Saturday, March 7, 2026

The discussion between Vishnu’s messengers (Vishnudutas) and Yama’s messengers (Yamadutas)- విష్ణుదూత యమదూతల సంవాదము

విష్ణుదూత యమదూతల సంవాదము

విష్ణుసేవకులచే నిరోధింపబడిన యముని బంటులు వారితో ఇలా పలికారు.

ఎవరు మీరు? ఈ విధంగా కర్తవ్య నిర్వహణలో ఉన్న మమ్మల్ని అడ్డగించి మా వశమైన ఈ ప్రాణిని కాపాడుతున్నారు. ఇక ఈ లోకంలో యముని శాసనాలు నవ్వులపాలు కావలసిందేనా?

అది మాత్రమే కాకుండా...

అయ్యా! అద్భుతరూపులై, తమ్మిరేకులవంటి కన్నులతో, శ్రేష్ఠమైన పీతాంబరాలతో, చెక్కిళ్ళపై కదులుతున్న కుండలాలతో, ప్రకాశవంతమైన కిరీటాలతో, పద్మాలదండలతో కూడిన విశాలమైన వక్షఃస్థలంతో, నిత్యయౌవనంతో, రత్నాలుతాపిన భుజకీర్తులతో చతుర్భుజులు, నీల మేఘశ్యాములు అయిన మీరు ఎవరో తెలియజేయండి.

పద్మ, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, ధనుర్బాణాది ఆయుధాలను కలిగిన మీ శరీరాలు లోకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

శాంత స్వరూపంతో ఒప్పే మీ శరీరకాంతులు సర్వలోకాల్లో అన్ని దిక్కులయందు అలముకున్న దట్టమైన చీకట్లను పోగొడుతూ ప్రకాశవంతమైన వెలుగుతో మాకు ఆనందాన్ని కలిగించాయి.

లోకాలన్నింటికి ఆనందం కలిగించే సుందర విగ్రహాలు కలవారు, చూడడానికి సాధ్యంకాని తేజస్సుతో విరాజిల్లుతున్న వారు, సర్వధర్మాలను పాటించేవారు అయిన మీరు యమధర్మరాజు దూతలమైన మమ్ములను అడ్డగించడానికి కారణమేమిటని ప్రశ్నించిన యమదూతలను చూచి చిరునవ్వు చిందుతున్న ముఖారవిందాలు కలవారై గోవిందుని దూతలు మేఘగంభీర భాషణాలతో ఇలా అన్నారు.

మీరు ధర్మపరిపాలన బద్దుడైన యముని భటులు అయితే, ఈతని నివాసమెక్కడో, పుణ్య, పాప స్వభావాలు ఏమిటో మాకు తెలియజేయండి. లోకంలో సర్వప్రాణులు శిక్షార్హులేనా? లేక పాపజీవులు మాత్రమేనా అనేది వివరించండి.

అని పలికిన విష్ణుదూతలతో యమభటులు ఈ విధంగా పలికారు.

సృష్టి ప్రారంభంనుండి వేదం నారాయణ స్వరూపంగా విశ్వసింపబడింది. అట్టి వేద బోధితమైనది ధర్మమనీ, దానికి విరుద్ధమైనది అధర్మమని తెలియజేయబడింది.

శ్రీమన్నారాయణుని సంకల్పబలంచేత సృష్టి కార్యక్రమం ప్రారంభమై సత్త్వరజస్తమోగుణాలతో కూడిన జీవులు జన్మించాయి. ఇవి తమకు అనుకూలమైన నామ, గుణ రూప భేదాలచే వేరు చేయబడి కర్మలను ఆచరిస్తాయి. ఈ జీవుల కర్మలకు సాక్షులుగా పంచభూతాలు, సూర్యచంద్రులు, రాత్రింబవళ్ళు, కాలం మొదలైనవి ఉన్నాయి. వారి సాక్ష్యాలను అనుసరించి జీవులకు శిక్షలు అమలు జరుగుతాయి.

జీవుడు తనకు ఇష్టమైన విధంగా పుణ్యపాపకర్మలు చేస్తాడు. ఆ కర్మల ననుసరించి శుభాలుగాని, అశుభాలుగాని ప్రాప్తిస్తూ ఉంటాయి. ఆలోచించి చూస్తే దేహధారులకు సత్త్వరజస్తమోగుణాల సంపర్కం తప్పదు. అందువల్ల దేహి అయిన ప్రతి జీవీ కర్మాచరణ తప్పక చేయవలసిందే!

