Wednesday, March 11, 2026

Parvati cursed King Chitraketu to be born as a demon (Asura) - చిత్రకేతుం డీశ్వరధిక్కారంబున గౌరిచే శాపమొందుట

చిత్రకేతుం డీశ్వరధిక్కారంబున గౌరిచే శాపమొందుట

ఇంద్రసమానరూపంతో చిత్రకేతువు విష్ణువును స్తుతిస్తూ మనసులో పద్మాక్షుడైన శ్రీహరిని సేవిస్తూ ఆనందిస్తూ; లోకాలన్నింటా కీర్తి గడిస్తూ యక్షులు, విద్యాధరులు, అప్సరఃకాంతలు తనను సేవిస్తూ, గానం చేస్తూ ఉండగా; కైలాసపర్వత ప్రాంతంలో పయనిస్తూ

విద్యాధర ప్రభువైన చిత్రకేతువు శంకరునివలె, మంచువలె, అమృతంవలె తెల్లని నవ్వులు చిందించేదీ; సంపదలతో కాంతిమంతమైనదీ; సేవచే అలసిన పార్వతీదేవికి అలసటను పోగొట్టేదీ; దేవతాసమూహానికి వికాసం కలిగించేదీ; మహాదేవుడైన ఈశ్వరుని చరణస్పర్శతో కూడినదీ; భూమండలంలో విరాజమానమైనదీ; ముల్లోకాలలో పవిత్రమైనదీ; అయిన కైలాస పర్వతాన్ని దర్శించాడు.

ఓ రాజా! ఆ వెండికొండపై బ్రహ్మాది దేవతలు కొలుస్తూ ఉండగా, నిండుసభలో పార్వతీసహితుడైన పరమేశ్వరుణ్ణి చిత్రకేతువు చూశాడు.

ఆ పరమేశ్వరుని కొలువుకూటంలో ఒకపక్క భగవంతుని యథార్థస్వరూపాన్ని తెలుసుకోలేక వేదాలు వాదించుకుంటున్నాయి. ఒకపక్క పరమశివుని దాక్షిణ్యవీక్షణంకోసం నిరీక్షిస్తూ బ్రహ్మాది దేవతలూ, సనకసనందనాది దేవర్షులూ స్తోత్రాలు చేస్తున్నారు. ఒకపక్క సదాశివుని సల్లాపాలు చెప్పుకుంటూ ప్రమథగణాలు ఆనందంతో కేకలు వేస్తున్నాయి. మరొకపక్క డమరుకం, మృదంగం మొదలైన వాద్యాల ఢమఢమ ధ్వనులతో భృంగి నాట్యం చేస్తున్నాడు. మరొకపక్క వింజామరలు వీస్తున్న సప్తమాతృకల మణికంకణ నిక్వణాలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా వెండికొండమీద పరమేశ్వరుని నిండు కొలువు కన్నులపండువు చేసింది.

(సప్తమాతృకలు: బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వారాహి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి.)

ఈ విధంగా బ్రహ్మాదిదేవతాసమూహం పరివేష్టించి సేవిస్తూ ఉండగా, తొడమీద కూర్చున్న పార్వతీదేవిని ఆదరంతో ఆలింగనం చేసుకొని నిండు కొలువులో ఉన్న శివుణ్ణి చూచి చిత్రకేతువు పకపకా నవ్వి పార్వతికి వినపడేలా ఇలా అన్నాడు.

అన్ని లోకాలకు పెద్దవాడై ధర్మరూపమే తానై ఉన్నవాడు పరమేశ్వరుడు. అంతులేని తపస్సుచేసి శిరోజాలు జడలు కట్టగా పెద్దలైన గొప్ప యోగులు, పరబ్రహ్మతత్త్వాన్ని గుర్తించినవారు కొలుస్తుండగా భాసిస్తున్న సభలో ఈ పరమేశ్వరుడు తన భార్యతో గూడి దంపతీరూపంగా సామాన్య మానవునివలె భార్యపై ప్రేమతో సిగ్గువిడిచి లాలింపబడుతున్నాడు. అయ్యో! లౌకిక మానవుడు కూడా ఏకాంతంలో మాత్రమే తన భార్యలతో కలసి ఉంటాడు తప్ప ఇలా ధర్మసభలలో భ్రాంతితో ఇలా ప్రవర్తించడు.

