నారాయణమహర్షీ ! సంగ్రహంగా దేవీచరితాన్ని తలియజెప్పావు. కానీ విసృతంగా వినాలని నా కోరిక. సృష్టికి ఆదిలో ఉండే పరాప్రకృతి, సృష్టి విధానమప్పుడు ఏరూపంతో ఎలా ఆవిర్భవించింది? అయిదుగా ఎలా విభజన పొందింది ? త్రిగుణాలూ అంశకళలుగా ఎలా రూపుదాల్పాయి ? వీటన్నింటి గురించి జన్మకథనం పూజావిధానం స్తోత్రం కవచం ఇత్యాదులన్నీ మంగళప్రదంగా సమగ్రంగా నాకు వివరించి చెప్పు. నువ్వు వేదవేదాంగవేత్తవు. ఈ చరాచర సృష్టిలో నీకు తెలియనిదంటూ ఏమీ లేదు. దయచేసి అనుగ్రహించు.
నారదా ! ఆత్మ నిత్యం, ఆకాశం నిత్యం, కాలం నిత్యం, దిక్కులు నిత్యం. అలాగే ఈ విశ్వంలో గోలోకం నిత్యం, అందులో ఒక ప్రదేశమే వైకుంఠం. అలాగే ప్రకృతి - నిత్యం. అది బ్రహ్మలీల, సనాతనం, అగ్నికి వేడిమి, చంద్రుడికి వెన్నెల, పద్మానికి శోభ, సూర్యుడికి ప్రకాశం - ఎలా అవిభాజ్యాలూ అవిభక్తాలూ అభిన్నాలో అలాగే (పరమ) ఆత్మ - ప్రకృతి ఇవి రెండూ అభిన్నాలు.
బంగారం లేనిదే కంసాలి ఆభరణాలు చెయ్యలేడు. మట్టి లేనిదే కుమ్మరి కుండలు చెయ్యలేడు. అలాగే ప్రకృతి లేనిదే (పరమ) ఆత్మ ఈ జగత్తును సృష్టించలేడు. ప్రకృతి అంటే సర్వశక్తి స్వరూప. దాని కలయికవల్లనే (పరమ) ఆత్మ శక్తిమంతుడు అవుతున్నాడు. "శక్తి" పదంలో 'శ' అనేది ఐశ్వర్యానికీ (ఈశ్వరత్వం) 'క్తి' అనేది పరాక్రమానికీ (విస్తరణ) సంకేతాలు. ఆ రెండింటినీ ఇచ్చేదీ ఆ రెండింటి స్వరూపమూ కనకనే ప్రకృతి - శక్తి అయ్యింది.
జ్ఞానమూ సమృద్ధీ సంపత్తీ యశస్సూ - వీటికి "భగమ్" అనిపేరు. అవి కలిగినది కనుకా, వాటి స్వరూపముకనుకా శక్తికి భగవతి అనీ భగరూప అనీ పేర్లు ఏర్పడ్డాయి. దానితో కూడిన (పరమ) ఆత్మకు భగవంతుడని పేరు. ఆ స్వేచ్చామయుడైన భగవంతుడు సాకారుడూ నిరాకారుడూను. నిరాకారుడు తేజోరూపం. దానిని యోగీశ్వరులు ధ్యానిస్తూ ఉంటారు. పరబ్రహ్మమనీ పరమానందమనీ కీర్తిస్తుంటారు. ఆది అదృశ్యరూపం. కానీ సర్వద్రష్ట (తాను కనపడదు కానీ తాను అన్నింటినీ చూడగలదు). అది సర్వజ్ఞం, సర్వకారణం, సర్వదం, సర్వరూపం.
అయితే వైష్ణవులు దీనిని అంగీకరించరు. తేజస్వి లేనిదే తేజస్సు ఎక్కడ అని ప్రశ్నిస్తుంటారు. అందుచేత తేజోమండలమధ్యస్థుడైన బ్రహ్మతేజస్విని వారు పరమాత్మ అంటారు. అది స్వేచ్చామయం, సర్వరూపం, సర్వకారణకారణం, మనోహరమైన అత్యంతసుందరరూపం. ఆ తేజస్విది కిశోరవయస్సు, శాంతుడూ సర్వకాంతుడూ, పరాత్పరుడు, నీలనీరదశరీరుడు. శరత్కాలంలో మధ్యాహ్నవేళకు పూర్తిగా వికసించిన పద్మాల శోభను అపహరిస్తాయి అతడి కన్నులు. పేర్చిన ముత్యాలవంటి పలువరుస, శిరస్సుమీద నెమలిపింఛం. మాలతీపుష్ప మాలికలు, కొనదేలిన ముక్కు, నవ్వురాజిల్లెడు మోమువాడు, భక్తానుగ్రహకారణుడు, అగ్నిజ్వాలల లాగా పరిశుభ్రమైన పీతాంబరం ధరించినవాడు. మురళీధారి. రత్నభూషణ భూషితుడు. సర్వాధారుడు. సర్వేశుడు, సర్వశక్తియుతుడు, విభువు, సర్వైశ్వర్యప్రదుడు, స్వతంత్రుడు. సర్వమంగళప్రదుడు, పరిపూర్ణతముడు, సిద్దుడు, సిద్ధేశుడు, సిద్ధికారకుడు. ఈ సనాతనుడైన దేవదేవుణ్ణి వైష్ణవులు ధ్యానిస్తుంటారు. ఉపాసిస్తారు.
