తులసీదేవి ఇక్కడికి ప్రసంగం చాలించింది. ఇద్దరూ క్షణకాలం మౌనంగా ఉండిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి శంఖచూడా! ఏం చేస్తున్నావ్? కబుర్లు చెబుతూ కూర్చున్నావా? గాంధర్వ పద్ధతిలో తులసీదేవి పాణిగ్రహణం చెయ్యి. నువ్వు పురుషరత్నానివి, ఈవిడ స్త్రీరత్నం. నెరజాణకు నెరజాణతో కలయిక ఆనందప్రదమేకదా! నిర్విరోధంగా లభించే ఉత్తమ సుఖాన్ని ఎవరయివా వదులుకుంటారా? అలా వదులుకునేవాడు శుద్ధపశువు.
కాంతామణీ! ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు. ఎంతసేపు పరీక్షిస్తావు? ఇటువంటి గుణవంతుడు కోటికొక్కడుకూడా ఉండడు. దేవ దానవులను జయించిన మహావీరుడు. లక్ష్మీశ్రీహారులలాగా రాధాకృష్ణులలాగా నేనూసరస్వతిలాగా భవుడూభవానీలాగా ధరాదేవీవరాహమూర్తుల్లాగా అనసూయ అత్రిమహర్షుల్లాగా నలదమయంతులలాగా రోహిణీచంద్రుల్లాగా రతిమన్మథుల్లాగా దితికశ్యపుల్లాగా వసిష్ఠారుంధతుల్లాగా అహల్యాగౌతముల్లాగా కర్దమదేవహూతుల్లాగా తారాబృహస్పతుల్లాగా శతరూపామనువుల్లాగా దక్షిణాయజ్ఞదేవతల్లాగా స్వాహాహుతాశనుల్లాగా శచీదేవేంద్రుల్లాగా పుష్టిదేవీ గణపతుల్లాగా దేవసేనా షణ్ముఖుల్లాగా తులసీశంఖచూడులు మీరిద్దరూ దంపతులై సాభాగ్యసంపదలతో వర్ధిల్లండి. సుఖసంతోషాలను యథేచ్చగా అనుభవించండి. అటుపైని గోలోకం చేరుకుందురుగావి. తులసీ! నువ్వు అప్పుడు కృష్ణపరమాత్మను కలుసుకుందువుగాని అన్నాడు.
నారాయణమహర్షి ఇంతవరకూ చెప్పి కాసింత విశ్రాంతి తీసుకున్నాడు. నారదుడు మళ్ళీ మొదలుపెట్టాడు. మహర్షీ! నాకన్నీ సందేహాలే! అన్నీ సంశయాలే. నీవంటి జ్ఞాని దారికినప్పుడే అన్నీ తీర్చేసుకోవాలి. విసిగిస్తున్నాను అనుకోవద్దు. చాలా విచిత్రమైన ఉపాఖ్యానం చెప్పావు. ఇలాంటివి ఇప్పటికి చాలా చెప్పావు. అయినా నాకు తృప్తి కలగడంలేదు. తులసీ శంఖచూడుల కథ ఆటుపైని ఏమయ్యింది, ఆ విశేషాలు వినాలని ఉంది అని అడిగాడు. నారాయణుడు గొంతు సవరించుకుని మిగతా కథ చెప్పనారంభించాడు.
నారదా! బ్రహ్మదేవుడు అలా ఇద్దరినీ ఆశీర్వదించి తన లోకానికి వెళ్ళిపోయాడు. తులసీ శంఖచూడులు గాంధర్వవివాహం చేసుకున్నారు. దేవలోకంలో దుందుభులు మ్రోగాయి. పారిజాత పుష్పవృష్టి కురిసింది. వివిధ శృంగారక్రీడల్లో తేలియాడారు. తులసీదేవి నవసంగమ సమ్మూర్చిత అయ్యింది. నీరులేని సుఖసాగరంలో మునిగితేలింది. కామశాస్త్రంలో చెప్పిన చతుష్షష్టి బంధ విశేషాలతో ఆ రసికదంపతుల కలయిక నిత్యనూతనంగా అనుక్షణమధురంగా సాగింది. అంగ ప్రత్యంగ సంశ్లేషాలతో సర్వాంగచుంబనలతో ప్రణయకలహాలతో పరస్పర సాంత్వనాలతో పుష్పోద్యాననదీతీరాలలో పొదరిళ్ళలో చందనచర్చలతో నిర్విరామంగా వారి సంభోగ శృంగార లతిక చిగురులు తొడిగింది. లీలావిలాసాలతో తులసీదేవి, రాసిక్యవైభవంతో శంఖచూడుడూ పరస్పరం మనస్సులు దోచుకున్నారు. కౌగిలింతలకు చందనచర్చలు పేటులెత్తాయి. స్వేదజలానికి సిందూరతిలకాలు చెమ్మగిల్లాయి. నఖక్షతాలతో దంతక్షతాలతో తులసీదేవి సర్వాంగీణంగా చిగురించిన తీగలాగా ఉంది. శంఖచూడుడి గుండెలమీద బుజాలమీద క్షతాలతోపాటు తులసీదేవి ధరించిన కంకణాద్యాభరణాలు ఒత్తుకుని గుర్తులేర్పడ్డాయి. ఆలింగన చుంబన జంఘాదిమర్దనలతో కవ్వింపులతో కొసరింతలతో బెదిరింపులతో చిరునవ్వులతో నిట్టూర్పులతో తాంబూలసేవనలతో పల్లటీ కూతలతో(మణిత ధ్వనులు) సంస్కారసంపన్నమైన శృంగారానుభవంతో రేయింబవళ్ళు సంతృప్తి చెందుతున్నారు. ఏపూటకాపూట విలువైన వస్త్రాలూ ఆభరణాలూ సుగంధానులేపనాలూ పుష్పాలంకరణలతో పరస్పరం కన్నులపండువు చేసుకుంటున్నారు.
జరారోగహరమైన పారిజాతకుసుమాన్నీ అమూల్య రత్నాంగుళీయకాన్నీ త్రిలోకదుర్లభమైన అనర్ఘమణినీ తులసీదేవి శంఖచూడుడికి బహూకరించిది. నీ దాసిని నేనని మాటిమాటికీ పలవరిస్తూ భక్తిగా పాదాభివందనం చేసింది. శంఖచూడుడు లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. నేనే నీ దాసుణ్ణి అన్నాడు. వరుణదేవుడినుంచి జయించి తెచ్చిన అమూల్యవస్త్రాలనూ త్రిలోక దుర్లభమైన రత్నమాలికనూ మంజీరాలనూ కేయూర కుండలాలనూ కంకణాంగుళీయకాలనూ విశ్వకర్మ ఇచ్చిన అపూర్వశంఖాన్నీ పద్మపత్ర నిర్మితమైన శయ్యనూ తులసికి బహూకరించి ఆమె చిబుకం పట్టుకుని ముఖం పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వులు కురిపించాడు. ముద్దులతో నింపాడు. కబరీభరంలో మాంగళ్యభూషణాన్ని అలంకరించాడు. చందనకుంకుమబిందు నిర్మితమైన మకరికాపత్రాలను చెక్కిళ్ళపై చిత్రించాడు. సిందూర తిలకం దిద్దాడు. నల్లని జుట్టుమధ్య అది దీపంలా వెలిగిపోయింది.
పాదపద్మాలకు లత్తుక, గోళ్ళకు రంగు తీర్చిదిద్ది ఆ పాదాలను తన గుండెలకు హత్తుకుని దేవీ! నీ దాసుణ్ణి అంటూ మైమరిచి పలవరించాడు. మెల్లగా కౌగిలించుకున్నాడు. గుండెలపై పరుండబెట్టుకున్నాడు.
ఇలా ఎంతకాలం గడిచిందో వారికే తెలీదు. ఒకనాడు ఎందుకనో ఇద్దరూ కలిసి ఆ తపోవనాన్ని విడిచిపెట్టేసి మలయపర్వత సీమలకు వెళ్ళిపోయారు. అక్కడ ప్రతిశిఖరంమీద ప్రతి సానువులోనూ ప్రతి వనంలోనూ ప్రతి పొదరింటా ప్రతిగుహలోనూ ప్రతి సరస్సులోనూ ప్రతి నదీతీరంలోనూ ప్రతి పులినతలంమీద తామే అయి క్రీడించారు. పుష్పభద్రానదిలో జలక్రీడలు సాగించారు. అటునుంచి గంధమాదనంమీద మరికొంతకాలం వినోదించి నందనంలో విహరించారు. చంపక కేతకీ మాలతీ కుంద కుముద వనాలలో ఆనందించారు. ప్రతి కల్పవృక్షచ్భాయలోనూ నిర్జన కాంచన శిఖరాలమీదా వలపులు పండించుకున్నారు, పుంస్కోకిలల కలకూజితాలతో గండుతుమ్మెదల ఝంకారాలతో కోరికలు తీర్చుకున్నారు. అయివా కామం చల్లారలేదు. ఆజ్యంపోసినట్టు కామాగ్ని మరింతగా ప్రజ్వరిల్లింది.
