Tuesday, September 23, 2025

Thripura Bhairavee Devi Vupasana Vidhanamu - శ్రీ త్రిపుర భైరవీ దేవి ఉపాసనా విధానము

ఐదవ మహావిద్య శ్రీ త్రిపుర భైరవీ దేవి ఉపాసనా విధానము

దశమహా విద్యలలో ఐదవ మహావిద్య శ్రీ త్రిపుర ఖైరవీ దేవి. ఈ మాత వేల సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంటుంది. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహా విద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్ష ప్రాప్తి సాధకుడికి కలుగుతుంది. ఈ అవతారంలో ఆదిపరాశక్తి సృష్టి యొక్క లయకు ప్రతిరూపంగా ఉంటుంది.

దుర్గా సప్తశతి యొక్క మూడవ అధ్యాయములోని మహిషాసురవధ ఘట్టంలో అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. ముండ మాలాధారిణి అయిన అమ్మవారు అరుణ వర్ణంలో, ఎర్రటి చీరతో, చేత జపమాల, పుస్తకము మరియు అభయ ముద్రలతో, కమలాసనయై దర్శనమిస్తుంది. రుద్రయామల మరియు భైరవీకుల సర్వస్వమనే తంత్ర గ్రంథాల్లో అమ్మవారి ఉపాసన పద్ధతి చెప్పబడి ఉంది.

అమ్మవారి మెడలోని ముండమాలయే వర్ణమాల, అమ్మవారి రజోగుణమే సృష్టి ప్రక్రియకు ప్రతీక. అమ్మవారే ప్రణవం. అ నుండి అః వరకు ఉండే అచ్చులన్నీ భైరవుడైతే, క నుండి క్ష వరకూ ఉండే హల్లులన్నీ భైరవీ అని పిలువబడతాయి. దీనిని బట్టి త్రిపురభైరవి అక్షర స్వరూపిణి అని మనకు తెలుస్తుంది.

మత్స్య పురాణంలో భైరవిదేవి యొక్క పది రూపాల గురించి చెప్ప బడివుంది. అవే 
1) త్రిపుర భైరవి, 
2) కోలేశ భైరవి, 
3) రుద్ర భైరవి, 
4) చైతన్య భైరవి, 
5) నిత్య భైరవి, 
6) సిద్ధి భైరవి, 
7) కమలేశ్వరి భైరవి, 
8) కామేశ్వరి భైరవి, 
9) షట్కూటా భైరవి, 
10) భువనేశ్వరి భైరవి. 
ఈ రూపాలనే దశమహా భైరవి స్వరూపాలంటారు. ఇంద్రియ నిగ్రహం కొఱకు ఈ రూపాల ఉపాసన తప్పనిసరి అంటారు.

దశమహా భైరవీ స్వరూపాలలో సిద్ధి భైరవి ఉత్తరామ్నయ పీఠానికి అధిదేవత. నిత్య భైరవి పశ్చిమామ్నాయ పీఠానికి అధిదేవత. పై రెండు పీఠాల అధిదేవతా ఉపాసకుడు స్వయంగా పరమశివుడే కావడం గమనార్హం. రుద్ర భైరవి దక్షిణామ్నాయ పీఠానికి అధిదేవత. ఈ పీఠ అధిదేవతా ఉపాసకుడు శ్రీమన్నారాయణుడు. ప్రపంచంలోని ప్రతి క్షణమూ జరిగే మార్పులకు కారణము భైరవీదేవియే. ఎందుకంటే ప్రతి మార్పు కూడా ఆకర్షణ వికర్షణల సంయోగమే కాబట్టి.

ఓమ్‌ త్రిపురాయైచ విద్మహే 
భైరవ్యైచ ధీమహి
తన్నో దేవీ ప్రచోదయాత్‌!


