ్యం పిండి) తినడం ఒక పురాతన ఆచారం. దీనికి శాస్త్రీయ, ఆయుర్వేద మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి.

ఏకాదశి రోజున ధాన్యాలు తినకూడదని వైష్ణవ సంప్రదాయం చెబుతుంది. అందుకే సులభంగా జీర్ణమయ్యే, ఉపవాసానికి అనుకూలమైన ఆహారాలను తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో పేలాలను ఉపవాస ఆహారంగా స్వీకరించే ఆచారం ఉంది.


పేలాల పిండి:
తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.

ఆషాఢ మాసంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో జీర్ణశక్తి కొంత మందగిస్తుంది. పేలాల పిండి తేలికగా జీర్ణమవుతుంది, శరీరానికి తక్కువ భారం కలిగిస్తుంది. అందుకే పెద్దలు ఈ ఆహారాన్ని సూచించేవారు.

కొన్ని తెలుగు ప్రాంతాల్లో శ్రీమహావిష్ణువుకు పేలాల నైవేద్యం సమర్పించి, తర్వాత ప్రసాదంగా పేలాల పిండి తీసుకోవడం ఆనవాయితీ. ఇది ప్రాంతానుసారం మారుతుంది.

తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా పేలాల పిండి తినాలి" అని ప్రాంతీయ సంప్రదాయం. కొందరు పండ్లు, పాలు, సగ్గుబియ్యం వంటి ఉపవాస ఆహారాలను తీసుకుంటారు; మరికొందరు పేలాల పిండిని ప్రసాదంగా స్వీకరిస్తారు.

అందువల్ల, పేలాల పిండి తినడం ప్రధానంగా ప్రాంతీయ ఆచారం, ఉపవాసానికి అనుకూలమైన తేలికైన ఆహారం, మరియు విష్ణుభక్తి సంప్రదాయంతో ముడిపడి ఉన్న విశ్వాసం అని చెప్పవచ్చు.

తొలి ఏకాదశి ప్రాశస్త్యం:
ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. 

ఈ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.ఇది తొలి ఏకాదశి పర్వదినం విశిష్టత.

పురాణం: భవిష్యోత్తర పురాణంలో , సృష్టికర్త అయిన బ్రహ్మ ఒకప్పుడు తన కుమారుడైన నారదునికి శయని ఏకాదశి ప్రాముఖ్యతను వివరించినట్లే, కృష్ణుడు యుధిష్ఠిరునికి దాని ప్రాముఖ్యతను వివరిస్తాడు . ఈ సందర్భంలోనే మందత మహారాజు కథ చెప్పబడింది. ఆ ధర్మరాజు దేశం మూడు సంవత్సరాలు కరువును ఎదుర్కొంది, కానీ వర్ష దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి రాజు పరిష్కారం కనుగొనలేకపోయాడు. చివరికి, అంగిరస మహర్షి రాజుకు దేవశయని ఏకాదశి వ్రతం ఆచరించమని సలహా ఇచ్చాడు . అలా చేసిన తరువాత, విష్ణువు అనుగ్రహంతో , రాజ్యంలో వర్షాలు కురిశాయి.

ఈ రోజున, దక్షిణ మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో, చంద్రభాగ నది ఒడ్డున ఉన్న పండర్‌పూర్‌లో, పండర్‌పూర్ ఆషాఢ ఏకాదశి యాత్ర అనే పేరుతో ఒక భారీ యాత్ర లేదా ఊరేగింపు ముగుస్తుంది . పండర్‌పూర్, విష్ణువు యొక్క రూపమైన విఠలుని పూజిస్తారు. ఈ రోజున మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది యాత్రికులు పండర్‌పూర్‌కు వస్తారు. వారిలో కొందరు మహారాష్ట్రకు చెందిన సాధువుల చిత్రాలతో కూడిన పల్లకీలను తీసుకువస్తారు. అలంది నుండి జ్ఞానేశ్వరుని చిత్రం , నర్సి నామ్‌దేవ్ నుండి నామ్‌దేవ్ చిత్రం, దేహు నుండి తుకారాం యొక్క చిత్రం , పైఠాన్ నుండి ఏకనాథ్ , త్రయంబకేశ్వరం నుండి నివృత్తినాథ్ , ముక్తాయినగర్ నుండి ముక్తాబాయి , సాస్వాద్ నుండి సోపాన్ మరియు షెగానన్ మహారాజ్ యొక్క చిత్రం . ఈ యాత్రికులను వార్కారీలు అంటారు . వారు విఠ్ఠలకు పారణ భక్తుడైన భక్త తుకారాం మరియు జ్ఞానేశ్వర్ యొక్క అభంగాస్ (స్తోత్రాలు పాడటం) పాడతారు.

శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తే సృష్టిని ఎవరు కాపాడుతారు?
భగవంతుడు నాలుగు నెలలు నిద్రపోతే, ఈ ప్రపంచం పరిస్థితి ఏంటి? అనే సందేహం చాలామందికి వస్తుంది.

పురాణాల ప్రకారం, ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు. అయితే అది మనం చేసే నిద్ర కాదు. యోగనిద్ర అంటే అంతర్ముఖ ధ్యాన స్థితి. ఈ సమయంలో కూడా ఆయన తన దివ్యశక్తితో జగత్తును నడిపిస్తూనే ఉంటాడు.

శాస్త్రాల ప్రకారం, శ్రీమహావిష్ణువు తన యోగమాయ శక్తి ద్వారా సృష్టి క్రమాన్ని నిరంతరం కొనసాగిస్తాడు. సూర్యుడు ఉదయిస్తాడు, వర్షాలు కురుస్తాయి, కాలచక్రం తిరుగుతుంది, దేవతలు తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తారు. అంటే భగవంతుడు విశ్రాంతి తీసుకోవడం కాదు, బయటి కార్యాల నుంచి అంతర్ముఖ స్థితికి ప్రవేశించి, తన దివ్య సంకల్పంతో సృష్టిని నడిపిస్తాడు.

కొన్ని శైవ సంప్రదాయాలు, స్థానిక కథనాల ప్రకారం చాతుర్మాసంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు, లోకక్షేమం కోసం పరమశివుడు ప్రత్యేకంగా జగత్తును కాపాడుతాడు అని చెబుతారు. అందుకే ఈ కాలంలో శివారాధనకూ విశేష ప్రాధాన్యం ఇస్తారు.

ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు. ఈ కాలంలో ఋషులు, యతులు ఒకేచోట ఉండి తపస్సు, పారాయణం, ధర్మబోధ చేసేవారు. అందుకే భక్తులు కూడా ఉపవాసం, జపం, దానం, పూజలతో ఈ పవిత్ర కాలాన్ని ఆచరిస్తారు.

Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం "రుద్రసాగరం" సరస్సు సమీపాన ఉంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని "స్వయంభువు"గా భావిస్తారు. ఈ క్షేత్రంలో ఇతర విగ్రహాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తితో యేర్పడిన శివలింగంగా భావిస్తారు.

చరిత్ర
మహాకాళేశ్వర్ ఆలయం ప్రాచీనకాలం నుండే ఉన్నదిగా పురాణాలు చెబుతున్నాయి. ఇది ఓజ్జయిని (ప్రాచీన ఉజ్జయినీ) రాజధానిగా ఉన్నప్పుడు నిర్మించబడింది.

స్కంద పురాణం, శివ పురాణం వంటి గ్రంధాలలో ఈ ఆలయ ప్రాశస్త్యం వివరించబడింది.

మహాకాళేశ్వర్ స్వయంభూ లింగం. అంటే, శివుడే స్వయంగా ఈ లింగ రూపంలో అవతరించాడు.

శక్తివంతమైన ఈ దేవాలయం పాశుపత ఆరాధనకు కేంద్రంగా మారింది.

పురాణగాథ:
పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి "అవంతిక" అని పేరు. విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయుటకు గల నగరాలలో ఒకటిగా భాసిల్లింది. పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని "చంద్రసేనుడు" అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. తన పూర్తికాలాన్ని శివారాధనకే అంకితం చేసినవాడు. ఒకరోజు ఒక రైతు కుమారుడు (శ్రీకరుడు) రాజభవనం పరిసరాలలో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోనికి ప్రవేశించి ఆయనతోపాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు శ్రీకరుడిని బలవంతంగా రాజ్యం వెలుపల గల క్షిప్ర నదీ సమీపంలోనికి పంపిస్తారు.

ఉజ్జయినికి ప్రక్కగల రాజ్యాలలోని శత్రు రాజులు రిపుదమన రాజు, సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు. 

ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది. ఆ వేద ప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్టానుపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు ‘దేవప్రియుడు’. రెండవవాడి పేరు ‘ప్రియమేథుడు’. మూడో కుమారుడి పేరు ‘సుకృతుడు’. నాలుగవ కుమారుడి పేరు ‘సువ్రతుడు’. 

ఈ నలుగురూ పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు నివసించేవాడు. వాడి పేరు దూషణుడు. బ్రహ్మ దేవునిచే వరం పొంది అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు.కానీ ఆ నలుగురు ఏ మాత్రం బెదరలేదు. దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. ‘ఓం నమః శివాయ’ అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు.

బ్రహ్మ దేవునిచే వరం పొందిన దూషణుడు కనిపించకుండా అదృశ్య రూపంలో శత్రు రాజులకు సహాయం చేస్తాడు. వారు నగరాన్ని దోచుకొని శివ భక్తులపై దాడులు చేశారు.

అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి, ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాశులై పడిపోయాయి.కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు.

చంద్రసేనుని రాజ్యానికి ఉన్న శత్రువులనందరినీ నాశనం చేశాడు. శివభక్తులైన శ్రీకరుడు, విధి కుమారుల అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండుటకు అంగీకరించారు. అచటనే కొలువుండి ఆ రాజ్యంలో గల భక్తులను శత్రువుల బారినుండి రక్షించాలని నిశ్చయించుకుని శివుడు మహా కాళ లింగ రూపంలో క్షిప్ర నదీ తీరంలో వెలిశాడు.

ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాళునిగా కాంతి రూపంలో కొలువైనాడు. పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో దర్శించినవారికి మరణం, వ్యాథుల భయం నుండి విముక్తి కల్పిస్తానని తెలిపాడు.

దేవాలయ విశేషాలు
ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని "దక్షిణామూర్తి" అని కూడా అంటారు. అనగా ఈవిగ్రహం ముఖం దక్షిణం వైపు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడిలో "ఓంకారేశ్వర మహాదేవ" విగ్రహం మహాకాళ విగ్రహం పైన ఉంటుంది. గణపతి, పార్వతి, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. దక్షిణ భాగంలో నంది చిత్రం ఉంటుంది. ఇది మహాదేవుని యొక్క వాహనం. మూడవ అంతస్తులో గల "నాగచంద్రేశ్వర" విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శనంకోసం తెరుస్తారు. ఈ దేవాలయం ఐదు అంతస్తులలో ఉంటుంది. దానిలో ఒకటి భూ అంతర్భాగం. ఈ దేవాలయం "
రుద్రసాగరం" సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకొనివున్న విశాలమైన ప్రాంగణం కలిగి యున్నది. శిఖర గోపురం శిల్పాలతో కూడి సొగసుగా అలంకరించబడి ఉంటుంది. ఇత్తడి దీపాలు భూగర్భ గర్భగుడిలోనికి పోయే మార్గానికి వెలుగునిస్తాయి. దేవుని ప్రసాదం ఇతర ఆలయాల వలె కాకుండా దేవునికి సమర్పించినది దేవతలకు తిరిగి సమర్పించవచ్చని నమ్మకం.

ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమయిన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నయినా పొందుతాడు.

ఈ ప్రాంగణంలో పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, సాక్షిగోపాలుడు, శనీశ్వరుడుతోపాటు అనేక శివలింగాలు భక్తులకు దర్శనం ఇస్తాయ. మహాకాళ్ మందిర శోభ సంధ్యా సమయంలో అత్యంత మనోహరమై భాసిల్లుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుడ్ని ఇక్కడ మహాకాళుడిగా కొలువై ఉండమని ప్రార్థించాడనీ, ఆ బ్రహ్మ అభీష్టం మేరకు శివుడిక్కడ కొలువై ఈ మందిరానికింతటి శోభనిస్తున్నాడనే పురాణకథలు వినిపిస్తాయి.

భస్మ మందిరం
ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మమందిరంలోకి ఆవుల్ని తీసుకు వచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. 

ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్దపెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అపుడు అక్కడ మనం ఒక అలౌకికమయిన ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతాము. రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు. అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు. ఆ భస్మపాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు.

స్వామివారికి ఇక్కడ జరిగే భస్మ హారతి కైలాసనాధుని దర్శనం చేసినంత ఆనందాన్ని ఇస్తుంది. బ్రహ్మసైతం ఈ భస్మపూజ చేశాడని ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహాశ్మశానమని పిలవడం జరుగుతోందని చెప్పే పురాణకథలూ ఉన్నాయ. ఈ స్వామి దర్శనం అకాల మృత్యువు నుంచి రక్షిస్తుంది. 12 సంవత్సరాల కొకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రాన మరణించినవారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి.

శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారికి “భస్మ హారతి”  రొజూ ఉదయం 4 గంటలకు తప్పనిసరి ఆచారంగా సమర్పిస్తారు. ఈ పూజ రెండు గంటల పాటు ఆవుపేడ పిడకలను ఉపయోగించి నిర్వహిస్తారు. ఆర్తి సమయంలో మంత్రాలు జపించడం, గంభీరమైన ధ్వనులు చేయటం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మార్మోగిపోతుంది. ఇది మనిషి జీవిత కాలంలో మరిచిపోలేని అద్భుతమైన అనుభవం.

ఈ భస్మహారతి 10 మంది నాగ సాధువుల ద్వారా జరుగుతుంది ఈ భస్మ హారతి సమయంలో ఎవరిని గర్భగుడిలోనికి అనుమతించరు. కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మ హారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. స్త్రీలను ఈ హారతిలో పాల్గొనటంకాని, చూడటానికి కానీ అనుమతించరు. భక్తులను గర్భగుడి బయట ఉన్న నంది మంటపంలో, బారికేడ్లు వెనుకకు అనుమతించబడతారు. కేవలం 100 మందికి మాత్రమే వసతి వున్న నంది మంటపంలో సుమారు 500 భక్తులు బారికేడ్ల వెనుక, సమీపంలో కూర్చుని దర్శనం చేసుకొంటారు.

భస్మ హారతి సమయంలో పరమేశ్వరుడు భస్మధారణతో అందంగా దర్శనం ఇస్తాడు. ఈ భస్మ ఆరతి దర్శనం ప్రతి హిందూ భక్తుని చిరకాల కోరిక, మానవ జీవితంలో భస్మఆరతి దర్శనం పునర్జన హరణం.

మహాకాళేశ్వర దేవాలయం ఒక శక్తి పీఠం
హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.

చరిత్ర
ఈ దేవాలయ సముదాయం సుల్తాన్ షాస్-ఉద్-దీన్ (ఇలుత్మిష్) చే 1234-5 ప్రాంతంలో ఉజ్జయిని పై దాడి చేసిన సందర్భంలో నాశనం చేయబడింది. ప్రస్తుత నిర్మాణం సా.శ. 1736 లో శ్రీమంత్ రానోజీరావు షిండే మహరాజ్ యొక్క జనరల్స్ అయిన శ్రీమంత్ పీష్వా బాజీరావు, ఛత్రపతి షాను మహరాజ్ లచే నిర్మింపబదినది. తర్వాతి అభివృద్ధి, నిర్వహణ శ్రీనాథ్ మహాడ్జి షిండే మహరాజ్ (మహాడ్జి ది గ్రేట్) చే జరిగింది.

1886 వరకు మహారాజ శ్రీమంత్ జయాజీ రావు సాహెబ్ షిండే ఆలిజాహ్ బహాదూర్ చే నిర్వహింపబడింది. స్వాతంత్య్రం వచ్చిన పిదప ఈ దేవాలయం నిర్వహణను ఉజ్జయిని మ్యునిసిపల్ కార్పొరేషన్ వారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది కలెక్టరు కార్యాలయం నిర్వహణలో కొనసాగుతుంది.

విశేషాలు
పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. ‘కాళ’ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది. ఉజ్జయినిలోని రెండు స్వరూపాలూ కాల స్వరూపాలై ఉంటాయి. భూమధ్యరేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని.

జ్యోతిర్లింగం
శివ పురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు,తమలో తము "నేను గొప్ప అంటే నేను గొప్ప" అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది.దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకొన్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. 

బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా సద్దుమణిగింది. ఆ మహా లింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసా రూపం దరించి లింగం అగ్ర బాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రుపంలో ఆదిని కనుక్కోవడానికి బయలు దేరాడు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్ర భాగం కాని మొదలు కాని కనిపించలేదు.

ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం(మొగలి పువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని అపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి, సహాయం చేయమని అడిగాడు. ఆవు కనపడితే అదే విధంగా చెప్పి, ఆ లింగం అగ్ర భాగాన్ని చూసినట్లుగా, విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాదేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టి కర్తయే తనని బ్రతిమాలేసారికి కాదనలేక సరేనంటూ. రెండు, కిందకు దిగి వచ్చే సరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్ర భాగాన్ని చూశానని, కావాలంటే అవును, మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమే అంది మొగలి పువ్వు, బ్రహ్మ దేవుడి మాటను కాదనలేక అయన లింగం అగ్ర భాగాన్ని చూసాడని ఆవు తలతో చెబుతుంది కాని, అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది. 

బ్రహ్మ దేవుడి అసత్య ప్రచారాన్ని చూడ లేక ఈశ్వరుడు ప్రతయ్యక్షమయ్యాడు. బ్రహ్మ దేవుడు అబద్దం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోడానికి అర్హత లేకుండా శాపం యిచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసగాడు. శివుడు యేర్పరచిన "జ్యోతిర్లింగం" అనంతమైనది. దానినుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలైనాయి. 

సాధారణంగా జ్యోతిర్లింగాలు 64 కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ప్రతీదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతీదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం "లింగము" . ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం.

12 జ్యోతిర్లింగాలు 
సోమనాథ్ జ్యోతిర్లింగం – గుజరాత్ (ప్రభాస్ పటన్)
మల్లికార్జున జ్యోతిర్లింగం – ఆంధ్రప్రదేశ్ (శ్రీశైలం)
మహాకాళేశ్వర జ్యోతిర్లింగం – మధ్యప్రదేశ్(ఉజ్జయిని)
ఓంకారేశ్వర జ్యోతిర్లింగం – మధ్యప్రదేశ్ (నర్మదా నది తీరం)
వైద్యనాథ జ్యోతిర్లింగం – జార్ఖండ్ (దేవఘర్)
భీమశంకర జ్యోతిర్లింగం – మహారాష్ట్ర (పూణే సమీపంలో)
రామేశ్వర జ్యోతిర్లింగం – తమిళనాడు (రామేశ్వరం)
నాగేశ్వర జ్యోతిర్లింగం – గుజరాత్ (ద్వారక)
విశ్వనాథ జ్యోతిర్లింగం – ఉత్తరప్రదేశ్(వారణాసి/కాశీ)
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం – మహారాష్ట్ర (నాసిక్)
కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం – ఉత్తరాఖండ్ (హిమాలయాలు)
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం – మహారాష్ట్ర (ఎల్లోరా)

Wednesday, July 22, 2026

Remedies for Jupiter-related afflictions - గురుగ్రహ దోష నివారణ

గురుగ్రహ దోష నివారణ

నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్వగుణ ప్రధానమైన ఈ గ్రహం భూమిపై నివసించే జీవులపై, మానవులపై ప్రభావం చూపుతుంది.

ఈ గ్రహ ప్రాబల్యం బాగా ఉన్న వారికి విద్య, బుద్ధి, జ్ఞానం బాగా ఉంటుంది. ఈ గ్రహం బాగుంటే వారు అమితమైన తేజోవంతులుగానూ, ధనవంతులుగానూ ఉంటారని శాస్త్రం చెబుతోంది. 

జాతకంలో గురు గ్రహం (బృహస్పతి) బలహీనంగా ఉన్నప్పుడు లేదా అశుభ స్థానంలో ఉన్నప్పుడు "గురుగ్రహ దోషం" ఏర్పడుతుంది. దీనివల్ల విద్యలో ఆటంకాలు, వివాహంలో జాప్యం, సంతాన లేమి, ఆర్థిక సమస్యలు, మరియు సమాజంలో గౌరవం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మరియు కాలేయం, వెన్నుపూస, తొడలు, చెవులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నత్తి, మతిమరుపు, శరీరానికి నీరు పట్టడం, కఫం వంటి వ్యాధులు గురు గ్రహ ప్రభావంతో కలుగుతాయి.

అలాగే గౌరవహాని, పండితపామరులతో వివాదం, స్థానచలనం, అధికార నష్టం, తీర్థయాత్రలలో ఇబ్బందులు, స్వార్థం, సంతానదోషం, ధననష్టం, పుత్ర విరోధం, దైవ, గురు భక్తి లోపించడం ఇవి సామాన్యంగా గురు గ్రహ బలహీనతవలన కలిగే ఇబ్బందులు, లోపాలని శాస్త్రం చెబుతుంది.

అందుకే గురుగ్రహ దోషాలు, వ్యాధుల పరిహారం కోసం మంచి పుష్యరాగ మణిని గురువారం రోజు శివ పంచాక్షరి మంత్రం, గురుగ్రహ మంత్రంతో కలిపి జపించిన తర్వాత ధరించాలి. స్త్రీలు పాదాలకు ధరించే పసుపు, గడపలకు పసుపు రాయటం, పూజా కార్యక్రమాల్లోనూ, స్నానానికి మనం వినియోగించే పసుపు ఎన్నో వ్యాధుల్ని నివారించగలదు. కాబట్టి పసుపు రంగు వేయబడిన గది గోడల మధ్య నివాసం ఈ లోపాన్ని పూరిస్తుందని శాస్త్రం చెబుతోంది.

జాతకంలో గురువు బలహీనంగా ఉంటే, సంతాన సౌఖ్యత లేక పోవటం, కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట, నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట, ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం, షుగర్, క్యాన్సర్, మూత్ర రోగాలు, పెద్ద పొట్టతో కలిగిన దేహం, పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం, గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు.

వ్యాధి వస్తే తొందరగా తగ్గదు. లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖం, సంతోషం లేక పోవుట, దైవంపై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేకపోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శించుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.

గురు గ్రహ దోషనివారణకు పసుపు రంగు రాయి నీటిలో వేసుకొని ఆ నీటిని త్రాగిన దోష నివారణ కలుగును. పసుపు కొమ్ము గణపతిని, పసుపు రంగు(హరిద్రా)గణపతిని పూజిస్తే చాలా మంచిది. పూర్వ కాలం నందు గురుగ్రహ దోష నివారణకు ఇంద్రుడిని పూజించేవారు, ప్రస్తుతం దక్షిణామూర్తి, దత్తత్రేయ, హయగ్రీవుడిని పూజిస్తున్నారు.

ప్రతి గురువారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల సమయంలో దగ్గరలో ఉన్న దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి 160 ప్రదక్షిణలు చేయాలి. 16 గురువారాలు నవగ్రహములకు 160 ప్రదక్షిణలు చేసి, పసుపు వస్త్రంలో ఐదు పావుల శనగలు పోసి, మూత కట్టి, దాన్ని దానం చేయాలి.

అలాగే గురువారం రోజున ఉడికించిన శనగలు పేదలకు పంచిపెట్టాలి. కుడి చేతి చూపుడు వేలుకి కనకపుష్యరాగం ఉన్న బంగారు ఉంగరాన్ని ధరించాలి. బ్రాహ్మణుడితో గురు గ్రహ జపం చేయించి శనగలు దానం చేయాలి. గురువారం నాడు గురుగ్రహం వద్ద 16 పసుపు రంగు వత్తులతో దీపారాధన చేసి పసుపు వస్త్రాన్ని దానం చేయాలి.

16 గురువారాలు ఉపవాసము ఉండి చివరి గురువారం దక్షిణామూర్తి పూజ, గురు అష్టోత్తర పూజ చేయాలి. ప్రతిరోజూ 160 మార్లు చొప్పున 160 రోజుల పాటు గురు ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి.16 గురువారముల పాటు గురు గాయత్రి మంత్రాన్ని 160 సార్లు పారాయణ చేయాలి. ప్రతి రోజూ దత్త శ్లోకాన్ని పారాయణ చేస్తూ, 40 రోజుల్లో 16.000 సార్లు గురు మంత్రాన్ని జపించండి. తీరిక లేనివారు కనీసం గురుశ్లోకములు 16 సార్లు లేదా గురు మంత్రాన్ని 160 సార్లు కాని పారాయణ చేయాలి. గురు పౌర్ణమి పర్వదినమున 18 సార్లు స్తవం పారాయణ చేయాలి.

జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.

భక్తి బావనలు, ఉన్నత విద్య, విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.

గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు. సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.

సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.

హయగ్రీవోపాసన వాక్ శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది.

జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్ 

ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే


జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.

హయగ్రీవుని పూజించడం వల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి.

విద్యార్థులు హయగ్రీవుని పూజించడం వల్ల చదువు బాగా వస్తుంది. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.


శ్రీ హయగ్రీవావతారవర్ణనము

గురుగ్రహ దోష శాంతి కోసం చేయవలసిన మరియొక పరిహారం

మేష, సింహ, ధనుర్ మాసాల్లో.. ఆది, సోమ, మంగళ, గురువారాల్లో, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలు కలిసి వచ్చిన రోజు వైష్ణవాలయం పూజారిని రాత్రి 1.30 గంటలకు స్వగృహానికి పిలిపించాలి.

గృహ మధ్య హాలులో 9 మూరల పసుపు వస్త్రం పరిచి 9 దోసిళ్ళు శెనగలు పోసి, ఆ రాశిపై బంగారు లేక ఇత్తడి చెంబును కలశంగా స్థాపించి, కలశంపై అష్ట దిక్కులకు 8 తమలపాకులను పెట్టి, వాటిపై టెంకాయను పెట్టి, విష్ణు స్వరూపమగు పసుపు కుంకుమ రేఖలు నిలువుగా పెట్టి ఆ కలశం ఈశాన్య దిశాముఖంగా పెట్టాలి.

కలశం ఎదుట ఎవ్వరూ కూర్చోకూడదు. వాయువ్య ముఖంగా వైష్ణవాలయ పూజారిని, ఆగ్నేయముఖంగా గృహస్థుడు అతని భార్య కూర్చొనాలి. తర్వాత మమ శనివర్గ జాతస్య.. లగ్నజాతకానుసారేన.. స్థాన స్థితి గురుగ్రహ పరిహారార్థం శతృరుణరోగపీడ పరిహారార్థం అని సంకల్పించాలి.

ఆ కలశమునకు పురుష సూక్త, నారాయణ సూక్తులతో ఆవాహన చేసి గురుగ్రహ సహిత శ్రీకృష్ణపర బ్రహ్మణే నమః పంచామృత అభిషేకం కరిష్యే అని చెప్పి కలశము ముందు భాగాన ఇత్తడి తట్టలో గురు గ్రహ పంచలోహ విగ్రహము, శ్రీకృష్ణుని బంగారు లేక పంచలోహ విగ్రహము పెట్టి పంచామృతములతో అభిషేకించి, కృష్ణ సహస్ర నామ, అష్టోత్తరములతో గురు అష్టోత్తరముతో పూజలు చేయాలి.

ఇలా రాత్రి మూడు గంటల వరకు పసుపు పువ్వులతో గంధాక్షత్రలతో పూజించి ఉద్వాసన పలకాలి. కలశ సహితంగా శెనగలు పసుపు, పువ్వులు, పసుపు రంగు వస్త్రం, రూ. 9 దక్షిణ ఇచ్చే మొత్తం సంఖ్య 9 వచ్చేలా చూసుకోవాలి.

ఇలా భార్యాభర్తలచే పూజపూర్తయ్యాక .. ఆ దంపతులు పూజారికి అన్నింటిని దానంగా ఇచ్చి సాష్టాంగ దండప్రణామములు ఆచరించి ఆశీర్వాదం పొందాలి. తర్వాత రాత్రి మూడు గంటల ప్రాంతాన అయ్యవారిని స్వగృహము నుంచి సాగనంపాలి. గురు గ్రహ పీడా పరిహారార్థం చేసినది కావున తీర్థప్రసాదములు తీసుకోరాదు. తర్వాత స్నానము చేయాలి.

గమనిక : ఈ పూజా కార్యక్రమము, అయ్యవారికి ఇచ్చే దానం కార్యక్రమాలు రాత్రి 3 గంటలలోపుగా ముగించాలి.

