రాక్షసులు అమృతం త్రాగటంకోసం ప్రయత్నించి పాలకడలిని మధించి చివరికి దుఃఖం పాలైన రీతిగా విష్ణుభక్తి లేని బుద్ధిహీనులు తాముకోరిన సంపదల్ని (శ్రేయస్సును) ఎన్నటికీ పొందజాలరు.
రాజా! ఆ విధంగా శ్రీహరి సముద్రాన్ని మథించి, అమృతాన్ని సంపాదించి, రాక్షసుల కన్నుగప్పి, దేవతలకే అమృతాన్ని పంచి, వారికి కొన్ని హెచ్చరికలు చేసి, గరుత్మంతుని అధిరోహించి వెళ్ళిపోయాడు.
అమృతం సంపూర్ణంగా దేవతలకే సమకూరినందువల్ల దైత్యులు, కోపతాపాలు పొంది, అతిక్రుద్దులై నానా విధములైన ఆయుధాలతో సంసిద్ధులై వీరుల బలంతో కూడినవారై యుద్దానికి బయలుదేరారు.
భాగ్యవంతులైన బలి, భగవదనుగ్రహం పొందిన ఇంద్రుడు, తక్కిన దేవాసురులు, మదంతో, ఆత్మాభిమానంతో బాణాలు, కత్తులు సమకూర్చుకొని తమలోతాము (ఒకరు మరొకరితో) పట్టుదలతో యుద్ధం చేయటం ప్రారంభించారు.
ఆ బలిచక్రవర్తి పూర్ణచంద్రుని వంటి దివ్యప్రకాశంతో తన రథంపై బయలుదేరాడు. ఆ రథం చాలా అపురూపమైనది. మయుడు నిర్మించినదది. కనిపించీ కనిపించకుండా చూడదగిన వస్తువులను చూచునదై ఆశ్చర్యకరంగా ఆకాశమార్గంలో పయనిస్తుంది. గొప్పశస్త్రాస్త్రాలు ఆ రథంలో సమకూర్చబడి ఉన్నాయి. గొప్ప రాక్షస భటులు దాన్ని రక్షిస్తుంటారు. చామరాలతో, ధ్వజాలతో దానవ సైన్యాలు ముందు వెళ్తూండగా ఆ కాంతిలో బలి చక్రవర్తి మిక్కిలిగా ప్రకాశించాడు.
ఇంకా నముచి, శంబరుడు, బాణుడు, ద్విమూర్థుడు, కాలనాభుడు, శకుని, జంభుడు, అయోముఖుడు; ప్రహేతి, హేతి, భూత సంత్రాసుడు, హయగ్రీవుడు, కపాలుడు, ఇల్వలుడు, ఉత్కలుడు, మేఘదుందుభి, మయుడు, త్రిపురాసురులు, విప్రచిత్తి, విరోచనుడు, వజ్రదంష్ట్రుడు, తారకుడు, అరిష్టుడు, అరిష్టనేమి, శుంభుడు, నిశుంభుడు, శంకుశిరుడు మొదలైన వారంతా ఒక గుంపుగా నిలబడ్డారు. పౌలోముడు, కాలకేయుడు, నివాతకవచులు మొదలైన మహావీరులు మహాదళంగా నిలబడ్డారు. వీరంతా రథాలను, గుర్రాలను, ఏనుగులను, జింకలను, సింహాలను, పందులను, కీటకాలను, నీటి జంతువుల్ని శరభాలను, దున్నపోతులను, గురుపోతులను, ఖడ్గమృగాలను, గండభేరుండాలను, చమరీమృగాలను, నక్కలను, పులులను, ఎద్దులను, వాహనాలుగా చేసుకొన్నారు. ఇంకా రాబందులను, గద్దలను, కాకులను, కోడిపుంజులను, కొంగలను, హంస మొదలైన పక్షులను కూడా ఎక్కారు. తిమి తిమింగలాది నీటి జంతువులను, మనుష్యులను, రాక్షస, దేవతా రూపాలలో ఉన్న జంతువులను కొంతమంది అధిరోహించారు. తమకు సంకేతాలయిన గొడుగులను, కవచఖఢ్గాలను, ఏనుగులకు, గుర్రాలకు వేసే పై తొడుగులను, శిరస్త్రాణాలను ధరించి వేరువేరుదళాలుగా సిద్ధపడి బలిచక్రవర్తి ముందు నిలిచారు. దేవేంద్రుడు ఐరావతాన్ని అధిరోహించి వచ్చాడు. అతనికి సహాయంగా వచ్చిన అగ్ని, వరుణ, వాయు, యమాది దేవతలు సైన్యంతో కూడి ఇంద్రుడు బలిని వెనుదీయని పరాక్రమంతో ఎదిరించాడు. ఆ విధంగా ఉభయ సైన్యాలవారూ యుద్దానికి సన్నద్ధులవుతూ, యుద్ధంచేయాలని సంబరపడుతూ, వేగిరపడుతూ, వాడివాడిమాటలతో ఒకరినొకరు ఆక్షేపించుకొంటున్న సమయంలో
ఓ రాజా! వజ్రదంష్ట్రలవంటి దండాలు కల్గిన ఆలవట్టాలు, నెమలిపురులతో అలంకరింపబడిన వింజామరలు, తెల్లగొడుగులు, సొగసైన రంగురంగుల జెండాలు, గాలికి రెపరెపలాడే తలపాగాలు, గలగలమని ధ్వనించే కంకణాది ఆభరణాలు, ధగధగలాడే శస్త్రాలు, రకరకాల డాలులు, హారాలు, నిండిన అంపపొదులు; వీటితోకూడి దేవదానవుల వీరసైన్యాలు రెండూ ఒక్కసారిగా విజృంభించాయి - ఇది ఎలా ఉందంటే మొసళ్ళతో నిండిన రెండు సముద్రాలు ఒకదానిపై ఒకటి పడ్డట్టు ఉంది.
దేవాసుర సంగ్రామంలో భేరీభాంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింతలు, రథచక్రాల సవ్వడులు - అన్నీ కలిసి భయంకరమైన శబ్దాల్ని పుట్టించాయి - ఆ ధ్వనులతో కులపర్వతాలు తలకిందులయ్యాయి.
ఈ విధంగా దేవదానవ సైన్యాలు రెండూ గుమికూడాయి. అప్పుడు బలితో ఇంద్రుడు; తారకునితో కుమారస్వామి; హేతితో వరుణుడు. ప్రహేతితో మిత్రుడు, కాలనాభునితో యముడు, మయునితో విశ్వకర్మ, శంబరునితో త్వష్ట, విరోచనునితో సవిత; నముచితో పరాజితుడు; వృషపర్వునితో అశ్వినీ దేవతలు; బాణుడు మొదలైన నూరుమంది బలి కుమారులతో సూర్యుడు, రాహవుతో చంద్రుడు, పులోమునితో వాయువు, శుంభనిశుంభులతో భద్రకాళి; జంభునితో వృషాకపి; మహిషునితో విభావసుడు; ఇల్వలుడు వాతాపులతో బ్రహ్మపుత్రులు; దుర్మర్నునితో మన్మథుడు; ఉత్కలునితో సప్తమాతృకలు; శుక్రునితో బృహస్పతి, నరకునితో శనైశ్చరుడు; నివాతకవచులతో మరుత్తులు; కాలేయులతో వసువులు, అమరులు; పౌలోములతో విశ్వేదేవులు, క్రోధవశులతో రుద్రులు; ఈ విధంగా కలిసి పోరాడుతూ, ద్వంద్వయుద్ధం చేస్తూ విజృంభించారు. రథికులు రథికులతో, కాలిబంట్లు కాలిబంట్లతో, ఆయా వాహనాలలోనివారు, వాహనాలవారితో; సింహనాదాలు చేస్తూ, బిగ్గరగా నవ్వుతూ, ఒకరినొకరు యుద్దానికి పిలుస్తూ బాహువులు అప్పళిస్తూ చెలరేగుతూ, గావు కేకలతో ఉబ్బిపోతూ, హుంకారాలు చేస్తూ, గర్విస్తూ, ధనుష్టంకారాలు చేస్తూ, బాణాలు నాటుతూ, గొడ్డళ్ళతో నరుకుతూ; చక్రాలతో ఖండిస్తూ, శక్తులతో ముక్కలు చేస్తూ కొరడాలతో కొడుతూ; గొడ్డళ్ళతో పొడుస్తూ గదలతో మోదుతూ, చేతులతో గుద్దుతూ, కత్తులతో నరుకుతూ, అడ్డకత్తులతో నొప్పిస్తూ, ఈటెలతో తెగవేస్తూ, తాళ్ళతో కట్టివేస్తూ, ఇనుప గుదియలతో మొత్తుతూ, రోకళ్ళతో దంచుతూ, సమ్మెటలతో బాదుతూ, పిడికిళ్ళు బిగించి గుద్దుతూ, తోమరాలతో పిండిచేస్తూ, శూలాలతో కుమ్ముతూ, గోళ్ళతో చీలుస్తూ, చెట్లను కొండల్నీ విసురుతూ, కొరవులతో కాలుస్తూ ఇలా అనేక విధాలుగా పోరాటాలు సాగించారు. ఆ సమయంలో యుద్ధభూమిలో అంతటా పగిలిన తలలు, బద్దలైన పుర్రెలు, చీలికలయిన చెక్కిళ్ళు; చిక్కులు పడిన కొప్పులు; విరిగిపోయిన పండ్లు నరకబడిన భుజాలు, లొట్టలుపోయిన కన్నులు; విరిగిపడిపోయిన చెవులు, తెగిపోయిన ముక్కులు, విరిగిపడిపోయిన తొడలు, ఊడిపోయిన కాళ్ళు, చిరిగిపోయిన కవచాలు, రాలిపోయిన ఆభరణాలు, కిందికి వాలిపోయిన జండాలు, కూలిపోయిన గొడుగులు, కుంగినేలబడిన ఏనుగులు, నుగ్గునుగ్గయిన రథాలు, తుక్కుతుక్కయిన గుర్రాలు, చెల్లాచెదరై పడిపోయిన సైన్యసమూహం; కొట్టుకొంటున్న కొనప్రాణాలు, పొర్లాడుతున్న శరీరాలు, శవాలనుచూసి ఉబ్బి ఆడుతున్న పిశాచాలు, పారుతున్న రక్తపుటేర్లు, రాశులుగా పోగులు పడ్డ మాంసఖండాలు; ఎగిసిపడుతున్న పీనుగులు, వాటికోసం మూగి హోరుమని రొదచేస్తున్న రాబందులు, గద్దలు - వీటితో రణరంగం అతిఘోరంగా కనిపించింది.
