దక్షుండు నారదుని శపియించి ప్రజాసర్గం బొనరించుట
అది ఎలాగంటే - వీరు బాలురు. దేవఋషి పితృబుణాలు తీర్చుకోలేదు. ఏ కర్మలను చేయలేదు. కర్మల అనిత్యత్వాన్ని వీరెరుగరు. అటువంటి చిన్నపిల్లల బుద్దిని తప్పుత్రోవ పట్టించి వారిని ఈ లోకంలోను, పరలోకంలోను కూడా శ్రేయస్సు పొందకుండగా చేశావు. నీవు చేసిన ఈ పాపంవలన భగవద్భక్తులందరిలోను సిగ్గులేని వాడవై అపకీర్తి పాలవుతావు. నా పుత్రులు నిరపరాధులు. నీపైనవారికి శత్రుత్వం లేదు. అటువంటివారికి ద్రోహం చేశావు. నీవు తప్ప మిగిలిన భాగవతోత్తములందరూ ప్రాణులపట్ల అనుగ్రహం కలవారే. నీవు చాలా ఆసక్తిగా మిత్రులమధ్య ఉన్న స్నేహబంధాన్ని ఛేదిస్తావు. నీవలన మిత్రులమధ్య విరోధం ఏర్పడుతుంది. శత్రుత్వాలు నీవలన శాంతింపవు. ఇకపైన ఎవరికీకూడా విషయసుఖాలు అనుభవించకుండా అవి దుఃఖహేతువులనే విషయం తెలియదు. జ్ఞానం స్వయంగా కలుగుతుందేతప్ప నీబోటివాళ్ళు చెప్పినంతమాత్రాన కలుగదు. నీవు నిరంతరం లోకాలన్నీ తిరుగుతూనే ఉంటావు. నీకెక్కడా నివాసస్థానమంటూ ఉండదు అని దక్షుడు నిర్దయగా నారదుణ్ణి శపించాడు. అయినా నారదుడు కోపగించుకోలేదు. ఆ శాపాన్ని అంగీకరించాడు. అటువంటి శాంతస్వభావం ఉంటే ఏ వ్యక్తి అయినా అన్ని ద్వంద్వాలకూ అతీతుడయి సర్వేశ్వరుడనబడతాడు కదా!
దక్షుడు ప్రజలను సృష్టించాలనే తన కోరిక తీరకపోవడం చేత చాలా దుఃఖపడ్డాడు. అపుడు బ్రహ్మ వచ్చి సృష్టికి ఉపాయం చెప్పాడు. దక్షుడు తన భార్యయైన అసిక్నియందు అరవైమంది కూతుళ్ళను కన్నాడు. వారిలో పదిమందిని ధర్ముడికిచ్చాడు. పదుముగ్గురిని కశ్యపుడికిచ్చాడు. ఇరవైయేడుగురిని చంద్రుడి కిచ్చాడు. భూతుడి కిద్దరిని, ఆంగిరసుడి కిద్దరిని, కృశాశ్వుడి కిద్దరిని ఇచ్చాడు. చివరి నల్గురిని తార్క్ష్యుడనే పేరుకల కశ్యపుడి కిచ్చాడు. పైన చెప్పిన వరుసలోనే కూతుళ్ళనిచ్చాడు. ఆ కూతుళ్ళ పేర్లు విను.
(ప్రతి వ్యక్తి పుడుతూనే మూడు ఋణాలతో పుడతాడు. అవి దేవఋణం, ఋషిబుణం, పితృఋణం.
దేవఋణం : దేవతలు వర్షాలు కురిపించి తద్ద్వారా మనకాహారాన్ని సమకూరుస్తున్నారు. అందుకు మనం వారికి ఋణపడి ఉన్నాం. ఆ ఋణం తీర్చుకొనే ఉపాయం ఏమిటంటే యజ్ఞాలు చేసి మనం ఇచ్చే ఆహుతులద్వారా వారిని సంతోషపరచడమే.
ఋషిబుణం : ఋషులు మనకు వేద వాఙ్మయాన్నిచ్చారు. అందువలన మనం వారికి ఋణపడి ఉన్నాం. అది తీర్చుకొనే ఉపాయం బ్రహ్మచర్యం. అంటే వేదాధ్యయనం చెయ్యడమే.
పితృఋణం : పితృదేవతలు మనకు శరీరాన్నిచ్చారు. అందువలన మనం వారికి ఋణపడి ఉన్నాం. అది తీర్చుకొనే ఉపాయం వంశం కొనసాగేవిధంగా సత్సంతానాన్ని కనడమే.
ఈ మూడు ఋణాలూ తీర్చుకొనిన తరువాతనే మనస్సును మోక్షమార్గంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇవేవీ తీర్చుకొనని తన పుత్రులను మోక్షమార్గంలో ప్రవేశపెట్టి నారదుడు వారిని భ్రష్టుల్ని చేశాడు - అని దక్షుడి అభిప్రాయం)
దక్షుని కూతుళ్ళు ఎంత పుణ్యం చేశారో కదా! అందరూ సాటిలేని సవతులే అయినా ముల్లోకాలూ వారి సంతానమయ్యేంతగా సంతానవతులయ్యారు. ఏ తల్లి వారిని కన్నదో కదా!
దక్షప్రజాపతికి అరవైమంది పుత్రికలు. వారిలో పదిమంది ధర్ముని భార్యలు. వారి పేర్లు - భానువు, లంబ, కకుప్పు, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప. వారిలో భానువు కొడుకు వేదఋషభుడు. వేదఋషభుని కొడుకు ఇంద్రసేనుడు. లంబయొక్కపుత్రుడు విద్యోతుడు. విద్యోతుని పుత్రులు స్తనయిత్నువులు. కకుబ్దేవి యొక్క పుత్రుడు సంకుటుడు. సంకుటుని పుత్రుడు కీకటుడు. కీకటునికి దుర్గాభిమాని దేవతలు పుత్రులు. దుర్గభూములకధిష్ఠాన దేవతలు జామిదేవియొక్క పుత్రులు. ఆ దేవతల పుత్రులు స్వర్గుడు, నంది.
విశ్వయొక్క పుత్రులు విశ్వేదేవతలు. విశ్వేదేవతలకు సంతానం లేదు. సాధ్యయొక్క పుత్రులు సాధ్యగణాలు. సాధ్యగణాల పుత్రుడు అర్థసిద్ధి. మరుత్వతికి మరుత్వంతుడు, జయంతుడు అని ఇద్దరు పుత్రులు. అందులో జయంతుడు వాసుదేవుని అంశతోపుట్టి ఉపేంద్రుడనే ప్రసిద్ది పొందాడు. ముహూర్తకు మౌహూర్తికులనే పుత్రులు కలిగారు. వారు ప్రాణులకు కాలాన్ననుసరించి ఫలం ఇస్తారు. సంకల్ప కొడుకు సంకల్పుడు. సంకల్పుని కొడుకు కాముడు. వసువునకు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్ముడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు అనే ఎనమండుగురు వసువులు పుట్టారు. వారిలో ద్రోణుని భార్య అభిమతి. వారికి హర్షుడు, శోకుడు, భయుడు అనేవారు జన్మించారు.
ప్రాణుని భార్య ఊర్జస్వతి. వారికి సహుడు, ఆయువు, పురోజవుడు అనే ముగ్గురు పుత్రులు. ధ్రువుని భార్య ధరణి. పురములు వారి సంతానం. అర్కుని భార్య వాసన. వారి పుత్రులు తార్ష్యుడు మొదలయినవారు. అగ్నిభార్య వసోర్ధార. ద్రవిణకాదులు వారి పుత్రులు. అగ్నికి కృత్తికలు కూడా భార్యలు. వారికి స్కందుడు పుత్రుడు. స్కందునికి విశాఖుడు మొదలయినవారు పుత్రులు. దోషుని భార్య శర్వరి. ఆమె పుత్రుడు శింశుమారుడు. అతడు శ్రీహరి అంశతో జన్మించాడు. వస్తువు భార్య ఆంగిరస. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఆమె కొడుకు. విశ్వకర్మ భార్య ఆకృతి. ఆమె పుత్రుడు చాక్షుషమనువు. ఆ మనువునకు విశ్వులు, సాధ్యులు అనేవారు పుత్రులు. విభావసుని భార్య ఉష ఆమె పుత్రులు వ్యుష్టి, రోచిస్సు, ఆతపుడు. ఆతపుని పుత్రుడు పంచయాముడు. అతడు దివసాభిమానిదేవత. భూతుడు శంకరుని అంశతో జన్మించాడు. భూతుని భార్య సురూప. కోట్లాదిమంది రుద్రగణాలు ఆమె పుత్రులు. అంతేకాదు. సురూపకు రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాయుడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు అనేవారు, రుద్రుని అనుచరులయిన ప్రేతలు, వినాయకులు అనేవారు కూడా పుత్రులుగా ఉదయించారు.
అంగిరసుని భార్య స్వధ. పితృగణాలు ఆమె పుత్రులు. అంగిరసుని మరో భార్య సతి. ఆమెకు అథర్వాఖీమాన దేవతలు పుత్రులు. కృతాశ్వుని భార్య అర్చిస్సు. ఆమె పుత్రుడు ధూమ్రకేశుడు. వేదశిరస్సుని భార్య ధిషణ. ఆమెకు దేవలుడు, వయునుడు, మనువు అని ముగ్గురు పుత్రులు. తార్ష్యునకు వినత, కద్రువ, పతంగి, యామిని అని నలుగురు భార్యలు. వారిలో పతంగి సంతానం పక్షులు. యామిని సంతానం మిడుతలు. వినతకు ఇద్దరు కొడుకులు. గరుత్మంతుడు, అనూరుడు, గరుత్మంతుడు శ్రీహరి వాహనం. అనూరుడు సూర్యుని రథసారథి. కద్రువ సంతానం పాములు. కృత్తికాది నక్షత్రాలు చంద్రుని భార్యలు. చంద్రుడు రోహిణియందు అధికాసక్తుడయి తక్కిన భార్యలను పట్టించుకోని కారణంగా దక్షుడు చంద్రుణ్ణి క్షయ రోగగ్రస్తుడవగుము అని శపించాడు. ఆ కారణంగా సంతానం పొందే అర్హత చంద్రునికి లేకపోయింది. అటుపైన దక్షుడు అనుగ్రహించగా క్షీణించిన కళలు తిరిగి చంద్రుణ్ణి చేరాయి. ఇంతేకాక -
ఎవరు కశ్యప ప్రజాపతికి భార్యలో, ఎవరు అలౌకికమైన చరిత్ర కలిగి సమస్త జగత్తుల పూజలందుకుంటున్నారో, ఎవరి పుత్రులు, పొత్రులు బలవంతులయి ముల్లోకాలను పరిపాలించారో, ఎవరికి కొంగుబంగారమై ఎంత వ్యయం చేసినా తరుగని పుణ్యం ఉందో అటువంటి కశ్యపుని భార్యల యొక్క నానావిధాలయిన సంతతిని స్పష్టంగా నిరూపించడం అసాధ్యం. సంతానవతులయిన ఆ ప్రసిద్ధ సాధ్వీమణుల పేర్లు, వారి వంశాలు చెప్తాను. ఓ రాజా! విను.
(ముంగొంగు బంగారం అనేది తెలుగు జాతీయం. మూల్గుపుణ్యం అంటే ఎంత తీసినా తరగకుండా గుట్టలు గుట్టలుగా పడి ఉందనీ, ముంగొంగు బంగారం అంటే అవసరమయిన వెంటనే వాడుకునేందుకు వీలయినది, విలువైనది అని అర్ధం.)
మూడు లోకాల్లో ఉన్న ప్రాణులన్నీ అదితి, దితి, కాష్ఠ, దనువు, అరిష్ట తామ్ర, క్రోధవశ, సురస, సురభి, ముని, తిమి, ఇళ, సరమల సంతానమే.
తిమికి చేపలు మొదలగు జలచరాలు పుట్టాయి. సరమకు వ్యాఘ్రాది క్రూరజంతువులు పుట్టాయి. సురభికి దున్నపోతులు, ఆవులు మొదలయినవి జన్మించాయి. తామకు డేగలు, గద్దలు పుట్టాయి. మునికి అప్సరసలు, ఇళకు చెట్టు, చేమలు, క్రోధవశకు పాములు, సురసకు రాక్షసులు, అరిష్టకు గంధర్వులు, దనువునకు సుప్రసిద్ధ బలంకల పద్దెనిమిది మంది దేవతాశత్రువులయిన రాక్షసులు జన్మించారు. వారి పేర్లు, వంశాలు విను.
కశ్యపుని భార్యలలో దనువొకతె. ఆమె పుత్రులు పద్దెనిమిదిమంది. వారి పేర్లు - ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, ఆయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి దుర్జయుడు. వీరిలో స్వర్భానువు కూతురు సుప్రభ, ఆమె భర్త నముచి. వృషపర్వుని కూతురు శర్మిష్ట ఆమె భర్త యయాతి. అతడు నహుషుని కొడుకు. వైశ్వానరునకు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక అని నలుగురు పుత్రికలు. ఉపదానవి హిరణ్యాక్షుని భార్య. హయశిర భర్త క్రతువు. పులోమకాలకలను బ్రహ్మవాక్యముపై కశ్యపుడు వివాహమాడాడు. పులోమకు పౌలోములు, కాలకకు కాలకేయులు పుట్టారు. వారు సమరకోవిదులు. పొలోమకాలకేయులకు అరువదివేలమంది రాక్షసులు జన్మించారు. వారు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు. ఇంద్రుని ప్రీతి కొరకు నీ తాతగారైన అర్జునుడు వారిని వధించాడు. విప్రచిత్తికి సింహికయందు రాహువు, వందమంది కేతువులు మొత్తం నూట ఒక్కమంది జన్మించారు. వారు గ్రహాలు. ఆదిపురుషుడైన శ్రీహరి తన అంశతో అదితియందు జన్మించాడు. అంత అదృష్టవంతురాలయిన అదితి వంశం విను. వివస్వంతుడు, అర్యముడు, పూషుడు, త్వష్ట సవిత, భగుడు, ధాత, విధాత, అరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు అనే పేర్లుకల పన్నెండుగురు సూర్యులు అదితికి జన్మించారు. వివస్వంతునికి యముడు, యమి అనే కవలలు కలిగారు. సంజ్ఞ ఆడుగుర్రం రూపం ధరించి అశ్వినీ దేవతలను కన్నది. వివస్వంతుని మరో భార్య ఛాయ. ఆమెకు శని, సావర్ని అనే మనువు, తపతి అనే కూతురు పుట్టారు. తపతి భర్త సంవరణుడు. అర్యముని భార్య మాతృక. వారి సంతానం చర్షణులు. వారు వివేకంకల వారయిన కారణంగా వారిని ఆధారంగా చేసుకొని బ్రహ్మ మానవజాతిని రచించాడు. పూషుడు భర్గుని చూచి నవ్వగా అతడు కోపగించి పూషుని పళ్ళు రాలగొట్టాడు. అప్పటి నుంచి అతనికి పిండే తిండి. ఆ పూషునికి సంతానం లేదు. త్వష్టయొక్క భార్య రచన. ఆమె దితిపుత్రులకు చెల్లెలు. త్వష్ట రచనల కొడుకు విశ్వరూపుడు. దేవతలు బృహస్పతికి కోపం వచ్చేవిధంగా ప్రవర్తిస్తే బృహస్పతి దేవతలను విడిచి వెళ్ళిపోయాడు. అపుడు దేవతలు విశ్వరూపుణ్ణి తమ గురువుగా స్వీకరించారు. ఈ విధంగా శుకమహర్షి చెప్పగా పరీక్షిన్మహారాజు ఇలా అడిగాడు.
దేవాసుర యుద్ధ ప్రారంభము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
పంచాంగం
No comments:
Post a Comment