Equivalent to the sin of killing a Brahmin - bramahatyasamanaalu - బ్రహ్మహత్యాసమానాలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - బ్రహ్మహత్యాసమానాలు

మానినీమణీ! ఇక్కడ మరొక విశేషం నువ్వు తెలుసుకోవాలి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని చంపడం అనేకాదు ఇంకా చాలా రకాలున్నాయి. శ్రీకృష్ణాది దేవతలపట్ల భేదబుద్ధిని పాటించి ఆదరానాదరాలు చూపిస్తే అది బ్రహ్మహత్యా సదృశం. అలాగే ఇష్టదైవమూ గురువూ తల్లిదండ్రులు - వీరిపట్ల హెచ్చుతగ్గులు పాటించినా దైవభక్తులపట్ల భేదబుద్ధిని చూపించినా విప్రపాదోదక సాలగ్రామ శిలోదకాలమధ్య భేదం పాటించినా హరిహర నైవేద్యాల మధ్య తారతమ్యం పరిగణించినా హరిహరులమధ్య భేదబుద్ది పాటించినా శక్తిభక్తులనూ శక్తి శాస్త్రాలనూ ద్వేషించినా పితృదేవతార్చనను పరిత్యజించినా హరినీ హరిభక్తులని నిందించినా అర్చించకపోయినా సర్వశక్తిస్వరూప మహాదేవిని నిందించినా కృష్ణాష్టమి శ్రీరామనవమి శివరాత్రి ఏకాదశి (ముక్కోటి) రవివారవ్రతం - ఈ అయిదు పర్వదినాలనూ జరపకపోయినా అంబువాచీ భూఖననం చేసినా (ప్రతినెలా ఆర్ద్రానక్షత్రంలో ప్రథమపాదంనుంచి మూడురోజులపాటు భూదేవి రజస్వలగా ఉంటుంది. అంబువాచి అంటారు. ఆ సమయంలో భూమిని దున్నకూడదని ధర్మశాస్త్రం.) గురు మాతాపితృభార్యాపుత్రుల్ని పోషించకపోయినా అవివాహితుడుగా సంతానం పొందినా బ్రహ్మహత్య చేసినట్టే. ఇదే ఆతిదేశిక బ్రహ్మహత్య.

గోవును కొట్టినా కొడుతున్నవారిని అడ్డుకోకపోయినా రక్షించకపోయినా గోబ్రాహ్మణులకు మధ్యనుంచి నడిచినా గోవులకు ఉచ్చిష్టం పెట్టినా వృషవాహకుడి ఆహారం కాజేసినా అగ్నినీ గోవునూ కాలితో తన్నినా కాళ్ళుకడుక్కోకుండా ఇంటిలోకి వచ్చినా తడికాళ్ళతో భోజనం చేసినా నిద్రించినా సూర్యోదయకాలంలో భుజించినా అవీరాన్న వేశ్యాన్నాలను తిన్నా యోనిజీవ్యుడైనా (తార్పుడుగాడు) సంధ్యావందనం ఎగ్గొట్టినా భర్తకూ దేవుడికీ మధ్య ఇల్లాలు భేదం పాటించినా మగడు ఇల్లాలిని కొట్టినా దేవతాప్రసాదాలను పంచిపెట్టకపోయినా అన్నింటికీ నాస్తినాస్తి అన్నా దేవగురు మిత్రద్రోహాలు చేసినా దేవ - గురు - పితృవందనం చేయకపోయినా, నమస్కరించినవాడికి ఆశీస్పూ విద్యార్థికి చదువూ అందించకపోయినా అన్నపుష్పాది పవిత్ర వస్తువులను దాటినా గోహత్య చేసినట్టే. దీన్నే ఆతిదేశిక గోహత్య అంటారు.

పురుషుడికి పరిణయమాడిన స్త్రీమాత్రమే గమ్య. తక్కిన వనితలందరూ అగమ్యులు. అంటే పొందుకోరరానివారు. అగమ్యాగమనం నూరు బ్రహ్మహత్యలతో సమానం. కుంభీపాక నరకమే శిక్ష అపరిశుద్ధుడుగా సంధ్యవార్చినా ఆసలు సంధ్యావందనమే చెయ్యకపోయినా అతడు సంధ్యాహీనుడు అవుతాడు. నరకానికి పోతాడు. వైష్ణవ శైవ శాక్త సౌర గాణప మహామంత్రాలలో ఎదో ఒకటి ఉపదేశంగా పొంది ఉపాసించాలి. అహంకరించి ఏ మంత్రోపదేశమూ పొందనివాడు అదీక్షితుడు. ఇతడికీ నరకం తప్పదు. పుణ్యక్షేత్రాలలో తీర్థాలలో అడిగి దానాలు పట్టేవాడు తీర్థవ్రతిగ్రాహి. దేవుడి పేరు చెప్పి పొట్టపోసుకునేవాడు దేవలుడు. సంధ్యాపూజాహీనుడిని ప్రమత్తుడు పతితుడు అంటారు. వీరూ వీరితోపాటు గ్రామయాజీ సూపకారుడూ (విప్రుడై ఇతరుల ఇంట భుజించేవాడు) కుంభీపాక నరకంలో పడతాడు ఇంకా ఎవరెవరు ఎయే కుండాలలో వెళ్ళిపడతారో చెబుతాను - సాధ్వీ! ఆలకించు.

సావిత్రీ! దేవతలను సేవించనిదే కర్మవినాశం కానేకాదు. సత్కర్మలు స్వర్గసుఖాలకూ జీవశుద్దికీ దుష్కర్మలు నరకయాతనలకూ దేహశుద్ధికీ హేతువులు.

వేశ్యాధనం అనుభవించేవాడూ వేశ్యాగమనం చేసిన బ్రాహ్మణుడూ కాలసూత్ర నరకకూపంలో శతవర్షాలు కష్టాలు అనుభవించి పై జన్మలో రోగపీడితుడై అటుపైని శుచి అవుతాడు. ప్రస్తావన వచ్చింది కనక స్త్రీలలో భేదాలు చెబుతాను. విను, ఒకడిని అగ్నిసాక్షిగా పరిణయమాడి త్రికరణశుద్ధిగా అతడితో జీవించేది పతివ్రత. రెండవ వాడితో సంపర్కం పెట్టుకుంటే కులట. ముగ్గురితోనైతే ధర్షిణి. నలుగురితో పుంశ్చలి. అయిదుగురితో వేశ్య. ఆర్గురితో పుంగి. ఎడుగురూ ఎనమండుగురూ ఇంకా ఆపైని పురుషులతో సంపర్కం చేస్తే మహావేశ్య. సర్వజాతుల్లోనూ ఇది అస్పృశ్య.

కులట నుంచి మహావేశ్యవరకూ ఎవరిని పొందినా ద్విజుడు కాలసూత్ర నరకానికి పోవడం తథ్యం. అటుపైని చేప కడుపున పుడతాడు. కులటాగామి ఒక శతాబ్దమూ ధర్షిణీ గామి నాలుగు శతాబ్దాలూ పుంశ్చలీగామి ఆరుశతాబ్దాలూ వేశ్యాగామి ఎనిమిది శతాబ్దాలూ పుంగీగామి పది శతాబ్దాలూ ఆ నరకంలో ఉంటాడు. మహావేశ్యాగామి నూరుశతాబ్దాలు నరకయాతన అనుభవిస్తాడు. అలాగే వీరు వరసగా - తిత్తిరి - వాయస - కోకిల - వృక - సూకర - శాల్మలీతరు జన్మలు ఏడేసి ఎత్తుతారు. 

సూర్యచంద్రగ్రహణాల రోజున జ్ఞానహీనుడై భోజనం చేసినవాడు అరుంతుదనరకంలో మెతుక్కి ఏడాదిగా దుఃఖాలు అనుభవిస్తాడు. అటు పైని ఉదరరోగపీడితుడుగా జన్మిస్తాడు. తనువంతా గుల్మాలతో (పుండ్లు) గుడ్డివాడుగా దంతహీనుడుగా దురపిల్లుతాడు. కడకు కర్మఫలం పూర్తయ్యి శుచి అవుతాడు.

నిశ్చయతాంబూలాలు పుచ్చుకుని మరొకడికి కన్యాదానం చేసినవాడు పాంశుకుండనరకానికి పోతాడు. పాంశువులే తింటూ నూరేళ్ళు తల్లడిల్లుతాడు. వీడిని యమదూతలు శరతల్పంమీద పొర్లిస్తారు. పార్థివలింగం చేసి భక్తితో అర్చించని విప్రుడు శివుడి కోపానికి గురి అవుతాడు. శూలప్రోతనరకంలో శతాబ్దంపాటు క్లేశాలు కుడిచి శ్వాపదంగా ఏడు జన్మలెత్తుతాడు. అటుపైని దేవలుడుగా ఎడుజన్మలు ఎత్తి కర్మఫలానుభవం పూర్తిచేసుకుంటాడు. విప్రుణ్ణి భయపెట్టినవాడూ అతడి దేవతార్చనాది సత్కర్మలకు అడ్డుతగిలినవాడూ ప్రకంపననరకంలో విప్రరోమాబ్ద పర్యంతం విలపిస్తాడు. అధికారివైపు ధిక్కారంగా కోపంగా చూసినవాడూ కటువుగా ఎదిరించి పలికినవాడూ సోల్ముకనరకంలో పడతాడు. అక్కడ నా కింకరులు రోజూ అతడి నోటిలో ఉల్కలను పడవేస్తుంటారు. వాడి శరీరంమీద వెండ్రుకలన్ని సంవత్సరాలపాటు రోజూ దండతాడనలు రుచిచూస్తూ యాతనలు పడతాడు. అటుపైని ఏడు జన్మలు ఆడదిగా పుట్టి వితంతువు అవుతాడు. అప్పటికి గానీ కర్మఫలానుభవం పూర్తికాదు.

ఇతరుడితో సంపర్కం పెట్టుకున్న బ్రాహ్మణి అంధకూపనరకానికి పోతుంది. పధ్నాలుగుమంది ఇంద్రులు మారేదాకా యమకింకరుల బాధలు అనుభవిస్తుంది. ఆటుపైని కాకిగా వెయ్యి జన్మలు ఎత్తుతుంది. పందిగా నూరుజన్మలు సృగాలిగా కుక్కుటిగా పారావతిగా వానరిగా నూరేసీ ఎడేసీ జన్మలు ఎత్తి కడపటికి మళ్ళీ మానవిగా రజక గృహంలో పుట్టి క్షయరోగ పీడితురాలై పుంశ్చలిగా మారి కుష్ఠవ్యాధికిలోనై మరణిస్తుంది. అప్పటికి దుష్కర్మఫలం పూర్తి అవుతుంది. వేశ్యలకు వేధననరకం పుంగికి దండతాడననరకం ధర్షిణీకి జలరంధ్రనరకం కులటకు దేహచూర్ణికానరకం స్వైరిణికి (మహావేశ్య) దళనకూపం ధృష్టకు (పతివంచక) శోషణనరకం తప్పవు. శతాబ్దాలపాటు ఈ నరకకుండాల్లో వారు యమయాతనలు పడతారు. మన్వంతరకాలం విణ్మూత్రభక్షణ చేస్తారు. ఆపైని విట్‌కృమిగా (మలక్రిమి) లక్షసంవత్సరాలు జన్మలెత్తితేగానీ కర్మవిశుద్ధి లభించదు. సవర్ణపారదారికులు (ఏకులంవాడు ఆ కులం పరకాంతతో) కషాయనరకకుండంలో పార్లుతారు. కషాయ తప్తోదకం తాగుతూ నూరేళ్ళు యాతనపడతారు. అనులోమ విలోమ పారదారికులు (అగ్రవర్ణ నిమ్నవర్ణ పరకాంతా సంగమం) స్త్రీపురుషులిద్దరూ శూర్పకూపంలో శూ
ర్పకారకృమి దష్టులవుతారు. యమదూతలు కాగిన మూత్రం తాగిస్తారు. దండతాడనలు సరేసరి. అటు పైని వరాహంగా ఛాగలంగా ఏడేసి జన్మలు ఎత్తి కర్మ విశుద్ది పాందాలి.