ఇంకా ఆ యుద్ధంలో బలిచక్రవర్తి దేవేంద్రునిపై పదిబాణాలు వేశాడు. మూడు బాణాలతో ఐరావతాన్ని కొట్టాడు. గుర్రాలపై నాల్గు బాణాలు వేశాడు. సారథిని ఒకబాణంతో కొట్టాడు. ఇంద్రుడు కూడా విజృంభించి వెంటనే అన్ని బాణాలను అన్నేసి బాణాలతో నరికివేశాడు. దీన్నిచూసి ఇంద్రుడిని బలిచక్రవర్తి అభినందించాడు.
తన బాణాలన్నింటినీ వరుసపెట్టి ఇంద్రుడు ఖండించి వేయగా, వీరుడైన బలిచక్రవర్తికి ఉపాయం స్ఫురించి, బలవత్తరమైన శక్త్యాయుధం చేతపట్టాడు. దాన్నికూడా ఇంద్రుడు ఆశ్చర్యకరంగా త్రుంచివేశాడు. తరువాత బలిచక్రవర్తి ఈటె, బల్లెం, తోమరాలను చేతబట్టి ప్రయోగించాడు. వాటినిగూడా ఇంద్రుడు ఖండించి వేశాడు. అంతటితో ఆగక, ఏయే ఆయుధాల్ని బలి ప్రయోగించినా పూనుకొని వాటిని వెంటనే తునాతునకలు చేసివేశాడు. చివరికి బలిచక్రవర్తి రథం కూడా పోగొట్టుకున్నాడు. దానితో కపటోపాయంతో నేర్పుగా ఆకాశంలో ఒకమాయను సృష్టించాడు. దీన్నిచూసి దేవతలు భయపడి పోయారు.
ఈ విధంగా బలి ప్రయోగించిన విశేషమైన మాయవల్ల దేవతలపైన ఉన్నట్టుండి పర్వతాలు పడ్డాయి. కార్చిచ్చుతో మండుతున్న చెట్లు భస్మమై వర్షంలాగా రాలిపోయాయి. కొండశిఖరాలు విరిగి ముక్కలై రాళ్ళవర్షంతో నేల మూతబడి పోయింది. గొప్ప గొప్ప సర్పాలు పైనబడి కరిచాయి. తేళ్ళు కుట్టాయి. అడవి పందులు, పులులు, సింహాలు ఒక్కసారిగా దాడిచేసి దేవతల్ని చీల్చిపారవేయడం ప్రారంభించాయి. అడవి ఏనుగులు సురల్ని తొక్కి పారవేశాయి. శూలాలు ధరించిన దిగంబరులైన రాక్షసులు లక్షలాదిమంది, దేవతల్ని 'రండిరా! రండి అంటూ; 'నరుకుతాం'; 'కోస్తాం' అంటూ కేకలు వేయటం మొదలు పెట్టారు. వికారపుముఖాలతో, గదలపట్టుకొని వేలాడుతున్న జులపాలతో చాలామంది రాక్షసవీరులు 'పోనీకండి! పోనీకండి! నరకండి! నరకండి!' అంటూ దేవతల్ని వెన్నంటి తరిమారు. చెవులు తూట్లుపడేలా ఉన్న శబ్దాలతోటి పిడుగులతో కూడిన మేఘసమూహాలు గాలికి చెలరేగి నిప్పుల కుప్పల్ని మంటల రాసుల్ని కురిపించాయి. పెనుగాలుల వల్ల విజృంభించిన దావాగ్ని ప్రళయాగ్నిలాగా చుట్టుముట్టింది. ప్రచండమైన తుఫాను చెలరేగి ఎగిసిపడుతున్న అలలతో, భయంకరమైన సుడిగుండాలతో సముద్రం చెలియలికట్టను దాటి చెలరేగి ప్రవహిస్తోందా అన్నట్టు కంటికి ఆనకుండా అయిపోయింది. ఆ సమయంలో ప్రళయకాలంలోలాగానే ఇది నేల అది నింగి అని, ఇప్పుడు రాత్రి అప్పుడు పగలని కూడా తెలియకుండా అంతా అయోమయంగా తయారయింది.
రాజా! ఆ బలిచక్రవర్తి పన్నిన నానావిధాలైన మాయాజాలాలకు విరుగుడు తెలియని అదితి పుత్రులైన ఇంద్రాది దేవతలు ఎన్నో అపాయాల పాలై చిక్కులలో పడి దీనులయ్యారు.
