శ్రీ నారాయణు డిట్లనెను: ఈ జంబూ ద్వీపమెంత పరిమాణము గలదో యంతియ పరిమాణము గల క్షార సముద్రముచే నీ జంబూద్వీపము చుట్టబడియున్నది. మేరుగిరి జంబూద్వీపముచే చుట్టబడెను. జంబూద్వీప పరిమాణమునకు రెండింతలు పరిమాణముగల ప్లక్షద్వీపముచేత క్షారసముద్రము చుట్టబడెను.
ఒకపెద్ద లోతైన యగడ్త వనములను చుట్టినట్టులిది యును చుట్టి యుండును. అదు బంగారు కాంతిరేఖలు వెల్గుచుండును. అచట ప్రియవ్రతుని కుమారుడు సప్తజిహ్వుడనువాడు గలడు. ఇధ్మజిహ్వుడా ద్వీపమున కధిపతి. అతడు దాని నేడు వర్షములుగ విభజించి తన యేడుగురు కొడుకులకు పంచి యిచ్చెను. తుద కత డాత్మ ప్రియమగు యోగమార్గ మవలంబించి యాత్మవిచారయోగముతో భగవంతునిలో లీనుడయ్యెను.
శివము-యవసము-భద్రము-శాంతము-క్షేమము-అమృతము-అభయ-మను నేడు వర్షములతని యేడుగురు కొడుకుల పేర్లమీద నేర్పడెను. అందేడునదులు నేడు గిరులును ముఖ్యములు. అరుణ-నృవ్ణు-అంగీరస-సావిత్రి-సుప్రభాతిక-ఋతంభర-సత్యంభర-యనునవిముఖ్య జీవనదులు. మణికూటము-వజ్రకూటము-ఇంద్రసేనము-జ్యోతిష్మంతము-సువర్ణము-హిరణ్యష్ఠీవము-మేఘమాల-యనునవి ప్లక్షద్వీపమందలి పర్వతరాజములు.
ఆ దివ్యవాహినుల జలమును తాకిన-త్రాగిన -క్రుంకిన -మాత్రన ప్రజల యజ్ఞాన పాపములు తొలగింపోవును. ఈ ప్లక్షద్వీపమందు హంస-పతంగ-ఊర్ద్వాయన-సత్యాంగము-లను నాల్గు వర్ణములు వారుందురు.వారు వేయేండ్లు బ్రదుకుదురు. వారు దేవతలను పోలిన ఆకృతులు కలవారు. వారు త్రయీ విద్యావిధానము స్వర్గ ద్వారమనబడు సూర్యభగవాను నీ విధముగ బూజింతురు.
పురాణపురుషుడు - శ్రీ విష్ణుస్వరూపుడు-సత్యధర్మముల కధిష్టానదేవత-బ్రహ్మస్వరూపుడు- శుభాశుభముల ప్రేరకుడు-నగు సూర్యాత్ముని శరణు వేడుచున్నాను. ఈ ప్లక్ష ద్వీపము నందును మఱి మిగిలిన యైదు దీవులందు నుండు వారి కాయువు ఇంద్రియము ఓజస్సు బుద్ధిబలము ప్రాణము పరాక్రమము ననువి సహజసంపదలుగ గల్గుచుండును.
ఈ ప్లక్షద్వీపము చుట్టును చెఱకు సముద్రము గలదు. ఈ దీవికి రెండింతల పరి మాణముతో శాల్మలీద్వీపము గలదు. ఈ దీవి తనంతటి వైశాల్యముగల సురాసాగరముచే చుట్టబడియున్నది. ఈద్వీప మందు శాల్మలీద్వీపవృక్షములు ప్లక్షద్వీపవృక్షము లంత మిక్కిలిగ గలవు. ఆ ద్వీపము పక్షిరాజగు గరుడ భగవానుని నివాసస్థానము. అ దీవి కథిపతి ప్రియవ్రతుని కొడుకు యజ్ఞబాహుడు. అతడు తన యేడుగురు కొడుకుల కేడు వర్షములు పంచియిచ్చెను.