దశమహావిద్యాధిదేవతలలో అతి భయంకర రూపం కలది త్రిపుర భైరవి. ఈమెనే రుద్రభైరవి, ఛాముండేశ్వరి అని కూడా పిలుస్తారు. అసురులతో జరిగిన యుద్ధంలో పార్వతిదేవి అవతారమైన త్రిపురభైరవిని చూసి అక్కడ ఉన్న రాక్షసులంతా ఆమె భయంకరమైన రూపం చూసి పరుగులు తీయసాగారు. ఆమె ఆ యుద్ధంలో చండ, ముండ అనే ఇద్దరు రాక్షసులను చంపి వారి రక్తం తాగేసింది. ఆమె నోటినిండా రక్తంతో, పులి చర్మం కట్టుకుని, గాడిద మీద కూర్చుని ఉంటుంది. భైరవి అంటే భయంకర రూపం కలిగి ఉన్నది అని అర్థం. ఈమె సృష్టి యొక్క లయకు ప్రతిరూపం. లయ అంటే నాశనం చేయటమే కాక మరు సృష్టి లేకుండా చేయటం. ఈమె అన్ని భయాలకు అతీతంగా ఉంటూనే కొలచిన భక్తులకు అన్ని భయాలనుండి అభయమిస్తుంది.

ఈమె శిరస్సుపై పూలతో చేసిన హారం అలంకరించబడి ఉంటుంది. ఈమె వెయ్యి ఉదయిస్తున్న సూర్యుల ఎర్రని కాంతికి సమానమైన తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె హస్తములలో పాలు, పుస్తకము ఉంటాయి. ఈమెకు విశాలమైన మూడు నేత్రాలు, నాలుగు హస్తాలు ఉన్నాయి. ఈమె తనను ఆరాధించిన వారి భయాలను పోగొట్టి, ఓదార్చి వరాలు ఇస్తుంది.

త్రిపుర భైరవి అమ్మవారు నవగ్రహ నాయకిగా పిలుస్తారు. ఈ అమ్మవారిని ఎవరైనా జన్మ నక్షత్రం, పుట్టిన తేది మరియు రోజు తెలియని వారు పూజించవచ్చు. “అమ్మవారి ఆవిర్భావం మాఘ మాస పౌర్ణమి” నాడు జరిగింది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖ భోగాలను పొందే శక్తి సకల జనాల, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది. అమ్మవారి స్వరూపం విషయానికి వస్తే ఎర్రని వస్త్రము విమర్శశక్తికి ప్రతీక. గళంలోని ముండమాల వర్ణమాలకు, రక్త పయోధరాలు రజోగుణ సంపన్న సృష్టికి, అక్షపమాల వర్ణ సమామ్నాయానికి, పుస్తకం బ్రహ్మవిద్యకు, త్రినేత్రాలు వేదత్రయకి,
మందహాసం కరుణకు ప్రతీకలు. ఈ అమ్మవారిని పూజించటం వలన అపమృత్యు దోషాలు, విష జంతువుల భయాలు, అంటువ్యాధులు దూరమౌతాయని అంటారు.

నశించే జగత్తుకు అధిష్టాత దక్షిణామూర్తి కాలభైరవుడు. అతని శక్తియే త్రిపుర భైరవి. బ్రహ్మాండ పురాణంలో గుప్తయోగినుల అధిష్టాత్రి గా పిలుస్తారు. మత్స్య పురాణంలో త్రిపుర భైరవి, కోలేశ భైరవి, రుద్ర భైరవి, చైతన్య భైరవి మొదలైన వారి వర్ణన ఉంది.

అ నుండి అః వరకు ఉన్న 16 అక్షరాలు భైరవునికి చెందగా క నుండి క్ష వరకూ భైరవికి చెందినవి. స్వచ్చందోప్రధమ పటాలంలో యోగీశ్వరీ రూపంలో ఉన్న ఉమయే అమ్మవారు. శంకరుని పతిగా పొందాలనే తపనతో ఉంటుందని చూపబడింది. త్రిపురభైరవి స్తుతిలో, భైరవి సూక్ష్మ వాక్కుకు, జగత్తుకు మూల కారణమైన దానికి అధిష్టాత్రిగా చెప్పబడుతున్నది.