నారదా ! జన్మ మృత్యు జరా వ్యాధి శోక భీతి హరుడైన పరాత్పరుడికి బ్రహ్మాయుష్షు ఒక నిమేషమాత్రమవుతుంది. ఆ పరబ్రహ్మనే కృష్ణుడు అంటారు. ఇందులో "కృష్" అనేది భక్తివాచకం. 'న' అనేది దాస్యవాచకం. భక్తి - దాస్య ప్రదాత కనక కృష్ణుడయ్యాడు. అలాగే కృష్ శబ్దం సర్వవాచకం. నకారం బీజవాచకం. స్రష్ట తానే. సృష్టిబీజమూ తానే. కనకనే కృష్ణుడు.
ఆ స్వేచ్చామయుడు తన ఇచ్చానుసారం రెండు రూపాలుగా అయ్యాడు. వామభాగం స్త్రీరూపంగా, దక్షిణభాగం పురుషరూపంగా. మహాకామి అయిన ఈ సనాతన పురుషుడు కామాధారయైన ఆ స్త్రీమూర్తిని చూశాడు. అప్పుడే వికసించిన పద్మంలాగా కమనీయంగా ఉంది. చంద్ర బింబంలాగా ఉంది. రంభోరు. నితంబ భారాంచిత. శ్రీఫలాలవంటి వక్షోజాలు. సన్నని నడుము. పుష్పమాలికాలంకృత, శాంతస్వరూప, స్మేరవదన, వక్రలోచన. అగ్నిజ్వాలలా పరిశుభ్రమైన చీర, రత్నభూషణ భూషిత. తన నయనచకోరాలతో శ్రీకృష్ణుడి ముఖమనే చంద్రబింబంలోని వెన్నెలల్ని తదేకదీక్షగా గ్రోలుతోంది. తన్మయం చెందుతోంది.
ఆ స్త్రీమూర్తి నెన్నొసట కస్తూరిబిందువు. దానికి కింద చందన బిందువు. వాటితో సమానంగా సిందూరబిందువు. వాలుకొప్పులో తురిమిన మాలతీ పుష్పమాలికలు.
కోటిచంద్రులు ఒక్కసారిగా ఉదయించినట్టుంది ఆ స్త్రీమూర్తి. తన నడకలతో రాజహంసలనూ గజరాజాలనూ పరిహసిస్తోంది. తన కాంతుడిపట్ల కాముకి.
ఆ సౌందర్యరాశిని చూసి రాసేశ్వరుడు రాసోల్లాసమైన రాసమండలంలో రసికుడై ఆమెతో రాసక్రీడను జరిపాడు. శృంగారం మూర్తీభవించినట్టు సుఖసంభోగం సాగించాడు. బ్రహ్మమాసంలో ఒకరోజుపాటు అది సాగింది. అప్పటికి ఆ జగత్పిత అలిసిపోయాడు. నిత్యానందదాయకమైన శుభక్షణంలో ఆ స్త్రీమూర్తి యోనిలో వీర్యాధానం చేశాడు. సురతాంతంలో అలిసిపోయిన ఆమె శరీరం నుంచి హరితేజస్సువల్ల స్వేదజలం వరదలు కట్టింది. నిట్టూర్పులు నిగిడాయి. ఆ గాలి తాకిడి! స్వేదజలాలు విశ్వగోళమంతటా (సముద్రాలుగా) వ్యాపించాయి. ఆ వాయువే జీవరాశికి ప్రాణాధార మయ్యింది. ఆ వాయువుకి ఒక రూపం ఎర్పడింది. అతడి వామభాగం నుంచి మరొక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. అతడికి ప్రాణవల్లభ అయ్యింది. వారిద్దిరికీ అయిదుగురు పుత్రులు జన్మించారు. అవే పంచప్రాణవాయువులు. ప్రాణ - అపాన - సమాన - ఉదాన - వ్యాన వాయువులు.