ఓ మహారాజా! చిత్రకేతువుయొక్క పరిహాసవచనాలను వినికూడా పరమేశ్వరుడు ఏమీ అనకుండా చిన్ననవ్వు నవ్వాడు. ఆ సభలోని వారంతా ఈ విషయం చూచి మౌనం వహించారు. ఈశుడు ఇంత జరిగినా ఏమీ అనక ధైర్యంగా ఉన్నాడంటే పరమేశ్వరుని ధెర్యంయొక్క మహిమ ఎంత గొప్పదో కదా!

ఈ విధంగా తన పూర్వ కర్మవల్ల తానే సర్వేంద్రియాలనూ జయించాను అనుకోవడంవలన కలిగిన అహంకారంతో చిత్రకేతువు జగద్గురువైన పరమేశ్వరుణ్ణి గురించి పరుషపు మాటలు మాట్లాడాడు. అలా మాట్లాడుతున్న చిత్రకేతువును జూచి పార్వతి ఇలా అన్నది.

మావంటి సిగ్గుమాలినవారినీ, మతిమాలినవారినీ ఆక్షేపించడానికి, ఆజ్ఞాపించడానికి నేర్పరి అయిన యముడా ఈ చిత్రకేతువు?

(పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరస్వరూపులు. పరమేశ్వరుడున్నచోట పార్వతి ఉండి తీరుతుంది. మావంటి సిగ్గుమాలినవారని పార్వతి అన్న మాటలో అర్థం మేము అర్ధనారీశ్వర స్వరూపం గలవారమని తెలియజేయడం. వీడు యముడా అన్నమాటలో యముని పరమేశ్వరుడు తన ఎడమకాలితో తన్ని తరిమినాడని, యముడే నిలబడలేకపోతే చిత్రకేతువు ఎలా నిలబడగలడనే అర్ధం ధ్వనిస్తుంది.)

ఉపనిషద్రహస్యాలు ఎరిగినవారూ, యోగమార్గశ్రేష్ఠులూ అయిన భృగు నారద కపిలాదులు త్రిగుణాలకు అందని మహేశ్వరుణ్ణి చూచి నవ్వి ఎరుగరు. వారు ధర్మమార్గమెరుగరా?!

సర్వేశ్వరుడు, పాపసంహారుడు, శాశ్వతమైన ఐశ్వర్యం గలవాడు, ఆత్మారాముడు, ఈశ్వరుడు అయిన ఈ మహాత్ముడు సామాన్యుడు గాడు. ఈయన పదపద్మములకు ఇంద్రాది దేవతలు నమస్కరించడంవల్ల వాళ్ళ కిరీటాల నీడ స్వామి పాదాలపై పడుతూ ఉంటుంది. బ్రహ్మాది యోగుల మానసాలలో ఈయన తత్త్వం ఓలలాడుతూ ఉంటుంది. ఈయన రూపాన్ని స్పష్టంగా తెలిసికోలేక వేదాలు వాదాలు మానుకుంటాయి. ఈయన దయ, లోకాలన్నింటికీ తృప్తిని కలిగించి ధన్యత చేకూరుస్తుంది. ఇటువంటి పరమేశ్వరుణ్ణి నిందించిన ఈ చిత్రకేతువనే పాపాత్ముడు అన్నివిధాలా దండనకు అర్హుడు. అతడు దండన నుండి తప్పించుకోలేడు.

