Monday, April 27, 2026

Surya Chandradi Grahalu - Gatibhedalu - సూర్యచంద్రాది గ్రహాలు - గతిభేదాలు

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - సూర్యచంద్రాది గ్రహాలు - గతిభేదాలు

నారదా! ఈ పర్వతమునకు పైని సిద్ధయోగులు సంచరింతురందరు. ఈ భూమ్యాకాశముల నడుమ సూర్యడు సంచరించుచుండును. సూర్యునకు భూమికి నడుమ దూర మిరువదైదుకోట్ల యోజనము లుండును. మృతప్రాయమైన యండమునం దాత్మరూపమున ప్రవేశించుట వలన సూర్యుడు మార్తాండుడనబరగును. 

పెద్ద బంగారుగ్రుడ్డునుండి యుద్బవించుట వలన సూర్యడు హిరణ్యగర్బుడని పిల్వబడును. సూర్యునివలన నింగి నేల దిశలు స్వర్గము అపవర్గము నరకము రసస్థానములు సుర-నర-జంతువులు ప్రాకునవి వృక్షలతలు ఈ సకల జీవకోటి కంతటికిని సూర్యడే యాత్మ. సూర్యడే చక్షురధిదేవత. ఇతడే భూమండల మంతట నిండి విరాజిల్లుచున్నాడు.

సూర్యునివలననే పండితులు ద్యుపరిమాణమును తెల్పుదురు. ఎట్లన రెండు సమభాగములలో నొకటి తెలిసిన రెండవది తెలిసినటులే కదా ! తపించువారిలో శ్రేష్ఠుడగు సూర్యభగవానుడు దివిభువుల మధ్య తన వెల్గులు విరజిమ్ముచుండును. సూర్యుడు ఉత్తరాయనమును ఆశ్రయించియుండి తన నడకలో మాంద్యమును కలిగించుకొనును. ఏలయన ఉత్తరాయన గమనము అతనికి ఆరోహణ (పైకి ఎక్కుచు నడవవలసిన)స్థానము. 

కనుక అతడు దీనిని చేరియుండి. పగటి పరిమాణమును దీర్ఘముగా చేయును. దక్షిణాయనము అతనికి అవరోహణ(ఎత్తునుండి క్రిందికి దిగు) స్థానము. అందుచే అతడు దీనిని చేరి తన నడకను శ్రీఘ్రతరముచేయును. అందుచే అతడు దీనియందు ఉన్నపుడు పగళ్లపరిమాణమును హ్రస్వతరము (చాలపోట్టిదానినిగా) చేయును. విషువత్‌ అను స్థానము - ఒక అయనమునుండి మఱియెక అయనమునకు మారెడి ఒక దినము మాత్రము. ఇది సమస్థానము. 

దీని నాశ్రయించి సూర్యుడు పగటి పరామాణమును రాత్రి పరిమాణమును సమముగా చేయును (ఇది సాధారణుగా మార్చి-సెప్టెంబరు తేదీలకు ఇంచుమించుగా అగును.) ఇది సూర్యడు మేషము నందును తులయందును. చరించు కాలము అగును. అపుడు వేదత్రయమూర్తియగు రవి అహోరాత్రములను సమాన పరిమాణము కలవిగా చేయును. 

వృషభ-మిథున-కర్కట-సింహ-కన్యారాసులలో సూర్యుడున్నపుడు క్రమముగా పగళ్ల పరిమాణ మధికమగుచు రాత్రులు పరిమాణము తగ్గుచు పోవును. వృశ్చికధనుర్‌ - మకర- కుంభ-మీనరాసులందు సూర్యుడుండగా రాత్రుల పరిమాణము పెరుగుచు పగళ్ల పరిమాణము తగ్గుచు పోవును.

శ్రీ నారాయణు ఈవిధముగా పలికెను : ఇకమీదట ఇంకను మిగులను విస్తరరూపమున రవి గమనమును వివరింతును. రవియొక్క గమనము-మాత్రమే కాదు. ఇతర గ్రహముల గమనము కూడ-శీఘ్రము-మందము-సమము-అని మూడు విధములుగ నుండును.

