Monday, October 5, 2026

What benefits are gained by performing Pitru Tarpanam on specific Tithis? - pitru tarpanam ae thidhi lo pedite ae prayojanam kalugutundi..! పితృ తర్పణం ఏ తిథి లో పెడితే ఏ ప్రయోజనం కలుగుతుంది..!

పితృ తర్పణం ఏ తిథి లో పెడితే ఏ ప్రయోజనం కలుగుతుంది..!

భాధ్రపద మాస కృష్ణపక్ష మందు మహాలయమును పితరులనుద్దేశించి చేస్తూ శక్తి కొలది వేద పారగులైన బ్రాహ్మణులకు అన్నంతో భోజనం పెట్టిన వారు దుర్గతిని పొందరు. భాద్రపద కృష్ణపక్షమందు మహాలయ మందు తన శక్తికి తగినట్టు ఒక్కనికో, ఇద్దరికో, ముగ్గురికో బ్రాహ్మణులకు దారిద్ర్యం లేకుండ భోజనం పెట్టిన యెడల అతనికి దుర్గతి ఎప్పుడు ఉండదు. ఈతడు భాద్రపద మాసంలో పితరులను ఉపాసించనందు వలన ఈ బ్రాహ్మణుడు వేతాలుడైనాడు. పాపియైన నిన్ను పట్టుకున్నాడు. భాద్రపద మాసం కాలం మొదలుకొని వృశ్చికం వరకు తత్వదర్శులైన మునులు మహాలయమని చెప్పారు.

పాడ్యమి తిథి
శుభమైన భాద్రపద కృష్ణపక్ష మందు ప్రథమ తిథి యందు భక్తి పూర్వకముగ మహాలయ శ్రాద్ధము చేసిన వాని కర్మతో సర్వపావనుడైన అగ్ని సంతుష్టుడౌతాడు. అతడు చేసిన వాడు వహ్నిలోకమును చేరి వహ్నితో సహకూడి ఆనందిస్తాడు. అతనికి అగ్నిదేవుడు సర్వైశ్వర్యములను ఇస్తాడు కూడ. ప్రథమ తిథి యందు మహాలయము చేయని నరుని గృహమును, సంపదను, క్షేత్రాదికమును అగ్నిదహిస్తాడు కూడా. మహాలయ ప్రథమతిథియందు వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు భుజిస్తే పితరులు దశకల్ప సహస్రముల కాలము తృప్తిని పొందుతారు.

విదియ తిథి
ద్వితీయ యందు మహాలయ శ్రాద్ధము చేసిన వానికి భవానీ పతియైన ఈశ్వరుడు సంతుష్టుడౌతాడు. ఆతడు కైలాసానికి చేరి శివునితో కూడి ఆనందిస్తాడు సంతుష్టుడైన మహేశ్వరుడు అతనికి అధికమైన సంపదనిస్తాడు. ద్వితీయ తిథి యందు మహాలయము చేయని నరుని కోపించి శంభువు ఆతని బ్రహ్మవర్చస్సు నాశనం చేస్తాడు. కాల సూత్రమను రౌరవ నరకాన్ని ఆతనికిస్తాడు. మహాలయ ద్వితీయ తిథి యందు వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు భుజిస్తే పితరులు ఇరువది కల్ప సహస్రముల కాలము తృప్తి నందుతారు. పితరుల అనుగ్రహం వల్ల ఈతని సంతతి వృద్ధి చెందుతుంది.

తదియ తిథి
తృతీయ యందు మహాలయ శ్రాద్ధమును నరుడు భక్తితో చేయాలి. దీనితో భగవాన్ లోకపాలుడైన ధనాధిపతి సంతుష్టుడౌతాడు. మహాపద్మాది నిధులు అతని వశంలో ఉంటాయి. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు అతన్ని అనుసరించి ఉంటారు. తృతీయ తిథి యందు మహాలయము చేయని నరుని సంపదను భగవాన్ ధనరుడు (కుబేరుడు) క్షణంలో హరిస్తాడు. బహుదుఃఖ సమాకులమైన దారిద్ర్యాన్ని కూడా ఈతనికిస్తాడు తృతీయ తిథి యందు మహాలయము చేసిన నరుని కర్మతో, అతని పితరులు ముప్పది కల్పసహస్రముల కాలము తృప్తినందుతారు.