విష్ణుమూర్తి పదపద్మ అర్చనం అన్ని లోకాలవారూ చేయదగింది. అది సమస్త సుఖాలనూ కలిగిస్తుంది. సకల శుభాలకూ మూలకారణం. సత్పురుషులు సేవించేది. అటువంటి స్వామి పదార్చన చేయడానికి దుర్మార్గుడైన ఈ చిత్రకేతువు తగినవాడా?!

కాబట్టి ఓ దుష్టుడా! నీవు చేసిన ఈ పాపం కారణంగా పాపస్వరూపుడైన రాక్షసుడవై జన్మించు అని శపించింది పార్వతీదేవి. ఇకపై మహాత్ముల విషయంలో దోషాలు ఆచరింపకు అని హెచ్చరించింది. చిత్రకేతుడు విమానం దిగి వచ్చాడు. పార్వతీదేవికి సాష్టాంగనమస్కారం చేశాడు. చేతులు జోడించి ఇలా అన్నాడు - ఓ లోకమాతా! నీవిచ్చిన శాపాన్ని స్వీకరిస్తున్నాను. గతంలో చేసిన కర్మలఫలంగా ప్రాప్తించిన సంసారం అనే చక్రంలో అజ్ఞానంవల్ల మోహాన్ని పొంది తిరిగే జీవులకు సుఖదుఃఖాలు సహజంగా కలుగుతాయి. అస్వతంత్రులైన వారు తమ సుఖదుఃఖాలకు కర్తలు కారు. శాపానుగ్రహాలు, స్వర్గనరకాలు, సుఖదుఃఖాలు సమానమైనవే. పరమాత్మ తన మాయతో ఈ లోకాలను సృష్టిస్తూ ఉంటాడు.

వారిలో వారికి అనుబంధాలు, అనురాగాలు కలగజేస్తాడు కాని పరమాత్మ మాత్రం ఆ మాయకు లోనుగాడు. అతడు నిష్కలుడై దేనినీ అంటకుండా ఉంటాడు. ఇలా జన్మించే మానవులకు భార్య ఎవరు? బంధువెవరు? శత్రువు ఎవరు? మైత్రి ఎక్కడిది? సేవాభావం ఎక్కడిది? ఇవన్నీ వారి వారి కర్మానుసారంగా పరమేశ్వరుడు కల్పిస్తూ అన్ని జీవుల ఎడల సమభావంతో ఉంటాడు. పరమేశ్వరునికి సుఖదుఃఖాలకు సంబంధించిన అనురాగంగాని రాగానికి అనుబంధంగా ఉండే  రోషంగాని ఉండవు. భగవంతుని మాయాగుణంవల్ల జంతువులకు, జీవులకు సుఖదుఃఖాలు, బంధమోక్షాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి నీకు నమస్కరిస్తున్న నన్ను దయచూడు. నీవు శపించావనే భయం నాకు లేదు. అఖిల లోకాలకూ జననివైన నిన్ను పరుషంగా మాట్లాడినందులకే భయపడుతున్నాను అని సాష్టాంగ నమస్కారాలు చేసి చిత్రకేతువు పార్వతీపరమేశ్వరులను ప్రసన్నం చేసికొని తన విమానం ఎక్కి వెళ్ళిపోయాడు.

అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతలు, రాక్షసులు, ప్రమథులు వింటూ ఉండగా పార్వతీదేవితో ఇలా అన్నాడు. పార్వతీ! శ్రీమన్నారాయణునియొక్క దాసులు, ఆ దాసుల దాసులు ఎంత నిర్లిప్తంగా ఉపేక్షాభావంతో ఉంటారో గమనించావు కదా! నిరంతరం అంతటా హరిదర్శనం చేసేవారు ఇలాగే ప్రపంచ విషయాలపై నిరాసక్తంగానే ఉంటారు. వారికి స్వర్గం, మోక్షం, నరకం అనే తేడాలు ఉండవు. పరమాత్మయొక్క లీల ఆధారంగా దేహధారులకు సుఖదుఃఖాలు మొదలైన ద్వంద్వాలు అజ్ఞానంవల్ల కలుగుతాయి. ఇటువంటి భేదభావాలు విష్ణు భక్తి గలవారికి కలుగవు. అంతేగాదు

