Monday, May 4, 2026

The marriage of Ganga and Vaikuntha - గంగా-వైకుంఠుల పరిణయం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - గంగా-వైకుంఠుల పరిణయం

శానకాదిమహామునులారా! శ్రద్ధగా వింటున్నారుకదా అని మరొకసారి హెచ్చరించి సూతుడు తరవాత కథను కొనసాగించాడు. అప్పుడు నారదుడు మళ్ళీ నారాయణమహర్షిని అడిగాడు -

మహర్షీ! గంగాదేవి వైకుంఠానికి వెళ్ళింది అన్నావేతప్ప అక్కడ చతుర్భుజుడికి ఎలా ఇల్లాలయ్యిందో చెప్పలేదు. ఆ పుణ్యకథ వినాలని ఉంది. చెప్పపూ - అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణ మహర్షి సరే అని ప్రారంభించాడు.

నారదా! గంగాదేవి వైకుంఠానికి బయలుదేరిందికదా! ఆవిడవెంట బ్రహ్మదేవుడు వెళ్ళాడు. వెళ్ళి వైకుంఠంలో ఉన్న చతుర్భుజ నారాయణుడికి విషయమంతా వివరించి చెప్పాడు. రాధాకృష్ణుల శరీరాలనుంచి ద్రవరూపంగా గంగాదేవి ఆవిర్భవించడమూ రాధమ్మకు భయపడి శ్రీకృష్ణుడి పాదపద్మంలో దాక్కోవడమూ రాధాదేవి అలిగి జలపానం చెయ్యడమూ తామందరూ గోలోకానికి వెళ్ళి శ్రీకృష్ణపరమాత్మను శరణువేడటమూ ఆయన దయతలిచి గంగను తన పాదంనుంచి విడిచిపెట్టడమూ అప్పూడు ఆ గంగాదేవిని వైకుంఠానికి వెళ్లమనడమూ, అక్కడ చతుర్భుజనారాయణుడికి ఇల్లాలివి కమ్మనడమూ - మొత్తం జరిగిన వృత్తాంతాన్ని వివరంగా చెప్పాడు.

చతుర్భుజనారాయణా! వైకుంఠాధిపా! ఈవిడ పరమ పావని. రాధాకృష్టాంగసంభూత. జలాధిష్ఠాన దేవత. నవయౌవన సంపన్న సుశీల సుందరాంగి శుద్ధసత్త్వస్వరూప. క్రోధాహంకార వివర్జిత. నిన్ను తప్ప ఈ వైకుంఠంలో మరెవ్వరినీ వరించదు. ఈవిడకు రాధికామంత్రాన్ని ఉపదేశించి ఇక్కడకి తీసుకువచ్చాను. గాంధర్వవివాహ పద్దతిలో నువ్వు ఈమెను స్వీకరించు. నువ్వు సురేశ్వరుడవు. రసికుడవు. ఈమె సురేశ్వరి. రసీక. అందుచేత మీ ఇద్దరి సమాగమమూ పరస్పరం ఆనందదాయకంగా అనురూపంగా ఉంటుంది. నువ్వు పురుషులలో రత్నానివి. ఈవిడ స్త్రీరత్నం. నెరజాణకు నెరజాణతో సంగమం గుణోన్నతంగా ఉంటుంది. పైగా - స్వయంగా వరించి వచ్చిన కన్యను తిరస్కరించినవాడిమీద లక్ష్మీదేవి అలుగుతుంది. విడిచి వెళ్లిపోతుంది. ఇది నిశ్చయం. పామరుడేకాదు పండితుడైనా ప్రకృతిని ఆవమానించడు. స్త్రీ అంటే ప్రకృతి కళాస్వరూపిణి. పురుషుడంటే ప్రాకృతికుడు.

నువ్వేమో జగన్నాథుడివి. నిర్గుణుడివి. ప్రకృతికి అతీతుడివి. శ్రీకృష్ణపరమాత్మ ద్విభుజుడైతే  అతనిలో సగభాగమైన నువ్వు చతుర్భుజుడివి. కృష్ణుడి వామాంగంనుంచి ఆవిర్భవించిన మహశక్తి  స్వరూపిణి రాధాదేవి. అందులో దక్షిణాంశ రాధాదేవికాగా వామాంశ లక్ష్మీదేవి. అంతా కలిపిచూస్తే ఈ గంగాదేవి నీ శరీరంనుంచి పుట్టినదే. అందుకే నిన్ను వరిస్తోంది. స్త్రీ పురుషులు అంటే ప్రకృతిపురుషులు అంతా ఎకాంగమే. కాబట్టి స్వీకరించు.

అని బ్రహ్మదేవుడు వైకుంఠనాథుణ్ణి ఒడబరిచి గంగాదేవిని అప్పగించి వెళ్ళిపోయారు, వైకుంఠనాథుడు గాంధర్వపద్ధతిలో గంగను వివాహం చేసుకున్నాడు. చందనచర్చలతో పుష్పమాలికలకో ఇద్దరూ శృంగారక్రీడల్లో మునిగితేలారు. నవసంగమసౌఖ్యానికి పరవశించిన గంగాదేవి మూర్చపోయింది రసికేశ్వరుడి సమాగమం రసికురాలికి అంతట పారవశ్యాన్ని కలిగించడం సహజమేకదా! 

నారదా! ఇలా ఆనందిస్తున్న గంగాదేవిని చూసి నిత్యమూ సరస్వతీదేవి ఈర్ష్యపడుతూ ఉండేది. గంగ - లక్ష్మి - సరస్వతి - తులసి - నలుగురూ శ్రీహరికి భార్యలుగదా! సరస్వతిని చూసి గంగమ్మమాత్రం ఈర్ష్యపడేదికాదు. చివరికి భరించలేక ఒకనాడు గంగాదేవి సరస్వతిని శపించింది. భూలోకానికి పొమ్మంది ఈ కథ అంతా నీకు తెలిసిందే.

నారాయణ మహర్షి ఇక్కడకి ఆగి రవ్వంత ఊపిరి పీల్చుకున్నాడు. ఈసారి నారదుడికి తులసీకథ వినాలి అనిపించింది. ఆవిడ ఎక్కడ పుట్టింది? పూర్వజన్మ ఎమిటి? ఎవరి అమ్మాయి? ఏ తపస్సులు చేసి శ్రీహరిని భర్తగా పొందింది? వృక్షత్వం ఎలా వచ్చింది? ఇలాంటి సందేహాలన్నీ ఏకరువుపెట్టాడు. నారాయణమహర్షి ఓపికగా బదులు పలికాడు.

వేదవతిగా లక్ష్మీదేవి


No comments:

Post a Comment

Mahabaleshwar Temple - Mahabaleshwar- Maharashtra - మహాబలేశ్వర్ దేవాలయం - మహాబలేశ్వర్ - మహారాష్ట్ర

మహాబలేశ్వర్ దేవాలయం,  మహాబలేశ్వర్, మహారాష్ట్ర మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న మహాబలేశ్వర్ ఆలయం (పాత మహాబలేశ్వర్) 16వ శతాబ్దానికి చెందిన ప...