Monday, April 27, 2026

Antara Jyothichakram - ఆంతరజ్యోతిశ్చక్రం

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - ఆంతరజ్యోతిశ్చక్రం

నారాయణు డిట్లనెను: సప్తర్షి మండలమునకు పదుమూడు లక్షల యోజనములపైని పరమ వైష్ణవ పదము తేజరిల్లు చుండును. ఆపరమధామమునందు పరమ భాదవతోత్తముడు లోకవందితుడునైన యుత్తానపాదుని పుత్రుడగు ధ్రువుడు ప్రకాశించుచుండును, అత డింద్రాగ్ని కశ్యపులను గూడియుండును. 

నక్షత్రములను చూచువారు ముఖ్యముగ నెక్కువగ ధ్రువుని గౌరవింతురు. కల్పజీవులగువారు భగవంతు నుపాసించుచుందురు. జ్యోతిశ్చక్రములోని గ్రహనక్షత్రాదుల నన్నిటిని భగవానుడు త్రిప్పుచుండును. ఇటు లవ్యక్తగతితో గ్రహాదులను ద్రిప్పుచు నీశ్వరుడు ధ్రువుని మాత్రము స్థాణువువలె కదల కుండునట్టు లుంచెను. 

ఈ విధముగ పరమేశ్వరుడు నిజతేజముతో నెల్లరిని ప్రకాశింపచేయుచు దేవపూజితుడై యొప్పును. పశువులు మేఢిస్తంభమునకు బంధింపబడి దానిచుట్టు తిరుగును. ఇట్లు గ్రహాదులు లోనబైట నను విభాగముతో కాలచక్రము నందు గూర్చబడి ధ్రువు నాధారము చేసికోని వాయుప్రేరణచే తిరుగును. 

గ్రహాదులు కల్పాంతము వఱకు నిట్లు పరిభ్రమించును. వాయువు కర్మసారథి-చోదకుడు. డేగ మున్నగు పక్షులు నింగిపై వాయువశమున నెగురునేకాని క్రింద పడవు. అదే తీరున నక్షత్రగ్రహాదు లన్నియును ప్రకృతి పురుషుల సంయోగమున ననుగ్రహింపబడి వాయువశమున నేలపై పడక తిరుగుచుండును.

కొందఱీ జ్యోతిశ్చక్రమును భగవానుని యోగధారణ కుపయోగపడు శింశుమార స్వరూపముగ భావింతురు. ఓ మునీశా! ఈ కుండలీభూత శరీరుని తల క్రిందివై పుండును. దాని తోకచివర నుత్తానపాదుని పుత్రుడగు ధ్రువుడు నెలకొని యుండును. తోక భాగమునందు పాపరహితులగు ప్రజాపతి ధర్ముడు ఇంద్రాగ్నులును దేవపూజితులై ప్రకాశించుచుందురు. 

దాని తోక కొట్టకొన ధాతృవిధాతలును నెన్నడుమునందు సప్తర్షులును వెలుగుచుందురు. ఈ శింశుమారము దక్షిణమునకు తిరిగిన పడగతో చుట్టలు చుట్టుకొని వెల్గుచుండును. దానికి కుడివైపున నుత్తరాయణ నక్షత్రములు (అభిజిత్తునుండి పునర్వసు వఱకు 14 తారలు) తనరును. 

ఎడమవైపున దక్షిణాయన నక్షత్రములు కుండల రూపమననున్న శరీరమున కిరుప్రక్కలనున్న యవయవములు సమానముగ నుండును. దాని వీపు భాగమున 'అజవీథి' గలదు. ఉదరమున నాకాశగంగ గలదు. పునర్వసు పుష్యములు కుడియెడమప్రక్కల గలవు. ఆర్ద్రాదీశ్లేలు దానివెనుక కాళ్లకు కుడియెడమ వైపుల గలవు. 

అభిజిత్తు ఉత్తరాషాఢయు దాని కుడియెడమప్ర ముక్కుల నొప్పును. ఓయి నారదా! శ్రవణము పూర్వాషాఢయును దాని కుడుయెడమ నేత్ర ములం దనరారును. దాని కుడియెడమ చెవులందు వరుసగ ధనిష్ఠామూలా నక్షత్రములును మఘాదిగ నెనిమిది నక్షత్రములు దక్షిణ భాగమున ప్రకాశించును.

ఇవి యెడమభాగమందలి యెముకలందుండును. మృగశిరాదులు ఇత్తరదిగ్బా భగమున నుండును. ఇవి కుడివైపుననున్న యెముకలందున్నటు లూహింపబడెను. దానికుడి యెడమ భుజములందు శతభిషక్‌ జ్యేష్ఠలను భావింపవలయును. 

