కపిలగోవు పేడను నేలమీద పడకముందే పట్టుకోవాలి. ఒకవేళ నేలమీద పడిపోతే కడికి పైపేడనూ కిందపేడనూ వదిలేసి మధ్యలోది స్వీకరించాలి. అది దుర్గంధంతో ఉన్నా పుర్రుగా ఉన్నా మరీ గట్టిగా ఉన్నా పనికిరాదు. పట్టినపేడను ఇంటికి తెచ్చి చిట్టో పాట్టో కలిపి ముద్దలు చేసి ఎండబెట్టాలి. ఇదంతా ఆయా మంత్రాలతోనే చెయ్యాలి. హోమం చేసేటప్పుడూ భస్మం తీసేటప్పుడూ నియత మంత్రాలు పఠించాలి. నియమాలు శ్రద్ధగా పాటించాలి. కడిగి శుద్ధి చేసి తడిఆర్చిన గట్టిపాత్రలోకి కచికలు తీసి పరిశుభ్రవస్త్రం కప్పాలి. సమంత్రకంగా పరిమళద్రవ్యాలు కలపాలి. మంత్రయుక్తంగా పరిశుభ్రస్థలంలో భద్రపరచుకోవాలి. వెండి బంగారు కర్ర మట్టిపాత్రలు ఏవైనా పనికివస్తాయి. అందంగా శుభ్రంగా దృఢంగా ఉంటే చాలు. ధనవంతులైతే బంగారు పొత్రల్లోనే ఉంచుకోవచ్చు.
ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు విభూతిని స్వయంగా తీసుకువెళ్ళాలి. అనుచరులతోనైనా తెప్పించుకోవచ్చు. కానీ అశుచి చేతికి భస్మపాత్రను ఇవ్వకూడదు. అశుచి స్థలంలో ఉంచకూడదు. శరీరంలో నీచాంగాలకు తాకించకూడదు. పాత్రను విసరడం ఎగరవెయ్యడం దాటడం - ఇలాంటివి చెయ్యకూడదు. భక్తిశ్రద్ధలతో సమంత్రకంగా విభూతిని తయారుచేసుకోవాలి, రక్షించుకోవాలి, ధరించుకోవాలి. ఇది స్మృతులు చెప్పిన విభూతిధారణ విధానం. యథాతథంగా ఆచరించినవాడు శివుడితో సమానమవుతాడు.
శైవులు శివాలయాలలో సిద్ధం చేసుకున్న విభూతిని వైదికులు అడిగి తెచ్చుకోవచ్చు. భస్మాన్నేకాదు ఇచ్చిన వారినీ గౌరవించి పూజించాలి. తాంత్రికులు తంత్రమార్గంలో విభూతిని తయారుచేసుకొంటారు. ఒక వేళ ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు దాన్ని ఇవ్వజూపితే వైదికులు స్వీకరించకూడదు.
కానీ శూద్ర కాపాలిక పాషండాదులు ఇస్తే తీసుకోవచ్చు, ధరించవచ్చు. విభూతిని ఏనాడూ ఎవ్వరూ ఎట్టిపరిస్థితుల్గొనూ తిరస్కరించకూడదు. కించపరచకూడదు. అసలు అటువంటి ఊహలే రాకూడదు. కించపరిచినా విభూతిధారణను విడిచిపుచ్చినా పతితుడవుతాడు. త్రిపుండ్రధారణమూ దేహావగుంఠనమూ భక్తిశ్రద్దలతో మంత్రపూర్వకంగా రోజూ ముప్పొద్దులా చేసుకోవాలి. లేకపోతే మోక్షం లేదు. కోటిజన్మలెత్తినా భవబంధ విమోచనం కలగదు. విభూతి ధరించనివాడి జన్మ నిష్ఫలం. మరుసటి జన్మలో పందిగా పుడతాడు. త్రిపుండ్రాలంకరణ లేని మానవ శరీరం శ్మశానసదృశం. పుణ్యాత్ములు వాడిని చూడనేకూడదు. విభూతి లేని ఫాలమూ, శివాలయం లేని గ్రామమూ, ఈశ్వరార్చన లేని జన్మమూ, శివాశ్రయం కాని చదువూ(విద్య) పరమనింద్యాలు.
