Monday, April 20, 2026

Maya Sukaram - మాయాసూకరం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మాయాసూకరం

ఇట్లు విశ్వామిత్రడు వెళ్ళి రాజు తన పట్ల చేసిన పని మంచిది గాదని మనసులో తలంచెను. ఆనాడు వసిష్ఠునితో వాదము ఈనాడు రాజు వలన తపో విఘ్నము జరిగెను. 

కనుక విశ్వామిత్రుడు కోపావేశముతో ప్రతీకారముచే పగ తీర్చు కొనదలచెను. అతడు ఘోర విగ్రహముగల దానవుని తలచెను. ఆ దానపు నొక పంది యాకారమున హరిశ్చంద్రుని దేశము మీదకు ప్రయోగించెను. 

అది రాజుగారి యుద్యానవనముజేరి వనపాలకులను భయపెట్టెను. అది కదంబ-మాలతీ వృక్షము లను విఱుగగొట్టెను. అది కొన్నిచోట్ల మాటిమాటికి యూధికా వృక్షముల నరుసలు కదలించుచు కోఱలతో నేల పెళ్ళగించుచు చెట్లు పీకి వేసెను. 

అది కొన్ని యెడలనుండి గేదగి చెట్లను మల్లెచట్లను ఉశీరకరవీర వృక్షములనుత్రవ్వి పెకలించెను. వనమందున్న అశోక ముచుకుంద వకుల తిలకవృక్షములు సమూలముగ పెకలించి చిందర వందర చేసెను. 

తోటకాపరులు శస్త్రములు చేతదాల్చి దానిమీదకు పరుగెత్తిరి. మాలలు గట్టువారు భయాతురులై హహాకారములు చేసిరి. వనరక్షకులు దానిని బాణములతో నెంతగనో కొట్టిరి. కాని యది వెఱవక కాలునివలె తిరిగి వారిని బాధ పెట్టెను. వారు మిక్కిలి భయకంపితులై రాజును శరణువేడి కాపాడుమని మొఱపెట్టకొనిరి. 

అట్లు భయార్తులై వచ్చిన వారిని రాజు చూచి మీకెవని వలన భయము గల్గెనో నాకు తెల్పుడని యడిగెను. రక్షకులాలా! నేను దేవతలకు రాక్షసులకు భయపడను. ఇక మీకెవనివలన భయము గల్గెనో నాకు తెలుపుడు. 

ఏ పాపి- యే దుష్టుడు- నాకు పగవాడయ్యెనో చెప్పుడు; వాని యొకేయొక బాణమున తెగటార్పగలను. నా శత్రువు దేవుడో-దానవుడోవాని బలమెంతటిదో-వాని రూపేదియో - వాడెక్కడ గలడో- అన్నియా నాకు తెల్పినచో వానిని వాడిబాణముతో చంపుదును.

మాలలు కట్టువా రిట్లనిరి: రాజా! దేవ-దానవ-యక్ష-కిన్నరులలో నెవ్వడును కాడు. ఒక్క మహాకాయముగల పంది మీ వనమునందున్నది. ఆ మహావేగముగల పంది మెత్తని పూలచెట్లు కోరలతో పెకలించి వనమంతయును చిందర వందర చేసెను. 

రాజా! మేము బాణములతో కర్రలతో రాళ్లతో దాని నెంత కొట్టినను అది జంకుకొంకులులేక తిరిగి మమ్మే చంపుటకు వచ్చినది. అనువారి మాటలువిని రాజు మహాకోపముతో సత్వరమే గుఱ్ఱమెక్కి యుపవనము దెస కరిగెను. 

రాజు వెంట గజాశ్వరధసేనలు-పదాతి ధళములు-తోటవైపు వెళ్ళెను. అట ఘురఘుర శబ్దముతో భయంకరమైన పందిని భగ్నమైన తోటను చూడగనే రాజునకు కోపము వచ్చెను. రాజు వెంటానే వింటియందు బాణ మెక్కుపెట్టి నారి సారించి పాప రూపమైన పందిని చంపుటకు పూనుకొనెను. 