జీవుడు ఇప్పటి జన్మలలో చేసిన కర్మల పాప, పుణ్యాలను ఆధారంగా చేసుకొని, తరువాతి జన్మలలో అందుకు తగిన రూపాలు పొందుతాడు. ఈ జన్మ కర్మ ఫలితాలను మరుసటి జన్మలలో తప్పక అనుభవిస్తాడు.

ఇంకా వినండి. సత్త్వరజస్తమోగుణాలలో ఒక్కదానిప్రభావంవల్ల జన్మించినజీవులు సాత్త్వికులు, రాజసులు, తామసులు అని పిలువబడతారు. మొదటివారు ధర్మాచరణపరులై సుఖాలు అనుభవిన్తారు. రెండవ వారు అహంకారపూరితులై ధర్మాధర్మాలను ఆచరిస్తూ సుఖదుఃఖాలు రెంటిని అనుభవిస్తారు. మూడవవారు ఘోరబుద్ధి కలిగి అధర్మపరులై కష్టాలపాలౌతారు. వారి వారి ప్రవర్తనల కనుకూలమైన జన్మలే తదనంతరం వారికి ప్రాప్తిస్తాయి.

సమవర్తి అయిన యముడు సర్వప్రాణులలో అంతరాత్మరూపంలో ఉండి, వారివారిగుణాలకు, కార్యాలకు అంతస్సాక్షిగా ఉండి, వారి ప్రవృత్తులకు ప్రేరణ కల్పిస్తాడు. అజ్ఞానులు తమోగుణప్రధానులై దేహాత్మభావం పొంది ఉంటారు. పూర్వస్మృతిని కోల్పోయి కర్మేంద్రియాలతో పాపకర్మలు చేస్తూ, జ్ఞానేంద్రియాలవలన విషయలంపటులై వాగ్రూపమైన, మానసికమైన, శారీరకమైన పనులు చేస్తుంటారు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు తన్మాత్ర పంచకాలతో గూడి, మనసుతో కలిపి తాను పదిహేడవ వాడయి ఉపాధి సంబంధం కలిగి, సంసారబద్దుడై కొట్టుమిట్టాడుతుంటాడు. పైన చెప్పిన పదహారు అంశాలతో కూడిన జీవుడు సత్త్వగుణం కలవాడైతే హర్షాన్ని రజోగుణంగలవాడైతే శోకాన్ని తమోగుణంగలవాడైతే భయాదులను పొందుతాడు.

అరిషడ్వర్గాన్ని జయించలేక కర్మ సంసారబంధకారణమని తెలిసికూడా, పూర్వజన్మవాసనల కారణంగా ఆయా కర్మలను చేస్తుంటాడు. ఆ కారణంగా పట్టుపురుగు తాను అల్లుకున్న గూటిలో చిక్కుకొని, బయటకు రాలేని విధంగా సంసారజాలంలో చిక్కుకుంటాడు.

ప్రస్తుత వసంతకాలంలోని ఫల, పుష్ప భరితమైన వృక్ష లతాదులను చూచి, భూతకాలంలోను, భావికాలంలోను వాటి స్థితిగతులను ఊహించవచ్చు. అలాగే జీవి ఇప్పటిజన్మలోని నడవడికనుబట్టి భూతకాలంలోని గుణశీలాలు ఎలాంటివో, భావికాలంలో ఎలా ఉండబోతాయో ఊహించవచ్చు.

ఏ ప్రాణి అయినా సరే తనకు విధించిన పనులను చేయకుండా ఉండటం సాధ్యం కాదు. వాసనాబలాన్ని బట్టి ఆ యా గుణాలు ఏర్పడతాయి. ఆ గుణాలకు అనుగుణంగానే జీవుడు కర్మలు తప్పక చేయవలసి ఉంటుంది. అవ్యక్తమైన ఆ వాసనాహేతువుచే ఏర్పడినగుణాలవల్ల జీవి బద్దుడవుతాడు కాబట్టి బలవంతంగానైనా కర్మలు చేస్తూ ఉంటాడు. జన్మపరంపరా రూపమైన ఈ సంసారచక్రంనుండి విముక్తి పొందాలంటే ఆ పరమేశ్వరునియందు అనన్యభక్తి కలిగి ఉండాలి. అపుడే జీవన్ముక్తి లభిస్తుంది.