పరమేశ్వరుడనైన నేను, కుమారస్వామి, నారదుడు, బ్రహ్మ, దేవతాబ్బందం, ఘనయోగులు, మౌని సముదాయం, ఇలా మేమందరం దానవవిరోధి అయిన విష్ణుమూర్తి అంశతో జన్మించినవారమే. అయినా మాకు గొప్ప గర్వం ఉన్న కారణంగా ఆ విష్ణుమూర్తినిగాని, ఆ విష్ణుతత్త్వాన్నిగాని తెలుసుకోలేకపోతున్నాము.

ఓ పార్వతీ! ఆదిపురుషుడు, ఒకే ఒక్కడు అయిన విష్ణుపరమాత్మ సమస్తప్రపంచం తానై నిండి ఉంటాడు. అందరికీ అంతరాత్మ అయి ఉంటాడు. అతడు సర్వజీవులకూ ప్రియుడు. ఏవిధంగా చూచినా ఆ పరమాత్మకు ఒకడు ప్రియుడని, ఒకడు అప్రియుడని భేదం ఉండదు.

ఓ పార్వతీ! చిత్రకేతుడనే ఈ విద్యాధర రాజు శాంతచిత్తుడు. లోకాలను సమదృష్టితో చూచేవాడు. విష్ణుభక్తియుతుడు. వేయి మాటలెందుకు. పార్వతీ! అతనిని గూర్చి (చిత్రకేతునిగూర్చి) చెప్పేదేమున్నది! పరమేశ్వరుడనైన నేను సైతం విష్ణుప్రియుడను సుమా!

విష్ణుభక్తుల ఆలోచన క్రమానికి ఆశ్చర్యపడనవసరం లేదు. ఈ భవ్యచరిత గలవారు గొప్ప బుద్ధివైభవంతో శాంతమైన స్వభావం గలిగినవారు, పవిత్ర పరతత్త్వ జ్ఞాననిపుణులు అయి ఉంటారు.

ఈశ్వరుని మాటలు విని పర్వత రాజపుత్రి ఆశ్చర్యం నుండి తేరుకొని, ప్రశాంతచిత్తం పొందింది. ఆ విధంగా పరమ భాగవతుడైన చిత్రకేతుడు పార్వతీదేవికి తిరిగి శాపం ఇచ్చే సామర్ధ్యం ఉన్నవాడైనప్పటికి తిరిగి శపింపక శాంతం వహించి పార్వతీదేవి శాపాన్ని తలదాల్చడు. ఇటువంటి మంచి లక్షణాలు నారాయణ భక్తి పరాయణులకు మాత్రమే లభిస్తాయి తప్ప ఇతరులకు లభిస్తాయా! లభించవు. ఈ విధంగా శాపం పొందిన చిత్రకేతుడు త్వష్ట చేసే యజ్ఞంలో దక్షిణాగ్నినుండి జనించి రాక్షసుడై వృత్రాసురుడనే పేరుతో విఖ్యాతి పొంది భగవంతునికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాడు కాబట్టి 

ఓ రాజా! ఈ వృత్రాసురునకు రాక్షసాకారం కలిగిన పూర్వ వృత్తాంతాన్ని, ఎంతో పుణ్యాత్ముడైన చిత్రకేతుని గొప్పదనాన్ని భక్తితో విన్నవారికి, చదివినవారికి, సకలదుష్కర్మలు నశిస్తాయి. సకల వైభవాలు సమకూరుతాయి. కోర్కెలు వాటంతట అవే తీరుతూ ఉండగా వారు నిర్మలాత్ములై, నిత్య సత్య జ్ఞానపరాయణులై, పాపాలు నశించిపోగా బంధువులతో, స్నేహితులతో, కొడుకులతో, మనుమలతో సుఖాన్ని అనుభవిస్తారు.

No comments:

Post a Comment