దానవేంద్రుడు శంఖచూడుడు తులసీదేవితో తన రాజధానిలోకి ప్రవేశించాడు. మనోహర కేళీమందిరం కల్పించి అందులో ఇద్దరూ ఆనందించారు. అక్కడినుండే ఆ ప్రతాపశాలి సాధారణ పరిపాలన సాగించాడు. ఇలా ఒక మన్వంతరం గడిచింది. ఇంతకాలమూ దేవదానవ సంగ్రామాలు లేవు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. దానవవీరులూ తమ తమ ఇల్లాండ్రతో ఆనందాలనుభవించారు.
దానవుల చేతిలో పరాజితులై స్వర్గలోకాన్నీ అధికార భోగభాగ్యాలనూ కోల్పోయిన దేవతలు భిక్షుకులై సంచరిస్తున్నారు. వారంతా గుమికూడి బ్రహ్మదేవుడి సన్నిధికి వెళ్ళారు. తమ దుస్థితి విన్నవించి గొల్లుమన్నారు. బ్రహ్మతో కలిసి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి తీసుకుని వైకుంఠానికి వెళ్ళారు.
అది వైకుంఠం. అత్యంతదుర్లభం. పరమపదం. జరామృత్యుహరం. దానిద్వారం దగ్గర ఇరువైపులా ద్వారపాలకులున్నారు. రత్న సింహాసనాలమీద కూర్చుని ఉన్నారు. రత్నాభరణాలతో పీతవస్త్రాలతో వన మాలికాలంకృతులై సాక్షాత్తు విష్ణుమూర్తుల్లాగా శ్యామసుందర విగ్రహులై చతుర్భుజులై గదాశంఖచక్ర పద్మధారులై పద్మనేత్రులై హసన్ముఖులై కావలికాస్తున్నారు. బ్రహ్మదేవుడు తమ రాకనూ కారణాలమా వారికి విన్నవించాడు. వారు అనుజ్ఞ ఇచ్చారు. ఆమీదట అందరూ లోపలికి ప్రవేశించారు. ఇలాంటి ద్వారాలు వరుసగా పదహారున్నాయి. ఆంతటా ఇదే పరిస్థితి, ఇదే అవస్థ. అన్నీ గడిచి ప్రధాన సభామంటపం చేరుకున్నారు. అక్కడ శ్రీమన్నారాయణుడు దేవర్షి పరివృతుడై కొలువుతీరి ఉన్నాడు. చతుర్భుజులూ నారాయణ స్వరూపులూ కౌస్తుభాలంకృతులూ అయిన పార్షదులు పరివేష్టించి ఉన్నారు.
ఆ నభామంటపం చతురస్రాకారంలో ఉంది. చంద్రమండలంలాగా వెన్నెలలు వెదజల్లుతోంది. మణిమయహారాలు తోరణాలుగా వేలాడుతున్నాయి. అంతటా రత్నాలు పొదిగారు. శ్రీహరి కేవలం ఇచ్చామాత్రంతో సృష్టించినట్టుంది. ఎటుచూసినా మేలిమిముత్యాల అలంకరణలు. నేలంతా మణికుట్టిమం, జలభ్రాంతిని కలిగిస్తోంది. నాలుగువైపులా గోడలకు మండలాకార మణిదర్పణాలు. మధ్యమధ్య అపూర్వంగా చిత్రరేఖలు. పద్మరాగమణులతో శిల్పం చెక్కిన పద్మాలు. వాటిమీద ఎగురుతున్నట్టు ఇంద్రనీలమణులతో తుమ్మెదలు. చుట్టూ లోపలితట్టునే శ్యమంతక మణులతో నిర్మించిన విశాల సోపాన నిశ్రేణి. ఇంద్రనీలమణి స్తంభాలు. ప్రతిస్తంభం దగ్గరా రతమయ పూర్ణకుంభాలు. వాటినుంచి పట్టుదారాలతో పాకిస్తున్న చందన లతలు - వాటికి చిగుళ్ళు.
సభామంటపానికి వెలుపల పారిజాతవృక్షాలు. వాటి పరిమళం చల్లగా మెల్లగా అంతటా వ్యాపిస్తోంది. లోపల కస్తూరీ కుంకుమ చందనాగురు సుగంధాలు విటితో పోటీపడుతున్నాయి.
సహస్రయోజన విస్తీర్ణమైన ఆ మహామంటపంలో ఒకవైపున విద్యాధరస్త్రీలు మనోహరంగా నృత్యాలు చేస్తున్నారు. మంద్రస్వరంతో విద్యాధరులు నేపథ్యగానం అందిస్తున్నారు. భవనానికి లోపలా వెలుపలా ఆయుధపాణులై హరికింకరులు కావలి తిరుగుతున్నారు.
ఆ సభామంటపానికి మధ్యభాగంలో శ్రీహరి చుక్కల్లో చంద్రుడులాగా వెలిగిపోతున్నాడు. అదొక సింహాసనం. అమూల్యరత్నసింహాసనం. దానిమీద శ్రీహరి. కిరీటి. కుండలి. వనమాలి. చందనచర్చిత నీల శరీరుడు. చేతిలో కేళీపద్మం. ఎట్టయెదుట నృత్యగీతాలను ఆస్వాదిస్తున్నాడు. చిరునవ్వులు ఆరబోస్తున్నాడు. శాంతన్వరూపుడై ఉన్నాడు. లక్ష్మీసరస్వతులు పాదాలు ఒత్తుతున్నారు. తాంబూలం సేవిస్తున్నాడు. ఆ పరిమళాలు వ్యాపిస్తున్నాయి. గంగాదేవి తెల్లని వింజామర వీస్తోంది.
సభాసదులందరూ భక్తివినమ్రులై స్తోత్రపాఠాలు చేస్తున్నారు. పరిపూర్ణతముడైన ఆ ప్రభువును దర్శించి బ్రహ్మేశానదేవతలందరూ శిరసువంచి నమస్కరించారు. బహుధా స్తుతించారు. అందరి తనువులూ పులకాంకురితాలే. అందరి గొంతులూ భక్తిగద్గదాలే. అందరి కన్నులూ అశ్రుజలపూర్ణాలే.
జగద్విధాత బ్రహ్మదేవుడు మరింత చేరువకి వెళ్ళి శిరస్సున అంజలిబంధంతో వినయంగా వంగి నిలబడి మెల్లగా యావద్వృత్తాంతమూ విన్నవించాడు. అంతా విన్న శ్రీహరి ఒక్క మందహాసం చేసి రహస్యంగా పలికాడు.
సహస్రయోజన విస్తీర్ణమైన ఆ మహామంటపంలో ఒకవైపున విద్యాధరస్త్రీలు మనోహరంగా నృత్యాలు చేస్తున్నారు. మంద్రస్వరంతో విద్యాధరులు నేపథ్యగానం అందిస్తున్నారు. భవనానికి లోపలా వెలుపలా ఆయుధపాణులై హరికింకరులు కావలి తిరుగుతున్నారు.
ఆ సభామంటపానికి మధ్యభాగంలో శ్రీహరి చుక్కల్లో చంద్రుడులాగా వెలిగిపోతున్నాడు. అదొక సింహాసనం. అమూల్యరత్నసింహాసనం. దానిమీద శ్రీహరి. కిరీటి. కుండలి. వనమాలి. చందనచర్చిత నీల శరీరుడు. చేతిలో కేళీపద్మం. ఎట్టయెదుట నృత్యగీతాలను ఆస్వాదిస్తున్నాడు. చిరునవ్వులు ఆరబోస్తున్నాడు. శాంతన్వరూపుడై ఉన్నాడు. లక్ష్మీసరస్వతులు పాదాలు ఒత్తుతున్నారు. తాంబూలం సేవిస్తున్నాడు. ఆ పరిమళాలు వ్యాపిస్తున్నాయి. గంగాదేవి తెల్లని వింజామర వీస్తోంది.
సభాసదులందరూ భక్తివినమ్రులై స్తోత్రపాఠాలు చేస్తున్నారు. పరిపూర్ణతముడైన ఆ ప్రభువును దర్శించి బ్రహ్మేశానదేవతలందరూ శిరసువంచి నమస్కరించారు. బహుధా స్తుతించారు. అందరి తనువులూ పులకాంకురితాలే. అందరి గొంతులూ భక్తిగద్గదాలే. అందరి కన్నులూ అశ్రుజలపూర్ణాలే.
జగద్విధాత బ్రహ్మదేవుడు మరింత చేరువకి వెళ్ళి శిరస్సున అంజలిబంధంతో వినయంగా వంగి నిలబడి మెల్లగా యావద్వృత్తాంతమూ విన్నవించాడు. అంతా విన్న శ్రీహరి ఒక్క మందహాసం చేసి రహస్యంగా పలికాడు.
No comments:
Post a Comment