Sunday, August 16, 2026

Mahadevi Aatmavishkaram - మహాదేవి ఆత్మావిష్కారం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - మహాదేవి ఆత్మావిష్కారం

భాస్వజ్జపాకుసుమాభ, బాలకోటిరవిప్రభ, బాలశీతాంశుమకుట, వస్త్రాంతర్వ్యంజితస్తని. వర - పాశ
- అంకుశ - అభయ హస్తాలు నాలుగు, రమణీయాంగి, కోమలాంగలతిక, శివ, భక్తకల్పద్రుమం, అంబిక, నానాభూషణ భూషిత, త్రినేత్ర, మల్లికామాలికా కబరీజూట విరాజిత. ఆమెకు నాల్గువైపులా నాలుగువేదాలూ రూపుదాల్చి నిలబడి స్తుతిస్తున్నాయి.

ఆమె పెదవుల కాంతులు వ్యాపించినంతమేరా నేల పద్మరాగాలు తాపించినట్టు అవుతోంది. ప్రసన్న స్మేరవదన, కోటి కందర్పసుందర, రక్తాంబరపరీధాన, రక్తచందన చర్చిత, ఉమాదేవి, హైమవతి, నిర్వ్యాజకరుణామూర్తి, సర్వకారణకారణ - మహేంద్రుడు దర్శించాడు.

భక్తినిర్ఝరులు గుండెల్లో పొంగులెత్తాయి. కన్నులు చెమ్మగిల్లాయి. గొంతు గద్గదమయ్యింది. తనువు
పులకించింది. ఉక్కిరిబిక్కిరి అవుతూ సాష్టాంగపడ్డాడు. స్తుతులూ నుతులూ జాలువారాయి. అమ్మా! ఆ యక్ష రూపం ఏమిటి? ఎందుకు ఆలా అవతరించావు? ఇప్పటికీ ఆర్థం కావడంలేదు. అనుగ్రహించు తల్లీ! - అని అభ్యర్థించాడు. కరుణసముద్రం పలికింది -

ఇంద్రా! నా రూపమే పరబ్రహ్మం. సర్వకారణకారణం. మాయాధిష్ఠానం. సర్వసాక్షి, నిరామయం.
సర్వవేదాలూ ఏ పదాన్ని శిరసావహిస్తున్నాయో, సర్వతపస్సులూ సారాంశంగా ఏ పదాన్ని చెబుతున్నాయో, సర్వతపస్వులూ దేన్ని కోరి బ్రహ్మచర్యం పాటిన్తున్నారో - ఆ పదాన్ని ఒక్కముక్కలో నీకు చెబుతున్నాను. గ్రహించు - 

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ తదేవాహుశ్చ హ్రీమ్మయమ్‌

ద్వే బీజే మమ మంత్రే స్తో ముఖ్యత్వేన సురోత్తమ ॥

సురనాయకా! ఓమ్‌ అనే ఒక్క అక్షరమే పరం బ్రహ్మ, దాన్నే హ్రీమ్‌ మయంగానూ పలుకుతున్నారు.
ఇవి రెండే నా మంత్రంలో ముఖ్యమైన బీజాక్షరాలు. నన్ను నేను భాగద్వయం చేసుకుని జగత్తులు
సృష్టిస్తున్నాను. అందులో ఒక భాగం (ఓమ్‌) సచ్చిదానందనామకం. రెండవది మాయాప్రకృతి సంజ్ఞితం, ఆ మాయయే (హ్రీమ్‌) పరాశక్తి. నేను శక్తిమతిని, ఈశ్వరిని, జాబిల్లి వెన్నెలల్లాగా నేనూ మాయా అవిభాజ్యలం, అభిన్నలం. ఈ మాయ నాదే. సామ్యావస్థాత్మిక. 

ప్రళయంలో సకలజగత్తులూ నాలో లీనమై అభిన్నంగా ఉంటాయి. కర్మపరిపాకవశాన ప్రాణికోటికి పునస్సృష్టిలో పునర్జన్మలూ పునారూపాలూ నానుంచి అభివ్యక్తమవుతుంటాయి. అంతర్ముఖమైన అవస్థను 'మాయ' అంటారు. బహిర్ముఖమైన అవస్థను తమస్సు అంటారు. దానినుంచే ప్రాణికోటి సంభవిస్తుంది.

సృష్టి సమయంలో అదే రజోగుణమవుతుంది. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణత్రయాత్మకులయ్యారు. 