అప్పుడు దేవతలు “స్వామీ! జనార్దనా! ఈ రాక్షసుల చేతిలో పడ్డామే. ఇక మాకుదారి ఏది? ఎక్కడికి పోవాలి? నీవైనా ఇక్కడికి రాకూడదా స్వామీ! కుయ్యో! మొర్రో” - అంటూ విష్ణువుకు మొర పెట్టుకొన్నారు.
ఆ విధంగా మొర పెట్టుకొంటున్నప్పుడు.
ఆ సమయంలో విష్ణువు గరుడవాహనారూఢుడై వక్షఃస్థలంలో కౌస్తుభమణి, రమామణి ప్రకాశిస్తుండగా, నానావిధాలైన ఆయుధాలను, చక్రాన్ని ధరించి, కిరీటకేయూరాదుల చేత మిక్కిలిగా ప్రకాశిస్తూ, కొత్తదైన పచ్చని పట్టుపీతాంబరాన్ని ధరించి, వికసించిన పద్మాలవంటి పెద్ద నేత్రాలతో; మిరుమిట్లు కొల్పుతున్న వైభవంతో దేవతలున్న ఆ చోటికి వచ్చాడు.
శ్రీమహావిష్ణువు అక్కడ ప్రత్యక్షం కాగానే అప్పటివరకు పనిచేసిన రాక్షసమాయలన్నీ వెలవెలబోయి వ్యర్థాలై ఒక క్షణంలో అదృశ్యాలయ్యాయి. దేవతలంతా నిద్రపోయి మేల్కొన్నవారిలాగా హాయిగా పైకి లేచారు. తమ దివ్యకాంతులతో మళ్ళీ ప్రకాశించారు. అంతేమరి. శ్రీహరిపాదాలను పూజచేస్తే ఆపదలు దూరం కాకుండా ఉంటాయా? ఉండవు.
కాలనేమి అనే రాక్షసుడు గరుడవాహనం మీద గల స్వామికెదురుగా సింహాన్ని అధిరోహించి వచ్చి తలపడ్డాడు. తన చేతిలోని వాడిబల్లెంతో గరుడుని తలమీద పొడిచాడు. స్వామి అతని ఆయుధాన్ని చేతిలోకి చిక్కించుకొని దానితోనే ఆ దానవుణ్ణి చావపొడిచాడు.
ఆ తరువాత మాలి, సుమాలి అనే దైత్యులు విష్ణువును బెదిరించగా శ్రీహరి చక్రాయుధంతో వారిద్దరినీ ఖండించాడు. మాల్యవంతుడు గదతో గరుడుని రెక్కలు చెదరగొట్టాడు. వాడిపై స్వామి చక్రాన్ని ప్రయోగించి వాని శిరస్సును ఖండించివేశాడు.
భగవంతుడైన శ్రీహరి దయాగుణంచేత, మరలా పొందిన చైతన్యం గలవారైన వరుణుడు, వాయువు, ఇంద్రుడు మొదలైన దేవతా ప్రముఖులు మునుపు ఎవరెవరితో యుద్ధం చేస్తూ ఉన్నారో, వారి వారినే ఎదుర్కోని నొప్పించారు.
అప్పుడు మహేంద్రుడు బాహుబలాన్ని కూడదీసుకొని సాహసంతో ఎలాగైనా బలిని గెలిచితీరాలన్న పూనికతో మిక్కిలి ఉత్సాహంతో వజ్రాయుధాన్ని పైకెత్తాడు. దీన్నిచూచిన అక్కడి రాక్షసులంతా హాహాకారాలు చేశారు.
ఇంద్రుడు పైకెత్తిన వజ్రహస్తంతో తన ఎదుట పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్న బలి చక్రవర్తితో ఇలా అన్నాడు.
ఒరే బలీ! శత్రువుకు కనిపించకుండా యుద్ధంచేసి గెలవడంకూడా ఒక పరాక్రమమేనా? దీన్ని ధైర్యమంటారా? మగవాడై, తన బలాబలాలు తెలుసుకొని, శక్తిసామర్థ్యాలు ఉండికూడా శత్రువు ఎదుట పడకుండా మాయవేషాలు వేస్తే బంధువులు నవ్వరా? పండితులు తిట్టరా? కనీసం ఆడవారు కూడా మెచ్చుకొంటారా? (మెచ్చుకోరు).
'ఓరి శత్రువా! బలీ! ఇవాళ నీవు నానుండి తప్పించుకోలేవు. ఇక మాయలు పన్నలేవు. మాతో యుద్ధం అంటే నవ్వులాట కాదు. తళతళలాడుతున్న ఈ వజ్రాయుధంతో నిన్ను ముక్కలు చేస్తాను. తొందరగా నీ కోరికలు ఏవైనా ఉంటే తీర్చుకో. నీవారిని కలుసుకో. ఈ రోజు యుద్ధంలో నీ గర్వాన్ని పూర్తిగా అణచిపారేస్తాను చూడు!' - అని ఇంద్రుడు బలిచక్రవర్తితో అన్నాడు.
ఇలా ఇంద్రుడు నిందిస్తుండగా బలిచక్రవర్తి విని ఇలా అన్నాడు.
