Sunday, August 16, 2026

Gayatri Mahima - Goutamudi Katha - గాయత్రీ మహిమ - గౌతముడి కథ

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ మహిమ - గౌతముడి కథ

జనమేజయా! ఒకప్పుడు ప్రాణికోటి కర్మవశాన పదిహేను సంవత్సరాల కరువు వచ్చింది. వానలు లేక అంతటా దుర్భిక్షం విలయతాండవం చేసింది. ఇంటింటా మృతదేహాలే. లెక్క పెట్టటం ఎవరితరమూ కాలేదు. ఆకలి తట్టుకోలేక చనిపోయినవారు చనిపోగా మిగిలినవారు పందుల్నీ కుక్కల్నీ గుర్రాల్నీ ఏ జంతువు దొరికితే ఆ జంతువుని చంపుకుని తిన్నారు. 

కొందరు మానవశవాలనే భక్షించారు. తల్లి కొడుకునీ, మగడు భార్యనీ భక్షించే భయంకర దుర్భిక్షమది. ఈ దశలో బ్రాహ్మణులకు ఒక ఆలోచన వచ్చింది. గాయత్రీ జపమహిమ కారణంగా గౌతముడి ఆశ్రమంలో దుర్భిక్షం లేదని సుభిక్షంగా ఉందనీ వింటున్నాం. ఇప్పటికే చాలా ప్రాణికోటి అక్కడికి చేరుకుందనీ సుఖంగా జీవిస్తోందనీ తెలిసింది.

కనక మనంకూడా వెళ్ళి ఆ మహర్షినే ఆశ్రయిద్దాం - అని నిశ్చయించుకుని అగ్నిహోత్రాలతో కుటుంబాలతో గోవులతో దాసదాసీజనంతో అందరూ బయలుదేరి వెళ్ళారు. అన్ని దిక్కులనుంచీ ఒక్కసారిగా తరలివెళ్ళారు. అంతమంది బ్రాహ్మణులను చూసి గౌతముడు సగౌరవంగా నమస్కరించాడు. ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. కుశలప్రశ్నలు వేశాడు. ఆగమనకారణం తెలుసుకున్నాడు. అందరికీ అభయమిచ్చాడు.

ఇది మీ ఇల్లే అనుకోండి. నేను మీ దాసుణ్ణే అనుకోండి. ఈ దాసుడు ఉండగా మీకు చింత ఏమిటి! మీవంటి తపోధనుల రాకతో నేను నిజంగా ధన్యుణ్ణి అయ్యాను. మీ దర్శనభాగ్యం చేతనే ఎవరికైనా దుష్కృతాలన్నీ సుకృతాలైపోతాయి. మీరంతా ఇలా వచ్చి పాదధూళితో నా గృహాన్ని పావనం చేస్తున్నారు.

నాకంటే ధన్యుడెవడు! ఇక్కడే అందరూ హాయిగా ఉండండి. మీ మీ సంధ్యావందన జపాదికాలు నిర్విఘ్నంగా జరుపుకోండి - అని అందరినీ ఊరడించి ధైర్యం చెప్పి విడిది చేయించాడు. తరవాత తాను లోపలికి వెళ్ళి గాయత్రిని ప్రార్థించాడు.

నమో దేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే ।
వ్యాహృత్యాది మహామంత్రరూపే ప్రణవరూపిణి ॥

మహావిద్యా! వేదమాతా! పరాత్పరా! వ్యాహృతి త్రయంతో (భూర్భువః స్వః) మహామంత్రస్వరూపా! ఓంకార రూపిణీ! సామ్యావస్థాత్మికా! హ్రీంకారరూపిణీ! స్వాహా - స్వధా స్వరూపా! సకలార్థప్రదాయిని! నమో నమః. నమో నమః. భక్తకల్పలతా! అవస్థాత్రయ సాక్షిణీ! తుర్యాతీతస్వరూపా! సచ్చిదానంద రూపిణీ! సర్వవేదాంతసంవేద్యా! సూర్యమండలవాసినీ! ప్రాతఃకాలంలో రక్తవర్ణంలో బాలారూపిణివై, మధ్యాహ్న సమయంలో యువతివై, సాయంవేళలో కృష్ణవర్ణంలో వృద్ధవై అలరారే జగన్మాతా! నమో నమః. సర్వభూతసృష్టికీ అరణివంటిదానా! పరమేశ్వరీ! అనుగ్రహించు.

గౌతముని ప్రార్థనకు సంతోషించి గాయత్రీమాత ప్రత్యక్షమయ్యింది. అందరినీ అన్నపానాలతో పోషించడానికి విలుగా పూర్ణపాత్రను ప్రసాదించింది. మహర్షీ! నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఈ పాత్ర. స్వీకరించు - అని అందించి అంతర్థానం చెందింది.

అన్నరాశులు పర్వతాకారంగా ఆవిర్భవించాయి. షడ్రసోపేతంగా వంటకాలు ఆవిర్భవించాయి. కోరుకున్న భూషణాలూ వస్త్రాలూ యజ్ఞసామగ్రి పాత్రసామగ్రి సంబారాలూ - గౌతముడు ఏక్షణాన ఏది కావాలనుకుంటే అది సమృద్దిగా అందించింది ఆ గాయత్రి పూర్ణపాత్ర. విప్రులకు ఆయా వస్తువుల్ని పుష్కలంగా వంచిపెట్టాడు. 

గోమహిషాది పశువులుకూడా ఆవిర్భవించాయి. వాటినీ విప్రులకు బహూకరించాడు. వాటికి కావలసిన ఆహారమూ అందింది. గౌతముడి సూచనప్రకారం అందరూ కలిసి అక్కడ అనేక యజ్ఞాలు నిర్వర్తించారు. ఆశ్రమప్రాంతం స్వర్గసీమను తలపించింది. సమస్త సమృద్దులతో కళకళలాడింది. ముల్లోకాలలోనూ ఏ సుందర వస్తువు ఉన్నా అదల్లా అక్కడ ఆవిర్భవించింది. 

వస్త్ర చందన, భూషలతో విప్రులందరూ దేవపురుషుల్లాగా ఉంటే వారి స్త్రీలందరూ దేవతాస్త్రీలే ఆనిపించారు. ఆ దివ్యవస్త్రాలుగానీ ఆ దివ్యభూషణాలుగానీ అలా ఉన్నాయి. ఆశ్రమ మండలంలో నిత్యోత్సవంగా కాలం గడుస్తోంది. రోగ - రాక్షస - చోర భయాలు లేవు. 

శతయోజన విస్తీర్ణమైన ఆశ్రమమండలం ఇంకా రకరకాల ప్రాణికోటిని ఆకర్షించింది. ఎవరు వచ్చినా ఏది వచ్చినా అందరికీ స్వాగతం పలికాడు గౌతముడు ఆదరించి పోషించాడు.

యజ్ఞయాగాలు నిరంతరంగా పుష్కలంగా జరగుతూండటంతో దేవతలూ సంతోషించారు. మహర్షిని కీర్తించారు. ఇంద్రుడైతే మరీ మరీ కొనియాడాడు. ఆశ్రమంలో కల్పవృక్షం ఏదో ఉండి కోరికలు తీరుస్తున్నట్టుంది. లేకపోతే భూమండలం కరువుతో కటకటలాడుతోంటే వీరికి ఈ సమృద్ది ఎలా సాధ్యం అనుకున్నాడు.

పన్నెండేళ్ళు గడిచాయి. గౌతముడు అందరినీ పోషిస్తూనే ఉన్నాడు. అలాగని ఏ కొంచెమూ గర్వపడలేదు. గాయత్రీదేవికి ఒక దివ్యమందిరం కట్టించాడు. మునివిప్రులంతా అక్కడచేరి భక్తిశ్రద్ధలతో ముప్పొద్దులా అర్చించారు. మంత్ర పురశ్చరణలు సాగించారు. 

జనమేజయా! ఇప్పటికీ ఆ మందిరం అక్కడ ఉంది. గాయత్రీమాత బాలగా యువతిగా వృద్దురాలిగా త్రిసంధ్యల్లోనూ దర్శనమిస్తోంది. 

బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం





No comments:

Post a Comment