ఆ స్వేదజలానికి అధిదేవతగా వరుణుడు ఆవిర్భవించాడు. అతడికీ వామభాగంమంచి స్త్రీమూర్తి అవతరించింది. వరుణవల్లభ - వరుణాని.
ఆ చిచ్చక్తి కృష్ణాదేవి కృష్ణగర్భాన్ని ధరించింది. శతమన్వంతరాలు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించింది. ఆవిడ కృష్ణుడికి ప్రాణాధిదేవి. ప్రాణాధికప్రియ. నిరంతరకృష్ణసంగిని. ఎప్పుడూ కృష్ణుడి వక్షఃస్థలంమీదవే ఉండేది. శతమన్వంతరాలు గడిచాక కృష్ణాదేవి ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ శిశువు బంగారపు రంగులో ఉన్నాడు. అతడే విశ్వాధారాలయుడు.
ఆ బిడ్డను చూస్తూనే కృష్ణాదేవికి హృదయం భగభగలాడింది. బ్రహ్మాండగోళమంతటా నిండీ ఉన్న మహాజలంలోకి విసిరేసింది - కృష్ణుడు హాహాకారాలు చేశాడు. వెంటనే శపించాడు. ఓసి కోపవా!
ఓసి నిష్ఠురా! బిడ్డను నీళ్ళల్లోకి విసిరేశావా! ఈ పాపానికి ఫలం అనుభవించు. ఇంక నీకు బిడ్డలు పుట్టరు. ఇది నిశ్చయం. ఇంతేకాదు నీ అంశరూపాలుగా జన్మించిన అప్పరసలుకూడా నిత్యయౌవనలుగా ఉండిపోతారే తప్ప వారికీ కడుపుపండదు - అని కఠినంగా శపించాడు.
అదే క్షణంలో కృష్ణాదేవి జిహ్వాగ్రభాగంనుంచి హఠాత్తుగా ఒక కన్య ఆవిర్భవించింది. తెల్లని రంగులో మనోహరంగా ఉంది. తెల్లని వస్త్రాలు ధరించింది. విణాపుస్తకధారిణి. రత్నభూషణభూషాఢ్య, సర్వశాస్త్రాధిదేవత.
అటు పైని కొంతకాలానికి ఆవిడ రెండు రూపాలు ధరించింది. వామభాగం నుంచి లక్ష్మీదేవి, దక్షిణభాగం నుంచి రాధాదేవి ఆవిర్భవించారు. అదిచూసి పరాత్పరుడు కృష్ణుడు ద్విధారూపాలు ధరించాడు. వామభాగం నుంచి చతుర్భుజుడు, దక్షిణభాగం నుంచి ద్విభుజుడు అవతరించారు.
వాణిని ద్విభుజుడికి కామినిగా, రాధను ఆమెకు తోడుగా నియమించి వారిని అక్కడే ఉండమని ఆశీర్వదించి చతుర్భుజుడికి - నారాయణుడికి - లక్ష్మీదేవిని జతపరిచి కృష్ణుడు వారితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు.
అక్కడ వాణి, ఇక్కడ లక్ష్మి ఇద్దరికీ సంతానం కలగలేదు. అప్పుడు చతుర్భుజనారాయణుడి శరీరంనుంచి చతుర్భుజులైన పార్షదులు చాలామంది ఆవిర్భవించారు. అందరూ రూపంలో తేజన్సులో వయస్సులో నారాయణుడికి ముమ్మూర్తులా ప్రతిబింబాలు. ఆలాగే లక్ష్మీదేవి శరీరంనుంచి దాసీజనం కోటినంఖ్యలో అవతరించారు.
అక్కడ గోలోకంలో ఆ గోలోకనాధుడి రోమకూపాలనుంచి అసంఖ్యాకంగా గోపకులు ఆవిర్భవించారు. అందరూ ముమ్మూర్తులా ఆ ద్విభుజుడైన గోలోకనాధుడిలాగానే ఉన్నారు. ఆ పార్షదులందరూ అతడికి ప్రాణప్రియులయ్యారు. అలాగే రాధాదేవి శరీరంలో రోమకూపాలనుంచి గోపకన్యకలు ఆవిర్భవించారు. ఆందరూ రాధాదేవిలాగానే ఉన్నారు. అదే రూపం. ఆదే వయన్సు. అదే ఆభరణాదికం.