ముండమలా తంత్రాన్ని బట్టి త్రిపుర భైరవి నరసింహస్వామికి అభిన్న శక్తిని ప్రసాదించిది. సృష్టిలోని ఆకర్షణ వికర్షణ శక్తులదే మూలం. క్షణక్షణం పరివర్తన శీలమైన జగత్తుకు అధిష్టాత్రి కావడంతో త్రిపుర భైరవి అని పిలుస్తారు. అమ్మవారికి సంబంధించిన రాత్రి కాలరాత్రి అని, భైరవుని కాలభైరవ పిలుస్తారు. ఇంద్రియాల పట్ల విజయాన్ని సాధించాలన్నవారు అమ్మవారిని ఉపాసిస్తారు.

ఎర్రని వస్త్రాలతో, ఎర్రని రక్తం పూయబడిన పయోధరాలతో, పూల దండతో, రెండు చేతుల్లో రుద్రాక్షమాల, పుస్తకాన్ని ధరించి, మరో రెండు చేతులతో వరదాభయ ముద్రలను ప్రదర్శిస్తూ, చంద్రవంక కలిగిన కిరీటంతో, ఉదయించే సూర్యుని కాంతివలె మెరుస్తూ, మూడు కళ్ళతో అమ్మవారు ఉంటారని త్రిపురభైరవిని వర్ణిస్తారు.

రుద్రయామళతంత్రం, భైరవీకుల సర్వస్వం అనేగ్రంథాల్లో త్రిపుర భైరవి ఉపాసన, సాధనా విశేషాలు, ఆ దేవి కవచ స్తోత్రాలు పేర్కొన బడ్డాయి. భయంకరమైన రవం అంటే ధ్వని చేసినవాడు భైరవుడు. అతని శక్తి భైరవి. అందుకే భైరవులలో ప్రముఖుడైన కాలభైరవుని భార్యగా త్రిపురభైరవిని కొలుస్తారు. ఈ త్రిపుర భైరవి మహాత్రిపుర సుందరికి రథవాహిని అంటారు.

బ్రహ్మాండపురాణంలో 
త్రిపుర భైరవిని గుప్తయోగినీ దేవతలకు అధిష్టాత్రీ దేవతగా చెబుతారు. మత్స్యపురాణం ప్రకారం ఎనిమిది రకాలైన భైరవ రూపాలు ఈ విధంగా చెప్పబడ్డాయి. 

అసితాంగ భైరవుడు, 
రురు భైరవుడు, 
చండ భైరవుడు, 
క్రోధ భైరవుడు, 
ఉన్మత్త భైరవుడు, 
భీషణ భైరవుడు, 
సంహార భైరవుడు 
అని భైరవ రూపాలు ఎనిమిదిగా వర్ణించ బడ్డాయి. అదే విధంగా త్రిపురభైరవీ దేవి కూడా 
కోలేశభైరవి, 
రుద్రభైరవి, 
చైతన్య భైరవి, 
నిత్యభైరవి 
అని వివిధ రూపాలలో కనిపిస్తుందని మత్స్య పురాణం చెబుతోంది.

తంత్ర గ్రంథాల ప్రకారం త్రిపురభైరవి ఏకాక్షరమైన ప్రణవంతో అంటే “ఓం” తో ఉపాసించబడుతుంది. ప్రణవమే సాధనా విశేషాలు తెలియజేసిందనే విషయాన్ని పరమహంస జీవిత చరిత్ర తెలుపుతుంది.

త్రిపురభైరవిని వామాచార, దక్షిణాచారాల్లో పూజించవచ్చు. వామాచార పద్ధతిలో శ్మశానాలలో, శూన్యగ్భహాలలో, రాత్రివేళల్లో బలులు సమర్పించి సాధన చేయాలి.