చవితి తిథి
చతుర్థి యందు నరుడు భక్తితో మహాలయ శ్రాద్ధం చేయాలి. దాని వలన భగవాన్ పార్వతీసుతుడు ఐన హెరంబుడు సంతోషిస్తాడు. గజవక్త్రుని అనుగ్రహం వల్ల అతని విఘ్నాలు నశిస్తాయి. చతుర్థి తిథి యందు మహాలయము చేయని నరునకు భగవాన్ విఘ్నేశుడు ఎప్పుడు విఘ్నం చేస్తూనే ఉంటాడు. చండకోలాహలమనే నరకంలో పడిపోతాడు కూడా. చతుర్థి తిథి యందు మహాలయము చేసిన నరుని పితరులు నలుబది సహస్రములు ఆనందంతో ఉండి శ్రాద్ధ కర్తకు నిరంతరంగా బహుపుత్రులనిస్తారు.

పంచమి తిథి
పంచమి తిథి యందు మహాలయము భక్తితో చేయని నరుని మందిరమును భగవతి లక్ష్మి వదిలిపెడుతుంది. ఆతని ఇంటిలో కలహమున కాధారమైన అలక్ష్మి పుడుతుంది. పంచమి తిథి యందు మహాలయమాచరరించిన నరుని పితరులు ఐదు (యాభై బహుశాక్రమంలో) కల్ప సహస్రకములు తృప్తినందుతారు. తృప్తులై ఈతనికి అవిచ్ఛిన్నమైన సంతానాన్ని కూడా ఇస్తారు. మహదైశ్వర్యమునిచ్చే పార్వతి కూడా ప్రసన్నురాలౌతుంది.

షష్టితిథి
షష్టితిథి యందు నరుడు భక్తితో మహాలయ శ్రాద్ధమును చేయాలి. ఆ కర్మవలన పార్వతీసుతుడైన షణ్ముఖుడు భగవానుడు సంతుష్టుడౌతాడు. ఆతని అనుగ్రహం వల్ల ఆనరునకు పుత్రులు పౌత్రులు కలుగుతారు. గ్రహములతో బాల గ్రహములతో కూడా ఎప్పుడూ బాధింపబడరు షష్టితిథి యందు భక్తితో మహాలయ శ్రాద్ధము చేయని నరునకు స్కందుడు మహాసేనుడు, విముఖుడౌతాడు. గర్భం నుండి బయటికి వస్తూనే ఆతని సంతానం నశిస్తుంది. ఎప్పుడూ పూతనాది గ్రహముల సమూహములతో బాదింపబడతాడు. వహ్నిజ్వాలా ప్రవేశమనే నరకంలో కిందపడిపోతాడు. షష్ఠితిథి యందు శ్రద్ధ కలిగి మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు అరవై వేల కల్పసహస్రములు తృప్తినందుతారు. పుత్రులను, విపులమైన సంపదను కూడా ఇస్తారు.

సప్తమి తిథి
సప్తమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధమును చేయాలి. బంగారు చేతులు గల ఆదిత్యుడు దీని వలన సంతుష్టుడౌతాడు. భాస్కరుని అనుగ్రహం వలన రోగం లేకుండా దృఢశరీరం గల వాడుగా ఔతాడు. భగవాన్ హిరణ్యపాణియైన వాడు స్వయంగా తన చేతితో హిరణ్యమును సంతుష్టమనస్కుడై మహాలయ శ్రాద్ధ కర్తకు ఇస్తాడు..