ఓ దేవమునిశ్రేష్ఠా! నారదా! వినుము : రవికే కాదు-సర్వగ్రహములకును స్థానములుమూడు-మధ్యస్థానము-ఉత్తరస్థానము-దక్షిణస్థానము-అని వీనికి వరుసగ-1. జారద్గవము 2. ఐరవతము 3. వైశ్వానరము అనియు పేరులు కలవు. వీనిలో నొక్కొక్కటి మూడు ఉపభేదములతో నుండును.

ఎట్లనగా! ఉత్తర దక్షిణ ధ్రువ నక్షత్రములు రెండు కొనలందుండునట్లు. అంతరిక్షములో అమరియున్న జ్యోతిశ్చక్రము నట్టనడుమ గ్రహములు సంచరించు బాటగా ఇరువది ఏడు నక్షత్రములతో ఏర్పడిన క్రాంతివృత్తము అను చక్రపు అమరిక ఉన్నది. వీనిలో అశ్విని భరణి కృత్తికలు నాగవీథి; రోహిణి మృగశిర ఆర్దృలు-గజవీథి; పునర్వసు-పుష్యమి-ఆశ్లేషలు-ఐరావతవీథి; ఈమూడు విథులను కలిసి ఐరావతవీథియగును. (నాగ-గజ-ఐరావత-మూడును గజములే.) ఈ మూడు వీథులును కలిసి ఉత్తర మార్గము అనబడును.

ముఖ-పూర్వఫల్గుని-ఉత్తరఫల్గుని-అర్షభీవీథి;హస్త-చిత్త-స్వాతి-గోవీథి; విశాఖ-అనూరాధ-జ్యేష్ఠ-జారద్గవ వీథి; ఈ మూడు వీథులును కలిసి జారద్గవవీధి అనబడును. ఈ మూడు వీథులను కలిసి మధ్యమమార్గము. అగును. (ఋషభ-గో-జరద్గు-శతభిషము-మార్గవీథి; పూర్వాభాద్ర-ఉత్తరాభాద్ర-రేవతి-వైశ్వానరవీథి; ఈ మూడు వీథులును కలిసి దక్షిణమార్గము అనబడును. 

సూర్యుడు ఉత్తరాయనమును చేరినప్పుడు అతని రథపు కాడి కొనలయందు ఇమిడ్చి వాయువుచే కట్టబడిన పాశములను లాగుట జరుగును. అది అతని నడకలో ఆరోహణము అనబడుచున్నది. అప్పుడు అభ్యంతర భాగమునందలి అంతరిక్ష మండలమున రవి రథ గమనము జరుగును. దానిచే అతని గతిలో మాంద్యము-నెమ్మదితనము-పగళ్ల పరిమాణముల వృద్ది-జరుగును. రాత్రుల పరిమాణము తగ్గును. ఇది సౌమ్యా(ఉత్తరా) యనక్రమము. 

దక్షిణాయనమున ఇవే పాశములు ప్రేరితములై - అనగా ముందునకు సడలించబడి వదలబడిన-అవరోహణము జరుగును. బహిర్మండలమున రవి రథము ప్రవేశించినడుచును. అందుచే అతని రథగతిలో శీఘ్రత్వము వచ్చును. అప్పుడు పగళ్ల పరిమాణము తగ్గి రాత్రుల పరిమాణము పెరుగును. విషువకాలమునందు(ఇది లోగడ చెప్పబడినది.) పాశముల బిగువు సమావస్థలో ఉండుట చేత రాత్రిందినముల పరిమాణములు సమములుగనుండును. 

ఈ నడకలో రవి రథగమనము మధ్యమండలమున జరుగును. రవిరథపు కాడికొనలయందు బిగింపబడిన పాశములు ధ్రువుడు అధిష్టాతగానున్న అంతరిక్షమునందలి వాయువులచే అకర్షింప-లాగ-బడునపుడు సూర్యడు అభ్యంతర మండలమున నెమ్మది నడకతో తిరుగును. 

ధ్రువుడు తన అధీనమునమండు అంతరిక్షవాయు ద్వారమున పాశములను మరల వదిలినపుడు రవి బాహ్యమంజలమున తిరుగును. (పాశముల వదులుటగాని తన దగ్గరకు లాగికొనుటగాని ధ్రువుడు చేయప్పుడు మధ్యమండలమున రవి రథము సంచరించును.)

మేరుపునకు తూర్పుదెసయందు ఇంద్రుని నగరమగు దేవధాని- అమరావతి దక్షిణపు దెస యముని సంయమనీపురి పడమట వరుణుని మహాపురి యగునివ్లూెచని- ఉత్తరమున సౌమ్య- ఉత్తర దిక్కుననుండు కుబేరుని నగరియగు విభావరి- కలవు. (భోగోళముపై ప్రదేశములందు ఉన్నజనుల స్థితినిబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగ దిగ్వ్యవస్థ ఏర్పడును. 

ఏలయన ఎవరికి ఎటనుండి సూర్యుడుదయించు చున్నట్లు కనబడునో అచటివారి కదియే తూర్పు- అందరకును మేరువు మాత్రము ఉత్తరముననే యున్నది. అని ముందు చెప్పబడును.) రవి ఉదయించుచోటు అమరావతి- అతడు అంతరిక్ష మధ్యమునకు చేరి మధ్యాహ్నమును ఏర్పరచు స్థానము సంయమని- అస్తమించు స్థానము నివ్లూెచని- విభావరియును కుబేరపురి అర్ధరాత్రి స్థానము అని వ్యవస్థ. 

ప్రాణుల జీవన ప్రవృత్తులకు మూలము కాలము. దానివ్యవస్థకు మూలము రవి గమనము. దానినిబట్టి ఏర్పడియు రవి రథగతి గుర్తించుటకు సాధనము దిక్కులవ్యవస్థ. మేరువును ఆధారముగా తీసికొని దానికి నాలుగు వైపుల ఈ వ్యవస్థ అంతయు నీకు తెలిపితిని. 

మేరువునందు ఉన్నవారికి ఎప్పుడును అంతరిక్ష మధ్యమున నున్నట్లే సూర్యుడు కనబడును. అతడు ఆ మేరువునకు సవ్య-ఎడమ-దక్షిణ-కుడి-వైపులుగ నడుచుటయే అచ్చటి వారికి ఉదయాస్త మయములు. ఆయాదేశముల యందు విదిశల-మూలల-యందు రవి కనబడుటయే ఆయాకాలవ్యవస్థకు ఆధారము. 

ఎవరికి ఎచ్చట నున్నట్లు రవి కనబడునో వారికి అచ్చట ఉదయము-ఎచ్చట అతడు మరుగుపడినట్లు కనబడునో అచ్చటివారికి అస్తమనము వాస్తవమున సూర్యునకు ఉదయముకాని అస్తమయము కాని ఎప్పుడునులేవు. రవి దర్శనమునకు అందుట అందక పోవుటలే అతని ఉదయాస్తమయములు.

ఇంద్రుడు మున్నగువారి పట్టణములందున్నపుడు రవి మూడు పట్టణములను అనగ నింద్రపురి నున్నప్పు డింద్ర యమ సోమపురములను తాకును. ఆగ్నేయకోణమున నుండగ ఈశాన-ఆగ్నేయనైఋతి కోణములను నింద్ర యమపురములను తాకును. ఎల్ల వర్షద్వీపములకును మేరుపర్వత ముత్తరముగ చెన్ను మీరును. 

ఎవ్వరు భానూదయ మెచ్చట గందురో వారి కది తూరుపగును. వారి కందఱికిని మేరు వుత్తరమున నుండునని మునుల నిశ్చయము. సూర్యు డింద్రపురమునుండి పదునైదు గడియలు పయనించి యమపురిని జేరును. అంతలో రెండుకోట్ల ముప్పది ఏడు లక్షల డెబ్బదియైదువేల యోజనముల దూరము రవి పయనించును. ఇట్లు కాలమును దెల్పు కాలచక్రాత్మకుడైన రవి ప్రయాణించును. 

ఇదే వేగముతో భాస్కరుడు వరుణ సోమేంద్రపురములను దాటును. ఇటుల కాలజ్ఞానమునకు హేతుభూతుడై రవి తిరుగుచుండును. చంద్రాదులగు ఇతర గ్రహములును సూర్యునివలెనే తిరుగుచు ఇతర గ్రహములు సైతము తమ తమ స్థానములగు నక్షత్రములంగూడి యుదయించి యస్తమించుచుండును. 

రవి రథమొక్క ముహూర్తకాలములో ముప్పదినాల్గు లక్షల యెనిమిదివందల యోజనములు ప్రయాణము సాగించును. వేదమయుడగు భానుడు నలుదెసలందున్న పురములను జేరును. ప్రవహమను వాయువువలన రవి రథ మిట్లు తిరుగును. ఈ కాలచక్రాత్మకుని యరదమునకు సంవత్సరమున నొకే చక్రము- మూడు చాతుర్మాస్యములను నాభి పండ్రెండు మాసములనెడి ఆకులు- కలది-కలదు.

ఆరు ఋతువు లనెడు నిరుసు గలదు. ఇట్టి రథమును కవులు సంవత్సరాత్మక మందురు. మేరువుపైని గల మానసోత్తరగిరియందు దీని యొక యక్షము గలదు. మానసోత్తరపర్వతపు పొడవు. 1,57,50,000. ఈ చక్రముయొక్క యితర భాగములవలన కలా-కాష్ఠా ముహూర్తాది విభాగములు చేయబడెను. ఇట్ట చక్రమును రవితైలకారుని యంత్రమువలె (నూనె గానుగవలె) త్రిప్పుచుండును. ఇటుల రథము మానసోత్తరిగిరిని ప్రదక్షిణించును. 

ఆ గిరిపై నున్న యక్షము కాక మఱియొకటి ధ్రువునం దుంచబడెను. ఈ అక్షపు పొడవు మానసోత్తర పర్వతపు పొడవులో నాల్గవవంతు. ఇవి తైల యంత్రముయొక్క యక్షములను బోలియుండును. దీనికిపై నున్న దంతయును లోకపతియగు రవి యుండు భాగము. రథముపై సూర్యుడుండు స్థలము వెడల్పు ముప్పదియారు లక్షల యోజనములంత గలదు. ఇంతియ పరిమాణమున ఎత్తుగల గుఱ్ఱములను గూర్చును. 

గుఱ్ఱములు లోకకల్యాణముకొఱకు భానుని యోయుచుండును. సవితృదేవునికి ముందు సూతుడగు నరుణుడు పడమటి మొగమై యుండును. గరుడుని సోదరు డిట్లు సూతకార్యమునకు నియోగింపబడెను. వాలఖిల్యాది మహర్షు లంగుష్ఠ మాత్రులు. వారు లెక్క కరువదివేల మందిగలరు. వారు రవిమ్రోలచేరి శుభకరములగు వేదసూక్తములతో ఆయనను ప్రస్తుతింతురు. 

అదే విధముగ నితర ఋషులు దేవతలు గంధర్వులు నచ్చరలు నాగులు గ్రామణులు యాతుధానులు నెల్లరును భానుని ప్రస్తుతింతురు. వారు రవిని నెలల కొలది వారముల కొలదిగసేవింతురు. భూమండలమునకు చుట్టు రవి పయనించు కక్ష్య చుట్టు కొలత తొమ్మిదికోట్ల యెకలక్ష యేబదిరెండువేల యోజనములు-ఒక గప్యూతి. ఇంత దీర్ఘ దూరమును భాను డొక్క క్షణమాత్రమున దాటి పోవును. అతడు విశ్వవ్యాపి-దేవదేవేశుడు.

