Wednesday, August 5, 2026

Gayatri Mantrakshara Mahima - గాయత్రీ మంత్రాక్షర మహిమ

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ మంత్రాక్షర మహిమ

నారదా! తక్కిన అనుష్ఠానాలను వేటిని చేసినా చెయ్యకపోయినా గాయత్రిని చేస్తే చాలు ద్విజుడు కృతకృత్యుడైనట్టే. మూడు సంధ్యల్లోనూ ఆర్ఘ్యమిచ్చి మూడువేలు గాయత్రీజపం చేస్తే ఆదే పదివేలు. దేవతలకుకూడా పూజ్యుడవుతాడు. అంగన్యాస కరన్యాసాదులు చెయ్యనీ మాననీ. సచ్చిదానందరూపిణి గాయత్రిని నిర్వ్యాజంగా ధ్యానించడం ముఖ్యం.

గాయత్రీమంత్రంలో ఒక్క అక్షరాన్ని సిద్దింపజేసుకుంటే చాలు ఆ సాధకుడు హరిహర హిరణ్యగర్భ సూర్యచంద్రాగ్నులతో పోటీపడతాడు. ఒక్కొక్క అక్షరమూ అంతంత ప్రభావం కలిగినవి. అందుకని ఆ అక్షరాల ఋషిచ్చందోదేవతలను అదేక్రమంలో అక్షరాలా చెబుతాను శ్రద్ధగా గ్రహించు. 

వామదేవుడు - అత్రి - వసిష్ఠుడు - శుక్రుడు - కణ్వుడు - పరాశరుడు - విశ్వామిత్రుడు - కపిలుడు - శౌనకుడు - యాజ్ఞవల్క్యుడు - భరద్వాజుడు - జమదగ్ని - గౌతముడు - ముధ్గలుడు - వేదవ్యాసుడు - లోమశుడు - అగస్త్యుడు - కౌశికుడు - వత్సుడు - పులస్త్యుడు - మాండూకుడు - దూర్వాసుడు - నారదుడు - కశ్యపుడు - ఈ ఇరవైనాలుగు మందీ వరసగా ఆ ఇరవైనాలుగు వర్ణాలకూ ఋషులు.

గాయత్రి - ఉష్ణిక్కు - అనుష్టుప్పు - బృహతి - పంక్తి - త్రిష్టుప్పు - జగతి - అతిజగతి - శక్వరి - అతిశక్వరి - ధృతి - అతిధృతి - విరాట్‌ - ప్రస్తారపంక్తి - కృతి - అతికృతి(ప్రకృతి) - ఆకృతి - వికృతి - సంకృతి - అక్షరపంక్తి - భూః - భువః - స్వః - జ్యోతిష్మతి - ఇవి ఇరవైనాలుగూ ఛందస్సులు. 

అదేక్రమంలో దేవతలనూ చెబుతాను. మొదటి అక్షరం అగ్నిదేవతాకం, రెండవది ప్రజాపతి దేవతాకం, మూడు సోమదేవతాకం, నాలుగు ఈశాన దేవతాకం, అయిదు సవితృదేవతాకం, ఆరు ఆదిత్యదేవతాకం, ఏడవది బృహస్పతి దేవతాకం, ఎనిమిదవది మిత్రావరుణ దేవతాకం, తొమ్మిది భగదేవతాకం, పదవది అర్యమదేవతాకం, పదకొండు గణేశదేవతాకం, పన్నెండు త్వష్టృదేవతాకం, పదమూడవది పౌష్ణదేవతాకం, పధ్నాల్గు ఇంద్రాగ్నిదేవతాకం, పదిహేనవది వాయవ్య దేవతాకం, పదహారవది వామదేవ దేవతాకం, పదిహేడవది మైత్రావరుణిదేవతాకం, పద్దెనిమిదవది వైశ్వదేవం, పంద్దొమ్మిదవది మాతృదేవతాకం, ఇరవై విష్ణుదేవతాకం, ఇరవైయొకటి వసుదేవతాకం, ఇరవై రెండవది రుద్రదేవతాకం, ఇరవైమూడవది కుబేరదేవతాకం ఇరవైనాల్గవది అశ్వినీదేవతాకం.

నారదా! ఇవీ గాయత్రీమంత్రంలో ఇరవైనాలుగక్షరాలకూ ఋషులూ ఛందస్సులూ దేవతలూ సంగ్రహంగా తెలియజేశాను. దీన్ని వింటేచాలు జపించినంత ఫలితమూ దక్కుతుంది.