ఓ ఇంద్రా! చాలించు. నీవు ఒకడివేనా మగవాడివి. నువ్వా నిందించేది? జయాపజయాలు అందరికీ వస్తాయి (నీకు మాత్రం రాలేదా!); ఎవ్వరు తప్పించుకోగలిగారు? బ్రహ్మాదులు కూడా సుఖదుఃఖాలను ఏ విధంగా తప్పించుకోగలిగారు? ఆ దైవం మన అరచేతిలోని ఉసిరికకాయా ఏమిటి? ఇంత గర్వంగా మాట్లాడటం న్యాయంగా ఉందా?' అని అడిగాడు.
ఇంద్రా! జయాపజయాలు, సంపదలు, ఆపదలు, గాలిలో పెట్టిన దీపాల్లాంటివి. ఉంటాయి-పోతాయి. చంద్రుడి కళల్లాంటివి - తరుగుతాయి - పెరుగుతాయి. మేఘాల్లాంటివి - దైవానుకూలం లేకపోతే ఎగిరిపోతాయి; నీటితరగల్లాగా కొట్టుకుపోతాయి. మెరుపు తీగల్లాగా క్షణంలో మాయమవుతాయి. అంచేత మిడిసిపడవద్దు. (అంటూ యుద్ధమూ చేశాడు; సూటిపోటిమాటలూ అన్నాడు)
అని ఇట్లు ఆక్షేపించినవాడై.
బలి ఇంద్రుడిదేహంలోకి వాడి బాణాలు గుచ్చాడు. మహాఘోరమైన బాణాలవంటి సూటి పోటి మాటలతో బాధించాడు. ఇంద్రుని బాధించాడు.
ఇలా సత్యవాది అయిన బలిచేత ఇంద్రుడు తిరస్కరింపబడినవాడై
శత్రువు ఇలా ఆక్షేపించగా ఇంద్రుడు అంకుశంతో పొడవబడిన ఏనుగులాగా త్రుళ్ళిపడ్డాడు. వృత్రాసురుణ్ణి చంపిన ఆ వజ్రాయుధం విసిరి బలిచక్రవర్తిని కొట్టాడు. బలిచక్రవర్తి ఒక పెద్దకొండలాగా నేలమీద పడ్డాడు.
బలిస్నేహితుడైన జంభుడు అనే రాక్షసుడు తన మిత్రుడు నేలమీద పడిపోవటం చూశాడు. తన స్నేహాన్ని ప్రకటిస్తూ అమితమైన బాహుపరాక్రమంతో ఇంద్రుడిని ఎదుర్కొన్నాడు.
జంభుడు సింహాన్ని అధిరోహించి తళతళలాడుతున్న గదను పైకెత్తి, పర్వతాలకు శత్రువైన ఇంద్రుడిని కొట్టి, ఐరావతాన్ని ఒక్కదెబ్బ కొట్టి నొప్పించి, విజృంభించి, కేకలువేస్తూ పొంగిపోయాడు.
క్రూరమైన ఆ జంభుని గదాఘాతానికి దిగ్గజమైన ఐరావతంకూడా దిమ్మతిరిగి పోయింది. దుస్సహమైన నొప్పితో, తోకను కూడా కదిలించ లేకపోయింది. బాధను తట్టుకోలేక గిరగిర తిరుగుతూ మోకాళ్ళపై ముందుకు వంగి పక్కకు పడిపోయింది.
దేవేంద్రుని సారథి వెంటనే వేయిగుర్రాలు పూన్పిన రథాన్ని సిద్ధం చేయగా దానిపై ఇంద్రుడు కూర్చున్నాడు. ఏ కారణం లేకుండానే జంభుడు శూలంతో మాతలిని పొడిచాడు.
జంభాసురుని బల్లెందెబ్బతినికూడా మాతలి తల్లడిల్లి పోకుండా అరిచాడు. అది విని 'భయపడకు' అంటూ ఇంద్రుడు వజ్రాయుధంతో వాడి తలను నరికేశాడు. దాన్నిచూచి రాక్షసమూకలు తల్లడిల్లిపోయాయి.
యుద్ధంలో జంభుడు చనిపోయిన విషయాన్ని నారదమహర్షి వెళ్ళి చెప్పగా, అతని సోదరులు, బలుడు, పాకుడు, నముచి అనే వారు విని, వెంటనే క్రుద్దులై రణరంగంలోకి చారబడి ఇంద్రుణ్ణి పోటుమాటలతో నిందించి, కొండను మేఘాలు వర్షధారలతో నింపివేసినట్టు బాణాలతో కప్పివేశారు.
బలాసురుడు ఇంద్రుని వేయి గుర్రాలను వేయి బాణాలతో అదరగొట్టాడు. ఇన్నూరు బాణాలతో రథాన్ని సారథిని, ఇంద్రుడి ప్రతి అవయవాన్నీ బాధించాడు. పాకుడు ధనుస్సుతో బాణాల్ని ఎక్కుపెట్టడం, ప్రయోగించడం గుర్తించలేనంత వేగంగా విజృంభించాడు. నముచి బంగారుపిళ్ళు కలిగిన పదిహేను బాణాలతో కొట్టి అరిచాడు. ఇలా ముగ్గురు సోదరులు రథంలోని సూతునితో కూడిన ఇంద్రుడిని బాణాలతో కప్పివేశారు. అది ఎలా ఉందంటే వర్షాకాలంలో మేఘసమూహాలు సూర్యబింబాన్ని కప్పివేసినట్టుంది.
