Friday, July 31, 2026

Manvantaraalalo Mahadevi - మన్వంతరాలలో మహాదేవి

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము - మన్వంతరాలలో మహాదేవి

శౌనకాది మహామునులారా! మొదటి మన్వంతరంలో జగన్మాత - వింధ్యవాసినిగా ఆరాధనలు అందుకుంది. మిగతా మన్వంతరాలలో ఏయే రూపాలతో ఎవరెవరి అర్చనలు అందుకున్నదో తెలియజెప్పమని నారదుడు అడిగాడు. నారాయణమహర్షి ఇలా వివరించాడు -

నారదా! స్వాయంభువుడు మొదటి మనువు. ఆయన వింధ్యవాసినిని ఆరాధించి ఆకంటకంగా రాజ్యపాలన సాగించాడు. ప్రియవ్రత - ఉత్తానపాదులు ఇద్దరూ అతడి కుమారులు. మహా తేజస్వులు. పరిపాలకులుగా సుప్రసిద్దులు. ఈ స్వాయంభువుడి తరవాత స్వారోచిషుడు రెండవ మనువు. ఇతడు ప్రియవ్రతుడి కుమారుడు. అప్రమేయ బలపరాక్రమసంపన్నుడు. కాళిందీ తీరంలో ఆశ్రమం కట్టుకుని మట్టితో దేవీవిగ్రహం చేసి దాని ఎదుటే కూర్చుని తపస్సు చేశాడు. పన్నెండు సంవత్సరాలకి అమ్మవారు అనుగ్రహించింది. కోటిసూర్యప్రభలు విరజిమ్ముతూ ప్రత్యక్షమయింది. స్వారోచిషుడికి సర్వమన్వంతరాలకూ ఆధిపత్యం ప్రసాదించింది. తారిణి అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. తరవాత ఉత్తముడు ఆనే మూడవ మనువు (ప్రియవ్రతసుతుడు) గంగాతీరంలో మూడేళ్ళు తీవ్రంగా తపస్సుచేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. నిష్కంటకంగా రాజ్యం పరిపాలించి ఉత్తమ సంతానం పొంది భోగభాగ్యాలు అనుభవించి ధర్మకార్యాలు ఆచరించి రాజర్షి పదవిని పొందాడు. ప్రియవ్రతుడి నాల్గవ కుమారుడు తామసుడు
మనువు అయ్యాడు. నర్మదానది దక్షిణతీరంలో దేవి సమర్చన చేశాడు. వసంతశరదృతువుల్లో నవరాత్రి సపర్యలు చేశాడు. స్తోత్రాలతో అనుగ్రహం సంపాదించాడు. జలజాక్షిగా అవతరించి జగన్మాత వరాలు ప్రసాదించింది. అకంటకంగా రాజ్యమేలి పదిమంది మహావీరుల్ని పుత్రులుగా పొంది ఉత్తమ లోకాలకు చేరుకున్నాడు. తామసుడి తమ్ముడు రైవతుడు అయిదవ మనువయ్యాడు. కాళిందీతీరంలోనే తపస్సు చేశాడు. సరస్వతీ బీజాక్షరంతో కలిపి అమ్మవారి మహామంత్రాన్ని రహస్యంగా జపించాడు. జగజ్జనని అనుగ్రహానికిపాత్రుడై రాజ్యాన్ని శత్రుపీడారహితంగా పాలించి సత్పుత్రుల్ని పొంది ఇంద్రలోకం చేరుకున్నాడు.

అంగపుత్రుడు చాక్షుషుడు ఆరవ మనువయ్యాడు. సుపులహుడు అనే బ్రహ్మర్షిని శరణువేడాడు. సిరిసంపదలు కలిగే ఉపాయం చెప్పమనీ సమస్తమేదినీమండలానికీ ఆధిపత్యం లభించే తెరువు చూపమనీ అవ్యాహతబుజబలం శస్త్రాస్త్రనైవుణ్యం కావాలనీ ఉత్తమసంతానం అఖండయౌవనం జన్మాంతంలో మోక్షం - ఇవి నా అభిలాషలనీ అభ్యర్థించాడు. ఆ బ్రహ్మర్షి - వాగ్భవబీజయుక్షంగా మహాదేవీ మూలమంత్రాన్ని జపించమనీ త్రిమూర్తులకూ ఆయా శక్తులు అందువల్లనే లభించాయనీ నీకూ అలాగే కోరికలన్ని తీరతాయనీ ఉపదేశించాడు. చాక్షుషుడు విరజానదీ తీరానికి వెళ్ళి దీక్షతో తీవ్రతపస్సు చేశాడు. కేవలం రాలిపడిన ఆకులూ అలములూ తింటూ ప్రాణాలు నిలుపుకుని జపం సాగించాడు. మొదటి సంవత్సరం గడిచింది. రెండవ సంవత్సరమంతా కేవలం నీరు తాగి, మూడవ యేడు అదికూడా మానేసి గాలినిమాత్రమే పీలుస్తూ స్థాణువులా నిలబడి తపస్సు చేశాడు. ఇలా పన్నెండేళ్ళు గడిచాయి. అప్పుడు శ్రీపరమేశ్వరి సాక్షాత్కరించింది. వరం కోరుకోమంది.

మహాదేవీ! నువ్వు సర్వాంతర్యామివి. నా కోరికలు ఏమిటో తెలుసు. అయినా అడగమన్నావు కనక అడుగుతున్నాను. మన్వంతరరాజ్యం కావాలి. సద్గుణసంపన్నులూ మహావీరులూ దేవీభక్తి తత్పరులూ ఆయిన పుత్రులు కావాలి. భోగభాగ్యాలు అనుభవిస్తూ శత్రుపీడారహితంగా రాజ్యాన్ని పరిపాలించాలి. జన్మాంతంలో ముక్తి కలగాలి. దేవేశీ! అనుగ్రహించు - అని అభ్యర్థించాడు చాక్షుషుడు. అమ్మవారు అన్ని వరాలూ ఇచ్చి అంతర్ధానం చెందింది. చాక్షుషుడు మనువుల్లోకెల్లా మాన్యుడయ్యాడు. అతడి కొడుకులు సమర్ధులనిపించుకున్నారు. మన్వంతరకాలం రాజ్యంచేసి చాక్షుషుడు దేవీప్రసాదంవల్ల ముక్తిపాందాడు.

నారదా! వైవస్వతుడు ఏడవ మనువు. సావర్ణి ఎనిమిదవ మనువు. వీరిద్దరూ దేవీ సమర్చనతోనే మన్వంతరాలకు ఆధిపతులయ్యారు. వీరిలో సావర్ణిది జన్మాంతరారాధన. అందుకని పుట్టుకతోనే మన్వంతరపతి అయ్యాడు. ఈ కథ ఏమిటంటే -

మనుసావర్ణి (సురథుడు) - దేవీమాహాత్మ్యం



No comments:

Post a Comment