ఈ విధంగా ప్రహ్లాదుడు అనేక విధాలుగా అనుకూలమైన సమయాలలో రాక్షస కుమారులకు రహస్యంగా మోక్షమార్గం బోధించసాగాడు. అప్పుడు వాళ్ళందరూ గురువుల దగ్గర తమ చదువులు ఆపివేసి తమ హృదయాలను హృషీకేశునివైపు మళ్ళించారు. వాళ్ళ గురువు ఇది గమనించి, శిష్యుల భావాలు తెలుసుకుని, భయపడి హిరణ్యకశిపుని వద్దకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు.
రాక్షసరాజా! నీ కొడుకు రాక్షస బాలురందరినీ చేరదీసి రహస్యంగా నేను బోధించిన పాఠాలన్నీ అబద్దాలని, నిరర్థకాలని, నిరసించి, వారిని ఆకట్టుకొని, తన బోధలతో, వారినందరినీ ముక్తిమార్గానికి మరలించాడు. మన రాక్షస వంశానికి పెద్దప్రమాదం వాటిల్లింది. ఇపుడు నీవు పూనుకొని నీ సమర్థత నిరూపించుకోవలసి ఉంది. వారినందరినీ మళ్లీ మన మార్గానికి తీసుకవచ్చి ఈ ప్రమాదాన్ని చక్కదిద్దవలసి ఉంది.
రాజా! ఇది విన్నావా? రాక్షసబాలురు నన్ను తిరస్కరించి నా పాఠాలు వినడం మానేశారు. అందుకు కారణంగా వారు అంటున్నది ఇది. “ఈ గురుడు ఎప్పుడూ మాకు గొప్పవైన హరి కథలను చెప్పడు”. అని.
రాజా! ప్రహ్లాదుడు హరికథలు మానడు. అందరిలో ఒకడిగా ఉండక వేరుగా నిలిచి, మందుని (బుద్ధిహీనుని)లాగా తిరుగుతాడు. నేను బోధించే పాఠాలు తాను తిరిగి పలుకడు. ఈ స్థితిలో ఈ అల్లరి పిల్లవాణ్ణి చదివించడం మాకు సాధ్యపడటం లేదు.
రాజా! గొప్ప రాక్షస వంశంలో వికారమైన కొరగాని కొడుకుపుట్టాడు. నిత్యం హరిస్మరణ తప్పుడు. విష్ణుభక్తి వదలడు. వీడెక్కడనుండి మనవంశానికి వచ్చి చేరాడు? వెఱ్ఱివాడు!
గురుసుతుడు, వినిపించిన తన కొడుకును గురించిన మాటలు, తన చెవులపై కత్తిదెబ్బలలాగా తగిలి హిరణ్యకశిపుడు ఎగసిపడ్డాడు. కాలిదెబ్బ తిన్న పాములా, గాలితో చెలరేగిన అడవి నిప్పులా, కర్రదెబ్బతిన్న సింహంలా, భయంకర రౌద్రావేశంతో రగిలే మనస్సుతో, కొడుకును సంహరించడానికి సంసిద్దుడై, శరీరం వణుకుతుండగా, కళ్ళు ఎఱ్ఱబడి నిప్పులు చిమ్ముతుండగా, కుమారుని రప్పించి, గౌరవాదరాలు విడిచిపెట్టి, దయమాలి పిడుగులవంటి మాటలతో బెదిరిస్తూ
శాంతశీలంతో అతిపవిత్రంగా పరిశుద్ధజ్ఞానంతో ఒప్పేవాడు, అజ్ఞానపు అడవులకు అగ్నివంటివాడు, చేతులు జోడించి వెలుగొందేవాడు, సదా నారాయణుని పాదపద్మ ధ్యానమనే అమృతరస ఆస్వాదనంలో మునిగినవాడు అయిన కొడుకును ధిక్కారంతో అనాదరంతో, ఆ దేవవిరోధి ఉగ్రుడై ఇలా పలికాడు.
