నారదా! దక్షసావర్ణి అని ఒక మనువు ఉన్నాడు. చాలా పుణ్యాత్ముడు. వైష్ణవుడు, శుచిశీలి, యశస్వి, విష్ణుమూర్తి అంశతో అవతరించాడు. ఆయనగారికి ఒక కుమారుడున్నాడు. బ్రహ్మసావర్ణి ఆని పేరు. అతడూ ధర్మాత్ముడే. విష్ణుభక్తి పరాయణుడే. అతని కుమారుడు ధర్మసావర్ణి. ఇతడూ వైష్ణపుడే. జితేంద్రియుడే. ఇతనికి రుద్రసావర్ణి, అతనికి దేవసావర్ణి, అతనికి ఇంద్రసావర్డి పుత్రులుగా జన్మించారు. అందరూ వైష్ణవులు. అందరూ ధర్మాత్ములు. అందరూ జితేంద్రియులు. ఆందరూ మహాతపస్వులు. వీరిలో ఇంద్రసావర్ణి కుమారుని పేరు వృషధ్వజుడు. పేరుకి తగ్గట్టే ఇతడు శివభక్తుడు. పరమ మాహేశ్వరుడు. ఇతడి ఆశ్రమంలో సాక్షాత్తు శివుడు మూడు దేవయుగాలపాటు ఉన్నాడంటే ఇక ఇతని శివభక్తిని గూర్చి వేరేచెప్పాలా! శివుడికికూడా వృషధ్వజుడంటే పుత్రాధిక వాత్సల్యం. స్నేహం, ప్రేమ. దానికి లొంగిపోయిన వృషధ్వజుడు నారాయణాది దేవతాపూజలనూ యజ్ఞయాగాదులనూ పరిత్యజించాడు. వాణీ లక్ష్మీపూజలను కూడా దూరం చేశాడు. అంతే కాదు వాటిని నిందించనారంబించాడు. అది భరించలేకపోయాడు సూర్యభగవానుడు. సర్వసంపదలూ తొలగి భ్రష్టుడివైపామ్మని శపించాడు. ఆది విన్న శివుడు త్రిశూలం పుచ్చుకుని సూర్యుడి వెంటబడ్డాడు. సూర్యుడూ అతడి తండ్రీ బయపడి పరుగు లంకించుకున్నారు. బ్రహ్మదేవుణ్జి శరణువేడారు. శివుడు అలాగే వెంబడించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. దానితో బ్రహ్మదేవుడికీ హడలెత్తింది. సూర్యుడితో సహా వైకుంఠానికి పరుగెత్తాడు. బ్రహ్మ - కశ్యప - మార్తాండులు ముగ్గురికీ భయంతో నోళ్ళు ఎండిపోయాయి. మాట పెగలలేదు. శ్రీమన్నారాయణుడి పాదాలమీద పడ్డారు. శరణు శరణు అన్నారు. బహుధాస్తుతించారు. జరిగినదంతా చెప్పారు. నారాయణుడు దయతలచి అభయమిచ్చాడు. నేనున్నాను భయపడకండి అన్నాడు. భయార్తులై ఎవరు నన్ను స్మరించినా నేను చక్రధారినై అక్కడ ప్రత్యక్షమవుతాను. రక్షిస్తాను. ఇది నా వ్రతం. ఈ జగత్తులకు రక్షకుణ్ణి నేను. బ్రహ్మరూపంలో సృష్టిచేసేది నేను. శివరూపంతో సంహరించేది నేను. నువ్వూ శివుడూ సూర్యుడూ అన్ని నేనే. త్రిగుణాత్మకుణ్ణి. అనేక రూపాలూ అవతారాలూ ధరిస్తూ ఈ సృష్టిని కాపాడుతూ ఉంటాను.
అందుచేత మీరు నిర్భయంగా జీవించండి. వెళ్ళండి. శివుడివల్ల మీకు ఈరోజు నుంచీ ఏ భయమూలేకుండా వరం ఇస్తున్నాను. శంకరుడు సజ్జనుడు. సర్వేశ్వరుడు. భక్తపరాధీనుడు. భక్తవత్సలుడు. సుదర్శనమన్నా శివుడన్నా నాకు ప్రాణాధికప్రియం. సుదర్శన శివులకన్నా తేజస్వి ఈ బ్రహ్మాండంలో నాస్తి.