విభూతిని నిందిస్తున్నాడంటే శివుణ్ణి నిందిస్తున్నట్లే, ధరిస్తున్నాడంటే శివుణ్ణి ధరిస్తున్నట్లే. వస్తు సామగ్రి ఎంత పుష్కలంగా ఉన్నా సాధనసంపత్తి ఎంత అధికంగా ఉన్నా విభూతిలేని శివార్చన (అగ్ని లేని పర్వతంలా?) శోభించదుగాక శోభించదు. ఉద్దూళన త్రిపుండ్రధారణలు శ్రద్ధగా ఆచరించనివారికి పూర్వజన్మ సంచితపుణ్యాలన్నీ నశిస్తాయి. స్మార్తులు వేదోచితాచారాలను పాటిస్తూ వేదమంత్రాలతోనే త్రిపుండ్రధారణ చెయ్యాలి. లేనినాడు అనర్ధదాయకమవుతుంది. విభూతి పెట్టుకోనివాడు ఏ మంచిపని చేసినా అది చెయ్యనట్టే, ఏ పవిత్ర విషయం విన్నా అది విననట్టే, ఏ గొప్పవిద్య నేర్చినా అది నేర్వనట్టే. ఆతడి వేదాలూ యజ్ఞాలూ దానాలూ తపస్సులూ వ్రతాలూ పూజలూ ఉపవాసాలూ అన్నీ వృధా వృధా - భస్మధారణ చెయ్యకుండా ముక్తి కావాలని కోరుకోవడం విషం తాగినా బ్రతకాలనుకోవడం.
అసలు, సృష్టికర్త నొసలును సృష్టించడమే త్రిపుండ్రధారణకోసం. అందుకే అడ్డంగా విశాలంగా సృష్టించాడు. లేకపోతే గుండ్రంగానే సృష్టించి ఉండేవాడు. అదీగాక సహజసిద్ధంగానే నొసట అడ్డగీతలు ఉంటాయి. ఆవంకన నిత్యమూ జ్ఞాపకం చేస్తున్నాడు. అయినా విభూతి పెట్టుకోకపోతే పరమమూర్ఖులు గాక మరేమిటి!
నొసట తిర్యగ్రేఖలుగా విభూతి పెట్టుకోని విప్రుడు చేసే ధ్యానం ధ్యానమే కాదు, జ్ఞానం జ్ఞానమే కాదు, మోక్షం మోక్షమేకాదు, తపస్సు తపస్సేకాదు. వేదాధ్యయనానికి శూద్రుడు అధికారి కానట్టే త్రిపుండ్రధారణలేని విప్రుడు శివార్చనకు పనికిరాడు.
తూర్పుదిక్కుకి అభిముఖంగా నిలిచి కాళ్ళూ చేతులూ కడుక్కుని ఆచమించి ప్రాణాయామంచేసి సంకల్పం చెప్పుకుని భస్మస్నానం చెయ్యాలి. అగ్నిహోత్రంనుంచి పరిశుభ్రమైన విభూతిని తీసుకువి ఈశాన మంత్రంతో నెత్తిమీద జల్లుకోవాలి. పురుషమంత్రంతో నొసట దిద్దుకోవాలి. అఘోరమంత్రంతో హృదయం మీదా వామ మంత్రంతో గుహ్యప్రదేశంలోనూ సద్యోజాతమంత్రంతో కాళ్ళమీదా ప్రణవోచ్చారణతో సర్వాంగాలకూ అలంకరించుకోవాలి. అటుపైని ఉద్దూళనం చేసుకోవాలి. దీన్ని ఆగ్నేయక భస్మస్నానమంటారు. ఏ వైదికకర్మను ఆచరించాలన్నా ప్రారంభంలో ఇది చెయ్యాలి. తరవాత మళ్ళీ కాళ్ళూచేతులూ కడుక్కుని యథావిధిగా ఆచమించి లలాట హృదయ కంఠ ప్రదేశాలలో పంచబ్రహ్మమంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. అప్పటికి. కర్మానుష్ఠానానికి కావలసిన పవిత్రత సిద్దిస్తుంది. సత్కర్మలు ఫలిస్తాయి. లేకపోతే ఫలించవు. సత్య శౌచ జప హోమ తీర్థ దేవపూజాదులన్నీ వ్యర్థమే అవుతాయి. రుద్రాక్షలూ త్రిపుండ్రాలూ ధరించిన విప్రుడు దురిత - రోగ - దుర్భిక్ష - తస్కరభయాదుల్ని తొలగించగలుగుతాడు. అపునర్భవంగా బ్రహ్మత్వం పొందుతాడు. పంక్తి పావనుడు అవుతాడు. దేవవిప్ర పూజ్యుడవుతాడు. శ్రాద్ధ - యజ్ఞ - జప - హోమ - వైశ్వదేవ - సురార్చనల్లో విభూతిని ధరించినవాడు పూతాత్ముడు మృత్యుంజయుడు.
భస్మధారణ మహిమ
No comments:
Post a Comment