సూర్యుడు నా ఆజ్ఞ లేక ఆకాశాన ప్రకాశించడానికి భయపడతాడు. వాయువు నాకు అనుకూలంగా తప్ప కాలమేదైనా వీయడానికి జంకుతాడు. అగ్ని నా పరాక్రమపు వేడిమికి తలఒగ్గి, తగ్గి వెలుగుతాడు. నాకు భయపడతాడు. యముడు నా ఆనతిలేకుండా జీవుల ప్రాణాలు తీయడానికి భయపడతాడు. ఇంద్రుడూ నాముందు తల ఎత్తడానికి జంకుతాడు. సురలు, కిన్నరులు మొదలైన దేవగణం అందరూ నాకు భయపడేవారే! ఒరే తుంటరీ! నీవు ఒక్కడవు మాత్రం నాకు ఎందుకు భయపడవు? నేను కోపగిస్తే నీకు దిక్కెవరు?
ఓరి అల్పజ్ఞుడా! ప్రభావశాలురైన లోకపాలకులే నా ఆజ్ఞను దాటడానికి జంకుతారు. కోపగించి నేను కన్నుతెరిస్తే చాలు ముల్లోకాలూ నా క్రీగంటి చూపుకే మతిపోయినట్లు వణకుతాయి. కాగా, అహంకారంతో కేవలం నీవు ఒక్కడవు నా ఆజ్ఞను భంగపరచడానికి ఎలా సాహసించావు?
అర్భకా! గొంతు నొప్పి పుట్టెటట్లు మాటిమాటికీ హరి దుర్జయుడని చెబుతుంటావు గదా! అదే నిజమై ఉంటే, నేను అమరావతిపై దండెత్తి దేవతలందరినీ నరికి శిక్షిస్తుంటే, ఆ యుద్ధరంగానికి జంకకుండా వచ్చి తనవారిని రక్షించుకోవద్దా? మరి రాలేదెందుకు?
గురువు చెప్పని మోక్షాన్ని గురించి బాలురకు నేర్పి, దానిలో వారికి ఆసక్తి గల్గించి, నీ వదరుబోతుతనాన్ని ప్రదర్శించావు. మన వంశద్రోహి అయిన హరిని పొగడి నా వంశాచారాన్ని బూడిద చేశావు. ఇటువంటి హీనుని నిన్ను చంపడం ఉత్తమకార్యం. అందువల్ల నిన్ను చంపి నా వంశాన్ని దోషరహితం చేస్తాను.
ఓరి అర్భకా! అన్ని దిక్కులూ జయించాను. దేవేంద్రుడు మొదలు దిక్పాలకు లందరు, రక్షణ కరవై నన్నొక్కనినే దిక్కని సేవిస్తున్నారు.
నేను ఇతరులలాగా, సేనలతో దండెత్తి గాక, నా ఒక్కని శౌర్యంతోనే మహాబలు లెందరినో ఎదిర్చి జయించాను. అట్టి నాకు ప్రత్యర్థివై ఏ బలంతో మాట్లాడుతున్నావురా?
తండ్రి ఈ విధంగా గద్దిస్తే, కొడుకు మెల్లగా అణకువతో ఇలా అన్నాడు.
రాక్షసరాజా! లోకంలోగల అందరికి, బలవంతులకు బలహీనులకు, ఎవడు బలమో; నీకు, నాకు, బ్రహ్మ మొదలయిన వారికి సకల ప్రాణులకు ఎవడు బలమో, అట్టి ప్రభుడే నాకు బలం. వాడే నాకు శక్తిప్రదాత.
('దుర్బలస్య బలం రాజా' - బలహీనులకు రాజే బలం అన్నది సామాజిక న్యాయానికి చెందింది. రాజు లౌకిక జీవితానికి బలం. దేవుడు ముముక్షువులకు ఆత్మబలం.)