చతుర్ముఖా! మరో రహస్యం నీకు తెలుసా? శివుడు తలుచుకుంటే చిటికెలో కోటి సూర్యుల్ని సృష్టించగలడు. నీలాంటి బ్రహ్మదేవుళ్ళను కోటిమందిని కల్పించగలడు. అతడికి అసాధ్యమంటూ ఎదీ లేదు. ఆతడు రేయింబవళ్ళు నన్నే ధ్యానిస్తూ ఉంటాడు. నా మంత్రాన్ని నా గుణగణాలనూ బక్తితో అయిదుముఖాల గానం చేస్తూ ఉంటాడు. అతడు జ్ఞాని. జ్ఞానాధిదేవత. నేనుకూడా నిరంతరం అతడి మేలునే ఆకాంక్షిస్తూ ఉంటాను. ఎవరు ఎలా నన్ను ధ్యానిస్తే వారిని అలా నేను సేవిస్తుంటాను, రక్షిస్తుంటాను. (యథా చ మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్) సకల శుభాలూ అతడి అధీనంలో ఉంటాయి. శివం కలిగించేవాడు కనకనే శివుడన్నారు. శుభస్వరూపమే అతడు.
శ్రీహరి ఇలా ప్రసంగిస్తుండగానే త్రిశూలధారియై శివుడు కోపంతో ఊగిపోతూ ఎరుపెక్కిన కన్నులతో వృషభ వాహనం మీద అక్కడికి వచ్చాడు. వస్తూనే వాహనం దిగాడు. చక్రికి శిరసువంచి భక్తిగా నమస్కరించాడు. ఒక్కసారి తలెత్తి తేరిపారజూశాడు.
రత్నసింహాసనంమీద రత్నాలంకార భూషితుడై కిరీట కుండలాలంకృతుడై వనమాలికాధారియై చక్రహస్తుడై చతుర్భుజుడై నవనీరదశ్యాముడై చందనచర్చిత సర్వాంగుడై పీతాంబరుడై లక్ష్మీప్రదత్త తాంబూలచర్వణపరాయణుడై అప్పరశ్చామరగ్రాహిణీ సంసేవితుడై విద్యాధరీ నృత్యగీతాస్వాదనరసికుడై విరాజిల్లుతున్న శ్రీమన్నారాయణుడు ఎట్టయెదుట కనివిందుచేశాడు.
ఈశ్వరుడు మరొక్కసారి నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నిర్భయంగా నిలబడి భక్తితో శిరసువంచాడు. సూర్యుడూ కశ్యపుడూ అంజలిఘటించారు.
శ్రీ హరి చిరునవ్వులతో శివుణ్ణి ఆహ్వానించి సమున్నత సుఖాసనం చూపించాడు. శివుడు దానిమీద కూర్చున్నాడు. విష్ణుపార్షదులు వచ్చి ఇరువైపులా నిలిచి వింజామరలు వీచారు. మకరందంకవ్నా మధురంగా మధుసూదనుడు పలకరించాడు.
మహాదేవా! కుశలమా? చాలాకాలమయ్యింది నిన్ను చూసీ, నీతో సంభాషించీ. పోవీలే ఇప్పటికైనా తీరుబాటుచేసుకుని వచ్చావు. కాసేపు హాయిగా గడుపుదాం. ఏదైనా పనిమీద వచ్చి ఉంటే చెప్పు. ముందు అది చూసి తరవాత కబుర్లకి దిగుదాం. అవునూ, నీ ముఖం ఏమిటి కొత్తగా ఉంది. ఎక్కడో కాసింత కోపరేఖ కనపడుతున్నట్టుంది - అంటూ మందహాసం విసిరాడు.
