పై విధంగా చెప్పి విష్ణువు మాయమైనాడు. పార్వతీసమేతుడైన శివుడు 'హరి ఎక్కడకు వెళ్ళినాడో! ఎక్కడ ఉన్నాడో!” అనుకుంటూ పదిదిక్కులా అంతటా చూస్తుండగా తన (శివుని) ఎదుట.
ఒక ఉద్యానవనంలోని చెట్లవరుసలో ఒకానొక చెట్టునీడలో, స్తనకలశాలపైనగల పైట తొలగిపోగా, కొప్పుముడి కదలాడగా, నొసటిపై ముంగురులగుంపులు ముసురుకొనగా, ఉన్నదా లేదా అని సందేహించేటట్లున్న నడుము కదలాడగా, చెక్కిళ్లపై చెవులకమ్మల వెలుగులు చిందులాడగా, పిరుదుల బరువుతో అడుగులు తొట్రుపడగా, చూపుల వెలుగుల గుంపులు దిక్కులను కప్పివేయగా, జారిపోయిన చీర ఎడమచేతితో పట్టుకొని, బంగారు అందియల జంట గలగలమని శబ్దించగా, చేతిగాజుల ఝణఝణమనే శబ్దాలు అతిశయిల్లగా, పుట్టచెండుతో ఆడుకొంటూ ఉన్న చెలువను చూచెను.
(శివుడు దర్శించిన మోహినీరూపం తీరిచిదిద్ది అలంకరించుకొన్న రూపం కాదు. బంతి ఆటలో చెదరిన సహజ సుందరరూపం.)
ఆ విధంగా చూచి అదివరకే మగువవలపుతో సగమయిన శివుడు ఆ మగువ ప్రాయమూ, అందమూ, స్వభావమూ, విలాసాలూ తనను బాగా ఆకట్టుకొనగా గుడ్లప్పగించి ఎడతెరపి లేకుండ చూచి మెత్తబడిన చిత్తంతో
'ఈ కనిపించే అన్నులమిన్న ఎవరిదోకదా! ఈ అందమైన నెలతను మునుపు ఏ కల్పంలోనూ చూడలేదు. ఈమెను బ్రహ్మ సృష్టించలేదనడం నిజం. ఇల్లాలుగా ఈ వయ్యారిని పొందగలిగే అదృష్టవంతుడెవడో! విహారాలకు నా కీ చెలువ లభిస్తుందా!' అనుకొన్నాడు శివుడు.
ఈ ప్రకారంగా మన్మథుని బాణాలు హద్దుదాటి వేటాడగా (కామహారి అనే) శివుని పెద్దబిరుదు వ్యర్థమై పోయేటట్లు మోహిని ముడిచిన కొప్పుముడి ఊడిపోయింది. కురులు భుజాలపైన మెడలపైన చెల్లా చెదరయి కదలాడినాయి. ఆమె నొసటి మీది కస్తూరిబొట్టు కరిగిపోయింది. అందమైన మోమువెలుగులు అన్ని దిక్కుల ప్రసరించాయి. చిరునవ్వులు చిందులాడుతున్నాయి. లేత చెమటలతో తొట్రుపడుతూ పులకలు మొలకలెత్తినాయి. మనసునకు ముదాన్ని కలిగించే బంతిని అందమైన చేతులతో అందుకొన్నది. ఆ బంతిని ఎదకు ఆనించుకుంది, చెక్కిలిపై చేర్చుకుంది, చిబుకానికి తాకించుకుంది, చనుమొనలపై అదిమి పట్టుకుంది, గోరులతో మీటింది. అందమైన చేతులలోని మెల్లమెల్లగా కదలాడే మేలిమి బంగారుకంకణాలు ఝణఝణ ధ్వని చేయగా కుచకలశాలు ఒకదానితో ఒకటి ఒరుసుకొనగా కుడి ఎడమలకు త్రుళ్లిపడేటట్లు చెండును ఒయ్యారంగా పైకెగురవేసింది. తనకు తానే చిన్ని చిన్ని పందాలు కట్టింది. సన్నని నడుము కదలాడేటట్లు మెడలోని హారాలు