Saturday, April 18, 2026

Revathudi's Satya Loka Yatra - రేవతుడిసత్యలోకయాత్ర

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధమురేవతుడిసత్యలోకయాత్ర

జనమేజయ డిట్లనెను: ఓ వ్యాసమహర్షీ ! రేవతుడు రేవతిని తీసికొని బ్రహ్మలోక మేగెనను విషయము నా మది కచ్చెరువు గొలుపుచున్నది. నేను మున్ను బ్రాహ్మణుల సభలో కథాప్రసంగమున నొక మాట వింటిని. 

ఏమన బ్రహ్మవిదుడు శాంతుడునగు బ్రాహ్మణుడు బ్రహ్మలోకము వెళ్ళగలడు. భూలోకవాసులకు బ్రహ్మలోకము చేరరానిది. మఱి రేవతుడు రేవతిని తీసికొని స్వయముగ నెట్లు బ్రహ్మలోకమేగ గల్గెను? చచ్చినవాడు స్వర్గమేగునని సర్వశాస్త్రములు తెల్పుచున్నవి. ఈ మానవదేహముతో బ్రహ్మలోకము చేరుటెట్లు సాధ్యము? 

ఆ స్వర్గమునుండి మానవలోకమునకు తిరిగి యెట్లు రావచ్చును? ఓ విద్వాంసుడా! రేవతుడు బ్రహ్మనుజేరి ప్రశ్నించదలచి యెట్లు వెళ్ళను. నా యీ సంశయ మిపుడు దీర్చుటకు నీవు సమర్థు డవు. అన 

వ్యాసు డిట్లనెను: ఓ రాజా! సుమేరు పర్వత శిఖరములందు సర్వలోకములు నెలకొనియున్నవి. ఇవి ఇంద్ర లోకము; అగ్ని లోకము; యమలోకము; సత్యలోకము; కైలాసము; వైష్ణవనిలయమగు వైకుంఠధామము. 

పూర్వము దనుర్ధరుడు పార్థుడునైన అర్జునుడు దేవేంద్ర నగరమున నైదు సంవత్సరములు నివసించెను. అపుడింద్రుని సన్నిధిలో నర్జునుడు మానవ శరీరముతో నుండెను. అర్జునునివలె కుకుత్థ్సుడు మొదలుగాగల రాజులు స్వర్గ మేగిరి. పిదప మహాబలశాలురగు దానవులును స్వర్గసీమను చేరిరి. వారింద్రనగరము జయించి సుఖముండిరి. 

మునుపు మహాభిషుడను మహారాజు బ్రహ్మ లోకమునకు వెళ్ళుచు త్రోవలో నతడు గంగాసుందరిని చూచెను.

అంతలో దైవవశమున కమ్మనిపిల్లగాలుల కామె మేనిమీద వస్త్రము కొంత తొలగెను. అపుడామె సగము దిగంబరగ నుండగ రాజదేవైపు ఱప్పవాల్పకచూచెను. ఆ రాజు వలరాజు బాణములకు తాళలే కామె వాడిచూపుల నెదుర్కొనుచు చిర్నవ్వు నవ్వెను. ఆ సుందరియు మరల చిర్నగవు నవ్వెను. 

ఈ యిర్వురి నవ్వులను బ్రహ్మచూచి మీరు నేలపై బుట్టుడని శపించెను. ఎల్ల దేవతలును దైత్య దానవులచేత పీడింపబడి కమలాపతియగు విష్ణునిజేరి సంస్తుతింతురు. రాజా విజ్ఞులగు మానవు లెల్లలోకముల కేగవచ్చును. ఈ విషయముగూర్చి ఆవంతయు సందేహింప బనిలేదు. 

సరపతీ! పుణ్యాత్ములు తాపసోత్తములు అటకు తప్పక వెళ్ళగలరు. వాని పుణ్య సత్యములు వారి బాటలో వారికి తోడుగ నుండును. అట్లే యజ్ఞము నిర్వర్తించు మహితాత్ములగు యజమానులు వెళ్లగలరు అనెను. 

