వామనమూర్తి విశ్వరూపము నొంది విజృంభించుట
బలిచక్రవర్తి ఔదార్యాన్ని గ్రహాలు, మునీశ్వరులు, సిద్దులు, గంధర్వులు, కిన్నరులు, యక్షులు, గరుడులు, దేవతలు, నాగపతులు పొగడినారు, అతనిపై పూలవానలు కురిపించినారు; దేవ వాద్యాలు మ్రోగినాయి.
బ్రహ్మచారి ఇంతవాడింతవాడై, తాను ఆకాశానికన్నా పెద్దవాడై; మేఘమండలం చివరివరకు పెరిగి సూర్యమండలంకన్న - చంద్రమండలంకన్న - ధ్రువమండలంకన్న పెరిగి, మహర్లోకాన్ని మించి - సత్యలోకాన్ని మించి - బ్రహ్మాండం చివరివరకు వృద్ది పొందినాడు.
వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతున్న సమయాన సూర్యబింబం ఆతనికి క్రమక్రమంగా గొడుగుగా, శిరోమణిగా, కర్ణాలంకారకుండలంగా, కంఠభూషణంగా, తరువాత బంగారు భుజకీర్తిగా, ఆ పిమ్మట కాంతులీనే కంకణంగా, అనంతరం కటిస్థలమందలి గంటగా, ఆ పైన కాలి అందెగా, చివరకు పాదపీఠంగా ప్రకాశించింది.
ఈ విధంగా వామనరూపుడగు విష్ణుమూర్తి సత్త్వ రజస్తమో రూపకమైన విశ్వరూపాన్ని ధరించి విజృంభించినాడు. భూమీ ఆకాశమూ స్వర్గమూ దిక్కులూ దిక్కుల మధ్యభాగాలూ సముద్రాలూ చరాచర భూతరాసులన్నీ కూడా తానే అయి ఏకాకృతిని ధరించినాడు. క్రమంగా భూలోకాన్ని అతిక్రమించినాడు. భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం దాటి సత్యలోకాన్ని కూడా ఆక్రమించి దానిని కూడా దాటిపోయినాడు. అన్ని తావులలో మూలమూలలూ సందుసందులూ నిండిపోయినాడు. మహోన్నతమైన ఆకారంతో పాదాల అడుగుభాగాన రసాతలాన్నీ పాదాలతో భూమినీ, పిక్కలతో పర్వతాలనూ, మోకాళ్లతో పక్షులసమూహాన్నీ; తొడలలో దేవతలను, వస్త్రంలో సంధ్యాకాలాన్నీ గుహ్యాంగంలో ప్రజాపతులను, పిరుదులలో రాక్షసులను, నాభిలో ఆకాశాన్ని కడుపులో సప్తసముద్రాలను, వక్షంలో నక్షత్రసమూహాన్ని, హృదయంలో ధర్మాన్నీ వక్షోజస్థానంలో ఋతాన్నీ సత్యాన్నీ మనస్సులో చంద్రుడినీ, ఎదలో లక్ష్మీదేవిని, కంఠంలో వేదాలను, భుజాలలో ఇంద్రాదులైన దేవతలను, చెవులలో దిక్కులను, తలలో స్వర్గలోకాన్ని, తలవెంట్రుకలలో మేఘాలను, ముక్కుపుటాలలో వాయువును, కన్నులలో సూర్యుడినీ, ముఖంలో అగ్నినీ, వాక్కునందు సర్వ ఛందస్సులను, నాలుకలో వరుణునీ, కనుబొమ్మలలో కార్యాకార్యాలను, రెప్పలలో రేయింబవళ్ళనూ, ఫాలభాగంలో కోపాన్నీ, క్రింది పెదవిలో లోభాన్నీ, స్పర్శలో కామాన్నీ, రేతస్సులో జలాన్నీ, వీపులో అధర్మాన్నీ అడుగులలో యజ్ఞాలనూ, నీడలో మరణాన్నీ నవ్వులో సకలమాయలను, దేహరోమాలలో ఓషధులను, నాడీప్రదేశాలలో నదులను, గోళ్ళలో రాళ్ళనూ, బుద్ధిలో బ్రహ్మనూ, ప్రాణాలలో దేవర్షిగణాలనూ, శరీరంలో చరాచరసకలప్రాణులను ఇమిడించుకొన్నారు. ఆయన మేఘంవలె మ్రోగే పాంచజన్యం అనే శంఖంతో, శార్ఙ్గం అనే ధనుస్సుతో, సుదర్శనం అనే చక్రంతో, కౌమోదకి అనే గదతో, ఖడ్గంతో అక్షయాలయిన అంపపొదులతో ప్రకాశిస్తున్నాడు. మకరకుండలాలతో, కిరీటంతో, కౌస్తుభమణితో, రత్నమయమైన మొలనూలితో, పీతాంబరంతో, వక్షాన వైజయంతీ మాలికతో దివ్య కాంతులతో విరాజిల్లుతున్నాడు. సునంద, నంద, జయ, విజయాది పరిచారకసమూహం చుట్టూ చేరి ఉంది. సాటిలేని తేజస్సుతో మెరుస్తున్న విష్ణువుకు బ్రహ్మాండమే శరీరానికి ఒక మేలిముసుగుగా ఒప్పుతున్నది.