త్రిమూర్తులలో రజోగుణాధికుడు బ్రహ్మ సత్త్వగుణాధికుడు విష్ణువు. తమోగుణాధికుడు రుద్రుడు.
స్థూలదేహం - బ్రహ్మ. లింగదేహం(సూక్ష్మదేహం) శ్రీహరి. కారణదేహం రుద్రుడు. తురీయావస్థను నేనే.

సామ్యావస్థ అన్నానే అది. సర్వాంతర్యామిరూపిణి. అటుపైని పరంబ్రహ్మమైన నా రూపం -
రూపవర్జితం. అందుకనే నారూపం నిర్గుణమూ సగుణమూ అని రెండు విధాలు. వీటిలో నిర్గుణరూపం మాయారహితం. సగుణరూపం మాయాసహితం. 

నేను జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి జీవుల్ని వారి కర్మానుసారంగా ప్రేరేపిస్తూ ఉంటాను. సృష్టి స్థితి తిరోధానాలకు నేనే ప్రేరణ. బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులను కారణాత్మకులుగా చేసేది నేనే. నాకు భయపడినా ఆజ్ఞగా గాలివీస్తున్నాడు. సూర్యుడు వెలుగుతున్నాడు. మీరంతా చేసే పనులు నా ఆజ్జలే. 

కనక నేను సర్వోత్తమను. నా అనుగ్రహం వల్లనే రాక్షసయుద్ధాల్లో మిమ్మల్ని జయం వరిస్తోంది. మిమ్మల్ని కీలుబొమ్మలుగా (కొయ్యబొమ్మలుగా - కాష్ఠపుత్తలికోపమాన్‌) ఆడిస్తున్నది నేనే. ఒక్కొక్కప్పుడు మీకూ ఒక్కొక్కప్పుడు దైత్యులకూ విజయం అందిన్తుంటాను. నేను స్వతంత్రను. నా ఇచ్చయే నాది. కర్మానురోధంగా అన్నీ చేస్తుంటాను.

సురోత్తమా! సర్వాత్మికను నన్ను విస్మరించి మీరు విజయగర్వంతో విర్రవీగారు. అది అంతా మీ
ప్రయోజకత్వమే అని అహంకరించారు. మోహంలో పడ్డారు. మీ కళ్ళు తెరిపించాలనే అనుగ్రహబుద్ధితో మీ శరీరాల్లో ఉన్న నా శక్తుల్ని బయటకు తీసి తేజోమండలంగా యక్షరూపంగా అవతరింపజేశాను. 

మీ అహంకారాలను అణిచివేశాను. మీ శక్తిహానత మీకు తెలిసివచ్చేట్టు చేశాను. కనక ఇకనుంచీ నిరహంకారులై సచ్చిదానంద రూపిణిని నన్ను శరణువేడండి - అని చెప్పి అంతర్ధానం చెందింది.

జనమేజయా! అప్పటినుంచీ ఇంద్రాదిదేవతలందరూ అహంకారం విడిచిపెట్టి పరమేశ్వరీ
పాదపద్మాలను ఉపాసించ నారంభించారు. త్రిసంధ్యల్లోనూ గాయత్రిని జపించడం, యజ్ఞభాగాలను మహాదేవికి నివేదన చెయ్యడం - ఇత్యాది కార్యక్రమాలు అనుష్ఠించారు. 

ఈ రకంగా అందరూ సత్యయుగంలో గాయత్రీ జపతత్పరులూ తారహృల్లేఖా జపనిష్ణాతులూ అయ్యారు. తక్కిన హరి - హరోపాసనలు ఏవీ నిత్యకర్మలు కాదు. గాయత్రీ ఉపాసన ఒక్కటే నిత్యవిధిగా వేదాలు అన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇది ఒక్కటి చేస్తే చాలు ద్విజులకు కృతకృత్యత్వమే. 

తక్కిన సత్కర్మలు ఏవి చేసినా చెయ్యకపోయినా గాయత్రీమాత్రనిష్ణాతుడైతే చాలు ద్విజుడు ముక్తి పొందుతాడని మనువే స్వయంగా చెప్పాడు.

అంతటి శక్తి సంపన్నమూ వేదత్రయప్రతిపాదితమూ అయిన గాయత్రీ ఉపాసనను విడిచిపెట్టి హరి - హరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోవడం నిశ్చయం. అందుకని తొట్టతొలి కృతయుగంతో ద్విజోత్తములందరూ గాయత్రీ రూపాన దేవీ పాదపద్మాలను ఉపాసించారు.

గాయత్రీ మహిమ - గౌతముడి కథ





No comments:

Post a Comment