Sunday, April 19, 2026

Trishankudiki Vishwamitruni Pratyupakaram - త్రిశంకుడికి విశ్వామిత్రుని ప్రత్యుపకారం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - త్రిశంకుడికి విశ్వామిత్రుని ప్రత్యుపకారం

యామె తన పతి కిట్లనియెను: మునివర్యా! నీవు వెళ్ళిన పిమ్మట నేను దారుణమైన కరవు కాల మెట్లు గడిపితినో వినుము. మన పుత్రులంద ఱన్నము లేక మిక్కిలి దుఃఖించిరి. ఆకలిగొన్న బాలురను జూచి ధాన్యమునకై వనమువనము తిరిగితిని. అట్లు విచార ముతో తిరుగుచుండగ నాకు కొన్ని ఫలములు కనిపించెను.

వానితో కొంత ధాన్యముతో నెట్లో కొన్ని నెలలు గడిపితిని. కాంతా! కొంతకాలమున కవియు దొరుకక నేనెంతయో కుమిలితిని. ఈ కరవు దినములలో నింత బిచ్చము పెట్టువారులేరే! అడవిలో ధాన్యములేదే! చెట్లకు పండ్లులేవు. భూమిలో కందమూలములు లేవు. 

నాబాలు రాకటి బాధచే బావురుమని యేడ్చుచున్నారు. ఇపుడెక్కడికేగుదును? ఏమి చేతును? ఈ యాకలిచే పీడితుల కేమి సమాధానము చెప్పుదును. అని మదిలో చింతించి తుదకిట్లు నిశ్చయించితిని. 

ఒక కుమారునే ధనవంతున కైన నమ్మి డబ్బు తీసికొని దానితో బాలురను త్కనకి పోషింపవలయును. ఇటు లాకలిచే పీడితులను బోషింతును. వీరిని పెంచుటకు మఱి యితరోపాయము లేదు. అని తలచి యొక బాలు నమ్మదలచితిని. 

మహానుభావా! ఆ బాలుడు పల్మారు క్షుధార్తితో నేడ్చుచుండెను. అట్టివానిని తీసికొని నేను సిగ్గుమాలి బయలుదేరితిని. అంతలో త్రోవలో సత్యవ్రతుడను రాజర్షి దిక్కులేని నన్ను జూచి యీ బాలు డేల యేడ్చుచున్నాడని యడిగెను. 

మునిసత్తమా! అపుడు నేనతని కిట్లు పలికితిని. నేనీ బాలు నమ్ముటకు వెళ్ళుచున్నాను. నా మాటలు వినగనే రాజు గుండె కరగెను. 

అతడిట్లనెను: ఈ చిన్నారి బాలుని తీసుకొని నీ యింటి కేగుము. ముని తిరిగి వచ్చునంతవఱకు నేనీ కుమారకులకు తగిన మాంసము పంప గలను. ఆ రాజు దయతో ప్రతిదినము పందులను జింకలను వేటాడి వాని మాంసము నొక చెట్టుపై నుంచి వెళ్ళుచుండెను.

అతని వలననే మన బాలకులీ దుఃఖసాగరము దాటగల్గిరి. అట్టి రాజు నా కారణమున వసిష్ఠునిచే శపింపబడెను. ఒకనాడడవిలో మాంసము దొరకనందున నతడు వసిష్ఠునియావును చంపెను. 

గాన వసిష్ఠునకు కోపము వచ్చెను. ముని యతనిని చండాలునిగ శపించెను. ఇట్లు కోపము గోవధ చండాలత్వ - మీమూటి వలన రాజునకు త్రిశంకుడని పేరు పెట్టెను. 

ఓ కౌశికా! అతనికి గల్గిన దుఃఖమునకు నేనెంతయో వగచితిని. నా వలన రాజకుమారుడు చండాలుడయ్యెను కనుక ఏ ఉపాయము చేతనైనను నీ ప్రబల తపము వలన నైన నా రాజును బ్రోచుట మంచిది. 

అను భార్య మాటలు విని కౌశిక ముని దీనముగ నున్న తన పత్ని నోదార్చి యామె కిట్లనెను 

''కమలలోచనా! అతడు నీ కుపకారము చెసెను. అడవిలో నీ వతని వలన రక్షింపబడితివి. కనుక నేను రాజును శాపముక్తుని జేయగలను. నా విద్యా తపోబలము నతని దుఃఖము బాప గలను.'' అని పరమార్థవిదుడగు కౌశికుడు తన భార్య నూరడించెను. 

త్రిశంకున కెట్లు దుఃఖము తొలగునాయని కౌశికముని యెంతయో యోజించి తుదకు రాజున్న చోటికేగెను. అపుడు త్రిశంకుడొక మాలపల్లెలో దీనముగ చండాల రూపమున నుండెను. 

తన చెంతకు వచ్చుచున్న మునిని గని రాజచ్చెరువందెను. రాజు వెంటనే ముని పాదములకు దండ ప్రణామము లొనర్చెను. ముని రాజును లేపి చల్లనిమెల్లని మాటలతో నిట్లనెను. 

ఓ రాజా! నీవు నా కొఱకు ముని చేత శపింపబడితివి.

రాజిట్లనెను: నేను మున్ను యాగము చేయించుమని వసిష్ఠుని ప్రార్థించితిని. మునివర్యా! నేనొక యజ్ఞము చేయదలచితిని. ఆ యాగము వలన నేను స్వేచ్ఛగ స్వర్గమేగ దలచితిని. దానిని జరిపించుమని మునినడిగితిని. నేనీ శరీరముతోడనే స్వర్గ సుఖములంద గోరితిని. 

అపుడు వసిష్ఠుడు కోపించి నన్ను దుర్మతీ! అని సంబోధించి యిట్లనెను : ఈ నర దేహముతో స్వర్గ వాసము నీకెట్లు గల్గును? అనగా అపుడు నేను మరల స్వర్గ లోభముచే నిట్లంటిని. 

''అట్లయిన నేను వేరొక్కని పురోహితునిగ నియమించుకొని నాయుత్తమ యజ్ఞ మొనర్తును'' అపుడు నేను మునిచే చండాలుడుగ శాప్తుడనైతిని. ఇట్లు నీకు నాశాప కారణము తెల్పితిని. 

మునీశ్వరా! నా దుఃఖము తొలగించుటకు నిన్ను వేడుచున్నాను. అని శోకార్తుడగు రాజు మిన్నకుండెను. అంత కౌశికుడును రాజు శాపము తొలగించుటకు నెమ్మది చక్కగ తలంచెను.

త్రిశంకుడికి సశరీర స్వర్గం

No comments:

Post a Comment