“అయ్యో! ఇంద్రా! అన్యాయంగా రాక్షసుల బాణాలకు బలి అయిపోయారా” అంటూ దేవతలు ఆర్తనాదాలు చేస్తూ అందరూ నిరాశ్రయులై అసురుల సేనల మధ్య (వ్యూహం - మొగ్గరం,) చిక్కుకొన్నారు. సముద్రంలో పగిలిన నావలో చిక్కుపడిపోయిన వర్తకుల్లాగా హాహాకారాలు చేస్తున్నారు.
అప్పుడు దేవేంద్రుడు “ఓ దేవతలారా! భయపడకండి. నేనున్నాను” అంటూ ఆ బాణాలతో కూడిన పంజరాన్ని గుర్రాలతో కూడిన రథంతో చీల్చుకొని బయటపడ్డాడు. ఉదయం కాగానే కొత్తకాంతులతో వెలిగే సూర్యుడి లాగా ప్రకాశించాడు.
ఇంద్రుడు చెల్లాచెదరై పారిపోతున్న దేవ సైన్యాన్ని చూచి 'ఓహో! భయపడకండి యుద్ధం చేయండి' అని బిగ్గరగా పిలుస్తూ వారిని మళ్ళీ యుద్దానికి పురికొలిపాడు. వాడిబాణాలతో, తన వజ్రాయుధంతో బలుడితలను, పాకుడితలను - నేలకూల్చాడు. దీన్నిచూచి అతని బంధువులు గడగడలాడిపోయారు. అతని సేనానాయకులు దుఃఖిస్తూ దీనులై పారిపోయారు.
ఆ సమయంలో నముచి యుద్ధరంగంలో నిలబడ్డాడు.
తన బంధువుల్ని చంపినవాడు వీడే అని ఇంద్రుడిపైన నముచి మండిపడుతూ ఒకవైపు కోపం మరోవైపు దుఃఖం పొంగివస్తుండగా, బంగారు పిడి కల్గినదీ, గంటలు కలదీ, ఇనుముతో చేయబడినది, చూడడానికి శక్యంకానిది అయిన శూలాన్ని పట్టి సింహంలాగా గర్జించి 'దీనితో నీవు చస్తావు చూడు' అంటూ సురేంద్రునిపై దాన్ని విసిరివేశాడు.
ఆకాశంలో నముచి ప్రయోగించిన శూలం తనవైపు వస్తుండగా ఇంద్రుడు దాన్ని అనేక బాణాలతో ఖండించాడు. నముచి కంఠాన్ని ఖండించడానికి వజ్రాయుధాన్నే ప్రయోగించాడు. అది వాడి తలను నరకలేకపోయింది. వాడేమో కదలను కూడా లేదు. అలా చలించకుండా ఉన్న వాడిని చూచి ఇంద్రుడు ఆశ్చర్యపడ్డాడు.
ఇలా నిలబడిన నముచిని చూచి, తన వజ్రాయుధం వ్యర్థమయిపోయినందుకు సందేహించి బలభేది అయిన ఇంద్రుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు.
పర్వతాల రెక్కలను ఖండించే సమయంలో కూడా ఈ వజ్రాయుధం వాడి ఎప్పుడూ తగ్గలేదు. వృత్రాసురుడు మొదలైనవారిని చంపినప్పుడు కూడా ఈ ఆయుధం తనపని పూర్తిచేసికాని తిరిగి రాలేదు. ఇదేమి ఇవాళ ఇలా జరిగింది! నేను ఇంద్రుడినే కానా? లేక ఇది వజ్రాయుధంకాదా? లేదా ప్రయోగించటంలో ఏదైనా పొరపాటు జరిగిందా! ఈ మాయావి దీని వాదర తెగకుండా ఏదైనా ప్రయోగం చేశాడా! ఈరోజు ఈ వజ్రాయుధం ఎందుకిలా శక్తి హీనమయిపోయింది? అని ఇంద్రుడు శోకించగా 'దివ్యవాణి' "ఈ రాక్షసుడు తడివస్తువుచేత, పొడివస్తువుచేత చావులేకుండా వరం పొందాడు. అంచేత ఇంద్రా! నీవు వేరే ఒక వస్తువును ఆయుధంగా త్వరగా ప్రయోగించు" అని ఆదేశించింది.
ఇలా ఆదేశించిన దివ్యవాణి పలుకులు విని ఇంద్రుడు.
ఇంద్రుడు స్వబుద్ధితో పొడియైన, తడియైన కాని వస్తువేది అని ఆలోచించి, దివ్యస్ఫురణతో, అలాంటి వస్తువు 'ఫేనమే' (నురుగు) అని నిశ్చయించుకొని, దానినే ఆయుధంగా అమర్చుకొని ప్రయోగించి నముచిశిరస్సును భేదించాడు. దీన్ని చూచి దేవతలందరూ సంతోషించారు.