దక్షిణాచార పద్ధతిలో కుమారీ పూజ, నారీ పూజచేసి, గంధ చందనాలతో ఎర్రని పుష్పాలతో, కూష్మాండ బలిని సమర్పిస్తూ ప్రతి రోజూ పూజించాలి. సాత్విక ద్రవ్యాలైన ఎర్రని పూలు, పళ్ళు, నెయ్యి, గంధం, చందనం వంటి ద్రవ్యాలలో అమ్మవారిని అలంకరించాలి. ఈ విధంగా దక్షిణాచార పద్ధతిలో త్రిపురభైరవీ దేవిని ఉపాసిస్తే, సంకటాల నుండి విముక్తి కలిగి, సకల సుఖభోగాలు పొందే శక్తి సకల జనాకర్షణ శక్తి సాధకునికి కలుగుతాయి.

త్రిపుర భైరవీ దేవి కుండలాలు, ముక్కు పుడక, గాజులు మరియు వడ్డాణం ధరించి ఉంటుంది. ఆమె రొమ్ముల మీద వ్రేలాడే హారం ధరించి ఉంటుంది. త్రిపుర భైరవి అందాల కిరీటం ధరిస్తుంది. భైరవి దేవి పెదవులు రక్తంతో తడిసి ఉంటాయి. త్రిపుర భైరవికి మూడు కళ్ళు ఉంటాయి. భైరవి ఒక చేతిలో పుస్తకం, మరో చేతిలో జపమాలను కలిగి ఉంటుంది. త్రిపుర భైరవి అరచేతులు రక్తంతో తడిచి కుంకుమ వర్ణంతో ఉంటాయి. కొన్ని చిత్రాలలో త్రిపుర భైరవి త్రిశూల గొడ్డలి మరియు పిడుగు వంటి ఆయుధాలను పట్టుకున్నట్లు చూపబడింది. మరికొన్నిచిత్రాలలో ఆమె పుర్రెల దండ ధరించి ఉన్నట్లు కూడా చూప బడింది.

ఉత్తరాదిలో త్రిపుర భైరవి అమ్మవారి వర్ణన, దక్షిణాదిలో త్రిపుర భైరవి వర్ణనలో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. ఉత్తరాది సంప్రదాయం ప్రకారం అమ్మవారు అర్థనిమీలిత నేత్రాలతో, శుష్మించిన రొమ్ములతో, జుట్టు విరబోసుకొని, పారవశ్య స్థితిలో కనుపిస్తుంది. దక్షిణాది సంప్రదాయం వర్ణనల ప్రకారం గుండ్రని పెద్ద వక్షోజాలతో, చిన్న నడుముతో, పెద్ద పెదాలు, కోరలతో భయంకరంగా, ఉగ్రంగా కనుపిస్తుంది. కానీ త్రిపుర భైరవి తన క్రూరత్వాన్ని మరుగు పరచుచూ ప్రశాంతంగా కూర్చున్న స్థితిలో కనిపిస్తుంది.