విశ్వరూపాన్ని పొందిన త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకాన్నీ ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్నీ మరొక అడుగుతో పైలోకాలను ఆక్రమించినాడు. క్రమంగా అన్నింటినీ దాటిపోయినాడు. ఇక ఆ రూపం పట్టకపోవడంవల్ల బ్రహ్మాండం బద్దలు కాసాగింది. ఆయన తప్ప ఇంకవరూ కనిపించకుండా పోయినారు. ఆ విశ్వరూపుడు మాటలకూ, చూపులకూ అందరానివాడై ప్రకాశించినాడు.
(భూలోకం కిందుగాను దేవలోకం పైగాను ఉంటుందని భావన. దీనికి అనుగుణంగానే వామనుని విజృంభణం వర్ణించబడింది.)
రాజా! విష్ణుమూర్తి పాదాలు రెండూ రెండుపద్మాలవలె ఉన్నాయి. ఒక పాదం కింద ఉన్న భూమండలం పద్మానికి అంటుకున్న చిన్న బురదముద్దలా ఒప్పారింది. ఇంకొక పాదంమీద ఉన్న ఆకాశం పద్మం మీద ఉన్న తుమ్మెదలా శోభించింది.
లోకాలన్నీ దాటిపోయిన త్రివిక్రముని కాలిగోళ్లకాంతులు చంద్రునియొక్క వెన్నెలవలె ప్రకాశించినాయి. ఆ వెలుగులో సత్యలోకమందలి బ్రహ్మ తేజస్సుకూడా సూర్యుని వెలుగు ముందు దీపంవలె తక్కువయింది (వెలవెలపోయింది).
సంసారబంధాన్ని తెంచుకొని సత్యలోకంలో ఉన్న రాజులూ, సప్తఋషులలోను నవబ్రహ్మలలోను ఒకడైన మరీచి మొదలగువారు, సనందనుడు మొదలయిన బ్రహ్మమానస పుత్రులూ, దేవమునులూ, అక్కడ ఎల్లప్పుడూ రూపాన్ని ధరించి మ్రోగుతున్న పురాణాలూ, తర్కం, వేదాలూ, వ్యాకరణం, చరిత్రలు, ధర్మశాస్త్రాలూ, మొదలయినవీ, జ్ఞానాగ్నిచే సంచితమైన కర్మలన్నీ దగ్ధంకాగా, ఇంకను మిగిలి ఉన్నవారందరూ వస్తున్న శ్రీహరియొక్క పాదాన్ని చూచి తమతమ చిత్తాలలో తలుస్తున్న పెన్నిధానాన్ని చూచినామనీ, నేడు ధన్యులమైనామనీ భక్తితో నమస్కరించినారు.
హరియొక్క బొడ్దుతామరను చూచి 'నా పుట్టినతావు ఇదేకదా' అనుకొని బ్రహ్మదేవుడు సంతోషించినాడు. ఆయన తన కమండలు జలాలతో స్వామివారి పాదాన్ని కడిగినాడు. ఆ జలధారలు హరియొక్క కీర్తి ప్రభలతోనిండి మందాకిని అనే పేరుగల స్వర్గ గంగవలె ప్రవహించినాయి.
బ్రహ్మాదులు మహావిష్ణువును యోగమార్గంలో ఊహించి పలురకాలయిన పూలదండలతో పూజించినారు. గంధాన్ని సమర్పించినారు, ధూపదీపాలు పెట్టినారు, పేలాలు అక్షతలు చల్లినారు, పండ్లను కానుకలుగా ఇచ్చినారు, శంఖారావములు జయజయధ్వానాలు చేస్తూ భల్లూకరాజయిన జాంబవంతుడు అన్ని దిక్కులలో ఢంకా మోగిస్తూ 'కరుణాంబు నిధీ, త్రివిక్రమా' అంటూ విష్ణుదేవుని జయాన్ని ఎల్లదిక్కులలో చాటినాడు.