తులసీదళాన్ని చేతితో పట్టుకుని ప్రతిజ్ఞచేసి మాట తప్పినవాడు జ్వాలాముఖ నరకకూపంలోనూ గంగాజలం గోవు విప్రుడు సాక్షిగా ఆడితప్పినవాడూ దేవప్రతిమ ఎదుట శపథంచేసి జారిపోయినవాడూ కుడిచేతిలో కుడిచెయ్యివేసి ఆడితప్పినవాడూ దేవాలయంలో మాటతప్పినవాడూ - వీళ్ళంతా అదే నరకకూపంలో మటమటలాడతారు. మిత్రద్రోహి కృతఘ్నుడు విశ్వాసఘాతకుడూ కూటసాక్ష్యం చెప్పేవాడూ వీళ్ళందరికీ జ్వాలాముఖ నరకకూపమే గతి. చతుర్దశేంద్రకాల పర్యంతం శిక్ష అనుభవించి మ్లెచ్చ విట్‌కృమి బ్రహ్మకృమి సర్ప దేవల వ్యాఘ్ర నకుల గండక మండూక జన్మలు ఒక్కక్కరూ ఏడేసిఎత్తి ఎప్పటికో పరిశుద్ధులవుతారు.

నిత్యనైమిత్తిక క్రియలకు ఎగనామం పెట్టి వేదవాక్యాలను పరిహసించి వ్రతోపవాసాలను పరిహరించి పెద్దలమాటలను పెడచెవినిబెట్టి చెడు తిరుగుళ్ళు మరిగిన విప్రుడు ధూమ్రాంధకూపంలో శతాబ్దంపాటు యాతనపడి అటూ ఇటూ ఏడుతరాలుచెడి జలజంతువుగా నూరు జన్మలెత్తి కడపటికి శుచి కాగలుగుతాడు. దేవబ్రాహ్మణ పరిహాసకుడుకూడా ఇలాగే అదే నరకయాతన అనుభవిస్తాడు. వీడివంశంలో అటు పదితరాలకూ ఇటు పదితరాలకూ వీడిపాపం అంటుకుంటుంది. అటుపైని మూషకజాతిలో ఏడు జన్మలు ఎత్తుతాడు. పక్షిగా క్రిమిగా చెట్టుగా పశువుగా అనేక జన్మలెత్తి మనిషి అవుతాడు.

బ్రాహ్మణుడు దైవజ్ఞజీవి వైద్యజీవి చికిత్సకుడు లాక్షాలోహాది వ్యాపారి రసాదివిక్రయి అయినట్టయితే నాగవేష్టనరకంలో పడి సర్పవేష్టితుడవుతాడు. అటుపైని నానావిధ పక్షిజాతుల్లో పుట్టి కడపటికి నరజన్మ పాందుతాడు. అప్పుడు గణకుడుగా వైద్యుడుగా గోపాలుడుగా కర్మకారుడుగా రంగకారుడుగా ఏడేసి జన్మలూ ఎత్తి శుచి అవుతాడు.

సాధ్వీ! ప్రసిద్ధ నరకకుండాలగురించీ వాటిలో పడేవారి గురించీ యాతనల గురించీ పునర్జన్మల గురించి వివరంగా చెప్పాను. ఇవి కాక ఇంకా అప్రసిద్ద నరకకూపాలు అనేకం ఉన్నాయి. అవి చిన్నచిన్నవి. వాటిలో పడే పాతకులూ ఉన్నారు. దుష్కర్మఫలాలు అనుభవించి అనేకజన్మలు దురవస్థలనుభవించి పరిశుద్ధులవుతారు. నేను ప్రత్యక్షంగా ఎరుగుదును కనక వాటికి అధిపతిని కనక స్పష్టంగా తెలియపరిచాను. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావ్‌ - అని ముగించాడు యమధర్మరాజు.

నరకనివారణ


Dushmarmafala Niruupana - దుష్మర్మఫల నిరూపణ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దుష్మర్మఫల నిరూపణ

సావిత్రీ ! శుభకర్మలు చేసుకున్నవారు రకరకాల స్వర్గాలకు వెళ్ళి పుణ్యఫలాలను అనుభవిస్తారు.

అవి చెల్లిపోగానే భూలోకంలో సజ్జనులై జన్మిస్తారు. వీరు ఏనాడూ నరకానికి పోరు. అలాగే దుష్కర్మలు చేసినవారు నానావిధ నరకాలకి పోతారు. ఆ నరకాలలో రకరకాల కుండాలు ఉంటాయి. లోతైన కూపాలు. ఏ దుష్కర్మకు ఏ కూపమో, దాన్ని వైశాల్యమూ లోతూ ఎంతో, ఆందులో ఎంతకాలం క్లేశాలు అనుభవించాలో అంతా శాస్త్రప్రమాణంగా నిర్ధారణ అయ్యిఉంది. అవ్వి అతిభయంకర కుండాలు, అమ్మా! ఆ గుంటలు పరమకుత్సితంగా ఉంటాయి. చూడక్కర్లేదు వింటేనే చాలు వొళ్ళు జలదరిస్తుంది.

పెద్దవి ఎనభయ్యారుకి పైగా ఉన్నాయి. చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రసిద్దమైన పేర్లు కొన్ని చెబుతాను. ఆలకించు. వహ్నికుండం తప్తకుండం క్షారకుండం విట్కుండం (మలం) మూత్రకుండం శ్లేష్మకుండం గరకుండం దూషికుండం (పుసి) వసాకుండం శుక్రకుండం (10) అసృక్కుండం అశ్రుకుండం గాత్రమలకుండం కర్ణమలకుండం మజ్జాకుండం మాంసకుండం నఖకుండం రోమకుండం కేశకుండం అస్థికుండం (20) తామ్రకుండం లోహకుండం చర్మకుండం తప్తసురాకుండం కంటకకుండం విషకుండం తప్తతైలకుండం కుంతకుండం కృమికుండి (పురుగులు) పూయకుండం (30) సర్పకుండం మశక కుండం దంశకుండం గరళకుండం వజ్రదంష్టాకుండం వృశ్చికకుండం శరకుండం శూలకుండం పరశుకుండం ఖడ్గకుండం (40) గోళకుండం నక్రకుండం కాకకుండం మంథానకుండం బీజకుండం వజ్రకుండం తప్తపాషాణకుండం తీక్ష్ణపాషాణకుండం లాలాకుండం మసీకుండం (50) చూర్ణకుండం
చక్రకుండం వక్రకుండం కూర్మకుండం జ్వాలాకుండం భస్మకుండం దగ్ధకుండం ఇంకా ఇలాగే
తప్తసూచీ - అసిపత్ర - క్షురధారా (60) - సూచీముఖ - గోకాముఖ - నక్రముఖ - గజదంశ - గోముఖ -
కుంభీపాక - కాలసూత్ర - మత్స్యోద - కృమికందుక - పాంసుభోజ్య (70) - పాశవేష్ట - శూలప్రోత -
ప్రకంపన - ఉల్కాముఖ - అంధకూప - వేధన - తాడన - జాలరంధ్ర - దేహచూర్ణ - దేహదళన (80) -
దేహశోషణ - దేహకషణ - శూర్ప - జ్వాలాముఖ - ధూమాంధ - నాగవేష్టనకుండాలున్నాయి. (86)

ఇవ్వే కాదు పాపాత్ముల్ని హింసించడానికి చిన్నవీ పెద్దవీ ఇంకా చాలా కుండాలున్నాయి. కింకరులు జాగరూకులై వీటిని నిరంతరం రక్షిస్తుంటారు. వీరినే యమభటులు అంటారు. వీళ్ళందరూ దండహస్తులు. పాశహస్తులు. మదమత్తులు. అత్యంత భయంకరులు. శక్తిహస్తులు. గదాహస్తులు. అసిహస్తులు. అతిదారుణులు. తమోయుక్తులు. దయాహీనులు. అనివార్యులు. తేజస్వంతులు. శంకారహితులు. రక్తపింగళవేత్రులు. మృత్యువు ఆసన్నమైన పాపాత్ములకుమాత్రమే కనిపిస్తారు. పుణ్యాత్ములకూ యోగీశ్వరులకూ స్వధర్మనిరతులకూ వీరి దర్శనభాగ్యం లభించదు. ఇప్పటికి యమకుండాలగురించి చెప్పడమయ్యింది. ఇక ఏ పాపాత్ముడు ఏ కుండంలో పడతాడో చెబుతాను భయపడకుండా విను.

సాధ్వీలలామా ! హరిసేవారతుడూ అంతశ్శుద్దీ బహిశ్శుద్దీ ఉన్నవాడూ యోగసిద్ధుడూ
వ్రతాచరణతత్పరుడూ తపశ్శీలి బ్రహ్మచారీ - వీరు నరకం దరిదాపులకుకూడా వెళ్ళరు. ఇక మిగతావారి సంగతి చెబుతాను. బలగర్వంతో బంధువుల్ని కటువాక్కులతో హించించేవాడు ఆగ్నికుండంలో పడతాడు. తన శరీరంమీద ఎన్ని వెండ్రుకలున్నాయో అన్నేళ్ళు అందులో మాడతాడు. అటుపైని మూడు పశుజన్మలు ఎత్తుతాడు. ఆకలి దప్పులతో గుమ్మమెక్కిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టకుండా పంపించిన మూఢుడు తప్తతుండకుండంలో పడతాడు. రోమప్రమాణాబ్దాలపాటు అందులో నరకయాతన అనుభవిస్తాడు. అటుపైని ఏడు జన్మలవరకూ వాడిది పక్షిబతుకే. రవివారంనాడుగానీ సంక్రాంతిరోజునగానీ అమావాస్యనాడుగానీ శ్రాద్ధసమయంలోగానీ వస్త్రాలకు క్షారసంయోగం చేస్తే (మురికి వదల్చడానికి సబ్బుసోడాలు పెట్టడం) క్షారకుండంలో పడి దారాలన్ని సంవత్సరాలపాటు దుఃఖాలు అనుభవించి మరుసటి ఏడు జన్మల్లోనూ రజకుడవుతాడు. వేద శాస్త్ర పురాణనింద చేసినా త్రిమూర్తుల్ని నిందించినా గౌరీవాణీలక్ష్ములను తూలనాడినా దేవీదూషణ చేసినా ఆ పాపాత్ముడు నిరయానికి వెళ్ళి ఎనభయ్యారింటిలోనూ అత్యంత భయానకమైన కుండంలో పడతాడు. అంతకన్నా దుఃఖప్రదమైన కుండం ఏ నరకంలోనూ ఉండదు. అనేక కల్పాలదాకా అందులో మగ్గి మగ్గి అటుపైని సర్పజాతిలో పుడతాడు. దేవతాదూషణలకు ఏవేవో ప్రాయశ్చిత్తాలున్నాయిగానీ దేవీనిందకు మాత్రం ఏ ప్రాయశ్చిత్తమూ లేదు. దేవీనిందాపరాధస్య ప్రాయశ్చిత్తం న విద్యతే.

స్వదత్తంగానీ పరదత్తంగానీ విప్రుడి సొత్తును ఆపహరించినవాడు అరవైవేల సంవత్సరాలు విట్కుండంలో పడి ఉంటాడు. అన్ని ఏళ్ళూ విడ్భోజనమే చేస్తాడు. అటుపైని విట్‌కృమిగా జన్మిస్తాడు. ఇతరుల చెరువులో తాను చెరువు తవ్విస్తే మూత్రకుండనివాసం ఫలం. రేణువులన్ని సంవత్సరాలు అదే తాగుతూ అదే తింటూ పడిఉంటాడు. పునర్జన్మలో నిండా నూరేళ్ళు వృషభమై భారతభూమిలో ఎవరికో ఒకరికి చాకిరీ చేస్తాడు. ఎవరికీ పెట్టకుండా మృష్టాన్నాన్ని ఒక్కడే తిన్నవాడు శ్లేష్మకూపంలో పడి కొట్టుకుంటాడు. నూరేళ్ళు అదే తింటూ అందులోనే పడి చస్తాడు. అటుపైని శ్లేష్మమలమూత్రాలు తినే కాకిగా జన్మించి నూరేళ్ళు బదికి పాపం వదిలించుకుని శుచి అవుతాడు.

తల్లిని తండ్రిని గురువును భార్యను సంతానాన్నీ పోషించకుండా అనాధలుగా వదిలేసినవాడు గరకుండంలో నూరేళ్ళు అదేతింటూ దుఃఖిస్తాడు. అటుపైన భూతజన్మఎత్తి మరో నూరేళ్ళు గడిపి పాప విశుద్ధుడవుతాడు. ఇంటికి వస్తున్న అతిథిని చూసి ఏవగించుకుంటూ కన్నులు చిట్లించుకున్నవాడు విడిచి పెట్టె తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు సరిగదా వాడు నరకానికి పోతాడు. ఇంకా బ్రహ్మహత్యాది మహాపాతకాలు ఎవడు ఏది చేసినా దూషికాకుండంలో నూరేళ్ళు హింసలపాలై అటుపైని భూతజాతిలో జన్మించి మరో నూరేళ్ళు శోకించి కడపటికి పాపంనుంచి శుచి అవుతాడు. ఎరికైనాగాని ద్రవ్యం దానంగా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీనుకున్నవాడు వసాకుండంలో శతాబ్దంపాటు అదే తింటూ కుళ్ళిపోతాడు. అటుపైని కృకలాసంగా (తొండ) ఎడుజన్మలెత్తుతాడు. తరవాత ఆతిరౌద్రుడూ ఆతి దరిద్రుడుగా ఆల్పాయుష్కుడై బతుకుతాడు. స్త్రీని పురుషుడుగానీ పురుషుణ్ణి స్త్రీగానీ శుక్లపానం చేయిస్తే శుక్లకుండపతనమే ఫలం, నూరేళ్ళ తరవాత ఏడు వ్యాఘ్రజన్మలు ఎత్తుతారు. అప్పటికి పాపశుద్ధిపాంది మానవులుగా పుడతారు.

శ్రీకృష్ణుడిమీద పాటలుకట్టి తన్మయత్వంతో పాడుకుంటున్నవాణ్ణీ చూసి కళ్ళలొ నీళ్ళు తిరిగేలాగా పరిహసించిన పాపాత్ముడు అశ్రుకుండనరకంలో శతసంవత్సరాలు పడిఉంటాడు. మరుజన్మలో చండాలవంశాన పుడతాడు. మిత్రద్రోహి గాత్రమలకూపంలో నూరేళ్ళు శిక్ష అనుభవించి అటుపైని గాడిదగా మూడు జన్మలెత్తి పాపశుద్ధి పొందుతాడు. చెవిటివారిని నిందించిన కఠినాత్ముడు కర్ణవిట్‌ కూపంలో (గులుగు) పడి అదే తింటూ నూరేళ్ళు రోదిస్తాడు. బధిరుడూ దరిద్రుడుగా ఏడు జన్మలెత్తుతాడు. మరో ఏడు జన్మలకూ అంగవిహీనుడై ఆపైని శుచి అవుతాడు. లోభంతోగానీ స్వలాభంకోసంగానీ జీవహింస చేసినవాడు మజ్జాకూపంలో లక్షసంవత్సరాలు మగ్గుతాడు. ఆపైని ఏడుజన్మలు శశకంగా, ఏడు జన్మలు మీనంగా పుడతాడు. మూడు జన్మలు వరాహంగా ఏడుజన్మలు కోడిగా ఏడుజన్మలు లేడిగా ఎత్తి ఎత్తి కడకు పాతకశుద్ధి పొందుతాడు. కూతురిని పెంచి పెద్దచేసి ధనలోభంతో అమ్ముకునేవాడు మాంసకుండంలో కన్యారోమాలన్ని ఏళ్ళు పడిఉంటాడు. యమభటులు నిత్యమూ దండతాడనం చేన్తుంటారు. మాంసభారాన్ని నెత్తిమీద పెట్టి మోయిస్తారు. అందులోంచి కారే రక్తాన్ని నాకిస్తారు. అటుపైని అరవైవేల సంవత్సరాలు కన్యావిట్‌క్రిమిగా జన్మలెత్తుతాడు. ఆపైని వ్యాధుడుగా (బోయ) ఏడు జన్మలెత్తుతాడు. వరాహంగా మూడుజన్మలు కోడిగా ఏడుజన్మలు కప్పగా జలగగా కాకిగా ఏడేసి జన్మలూ ఎత్తి శుద్దుడవుతాడు.

వ్రతాలూ ఉపవాసాలూ శ్రాద్ధకర్మలూ జరిపేరోజుల్లో క్షురకర్మచేయించుకున్నవాడు నఖాదికుండాలలో ఆయా వ్రతాధిదేవతల ఆయుష్కాల పర్యంతం పడి ఉండి యమకింకరుల దండతాడనాలు అనుభవిస్తాడు. కేశదూషితంగా పార్థివలింగం తయారుచేసి ఆర్చించినవాడు రేణువులన్ని సంవత్సరాలు కేశకుండంలో తల్లడిల్లి తరువాత యవనజాతిలో పుడతాడు. హరుడికోపం తేలిగ్గా చల్లారదు. శతాబ్దం తరవాత రాక్షసజన్మఎత్తిస్తాడు. పితృదేవతలకు పిండం పెట్టనివాడు తన వెండ్రుకలన్ని యేళ్ళు అస్థికుండంలో శిక్ష అనుభవిస్తాడు. ఆపైని కుత్సితుడుగా కుంటివాడుగా (కుఖంజః) ఏడు జన్మలెత్తుతాడు. మహా దారిద్య్రం అనుభవించి శుద్ది పాందుతాడు.

గర్భిణిగా ఉన్న భార్యను కలిసినవాడు తామ్రకుండంలో నూరేళ్ళు దుఃఖాలు అనుభవిస్తాడు, అవీర (మగడూ బిడ్డలూ లేనిది) కానీ ఋతుస్నాత కానీ వండి పెట్టిన భోజనం తిన్న శ్రోత్రియుడు తప్తలోహకుండంలో శతాబ్దంపాటు ఇడుములు పడతాడు. ఏడుజన్మలు కాకిగా ఏడుజన్మలు చాకిగా (రజక) గడిపి మహావ్రణపీడుతుడై దరిద్రుడై అటు పైని పాపశుద్ధి పాందుతాడు. చర్మంతో చేసిన తొడుగులు తగిలించుకున్న చేతులతో దేవద్రవ్యాలను స్పృశించినవాడు శతవర్షాలపాటు చర్మకుండంలో శిక్షలు అనుభవిస్తాడు. భుజించరానివి భుజించిన నైష్ఠికుడు తప్తసురాకూపంలో శతాబ్దీకాలపర్యంతం పడి ఉండి ఆపైని ఏడుక్షుద్ర జన్మలు ఎత్తుతాడు. అటు పైని శుద్ది పొందుతాడు. ప్రభువును కొట్టినవాడికీ కటువుగా మాట్లాడినవాడికీ కంటకకూపనివాసమే శిక్ష. దెబ్బకు నాలుగు దెబ్బలుగా యమకింకరులు దండిస్తారు. ఆపైని గుర్రంగా ఏడు జన్మలెత్తి శుచి అవుతాడు. విషం పెట్టి జీవహింస చేసిన పాతకి విషకూపంలో వెయ్యేళ్ళు పొర్లుతాడు, అటుపైని మహావ్రణపీడితుడుగా రాజద్రోహిగా నూరుజన్మలు ఎత్తుతాడు. మరో ఏడు జన్మలు కుష్ఠురోగం అనుభవించి శుద్దుడవుతాడు.

ఆవునుగానీ ఎద్దునుగాని కర్రతో బాదిన వాడూ లేక బాదించినవాడూ తప్త తైలకుండంలో నాలుగు యుగాలపాటు మలమలావేగుతాడు. అటు పైని దాని శరీరంమీద ఉన్న వెండ్రుకలన్ని సంవత్సరాలపాటు భారతభూమిలో వృషభజన్మలు ఎత్తి ఎత్తి కడకు శుద్ది పాందుతాడు. కుంతం అనే ఆయుధంతోగాని వహ్నిలోహంతోగాని జీవహింస చేసిన పాపాత్ములు కుంతకుండంలో అయుతవత్సరాలు నివసిస్తారు. అటుపైని వ్యాధిపీడితుడుగా ఒక జన్మగడిపి పాపం నుంచి శుద్ధిపాందుతాడు.

ద్విజుడైపుట్టి లోభంతో మాంసభక్షణ చేసినవాడూ హరికి నివేదన చెయ్యకుండా పదార్థాలను భుజించినవాడూ కృమికుండంలో స్వరోమ సమవత్సరాలు శిక్ష అనుభవించి మరు జన్మలో మ్లేచ్చుడవుతాడు. బ్రాహ్మణుడైపుట్టి చేయరాని పనులు చేస్తే పూయకుండనరకంలో యమదండన అనుభవిస్తాడు. అటుపైని శూద్రుడుగా ఏడు జన్మలు ఎత్తుతాడు. మహారోగి దరిద్రుడూ బధిరుడూ అవుతాడు.

కృష్ణపాదపద్మ చిహ్నాలను పడగమీద ధరించిన జాతిపామును సంహరించిన పాపాత్ముడు స్వరోమసమవత్సరాలు సర్పకుండంలో కుందుతాడు. సర్పభక్షితుడూ యమకింకర తాడితుడూ అవుతాడు. అటుపైని సర్పజన్మ ఎత్తుతాడు. ఆ తరవాత అల్పాయుష్కమానవుడై దద్రురోగపీడ అనుభవిస్తాడు. సర్పదష్టుడై మరణిస్తాడు. అప్పటికి పాపశుద్ధి అవుతుంది.

అల్పప్రాణుల్ని పట్టుకుని హింసిస్తూ వినోదించేవారు దంశకూపంలోనూ మశీకూపంలోనూ శిక్షింపబడతారు. నిరాహారులై హాహాకారాలు చేస్తూ దంశబాధలు అనుభవిస్తారు. కాళ్ళూచేతులూ కట్టేసి యమకింకరులు దండతాడనం చేస్తారు. అటుపైని క్షుద్రజంతువులై పుడతారు. ఆపైన అంగవికల మానవజన్మ ఎత్తి పాపప్రక్షాళన పొందుతారు.

తేనెటీగలను చంపి అవి దాచుకున్న తేనెను భుజించేవాడు గరళకుండంలో గరళభక్షితుడవుతాడు. ఆపైని మక్షికాజాతిలో జన్మించి పాపకర్మ విముక్తి పొందుతాడు. నిరపరాధిని దండించినా బ్రాహ్మణుడిని హింసించినా ఆ పాపానికి ఫలం వజ్రదంష్ట్రాకూపనివాసం. యమకింకరుల దెబ్బలకు హాహాకారాలు చేస్తూ రోదిస్తూ రోమసంఖ్యాసమసంవత్సరాలు గడిపి, పందిగా ఏడు జన్మలు కాకిగా మూడు జన్మలూ ఎత్తి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. ధనసంపాదనకోసం అమాయక ప్రజలను పీడించినవాడు వృశ్చికాకూపంలో పడతాడు. వృశ్చికంగా ఏడు జన్మలు ఎత్తుతాడు. అటుపైన అంగహీనుడై వ్యాధిపీడితుడై పాపశుద్ధి పాందుతాడు.

విప్రుడు శస్త్రజీవి అయినా సంధ్యావందన హరిభక్తి విహీనుడైనా స్వరోమాబ్దంగా అతడు శరకూపాదులో ఘోరశిక్షలు అనుభవిస్తాడు. కారాగారంలో బంధించి ప్రజలను ప్రమత్తుడై హింసించేవాడు గోళకుండ నరకానికి పోతాడు. అది సలసలకాగే నీటితో కుతకుతలాడే బురదతో భయంకరంగా ఉంటుండి వాడికోరలతో పెద్దపెద్ద పురుగులు ఎగురుతూ ఉంటాయి. అవి కుడుతూంటే ఆ కుండంలో ఉడుకుతాడు. హింసించిన ప్రజల శరీరాలమీద ఉన్న వెండ్రుకలన్ని సంవత్సరాలు ఈ శిక్ష అనుభవిస్తాడు. అటుపైని ప్రజలకు సేవకుడుగా జన్మించి పాపప్రక్షాళన చేసుకుంటాడు.

చెరువుల్లోనుంచి గాలికోసం ఒడ్డుకువచ్చిన మొసళ్ళనూ తాబేళ్ళనూ పట్టి హింసించేవాడు నక్రకంటక సమానాబ్దంగా నక్రకుండ మహానరకంలో హింసలు అనుభవిస్తాడు. అటుపైని తాను హింసించిన జంతువుల జాతిలో జన్మిస్తాడు.

పుణ్యక్షేత్రాలలోగానీ తీర్థస్నాననమయాలలోగానీ పరస్త్రీల గోప్యాంగాలను కాముకదృష్టితో చూసినవాడు కాకతుండకూపంలో పడి తన వెండ్రుకలన్ని సంవత్సరాలు హింసపడతాడు. కాకులు వాడీ కళ్ళు పీక్కుతింటాయి. అంధుడుగా మూడుజన్మలెత్తుతాడు. బంగారాన్ని దొంగిలించినవారు మంధానకూపంలో మథింపబడతారు. యమకింకరులు కళ్ళకు గంతలుకట్టి చావబాదుతారు. తన మలమూత్రాలను తానే తింటూ స్వరోమాబ్దకాలం గడిపి అటుపైని మూడుజన్మలూ అంధుడవుతాడు. ఏడు జన్మలు మహాదారిద్య్రం అనుభవించి స్వర్ణకారుడుగానో స్వర్ణవ్యాపారిగానో జన్మించి బంగారానికి సేవకుడవుతాడు. తామచౌర్యం లోహచౌర్యం చేసినవారు ఇలాగే బీజకుండంలో శిక్ష అనుభవిస్తారు. దేవతావిగ్రహాలను దొంగిలించినా దేవద్రవ్యాన్ని అపహరించినా స్వరోమాబ్దంగా వజ్రకుండ నరకంలో వజ్రాఘాతాలు తింటూ హాహాకారాలు చేస్తూ నిరాహారులై కింకరతాడితులై కడపటికి పాపకర్మ విముక్తులవుతారు. వెండినీ గోవులనూ వస్త్రాలనూ దొంగిలించేవారు తప్తపాషాణకుండంలో శిక్షింపబడతారు. మూడు జన్మలు బొల్లిరోగంతో పీడింపబడతారు. అటుపైని శ్వేతపక్షిగా జన్మిస్తారు. కాంస్యపాత్రలను ఆపహరించినవాడు తీక్ష్ణపాషాణ నరకంలో హింసలు అనుభవించి గుర్రంగా ఏడు జన్మలు ఎత్తి ఆపైని పాదరోగపీడితుడై పాతకవిముక్తి పాందుతాడు.

గతిలేక వాళ్ళు అమ్ముకుని జీవించే పుంశ్చలిని దోచుకునేవాడు స్వరోమాబ్దంగా లాలకుండంలో మునుగుతాడు. అటుపైని కంటిరోగంతోనూ శూలరోగంతోనూ పీడింపబడతాడు. ఎప్పటికో పాపవిశుద్ది పాందుతాడు. మసీజీవనం సాగించే విప్రుడు మసీకుండనరకంలో దుఃఖిస్తాడు. అటుపైని నల్లని పశువుగా మూడుజన్మలు ఎత్తుతాడు. మూడు జన్మలు నల్లగొర్రె అవుతాడు. ఆపైని తాడిచెట్టుగా పుడతాడు, కడపటికి విశుద్ధుడవుతాడు. ధాన్యాది సస్యాలనూ తాంబూలాన్నీ ఆసన తల్పాలను అపహరించేవాళ్ళు చూర్ణకుండ నరకకూపంలో యమబాధలు అనుభవిస్తారు. మేషజాతిలోనూ కుక్కుటజాతిలోనూ మూడేసి జన్మలు ఎత్తుతారు. ఆ పైని వానరజన్మ కాసవ్యాధిపిడ. దారిద్య్రం. అల్పాయుర్దాయం. వంశహాని. చివరికి పాపవిశుద్ధి. విప్రుల సొమ్ము హరించి (గానుగ) చక్రం చేయించుకున్నవాడు చక్రకుండనరకంలో శతాబ్దకాలం హింసలు అనుభవిస్తాడు. అటు పైని తైలకారుడుగా మూడు జన్మలు ఎత్తుతాడు. వ్యాధిపీడితుడూ వంశహీనుడూ అయ్యి పాపవిమోచనం పొందుతాడు. విప్రుల గో ధనాల విషయంలో వంకరగా వ్యవహరిస్తే వక్రకుండ నరకానికి పోతారు. ఆపైని వంకరటింకర అవయవాలతో పుడతారు. ఇలా ఏడు జన్మలయ్యాక గ్రద్దగా పందిగా పిల్లిగా నెమలిగా మూడు జన్మలు ఎత్తుతారు. అప్పటికి గానీ పాపభారం తరగదు. బ్రాహ్మణుడై పుట్టి కూర్మమాంసం తింటే కూర్మకుండంలో శతాబ్దంపాటు కూర్మాలతో భక్షింపబడతాడు. మూడు కూర్మజన్మలెత్తుతాడు. పందిగా బిడాలంగా నెమలిగా మూడేసి జన్మలు ఎత్తి క్రమంగా పాపపంకిలం వదిలించుకుంటాడు. నెయ్యిగానీ నూనెగానీ అపహరించినవాళ్ళు జ్వాలాకుండంలోనూ భస్మకుండంలోనూ నరకయాతన అనుభవిస్తారు. మత్స్యమూషక జన్మలు ఏడేసి ఎత్తి పాపభారం తొలగించుకుంటారు. సుగంధ ద్రవ్యాపహర్తలు దగ్ధకుండనరకంలో దివారాత్రాలు దగ్ధులవుతారు. అటుపైని దుర్గంధికులుగా ఏడు జన్మలెత్తుతారు. మృగనాభిగా(కస్తూరి) మూడు జన్మలు తప్పవు. ఏడు మంథాన జన్మలూ తప్పవు. అప్పటికి పాపఫలానుభవం పూర్తి అవుతుంది. బలప్రయోగంతోగానీ మోసం చేసిగానీ ఇతరుల పిత్రార్జితభూమిని కాజేసినవాళ్ళు తప్తసూచీకూపంలో పడిదగ్ధులవుతారు. ఏడు మన్వంతరాలు ఈ నరకం అనుభవించి అరవైవేల సంవత్సరాలు కృమికీటకమై తిరిగి స్వజాతిలో జన్మిస్తారు. పాపకర్మల ఫలంగా నరకయాతనలు అనుభవించి పరిశుద్ధులై స్వీయజాతిలో జన్మించాక శుభకర్మలు ఆచరించాలి. శుభఫలాలు దక్కుతాయి. మళ్ళీ పాపాలే చేస్తే ఇలాగే నరకయాతనలు తప్పవు.

సావిత్రీ ! ధనలోభంతో ఎదుటివాడి శిరస్సును కత్తితో నరికిన హంతకుడు అసిపత్రనరకంలో యాతనపడతాడు. పధ్నాలుగుమంది ఇంద్రులు మారేటంతకాలం అందులో కత్తికోత అనుభవిస్తాడు. బ్రాహ్మణుడిని చంపినవాడు శతమన్వంతరాలు అదే నరకంలో శిక్షింపబడతాడు. అటు పైని శతసూకరజన్మలూ సప్తకుక్కుట జన్మలూ సప్తసృగాల జన్మలూ సప్తవ్యాఘ్రజన్మలూ మూడు వృకజన్మలూ సప్తమండూక జన్మలూ ఎత్తుతాడు. అటుపైని ఒక మహిష జన్మఎత్తి పాపవిముక్తి పొందుతాడు. పల్లెలూ పట్టణాలూ తగులబెట్టేవారు క్షురధారానరకకూపంలో మూడు యుగాలపాటు యమబాధలు పడతారు. తరవాత ప్రేతాకారంలో మరిన్ని సంవత్సరాలు తిరుగుతారు. ఆపైని ఏడు జన్మలు మలభక్షకులై ఏడు జన్మలు కపోతాలై ఏడు జన్మలు శూలవ్యాధిపీడితులై ఏడు జన్మలు కుష్ఠువ్యాధి అనుభవించి శుద్ధిపాందుతారు, పరనిందాపరుడూ పరదోష ప్రచారకుడూ దేవ బ్రాహ్మణ నిందకుడూ సూచీముఖ నరకంలో యుగత్రయకాలం వేదనలు అనుభవిస్తారు. వృశ్చిక వజ్రకీట భస్మకీటజన్మలు ఏడేసి ఎత్తి మానవుడై మహావ్యాధి పీడితుడై మరణించి శుద్ధిపాందుతాడు, గోడలకు కన్నంవేసి తలుపులు బద్దలు చేసి ఇళ్ళల్లో చొరబడి వస్తువుల్ని దొంగిలించేవారు గోకాముఖనరకంలో మూడుయుగాలు యమకింకర బాధలు అనుభవిస్తారు. గిత్తలూ గొర్రెపాటేళ్ళూ మేకపోతులూ కొమ్ములతో కుమ్ముతోంటే గిట్టలతో మట్టగిస్తోంటే హాహాకారాలు చేస్తారు. ఆపైని వ్యాధిగ్రస్తమైన ఎద్దుగా ఏడుజన్మలూ మేషజాతిలో మూడుజన్మలూ ఛాగజాతిలో మూడు జన్మలూ ఎత్తి మానవుడుగా దారిద్య్రం నిత్యరోగం భార్యావియోగం బంధువియోగం అన్నీ అనుభవించి పాపకర్మ విముక్తుడవుతాడు. ఏ రకమైన ద్రవ్యాన్ని ఎవరినుంచి కాజేసినా చోరుడు నక్రముఖ కుండంలో నలిగిపోవలసిందే. మూడు శతాబ్దాలపాటు యమభటుల దండతాడనలు తినవలసిందే. ఆపైని రోగిష్ఠి ఎద్దుగా ఏడు జన్మలు దుఃఖించి మానవుడై మహారోగిగా అందరితోనూ ఏవగింపబడి కడపటికి పరిశుద్ధి పొందుతాడు. ఏనుగుల్నీ గుర్రాల్నీ పశువుల్ని చంపినవాడు గజదంశకూపంలో మూడుయుగాలపాటు యాతనలు అనుభవిస్తాడు. నాగదంతాలతో యమకింకరులు కుళ్ళబొడుస్తుంటే కుయ్యోం మొర్రోమని పెడబొబ్బలు పెడతాడు. అటుపైని ఆయా జంతువులుగా మూడేసి జన్మలు ఎత్తుతాడు. నరుడై శుచి అవుతాడు.

దప్పికతో వచ్చి నీళ్ళు తాగుతున్న గోవును తరిమివేసిన మానవుడు గోముఖనరకంలోపడి పురుగులతో కాగుతున్న నీళ్ళల్లో మగ్గుతాడు. మన్వంతరకాలం ఈ శిక్ష అనుభవిస్తాడు. నరజన్మ ఎత్తి మహారోగపీడతో మరణించి పాపప్రక్షాళన పొందుతాడు, గోహత్య బ్రాహ్మణహత్య స్త్రీహత్య భిక్షుహత్య భృణహత్య(గర్భస్రావం) చేసినవారూ పొందుకోరరాని స్త్రీని పొందినవారూ కుంభీపాకనరకంలో చతుర్దశేంద్రసమకాలం హింసలు ఆనుభవిస్తారు. యమదూతలు నలిపేస్తారు. నిప్పుల్లో తోస్తారు. ఇనపముళ్ళ పొదల్లోకి విసురుతారు. కాగుతున్న నూనెలో ముంచుతారు. సలసలలాడుతున్న తామ్ర లోహద్రవంలో వేపుతారు. ఇన్నీ అనుభవించి నూరు గ్రద్దజన్మలూ నూరు పందిజన్మలూ ఏడు కాకిజన్మలూ ఏడు సర్పజన్మలూ ఎత్తి అరవైవేల సంవత్సరాలపాటు విట్‌కృమిగా జీవించి ఆపైని ఎద్దుగా ఏడుజన్మలు ఎత్తి మనిషైపుట్టి దరిద్రుడై కుష్ఠురోగపీడితుడై అప్పటికి పాపభారం తొలగించుకుంటాడు.

బ్రహ్మహత్యాసమానాలు


Tuesday, July 21, 2026

Zodiac signs favored by Goddess Lakshmi - లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు

సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదల దేవతగా కొలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం తనపై ఎప్పటికీ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్ని రాశులపై లక్ష్మీదేవి చల్లని చూపు ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతారు.

చంద్రుడు, గురుడు మరియు శుక్రుడు అధిపతులుగా కలిగిన రాశుల మీద లక్ష్మీ దేవి చూపు చల్లగా ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సంపద, సౌందర్యం, విలాసం, సౌభాగ్యానికి కారక గ్రహంగా భావిస్తారు. అందువల్ల ఈ రాశివారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని సంప్రదాయ జ్యోతిష్యం చెబుతుంది.

కర్కాటక రాశి
ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, పోషణకు ప్రతీక. కుటుంబాన్ని గౌరవించే స్వభావం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.

తులా రాశి
తులా రాశికి కూడా శుక్రుడే అధిపతి. సమతుల్యత, అందం, మంచి సంబంధాలు, ఆర్థిక ప్రణాళిక వంటి లక్షణాలు ఈ రాశివారిలో ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్యం చెబుతుంది. అందుకే ఐశ్వర్య యోగాలు కలుగుతాయని భావిస్తారు.

ధనుస్సు రాశి
ఈ రాశికి అధిపతి గురుడు. గురుడు జ్ఞానం, ధర్మం, పుణ్యానికి సూచిక. ధర్మమార్గంలో నడిచేవారిపై లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం.

మీన రాశి
మీన రాశికి కూడా గురుడే అధిపతి. భక్తి, దయ, దానం, ఆధ్యాత్మికత ఈ రాశివారి ప్రధాన లక్షణాలుగా భావిస్తారు. ఈ గుణాలు లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతాయని జ్యోతిష్య సంప్రదాయం చెబుతుంది.

లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం రాశిని బట్టి మాత్రమే కాదు. భక్తి, నిజాయితీ, పరిశుభ్రత, దానం, ధర్మాచరణ, కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న ప్రతి ఒక్కరిపై ఆమె కటాక్షం ఉంటుందని పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తాయి. రాశి ఒక సూచిక మాత్రమే, సత్కర్మలే లక్ష్మీ కటాక్షానికి నిజమైన మార్గం.

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...