భైరవికి పన్నెండు వేర్వేరు రూపాలు ఉన్నాయని చెబుతారు. ఈ రూపాల్లో ఒక్కొక్కరూపం ప్రత్యేక మంత్రం మరియు యంత్రాన్ని కలిగి ఉంటుంది. త్రిపుర భైరవి రూపాల్లో సాత్విక రూపం మరియు భయంకరమైన రూపాలు కూడా ఉన్నాయి. భైరవి ఒక బహుముఖ దేవత, కేవలం విధ్వంసానికి మాత్రమే ఈ మాత పరిమితం కాదు. భైరవి సాత్విక రూపాలలో సంపత్‌ప్రద భైరవి (అన్ని సంపదలను ఇచ్చే మాత), సకల సిద్ధి భైరవి (అన్ని విజయాలు ఇచ్చే దేవత), భయ విధ్వంసిని (భయాన్ని నాశనం చేసే దేవత), చైతన్య భైరవి (స్పృహను మేల్కొల్పే దేవత), భువనేశ్వరి భైరవి (ప్రపంచాన్ని నిలబెట్టే దేవత), కామేశ్వరి భైరవి (కోరికను రేకెత్తిస్తూ, సంతృప్తిని ఇచ్చే దేవత), శుంభకరి (శుభాన్ని కలిగించే మాత) మరియు అన్నపూర్ణేశ్వరి భైరవి (అన్నాని అంటే తిండిని ప్రసాదించే దేవత)గా కనిపిస్తుంది. త్రిపుర భైరవిని సృష్టి సంహారాకారిణి, జగత్‌ ధత్రి, పరమేశ్వరి
మరియు జగన్మాత అనే ఇతర పేర్లతో కూడా పిలుస్తారు.

త్రిపుర భైరవి వివిధ రూపాలతో వర్ణించ బడింది. అత్యంత ప్రాచుర్యం పొందిన రూపంలో ఆమె కమలంపై ఆశీనురాలై ఉంటుంది. నాలుగు చేతులు కలిగి ఉండి, ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో జపమాల, మిగిలి రెండు చేతులు వరద, అభయ ముద్రలతో కనిపిస్తుంది. మరొక రూపంలో ఆమె కత్తి మరియు రక్తం ఉన్న ఒక పాత్ర మరియు ఇతర రెండు చేతులతో అభయ మరియు వరద ముద్రలను చూపిస్తుంది. తాంత్రిక ఆరాధనలో శివునిపై త్రిపుర భైరవి ఆశీనురాలైనట్లు కూడా ఆమె చిత్రీకరించబడింది. త్రిపుర భైరవిని రాజరాజేశ్వరిని పోలిన రాణిగా కూడా చిత్రీకరించారు.

కుండలిని తంత్రంలో భైరవి అనే బిరుదు శక్తి స్వరూపిణి అయిన స్త్రీకి ఇవ్వబడుతుంది. యోగిని అంటే తంత్ర విద్యార్థి లేదా తంత్ర విద్యను ఆర్జించేవారు అని అర్ధము చెబుతారు. భైరవి అంటే విజయం సాధించిన సాధకులు అని అర్థం చెబుతారు. కాబట్టి భైరవి స్థితిని సాధించటం అంటే మరణ భయాన్ని దాటిన స్థితి అని అర్ధము.

త్రిపుర భైరవిని ఆరాధించడం వలన వ్యాపారం లేదా వృత్తిలో అభివృద్ధికి కనిపిస్తుంది. త్రిపుర భైరవి ఆరాధన వల్ల అదృష్టం, ఆనందం, వ్యాధుల నుండి త్వరగా కోలుకోవటం జరుగుతుంది. కోరుకున్న వరుడు లేదా వధువు లభించాలని కూడా త్రిపుర భైరవిని సేవిస్తారు. త్రిపుర భైరవి మాత తన భక్తులు మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

ఘోర స్వరూపంతో మహాకాలుడు చేసే ప్రళయ తాండవాన్ని త్రిపురభైరవి మాతే శాంతింపచేసింది అంటారు. ఈ భైరవినే దుర్గా అని కూడా పిలుస్తారు. దుర్గమమైన కష్టాల్ని దాటించే దేవి త్రిపుర భైరవి. ఈ దేవి సోత్ర పఠనం వలన సకల బాధలు తొలగి, యౌవ్వనవంతులుగా, సకల సుఖ భోగాలు పొందే శక్తి వంతులుగా, సకల జనాకర్షణ, గొప్ప ఐశ్వర్యవంతులుగా మారవచ్చని అంటారు.

శ్రీ త్రిపుర భైరవీ మహా విద్యా

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...