ఆ వర్షముల నామముల వినుము. సులోచనము--సౌమనస్యము-సౌమనస్యము-రమణము-దేవవర్షకము-పారిభద్రము-అప్యాయనము-విజ్ఞాతము-ననునవి వాని పేర్లు. అ వర్షములందేడు నదులు నేడు పర్వతములు ప్రధానములు. సరసము-శతశృంగము-వామదేవము-కందకము-కుముదము-పుష్పవర్షము-సహస్రశ్రుతి-యునవి యేడు గిరుల పేర్లు. ఇంకనదుల పేర్లు చెప్పబడుచున్నవి. అనుమతి -సినీవాలి-సరస్వతి-కుహు-రజని-నంద-రాక యనునవి ముఖ్యనదులు.
ఆ వర్షములందు శ్రుతధర- వీర్యధర-వసుంధర-ఇషుదర-యను నాల్గు వర్ణముల వారు గలరు. తన కిరణ కాంతులచే శుక్ల కృష్ణ పక్షములు విభజించుచు పితరులను తనువుచుండు వేదమయుడు భగవానుడు నగు సోమేశ్వరు నచటి వారు గొల్తురు. ఆ సోము డెల్ల ప్రజల కోర్కులు దీర్చుచుండును.
ఆ వర్షములందు శ్రుతధర- వీర్యధర-వసుంధర-ఇషుదర-యను నాల్గు వర్ణముల వారు గలరు. తన కిరణ కాంతులచే శుక్ల కృష్ణ పక్షములు విభజించుచు పితరులను తనువుచుండు వేదమయుడు భగవానుడు నగు సోమేశ్వరు నచటి వారు గొల్తురు. ఆ సోము డెల్ల ప్రజల కోర్కులు దీర్చుచుండును.
ఈ సురాసముద్రమునకు రెండింతలుగ నేతిసంద్రము తన రారును. ఈ నేతిసంద్రముచేత కుశద్వీపము చుట్టబడియున్నది. అచట కుశస్తంబము లుండుటవలన దీనిని కుశద్వీపమందురు. కుశ స్తంబములు తమ యంకురముల కాంతులు విరజిమ్ముచుండును. ఆ దీవికి ప్రియవ్రతుని కొడుకు హిరణ్యరేతు డధిపతి.
ఇతడును తన యేడుగురు కొడుకుల పేరులేడు వర్షముల కుంచెను. వసువు-దృఢరుచి-నాభిగుప్తము-స్తుత్యవ్రతము-వివిక్తము-నామదేవక-మను నవి వర్షముల పేర్లు. వానియందేడుగిరులు గలవు. అందేడు నదులు గలవు. వాని పేర్లు వినుము. చక్రము చతుః శృంగము-కపిలము-చిత్రకూటము-దేవానీకము-ఊర్ద్వరోమము-ద్రవిణము-నను నవి యేడు గిరులు. రసకుల్య-మధుకుల్య-మిత్రవింత-శ్రుతివింద-దేవగర్బ-ఘృతచ్యుత- మందమాలికయను నవి యేడు నదుల పేర్లు.
కుశధ్వీపవాసు లీ నదుల జలము లుపయోగించుకొందురు. కుశల- కోవిద-అభియుక్త- కులక- యను నాల్గు వర్ణముల ప్రజలచట నివాసము చేతురు. వారు సర్వవిదులు- దేవతాస్వరూపులు-కర్మకుశలురు- అగ్నిదేవుని సేవించువారలు. ఓ జాతవేదా!(ధనమునకు కీర్తికి మూలభూతుడా) నీవు సాక్షాత్తుగ పరబ్రహ్మమునకు హవ్యమును అందజేయువాడవు. మా దేవతాయజ్ఞనముల ఫలితములు పరమేశున కందజేయుము. అని కుశద్వీపవాసు లగ్నిలో వేల్తురు.
No comments:
Post a Comment