నారదా! అలనాటి కృష్ణశాపం కారణంగా వైకుంఠంలోగానీ గోలోకంలోగానీ ఏ వనితకూ కడుపు పండలేదు. అంతలోకీ కృష్ణప్రియ, విష్ణుమాయ, సనాతని ఆ దుర్గాదేవి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యింది. ఆదిపరాశక్తి, నారాయణ ప్రియ, సర్వశక్తిస్వరూపిణి బుద్దికి అధిష్టానదేవత, దేవీస్వరూపాలకు అన్నింటికీ బీజరూప, మూలప్రకృతి ఈశ్వరి, పరిపూర్ణతమ, తేజస్స్వరూపిణి, త్రిగుణాత్మిక, తప్తకాంచనవర్డ, కోటిసూర్యసమప్రభ, ఈషత్ హాస్య ప్రసన్నవదన. సహస్రభుజసంయుత, త్రిలోచన, నానాశస్త్రాస్త్రధారిణి, రత్తభూషణభూషిత,అగ్నిజ్వాలలా విశుద్ధవస్త్రాలంకృత. సకల స్త్రీలూ ఆమె కళాంశాంశరూపాలు. ఆవిడ మాయకు సమస్తలోకాలూ సమ్మోహితమవుతాయి. సర్వైశ్వర్యప్రదాత్రి, కృష్ణభక్తిప్రద, వైష్ణువులకు వైష్ణవి, ముముక్షువులకు మోక్షప్రదాయిని, భోగులకు సుఖప్రదాయిని. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, గృహంలో గృహలక్ష్మిగా కీర్తింపబడుతుంది. తపస్వులకు తపస్యాస్వరూప. రాజులలో శ్రీరూప, అగ్నిలో దాహకశక్తి, భాస్కరుడిలో ప్రభారూప. చంద్రుడిలో శోభారూప, పద్మాలలో శోభనరూప, పరమాత్మయైన శ్రీ కృష్ణుడిలో సర్వశక్తిస్వరూప. ఆ పరమాత్మ ఆమెవల్లనే శక్తిమంతుడవుతున్నాడు. ఈ జగత్తు ఆమెవల్లనే శక్తిమంతమవుతోంది. ఆమెయే లేకపోతే జగత్తు మృతప్రాయమే. ఈ సంసార మహావృక్షానికి (సృష్టితరువు) ఆ సనాతని బీజరూప, స్థితిరూప, (ఋ)వృద్దిరూప, ఫలరూప.
ఆ క్షుత్పిపాసాదయారూపిణి ఆ నిద్రా తంద్రా క్షమామతి స్వరూపిణి, ఆ శాంతి లజ్జాతుష్టిపుష్టి భ్రాంతికాంత్యాదిరూపిణి, ఆదిపరాశక్తి సర్వేశ్వరుడైన కృష్ణపరమాత్మను స్తుతించి ఎట్టఎదుట నిలబడింది. రాధికేశ్వరుడు రత్నసింహాసనం సమర్పించాడు.
ఆదే సమయానికి నారాయణుడి నాభికమలంనుంచి వనితాసమేతుడై చతుర్ముఖుడు ఆవిర్భవించాడు. కమండలువు ధరించి ఉన్నాడు. మహాతపస్వి, మహాజ్ఞాని, బ్రహ్మతేజస్సుతో విరాజిల్లు తున్నాడు. నాలుగు ముఖాలతోనూ నారాయణుడిని స్తుతించాడు.
అంతలోకీ కృష్ణుడు ద్విధారూపుడయ్యాడు. వామార్థం నుంచి మహాదేవుడూ దక్షిణార్ధంనుంచి గోపికాపతి ఆవిర్భవించారు. మహాదేవుడు శుద్ధస్ఫటికంలాగా ఉన్నాడు. శతకోటి సూర్యప్రభాసమన్వితుడై వెలిగిపోతున్నాడు. త్రిశూలాన్నీ పట్టిశాన్నీ ధరించాడు. పులితోలును వస్త్రంగా కట్టుకున్నాడు. రాగితీగల్లాగా ఉన్న జుట్టు గుబురుగా జడలు కట్టింది.
శరీరమంతటా భస్మం. స్మేరవదనారవిందుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, దిగంబరుడు. నీలకంఠుడు, సర్పభూషణుడు, కుడిచేతిలో రత్నమాలిక. పంచవక్త్రుడై కృష్ణపరమాత్మను స్తుతిస్తున్నాడు. సముచిత రత్ససింహాసనంమీద కూర్చున్నాడు.
No comments:
Post a Comment