కనుక ఈ అజామిళుడు పూర్వజన్మ సంస్కారం వల్ల శ్రేష్టమైన బ్రాహ్మణవంశంలో జన్మించి, వేదశాస్త్రాలను గురుసేవతో, ఇంద్రియ నిగ్రహంతో అభ్యసించాడు. పెద్దలను, జ్ఞానులను సేవించాడు, సకల ప్రాణులయందునూ సమత్వదృష్టి కలిగి, మంత్రానుష్థానంతో సిద్ధులు పొందాడు. సత్యవ్రతం, నిత్య నైమిత్తికాదికార్యాలు నిర్వహించాడు. లోభాది దుష్ట వర్తనలను వదిలి, సద్దుణవంతుడైనాడు.

నిత్యం ఆచారనిష్ఠకలవాడై, జ్ఞానాన్ని సముపార్జించే సరైన సమయంలో, తాను ఉత్తముడుగా మారబోతున్న కాలంలోనే అతనికి మన్మథవికారం కలిగించే కోడెవయసు ప్రారంభమైంది.

('యౌవనం ధనసంపత్తిః ప్రభుత్వమవివేకితా, ఏకైక మప్యనర్థాయ కిము యత్ర చతుష్టయమ్‌' అనే సూక్తి వల్ల ఆధారంగా తరువాత వచ్చే అన్ని అనర్థాలకు మూలమై వివేకాన్ని పోగొట్టే దోషాలలో మొదటిదైన నవయౌవనం అని చెప్పవచ్చు.)

మిక్కిలి తేజోవంతుడైన అజామిళుడనే ఆ బ్రాహ్మణునికి యావనదశ ప్రాప్తించిన కాలంలో కన్నుల చివర యౌవన మదం, మనసులో తొందరపాటు, శరీరమంతా మన్మథచేష్టలు, మొగమున లేత నవ్వు, శరీరానికి గొప్పబలం, తలవెంట్రుకల నల్లని నిగారింపు, నడుము బరువుతో తొడలయందు కాంతి, చేతులు పొడవుగా సాగుట, విశాల వక్షఃస్థలం, శరీర లావణ్యం. మొదలైన కొత్తదనాలు రూపుదిద్దుకున్నాయి.

మదిలో పుడుతున్న యౌవనమదం, తన చిహ్నాలను ప్రదర్శిస్తున్నట్లుగా అతనిముఖంపై మొలకెత్తిన నూనూగు మీసాలు నల్లగా అందంగా కనిపించాయి.

అంతేకాక, అరవిరిసిన తామరపూవుమీద తుమ్మెదలగుంపు వాలినట్లుగా అజామిళుని అందమైనముఖం పై చక్కని చిక్కని మీసకట్టు అంకురించింది.

ఇంతలో వసంత ఋతువు వచ్చింది. మన్మథుడనే బ్రహ్మదేవుడు ప్రారంభించిన యజ్ఞానికి వసంతుడనే పురోహితుడు అంకురారోపణం చేసినట్లు ఉద్యానవనాలలోని చెట్లకొమ్మలు కొత్తచిగుళ్లు తొడిగాయి. వాయువేగానికి కదలుతున్న ఆ చిగురాకులు కంపిస్తున్న జారజారిణీ జనహృదయాలలో గుచ్చుకొనే బాకులు లాగా ఉన్నవి. చక్కగా వికసించిన పువ్వులలో నుండి చెలరేగిన పుప్పొడి దుమారాలు ఆకాశాన వేలాడగట్టిన చాందినీలవలె ప్రకాశిస్తున్నాయి. పూలలో చిందుతున్న మకరంద బిందువుల విందులతో మైమరచిన మధుకరాల మధుర ఝంకార నాదాలతో దిక్కులన్నీ పిక్కటిల్లుతున్నాయి. బాగా పండి పగిలినఫలాలను ఆరగిస్తూ ఆనందంతో చిలుకలు మొదలైనపక్షులు కలకల ధ్వనులు చేస్తున్నాయి. ఈ విధంగా అందరికీ ఆనంద దాయకమైన మధుమాసం చెట్లన్నింటికీ కొత్తసాగసులు చేకూర్చింది. ఆ సమయంలో అజామిళుడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలూ, సమిధలూ, పుష్పాలూ, పండ్లూ తీసుకొని రావటంకోసం తోటలోనికి వెళ్లి తిరిగివస్తూ ఒక దట్టమైన పొదరింట్లో తీవ్రమైన రతిసంబంధమైన కోరికతో మన్మథక్రీడ యందు నిష్ణాతురాలైన శూద్రస్త్రీతో కూడిన ఒక పురుషుణ్ణి చూశాడు.