ఈ వర్ణాలకు అధిదేవతలేకాదు అధిదేవీశక్తులూ ఉన్నాయి. మంత్రాక్షరాల క్రమంలో ఆ శక్తుల పేరు చెబుతాను. విను. వామదేవి - ప్రియ - సత్య - విశ్వ - భద్రవిలాసినీ - ప్రభావతి - జయ - శాంత - కాంత - దుర్గ - సరస్వతి - విద్రుమ - విశాలేశ - వ్యాపిని - విమల - తమోపహారిణి - సూక్ష్మ - విశ్వయోని - నిరయ - వశ - పద్మాలయ - పరశోభ - భద్ర - ద్రుపద - అనే ఇరవైనాలుగు శక్తులు ఆ అక్షరాలకు అధిదేవిమూర్తులు. 

ఇంక ఈ వర్ణాల వర్ణాలు(రంగులు) ఏమిటంటే - మొదటిది సంపంగిపువ్వురంగు, రెండవది అతసీవర్ణం, మూడవది పగడం రంగు, నాల్గవది స్ఫటికవర్ణం, అయిదవది పద్మం రంగు, ఆరవది తరుణాదిత్యసన్నిభం, ఏడవది శంఖచంద్రసమప్రభం, ఎనిమిదవది చిగురాకురంగు (ప్రవాళపద్మపత్రాభం), తొమ్మిదవది పద్మరాగవు రంగు, పదవది ఇంద్రనీలపు రంగు, పదకొండవది ముత్తెపురంగు, పన్నెండవది కుంకుమరంగు, పదమూడవది కాటుకరంగు, పధ్నాల్గవది రక్తవర్ణం, పదిహేనవది వైఢూర్య వర్ణం, పదహారవది క్షౌద్రవర్ణం. పదిహేడవది పసపురంగు, పద్ధెన్మిదవది మొల్లపువ్వు రంగు(కుంద దుగ్ధాభం), పంధొమ్మిదవది సూర్యకాంతి రంగు, ఇరవై చిలకతోక రంగు (శుకపుచ్చనిభం), ఇరవై యొకటి శతపత్రనిభం, ఇరవైరెండు కేతకీపుష్ప సంకాశం(మొగలిపువ్వు రంగు), ఇరవైమూడవది మల్లికాకుసుమం, ఇరవైనాల్గవ అక్షరానిది కరవీరవర్ణం.

ఈ వర్ణాలు ఇరవైనాల్గింటికీ ఇరవైనాలుగు తత్త్వాలున్నాయి. పృథివి - ఆపస్సు(జలం) - తేజస్సు - వాయువు - ఆకాశం - గంధం - రసం - రూపం - శబ్దం - స్పర్శ - ఉపస్థం - పాయువు - పాదం - పాణి - వాక్కు - ఘ్రాణం - జిహ్వ - చక్షుస్సు - త్వక్కు - శ్రోత్రం - ప్రాణం - అపానం - వ్యానం - సమానం - అనేవి వీటి తత్త్వాలు. 

ఇలాగే ఒక్కొక్క వర్ణానికీ ముద్రలున్నాయి. సుముఖం - సంపుటం - వితతం - విస్తృతం - ద్విముఖం - త్రిముఖం - చతుర్ముఖం - పంచముఖం - షణ్ముఖం - అధోముఖం - వ్యాపకాంజలికం - శకటం - యమపాశం - గ్రథితం - సన్ముఖోన్ముఖం - విలంబం - ముష్టికం - మత్స్యం - కూర్మం - వరాహం - సింహాక్రాంతం - మహాక్రాంతం - ముద్గరం - పల్లవం ఇవి ఇరవైనాలుగు ముద్రలు. 

త్రిశూలం - యోని - సురభి - అక్షమాల - లింగం - అంబుజం ఆనేవి ఆరూ మహాముద్రలు. తుర్యరూపాలు. ఇవన్నీ మహాపాపక్షయకరాలు. కీర్తి ప్రదాలు. కాంతి ప్రదాలు.

నారాయణమహర్షీ! స్వామీ! సర్వజగన్నాథా! చతుష్షష్టి కళాభిజ్ఞా! యోగవిద్యారహస్యవేత్తా! నాకొక్క సందేహం మిగిలిపోయింది. ఏ పుణ్యకార్యం చేస్తే మోక్షం వన్తుంది? బ్రహ్మరూపత్వం సిద్ధిస్తుంది? దేహం దేవతారూపాన్నీ మంత్రరూపాన్నీ పొందుతుంది? ఆ సత్కర్మ ఏమిటో దాని ఆచరణవిధానమేమిటో మంత్ర - ఋషి - చ్ఛందో - అధిదైవత - ధ్యానాలు ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ప్రభూ! దయచేసి తెలియపరచవూ!

నారదమహర్షి! తప్పకుండా తెలియపరుస్తాను. నువ్వు ఆడగడమూ నేను చెప్పకపోవడమూనా!గాయత్రీకవచమని అత్యంత గుహ్యం ఒకటి ఉంది. దాన్ని పఠించివా ధరించినా సర్వపాపాలూ నశిప్తాయి. కోరికలన్నీ తీరతాయి. అంతేకాదు - దేవీరూపుడవుతాడు.

గాయత్రీ కవచం





No comments:

Post a Comment