చిక్కుపడేటట్లు తిరుగులాడింది. అలా సంచరించేటప్పుడు చెవుల కమ్మల వెలుగులు చెక్కిళ్లపై చిందులాడినాయి. ఆమె గుండ్రంగా తిరుగుతూ పుట్టచెండును పట్టుకొని పక్కలకు కదలుతోంది. అప్పుడు ఆమె పైటచెంగు జారిపోయింది. ఒడ్డాణంలోని బంగారు చిరుగంటలు మ్రోగినాయి. కాలిఅందెలు గల్లుగల్లుమన్నాయి. చేతిమురువుల రతనాలు తళుక్కుమన్నాయి. ఆమె వెనువెంట పరుగెత్తి బంతిని పట్టుకొంటూ, పట్టుకొన్న బంతిని నేలపై చరస్తూ, అది పై కెగిరినపుడు రెండు చేతులూ చేర్చి చాలసార్లు కొట్టుకున్నది. బంతి ఎగిరేటప్పుడు, పడేటప్పుడు పొడవైన వలలు వేసి లాగుతున్నట్లు సోగచూపులు వ్యాపింపచేస్తున్నది. చెండును కొడుతూ ఒకటినుండి వేయిదాకా నేర్పుతో లెక్కపెడుతోంది. మోహిని ఎర్రతామరలవంటి తన కాలి ఎర్రనివెలుగులతో తూరుపుకొండపైని సూరీడును గుర్తుకు చేస్తుంది. అందమైన ఆమె మోము చందురుని వెన్నెల వెలుగులతో చంద్రమండలాలను కల్పిస్తుంది. అప్పుడప్పుడు కుచకలశాల మిట్టపల్లాలనుండి జారిపోయిన పైటకొంగును సరిచేసుకుంటున్నది. చెక్కిళ్ళపై చిందే చెమటబొట్లను కొనగోళ్లతో ఎగజిమ్ముతున్నది. ఎర్రని పెదవిని దొండపండుగా భ్రమించి వచ్చిన రాచిలుకలను అదలిస్తున్నది. పద్మం వంటి ముఖంలోని పరిమళాలకోసం మూగిన కొదమ తుమ్మెదలను అదలిస్తున్నది. అందమైన మందగమనం నేర్చుకోవటానికి వచ్చిన రాజహంసల జంటను గెంటుతున్నది. సోగచూపులకోసం ముచ్చటపడి వచ్చిన నెమళ్లజంటలకు దూరంగా వెళుతున్నది. పొదరిండ్ల దగ్గరకు వెళ్లకుండ చిగురులవంటి చేతులకు మనసుపడి వచ్చిన కోయిలజంటలకు దూరమౌతోంది. తీగల ఉయ్యాలపై ఊగుతూ పూల గురివెంద గుబురులపై ఎక్కుతూ, పుప్పొడి గుట్టలను దాటుతూ, మకరందాల మడుగులు గడుస్తూ, క్రీడా పర్వతాలపై విహరిస్తూ, చిగురుటాకుల పీటలపై సేదతీర్చుకుంటూ, తీగ ఇండ్లలో దాగుడు మూతలాడుతూ, మొగలిబోదెలకు ఆనుకొంటూ, పూలరేకుల గవాక్షాలలో తొంగిచూస్తూ, మెట్టతామరల మొక్కలను తాకుతూ, సంపెంగ పొదలగడపలలో నిలబడుతూ, అరటాకుల ద్వారాలు తెరుస్తూ, కమ్మ పుప్పొడి బొమ్మలను బుజ్జగిస్తూ, రతనాలబాటలపై విహరిస్తూ, చలువరాతి తిన్నియలను సమీపిస్తూ, రత్న పంజరాలలోని గోరువంకలకు పలుకులు నేర్పుతూ, ఇచ్చవచ్చిన దానిని చూస్తూ, చూచిన దానిని మెచ్చుకుంటూ, మెచ్చుకొన్న దానిపై అచ్చెరువు కనబరుస్తూ, మైమరుస్తూ, మైమరపిస్తూ, ఆ వాల్గంటి ఒంటరిగా ఆ తోటలో అంతులేని అందచందాలతో జగన్నోహినియై విహారం సాగించింది.
మోహిని వాలుచూపులపదనుచేత శంకరుని ధైర్యం సడలిపోయింది. అతడు తనను తాను మరచినాడు. తన అనుచరులనూ మరచినాడు. చివరకు 'అర్ధాంగి'ని కూడా మరచిపోయినాడు.
(వాలుంగంటి= కత్తిలావాడియైన కన్నులు కలది. పదునైన చూపులు కత్తిలాంటి కన్నులకుంటాయి. మోహిని జంటవాలుగంటి కాగా శివుడు ముమ్మొనవాలుకాడు. అంటే త్రిశూలం కలవాడు. కనుకనే పద్యంలో 'శూలి' అనే పదం ప్రయోగించబడింది. జంటవాలుగంటి పదును చూపులకు ముమ్మొనవాలుకాని (శూలి) ధైర్యం కోలుపోయిందన్నమాట. మోహిని చూపులయొక్క గొప్పదనం చెప్పబడిందిక్కడ. 'వాలుగంటి', 'శూలి' పదాలు సాభిప్రాయ ప్రయోగాలు. ఇది సర్వతః ప్రాసపద్యం. ప్రాస అంటేకూడా కత్తి అని అర్థం. (జంట) వాలుగంటి, శూలి (ముమ్మొనవాలుకాడు) ఇవన్నీ కత్తులకు అంటే ప్రాసలకు సంబంధించిన పదాలు. అందుకే ఇది సర్వతః ప్రాస పద్యం. పోతనగారి ప్రాసక్రీడావిలాసాలకు ఉదాహరించదగ్గ పద్యాలలో ఈ ఆటవెలది ఒకటి.)
ఆ సమయాన, మోహిని బంతిని ఎగురవేసింది. దానిని పట్టుకోవడానికి వ్యవధానం లేకపోవటంచే అది చేతికి చిక్కక జారిపోయింది. దానిని తీసుకోవడానికి వస్తుండగా గాలి తాకిడికి ఆమె చీర ఊడిపోయింది. అప్పుడు శివుని మనస్సు కంపించిపోయింది.
కడగంటి కాంతులదానిని, చీరకట్టుకొనడానికి ప్రయత్నిస్తున్న దానిని, చనులబరువుతో వంగినదానిని, రెండు చేతులతో దాచుకొన్న అంగం కలదానిని, కొప్పుముడి వీడి వ్రేలాడుతున్నదానిని, ఆ మోహినిని చూచి శివుడు కామావేశంతో చలించినాడు. సిగ్గుపడి తన భార్య చూస్తున్నా కూడా చందురునివంటి మోముగల ఆ మోహిని కేలుదామరను పట్టుకోవడానికి ముందుకు వెల్లినాడు.
అడుగుదూరంలో సమీపిస్తున్న శివుని చూచింది మోహిని. చీర ఊడి పడిపోయిన సిగ్గుతో నవ్వుతూ చెట్లచాటున దాగింది. ముక్కంటి ఆ వాల్గంటి వెంటపడినాడు.
యౌవనంలో ఉన్న ఆడుఏనుగును కామోద్రేకంతో చేరవచ్చు మదించిన మగఏనుగువలె, శివుడు మోహినివెంటపడి 'బేలా! పోవద్దు, పోవద్దు' అంటూ దగ్గరకు పరుగెత్తి తనచేతితో ఆమె కొప్పును పట్టుకొని, ఆత్రంతో కౌగిలించుకొని రతిక్రీడకు పూనుకోబోయినాడు. మోహిని శివుని కౌగిలినుండి వదలించుకొని
మోహిని జడకట్టువీడి (ఆమె) వీపుపై వ్రేలాడు తున్నది. పిరుదుల బరువు వలన అలసిపోతూ ఉన్నది. మరల మరల కవ్వింపుగా వెనుదిరిగి చూస్తున్నది. విభ్రమాలు ప్రదర్శించే జగన్నోహినివెంట ఆడఏనుగు వెంట మగమదపుటేనుగు వలె శివుడు పరుగెత్తినాడు. అది - మన్మథుడు మరల శివుని జయించెనా అనిపించింది. అలా పరుగెత్తుతూ కొండలు అడవులు, సెలయేరులు, సరస్సులు దాటి వెళ్లునపుడు శివుని అమోఘమైన వీర్యం స్ఖలనమై నేలపై పడింది. అది పడిన తావెల్లా భూమిపై వెండీ బంగారం అయింది. వీర్యం పతనమైన వెంటనే శివుడు తనంతకు తాను తెలివి తెచ్చుకున్నాడు. ఇదంతా విష్ణుదేవుని మాయవలన కలిగిన మోహమని గ్రహించినాడు.
జగదాత్మకుడయిన శివుడు తన మహిమవల్ల విష్ణమాయను తెలుసుకొని వెనుదిరిగినాడు. హరికూడా సిగ్గువిడిచినవాడై స్త్రీ రూపాన్ని విడిచిపెట్టి మగవాడుగ మారిపోయినాడు.
(మోహినీ రూపంలో స్త్రీ సహజమైన సిగ్గుకూడా హరికి ఉండేది. మోహినీ రూపంతో పాటు ఆ సిగ్గునుకూడా హరి వదలినాడు. పరమపురుషుడు నిర్వికారుడు కదా!)
మదనుని జయించవచ్చు. యముడిని ధిక్కరించవచ్చు. మృత్యుంజయుడు కావచ్చు. కానీ ఆడువారి చూపులు అనే బాణాలను జయించడం త్రిపురవైరి అయిన శివునికికూడా సాధ్యం కాదు.
ఈ విధంగా మోహినీరూపాన్ని చాలించిన విష్ణువు శివునితో ఇలా అన్నాడు.
'సకలదైవత శ్రేష్ఠా! నీవొక్కడవు తప్ప నా మాయను ఇంకెవ్వడు తెలుసుకొనలేదు. మోహినీరూపాన్ని ధరించిన నామాయలోపడి మోసపోక ధైర్యంతో పొరపాటును తెలుసుకున్నావు. ఈ మాయ కాలస్వరూపమై కాలంతోపాటు నాయందు అధివసించి ఉంటుంది. ఈ మాయ నన్ను గెలువలేదు. అల్పజ్ఞులు తెలుసుకొనలేని నామాయను నీవు తెలుసుకున్నావు' అంటూ విష్ణువు శివుని గౌరవించినాడు. స్నేహభావంతో శివుడు సంతోషించి సతీదేవితో ప్రమథగణాల సేవలందుకొంటూ తన నివాసానికి వెళ్ళినాడు.
ఓ పరీక్షిన్మహారాజా! పాలసముద్రాన్ని చిలికేటప్పుడు కుంగిపోతున్న మందర పర్వతాన్ని మోసి చక్కగా నిలబెట్టేందుకు కూర్మరూపం ధరించిన విష్ణులీలలను కీర్తించినా, విన్నా శ్రేయస్సు కలుగుతుంది. సంసారసముద్రంలో మునిగి ఉండి పాపంతో బతుకుతున్న జనాలు కూర్మావతార విశేషాలు వినినా, కీర్తించినా చక్కని మేలును సౌఖ్యాన్ని పొందుతారు.
వికాసవంతమైన సుందరి(మోహిని) రూపంతో రాక్షసులను మోసగించి(మోహించి) ఆపదలతో వణకిపోతున్న దేవతలకు(శ్రీహరి) చక్కని పద్ధతిలో అమృతాన్ని పంచాడు. స్వచ్చమైన శరీర సౌష్టవంతో, దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ లీలామోహినీ అవతారాన్ని ధరించిన శ్రీపతిని పాపపు చీకట్లను రూపుమాపే సూర్యుని స్వరూపంగా భావించి హృదయంలో స్మరిస్తాను నమస్కరిస్తాను.
No comments:
Post a Comment