ఆ పొదరింటిలో రతిక్రీడలో ఆరితేరినాడు. యౌవనమద వైభవాన్ని ప్రదర్శించడంలో గడిదేరినవాడూ, సురతేచ్చతో కూడినవాడు, దిసమొలతో ఉన్నవాడూ అగు ఒక విటుణ్ణి చూశాడు.

మధువు తాగిన మత్తులో రతి తరువాత తిరిగి రతికోసం తొందరపడుతూ, కనుబొమలను, కనుగ్రుడ్లను విలాసంగా ఆడిస్తూ, నుదుటక్రమ్ముకొన్న ముంగురులతో, కౌగిలింతకోసం, రతిక్రీడకోసం వెంపర్లాడుతున్న వేశ్యతో, స్వేచ్చారతిలో ఉన్న జారుణ్ణి చూశాడు.

సంభోగసమయంలో అనుకోకుండా నోటి నుండి వచ్చిన మణితం(అవ్యక్త మాటలధ్వని) ఒడ్డాణపు మువ్వల ధ్వనితో కలిసి మధుర ధ్వనులు వినిపిస్తుండగా, రతిలో సంపూర్ణ తమకంతో ఉన్న వనితను చూశాడు.

ఆ యువతి కాలి అందెలు పోటాపోటీగా మోగుతూ, అతనికి ఆనందం కలిగిస్తుంటే వారు పోటీగా ఒకరి మీద ఒకరు పడుతూ చేస్తున్న సంభోగంలోని వివిధ భంగిమలను అజామిళుడు చూశాడు.

ఆ వేశ్య ముఖంపై ముంగురులు కదలాడుతుంటే, కొప్పు వీడిపోయే విధంగా, మెడలోని ఆభరణాలు ఊగుతుండగా నడుము కదలికలకు అనుగుణంగా ఒడ్డాణం తాళం వేస్తుంటే నడుము ఒత్తిడికి గురయ్యే విధంగా తన ఆధిక్యాన్ని చూపిస్తూ పురుషాయిత సంభోగక్రీడ సాగిస్తోంది.

నిండు యౌవనంతో మృదువైన శరీరంతో, ప్రియుని కౌగిలింతలతో పురుషాయిత శృంగారక్రీడలలో ఆరితేరిన కామ విలాసిని అయిన స్త్రీని చూచిన ఆ అజామిళుడు కామోద్రేకం కలవాడై

తేప తేపకూ ఏపుమీరిన తన చూపులనే మోహపాశాలలో చిక్కుకొన్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్యకృత్యాలైన వైదిక కర్మలనూ, శాస్త్రపాఠాలనూ, జపతపాలనూ మరచిపోయాడు. అతడి మనస్సనేఅరణ్యంలో కామోద్రేకమనేకార్చిచ్చు చెలరేగ సాగింది. నియమబద్ధమైన అతడిచిత్తం పట్టు తప్పిపోయింది.

అజామిళుడు ఆ క్షణం మొదలు ఆ అందాల భామ చిక్కని చెక్కిళ్లనూ, చిరునవ్వునూ, కదలుతున్న ముంగురులనూ, నున్నని నుదురునూ, చెవులదాకా వ్యాపించిన వాలుకన్నులనూ, బిగువైన కుచాలనూ, విశాలమైన కటిప్రదేశాన్నీ, మాటి మాటికీ స్మరింపసాగాడు. అతడిమనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. దిగులుతో క్రుంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనైనాడు.

కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రిగారు సంపాదించిన ఆస్తి నంతటినీ ఆమెపాలు చేశాడు. సాధు లక్షణాలైన సద్గుణాలను విడనాడాడు. బాగా రుచి మరిగి ఆ వాలుగన్నుల ఇంతి అందచందాలకు లొంగిపోయాడు.

నిండు యౌవనం కలిగి సుగుణ సంపత్తి కలిగి, కామక్రీడ యందు అతనికి ఆనుకూల్యవతి అయిన భార్యను ఇంటిలోనే వదిలి, తన గౌరవాన్ని పోగొట్టుకొని, నీచుడై ఆ స్త్రీతోనే కాపురం మొదలుపెట్టాడు.

ఈ విధంగా అజామిళుడు చుట్టపక్కాలను దూషించాడు. సజ్జనులను ద్వేషించాడు. దిక్కులేని దీనులను చిక్కులపాలు చేశాడు. చిట్టచివరకు ధనం కోసం దారులు కాచి వచ్చేపొయ్యే జనాన్ని దోచుకున్నాడు. దొంగతనంలో ఆరితేరాడు. ఎవరు ఏ మనుకొన్నాా ఎన్ని తిట్టినా లెక్కచెయ్యకుండా సంపాదించిన ధనమంతా ఆ సుందరి చేతుల్లో పోసి, దానికి దాసుడై దాని దయా దాక్షిణ్యాలపై జీవింపసాగాడు.

వేదాంత చర్చను వదిలి ఆమె స్తన గంధ(లేపన) చర్చను చేసేవాడు. తర్కశాస్త్రంలోని కఠిన విషయాల చర్చను వదిలి ఆమెతో ప్రేమపూర్వక తర్కాన్ని జరిపేవాడు. స్మృతులలోని పద, వాక్య, విశేషాలను వివరించడం మాని, ఆమె మాటల తీరులోని విశేషాలను వర్ణించేవాడు. నాటక, అలంకార పాటవాన్ని కాదని, ఆమె కపట వర్తనలను, ఆభరణాల సౌందర్యాన్ని పొగిడేవాడు. ఈ విధంగా ఏ మార్పు లేక పాపాత్ముడైన అజామిళుడు ప్రీతితో ఆ ఇంతిని సొంత భార్యగా భావించి, ఆమె సంసార భారాన్ని తానే మోస్తూ, మలినదేహుడై చెడుమార్గంలో జీవించాడు.

అందుకని ఇటువంటి పాపాత్ముడిని, దుష్టుడిని, దుర్మార్గుడిని, హింసాపరుడిని మేము తీసుకుపోయి, తప్పక శిక్షిస్తాము. దానివలనమాత్రమే అతడు పాపరహితుడు అవుతాడు.

ఈ విధంగా మాట్లాడుతున్న యమకింకరుల్ని ఆపి, నీతినిపుణులైన విష్ణుదూతలు సమాధానంగా ఇలా అన్నారు.

ఓహో! మీరు ఎంత గొప్ప పండితులో మీ మాటలే చెబుతున్నాయి. మీకు అసలు శిక్షలు అమలుచేసే విధానమేమిటో తెలియకపోవడం వలన అయ్యో! పాపం దండనార్హులు కానట్టి పుణ్యపురుషులు శిక్షలకు గురి చేయబడినారు.

సమబుద్ధి గలవారు, సాధువర్తనులు, శాసనకర్తలు, మంచి దయాపరులు, గొప్ప సుగుణాలు కల్గిన తల్లి దండ్రులే తమ బిడ్డలకు కీడు చేయ తలపెట్టితే ఇక ఆ బిడ్డలు ఎవరితో మొర పెట్టుకోగలరు? మీ మనస్సులలో మీరే కొంచెం ఆలోచించి చూడండి.

వివేకవంతుడు ఏ పనినైతే సరైంది అని చేస్తాడో, ఇతరులు దానినే ఆచరిస్తారు. అతడు ఏది నిజమని చెబుతాడో ఆ విషయాన్నే లోకం కూడా నమ్మి అనుసరిస్తుంది.

ఓ యమకింకరులారా! ఒకడిని స్నేహితుడని నమ్మి అతని ఒడిలో నిద్రిస్తున్న మిత్రుడిని ఎవడైనా దయారహితుడై చంపాలని అనుకుంటాడా? (అనుకోడు).

