Wednesday, August 19, 2026

Dhikpalaka Nagaralu - దిక్పాలక నగరాలు

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - దిక్పాలక నగరాలు

ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులుంటారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దిక్పాలకులకు వీరు సమష్టిరూపాలు. తూర్పుదిక్కున ఉన్నత సౌధశిఖరాలతో అమరావతి ఉంటుంది. మహేంద్రుడు ఇక్కడ కొలువుతీరి ఉంటాడు. స్వర్గలోకంలో ఉండే భోగంకన్నా ఇక్కడ భోగం వెయ్యిరెట్లు ఎక్కువ.

ఇతడు సమష్టి శతనేత్రుడుగదా! ఐరావతం అధిరోహించి వజ్రాయుధం ధరించి దేవసైన్యపరివృతుడై విరాజిల్లుతుంటాడు. దేవాంగనా సేవ్యమానయై శచీదేవి విరాజిల్లుతూ ఉంటుంది.

ఆగ్నేయకోణంలో వహ్నిపట్టణం: అందులో స్వాహా స్వధాయుక్తుడై అగ్నిదేవుడు(సమష్టిరూపం) ప్రకాశిస్తుంటాడు. నిజవాహనభూషాఢ్యుడై నిజసైన్యగణ పరివృతుడై దర్శనమిస్తాడు.

దక్షిణ దిక్కున యమపురి. అక్కడ దండధరుడు, యమభటులు, చిత్రగుప్తుడు. యముని మహిషం - అన్నీ సాక్షాత్కరిస్తాయి.

నైరృతి కోణంలో రాక్షసగణ పరివృతుడై నిజవాహన నిజశక్తి నిజభూషణ విరాజితుడె నిర్భతి నివసిస్తుంటాడు. ఇతడు ఖడ్గధారి.

పశ్చిమదిక్కున పాశధారి వరుణుడు మహాఝష వాహనారూఢుడై వారుణీమధువిహ్వలుడై నిజశక్తి సమాయుక్తుడై నిజయాదోగణ పరివృతుడై వరుణానీరతాకులుడై విహరిస్తుంటాడు.

వాయవ్యకోణంలో వాయులోకం. వాయుదేవుడుంటాడు. వాయుసాధన సంసిద్ధులైన యోగులు ఇతడి పరివారం. ధ్వజహస్తుడు. విశాలాక్షుడు. మృగవాహనుడు. మరుద్గణ నిజశక్తి పరివృతుడై కదలాడుతుంటాడు.

ఉత్తరదిక్కున యక్షలోకం ఉంది. వృద్ధి - బుద్ది శక్తులతో యక్షరాజు కుబేరుడిక్కడ అధినాయకుడు. నవనిధులకు అధిపతి. ఇతడు తుందిలుడు(పాట్ట పెద్దది). ధనాధిపతి. మణిభద్ర - పూర్ణభద్ర - మణిమాన్‌ - మణికంధర - మణిభూషణ - మణిస్రగ్వీ - మణికార్ముకధరాది యక్షసేనానులు ఇతడిని పరివేష్టించి ఉంటారు. నిజశక్తిధరుడై వెలుగొందుతుంటాడు.

ఈశానకోణాన రుద్రలోకం ఉంది. మహత్తరం. అనర్ఘరత్నఖచితం. మహారుద్రుడు దీని అధినేత. ఇతడు కోపిష్ఠి, దీప్తనయనుడు. వీపున ఎప్పుడూ అమ్ములపాదులు, ఎడమ చేతిలో నారి ఎక్కుపెట్టిన ధనుస్సు. శతకోటి ధానుష్కులు పరివేష్టించి ఉంటారు. 

తనతో సమాన బలసంపన్నులై శూలాయుధ పాణులై అసంఖ్యాక రుద్రులతో సన్నద్ధుడై ఉంటాడు. వాళ్ళంతా వికృతాస్యులు. కరాళాస్యులు. నిప్పులు కక్కుతుంటారు. కొందరు దశహస్తులు. కొందరు శతకరులు. కొందరు సహస్రభుజులు. దశపాద - దశగ్రీవ - త్రినేత్రోగ్రమూర్తులు మరికొందరు. 

అంతరిక్షచరులు. భూమిచరులు. రుద్రాధ్యాయంలో చెప్పబడ్డ రుద్రులందరూ ఇక్కడే ఉంటారు. ఇది రుద్రలోకం. భద్రకాళీ ప్రముఖ మాతృకలతో పరివృతయై రుద్రాణీకోటి ఈ రుద్రులకు సన్నిధిలో ఉంటుంది. డామర్యాది గణాలూ వీరభద్రాది సేనానులూ - వీరితో మహారుద్రుడు విరాజిల్లుతుంటాడు. 

రుండమాలాధరుడై సర్పభూషా విభూషిత కర - కంధరుడై వ్యాఘ్ర చర్మపరీధానుడై గజచర్మం ఉత్తరీయంగా చితాభస్మవిలిప్త సర్వశరీరుడై ప్రమథగణ సంస్తూయమానుడై ఢమరుధ్వనులతో దిక్కులను బధిరీకరిన్తూ(చెవిటిపరుస్తూ), ఆట్టహాస - ఆస్ఫోటిత(జబ్బచరుపులు) ధ్వనులతో ఆకాశాన్ని దద్దరిల్లజేస్తూ భూతసంఘంతో కొలువుతీరిన - భూతావాసుడు మహేశుడు ఈ ఈశాన దిక్పతి. పేరుకూడా ఈశానుడే.

ఈ పుష్యరాగప్రాకారం దాటాక పద్మరాగప్రాకారం. అదీ కుంకుమకాంతులే వెదజల్లుతుంటుంది. ఇదీ పదియోజనాల ఎత్తే. ఈరెండింటి నడుమాఉన్న నేలా చెట్టూ చేమలూ సమస్తమూ - ఇందాకటిలాగానే - పద్మరాగమయం. 

ఈ ప్రాకారంలో నానాయుధ ధారిణులూ రత్నభూషావిభూషితలూ చతుష్షష్టి వీరవనితలుంటారు. వీరిలో ఎవరిలోకం వారికి ఉంది. ఎవరి నాయకుడు వారికున్నాడు. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడే స్వస్వవాహన - స్వస్వలోక జనసహితలై గుమికూడి ఉంటారు. వీరంతా మహాశక్తికి కళాంశరూపాలు. వారిపేర్లు చెబుతాను - జనమేజయా! గ్రహించు.

దేవీ శక్తులు





No comments:

Post a Comment