ఓ మహాత్మా! దిక్కులు కాలంతో పాటుగా ఏర్పడ్డాయి. కాబట్టి, దిక్కు లేకపోవడం అనేది లేదు. ఈ దిక్కులకు మూలమైనవాడు ఎవడో, దిక్కులేనివారికి దిక్కైనవాడు ఎవడో, వాడే నాకూ దిక్కు
కాలస్వరూపుడైన ఈశ్వరుడు తనకు సహజసిద్ధమైన శక్తితో, వినోదాత్మకంగా లీలావిశేషంగా అన్నిలోకాలు సృష్టిస్తాడు. పోషిస్తాడు, ఖండిస్తాడు. ఆతడు మార్పు లేనివాడు, అన్నింటా ఉన్నాడు. నీవు నీ మనస్సున సమభావంతో ఉండు. దారి తప్పి ప్రవర్తించే మనస్సుకంటే వేరే శత్రువు లెవరూ లేరు. నీకు, నీ మనస్సు, విరోధిగా గాక, వశమైనదిగా చేసికో, రాక్షస స్వభావం వదలిపెట్టు. ప్రజలు నీ యెదుట నీకు శుభకరమైన పలుకులు పలకడంలేదు.
(సత్త్వశబ్దానికి బుద్ధి అనే అర్థం. శ్రీధరీయవ్యాఖ్యలో “సత్త్వం ధైర్యం బుద్ధిర్వా” అని ఉంది.)
రాక్షసేశ్వరా! క్షణంలో లోకాలన్నీ గెలిచావు. నిజమే. కాని నీ మనస్సును, ఇంద్రియాలను మాత్రం గెలువలేక పోతున్నావు. నిన్ను కట్టి పడవేసే ఈ ఆర్గురు శత్రులను -అరిషడ్వర్గాన్ని (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే వానిని) గెలువలేకున్నావు. ఆ ఆర్గురను జయిస్తే ఇక నీవు జయించవలసిన వారెవ్వరూ మిగలరు. విరోధి ఉండడు. వివేకంతో గ్రహించుమయ్య!
(ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునికి ముందే హితబోధచేశాడు. అరిషడ్వర్గాలనే అంతశ్శత్రుజయాన్ని సాధించవయ్యా! బహిశ్శత్రు జయంకంటే, ఇది శ్రేష్ఠమన్నాడు.)
నీ బుద్దిని నీవు వశపరచుకో, అపుడు కర్మవలన ఏర్పడిన కట్టుబాట్లన్నిటిని తెంచుకో, సమానమైన చూపుతో సంసారాన్ని విడిచిపుచ్చు. ఆపై మనస్సున హరిభక్తిని నిలుపుకో.
ప్రహ్లాదుని వచనానంతరం రాక్షసరాజైన ఆతని తండ్రి ఇలా అన్నాడు.
చావుకు తెగించినవాడవై 'చంపితే చస్తానని, అదరుబెదరు లేక పరుషవాక్యాలతో నన్ను పొడుస్తున్నావు. నా కోపాన్ని మరింత తీవ్రస్థాయికి ఎగదోస్తున్నావు.
ఓరీ దుర్భుద్ధిగలవాడా నాతో వాదులాడతావు. నా కంటె వేరుగా, ప్రాణిలోకానికి జగనాథుడు, సంపూర్ణ ప్రభావుడైన రాజు వేరొకడు లేడు. పూర్వం నా సోదరుని చంపినపుడు, ఆ నారాయణునికోసం పలు పర్యాయాలు ఈ విశ్వమంతా గాలించాను. వధించడానికి, ఎక్కడా వాడిజాడ లేదు. మరి ఈ విశ్వంలో వాడెక్కడుంటాడురా బుద్ధిలేనివాడా!
వాడు ఎక్కడ, ఎలా, ఏ రూపంతో ఉంటాడు? ఏ విధంగా వస్తాడు? వాడి బంటులాగా ఎక్కువగా వాగుతున్నావు. నిన్నూ నీ విష్ణుణ్జీ ఇద్దర్నీ చంపేస్తాను.
తండ్రిమాటకు తనయుడు కోపగించ లేదు. ప్రహ్లాదుడు మనస్సున హరిని స్మరించి, నమస్కరించి, శరీరం గగుర్చొడిచి విలసిల్లగా బాలలీలతో నాట్యం చేయడం మొదలుపెట్టి ఇట్లన్నాడు.
తండ్రీ ఈశ్వరునికై ఇక్కడా అక్కడా వెదకవలసిన పనిలేదు. అతడు సముద్రంలో ఉన్నాడు. గాలిలో ఉన్నాడు. ఆకాశంలో ఉన్నాడు. భూమిపై నున్నాడు. నిప్పులో, దిక్కులలో, పగళ్లలో, రాత్రులలో, సూర్యునిలో, చంద్రునిలో ఉన్నాడు. ఓంకారంలో, బ్రహ్మవిష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులలో, స్త్రీ పుం నపుంసకరూపములైన సమస్త వస్తుజాలంలో అంతటా ఉన్నాడు.
రాజా! చక్కగా విను. హరి, ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు-అనే సందేహం వద్దు. అతడు ఎక్కడెక్కడ వెదకితే అక్కడక్కడే ఉన్నాడు.
(భగవంతుడు సర్వవ్యాపి అయినా జిజ్ఞాసతో అన్వేషించే భక్తులకే కనిపిస్తాడు. అన్న సత్యం ఇందులో గోచరిస్తున్నది.)
అనీ ఈ విధంగా
ప్రహ్లాదుడు, 'హరి సృష్టిలోని అన్ని ఆకారాలలో ఉన్నాడు'. అని అంటే, హిరణ్యకశిపుడు తొందరపాటుతో 'లేడు లేడు' అంటూ కొడుకును భయపెడుతున్నాడు. ఆ సమయాన, విష్ణువుమాత్రం, అన్నిచోట్ల, స్థావర జంగమాల లోపల శ్రీ నరసింహుని రూపంలో, మిక్కిలి ప్రభావంతో కొలువై ఉన్నాడు.
ఆ సమయాన ఆ రాక్షసరాజు
అర్భకా! చాల తొందరపడుతూ హరి, అన్ని చోట్లా ఉంటాడంటున్నావు. అయితే, ఈ స్తంభంలో నీ చక్రినీ గిక్రినీ చూపగలవా?
స్తంభమున హరిని నీవు చూపలేకపోతే, నేను నీ తలను నరికి భూమిపై వేస్తాను. ఆ నరకబోయే సమయంలో నీ హరి, నిన్ను రక్షించడానికి నమ్మకంగా వస్తాడా? అతనికి ఆ శక్తి ఉందా?
తండ్రిమాటకు కొడుకు బదులు పల్కాడు.
బ్రహ్మదేవుడు మొదలుకొని గడ్దిపరకవరకు ఎల్లయెడల నిండి ఉండే ఆ ప్రాఢుడు, ఈ విశాలస్తంభంలో ఉండడా? స్తంభంలో ఉండి ఉంటాడనటానికి ఏ శంకా లేదు. నేడు అతడు తన స్వరూపంతో మాయలేకుండా ప్రత్యక్షంగా కనబడగలడు.
అని ప్రహ్లాదుడు పలికాడు. వెంటనే, హిరణ్యకశిపుడు గట్టిగా అరుస్తూ, గబుక్కున సింహాసనంనుండి కిందికి ఉరికి ఒరలోనున్న ఖడ్గాన్ని పైకి తీసి జళిపిస్తూ, భక్తశిఖామణి అయిన ప్రహ్లాదుణ్జి ధిక్కరిస్తూ
“వినరా మూర్ఖుడా! అర్భకుడా! గొప్పగా, 'హరి సర్వవ్యాపి' అని అంటావు. అయితే మరి ఈ స్తంభంలో ఉన్నాడా” - అంటూ, తన అరచేతితో, మదమెక్కిన పొగరుతో, ఉద్రేకంతో, భయంకరంగా వెలిగిపోతూ, చూపరుల కళ్లకు భయం గొలుపునట్లుగా రాక్షసరాజు, హరి ఆవిర్భవించబోయే స్తంభాన్ని తొందరగా గట్టిగా చరిచాడు.
ఈ విధంగా రాక్షసరాజు వైరంకారణంగా రోషానికి లోనై ఆ క్రోధాగ్నిలో వినయవిజ్ఞానాలు కాలిపోగా, చంచలమనస్కుడై తమోగుణం పైకొనగా హుంకరిస్తూ బాలుని ధిక్కరిస్తూ, 'హరిని ఇందు చూపు' మని మణిమయాలయిన కడియాలు క్రేంకారంచేస్తూ ఉండగా, దిగ్గజాల దంతాలను పగులగొట్టే శక్తిగల చేతితో సభామండపస్తంభ మొకదానిని మోదాడు. ఆ స్తంభంపై వేటుపడిన వెంటనే పదిదిక్కులలో అగ్నికణాలు చిందిపడగా, ఆ స్తంభం బ్రద్దలయింది. దానినుండి వెలువడిన ధ్వనులు, ప్రళయకాలం నాటి మేఘాలనుండి పుట్టె పిడుగుల పిండువలె ఎగసిపడి ఆకాశాన్నంతటిని నింపి, స్ధలం చాలక, బ్రహ్మాండాన్ని మొత్తం కదిలించి వేసింది. దానితో, బ్రహ్మ మొదలు ఎల్లదేవతలు, సకల చరాచరప్రకృతి చలించిపోగా బ్రహ్మాండమనెే గంగాళమే పగిలి దానినుండి నృసింహదేవుడు ఆవిర్భవించాడు.
అతడు వికసించిన తామరల జంటవంటి పాదాలతో, వాటిలోని చక్రం, ధనుస్సు, నాగలి లోనైన శుభరేఖలతో సుందరంగా ఉన్నాడు. ఆతని పాదం భూమిని సోకగానే, దానిభారం వహించే దిగ్గజాలు, ఆదిశేషుడు, కులపర్వతాలు, ఆదికూర్శం వంగిపోయాయి. ఆ అధిక భారానికి. ఆతడి తొడలు అమృతసముద్రం నుండి పుట్టిన ఐరావతపు తొండాలవలె ఘనంగా సుందరంగా ఉన్నాయి. ఆతని నడుము, ఘణఘణ మని ధ్వనించే గజ్జెలతో అలరారే, ఒడ్డాణంతో పీతాంబరశోభితమై ఉంది. దేవగంగా ప్రవాహానగల సుడివంటి, సుందరమగు లోతైన తామరపుష్పంగల నాభిరంధ్రం కలవాడు. ఆతని నడుము, కేవలం పిడికిట ఇమిడేదిగా సన్నగా శోభిస్తుంది అతడు కులపర్వతపు చరియవలె విశాలమైన వక్షఃస్థలంతో ఉన్నాడు. అతని గోళ్ళు, రాక్షససేన ధైర్యమనే తీగను తెగనరికే కొడవళ్ళు, రాక్షసరాజు వక్షఃస్థలమనే పొలం దున్నడానికి నాగళ్ళు. అయితే అవే, శరణాగతుల నయనచకోరాలకు వెన్నెల వెలుగులు. అవి వజ్రాయుధంవలె పదునైనవి గూడా.
