జానకి పలుకులలో పారుష్యం భరించలేక రావణుడు:
నెమ్మదిగా మాట్లాడి వశం చేసుకుందా మనుకుంటుంటే నన్నే వంచుతున్నావు. ప్రేమగా మాట్లాడుతుంటే పరాభవిస్తున్నావు.
నీ మీది అనురాగం నా క్రోధతీవ్రతను హరిస్తున్నది. కాముకుడికి దయ, ప్రేమ ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే నిన్ను ఏమీ చెయ్యకుండా వదలవలసి వస్తున్నది. లేకుంటే ఎప్పుడో నిన్ను కడతేర్చి ఉందును.
ఇంకా నీకు రెండు మాసాల గడువుంది. ఈలోపున నువ్వు నా శయనమందిరం చేరి, నన్ను భర్తగా గ్రహించావా, మేలు.
కాదంటే - నిన్ను ఉదయపు ఫలహారానికి వండించేస్తాను. అంటూంటే రావణుని వెంట వచ్చిన దేవ, గంధర్వ కన్యలు దుఃఖంతో సీతను చూస్తూ, అటువంటి ప్రమాదం రాదని హస్త, నేత్ర సంజ్ఞలతో జానకికి ధైర్యం కలిగించారు.
గుండె దిటవు చేసుకుని సీతాదేవి:
రావణా! ఈ అకార్యం నుంచి నిన్ను సక్రమ మార్గాన నడిపించే వాడు ఒక్కడూ ఈ లంకలోలేడు, అంటే నీ పరిజనులందరూ నీ నాశనాన్నే కోరుతున్నారు. ఇంద్రునికి శచీదేవివలె నేను రాముని ధర్మపత్నిని. అటువంటి నన్ను వాంఛించేవాడు ముల్లోకాలలో ఉండడు. నీకే పుట్టింది ఈ దుర్బుద్ధి.
ఆయన క్రోధాగ్ని నుంచి నువ్వు తప్పించుకోలేవు.
నువ్వెరుగుదువో, ఎరగవో!
ఆయన మత్తేభం,
నువ్వు చెవులపిల్లివి.
ఈ క్షణం వరకూ నువ్వు ఆయన కంటబడలేదు కనుక సిగ్గులేకుండా తిరుగుతున్నావు నిర్భయంగా.
నావంటి పతివ్రతను దుష్టబుద్ధితో చూచిన క్షణంలోనే నీ కళ్ళు నేల రాలవలసింది, ఈ దుర్భాషలాడే నీ నాలుక ఈపాటికే ఊడిపోవలసింది.
రామాజ్ఞ లేదు కనుక, పాతివ్రత్య నియమానుసారం నేను నిన్ను బూడిద చెయ్యకుండా వదలిపెట్టాను.
ఇంతకూ నీ చావుకోసమే నన్ను అపహారించి తెచ్చావు. యక్షేశుడయిన కుబేరుని సోదరుడవు.
మహాశూరుడవు కదా! ఇలా వంచనతో పర దారాపహరణ నీచకార్యం ఎందుకు చేశావు? అని అంటుంటే రావణుడు తన అరుణ నయనాలు మరింత ఎరుపెక్కించాడు. జిహ్వాగ్రం కూడా మండుతున్నట్టుంది.
ఉత్తుంగ భుజద్వయంతో రెండు శిఖరాలతో అలరారే మందరగిరిలా ఉన్నాడు.
సర్వాంగాలంకృతుడై వసంతునిలా ఉన్నా ఆ తీవ్రక్రోధంతో శ్మశాన చైత్యంలా ఉన్నాడు. కుపిత భుజంగం బుసకొడుతూన్నట్టు నిట్టూర్పులు విడుస్తూ సూర్యకాంతి సంధ్యాతిమిరాన్ని చెదరగొట్టేట్లు నిన్ను భస్మం చేసేస్తాను, అని అక్కడి రాక్షస స్త్రీజనాన్ని సాభిప్రాయంగాచూస్తూ:
ఎలా అయినా యీ సీత మనసు మార్చండి. సామ, దాన, భేదాలకు లొంగకపోతే దండోపాయం సాగించండి.
అని భయంకరాకారంతో సీతవైపు తిరిగాడు.
అప్పుడు ధాన్యమాలిని అనే నారీమణి చకచక రావణునిచేరి, గాఢంగా కౌగలించుకుని:
నాథా! కృశించి, దీనంగా పడివున్న యీ మానవప్రాణితో నీ కేమిటయ్యా. నాతో భోగించు. దీనికి నీ భోగాలు అనుభవించేయోగం లేదు.
మనమీద యిష్టంలేని వారితో వెడితే. శరీరతాపమే తప్ప సుఖంలేదు.
నిన్ను కోరేవారితో భోగం తృప్తినిస్తుంది, అని పాగుడుతూంటే, రావణుడు అట్టహాసం చేసి వెనుదిరిగాడు. ఆయనతో వచ్చిన వారందరూ అనుసరించి వెళ్ళారు.
ధర్మనిష్ఠురాలయిన జానకీదేవి గజ గజ వణుకుతూ ఉండిపోయింది.
No comments:
Post a Comment