సకలలోకాలలోనూ వ్యాపించిన భగవంతుని కంటితో చూడటానికీ మనస్సులో ఊహించటానికీ వీలుకాక బలిచక్రవర్తీ, ఆయన సభలోనివారూ చక్కగా స్తోత్రం చేసినారు.
ఆ పిమ్మట విష్ణుమూర్తి మెల్లగా వామనరూపాన్ని వహించినాడు. ఆయనను చూచి 'మూడడుగుల నెపంతో ఇతడు సమస్త ప్రపంచాన్నీ ఆక్రమించుకొన్నాడు. మాయతో బ్రహ్మచారి రూపాన్ని పొందిన విష్ణువని తలియక మనరాజు ఆడినమాట తప్పకుండా దానమిచ్చినాడు. అతనిలోతప్పు లేదు. ఈ పొట్టివాడు ఎదురులేని మహిమలతో లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. వీటిని ఇంద్రాదులకు ఇస్తాడు. ఈ బ్రహ్మచారి తప్పించుకొని పరుగెత్తిపోకుండా చంపివేయాలి' అంటూ ఇంద్రాది దేవతలను గెలిచిన రాహువు, హేతి, ప్రహేతి, విప్రచిత్తీ మొదలయిన రాక్షసులు బెదరిస్తూ కేకలు వేస్తూ పోరుకు సిద్ధమైనారు. గొడ్డళ్లూ, అడ్డకత్తులూ, ఈటెలు మొదలయిన ఆయుధాలు ధరించి చెలరేగి అన్నివైపుల ముసరుకున్నారు. దానిని గమనించి విష్ణుపరిచారకులైన సునందుడూ, నందుడూ, జయుడూ, జయంతుడూ, విజయుడూ, ప్రబలుడూ, ఉద్బలుడూ, కుముదుడూ, కుముదాక్షుడూ, గరుడుడూ, పుష్పదంతుడూ, విష్వక్సేనుడూ, శ్రుతదేవుడూ, సాత్వతుడూ మొదలయిన సేనాపతులు పదివేల ఏనుగులబలంతో కూడి తమతమ సైన్యాలను ఆయుధాలలో సిద్ధంచేసుకున్నారు. యుద్ధంలో దానవసేనను ఎదుర్కోని తుదముట్టించడానికి ఉత్సాహంతో సమాయత్తమైనారు. అది గమనించి అప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యుని శాపాన్ని గుర్తుకు తెచ్చుకొని దానవులతో ఇలా అన్నాడు.
ఓ రాక్షసవీరులారా! కలహించక రండి. పోరుచేయటానికి ఇది సరయిన సమయంకాదు. సకలజీవకోటికి సంపదల నివ్వడానికి, ఆపదలు కలిగించడానికి అధిపతిఅయిన భగవంతుని పరాభవించటానికి మనం సమర్థులం కాము. పూర్వం మనకు రాజ్యాన్నిచ్చి దేవతలను నశింపచేసిన దేవుని వైపరీత్యాన్ని ఏమందాం? మన సంపదయొక్క మహిమయేకదా ఇదంతా. భయపడి అనేక పర్యాయాలు పారిపోయిన దేవతలు మిమ్ములను తరుముట దైవనిర్ణయం. మన అదృష్టం ఎప్పుడు బాగుంటుందో ఆనాడే విరోధులను జయిద్దాం. ఇప్పుడు వద్దు.
అంతేగాక, గొప్పవైన కోటలు, మంత్రులు, దండు, మంత్రాంగాలు, ఔషధాలు, తెలివితేటలు ఉన్నప్పటికీ కాలాన్ని ఎరిగి సామదానభేదదండోపాయాలచే రాజు యుద్ధం చేయటం మంచిది.
'ఇప్పుడు వైరులతో రణం చేయటం సరికాదు. మనకు అనుకూలమైన సమయంలో జయించవచ్చు. అనవసరంగా శ్రమించక తొలగిపొండి' అని బలిచక్రవర్తి చెప్పినాడు. అప్పుడు విష్ణుభటులకు భయపడి రాక్షసులు పాతాళలోకానికి వెళ్లినారు. ఆ తర్వాత యాగంలో సోమపానం చేసే చివరిదినాన విష్ణువు అభిప్రాయాన్ని తెలుసుకున్న తార్‌క్ష్యనందనుడు వరుణపాశాలతో బలిచక్రవర్తిని బంధించినాడు.
చేతులూ, కాళ్లూ కట్టివేయగా 'ఇదంతా హరికృపయే ఏమిచేయగలను' అనుకొంటూ, ఏ సంశయం లేకుండా బలి నిలబడిపోయినాడు. దశదిశలలో హాహాకారాలు ధ్వనించాయి.