స్నేహభావంతో వచ్చి, హృదయమిచ్చి, తనకు బాగా నచ్చి, తనను మెచ్చి నమ్ముకున్న వ్యక్తికి దయాదాక్షిణ్యాలు గల బుద్ధిమంతుడు ఏ మాత్రం ఆలోచన లేకుండా ఎలా అపకారం చేస్తాడు? (అపకారం చెయ్యడు.)

అది మాత్రమే గాక, ఈ అజామిళుడు తనకు కలిగిన శ్రీవిష్ణునామోచ్చారణం అనే అమృతప్రాయమైన ఐశ్వర్యం కారణంగా మంచిబుద్ధితో, కోటి జన్మలలో అతనికి సంక్రమించిన మహాపాపసముదాయాన్ని పూర్తిగా ఈ జన్మలో పోగొట్టుకోగలిగాడు.

నారాయణుని గుణ కీర్తనలు అనేవి బ్రహ్మహత్య వంటి మహా పాతకాటవులకు కార్చిచ్చులు. గురుభార్యా సంగమం వంటి పాపాలు అనే పాములకు నెమళ్ళు. బంగారం దొంగిలించడమనే చీకట్లకు సూర్యకిరణాలు. మద్యం తాగడం వంటి పాపాలనే మత్తెక్కిన ఏనుగులకు సింహాలు. ఎంతో గొప్పవైన యోగసమాధివంటి విధులను ఆచరించిన బ్రహ్మాది దేవతా సమూహానికి కూడా లభించని మోక్షసామ్రాజ్యానుభవానికి చెందిన క్రీడలు.

శ్రీమన్నారాయణుని నామగానాలు మోక్షమనే కన్యతో సలిపే సల్లాపాలు. సత్యలోక సౌఖ్యాలకు నెలవైనవి. మహిమాన్వితమైన ముక్తి అనే రాజ్యాధిపత్యానికి ఆలవాలమైనవి. ఎడతెగని దీర్ఘ తపస్సులకు ఫలితమైనవి. పుణ్యానికి ఆధారమైనవి. నిరపాయపోషకాలై కోరికలను తీర్చగలిగేవి, అజ్ఞానాన్ని పోగొట్టేవి, ఉపనిషత్తుల మూలసారాంశాలు.

ఆశించదగింది, శుభలోకాలకు నెలవైంది, ఋషుల మనసులే నివాసంగా కలిగింది, ముక్తికి మార్గమైంది అయినట్టి గోవిందనామస్మరణం నిత్యం చేసేవాడు సర్వసమర్థుడూ అవుతున్నాడు.

అజామిళుడు “నారాయణా” అని పిలిచినప్పుడు ఇతనిహృదయం కుమారునిమీద ఆసక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతునిపేరును ఏ విధంగా పలికినప్పటికీ వాసుదేవుడు రక్షకుడై అందులో ఉండనే ఉంటాడు.

శ్రీమహావిష్ణువును బిడ్దపేరుతోనైనా, విశ్రాంతి సమయంలో అయినా, ఆటల్లోనైనా, పరిహాసంగానైనా, పద్యంలోనైనా, గద్యంలోనైనా, గీతాల్లోనైనా వాటి భావార్థాల్లోనైనా స్మరిస్తే చాలు అది సకల పాపాలను పోగొడుతుంది.

ప్రమాదవశాత్తు జారిపడినపుడూ, గాయపడి ఈతిబాధలతో కుంగినపుడూ, విషజ్వరాలవంటి వ్యాధులు సంక్రమించినపుడు, సంధివాతం ఏర్పడి ప్రేలాపన కలిగినపుడు, పాములవంటి విషజంతువుల వలన బాధకు గురైనపుడు, ఇలాంటి ఏ సందర్భంలోనైనా విష్ణువుని స్మరించగలిగితే అలాంటి వారికి యముని వలన ఏ విధమైన భయం పొందరు. దుఃఖ దశల్ని పొందరు.