జనమేజయు డిట్లనెను: అట్లు తన పుత్రియగు రేవతినిగొని వెళ్లిన ఆ రాజు బ్రహ్మలోకము జేరిన పిమ్మట యేమి చేసెను? బ్రహ్మ యతని కేమని పలికెను? రేవతి నెవరి కిచ్చిరి? విప్రవర్యా: అన్ని విషయములు నాకు వివరముగ దెల్పుము.

వ్యాసు డిట్లనియెను : రాజా! వినుము. రేవతుడను రాజు గలడు గదా : అతడు తన పుత్రికి తగిన వరుని తెలియు టకు బ్రహ్మలోక మేగెను. అత్తఱి నచట సంగీతసభ సాగుచుండె. అతడానందముతో నట నుండెను. అతడు తన కన్యతో సభయందు జరుగుచున్న నాదగానమాధురి చెవులార గ్రోలుచు సంతోషించెను. 

అది పూర్తికాగా బ్రహ్మకు నమస్కరించెను. రేవతుడు తన కూతును బ్రహ్మకు జూపి యిట్లు పలికెను. ఓ దేవపతీ! ఈమె నా కుమార్తె. ఈమెకు తగిన వరుడెవడో తెల్పుము. ఈమె నే రాజవరున కీయవలయునో నిన్నడుగ వచ్చితిని. ఎందఱో కులశీలములుగల రాజపుత్రులను చూచితిని. 

వారిలో నొక్కడును నా మనస్సునకు నచ్చినవాడు లేడు. అందువలన దేవదేవా! నిన్నడుగుట కిటకు వచ్చితిని. సర్వజ్ఞా: యోగ్యుడు కులీనుడు బలశాలి సర్వలక్షణ సంయుతుడునైన రాకుమారిని వరునిగ తెలుపుము. దాత ధర్మశీలుడునగు రాజ పుత్రుని నాకు తెలుపుము. 

అను రాజుమాటలకు జగత్కర్తయగు బ్రహ్మ వినెను. బ్రహ్మ కాలవైపరీత్యమునకు నవ్వుచు నిట్లు పలికెను. 

రాజా! నీ పుత్త్రికి రాజపుత్రులను వరులుగ కొందఱి నాలోచించితివి. ఇపుడు వారెల్లరును వారి తండ్రితాత లును వారి బంధువు లందఱును కాలగర్బముల గలిసిరి. ఇపుడిరువదియేడవ ద్వాపరము నడచుచున్నది. ఇపుడు నీ వంశ జులు చనిపోయిరి. నీ పురము దానవులచేత జిక్కెను. అచట నిపుడు చంద్రవంశరాజు రాజ్య మేలుచున్నాడు. అతడు యయాతి వంశజుడు. మధురానగరాధిపతి ఉగ్రసేనుడన పేరు గాంచినవాడు.

ఉగ్రసేనుని కొడుకు కంసుడు. అతడు దేవతలను ద్వేషించువాడు. బలశాలి-దైత్వాంశజుడు. తన తండ్రినే కారాగారమున బంధించెను. అతడు మదగర్వముతో నెల్లరాజుల జయించి పాలించుచున్నాడు. భారమునకు తాళలేక భూ మాత బ్రహ్మను శరణు వేడెను. క్రూర రాజసేనల భారముతో భూమి క్రుంగాపోయెను. 

దేవత లెల్లరును తమ తమ యంశములతో నవతరించిరి. కమలలోచనుడు వాసుదేవుడు నగు కృష్ణుడు దేవరూపిణియగు దేవకియం దుద్బవించెను. కృష్ణుడు నారాయణ మున్యంశమున జనించినవాడు. 

తొల్లి సనాతనుడు ధర్మపుత్రుడు నరసఖుడునగు నారాయణుడు గంగాతీరమున పావన బదరికాశ్రమందు వాసుదేవుడని శ్రీకృష్ణుడని ప్రసిద్ది గాంచుట కవతరించి పాపాత్ముడగు కంసుని చంపెను. అట్లు కంసుని చంపి యతని రాజ్యమును కృష్ణుడు గ్రసేనున కిచ్చెను. 