ఓ రాజా! అలా నముచి చావగా, మహర్షులు ఇంద్రుని సమయస్ఫూర్తిని, పరాక్రమాన్ని ప్రశంసించి దోసిళ్ళతో పూలుచల్లి ఆశీర్వదించారు. గంధర్వులలో ప్రముఖులైన గాయకులు విశ్వావసుడు, పూవసుడు కమనీయంగా పాటలుపాడారు. అమరకాంతలు నాట్యమాడారు. దేవదుందుభులు మ్రోగాయి. వాయువు, వహ్ని యముడు, వరుణుడు విజృంభించి రాక్షసుల్ని యుద్ధంలో ఓడించారు. తక్కిన దేవతలు మిగిలిన రక్కసిమూకల్ని సింహాలు చిల్లర జంతువుల్ని తరిమివేసినట్టు నిర్భయంగా తోలి పారేశారు. బ్రహ్మదేవుడు పంపించగా నారదమహర్షి రాక్షసుల్ని చంపడాన్ని ఆపటానికి అక్కడికి వచ్చాడు.
వచ్చి దేవతలతో నారదు డిలా అన్నాడు.
“ఓహో దేవతలారా! బాగుందయ్యా! మీకు అమృతం సిద్ధించింది. శ్రీహరిని ఆశ్రయించి కావలసింది సాధించి బాగుపడ్డారు. శత్రువులూ నశించారు. ఇంకా ఈ యుద్ధం ఎందుకు? అవసరంలేదు”. అంటూ సముచితమైన మాటలతో వారిని ఒప్పించి యుద్ధం నుండి విరమింప చేశాడు.
ఇలా నారదమహర్షిచేత ఆదేశింపబడ్డ వారై సకలదేవతాప్రముఖులూ స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన దైత్యదానవులు ఆపత్తులో ఉన్న బలిచక్రవర్తిని తీసుకొని పడమటి కొండ శిఖరాన్ని చేరారు. అక్కడ ఉన్న శుక్రాచార్యులవారు తెగిన గొంతులతో మరణించిన రాక్షసులందర్నీ తనకు తెలిసిన మృతసంజీవనీ విద్యతో బ్రతికించారు. బలిచక్రవర్తి కూడా శుక్రునిదయవల్ల శరీరవేదనను పోగొట్టుకొన్నవాడై బ్రతికి; ఓడిపోయినా లోకం పోకడ తెలిసినవాడు కాబట్టి దుఃఖపడకుండా ఉండిపోయాడు - అని చెప్పి శుకమహర్షి రాజుతో ఇంకా ఇలా చెప్పాడు.
(మృతసంజీవని - ఒక మంత్రప్రయోగం (కృత్య). దానితో శుక్రుడు రాక్షసుల్ని బ్రతికించడం ప్రారంభించాడు. చివరికి ఆ విద్యనుకూడా కచుని పంపి దేవతలు గ్రహించారు. (మహాభారతంలో ఈ కథ ఉంది).
శివుడు ఒకనాడు కైలాస శిఖరంమీద ప్రమథగణాలతో కొలువుతీరినాడు. శ్రీమహావిష్ణువు మోహినీరూపంతో రాక్షసుల్ని మోసగించి దేవతలకే అమృతాన్ని కొల్లగొట్టి పంచేశాడన్న వార్త విన్నాడు.
అపుడు పార్వతీదేవితో పాటు నందీశ్వరుణ్ణి అధిరోహించి భూతగణాలు సేవిస్తుండగా శివుడు విష్ణువున్న చోటికి బయలుదేరాడు. విష్ణువు శివునికి అతిధిమర్యాదలు చేశాడు. శివుడు ఆసనం అధిరోహించి మరలా విష్ణువును పూజించాడు. విష్ణువు క్షేమాన్ని అడిగి, తాము క్షేమంగా ఉన్న విషయం తెలిపి తియ్యని మాటలతో శివుడు మాట్లాడుతూ, చనువుతో విష్ణువును చూచి ఇలా అన్నాడు.
దేవదేవా! వాసుదేవా! జగదీశ్వరా! ఎల్లకాలాలలోనూ జగత్తునంతా వ్యాపించి ఉండే స్వరూపం నీది. అఖిల భావాలకూ ఆధారం, కారణం నీవే. నీవు ఈశ్వరుడివి. ఆది మధ్యాంతరహితుడివి. లోపల, వెలుపలా అన్న తేడా నీకు లేదు. నీ తత్త్వం నాశనం లేనిది. నీవు పరిపూర్ణ సత్యస్వరూపుడివి. ఆనందంతో కూడిన చైతన్యస్వరూపమైన జ్ఞానమే నీ స్వరూపం. నీ తత్త్వం పరిణామాలకు లొంగనిది. అన్నింటికీ మూలమైనది. రెండవది లేనిది. నీ స్వరూపంలో దుఃఖం లేదు. గుణాలు లేనిది. అన్నింటి పుట్టుక, మనుగడ నాశనాలను కల్పించే కారణమయిన పరతత్త్వం నీవే! కైవల్యం కోరేటటువంటి మహర్షులు అహంకార మమకారాలను జయించి పూనికతో నిన్ను సదా ఉపాసిస్తారు.
స్వామీ! నీవు ఎవరో చెప్పటం దుస్సాధ్యమయిన సంగతి. కొందరు నిన్ను పరబ్రహ్మమంటారు. మరికొందరు ధర్మమే నీ రూపమంటారు. సత్ అసత్తులకన్నా అతీతం నీ రూపమని కొందరు చెబుతారు. కొందరు నిన్ను శక్తి సహితుడంటారు. నీ తత్త్వం శాశ్వతమని, నీకు నాశనం లేనిదని, నీవు స్వతంత్రుడివని, అన్నింటికీ ఆవల ఉండేవాడివని, సర్వోత్కృష్టుడవని నిన్ను వర్ణిస్తారు. చివరకి ఏకానికీ అనేకానికీ, సత్తుకు అసత్తుకు - రెండింటికీ ఆధారం నీవేనంటారు. అంచేత బాగా మీమాంసచేస్తే ప్రపంచమంతటా నీవే ఉన్నావు. నీవు లేని, నీవు కాని వస్తువులేదు. కంకణాదులు, బంగారు ఒకటేకదా! అలలు ఎన్ని ఉన్నా సముద్రం ఒకటేకదా! అందువల్ల పైకి ఎన్ని తేడాలున్నా నీ తత్త్వాన్ని తేడాలున్నదానిగా చెప్పజాలము.
ఓ పద్మాక్షా! నీ లీలను మరీచి మొదలైన మహర్షులుకూడా తెలుసుకోలేరు. నీతోపాటు నిత్యంగా ఉన్న నేనూ ఎరుగను. నీ మాయచేత గుడ్డివారై దేవతలు, రాక్షసులు మొదలైన వారే కష్టాలపాలు అవుతారు - అంటే ఇతరుల విషయం (మానవాదుల విషయం) చెప్పడం ఎందుకు? ఏ ఒక్కరూపంలోనే కాకుండా అన్ని రూపాలలోనూ నీవు వ్యాపించి ఉంటావు. సకలజగత్తును సృష్టించి, పాలించి, నశింపచేసేటటువంటి చరాచరరూపమైన కారణంగా అన్నింటా నీవే విక్రమిస్తావు. ఆకాశంలో వాయువు ఎలా వ్యాపిస్తాడో అలాగే నీవు అన్నింటా వ్యాపించి ఉన్నావు. జగత్తుకు బంధమూ, మోక్షమూ నీవే కల్పిస్తావు. బాగా విచారిస్తే నీవే అంతా. (నీవుకానిది ఏదీ లేదని తెలుసుకొన్నానని అర్థం).
స్వామీ! మహిమతోకూడిన నీ పురుషసౌందర్యాన్ని ఎన్నోసార్లు కళ్ళారాచూశాము. ఇతరులు చెప్పగా విన్నాముకూడా. కాని మునుపెన్నడూ నీ స్త్రీరూపాన్ని చూడలేదు. మోహినీ రూపాన్ని ధరించి రాక్షసుల కన్నుగప్పి అమృతాన్ని ఇంద్రాదిదేవతలకు పంచిన ఆ రూపాన్ని చూడాలని నా మనస్సు ఉబలాటపడుతోంది.
('విన్నాము' అంటే నారదాది మహర్షులు వర్ణించగా ఎన్నోసార్లు విన్నామని అర్ధం. ఆ రూపాన్ని చూడగోరే వచ్చామని కూడా శివుడు అంటాడు (చూ.మూలం. 8-12-18.))
ముకుందా! మగవాడుగానే లోకాల్ని ఇట్లా నీ వ్యూహంలోకి ఆకర్షించి చిక్కులో పడతోస్తావే! - అలాంటప్పుడు ఆడరూపాన్ని పొంది ప్రపంచాన్ని కట్టిపడవేయడానికి నీకు ఎంతసేపు పడుతుందయ్యా!
(అంటే ముందు చెప్పినట్టు (మూలంలోలాగా) స్వామిరూపాన్ని చూడాలని వచ్చాననే అర్థం ఈ మాటలో ఉంది.)
ఆ విధంగా శివుని చేత కోరబడినవాడై భావగర్భితంగా నవ్వుతూ విష్ణువు ఇలా అన్నాడు.
శ్రీకంఠా! నిన్ను నీవు మరచిపోకుండా ఉండాలి సుమా!(అందుకే ముందు 'నవ్వాడు') నీ మనస్సుకు సంతోషం కల్గిస్తాను. నాడు రాక్షసుల్ని మోసగించి అమృతాన్ని రక్షించుకోవడానికి ధరించిన ఆ ఆకారం - మోహినీరూపం లోకాన్ని ముంచి వేసేటటువంటిది. నీవై నీవు చూస్తానంటే చూపెడతాను. అయినా కోరికలు పుట్టినపుడు వాటిని తీర్చుకోవటం తప్పేమీ కాదని అంటారు కదా!
No comments:
Post a Comment