ఆతడు, శంఖం, చక్రం, గద, ఖడ్గం మొదలయిన పెక్కు ఆయుధాలతో విలసిల్లే గడియలవంటి అనేక బాహువులతో ఒప్పుతున్నాడు. అతనిదేహం మీద మణిమయ మంజులహారాలు, భుజకీర్తులు, కడియాలు, కిరీటం, మకరకుండలాలు కాంతు లీనుతున్నాయి. ఆతని మెడ, మూడు ముడుతలతో పర్వత శిఖరసమానమై సుందరంగా ఉంది. కోపావేశంతోవణికే అతనిపెదవులు పారిజాతాల చిగుళ్ళవలె, అరుణవర్ణ శోభితాలు. అతనికోరలు, శరత్కాలమేఘాల మధ్య ధగధగమెరిసే మెరుపుతీగలు. అతని నాలుక, ప్రళయకాలాన సృష్టిని కబళించడానికి, ప్రళయాగ్నినుండి ఎగసిపడే జ్వాలామాలిక. అతని నోరు, ముక్కు రంధ్రాలు, మేరు, మందర పర్వతాల గుహల అంతర్బాగాలు, ఆతని ముక్కునుండి వెడలే ఊర్పులు, సప్తసాగరజలాలను మరిగిస్తున్నాయి. అతని కన్నులు, తూర్పుకొండపై వెలుగొందే సూర్యమండలంతో సమానమైన వెలుగులీనుతున్నాయి. అతని క్రీగంటి చూపులు, వాటినుండి బయల్వెడలే నిప్పుకణాలు, ఆకాశానగల నక్షత్రమండలాలను నిరోధిస్తున్నాయి. అతని కనుబొమలు, హరివిల్లువలె వంగి సుందరంగా భాసించగా, అతని ముఖం భయంకరంగానూ అతిసుందరంగాను ఉన్నది. అతని చెవులు నిశ్చలంగా ఎత్తుగా ఉన్నాయి. అతని జూలు, మందర పర్వతపు మథనతీవ్రత వలన ఎగసిపడే పాలసముద్రపు తరగల తుంపురులవలె మనోహరంగా ఉన్నాయి. అతని వెంట్రుకలు, చంద్రకిరణాలవల తెల్లగా ఉన్నాయి. అతని గర్జన, దిగ్గజాల చెవుల రంధ్రాలను హోరెత్తిస్తున్నాయి. శ్వేతపర్వతంవంటి పొడవైన, మిరుమిట్లు గొలిపే శరీర మతనిది. అతని దేహంనుండి వెల్వడే తెల్లని కాంతిపుంజాలు శత్రురాక్షస సమూహాల గర్వమనే చీకటిని పారదోలుతున్నాయి.
అతడు, ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి హిరణ్యకశిపుని శిక్షించడానికి కారణమైనా, ప్రహ్లాదునియందు కరుణరసంతోనూ, హిరణ్యకశిపునియందు వీరరసంతోనూ ప్రకాశిస్తున్నాడు. ఇంతటి ప్రభావంగల నృసింహస్వామి ఆవిర్భవించాడు.
(యాతుధానులు :వేదాలలో రాక్షసులకు 'యాతుధాను'లనే శబ్దం ప్రయోగింపబడింది. 'యాతు' అనే శబ్దానికి 'మాయావిద్య, శాంబరీవిద్య' అని పేరు. రాక్షసులు 'కామరూపులు', గనుక మాయా/శాంబరీ విద్యచే తమ కిష్టమైనరూపాన్ని ధరించేవారు. రామాయణంలో మారీచుడనే రాక్షసుడు/మాయావి, యాతు విద్యచే 'బంగారుజింక'గా మారడం యాతువిద్యా ప్రభావమే.)
చూస్తుంటే, ఆ ఆకారం, కేవలం నరునిది గాదు, అట్లని సింహానిదీ కాదు. రెండూ మేళవించి ఉన్నాయి. వాస్తవంగా ఇది విష్ణమాయా కల్పితం.
ప్రహ్లాదుడు తెగించి అన్నమాటలను, ధైర్యంగా నిరూపించడానికై విష్ణువు తన సర్వగతత్వాన్ని ఋజువు పరచుటకై ఈ స్తంభంలో, స్థిరంగా ప్రదర్శించడానికి, ఆ విధంగా నన్ను దండించడానికి వచ్చి ఉన్నాడు, నాకు చావు తప్పదు, అయినా, నా పెంపూ, సొాంపూ కనబడేటట్లు అందరి ముందు నేను శత్రువును ఎదిరించి పోరాడుతాను.
(రాక్షసులు విష్ణువుతో వైరం పెట్టుకున్నప్పుడు అతని వలననే మరణిస్తామని తెలిసినపుడు చివరి క్షణంవరకు కూడా తమ పరాక్రమాన్ని చూపి ఎదిరిస్తుంటారు తప్ప శరణాగతులు కారు.)
No comments:
Post a Comment