రాజు అతడు విల్లునమ్ములతో తన వైపు మహా రోషముతో వచ్చుటగని పంది భీకరముగ ఘురఘుర శబ్దము చేయుచు నతనివైపు పరిగెత్తెను. అది పెద్దగ నోరు తెఱచుకొని వచ్చుటచూచి రాజు దానిని చంపుటకు బాణం వదలెను. కాని పంది వెంటనే బాణము తప్పించుకొని మహా వేగముతో రాజును దాటి పారిపోయెను. 

అది తప్పించుకొని పోవుట చూచి రాజు మరింత కోపముతో ధనువు లాగి పందిపై బాణము లేసెను. అది యొక్క క్షణములో రాజునకు కనిపించకయు పెక్కు రీతుల ఘురఘురమనుచు పరుగెతైను. 

హరిశ్చంద్రుడును కోపోద్రేకముతో వాయువేగము గల గుఱ్ఱమెక్కి ధనువు లాగుచు పంది వెంటబడెను.

అపుడు సేనలు వనమంతయును చెల్లాచెదరై క్రుమ్మరుచుండెను. రాజోక్కడే పుట్టపురుగులేని కుట్ర నట్టడవిలో డస్సి యాకలిదప్పులచే నకనకలాడెను. అతని వాహనము సైత మలసిపోయెను. పంది తప్పించుకొని పోయినందున రాజు దిక్కులేని వానివలె నడవిలో దారితప్పి వెతగుందుచుండెను. 

నే నిపుడేమి చేతును? ఎక్కడి కేగుదును? ఈ వనమున నాకు బాటయు తెలియదే. ఇపుడెట్లని రాజు వగచెను. ఇట్లు చింతాతురుడై యొంటిగ రాజు విచారించుచుండగ నతనికి నిర్మలమైన నీరుగల యొక కొలను కనిపించెను. అది గని రాజు ప్రసన్నుడై గుఱ్ఱముదిగి దానికి నీరు పెట్టి తాను నిర్మలజలము త్రాగెను. రాజు నీరుగ్రోలి శాంతిజెంది తన పురి కేగదలచెను. 

కాని యతడు దారితెన్ను తెలియక మోహితుడయ్యెను. అంతలో విశ్వా మిత్రుడొక వృద్ధ బ్రాహ్మణ రూపమున వచ్చెను. రాజు బ్రాహ్మణునిగని భక్తిమీర నమస్కరించెను. తన్ను నమస్కరించు చున్న రాజుతో 

విశ్వామిత్రు డిట్లనెను: రాజా! నీకు మేలగుత! ఇచటి కేల వచ్చితివి. ఈ విజన ప్రదేశమున కొంటిగ నేమి ప్రయోజనము గోరి వచ్చితివి? ఈ కారణములన్నియును నాకు నిలుకడతో చెప్పుము. 

రాజిట్లమెను: ఒక బలముగల మహాకాయమగు పంది నా పూలతోటలో బడి మెత్తని పూలచెట్ల నన్నిటిని త్రెంపి వేసెను. 

విప్రవర్యా! నే నా చెడుపందిని చంపుటకు విల్లునంబులుబూని సైన్యమే వెంటరాగా నగరు వెడలి వచ్చితిని. ఆ మాయవి-పాపిష్ఠమగు పంది నా కండ్లకు కానరాక వేగమెటకో పరుగెత్తెను. దాని వెంట నేను బడితిని. నా సైన్య మెటు పోయెనో తెలియుటలేదు. నే నాకలిదప్పులచే భాదపడి యిచటికి వచ్చితిని. నా సైన్య మేమయ్యెనో తెలియదు. 

నగరపు బాట యును తెలియుటలేదు. ఓ విభూ! నా యదృష్టమువలననే నీ వీ నిర్జనప్రదేశమున కేతెంచితివి. నాకు మార్గము చూపింపుము. నా పురి కేగగలను. నే నయోధ్యాపతిని. నన్ను హరిశ్చంద్రుడందురు. రాజసూయము చేసినవాడను. యాచకుల కోర్కెలు దీర్చువాడను. 

ద్విజవర్యా! నీకు యజ్ఞమునకు ధనము కావలసినచో నా వెంట నయోధ్యకు రమ్ము. నీకు కావలసి నంత ధన మీయగలను.