శివుడుకూడా ప్రతిగా చిరునవ్వులు చిందించాడు. శ్రీహరీ! నువ్వన్నది నిజమే. నా కోపానికి కారణం ఉంది. వృషధ్వజుడని నా భక్తుడున్నాడు. భక్తుడే కాదు నాకు ప్రాణాధికప్రియుడు. అతడిని సూర్యుడు శపించాడు. అందుకని నాకు సూర్యుడిమీద కోపం వచ్చింది. త్రిశూలంతో తరుముకుంటూవచ్చాను. నా పుత్రవాత్చల్యం దెబ్బతింది. సూర్యుణ్ణి సంహరించాలనుకున్నాను. అతడు వెళ్ళి బ్రహ్మను. శరణువేడాడు. బ్రహ్మదేవుడు వచ్చి నిన్ను శరణుజొచ్చాడు. మనస్సుతోకానీ మాటతోకానీ నిన్ను శరణు కన్నవాడికి ఇక ఏ ఆపదలూ ఉండవుకదా! జరామృత్యుభయాలుకూడా దరిజేరవాయె. వాడు నిర్భయంగా నిశ్శంకగా సంచరించవచ్చు. అటువంటిది ప్రత్యక్షంగా వచ్చి నిన్ను శరణువేడుకొన్న విరించి సూర్యకశ్యపులను నేనే కాదు ఎవడుమాత్రం ఏమి చెయ్యగలడు? హరినామస్మరణ సర్వకాల సర్వావస్థలలోనూ అభయప్రదమూ మంగళప్రదమూను. నువ్వు జగన్నాథుడవు. అన్నీ తెలిసినవాడవవు. ధర్మ స్వరూపుడవు. నా భక్తుడి సంగతి ఏమిటో చెప్పు. వృషధ్వజుడు నాకు పుత్రనిర్విశేషుడు. ఈ సూర్యుడి శాపంవల్ల శ్రీవిహీనుడయ్యాడు. అతడిని ఎలా ఉద్ధరిస్తావో ఏమి చేస్తావో ఏమి చెయ్యమంటావో - అంతా నీ ఇష్టం ఆని ముగించాడు శివుడు.
శంభూ! నువ్వు గమనించలేదుగానీ సూర్యుడు శపించిన నాటినుంచి ఇప్పటికి ఇరవైయొక్క యుగాల కాలం గతించింది. వైకుంఠంలో గంటన్నర కాలమంటే భూలోకంలో కొన్ని యుగాలు. నువ్వు వెంటనే నీ కైలాసానికి వెళ్ళు. వృషధ్వజుడు కాలధర్మం చెందాడు. కాలమనేది ఆతి దారుణమూ అని వార్యమూకదా! అతడి కొడుకు రథధ్వజుడూ అస్తమించాడు. ఇతడి కొడుకులు ధర్మధ్వజ - కుశధ్వజులిద్దరూ ప్రస్తుతం జీవించి ఉన్నారు. సూర్యుడి శాపం కారణంగా అప్పటినుంచీ వీరందరూ ధనసంపద్విరహితులై గర్భదారిద్య్రం అనుభవిస్తున్నారు. అయితే ధర్మధ్వజ కుశధ్వజులిద్దరూ పరమవైష్టవులు. ప్రస్తుతం రాజ్యభ్రష్టులు. శ్రీవిరహితులు. ఇద్దరూ లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నారు. కనక త్వరలోనే వారిద్దరి భార్యలకూ లక్ష్మీదేవి తన అంశనూ తన కళనూ అందిస్తుంది. పుత్రికగా జన్మిస్తుంది. అప్పుడు సంపన్నులవుతారు. రాజ్యం పొందుతారు. రాజశ్రేష్ఠులవుతారు. శివా! ఇక నువ్వు వెళ్ళు. నీ సేవకుడు మరణించి చాలా కాలమయ్యింది - అని ఆజ్ఞాపించి శ్రీహరి కొలువు చాలించాడు. అభ్యంతరమందిరానికి వెళ్ళిపోయాడు. శివుడు తపస్సుకోసమని తన లోకానికి వెళ్ళిపోయాడు, బ్రహ్మదేవుడూ నిష్క్రమించాడు. సూర్యకశ్యపులూ సెలవుతీసుకున్నారు.
నారదా! ధర్మధ్వజ కుశధ్వజులు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ చాలాకాలం తపస్సు చేశారు. ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పోయిన రాజ్యాలనూ సంపదలనూ తిరిగి పొందారు. పుత్రవంతులూ అయ్యారు. వారిలో కుశధ్వజమహారాజుగారి ఇల్లాలు మాలావతి మళ్ళీ నీళ్ళుపోసుకుంది. పదినెలలూ మోసి ఆడపిల్లను ప్రసవించింది. ఆ బిడ్డ పుడుతూనే వేదధ్వని చేసింది. సద్యోయౌవనవతియై పురిటిమంచం నుంచి లేచి వచ్చింది. పుట్టగానే వేదాలు వల్లించింది కనక ఆ కన్యకకు వేదవతి అని నామకరణం చేశారు.
పురిటి గదినుంచి ఈవలికి వచ్చి స్నానం చేసి తపస్సు చేసుకుంటానంటూ అడవుల బయలుదేరింది. తల్లిదండ్రులూ పెద్దలూ ఎంత వారించినా వినిపించుకోలేదు. నిమిషం ఆగలేక పుష్కరక్షేత్రానికి వెళ్ళి ఒక మన్వంతరకాలం తీవ్ర తసస్సు చేసింది. అయినా ఆమె శరీరం బడలిపోలే వొడిలి పోలేదు. నవయౌవనం అలాగే నిలిచింది. అప్పుడొక అశరీరవాక్కు వినిపించింది-
వేదవతీ! పై జన్మలో నీ తపస్సు ఫలిస్తుంది. నీ కోరిక నెరవేరుతుంది. బ్రహ్మాదులకే అందని శ్రీహరిని పతిగా వాంఛిస్తున్నావు. వచ్చే జన్మలో శ్రీహరి నీకు భర్త అవుతాడు.
ఈ మాటలకు వేదవతి సంతోషించింది. అక్కడి నుంచి బయలుదేరి గంధమాదనపర్వతశిఖరం మీద అత్యంత నిర్జన ప్రదేశంలో మళ్ళీ తపస్సు కొనసాగించింది.
ఒకనాడు అక్కడికి రావణాసురుడు వచ్చాడు. వేదవతి యథావిధిగా అతిథి మర్యాదలు చేసింది పళ్ళూ ఫలాలూ అర్ఘ్యపాద్యాలూ శీతలోదకాలూ భక్తితో సమర్పించింది. అన్నింటినీ స్వీకరించి పాపాత్ముడు మరింత చేరువకి వెళ్ళి వెకిలిగా కుశలప్రశ్నలు వేశాడు. ఆమె సౌందర్యానికి చలిం కామబాణ పీడితుడయ్యాడు. చటుక్కున చెయ్యిపట్టుకుని కౌగిలించుకోబోయాడు. వేదవతి కోపంతో బుసకొట్టింది. కళ్ళల్లో నిప్పులు రాల్చింది. అతడిని శిలాప్రతిమలా నిశ్చేష్టుణ్డి చేసింది. రావణుడు రాతిబొమ్మ అయిపోయాడు. కాలూ చేయీ ఆడలేదు. నోటమాటలేదు. జడీభూతుడయ్యాడు.
వేదవతి కన్నులు మూసుకుని మనస్సులో మహాదేవిని స్మరించింది. స్తుతించింది. కళ్ళు తెరిచింది. రావణుణ్ణి శపించింది. రావణా! నా కారణంగానే నువ్వు నశిస్తావు. సపుత్రబాంధవంగ అంతరిస్తావు. నువ్వు కాముకుడవై నన్ను స్పృశించావు. కౌగిటిలోకి లాక్కోబోయావు. నీ బలం ఎమిటో ఎంతో చూపించు - అంటూ యోగశక్తితో దేహం చాలించి వెళ్ళిపోయింది. నిశ్చేష్టుడై చూస్తూ నిలబడ్డ రావణాసురుడు కొంత సేపటికి తెప్పరిల్లాడు. ఆమె శరీరాన్ని గంగానదిలో విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం నుంచి తేరుకోలేక వేదవతీరూపాన్నీ సాహసాన్నీ మరిచిపోలేక చాలాకాలం విలపించాడు.
సీత - ఛాయాసీత - ద్రౌపది
No comments:
Post a Comment