శ్రీనారాయణు డిట్లనెను : ఇంక నాల్గు వేదములు పుట్టిన జీవధాత్రి కర్మభూమియగు పావన భారతవర్షమునందు నే నాదిపురుష రూపమున విరాజిల్లుదును. నన్ను నీవి విధముగ సంస్తుతింతువు.
నారదు డిట్టనును : శాంతికి నెలవు దరిద్రుల పాలిటి పెన్నిధి ఋషిశిఖామణి అహంకారరహితుడు పరమహంస పరమగురువు ఆత్మారాముల కధిపతి యగు నరనారాయణుడను భగవానునకు నా ప్రణామముల. ఈ సకల విశ్వమునకు కర్త యయ్యును కర్మచేత బద్ధుడుగాని వాడును దేహియయ్యును దేహబాధలు లేనివాడును ద్రష్ట యయ్యును విషయములచే చెడని చూపుగలవాడును సంగమములేని వివిక్తసాక్షియు నగు దేవునకు ప్రణామములు.
ఓ యోగీశ్వరా ! అంత కాలమందున నిర్గుణుడవగు నీయందు పరమభక్తితో మనస్సు నిలిపి తనువు చాలించుటే యోగ నైపుణ్యమని యా హిరణ్యగర్బుడు పలికెను. ఎవడు విద్యాంసుడయ్యు నిహపరలోకములందు లంపటుడో ఎవ్వడు ధన-దార-సుతులయం దాసక్తుడగునో యీ వట్టి మట్టి తనువు వదలుటకు బాధ పడునో యట్టి వాని జ్ఞానమంతయును బూడిదలో బోసిన పన్నీరే; శ్రమమాత్రమే సుమా ఓ యధోక్షజా ! నీ మాయవలన శరీరమందలి యహం కార మమకారములు చెలరేగును. వానిని రూపుమాపగల్గు నీ సహజమైన ప్రేమభక్తియోగము మా కీయగదవే !
ఈ విధముగ సకల సారవిదుడు మునివరుడు నగు నారదమహర్షి నిత్యమనామయుడగు శ్రీనారాణుని సంస్తుతించుచుండును.
ఓ దేవ ఋషీ! ఈ భారతవర్షమందలి నదీ-పర్వతముల గూర్చి వివరింతును. సావధానముగ నాలకింపుము. శ్రీమలయగిరి మంగల ప్రస్థము మైనాకము చిత్రకూటము ఋషభకూటము కోల్లము సహ్యము దేవగిరి ఋష్యమూకము శ్రీశైలము శ్రీవేంకటాచలము మహేంద్రము వారి ధారము వింధ్యము ముక్తిమంతయు ఋక్షగిరి పారి యాత్రము ద్రోణము చిత్రకూటగిరి గోవర్థనము రైవతకము కుకుభము నీలగిరి గౌరముఖము ఇంద్రకీలము కామగిరి మున్నగునవి కాకింకెన్నో పుణ్యప్రదములగు పర్వతములు విలసిల్లుచున్నవి.
వీనినుండి పుట్టిన వందల-వేల-నదీ-నదములు చూచిన-త్రాగిన గ్రుంకిన-కీర్తించిన మాత్రన పావన మొనర్చును. ఇవి జీవుల ముడు విధముల పాపములను నశింపజేయును. తామ్రపర్ణి చంద్రవంశ కృతమాల వటోదక వైహాయసి కావేరి పయస్విని తుంగభద్ర కృష్ణ శర్కరావర వేణ గోదావరి భీమరథి నిర్వింధ్వ పయోష్ణి తాపి రేవ నర్మద సురస సరస్వతి చర్మణ్వతి సింధు అంధశోణ ఋషికుల్య త్రిసామ వేదస్మృతి మహానది కౌశికి యమున మందాకిని దృషద్వతి గోమతి సరయు రోధవతి సప్తవతి సుషోమ శతద్రు చంద్రభాగ మరుద్వృధ వితస్త అసిక్ని విశ్వ మున్నగు నదీనదములు జీవన ప్రదములై పుణ్యభారతభూమిపై ప్రసిద్ధములై యున్నది.
