రామాయణం సుందరకాండ పదిహేడవ సర్గ - రాక్షసీగణం
నీలి నీలి కాంతుల జలాలున్న సరోవరంలో హంస ప్రవేశించినట్లు కలువపూగుత్తివంటి చంద్రుడు ఆకాశంలో దిగువకు వచ్చాడు. నిర్మల ప్రభలతో చల్లగా సోకుతూ హనుమంతునికి తోడుపడుతున్నాడు. ఆ సమయంలో శోకభారంతో ఉన్న సీతాదేవి బరువెక్కి నీట మునిగిన నావలా ఉంది.
చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలవైపు ఆయన దృష్టి మరలింది. వారిలో-
ఒకే కన్ను కలది.
ఒకే చెవి గలది.
ఒకదానికి చెవులులేవు.
మరొకతెకు మేక చెవులు.
ఒకదాని ముక్కు శిరసువైపు తిరిగి ఉంది.
ఏనుగు తలకాయ, బారెడు పొడవైన కంఠం, తెగిన కేశాలు. కేశాలే లేనిది, కంబళీజుట్టు, వ్రేలాడిపోయిన చెవులు, నుదురు, పొట్ట, వక్షోజాలు. పెదవులు, బుగ్గలు. అంతేకాదు ఒకతెకు మోకాళ్ళుకూడా వ్రేలాడుతున్నాయి.
పొట్టిది, బాగా పొడుగుది, గూనిది, మరుగుజ్జుది, వికటంగా ఉండేది, వంగిన ముఖం, పచ్చని కళ్ళు, వికృత ముఖం. ఇంకా చూస్తూన్నాడు-
కొందరు పచ్చరంగు, మరి కొందరు నల్లరంగు. కలహ ప్రీతితో కొందరు, క్రోధస్వభావంతో కొందరు, ఇనుప శూలాలూ, ముధ్గరాలూ ధరించి కొందరు.
పంది ముఖాలు, లేడి తలకాయలు, పులిశీర్షాలు, నక్క మొహాలు, దున్నపోతు రూపాలు. ఏనుగు పాదాలు, గుర్రపు డెక్కకాళ్ళు, లొట్టిపిట్ట కొళ్ళు, లోపలకుపోయిన తలకాయలతో కొందరు. గాడిద, గుర్రం, ఆవు, ఏనుగు, సింహాల చెవులతో కొందరు.
ముక్కలేనివారు, అడ్డ ముక్కులవారు, పెద్ద ముక్కులు, కుంభకుచాలు, కుండ కడుపులు, అందరూ క్రోధంతోనే ఉన్నారు.
సురాపానం, మాంస భోజనం, నిరంతరం అదేపని వారికి. అటువంటి వారి మధ్య సీతాదేవి.
పుణ్యక్షయమై నేలకు జారిన నక్షత్రంలా ఉంది.
ఏ అలంకారమూలేకున్నా భర్తృవాత్సల్యమే భూషణంగా కనిపిస్తున్నది.
సింహాల మధ్య ఆడు ఏనుగులా ఉంది.
శరత్కాల మేఘం వెనుక చంద్రకళలా, తీగలులేని వీణలా, ధూళి నిండిన తామరతూడులా వుంది. పాతివ్రత్యమే రక్షగా వుంది.
దుఃఖాల రాశిలా వుంది.
సీతాదర్శనంతో ఆయన మనస్సు క్లేశరహితమై రామచంద్రునికి అభివాదాలర్పించింది. లక్ష్మణస్వామికి కూడా అభివాదాలు చేసి ఆ చెట్టు కొమ్మలలో రహస్య ప్రదేశానికి చేరాడు, హనుమంతుడు.
రావణప్రవేశం
No comments:
Post a Comment