హరిశ్చంద్రుని మాటలువిని నవ్వి విశ్వామిత్రు డతని కిట్లనెను. రాజా! మహాశయా! ఇది పాపనాశకమగు పావనపుణ్యతీర్థము. ఇచట స్నానముచేసి పితృతర్పణము చేయుము. నేడు పర్వదినము. ఇది పవిత్రమైన పుణ్యతీర్థము. ఇందు స్నానముచేసి నీ శక్తి యున్నంతగ దానము చేయుము. 

ఏదైన పుణ్యతీర్థమున కేగిన వాడందు స్నానము చేయక వెళ్ళినచో నతడాత్మఘాతుకుడగునని మనువు వాక్క్రుచ్చెను. కనుక రాజా! ఈ శ్రేష్ఠమైన తీర్థ రాజమున నీ శక్తి కొలదిగ పుణ్యము చేసికొనుము. నీకు తరువాత మార్గము చూపింతును. నగరమునకు వెళ్లవచ్చును. 

కాకుత్థ్సా! అనఘా! నీ దానమునకు సంతోషించి నేను నీకు బాట చూపించుటకు నీవెంట రాగలను. కపట మండితమగు ముని వాక్కులువిని రాజు తనపై నున్న వస్త్రములు విడిచి యథావిధిగ స్నాన మాడుటకు నదిని జేరెను. ముని వాక్యములకు మోహితుడై అతనికి వశుడైన రాజు చెట్టునకు గుఱ్ఱమును కట్టివేసి రాగలదైన యోగమును తప్పించుకొనలేకున్నందున చక్కగ స్నాన విధి నెఱవేర్చుకొని పితృదేవతలకు తర్పణము విడిచి 

విశ్వామిత్రునితో నిట్లనెను: స్వామి! నీకు దాన మొసంగుదును. మహాత్మా! నీ విపుడేది కోరిన దాని నిత్తును. ఆవులో! భూమియో! బంగారమో! గజాశ్వరథవాహనములో! కోరుకొనుము. రాజసూయయాగ మపుడు మునుల సమక్షమున దానవ్రతము పట్టితిని. 

కనుక నే నీయజాలని వస్తువేదియును లేదు. మునీశా! నీ వా పుణ్యతీర్థరాజమున కనబడితివి. నీ కోర్కి యేదియో తెలుపుము. దానిని తప్పక తీర్పగలను.

విశ్వామిత్రు డిట్లనెను : ''రాజా! మున్నొ కప్పుడు నేను వసిష్ఠునివలన నిన్ను గూర్చి వింటిని. ఈ భూమండలమున హరిశ్చంద్రునిబోలు దాత-కీర్తిశాలి-లేనేలేడు. హరిశ్చంద్రుడు సూర్యవంశమందలి మహారాజు. ఆ రాజునుబోలు దాత మున్ను లేదు. ముందుండబోడు. 

అతడు త్రిశంకు కుమారుడు. పరమోదారుడు. అని అతడనెను. అట్టి నిన్ను ప్రార్థించుచున్నాను. 

రాజా! నేనొక వివాహము జరుపవలయును. మహానుభావా! నా కొడుకు పెండ్లి. కనుక ధనమిమ్ము. 

రాజిట్లనెను : విప్రవర్యా! వివాహము జరిపించుకొనుము. నీవు కోరిన దిత్తును. నీవెంత ధనము కోరుదువో యంతధనము నీ కీయగలను. విశ్వామిత్రుడు రాజును వంచింపదలచెను. ముని గాంధర్వమాయ పన్ని యొక సుకుమార కుమారుని పదియేండ్ల కన్నియును రాజునకు చూపి 

రాజా! వీరిర్వురికి పెండ్లి జరుపవలయును. పెండ్లి చేయుటచే రాజసూయ యజ్ఞముకంటె గొప్పపుణ్యము. పెండ్లిచేసి యిల్లు నిలువబెట్టుట మంచిది గదా! ఇపుడీ విప్రకుమారుని పెండ్లివలన నీకు పున్నెము గల్గును. అను ముని వాక్కులకు రాజు మాయామోహితుడయ్యెను. ఆతడు సరేయని మాట యిచ్చెను. 

రాజ్యదానం

No comments:

Post a Comment