భారతవర్షమందలి జనులు కారణజన్ములు. వారు సత్త్వము-రజస్సు-తమస్సుల కారణముగ తెలుపు-ఎఱుపు-నలుపులుగల స్వర్గ-భూ-నరభోగము లనుభవింతురు. ఇచట నివసించు వార లెల్ల భోగము లనుభవింతురు. ఆయా వర్ణముల ధర్మము ననుసరించి ఎల్లరికి ముక్తి గల్గును. ఎల్ల కార్యములు తేలికగ సిద్ధి బొందుట యీ భారతవర్షముయొక్క విశిష్టలక్షణము. అని వేదవిదులగు మునులు స్వర్గవాసులను పల్కుచుందురు.
శ్రీహరి విశేషించి భారతీయులపట్ల ప్రసన్నత వహించును. వీరు భారతదేశమున జన్మించి హరిచరణ కమలసేవచేసి మాకును కనువిప్పు గల్గింతురు గదా ! ఆహా! ఈ భారతీయు లెంతటి పుణ్యవంతులో కదా! తీరని యింద్రభోగముల మాటున మా శ్రీ నారాయణుని పాదకమలచింతన మఱుగుపడెను గదా! ఇక దుష్కర తపోదానత్రములవలన స్వర్గప్రాప్తివలన మా కేమి లాభము?
కల్పాయువుతో స్వర్గమం దుండుటకంటె నల్పాయువుతో భారతమున జన్మించుట లెస్స. ఇచట ప్రజ్ఞావంతులు క్షణకాలమున సర్వమును త్యాగముచేసి యభయమైన హారిచరణకమలము నాశ్రయింతురు. వైకుంఠ కథాసుధారసము భాగవత - సాధుల-సత్సంగతి యజ్ఞేశుని యాగ మహోత్సవములను లేని యింద్రలోక మేనాటికిని చేరగూడదు.
ఇంతటి మహిమగల భారతమునందు మానవులుగ జన్మించి జ్ఞాన-క్రియా-ద్రవ్య సంపద గల్గియును ఎవరు పునర్జన్మము లేకుండుటకు యత్నింపరో వారు మరల జంతువులలె బంధింపబడుదురు. దర్బలచేత పవిత్ర మై నవస్తువులను మంత్రపూతముగ నాయా దేవతల పేర్లు చెప్పి యెవరు వేల్తురో వారిచ్చిన వస్తువులను హరి ప్రీతితో స్వీకరించును.
సత్య మేమనగ భగవానుడు కోరినవారి కోర్కెలు దీర్చును. కాని పరమార్థము మాత్రమీయడు. ఎవ్వాని కర్థించు స్వభావములేదో యెవడు నిష్కామముగ హరిని సేవించునోయట్టివాని కోర్కెలను భగవాను డీడేర్చును. వానికి తన శ్రీ పాదకమలము లొసంగును. మాకు స్వర్గసుఖ మేదైన మిగిలియున్నను మా వెనుకటి యిష్టాపూర్తములు మంచి స్థితిలో నున్న యెడల మాకు కమలనాభుని సంస్మరణ గల్గించు బంగరు భూమియగు భారతవర్షమున జన్మముగల్గి, సుఖసంపదలు గల్గుగాత.
అని స్వర్గమందలి యెల్ల దేవతలును సిద్ధ-ఋషులును శ్రీమంతమైన భారతవర్ష మహాత్మ్యము గానముచేయుచు అభివర్ణింతురు. ఈ బంజూద్వీపమునకు సమీపమున మఱి యెనిమిది యుపద్వీపములు గలవు. వీనిని సాగర పుత్రులుపాయముతో నేర్పఱచిరి. స్వర్ణప్రస్థ-చంద్రశుక్ర-ఆవర్తన-రమణక-మందర-హరిణ-పాంచజన్య-సింహళ-లంక-యను నెనిమిది యుపద్వీపములు. ఈ విధముగ జంబూద్వీపపు ప్రమాణ మంతయును విపులముగ చెప్పబడెను.
No comments:
Post a Comment