అష్టమి తిథి
అష్టమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. మృత్యుంజయుడు, కృత్తి వాసుడు, శంకరుడు దాని వలన సంతుష్టుడౌతాడు. శంకరుని అనుగ్రహం వలన అతనికి కైవల్యము చేతియందున్నట్లే మహాలయ శ్రాద్ధంతో సాక్షాత్తు త్రియంబకుడు సంతోషపడితే, పదునాల్గులోకములలో అతనికి దుర్లభమైనదేముంటుంది. ఎప్పుడూను భూమి యందు ఆతని కోరిక ఎప్పుడు కూడా సిద్ధించదు. చంద్రుడు తారలున్నంత వరకు వైతరిణి అను నరకమందు పడిపోతాడు. అష్టమి యందు శ్రద్ధతో మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు ఎనుబది కల్ప సహస్రము తృప్తి నందుతారు. ఈతనిని ఆశీస్సులతో వృద్ధి పరుస్తారు. ఈతని విఘ్నము కూడా తొలగిపోతుంది. పితృ గణములు ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు.

నవమి తిథి
నవమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధమును చేయాలి. దానితో దుర్గాదేవి, భగవతి, శాంభవి సంతుష్టి పొందుతారు. సంతుష్టి చెందిన దుర్గ మహిష నందిని అతని క్షయ, అపస్మార కుష్ఠాదులను క్షుద్ర ప్రేత పిశాచములను నశింపచేస్తుంది. నవమి తిథి యందు మహాలయము చేయని నరుడు బ్రహ్మరక్షస్సుతో, అపస్మారముతో పీడింపబడుతాడు. నిరంతరము అభిచార అర్థకృత్యములతో బాధింపబడుతాడు. నవమి తిథి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు తొంబది కల్ప సహస్రములు తృప్తి నందుతారు. పితృగణములు ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని గూడా ఇస్తారు.

దశమి తిథి
దశమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. దానితో షోడశాత్మ అమృత కళుడు, చంద్రుడు ప్రసన్నుడౌతాడు ఓషధులకు అధీశుడైన ఈతడు ఈ శ్రాద్ధంతో సంతోషిస్తే ఓషధులు ఎల్లప్పుడూ వ్రీహ్యది ధాన్యములను ఇస్తాయి. దశమి యందు ఉత్తమ ముఖ్యమైన మహాలయమాచరించని నరుని ఓషధులు నిష్ఫలమౌతాయి.ఆతని కృషి కూడా నిష్ఫలమే. దశమి తిథి యందు మహాలయ శ్రాదధము చేసిన నరుని, పితరులు శత కల్పసహస్రములు తృప్తినందుతారు. పితృ గణములు ఎల్లప్పుడూ ఈతనికి అవిచ్ఛిన్న సంతతినిస్తారు.

ఏకాదశి
ఏకాదశి యందు, భక్తితో మహాలయ శ్రాద్ధాన్ని చేయాలి నరుడు. దానితో సర్వ లోకముల సంహర్త ఐన రుద్రుడు అనుగ్రహిస్తాడు. సర్వసంహర్తయైన జగత్పతియైన రుద్రుని అనుగ్రహముతో ఈ శ్రాద్ధ కర్త నిరంతరము శత్రువులను ఓడిస్తాడు. అతని బ్రహ్మహత్యలు పదివేలైన ఆక్షణంలోనే నశిస్తాయి. అగ్నిష్టోమాది యజ్ఞముల ఫలమును పుష్కలంగా పొందుతాడు. ఏకాదశి యందు భక్తితో మహాలయము చేయని నరునిపై రుద్రుడు విముఖుడౌతాడు. అతనిని ఎప్పుడు కూడా అనుగ్రహించడు. అన్ని విధముల అభివృద్ధి చెందుతున్న శత్రువులు ఈతనిని బాధిస్తారు. బహు దక్షిణలతో చేసిన అగ్నిష్టోమాది యజ్ఞములు ఆతనిని నిష్ఫలములే, బూడిదలో పోసిన హవ్యముల వలె ఔతాయి. శ్రాద్ధము చేయని దోషము వలన బ్రహ్మఘాతకతుల్యుడౌతాడు. ఏకాదశి తిథి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు రెండు వందల కల్ప సహస్రములు తృప్తులౌతారు. పితృగణముల ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు.

ద్వాదశి తిథి
ద్వాదశి తిథి యందు మర్త్యుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. ఆతనిని లక్ష్మీపతియైన జనార్దనుడు సాక్షాత్తుగా అనుగ్రహిస్తాడు. దేవేశుడు, దేవదేవుడు ఐన జనార్దనుడు ప్రసన్నుడైతే చరాచర జగత్తంతా సంతోషించినట్టే అనుమానంలేదు. హరిప్రియ ఐన భూమి ఈతని పంటను వృద్ధి పరుస్తుంది కూడా. హరివల్లభ ఐన లక్ష్మికూడా అతని ఇంటిలో వృద్ధి పొందుతుంది. నారాయణుని చేతి యందున్న గద కౌమోదకి అనునది ఎప్పుడూ అపస్మారాది భూతములను నశింపచేస్తుంది. ఈతని శంఖము యాతుధాన పిశాచాదులను తొలగిస్తుంది. ఈ విధముగా కేశవుడు అన్ని విధముల ఈతని పీడను తొలగిస్తాడు.

త్రయోదశి తిథి
త్రయోదశి యందు నరుడు భక్తితో మహలయ శ్రాద్ధమును చేయాలి. అతనికి రతినాయకుడైన భగవాన్ కందర్పుడు ప్రసన్నుడౌతాడు. ప్రక్చందనాది భోగములు మనోరమలైన స్త్రీలు కామదేవుని ప్రసాదం వల్ల అతనికి ఎల్లప్పుడూ సిద్ధిస్తారు. పుట్టుక నుండి చావు వరకు ఆతడు సుఖమునే పొందుతాడు.

చతుర్దశి తిథి
చతుర్దశి యందు నరుడ భక్తితో మహాలయ శ్రాద్ధము చేయాలి. అతని అభీష్టమును నెరవేర్చుటకై శివుడు మేల్కొంటాడు. శివ జ్ఞానమును ఉపదేశించి సాయుజ్యము కూడా ఇస్తాడు. పదివేల సురాపానముల, పదివేల స్వర్ణప్తేయము బంగారం దొంగతనము / పాపము చతుర్దశి మహాలయం శ్రాద్ధం వల్ల తత్క్షణ మందే నశిస్తుంది. అశ్వమేధ సహస్రముల పదివేల పుండరీక యాగముల పుష్కల ఫలసిద్ధి చతుర్దశి మహాలయం వల్ల లభిస్తుంది. చతుర్దశి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు లక్షకోటి సహస్రముల లక్షకోటి శతములు కల్పములు తృప్తి నందుతారు. అనుమానం లేదు. నరకమందున్న పితరులు కూడా ఆనందంతో స్వర్గానికి వెళుతారు.

అమావాస్య తిథి
పితృదేవతలను నమస్కరించే అమావాస్య మహాపుణ్యప్రదమైంది ఇది పరమ శాంతమైంది. శివునకు మహా ఇష్టమైనట్టిది. ఆమహాలయ శ్రాద్ధమందు వేద విత్తములను భుజింపచేయాలి. అందువల్ల పితరులకు అనంతమైన తృప్తి లభిస్తుంది. శివుడు ఆనందిస్తాడు బ్రహ్మహత్యాది పంచ పాతకములు నశిస్తాయి. అన్ని యజ్ఞములు దక్షిణలతో కూడా విధానముగా చేసినట్లౌతాయి. సనాతన సర్వ ధర్మములు విధి ప్రకారము అనుష్ఠింపబడినట్లౌతాయి. అమావాస్య దిన మందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుడు ప్రత్యక్ బ్రహ్మేకతను తెలుసుకొని సాయుజ్యమును పొందుతాడు.

No comments:

Post a Comment

puranamu - avagahana - sraaddham eppudeppudu pettavachu? - Scriptural Understanding – When can the Shraddha ceremony be performed? - పురాణము - అవగాహన - శ్రాద్ధం ఎప్పుడెప్పుడు పెట్టవచ్చు?

పురాణము - అవగాహన - శ్రాద్ధం ఎప్పుడెప్పుడు పెట్టవచ్చు? పితృకార్యాలు జరిగే ప్రదేశంలో నువ్వులను చల్లితే అక్కడికి దైత్యులు, దానవులు, అసురులు రార...