భాగ్యాలు పోయినా బలిచక్రవర్తిలో దీనత్వం, కంపం కలుగలేదు. మునుపటికన్నా తెగువ, జ్ఞానం, ధైర్యం ఎక్కువైనాయి. ఆ బలిని చూచి వామనుడు ఇలా అన్నాడు.
ఓ దానవా! మూడడుగుల నేలను దానమిస్తానంటివి. భూలోకం సూర్యచంద్రులు ఉండేస్థలం నాకు ఒక అడుగైనది. స్వర్గలోకం ఒక అడుగైనది. నీ ఆస్తి అంతా నాకు రెండడుగులైనది. తక్కిన మూడవ పాదానికి భూమి ఉందా? ఇస్తానన్నదాన్ని ఇవ్వకుంటే నరకానికి వెళ్లవలసిరావడం నిజం. అందువల్ల నరకానికి కొంతకాలం వెళ్లు. అలాకాకుండా మూడవ అడుగు ఇవ్వదలిస్తే వెంటనే నాకు మూడవ అడుగుకు చోటును చూపించు. బ్రాహ్మణుల స్వాధీనంలో ఉన్నవానిని కాదనడానికి బ్రహ్మకు కూడా సాధ్యంకాదు.
ఈ విధంగా పలికిన వామనుని మాటలు విని 'సత్యం భంగమవుతుందేమో' అనే అనుమానం కలిగింది బలిచక్రవర్తికి. అది విషపు ములికివలె ఆయన మనస్సును గాయపరచింది. అయినా ఆయన దిగులుచెందక ప్రసన్నంగా నేర్పరి అయిన వామనునితో ఇలా అన్నాడు.
నిర్మలాత్మా! నా నాలుక సత్యమే వచిస్తుంది. అబద్దా లాడజాలదు. నాకు అనృతం లేదు. నీ మూడవ అడుగును నా తలపై ఉంచు.
దేవా! దుర్గతికి, శిక్షకు, పదభ్రష్టతకు, బంధనానికి, ధననష్టానికి, వచ్చిన ఈ దుఃఖానికి భయపడను. అసత్యం పలుకడానికి మాత్రమే భయపడతాను.
ఓ ఆనందస్వరూపా! ప్రభూ! జననీజనకులు, అన్నదమ్ములు, మిత్రులు, ఉపాధ్యాయులు శిక్షిస్తే మేలే జరుగుతుంది కానీ కీడురాదు. మదాంధులమైన మాకు సమయానికి దివ్యదృష్టిని ఇచ్చినావు. అందువల్ల గురువులలో నీవే మొదటివాడవు. నీవు బంధించినావనీ చెరపెట్టినావనీ నేను లోటుగాకానీ, బాధగాకానీ, భావించను, సిగ్గుపడను. నిన్ను ఎదిరించి రాక్షసులు ముందు మునీంద్రులు పొందునట్టి స్థానాన్ని (పరమపదాన్ని) పొందినారు గదా! స్వామీ! నీ నుండి పొందరానిది (ఇవ్వలేనిది) ఏముంది?
అయ్యయ్యో! మృత్యుదేవత స్నేహితురాలుకాదు, యముడు చుట్టంకాదు. యమకింకరులు సేవకులుకారు. బ్రహ్మ ఈ శరీరాన్ని రాతితో చేయలేదు. బుద్ధిహీనుడు - సత్యం, దానం, దయ, ధర్మం, మొదలయిన వాటిని విడనాడి ఈ మాయాసంసారమే సత్యమని భావిస్తున్నాడు.
ఓ హరీ! మా తాత ప్రహ్లాదుడు 'బంధువులు దొంగలు, పుత్రులు ఋణస్థులు, భార్యలు సంసారమునకు సంబంధించినవారు, ధనాలు అస్థిరాలు, శరీరం నిలుకడలేనిది, ఇతరులు తమ ప్రయోజనాలను ఆశించి వచ్చినవారు, కాలం నిలువనిది, ఆయుర్దాయం త్వరగా గడుస్తుంది, సంపద తొందరగా వెళ్లిపోతుంది' అనియేకదా! తన తండ్రిని ధిక్కరించి నీ పాద కమలాలను సేవించినాడు. అతనికి చిరంజీవత్వం కలిగింది. పూర్వం మావారు శత్రుత్వంతోనే నిన్ను పొందినారు. నీవు యాచకుడవై వచ్చి నన్నడగటం నాపుణ్యఫలమే కదా!
No comments:
Post a Comment