త్రిరాత్ర వ్రతదీక్ష
ఆ జగన్మాత దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది.
ఆ అమ్మ కరుణావల్లి, ఆ తల్లి అమృతహృదయ, ఆమె చల్లని చూపులకోసం ముల్లోకాలు ఎదురు చూస్తుంటాయి.
అందుకే ఆరాధించడానికి తిథి, వార, నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వీయుజమాసాన వచ్చే శుద్ధ పాడ్యమి మొదలుకుని నవమి వరకు ఆ తల్లిని కొలిచినవారికి కోటిజన్మలలోని పాపరాశి భస్మమవడమే కాదు, తుదిలేని పుణ్యరాశి లభ్యమౌతుందట. అందుకే సజ్జనులందరూ ఈ జగాలనేలే జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వెయ్యి కనులతో ఎదురు చూస్తుంటారని అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని 'దేవీభాగవతం' చెబుతోంది.
ఈ వ్రతరాజాన్నే దుర్గాదేవి వ్రతమని, కుమారీ పూజ అనీ అంటారు. ఈ చల్లని తల్లిని మనలోని తిమిరాంధకారాన్ని పారద్రోలమని రాత్రివేళ అర్చించడం సంప్రదాయం. అందుకే ఈ రాత్రిళ్లను శరన్నవ రాత్రులుగా కూడా అభివర్ణిస్తారు.
శరన్నవ రాత్రులలో అమ్మను కొలిచిన వారికి సర్వాభీష్టాలు కలుగుతాయి. తొమ్మిదిరోజుల వ్రతం పాటించలేనివారు సప్తమి, అష్టమి, నవమి తిథులలో దీక్ష పాటిస్తారు. దీనిని ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అని పిలుస్తారు.
నిత్య పూజలు ఆచరిస్తూ, నిత్య నైవేద్యాలు చేస్తూ సుమంగళీ వ్రతాలు, కుంకుమార్చనలు, పుష్పాలంకరణలు, మొదలైనవన్నీ ఈ నవరాత్రి వేడుకల్లో భాగాలై కనులపండువను, భక్తులను ఆనందపరవశులను చేస్తాయి. అష్టమిని.. అంటే, దుర్గాష్టమిని మహాష్టమి అని కూడా అంటారు. ఆ రోజంతా అష్టమి తిథి ఉంటే దుర్గాష్టమి, అలా కాకుండా అష్టమి వెళ్లి ఆనాడే నవమి తిథివస్తే దానిని మహాష్టమి అంటారు.
ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారిని సహస్ర నామాలతో , కుంకుమార్చనలతోనూ అర్చిస్తే, సత్సంతాన భాగ్యం కలుగుతుంది.ఈ దుర్గాష్టమి రోజు లలితా సహస్ర నామం పఠించేవారికి ఎలాంటి భయాలు దరిచేరవని చెపుతారు నవరాత్రి దీక్షలో మహానవమి మఖ్యమైనవి. మంత్రసిద్ధి జరిగే ఈ రోజుని ‘సిద్దిదా’ అని పిలుస్తారు. నవమి రోజున మహార్నవమి అంటూ పూజ చేస్తారు, పూర్వకాలంలో జైత్రయాత్రలకు వెళ్ళే రాజులు, చక్రవర్తులు నవమి రోజున ఆయుధ పూజలు చేసేవారు.
అలా చేయడంవల్ల వారికి విజయం సంప్రాప్తించేది, కాలక్రమంలో అదే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ రోజు వాహనాలు, యంత్రాలున్నవారు సహస్రనామ పూజగానీ, అష్టోత్తర శతనామ పూజ కానీ చేయడం శ్రేయస్కరం. దశమి రోజున శమీ పూజ చేస్తారు, దీనిని అపరాజిత పూజ అని కూడా పిల్వడం జరుగుతోంది. ‘శమి’ అంటే జమ్మి చెట్టు, ఈ రోజున జమ్మి చెట్టును పూజిస్తారు.
పాండవులు అజ్ఞాత వాసానికి వెళుతూ తమ ఆయుధాలను జమ్మి చెట్టు తొర్రలో దాచారట. ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు తన గాండీవాన్ని జమ్మి చెట్టుమీద నుంచే తెచ్చుకున్నాడట. తమ కోర్కెలు నెరవేరాలని కోరుకునేవారు తమ గోత్ర నామాలతో శమీపూజ చేయించుకోవడం శ్రేయస్కరం. శమీ పాపాలను నశింపజేస్తుంది. శత్రువులను సంహరిస్తుంది. అంటే శత్రుపీడన లేకుండా చేస్తుంది.
No comments:
Post a Comment