శ్రీ నారాయణు డిట్లనెను : ఇపుడు నరులకు శుభాశుభములు గూర్చునట్టి చంద్రాది గ్రహముల గమనములగూర్చి వినుము. అది మిగుల ఆశ్చర్యకరమైనది. కుమ్మరి సారెపై నున్న కీటకాదులు సారెతోపాటు తిరుగును. అటులే కాలచక్రాత్మకమగు రాశిచక్రముతో బాటుగ గ్రహము లన్నియును మేరునగమునకు ప్రదక్షిణ మొనర్చుచు తమ అక్షమును వదల కుండును. 

భానుడు మొదలగు గ్రహముల గమనము విలక్షణ విధముగ దోచును. గ్రహములు తమ తమకు అధిపత్యము కల నక్షత్రములలో తిరుగుచు నితర గ్రహముల స్థానములను నక్షత్రములందును దిరుగును. ఈ రెండు విధములగు గమనములు పరస్పరము విరోధము లేనివి. భగవాను డాదిపురుషుడు లోకభావనుడు అగునట్టి శ్రీమన్నారాయణుడే స్వయముగ జగముల మేలుకోరి యిట్టుల జ్యోతీరూపమున తిరుగుచుండును. 

అతడే కర్మశుద్ధి కారణముగ త్రయీమము డనబరగును. అతడే సూర్యరూపమున పండ్రెండు భేదములుగ నయ్యెనని తత్త్యవేత్తలందురు. ఆ సూర్యుడే వసంతము మున్నగు నారు ఋతువులను క్రమముగ ననుభవించును. అతడు వానిలో నాయాఋతుధర్మములు నెలకొల్పును. అట్టి యాదిత్య పురుషు నెల్లరును త్రయీవిద్యతో నుపాసింతురు. 

మానవులు తమ వర్ణాశ్రమధర్మములతో వైదిక కర్మలతో కొద్ది గొప్ప క్రియలతో శ్రద్ధాయోగములతో రవినిసేవింతురు. ప్రజలు తమ తమ కోర్కె లీడేరుటకు సతతము భాస్కరునిగూర్చి వేల్తురు. నమస్కరింతురు. దేవగణ స్వరూపములతో తేజరిల్లుచు తిరుగుచు పండ్రెండు మాసము లనుభవించును. మాసమనగ రాత్రిపగలు కలిసిన రెండు పక్షములు. లేక రవి రెండుంబావు నక్షత్రములం దిరుగు కాలము మాసము. ఇట్లు రవి రెండురాసు లనుభవించు కాలమును ఋతు వందురు.

ఈ ప్రకారముగ సంవత్సరము యొక్క యవయవములను తత్త్వవేత్త లభివర్ణించిరి. భానుడు మూడు ఋతువులలో నింగినెంతకాలములో తిరుగునో ఆ కాల పరిమాణమును పెద్దలయనమని వచింతురు. ఇట్లు రవి పండ్రెండు రాసులందును పూర్తిగ తిరుగును. ఇట్లు పండ్రెండు నెల లనుభవించు కాలము నొక సంవత్సర మందురు. సంవత్సరము-పరివత్సరము-ఇడావత్సరము-అనువత్సరము-ఇద్వత్సరము నని సంవత్సర మయిదు విధములు. రవికి మంద-మధ్య-శీఘ్ర గతులు మూడు గలవని కాలవిదులు వాక్రుత్తురు. 
ఈ విధముగ సూర్యగతి గుఱించి తెల్పితిని.

ఇక చంద్రాదులగతి గూర్చి వినుము. చంద్రుడు సూర్యనకు లక్ష యోజనములదూరముననుండి వెన్నెలలు గాయుచుండును. ఓషధులపతి వెన్నెలఱేడు సూర్యుడు సంవత్సరములో నడుచు మార్గమును చంద్రుడు రెండు పక్షములలో పూర్తి చేయును. సూర్యుడు నెల నడచు మార్గమును చంద్రుడు రెండుంబావు నాళ్లలలో (నొకరాశి) ననుభవించును. ఇటు త్వరితగతితో చంద్రుడెల్ల నక్షత్రముల ననుభవించును. 

కళానాథుడగు చంద్రుడు షోడశకళలతో నిండి దేవలతలకును తగ్గిన కళలతో పితృదేవతలకును మోదము చేకూర్చును. ఇతడు పూర్వము-అపరమునను పేర్లతో దివారాత్రులు గల్గించును. చంద్రు డెల్ల జీవకోటికి ప్రాణము-అమృతము. చంద్రుడు సనాతనుడు ఉత్తమపురుషుడు షోడశకళాత్మకుడు; ఇతడు ముప్పది ముహూర్తములలో నొక్కొక్క నక్షత్రము వంతున ననుభవించును. 

చంద్రుడు-మనోమయుడు-సుధాకరుడు-అన్నమయుడు-అమృతధాముడు-శృంగార కళానిధి-ఎల్ల దేవ -పితృ -నర -జంతు -వృక్ష గణములకు తృప్తికురుడు. ఎల్ల ప్రాణులకు ప్రీతికరుడు. కనుక చంద్రుని సర్వమయు డందురు. చంద్రునకు మూడు లక్షల యోజనములమీద నక్షత్ర చక్రము తిరుగుచుండును. ఇవన్నియును భగవంతునిచేత నియోగింపబడి మేరువునకు ప్రదక్షిణము చేయుచుండును.

అభిజిత్తునుగూడి నక్షత్రములు మొత్త మిరువదెనిమిదిగ లెక్కింపబడినవి. వీనికి రెండు లక్షల యోజనముల దూరాన శుక్రుడు ప్రకాశించుచు రవికి ముందువెనుకల సమముగ తిరుగుచుండును. శుక్రునకును శీఘ్ర-సమ-మందగతులు గలవు. ఇతడు లోకుల కనుకూలుడు-మేలు గూర్చువాడు. ఇతడు వర్షము నాపు గ్రహములను శాంత పరచి ప్రాణులకు సుఖము చేకూర్చును. ఇతనికి రెండు లక్షల యోజనముల దూరమున బుధు డొప్పారుచుండును. 

శుక్రునకు వలె బుధునకును శీఘ్ర-సమ-మందగతులు గలవు. ఒక్కొక్కసారి బుధుడు సూర్యునకు చాల దూరముగ నుండును. అపుడు పెనుగాలులు మేఘపాతములు అనావృష్ఠుల భయము సూచింపబడును. 

ఇతనికి పైని రెండు లక్షల యోజనముల దూరమున కుజుడు చెన్నొందుచుండును. కుజుడు వక్రుడు గానిచో మూడు పక్షముల కొక రాశి ననుభవించును. ఇటులే పండ్రెండు రాసు లనుభవించును. ఇతడు పాపగ్రహములలో చేరినవాడు. తఱచుగ నశుభము చేయువాడు. 

ఇతనికి రెండు లక్షల యోజనముల మీద గురుడు విరాజిల్లుచుండును, గురుడు ప్రతీరాశి నొక్క యేడాది యనుభవించును. ఇతడు వక్రించనిచో బ్రహ్మవాదులకు శుభము గల్గును. 

ఇతనికి రెండులక్షల యోజనముల పైని సూర్యసుతుడు క్రూరుడునగు శని గలడు. ఇతడొక్కొక రాశిని ముప్పదినెల లనుభవించును. ఈ విధముగ గ్రహము లన్నియు నొక్కొక్క రాశి చొప్పున నెల్ల రాసులు దిరుగుచుండును. కాలజ్ఞులు శని యెల్లరికినికీడు గల్గించువా డందురు. ఇతనికి మీద నుత్తరముగ పడునొకండు లక్షల యోజనములపైని సప్తర్షి మండలము శోభిల్లు చుండును, ఈ యేడుగురు మునులును లోకహితము చేకూర్చు తలంపుతో విష్ణుపదస్దానమునకు ప్రదక్షిణము చేతురు.

ఆంతరజ్యోతిశ్చక్రం






No comments:

Post a Comment