పెద్ద పాపాలకు పెద్దప్రాయశ్చిత్తాలనూ, చిన్నపాపాలకు చిన్నప్రాయశ్చిత్తాలనూ మహానుభావులైన మునులు నిర్ణయించే ఉన్నారు. కాని ఆ ప్రాయశ్చిత్తాలవల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప, పూర్తిగా పరిహారం కావు. సమస్తపాపాలనూ సంపూర్ణంగా హరించి, మనస్సును పరిశుద్ధం చెయ్యాలంటే భగవంతునిసేవ ఒక్కటే సరి అయిన త్రోవ. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ యోగిమానసవాసుణ్ణి, ఆ పీతాంబరధారుణ్ణి, ఆ వేదవేద్యుణ్ణి, ఆ పురుషోత్తముణ్ణి సంస్మరిస్తూ ఆయన పాదాలు సేవిస్తే మోక్షం సిద్ధిస్తుంది.

దైవం అంటే ఏమిటో అర్థం తెలియని చిన్నపిల్లవాడుకూడా మిగతా హరిభక్తులతో కలసి భగవన్నామస్మరణ చేస్తేచాలు గాలి సహాయంతో అగ్ని గడ్డిని బూడిదగా ఎలాచేస్తుందో అదేవిధంగా హరినామస్మరణం అతని పాపాలన్నిటిని పటాపంచలు చేస్తుంది.

(వేదాంతశాస్త్ర పరిభాషలో 'బాలుడు' అంటే 'అజ్ఞాని' అని అర్థం. పరమాత్మను తెలుసుకోవటమే జ్ఞానం. తెలుసుకోకపోవటం అజ్ఞానం.)

శక్తిమంతమైన ఔషధం కాకతాళీయంగా తీసుకున్నా అది తన ప్రభావంతో ఏ విధంగా వ్యాధిని తగ్గిస్తుందో, ఆ విధంగా, భగవంతుని నామాన్ని మూర్ఖుడు తెలియక పలికినా, అవహేళనగా పలికినా దాని ప్రభావం ఊరకనే పోదు. దాని మహత్తరగుణాన్ని తప్పకుండా చూపించి తీరుతుంది.

పూర్వజన్మ పుణ్యఫలంగా తప్ప, ధైర్యం కోల్పోయిన మనస్సు భగవన్నామ స్మరణ చేయలేదు. సకల లోకాలను తనలో ఇముడ్చుకోగలిగిన విష్ణువు కేవలం ఒక్కని మనసులో మాత్రమే ఉంటాడా? (ఉండదని భావం).

ఇక ఈ అజామిళుని విషయమంటారా! మరణకాలంలో ఈ మహనీయుడు శ్రీహరినామస్మరణం అనే అమృతాన్ని ప్రత్యక్షంగానే ఆస్వాదించాడు. శాశ్వతమైందీ, నిర్దోషమైందీ, సమస్తమైన చైతన్యానికి ఆలవాలమైందీ, నిత్యసత్యమైందీ, నిరహంకార సుగుణ సంపదలతో కూడిందీ, నియమబద్ధమైందీ, నిర్మలమైందీ అయిన నారాయణనామస్మరణం ఎలా వ్యర్థమవుతుంది?

ఈ విధంగా విష్ణుదూతలు భక్తితత్త్వాన్ని, నామవైశిష్ట్యాన్ని వివరించి, మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మీ ప్రభువైన యమధర్మరాజును అడిగి తెలుసుకొమ్మని చెప్పి పంపించారు. ఇటు అజామిళుడిని మృత్యుభయం నుండి, నరక భీతినుండి విముక్తుణ్జి చేశారు. యమకింకరులు అశక్తులై వెనుదిరిగి యమలోకానికి పోయి, జరిగిందంతా యమునికి తెలియజేశారు. ఆ తర్వాత

యమపాశం నుండి విముక్తుడై అజామిళుడు స్వస్థతపొంది, ఆనందపరవశుడై, విష్ణుదూతలకు మనసులోనే వందనాలు సమర్పించి, లేచి వారికి నమస్కరించి ఏదో చెప్పడానికి ఉత్సహిస్తుండగా అతని మనసును గుర్తించిన విష్ణుదూతలు అద్భశ్యులై వైకుంఠవాసుని వద్దకు వెళ్ళిపోయారు.

అజామిళుడి పశ్చాత్తాపం

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

No comments:

Post a Comment