ఆగస్త్యు డుత్తరపుపైదౌడయందును యముడు క్రింది దౌడయందును ఆంగారకుడు ముఖమందును శని యుపస్థ మందును విలసిల్లు చుందురు. దాని మూపున గురుడు ఱొమ్మునందు గ్రహపతియగు సూర్యుడును హృదయకమలమందున శ్రీమన్నారాణుండును 

మనస్సున చంద్రుడు నుందురు. అశ్వినిదేవతలు దాని స్తనములందును శుక్రుడు నాభియందును బుధుడు ప్రాణాపానములందును రాహుకేతువులు గళమందు నుందురు. దానియెల్ల యంగములందు రోమములందును నిఖిలకారాగణములు ప్రకాశములు విర జిమ్ము చుండును. 

ఇది అంతయును శ్రీవిష్ణుభగవానుని సర్వదేవ మయమైన దివ్యస్వరూప వర్ణనామృతము ఈ శింశుమార స్తోత్త్రమును ప్రతిసంధ్యయందును మౌనముగ నియతితో ధ్యానింపవలయును. నవనవోన్మేష ప్రజ్ఞాశాలియగు వాడు ప్రొద్దున దీనిని చదువుచు మేల్కాంచ వలయును. 

శ్రీజ్యోతిః స్వరూపుడు మహాకాలుడు దేవపతి పురుషోత్తముడునగు భగవానుని దోసి లొగ్గి ధ్యానించుచున్నానని సకలగ్రహ నక్షత్రతారా మయుడు పాపనాశకుడు ఆధియజ్ఞుడు నగువానిని త్రికాలములందీ మంత్రము సంస్మరించుచు నమస్కరించువాని పాపరాసులప్పటికప్పుడే పటాపంచలగును.

శ్రీనారాయణుడిట్లనెను : సూర్యునకు పదివేల యోజనముల మీదుగ (ఈరాహువు నక్షత్రము అనదగిన యోగ్యత కలవాడు కాడు. అయినను నక్షత్రము వలెనే సంచరించుచుండును.) రాహుమండలము శోభిల్లును. ఈ సింహికాసుతుడు సూర్య చంద్రులను మర్దించువాడు. ఇతడు శ్రీవిష్ణుననుగ్రహమున నమరత్వమును గ్రహత్వమును బడసెను. 

పదివేలయోజనముల వఱకును తపించు రవిమండలము నితడు గప్పివేయును. ఇతనిని రాక్షసునిగ నెఱుగవలయును. చంద్రమండలము పండ్రెండు వేల యోజనములుగలది. రాహువు పదుమూడు వేలయోజనముల విస్తారము కలవాడగును. ఇతడు పగవట్టి పర్వములందే సూర్యచంద్రుల నాచ్ఛాదించును. సూర్యచంద్రులల్లంత దూరమునందున్నను నితడువారిని గప్పివేయును. 

ఈ సంగతి శ్రీ మహావిష్ణునకు తెలియును. ఆదిచూచి అతడు వెంటనే యగ్ని జ్వాలలు చెలరేగు భిష ణమగు తన సుదర్శన చక్రమును ప్రేరించును. చక్రము యొక్క దుస్సహమైన తేజమును రాహువు సహింపలేకుండును, అతడు కలగుండు చెంది యొక్క ముహూర్త మాత్రముననే దూరము ముండియే తొలగిపోవును. ఇదే ఉపరాగము-గ్రహణము. ఇట్లు గ్రహణము లోకమున చెప్పబడెను. దేవర్షీ: చక్కగ వినుము. దీనికి క్రిందుగ పరమ పావనమైన లోకములు గలవు. అవి సిద్ధ-చారణ-విద్యాధరుల పుణ్య లోకములు. అవి పదివేల యోజనములంత విస్తారమున నొప్పిదమై యున్నవి. ఓయిసురమునీ! వీనికి క్రిందుగ యక్ష-రాక్షస భూత-ప్రేత పిశాచముల విహారస్ధానములు నెక్కొని యున్నవి. ఎందాక మేఘములు క్రమ్ముకొని యుండునో యెందాక వాయువులు వీచునో యందాక నంతరిక్షము గలదని జానకోవీదులు వాక్రుత్తురు.

ఓ ద్విజవర్యా! దానికి నూఱుయోజనములు క్రిందుగ సస్యశ్యామలయగు భూమి తిరముగనున్నది. దానిపై గరుడ పక్షులు డేగలు సారసములు హంసలు మున్నగు నేలపై బుట్టిన ప్రాణులెగురు చుండును. భూసంబంధమైన విషయము నీకు తెల్పితిని.

అథోలోకాల వర్ణన

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment