Monday, April 27, 2026

Krauncha Dvipam - క్రౌంచ ద్వీపం

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - క్రౌంచ ద్వీపం

నారదు డిట్లనెను : ఓ సర్వార్థ దర్శనా ! మిగిలిన దీవుల ప్రమాణముల గూర్చియు నెఱింగింపుము. వాని నెఱిగి నందువలన పరమానందము చేకూరును. 

నారాయణు డిట్టులనియెను : కుశ ద్వీపము చుట్టు నేతిసంద్రము గలదు. దానికి రెండింతల పరిమాణముతో క్రౌంచద్వీప మొప్పుచుండును. దీనికి చుట్టును పాలసంద్రము తనరును. ఈ ద్వీపమున క్రౌంచాద్రి యుండుట వలన దీనికి క్రౌంచద్వీపమను పేరు గల్గెను. మున్ను కుమారస్వామి తన శక్తి బాణముతో దీని నడిమి భాగము చీల్చెను. దానిని వరుణుడు పాలసంద్రముచేత తడిపి కాపాడెను. 

దీని కధినాయకుడు ప్రియవ్రతుని కొడుకగు ఘృత పృష్ఠుడు . ఇతడు సర్వలోకవందితుడై విరాజిల్లుచున్నాడు. ఇతడును తన యేడ్గురు కొడుకుల పేర్లమీద నేడువర్షము లేర్పరిచి వారి కప్పగించెను. అతడు స్వయముగ శ్రీ భగవానుని శరణు జొచ్చెను. ఆమము - మధురుహము- మేఘపృష్ఠము- సుధామకము-భ్రాజిష్ఠము-లోహితార్ణము- వనస్పతి-యను నేడువర్షములు. అందేడేసి సంఖ్యలలో నదీ పర్వతములు లలరారు చుండును. శుక్లము-వర్ధమానము-భోజనము-ఉపబర్హణము-నందము- నందనము-సర్వతోభ్రదమనున వచటి గిరి ముఖ్యములు. అభయ-అమృతౌఘ - ఆర్యక- తీర్థపతి-వృత్తి రూపవతి-శుక్ల-పవిత్రవతి-యనునవినదులు. వీని పుణ్యజలములు నాల్గు వర్ణములు ప్రజలు గ్రోలుదురు. పురుష-ఋషభ-ద్రవిణ-దేవక-లను నాలుగు వర్ణములు వార లచట వసిందురు. అచటి ప్రజలు జలమయుడు-జలాధిపతి-యగు దేవుని గొల్తురు.

వారు భక్తితో జలాంజలులతో పెక్కు విధముల నిట్లు నుతింతురు. '' ఓ జలదేవాః నీవు పురుషోత్తముని వీర్యమవు. నీవలన భూర్‌ - భువః - స్వర్లోకములు పునీతములై యున్నవి. నిన్ను తాకుచున్న మా మేనుల నాత్మరూపుడవై పవిత్రమొనరింపుము.'' అను మంత్రజపముతో వివిధ స్తుతులతో నచటి వారు జలపతిని నుతింతురు. ఇట్లు క్రౌంచద్వీపము ముప్పది రెండు లక్షల యోజనముల విస్తీర్ణము గల్గి క్షీరసాగరముచేత చుట్టబడియుండును. 

అంతే పరిమాణముగలదధిసముద్రముచేత శాకద్వీపము చుట్టబడియుండును. అందు కోకొల్లలుగ శాకవృక్షములు గలవు. నారదా! అది తన క్షేత్ర వైశాల్యమున కడు పెద్దది. ఆ దీవికి ప్రియవ్రతుని పుత్రుడు మేధాతిథియనువా డధిపతిగ నుండెను. అతడును దాని నేడు భాగములు చేసి తన యేడుగురు కొడుకుల పేర్లు పెట్టి వారి కిచ్చి తాను యోగమార్గ మవలంభించెను. పురోజవము- మనః పూర్వజవము-పవమానకము-ధూమ్రానీకము- చిత్రరేఫము-బహురూపము-విశ్వధృక్కు-అనునవి ప్రసిద్ధవర్షములు. - నదులు నేడు గలవు. 

ఈశానము-ఉరుశృంగము-బలభద్రము- శతకేశరము-సహస్రస్రోతకము- దేవపాలము-మహాశనము- ననునవి ప్రసిద్ధ గిరుల నామములు. ఏడు నదుల పేర్లు వినుము: అనఘ-ఆయుర్ద ఉభయస్పృష్టి- అపరాజిత-పంచపది-సహస్రశ్రుతి- నిజధృతి-యను నవి పేరొందిన నదీమతల్లులు. అచటి జనులెల్లరును-సత్యవ్రత-క్రతువత-దానవ్రత-అనువ్రత-యను నాల్గు వర్ణముల నొప్పుచుందురు. వారు వాయుదేవుని ప్రాణాయామ పూర్వకముగ నుతింతురు.

వారు రజస్తమస్సులులేని సత్త్వరూపుడగు శ్రీహరిని గొల్తురు. ఆ దేవుడు ప్రాణరూపమున భూతములందు జొచ్చి ప్రాణములను భరించును. ఈ జగములన్నియు నతని వసమందుండును. అట్టి సర్వాంతరుడైన యీశ్వరుడు మమ్ముగాపాడుతమని వారు నుతింతురు. 

దధిసముద్రమునకు మిక్కిలి విశాలముగ పుష్కరద్వీపము గలదు. పుష్కరద్వీపకుశాక ద్వీపమునకు రెండింతులు గలదు. అది తనంతటి పరిమాణముగల మంచినీటి సంద్రముచే చుట్టబడియున్నది. ఈ ద్వీపమందు నగ్నివలయములవలె పుష్కరములు(కమలములు) పసిడిరేకులతో వేనకువేలు చెన్నొందును. ఈ పుష్కరములను సర్వలోకములు రచింపగోరిన లోకగురవగు బ్రహ్మదేవుడు తన కమలాసనముగ కల్పించెను. 

ఈ దీవియందు నాటినుండి నేటి వఱకు నలరుచున్న యొకేయొక గిరి గలదు. అది మానసోత్తరగిరి. ఇది తన పొడవు-వెడల్పు-నందు పదివేల యోజనములంత గలదు. దీని నలుదెసల నాల్గు పురములు విలసిల్లుచున్నవి. ఈ పురము లింద్రాదిలోకపాలకులవి. వీనికి పైగా మేరుగిరికి ప్రదక్షిణముగ భాస్కరుడు వెల్గుచు తిరుగుచుండును. ఇచట సంవత్సరమందలి యుత్తరాయణ-దక్షిణాయనములు దేవతల కొక పగలు - రేతిరి యగును. 

ప్రియవ్రతుని పుత్రుడు వీతిహోత్రుడు దీని కధినేత. ఇతనికిర్వురు కుమారులు. అతడు వారిపేర్ల మీద రమణము -ధాతకి-యను పేర్లుంచిన రెండు వర్షము లేర్పఱచి వారిని వాని కధిపతులుగా జేసెను. అతడును తన పూర్వజుల పగిది భగవద్బక్తి తత్పరుడయ్యెను. అచటి ప్రజలు బ్రహ్మరూపియగు పరమేశుని ధ్యానింతురు. వారు తమ దేవుని కర్మయోగముతో గొల్తురు. వారు శీలసంపన్నులై బ్రహ్మసాలోక్యమునకు సాధనములు వెదకుదురు. ఏకాంతము - అద్వయము-శాంతము-నగు భగవానునకు వారభివందనములు చేతురు.

లోకాలోక పర్వతము






No comments:

Post a Comment