కంసుని మామ జరాసంధుడు - బలశాలి - పాపాత్ముడు. అతడు కోపముతో మధురపై దండెత్తి పోరు సాగించెను. కాని మహాబలుడగు జరాసంధుడు కృష్ణుని చేతిలో వోడెను. జరాసంధుడపుడు మహాబలుడగు కాలయవనుని కృష్ణునిపై యుద్ధమునకు పురికొల్పెను. 

శూరుడగు యవనపతి సైన్యముతో వచ్చుట కృష్ణుడు వినెను. అంత కృష్ణుడు మధురవదలి ద్వారకకేగెను. ఆ శిథిలపురమును శిల్పులచేత నిర్మింపజేసి జీర్ణమైన నగరమును పునరుద్ధరించెను. 

దానికి తన వశమందున్న యుగ్రసేనుని రాజుగ చేసెను. యాదవులనందఱను ద్వారకలో నివసింపజేసెను. అచట నిపుడు శ్రీకృష్ణుడు తన బంధుమిత్రులతో నివసించుచున్నాడు.

కృష్ణుని యన్న బలదేవుడు. అతడు శేషాంశవలన నవతరించినవాడు. హలాయుధుడు ; ముసలి ; వీరుడు. అతడు నీ కొమరి తకన్ని విధముల తగినవరుడు. కమలలోచనయగు నీ కన్యను బలరామున కిచ్చి యథావిధిగ వివాహ మంగళ కార్యము జరిపించుము. 

రాజా! అట్లు నీ కూతును కన్యాదానము చేసిన పిమ్మట నీవు సురారామము పావనము జనుల కోర్కెలు దీర్చునది-యగు బదరికాశ్రమమున తన మొనరించుట కరుగుము. అని పద్మయోనియగు బ్రహ్మ పలుకగా రాజు తన కన్యను వెంటగొని వేగమే ద్వారకను జేరెను. 

శుభలక్షణయగు తన కన్నియను బలదేవున కొసంగి పిదప తీవ్ర తప మొనరింప నడవుల కేగెను. అతడు నదీతీరమున మేను చాలించి స్వర్గము చేరెను. అన విని 

రాజిట్లనెను : ఓ వ్యాసమునీ! నీ వాశ్చర్యకరమైన విషయము వెల్లడించితివి. రేవతుడు బ్రహ్మలోకమున తన కూతుతో నేగి యట నూటయెనిమిదియుగము లుండె నంటివి. 

అంతటి దీర్ఘకాలమునగూడ రేవతుడుగాని రేవతిగాని ముసలివారు కాలేదా? ఇంతకాలము వారి కాయువుతీర కెట్లుండున ?.

వ్యాసు డిట్లనెను: అనఘా: బ్రహ్మలోకమునందు సతతము ముదిమి ఆకలిదప్పులు చావుభయము నిందమున్నగు దొసగులు మచ్చునకైన లేవు. శర్యాతి స్వర్గమున కేగిన పిమ్మట నతని సంతానము రాక్షసులచే పీడింపబడి కుశస్తలి వదిలి భీతితో చెల్లాచెదరయ్యెను. 

వైవస్వతమనువు తుమ్మునుండి వీర్యవంతడగు ఇక్ష్వాకు మహారాజు జన్మించి ప్రసిద్ధి గాంచెను. అతడు సూర్యకులదీపకుడు. అతడు వంశోద్ధారమునకు నారదునివలన దీక్షబొంది నిరంతరముగ హ్రీంమయియగు శ్రీదేవిని ధ్యానించి తపించెను. అతనికి నూర్గురు కొడుకులు. 

వారిలో వికుక్షి జ్యేష్ఠుడు-అతడు బలవీర్యసంయుతుడు. ఇక్ష్వాకు డయోధ్య రాజధానిగ పాలించి వాసి కెక్కెను. అతనికి శకుని మున్నగు నేబదిమంది కొడుకులు పుట్టిరి. 

రాజా! అతడు వారిలో కొందఱి నుత్తరాపథమునకు కొందఱిని దక్షిణాపథమునకు రాజులుగ చేసెను. ఆ యేబదిమందిలో నలువది యెనిమిది మందిని పాలకులుగ నియమించి తక్కిన యిద్దఱిని తన పరిచర్యల కుంచుకొనెను.

సూర్య వంశ రాజ వృత్తాంతము


No comments:

Post a Comment