Monday, April 27, 2026

Description of Atholoka - అథోలోకాల వర్ణన

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - అథోలోకాల వర్ణన

నారాయణు డిట్లనెను: విబుధఋషీ! భూమికి క్రిందిదెసనేడు పెద్ద వివరములు గలవు. వానిలో ప్రతిది పదివేలయోజనములు పొడవు గలది. ప్రతిదియునంతియే వెడల్పుగలదు. ప్రతిది యెల్లఋతువులందును సుఖముగూర్చును. అవి అతల - వితల - సుతల - తలాతల - మహాతల -
రసాతల - పాతాళాలు ఈ యేడును మహావివరము లనబరగును. 

ఓ విప్రా! వీనియందు స్వర్గమునకన్న మిన్నయగు సంపదలుచెన్నొందు చుండును. అచ్చోటగల రమ్యహర్మయములందు నుద్యానవనములందును కామభోగములు నిత్యసుఖసంపదలు పెక్కులుగలవు. అందుభుజశాలురైన కద్రూతనయులును దైత్యదానవులును నిత్యము తమతమ యాలుబిడ్డలతోబందుగులతో మోద-ప్రయోదము లనుభవింతురు. 

వారుతమ నెచ్చెలులను తమ యాశ్రితులను గూడి గృహముల సుఖింతురు. వారికోర్కెలు మొక్కపోనివి. వారుమాయావులు. అచటి వారెల్ల ఋతువులందును సుఖ సంతోషములతో నుందురు. మాయలకు విభుడగు మయుడు వానిని అట్లు నిర్మించెను. వారి పురములందలి భవనాల చిత్రవిచిత్రములైన అట్లాలకములగోపురములు మున్నగునవి జాతిమణుల-మేలిముత్యాల కాంతులీనుచుండును. 

అచ్చోటి కొలువుకూటములు ముంగిళ్ళు విహారస్థలులును కాంతులు వెద జల్లుచు స్వర్గమును దలదన్ను చండును. ఆచటి నాగాసురుల జంటలు పావురముల గోరువంకల జంటలును-రమ్యమగు కృత్రిమస్థానములు నెతైన మంచిమేడలు తీర్చిదిద్దిన కనుల పండువగు తోటలు ముచ్చటలు గొల్పుచుండును. అచటి చెట్లు పూలు పండ్లు విదుల్చుచు నెమ్మదికి నెమ్మి కమ్మందనము గ్రుమ్మరించును. 

అచటి లలనామణుల కొంగ్రొత్తతళు కుబెళుకుగలిగి తగిన తావులు పెక్కు గలవు. అచ్చోపెల్లుగ కలకలారావములు చేయు పక్షులతో నిండిన కొలంకులందు చేపలు గలవు. అచ్చట జలచరములచే గలతజెందిన పెక్కులు నీలారుణ కమలములును కలువలు నుత్పలములును కహ్లారములును గలవు. 

అవి యచ్చట తమతమ తావు లేర్పరచుకొని సొగసారుచున్నవి. ఆ కొలంకుల పెక్కుగతులగు స్వరములింద్రియములును తనుపును. వేయేల? ఆ చోటి కలుము లమరసంపదల నతిశయించును. కాలాంగములగు దివారాత్రములవలని భయ మెంతమాత్ర మునులేదు. అచటినాగరాజుల తలలందలి మణిగణముల నిత్యకాంతులవలన నట చీకట్లు తొంగియైన చూడలేవు. 

ఆచోటి దివ్యౌ షధుల రసాయనములం గూడిన రసాన్న పానములు స్నానములు నచట వసించువారి కాధి వ్యాధులు గల్గింపవు. మేనులు ముడు తలుపడి కృశించుట పాలిపోవుట ముసలితనము వెండ్రుకలు నెఱయుట నిరుత్సాహము మున్నగు మార్పు లచటివారి కేనాటికిని లేవు. వారి కెల్లవేళల మేలు దొంతరలు గల్గును. చావుభీతి లేదు. కానా వారు చక్రహస్తుని చక్రతేజమునకు వెఱతురు నారదా! అందు శ్రీహరి తేజము ప్రవేశింపగనే యతని చక్రభీతివలన దైత్యకాంతల గర్బములు స్రవించిపోవును.

శ్రీనారాయణ డిట్లనెను: ఓ నారదా! మొదటి అతల సుందరలోకమందున పుబలగర్వములు ఖండించునట్టి మయ పుత్రుడగు బలుడనువాడు గలడు. అతడు సర్వార్థములు సాధింపగల తొంబదియారు మాయావిద్య లేర్పఱచెను. వాని నెఱింగినవాడు గొప్ప మాయావి గాగలడు. బలశాలియగు బలుడావులించినంతనే ముజ్జగములను మోహపఱచునట్టి మోహినులు పెక్కురు పుట్టుదురు. 

ఆస్త్రీలు-పుంశ్చలీ-కామిమీ-స్వైరిణులు. వారు తమ ప్రియమైన వివరమునందు జొచ్చిన పురుష వర్యు నొంటరిగ చేజిక్కించుకొందురు. వారు ప్రయత్నించి హాటకరసముతో వారిని తమవారిగ వశీకరించుకొందురు. వారు తమ పదునైన కడగంటి చూపులతో వలపుతో కౌగిళ్లతో చిర్ననగవులతో నర్మమర్మ గర్భితమైన పలుకులతో తమిదీఱవారితో రమింతురు. అతడు తన్నొక సిద్దునిగ నాగాయుతబలునిగ నీశ్వరునిగ నోటమి నెఱుగనివానిగ దలచుకొని మదాంధు డగును. 

ఓనారదా! ఇంతవఱకు నీకతలము సంగతి తేల్పితిని. ఇంక రెండవ వివరమగు వితలము గుఱించి వినుము. ఈ భూమికి క్రింద వితలమను వివరమునందు శివభగవానుడు హాట కేశ్వర నామమున ప్రసిద్దుడై తన పార్షదగణములతో గూడి సేవలందుకొనుచుండును. అతడచట ప్రజాపతి రచితమైన సృష్టిక్రమమును పెంపొందించుటకు భవానీ సహితముగ విరాజిల్లుచుండును. 

శివుని మహావీర్యమునుండి హాటకమను నది ప్రవహించును. అగ్ని దానిని తన తేజముతో త్రాగును.
అగ్ని వెడలగ్రక్కిన హాటకమను బంగారము దైత్యులకు ప్రియమైనది. దైత్యకాంతలు దానిని సొమ్ములుగ నుపయోగింతురు.

సుతల లోకము

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment