Monday, March 9, 2026

Grihastha Pujalu Dharma Sandehalu - గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు,హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు.

సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి.

ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు.

చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు.

లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి.

విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి... పూజ లేకుండా ఉండకూడదు.

ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు.

నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండం మంచిది.

ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది.

అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి... నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి.

పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు.

ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది.


ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది?
గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది.

పుణ్య ప్రదేశాల్లో, దేవతా సన్నిధిలో చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిధిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది.

వెదురు తడక మీద కూర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఃఖం, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.

ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపం అందుకే దానికి మామిడి తోరణం కడతారు. కింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్త్రపరంగా చెప్పాలంటే గడపకు పసుపు రాయడం వల్ల క్రిమికీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.

పంచామృతం
ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారల మిశ్రమాన్ని పంచామృతం అంటారు. దీనిని పూజలో దేవునికి నివేదిస్తారు.

పంచగవ్యాలు
ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రంల మిశ్రమమే పంచగవ్యం. దీనిని పంటల రోగనివారణకు వాడతారు.

తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?
తొలితీర్థం శరీర శుద్ధికి, శుచికి. రెండవ తీర్థం ధర్మ, న్యాయ ప్రవర్తనకు, మూడవ తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం కొరకు.


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
సాధారణంగా చాలా మంది దేవాలయాలకు వెళ్తుంటారు. అక్కడ పూజారితో పూజలు, వ్రతాలు చేయించుకుంటాం. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తాం.

పూజలు, వ్రతాలు చేసినప్పుడో తీర్థం తీసుకుంటూ ఉంటాము. అయితే మనం గుడికి వెళ్లినప్పుడు అక్కడ మనకు తెలియ కుండానే చేతులు దేవుణ్ణి ప్రార్ధన చేస్తుంటాయి. రెండవది తీర్థం తీసుకుని తాగి మన చేతులను తలపై రాసుకుంటాము.

దేవాలయాల్లో తీర్థాన్ని తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై రాసుకోకూడదు అంటున్నారు పండితులు. చేతులు జోడించి దేవదేవునికి నమస్కరించి, ప్రార్ధన చేయవచ్చు కానీ తీర్థాన్ని తీసుకున్న తరువాత చేతులను తలపై రాయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయట.

సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనే వంటివి జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత చేతికి ఎంగిలి అంటుకుంటుంది.

ఆ చేయినే తలకు రాసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వదని వారు చెప్తున్నారు. అందుచేత తీర్థం తీసుకున్న చేతిని నీటితో కడుక్కోవాలని పండితులు సెలవిస్తున్నారు.

తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని నెత్తికి రాసుకోవడం చేయకూడదు. జేబు రుమాలుతో తుడుచుకోవాలి లేదా కండువాతో తుడుచుకోవాలని వారు సూచిస్తున్నారు. కానీ గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలపై రాసుకోవచ్చునని పండితులు అంటున్నారు.


ఉద్యోగంలో వృద్ధి కొరకు
వృత్తి అంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడం. ఆయా రంగాలలో తమ జీవితాలను జీతాల కోసం పనిచేస్తుంటారు. అయితే చాలామందికి ఏండ్ల తరబడి ఉద్యోగంలో వృద్ధి ఉండదు. వారిముందే వచ్చిన చిన్నవారు వారిని దాటిపోతుంటారు.

ఉద్యోగి ఉద్యోగంలో స్థిరత్వం కోసం అభద్రతా భావం తొలగించుకోవాలంటే తప్పకుండా శనీశ్వరుడిని "ఓం చర స్థిర స్వభవాయ నమః" అనే మంత్రంతో పూజించాలి. ఈ మంత్రాన్ని వీలయినన్ని సార్లు శనివారం రోజున జపిస్తూ ఉండాలి.

సంధ్యా సమయంలో రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేయాలి. దీనితో పాటు హనుమంతుని విగ్రహానికి లేదా చిత్రపటానికి నువ్వుల నూనె, సింధూరం కలిపి పటానికి కానీ విగ్రహానికి బొట్టు పెట్టాలి.

కాలభైరవ ఆలయంలో దీపం వెలిగిస్తే స్థిరత్వం వస్తుంది. ఇక శివాలయంలో అయితే ఆవనూనెతో దీపాన్ని వెలిగించాలి. శనివారం రోజున పచ్చకర్పూరం కలిపిన కుంకుమును ముఖానికి బొట్టు ధరించాలి. అలాగే ప్రదోష కాలంలో రావిచెట్టు, వేపచెట్టు మొదట్లో ఉన్న పుట్టలలో పాలు, నీళ్ళు కలిపి పోయడం ద్వారా ఉద్యోగంలో సంతృప్తికరమైన స్థానానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.

సోమవారం రోజున పరమేశ్వరుడికి పసుపురంగు పువ్వుల మాల వేసి, గరికె పూలతో స్వామిని పూజించిన తరువాత శనగలు పెట్టి ప్రసాదంగా పరమేశ్వరుడికి నివేదించాలి. పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఉద్యోగంలో సరైన స్థితికి రావడం జరుగుతుంది. అలాగే "ఓం వృషభ వాహనాయ నమః" మంత్రాన్ని వీలయినన్ని సార్లు జపించాలి. ఇలా భక్తి, శ్రద్ధలతో ఆయా దేవతలను పూజిస్తే తప్పక అనతికాలంలో పదోన్నతి వస్తుంది. దీంతోపాటు ఉద్యోగంలో కూడా భక్తితో, శ్రద్ధతో పనిచేయాలి.

నైవేద్యము

ఓం నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యా 
సంప్రదాయ కర్తృభ్యో, వంశ ఋషిభ్యో నమో గురుభ్య

నైవేద్యము అంటే: నివేదింప తగిన, సమర్పింప తగిన వస్తువు, పదార్ధము. భగవంతునికి నివేదించే పదార్ధము. అది వస్తువే వుండ వలసిన అవసరము లేదు. మన మనస్సును కూడా నివేదించ వచ్చు.

మనము తినే ఆహారమును భగవంతునికి పెడితే, ఆ పెట్టె విధానమును నైవేద్యము అని అంటారు, ఆయన తినిన తరువాత ఆయన ఉచ్చిష్టము మనకు ప్రసాదము అవుతుంది. అదే మనము ముందు తిని ఆయనకు పెడితే ఎంగిలి అవుతుంది. అలా చేయ కూడదు . భగవంతునికి నివేదించిన పదార్ధము మనకు ప్రసాదము అవుతుంది. ఆ ప్రసాదము మనము భక్తితో తిన వలెను.

మనము తినే ఆహారమును శుచిగా, మడిగా వండి భగవంతునికి నివేదన చేయ వలెను. ఒక్కో దేవతకు ఒక్కో వస్తువు ప్రీతి. విశేష దినములలో ఆ రకముగా పిండి వంటలు చేసి భగవంతునికి ఆరాధన చేయ వలెను.

భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ 
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం మహేశ్వరీ

అని నివేదన చేయవలెను. ఏ విధంగా నివేదన ఎలా చేయాలి? వండిన పదార్ధములను అన్నీ ఒక పళ్ళెములో (అది మనము తినే పళ్ళెము వుండ కూడదు) లేదా ఒక విస్తరాకులో అన్నీ వడ్డించి తీసుకొని రావలయును. దాని మీద ఆవు నెయ్యిని అభికరించ వలెను. ఆవు నేతితో అది అమృతము అవుతుంది.

గో సంబంధమైన పదార్దములు అమృతములు. అమృతమైన పదార్ధములనే భగవంతునికి నివేదన చేయ వలెను. ఇతర పదార్ధములను పెట్టకూడదు. యజమాని కుడి చేతి వైపు నీళ్ళు చల్లి, మత్స్య ముద్ర తో, చంధనముతో, చతురస్రము, దానిలో వృత్తము లిఖించ వలెను.

దాని పైన మహా నివేదన పాత్ర వుంచవలెను. గాలినీ ముద్రతో విషమును వడ కట్టి, గరుడ ముద్రతో ఆ విషమును హరించి, ధేను ముద్రతో అమృతీకరణము గావించి, గాయత్రీ మంత్రముతో ప్రోక్షణ గావించి పంచ ప్రాణములకు, పంచ ఆహుతులు సమర్పించ వలెను స్వాహా కారముతో. ముద్రలు తెలియని వారు గాయత్రీ మంత్రముతో సంప్రోక్షణ గావించి నివేదన చేయ వచ్చు. 

నివేదన అయిన తరువాత ఆ పాత్రలు తీసి, ఆ తీసిన చోట మరలా నీళ్ళు చల్ల వలెను. ఆ పైన తాంబూలాది సర్వోపచారములు చేసి భగవంతునికి నీరాజనము, మంత్ర పుష్పము చేయవలెను. తరువాత అపరాధాస్తవము చదువ వలెను.

బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?
బొట్టు.. బొట్టు పెట్టుకోవడం మన సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం. బొట్టు పెట్టుకున్న వాళ్ళ మొహం తేజోవంతంగా, చక్కని కళతో కనిపిస్తుంది. బొట్టు లేని మొఖాన్ని చూడకూడదు అని సాంప్రదాయాలు పాటించే చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా మహిళలు నుదుటన బొట్టు లేకుంటే అరిష్టంగా భావించేవాళ్ళు నేటికీ ఉన్నారు. ముఖ్యంగా వివాహితలైన స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే అది ఏ మాత్రం మంచిది కాదని చెప్తారు.

బొట్టు పెట్టుకోవటం వెనుక అనేక కారణాలు 
అయితే మహిళలు నుదుట కుంకుమ తిలకం పెట్టుకోవడం ఒక ఆచారమే కాదు అందుకు అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఇక బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న కారణాలలో కొన్నింటిని చూస్తే ... పురాణాల్లో కూడా బొట్టు గురించి చాలా ప్రసిద్ధమైన విషయాలు ఉన్నాయని చెబుతారు. పద్మపురాణంలో, ఆగ్నేయ పురాణంలో, పరమేశ్వర సంహిత లో నుదుటిమీద కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుందని చెప్పబడింది.

బ్రహ్మస్తానంలో బొట్టు పెట్టుకోవటం శుభాలకు సంకేతం
అంతేకాదు మన దేహంలోని ప్రతి శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారని, ఇక నుదుటికి అధిదేవత బ్రహ్మ దేవుడు అని చెబుతారు. బ్రహ్మ స్థానమైన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని చెబుతారు. అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోవటం తప్పనిసరి.

బొట్టు పెట్టుకోవటం వల్ల ఉపయోగాలివే 
కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరాన్ని అది చల్లబరుస్తుంది. మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల వారు చక్కనైన లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నుదుటన పెట్టుకున్న కుంకుమబొట్టు మెదడుని ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది. నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి. బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటుంది.

ఈ పనులు చేసేటప్పుడు బొట్టు లేకుంటే ప్రయోజనం ఉండదు 
ఇవి మాత్రమే కాకుండా నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవడం అనేక క్రతువులు చేసేటప్పుడు తప్పనిసరి. పుణ్యస్నానాలు చేసేటప్పుడు, దానధర్మాలు చేసేటప్పుడు, యజ్ఞయాగాదులు, దేవతార్చన నిర్వహిస్తున్నప్పుడు, పితృ కర్మలను ఆచరించే టప్పుడు నుదుటన బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. నుదుటన బొట్టు లేకుండా ఈ కార్యక్రమాలు ఏమి చేసినా అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు.

బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి .. ఎలా పెట్టాలంటే 
ఇదిలా ఉంటే ఇక బొట్టు పెట్టుకోవడంలో కూడా అనేక విధానాలు ఉంటాయి. ఏ వేలితో బొట్టు పెట్టుకోవచ్చు? ఏ వేలితో బొట్టు పెట్టుకోరాదు? అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో పెట్టుకోవాలి. అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి అలా కాకుండా మధ్యవేలుతో కానీ, ఉంగరపు వేలుతో కానీ బొట్టు పెడితే ఎదుటి వారి కర్మలు మనకు వచ్చిపడతాయి. అందుకే చూపుడువేలితో ఎదుటివారికి బొట్టు పెట్టాలని చెబుతారు.

మన చేతి వేళ్లలో ఒక్కో వేలు ఒక్కో గ్రహానికి నెలవు. నుదుటిపై కుంకుమ దిద్దేటప్పుడు ఉపయోగించే వేళ్లను బట్టి వాటి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. బొటనవేలు శుక్ర స్థానం. ఈ గ్రహం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఈ వేలితో తిలకం దిద్దుకుంటే ఆరోగ్యం, శక్తి కలుగుతాయి. మధ్యవేలు శని స్థానం. కనుక మధ్యవేలితో తిలకం ధరిస్తే దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుంది. ఉంగరపు వేలు సూర్య స్థానం. ఈ వేలితో బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి, తేజస్సు, శక్తి కలుగుతాయి. అంతేగాక ఆజ్ఞాచక్రం ఉత్తేజితమై, మేధస్సును మేల్కొలుపుతుంది. దేవుడికి ఈ వేలితోనే తిలక ధారణ చేయాలనేది పురాణవచనం. చిటికెన వేలు బుధుని స్థానం. వాక్సంబంధిత వృత్తులకు బుధుడు కారకుడు. చిటికెన వేలితో తిలకం దిద్దుకుంటే బుద్ధికుశలత కలుగుతుంది. చూపుడు వేలు బృహస్పతి స్థానం. అమరత్వానికి చిహ్నం. మరణించినవారికే ఈ వేలితో తిలకం దిద్దుతారు. అందువల్ల వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఇతర సందర్భాల్లో ఈ వేలితో బొట్టు పెట్టడాన్ని అశుభంగా భావిస్తారు

బొట్టు పెట్టుకుంటే కలిగే ఫలితం ఇదే 
ఇక దేవతల ప్రతిమలకు, ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలితో బొట్టు, గంధం వంటివి పెట్టాలి. పొరపాటున కూడా మధ్యవేలుతో పెట్టకూడదు. మధ్యవేలుతో మనం బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్షు, సంపద రెండూ వస్తాయని చెబుతారు. ఇక బొటన వేలుతో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని చెబుతారు. మొత్తంగా చూస్తే కచ్చితంగా మహిళలు బొట్టు పెట్టుకోవాలి. మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవటం ఎంతో మంచిది.

ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలి:
పూజలు అందరూ చేస్తారు. కానీ ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలి? ఎలా చేయాలి? అలా చేస్తే కలిగే ప్రయోజనాలేంటి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. నిజానికి శాస్త్రాల్లో ఈ పూజలకు సంబంధించి కూడా వివరించారు. మరి ఆ పూజలేంటో, ఎలా చేస్తారో మీరూ తెలుసుకోండి.

వారంలో ఏడు రోజులు ఉంటాయి కదా. ఇందులో ఒక్కోరోజు ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైంది. అందుకే ఆయా రోజుల్లో ఆయా దేవుళ్లను పూజించడం వల్ల మంచి పుణ్య ఫలం లభిస్తుంది. ఈ పూజల గురించి శివపురాణంలోని 14వ అధ్యాయంలో కూడా వివరించారు.

ఆదివారంఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం. ఆ రోజు సూర్య దేవుడ్ని ఆరాధించడం వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏ శుభకార్యం తలపెట్టినా నిర్వఘ్నంగా సాగుతుంది. సూర్య భగవానుడికి తెల్లటి ధాన్యము సమర్పించి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

సోమవారం చంద్రునికి సంబంధించిన వారం సోమవారం. అందుకే శివునికి ఎంతో ప్రీతికరం. సోమవారం శివుడికి మారేడు, బిల్వ పత్రాలతో పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. అలాగే లక్ష్మీ దేవికి కూడా ఇష్టమైన వారం. లక్ష్మీ దేవికి అభిషేకం, కుంకుమార్చన చేస్తే మంచిది. విష్ణు లేదా వైష్ణవ సంప్రదాయం పాటించే వారు వేంకటేశ్వరుడికి అభిషేకం, పుష్పార్చన చేస్తే విశేష ఫలితం.

మంగళవారం ఆంజనేయ స్వామి, దుర్గామాతకు మంగళవారం ఇష్టమైన రోజు. వీరిద్దరినీ మంగళవారం పూజిస్తే శుభ ఫలితాలు దక్కుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం మంగళవారం నాడు కాాళీ మాతను పూజించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులు లేదా వడ మాలను మంగళవారం వేసి పూజిస్తే భయాలు, రోగాలు పోతాయని భక్తుల నమ్మకం.

బుధవారం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు బుధవారం. అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు ఎర్రటి మందారాలతో బుధవారం వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే అయ్యప్పస్వామికి, విష్ణుమూర్తికి కూడా బుధవారం ఇష్టం. పెరుగు అన్నాన్ని బుధవారం విష్ణు దేవునికి నివేదించి పూజ చేస్తే.. కుమారులు, మిత్రులు, భార్యకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం 
లక్ష్మీదేవికి, దత్తాత్రేయుడు, సాయిబాబాను గురువారం పూజించడం శ్రేయస్కరం. ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్ట దైవానికి గురువారం పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి.

శుక్రవారం అమ్మవార్లు అంటే దుర్గా, కాళీ, లలితా, కామాక్షీ, మీనాక్షీ వంటి దేవతా స్వరూపాలను ఆరాధిస్తే మంచిది. అదే విధంగా తులసీ పూజ, గో పూజలు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. అమ్మవారికి ఎరుపు రంగు పూలు సమర్పించాలి.

శనివారంకలియుగ దైవం వేంకటేశ్వరుడికి శనివారం ఎంతో ప్రీతికరం. అదే విధంగా ఆంజనేయస్వామి, శని దేవతల ఆరాధన ఉత్తమం. కుదిరితే ఆంజనేయ స్వామి, శివాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రదక్షణలు చేస్తే దోషాలు పోతాయి. శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది.


నవగ్రహ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి
నవగ్రహ దేవాలయానికి వెళ్ళడం వలన జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి, గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, మంచి ఆరోగ్యాన్ని, సంపదను, శ్రేయస్సును పొందడానికి, అలాగే మానసిక ప్రశాంతతను పొందడానికి నమ్ముతారు.

నవగ్రహ దేవాలయాలకు వెళ్ళడానికి గల కొన్ని ముఖ్య కారణాలు:

గ్రహాల అనుగ్రహం:
నవగ్రహాలు (సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు) మానవ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నమ్ముతారు. ఈ గ్రహాల అనుగ్రహం పొందడానికి, వారి చెడు ప్రభావాలను తగ్గించడానికి నవగ్రహ ఆలయాలను సందర్శిస్తారు.

సమస్యల నివారణ:
నవగ్రహాల పూజలు చేయడం వలన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనేక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని నమ్ముతారు.

ఆధ్యాత్మిక ప్రయోజనాలు:
నవగ్రహ ఆలయాలను సందర్శించడం వలన ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

మంచి ఫలితాలు:
నవగ్రహాల పూజలు చేయడం వలన మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు.

నవగ్రహాలకు సంబంధించిన కొన్ని సాధారణ నమ్మకాలు:
సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అనే తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు.

ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది మరియు అది వ్యక్తి యొక్క జీవితంలో వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది.

నవగ్రహాలను పూజించడం ద్వారా, వారి అనుగ్రహాన్ని పొందవచ్చు మరియు వారి ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు.

మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వకూడదు?
మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదు.

శుక్రవారం లక్ష్మీదేవి ప్రతీక. ఈ రోజున ధనాన్ని ఇంటి నుండి బయటకు పంపడమంటే లక్ష్మీదేవిని తృణీకరించడమేనని కొందరి భావన. కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు, కొందరు బూజులు కూడా దులపరు, కొందరు పుట్టింటి నుంచి ఆడపిల్లని పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీ దేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులూ డబ్బులివ్వటంగానీ, అమ్మాయిని పంపటంగానీ చెయ్యరు.

మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు. మంగళవారం అప్పు తీసుకొన్నట్లైతే అది అనేక బాధలకు కారణమై ఆ అప్పు తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది.

లక్ష్మీదేవి పట్ల ఆరాధనా భావాన్ని పెంచుకుని భక్తి ప్రపత్తులతో ఆ తల్లిని తమ ఇంటిలో స్థిర నివాసం చేయమని ప్రజలు ప్రార్ధిస్తారు.

అత్యవసరమైన సమయాల్లో, ఆపద సమయంలో ఇలాంటి నియమనిబంధనల గురించి పట్టించుకోకూడదు. పట్టించుకుంటే అంతకుమించిన అనర్థాలు జరుగుతాయి.

అలాగే ఎక్కువ అప్పు ఏమైనా వుండి కొద్ది కొద్దిగా తీరుద్దామనుకునేవారు మంగళవారం నాడు తీర్చండి. తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు, త్వరలో ఋణ విముక్తులవుతారు.

ఏ రోజైనా ఉదయ, సాయం సంధ్యా సమయాలలోనూ, పూజ చెయ్యగానేనూ సంపదని ఇంటి నుంచి పంపకూడదు.


ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?
సూర్య భగవానుని తెల్లవారు ఝామున 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ.

ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును.

మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు.

రాహువునకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది.

సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేళ.

రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి.

తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.

సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును ఎప్పుడైనా పూజించవచ్చు

రుధ్రాక్షలు - రకాలు - ఫలితాలు

దీపారాధనకు వాడవలసిన నూనెలు

ద్వాదశ రాశుల వారు వెలిగించాల్సిన వత్తులు

గౌరిదేవిని పసుపుతో ఎందుకు చేస్తారు?

పూజలో గంధం (చందనం) వాడటం వెనుక ఆధ్యాత్మిక కారణం


తాంబూలం - తమలపాకులు

దేవుళ్ళకి హారతి

పారిజాత చెట్టు

నెమలి పించం ఇంట్లో పెట్టుకోవచ్చా

Karma - Phalitham - కర్మ - ఫలితం

కర్మ - ఫలితం

కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకి లను చూడటానికి, చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు.

దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే 'నాయనా! నీవే పరమాత్మవి కదా!, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి, అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి' అని అడిగింది.

అప్పుడు కృష్ణుడు "అమ్మా! నన్ను క్షమించు, నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో?' అని చిరునవ్వు తో! 
అన్నాడు. దేవకి ఆశ్చర్య చకితురాలయింది,

దేవకీ "కృష్ణా ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు?" అని అడిగింది. అప్పుడు కృష్ణుడు "అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు!" దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా కృష్ణుణ్ణి "అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో?" అని 
అడిగింది.

అపుడు కృష్ణుడు "ఇంకెవరు? యశోద మాత! 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గత జన్మలో, అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది." అని
 అన్నాడు, 

ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు, భగవద్భక్తులైనా, అవతార పురుషులైనా వాటి నుండి తప్పించుకోలేరు, ఇంకా మానవ మాత్రలం మనమెంత!

అలాగే యశోద మాత కృష్ణుని వివాహం చూడలేదని తపించింది. కలియుగంలో  వకుళ మాతగా పుట్టి తన చేతులమీదుగా దగ్గరవుండి మరీ శ్రీనివాసుని కళ్యాణం జరిపించి తన కోరికను తీర్చుకుంది. 

ఇలాంటి కర్మలు పరమాత్ముని లీలల వల్ల మనకు తెలిశాయి. మనం మానవమాత్రులము కావున మనం చేసే ప్రతికర్మ లేదా మనకు జరిగే ప్రతి కర్మ భూత, భవిషత్తు మరియు వర్తమానాల మీద ఆధార పడుతాయి. మనం ముందు జన్మలో చేసిన కర్మల వల్ల ఈ జన్మలో ప్రతిఫలం పొందుతాము. అది మంచి అయినా చెడు అయినా. వర్తమానం లో చేసిన కర్మ ఫలితాలు భవిషత్తులో కానీ తదుపరి జన్మలో మంచి కానీ, చేడు కానీ అనుభవించ వలసిందే. 

కావున కర్మను ఎవ్వరూ తప్పించలేరు. భూత, భవిషత్ కాలాలలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి, వర్తమాన కాలంలో అనగా ప్రస్తుత జన్మలో ధర్మబద్ధంగా, ధర్మకార్యాలు చేస్తూ నిజాయితీగా వ్యవహరిస్తూ తమ ఇష్ట దైవాన్ని పూజిస్తూ, స్మరిస్తూ జీవనం గడిపే వానికి కర్మ నశిస్తోంది. కర్మ నశించినవానికి పునర్జన్మ ఉండదు. ముక్తి లభిస్తుంది.

కర్మకు రెండు లక్ష్యములు. ఒకటి దుఃఖమును తొలగించుకొనుట. రెండు సుఖములు పొందుట. కాని ఈ లక్ష్యములు సిద్ధించవు. కర్మవలన మరింత దుఃఖము కలుగుతుంది. 

ఈ శరీరమే నాదికాదు. ఈ శరీరము ఉండునది లేదు. ఈ రోజు ఈ దేహము ఉండవచ్చు. కానీ, రేపే నశించవచ్చు. కావున, శరీరమే నాది కానపుడు భార్యా పుత్రులు, ధనధాన్యములు, వస్తువాహనములు, కృత్యులు పరివారములు నా వారలు ఎట్లవుతారు? 

శరీరము పోయినపుడు ఇవేవియు వెంటరావు. ఇవి పురుషార్ధములవలె కనిపించును. అదొక భ్రమ. నిజమునకు అవి అనర్థములు, ఆత్మ ఒక్కటే అనంతమైనది. అవ్యయమైనది. ఆనందదాయకమైనది.

శరీరము ఆత్మ ఒక్కటికాదు. శరీరము వేరు ఆత్మ వేరు. ఆత్మ అనంతము శరీరము పంచభూతాత్మకము. 

శరీరమునే ఆత్మగా భావించువాడు. దానితో అనేక కర్మలు చేయించును. కర్మల వలన తిరిగి దేహము కలుగును. దానితో మరల కర్మలు చేయించును. ఇదొక విషవలయము. 

శుభం భూయాత్.

పితృశాపం - స్త్రీ శాపం

Narada Muni encouraged Prajapati Daksa's second group of sons (the Savalasvas/Shabalashva) by awakening their natural affinity for their brothers (the Haryasvas) - నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

ఈ విధంగా ఘోరతపస్సు చేస్తున్న శబలాశ్వులను మోక్షపథగాములుగా చేయడానికి నారదుడు ఇదివరకటిలాగే వచ్చి వారికి ధర్మబోధ చేశాడు. 'మీ అన్నలు ఏ మార్గాన్ని ఆశ్రయించి ముక్తిని పొందారో మీరు ఆ మార్గాన్నే ఆశ్రయించవలసి ఉంది. ఎవ్వడైనా సోదరులు చూపిన మార్గాన్ని అనుసరించి వెళ్లేవాడే విశేషజ్ఞుడు అని పెద్ద లంటారు. అందువల్ల ఆ మార్గంలోనే మీరు ప్రవర్తించి ఎల్లవేళలా దేవతలతో కలిసి స్వర్గంలో సుఖంగా ఉండండి' అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుని మాటలను నమ్మిన శబలాశ్వులు విరాగులై

ఓ రాజా! నేను చెప్పేది విను. మంచి గుణవంతులైన ఆ శబలాశ్వులు ఇంతవరకు ఆచరించిన ఐహిక కర్మలకు సిగ్గుపడి, తమ అన్నలు వెళ్ళిన మోక్షమార్గాన్ని అనుసరించి పున్నమినాటి రాత్రి గతించిన తరువాత చంద్రకళలు క్రమంగా క్షీణించిన విధంగా కర్మ క్షయాన్ని పొంది వారు మోక్షాన్ని చేరుకున్నారు.

అదే సమయంలో దక్షునికి అనేక విధాలైన దుశ్శకునాలు గోచరించాయి. ఆయన మనస్సు అధికమైన వ్యథతో క్షోభించింది. తన పుత్రులు గతించడానికి కారణం

నారదుని కారణంగానే ఇలా జరిగిందని గ్రహించిన దక్షుడు మిక్కిలి కోపంతో అతని వద్దకు వెళ్ళి ఆపలేని బాధకు గురైనవాడై మిక్కిలి ఆగ్రహంతో

దక్ష ప్రజాపతికి మిక్కిలి కోపంతో ముఖం ఎర్రబడింది, కనుబొమలు ముడివడినాయి. కన్నులలో నిప్పులు రేగాయి. పెదవులు అదిరాయి. పండ్లు పటపట కొరుకుతూ నారదునితో ఇలా అన్నాడు.

పరమసాధువులాగా ఉంటూ ధూర్తుడవై చిన్నపిల్లలైన నా పుత్రులకు సన్న్యాసమార్గాన్ని బోధించావు. నా కుమారులు ఈ దుస్థితి పొందగా నేను బాధపడకుండ ఉండగలనా? ఇందుకు కారణమైన దుష్టుడవగు నిన్ను నా శాపాగ్నిజ్వాలలో పడదోసి బాధిస్తాను.

Narada Muni encouraged Prajapati Daksa's sons the Haryasvas abandon their father's mandate of procreation and instead pursue spiritual liberation - నారదుండు హర్యశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నారదుండు హర్యశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నాయనలారా! మీరు మిక్కిలి మూఢులుగా కన్పిస్తున్నారు. మీ భవిష్యత్తును విచారించుకొనలేకున్నారు. మీరు పసిబిడ్డలు. ఈ భూమి పరిమాణమెంతో తెలియనివారు. ఇక జీవులను ఏ విధంగా సృష్టించగలరు? సర్వాంతర్యామియైన ఆత్మస్వరూపుడు పురుషుడు ఒక డున్నాడు. స్త్రీరూపిణియై అనేక రూపాలు ధరించిన ప్రకృతి ఒకటున్నది. మాయలమారి అయిన ఆ ప్రకృతి పురుషుణ్ణి లోబరచుకుంటుంది. ప్రకృతీ పురుషుడూ కలిసి సంసార ప్రవాహాన్ని సాగిస్తారు. ఈ సంసారమనే నది రెండువైపులనుండీ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని అనుసరించి ఒక హంస విహరిస్తూ ఉంటుంది. ఆ హంసకు ఇరవై అయిదు మహిమ లుంటాయి. అయినప్పటికీ ఆ హంస సరియైన మార్గం కానరాక వజ్రంవలె దిట్టమై మెరుస్తున్న జలప్రవాహం పడే గోతిచుట్టూ తిరుగుతుంటుంది. ఆ గోతిలో పడితే మళ్లీ బయటపడటమంటూ లేదు.

(ఇక్కడ హంస అనేది జీవాత్మకు ప్రతీక. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, తన్మాత్రాదిగా గల కాళ్ళు, చేతులు, వాక్కు మల, మూత్ర అవయవాలు అయిదూ కర్మేంద్రియాలు. చెవి, కన్ను చర్మం, ముక్కు నాలుక అనే అయిదూ జ్ఞానేంద్రియాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అయిదూ తన్మాత్రలు. భూమి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే అయిదూ పంచభూతాలు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగింటినీ అంతఃకరణ చతుష్టయం అంటారు. వీటన్నింటికీ మూలమైన శక్తి ఆత్మ. ఈ ఇరవై అయిదు రూపాల సామర్థ్యం, ఐహిక సుఖలోలత్వం కలిగి ఉండి, బయటపడే మార్గం అనగా ముక్తిమార్గం తెలియక పోవడమే సుడిగుండంలో పడటం. దానిని దాటి ముక్తిని పొందే మార్గాన్ని తెలుసుకోవాలనేదే నారదుని ఉపదేశం.)

హరిదశ్వులారా! వినండి. ఈ సంగతులను గుర్తించండి. ఇందుకు తగ్గట్టుగా ప్రవర్తించండి. ఈ సృష్టి రహస్యాన్ని ఏ మాత్రమూ తెలుసుకోకుండా కేవలం మీ తండ్రిగారి ఆజ్ఞలను కొనసాగించటానికి పూనుకొన్నారు. అటువంటి మిమ్ములను ఇంత తెలివి తక్కువ వాళ్లను ఏమనాలి?

ఈ విధంగా నారదుడు చెప్పిన విషయాన్ని హర్యశ్వులు తమ విచక్షణ బుద్ధితో తమలో తాము ఇలా చర్చించుకున్నారు.

ముందుగా చక్కగా ఆలోచించి క్షేత్రజ్ఞుడు అనగా ఏమిటి? అజ్ఞాన సంబంధమైన లింగదేహం అనగా ఏది? అనే విషయాలు ముందుగా తెలుసుకోవాలి. అవేవీ తెలుసుకోకుండా కేవలం పనికిరాని పనులు చేసిన కారాణంగా ముక్తి లభించదు.

ఈ సమస్త లోకాలకూ మూలకారణమైన భగవంతు డొక డున్నాడు. ఆయన సర్వేశ్వరుడు. పుట్టుక లేనివాడు. ఆత్మాశ్రయుడు. పురుషోత్తముడు. అటువంటి అంతర్యామి అయిన స్వామిని దర్శింపకున్నచో బ్రహృదేవునికైనా మోక్షం లభించదు.

జీవుడు సంసారమనే కూపాన్ని స్వర్గంగా భావిస్తాడు. దాని నుండి బయటపడకుండా పరబ్రహ్మాన్ని గుర్తించటం సాధ్యం కాదు. కర్మలను చేయడంవలన స్వర్గసౌఖ్యాలు లభిస్తాయి. కానీ కైవల్యం లభించదు.

సామాన్య జీవునికి మోక్షంపై ఆసక్తి కలగడం, భగవంతునియందు ఆసక్తి ఏర్పడటం చాలా కష్టం. జీవుడు మెరమెచ్చులవంటి ఐహికసుఖాలకై పాటుపడుతూ బాధపడుతూ ఉంటాడు. అలాంటి చంచలమైన మనస్సు కల్గిన వారికి మోక్షపదవి దూరం.

అనుకూలత కల్పించుకొని జీవుడు ఐహికసుఖాలలో తేలుతూ ప్రజాసృష్టి మీదుమిక్కిలిగా చేస్తూ ఆ సంసార ప్రవాహంలో కొట్టుకుంటూ అవతలి గట్టును చూచికూడా చేరలేదు. నేను అనే అహంకారం అతణ్ణి జ్ఞానానికి దూరంచేసి, చెడ్డపనులు చేయిస్తుంది. జననమరణాలనే ఈ లంపటంలో చిక్కుకున్న జీవుడు శాశ్వతసౌఖ్యం అందించే మోక్షపదవిని ఎలా అందుకోగలడు?

తన సహజ లక్షణాలు విడిచి, వక్రమార్గంలో నడిచే స్త్రీని పెళ్ళాడిన తెలివిమాలిన భర్తవలె, ఐహికసుఖాలలో దుఃఖాలలో మునిగి తేలుతూ సంచరించే జీవుడు తన నిజ స్వరూపమైన పరమాత్మను తెలుసుకోలేక దుఃఖపడుతూ రక్షణ పొందలేడు.

25 తత్త్వాలకు స్పష్టమైన అద్దం వంటిది పరతత్త్వం. వీటిని వ్యతిరేకంగా ఉపయోగించి చెడుమార్గాలలో వెళ్లే పురుషుడు ఆ సూక్ష్మతత్త్వాన్ని తెలుసుకోలేక పోతే అలాంటి వానికి ఉత్తమగతి ఎందుకు లభిస్తుంది?

(పంచ వింశతి తత్త్వరాశి అనగా జీవుని శరీరంలో ఉండి అతనికి ప్రాణశక్తిని కలిగించి, అతడిని కార్యోన్ముఖుడిని చేసేవి. అవి 1)ఐదు జ్ఞానేంద్రియాలు 2) ఐదు కర్మేంద్రియాలు 3) ఐదు తన్మాత్రలు 4) పంచభూతములు 5) మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం, పురుషుడు. వీటికి లొంగినవాడు అధోగతిని, లేదా వీటికి తట్టుకొని దీటుగా నిలబడినవాడు సద్గతిని పొందుతారు.)

సంసార బంధానికి కారణం, దానినుండి విముక్తి పొందే మార్గం అనే ఈ రెండింటికి సంబంధించిన పరిపూర్ణ శాస్త్రజ్ఞానం లేక కర్మమార్గంలో పడి కొట్టుకునే వాడికి పరతత్త్వాన్ని దర్శించే ఉత్తమగతి ఎలా కలుగుతుంది?

ఈ కాలచక్రం చాలా శక్తిమంతమైనది. ఈ సమస్త జగత్తునూ చుట్టచుట్టి పట్టుకొని సున్న చుట్టి మటుమాయం చేసే కిటుకులు దానికి తెలుసు. అటువంటి కాలస్వరూపాన్ని తెలుసుకోకుండా ఊరకే కర్మలు చేస్తూ కూర్చుంటే వానికి అక్షయమైన మోక్షపదం ఎట్లా దక్కుతుంది?

ఈ సృష్టికార్యాన్ని మనతండ్రి అయిన దక్షప్రజాపతికి ఆయన తండ్రి బ్రహ్మదేవుడు అప్పగించాడు. అతి భయంకరమైన ప్రవృత్తి మార్గాన్ని అవలంబించటం ఇష్టం లేక మన తండ్రి ఆ పని చేయలేదు.

(పిత్రాజ్ఞ ఉల్లంఘించరానిదైనా అది శ్రేయాదాయకం కానప్పుడు ఉల్లంఘించడం దోషం కాదనేది ఇక్కడి ధర్మసూక్ష్మం.)

ఇలా వారిలో వారు ఆలోచించుకొని ఆ తరువాత

ఓ మహారాజా! ఇంకా చెబుతున్నా విను. నారద ప్రబోధం వల్ల నివృత్తిమార్గాన్ని అనుసరించిన దక్షుని కుమారులు తమకు ప్రబోధించిన నారదునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఉత్తమగతులవైపు వెళ్లారు. అంత నారదుడు కూడ విష్ణు పాదారవిందాలలోని తేనెను ఆస్వాదించే మనస్సుతో తన మహతి అనే వీణను మీటుతూ గానం చేసుకుంటూ తనకు నచ్చిన చోటికి వెళ్ళిపోయాడు.

నారదమహర్షి దక్షప్రజాపతి దగ్గరికి వెళ్లి, ఆయన కుమారులు తండ్రిమాట కాదని నివృత్తి మార్గాన్ని అనుసరించి వెళ్లారని చెప్పగా విని, దక్షుడు దుఃఖం పొంగిపొరలగా మనస్సులో చాల బాధపడ్డాడు.

ఆ విధంగా బాధపడుతున్న దక్షుని వద్దకు బ్రహ్మ వచ్చి ఓదార్చి, తిరిగి సంతాన వృద్ధి చేయమని ఆదేశించగా, దక్షుడు తన భార్య అసిక్ని ద్వారా సౌందర్యవంతులు, సకలగుణసంపన్నలూ అయిన అనేక వేలమంది శబళాశ్వులు అనే పేరు గలవారికి జన్మనిచ్చాడు.

తమకు జన్మనిచ్చిన తండ్రి కోరికను గ్రహించి ఆ కోరికను నెరవేర్చడానికి ఆ శబలాశ్వులు తపస్సు చేయడానికి వేంటనే వెళ్ళారు.

ఈ విధంగా ఆ శబలాశ్వులు తండ్రి ఆజ్ఞమేరకు ప్రజాసృష్టి చేయడానికి తపస్సు చేయాలని నిశ్చయించుకొన్నారు. ఏ పుణ్యతీర్థం అన్ని తీర్థాల పుణ్యఫలాన్ని ఇస్తుందో, ఏ పుణ్యతీర్థాన్ని చూసినంతనే పాపాలన్నీ పటాపంచలౌతాయో అటువంటి నారాయణ తీర్ధం అనే సరస్సు దగ్గరకు వెళ్ళి అక్కడ నీటిని స్పృశించినంత మాత్రంచేతనే తమ మాలిన్యాన్ని పోగొట్టుకొని

ఆ శబలాశ్వులు బ్రహ్మాది దేవతలకు సాధ్యం కాని పరబ్రహ్మాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ, పరమాత్మ సంబంధమైన మూలమంత్రాన్ని జపిస్తూ, ఆ మూలపురుషుణ్ణి చూడాలనే కుతూహలంతో సమస్తం పరబ్రహ్మ స్వరూపంగా భావించి తపస్సు చేశారు.

ఆ దక్షపుత్రులు స్థిరబుద్ధితో ఒంటికాలిబొటన వేలిపై నిలబడి చేతులు పైకెత్తి జోడించి చూపులతో తీక్ష్ణమైన సూర్యుడిని చూస్తూ, కొంతకాలం గాలిని ఆహరంగా తీసుకుంటూ, కొంతకాలం ఏ ఆహారమూ లేకుండా సమస్త లోకాలకూ, దేవతలకూ భయం కలిగే విధంగా ఘోరతపస్సు చేశారు.

నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

The Hamsa-guhya Stotra is a praise of Lord Vishnu by Prajapati Daksha - దక్షుడు కావించిన హంసగుహ్యం బను స్తవరాజము

దక్షుడు కావించిన హంసగుహ్యం బను స్తవరాజము

సర్వశ్రేష్ఠుడై అనుగ్రహం చూపడానికి చైతన్య శక్తితో సాక్షాత్కరించే ఆ దేవదేవునికి నమస్కారం చేస్తాను. నిత్యం ప్రకాశించే పరమాత్మునికి వందనం చేస్తాను. అద్భుతమైన దివ్యానుభూతే రూపంగా వెలుగొందేవానికి నమస్కరిస్తాను. నిమిత్తమాత్రంగా బంధువైనట్టి సగుణసాకారమూర్తి అయిన పరమాత్మకు స్తుతులు సమర్పిస్తాను.

గుణాలలో చిక్కుకున్నవారికీ, కేవలం తాత్త్విక బుద్ధితో అన్వేషించే వారికీ నీ ఉనికి తెలియరానిది. మొదటినుండి ఉన్నవాడవు నీవు! మోక్షానికి పరమావధివై ప్రకాశించే వాడవు నీవు! అలాంటి అంతర్యామివైన స్వామిని నిన్ను ఆశ్రయిస్తున్నాను.

నీవు సర్వప్రాణుల దేహాలయందు జీవాత్మ రూపంలో ఉంటున్నావు, కానీ త్రిగుణాలచే బద్దుడైన జీవుడు తనలోనే అంతర్యామిగా వున్న నిన్ను గుర్తించలేకున్నాడు. త్రిగుణాలకు లోబడి ఇతరులతో కలసి ఉంటున్నాడు. కాని, ఓ పరమాత్మా! గుణాతీతుడవైన నీతో కలసి ఉండడమే లేదు. అలాంటి ఓ పరమాత్మా నిన్ను సేవిస్తాను.

మనసు, శరీరం, ప్రాణాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు చక్కని వివేచనతో ప్రయత్నించకపోతే తప్ప జీవుడు తమలో ఉన్న పరమాత్మను చూడలేడు. అటువంటి సర్వగుణ సహితుడైన జీవునిలో అంతర్యామిగా ఉండేవాణ్ణి, సమస్తప్రాణులకూ మేలు కలిగించే వాడినీ, మూలపురుషుడిని ఆశ్రయిస్తాను.

మనస్సు సంకల్ప వికల్పాలకు స్థానం. మనసులో అనేక విరుద్ధ భావాలు సంఘర్షణకు గురై వస్తూ, పోతూ వుంటాయి. ఈ విధమైన మనస్సు ఇంద్రియాల విషయంలో నిగ్రహాన్ని నిలుకడను పొందగల్గితే దానిని నిర్వికల్పసమాధి అంటారు. ఈ విధమైన జ్ఞానానికి మూలమైన అంతరాత్మస్వరూపానికి నమస్కారం. కట్టెలో మిక్కిలి గూఢంగా ఉన్న అగ్నిని రాపిడిశక్తిచేత బయటకు రప్పించినట్టు, బుద్ధిమంతులు తమ మనసనే ఆకాశమందు విహరించే పరమాత్మను తమయొక్క ఇచ్చాజ్ఞానక్రియలనే ఆత్మశక్తులచేత సాక్షాత్కరింపజేస్తారు. అటువంటి ఏకాత్మరూపుడైన నిర్గుణ పరబ్రహ్మ 'ఏకోహం బహూస్యాం' అనే సంకల్పంతో అనేక నామరూపాలను ధరించి విశ్వరూపి అయ్యాడు. అటువంటి సర్వాత్మకుడు నన్ను అనుగ్రహించుగాక. అవాఙ్మానస గోచరుడు, నిర్గుణ పరబ్రహ్మ, సృష్టిస్థితి లయకారణుడు అయిన దేవదేవుణ్ణి ఆశ్రయిస్తాను. ఏ దేవుని మాయాప్రభావం కారణంగా పండితులు, పామరులు, భగవంతుని విషయంలో ఉన్నాడు, లేడు అని వాదించుకుంటారో, వారందరియందు కూడా ఒకే ఆత్మశక్తిగా ఉంటూ, యోగాది ఉపాసనా ధర్మాలు వేరైనా 'నదీనాం సాగరో గతిః' అన్నట్లు వాటన్నిటికి ఒకే గమ్యరూపమైన పరాత్పరుడు నాకు అనుకూలంగా మారునుగాక. నిర్గుణుడు, నిరాకారుడు ఐన పరమాత్మ జగత్తును రక్షించటంకోసం సద్గుణుడు, సాకారుడు అవుతున్నాడో; అటువంటి సర్వవ్యాపకుడు నాకు ప్రసన్నుడు అగుగాక. ఏ భగవానుడు జీవుల పూర్వజన్మ విశేషం కారణంగా ప్రస్తుతజన్మలలో జ్ఞానమనే జ్యోతిగా వెలుగొందుతూ, భూ పదార్థాల వాసనతో కూడుకున్న వాయువు (గాలి) మాదిరిగా అన్నింటిలో ఉంటూ, అన్నింటికి దూరంగా ఉండగలిగే నారాయణుడు నా కోరికను తీర్చుగాక. అని భక్తితో నిండినవాడై తన మాటలతో కీర్తిస్తున్న దక్షునికి, భక్తపాలకుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. అంత

శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని మీద ఆసీనుడై ఉన్నాడు. గరుడుని రెండు భుజాలమీద చాచిన ఆ స్వామి పాదాలు మేరుపర్వతం చరియకు రెండుప్రక్కలా ప్రకాశించే ఇంద్రనీలమణుల గనులవలె ఉన్నాయి. ఆయన అష్టబాహువులూ అందంగా పైకిచాచిన అష్టదిగ్గజాల తొండాలవలె ప్రకాశిస్తున్నాయి. ఎనిమిది చేతులలోనూ చక్రమూ, ధనుస్సూ, కత్తి, శంఖమూ, ఖడ్గమూ, పాశమూ, డాలూ, గదాదండమూ విరాజిల్లుతున్నాయి. నల్లని దేహంతో నగుమోముతో సాధుజనులను సంరక్షించే చల్లనిచూపులతో బంగారురంగు పట్టుపీతాంబరంతో మణిమయకిరీటంతో నలుమూలలా కాంతులు విరజిమ్మే భూషణాలతో, మకరకుండలాలతో పుండరీకాక్షుడు దక్షునిముందు ప్రత్యక్షమైనాడు.

మకర కుండలాల కాంతి చెక్కిళ్ళపై చంద్రకాంతిలా ప్రసరిస్తుండగా, కిరీటం యొక్క శ్రేష్టమైన ప్రకాశం ఆకాశలక్షికి కుంకుమరంగు వస్త్రంగా మారగా, వక్షఃస్థలం మీద వనమాలికల కాంతి శ్రీవత్సం, కాస్తుభమణుల కాంతిలో కలిసి అతిశయిస్తుంటే, నల్లని కొండను చుట్టిన మెఱుపు తీగల మాదిరి స్వామి భుజకీర్తులు శోభిస్తుండగా, సకల లోకాలనూ సమ్మోహింపజేస్తూ, నారదుడు మొదలైన దేవర్షులు, మహర్షులు స్వామిని సేవిస్తుండగా, గంధర్వాది దేవగణాల కీర్తనలు చెవులకు ఆనందం కలిగిస్తుండగా

సర్వశక్తిమంతుడు, సర్వాత్మకుడు, సర్వవ్యాపకుడు, శాశ్వతుడు, సర్వదుడు అయిన ఆ శ్రీహరి తనను సమస్త భక్తజనులు సేవిస్తుండగా దక్షునికి ప్రత్యక్షమయ్యాడు.

ఈ విధంగా సాక్షాత్కరించిన సర్వేశ్వరుని దివ్యరూపం సర్వదిక్కులనూ వెలిగిస్తూ మహాశ్చర్యాన్ని కలిగించింది. అలా ప్రకాశించే ఆ దేవదేవుని తేజోమయమూర్తిని వీక్షించి, దక్షుని హృదయంలో భయమూ, ఆనందమూ, ఆశ్చర్యమూ ముప్పిరి గొన్నాయి. ఎలాగో ఆ తన్మయత్వంనుండి తెప్పరిల్లి తొట్రుపాటుతో దక్షుడు స్వామికి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. జోడించి మోడ్చి నిలుచున్నాడు. సెలయేళ్లు కలయికతో దరులొరసి పొంగి మిన్నంటి సముద్రాన్ని దరిసిన మహానదీ ప్రవాహంవలె దక్షప్రజాపతి పులకించిన దేహంతో భగవంతుని ముందు నిలిచాడు. ఆయన పరవశించిన తన హృదయాన్ని ఎలాగో అదుపు చేసుకొని పొంగిపొరలే ఆనందంతో ఆ పరమేశ్వరునితో ఏమేమో పలుకాలి అనుకొన్నాడు. పరమ మంగళదాయకాలైన ఆయన పవిత్రనామాలను ఉచ్చరించాలనుకొన్నాడు. పరమపవిత్రాలైన ఆయన లీలలను అభివర్ణించాలనుకొన్నాడు. విబుధులకు సంతోషాన్ని కలిగించే ఆయనపరాక్రమాన్ని ప్రస్తుతించాలనుకొన్నాడు. తన మనస్సులోని కోరికను వెల్లడించాలనుకొన్నాడు. కానీ పాపం! ఏమీ చేయలేక పోయాడు. ఆ విధంగా మైమరచి నోట మాటరాక మౌనం వహించి ఉన్న ప్రజాకాముడైన ప్రజాపతిని చూచి, సర్వజ్ఞుడూ సర్వప్రాణి హృదయాంతర్యామీ అయిన ఆ స్వామి అతని అభిప్రాయాన్ని గ్రహించి, ఆర్తజనులను రక్షించే లక్షణంగల మాటలతో ఇలా అన్నాడు.

ఓ దక్షా! నీ తపస్సుకు మెచ్చాను. అందుకు ఈ క్షణంలోనే నీకు ఫలసిద్ధిని ప్రసాదిస్తున్నాను. నానుండి వరం పొందడానికి ఈలోకంలో నీకంటె అర్హుడు ఎవడున్నాడు?

ఈ నీ తపస్సు ఇక చాలు. సకల జీవరాశులకు సమస్త సంపదలు సిద్ధిస్తాయి. నీవు సృష్టి చేయాలనే కోరికతో నన్ను గూర్చి తపస్సు చేశావు. నా సంకల్పం కూడా ఇదే. నీ తపస్సు నెరవేరింది.

ఇంకా చెబుతాను విను. బ్రహ్మ, రుద్రుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రాదులు వీరందరూ నా అంశకు చెందినవారే. వేదచోదితమైన సంధ్యావందనాదులు నా మనస్సు. జపధ్యానాదులు నాశరీరం. ధ్యానధారణాది మానవకార్యాలు నా ఆకారం. యోగాదులు అవయవాలు. ధర్మం నా ఆత్మ. దేవతాగణాలు జీవములు. వేదం నా స్వరూపం. సృష్టిపూర్వం నేను మాత్రమే ఉన్నాను. శాశ్వతుడైన నా నుండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండం, బ్రహ్మ తమకు తాముగా పుట్టారు. నా తేజస్సును కలిగి ఉన్న బ్రహ్మ క్రియారహితుడై ఉన్నప్పుడు నాచే ప్రేరితుడై ఘోరతపస్సు చేశాడు. తదనంతరం నా సంకల్పంతో ప్రజాసృష్టి చేయగల మిమ్మల్ని సృష్టించాడు.

ప్రజాపతులలో ఒకడైన పంచజనుని కుమార్తె ఐన అసిక్నిని నీకు భార్యగా అనుగ్రహించాను. గృహస్థ ధర్మాన్ని పాటించి మీరు అత్యధిక ప్రజలను సృష్టించండి. నీ సంతానం కూడా నాచే ప్రభావితులై సృష్టిని పెంపొందిస్తారు అని ఆదేశించి మాయమయ్యాడు. అప్పుడు దక్షుడు స్వామి ఆజ్ఞమేరకు అసిక్నితో కూడి పదివేలమంది హర్యశ్వులకు జన్మనిచ్చాడు. వారు తండ్రి ఆజ్ఞమేరకు ప్రజాసృష్టికోసం తపస్సు చేయడానికి సింధునది సముద్రసంగమ ప్రాంతమైన విశిష్ట పుణ్యతీర్థమైన నారాయణసరస్సునుచేరి అందు స్నానం చేసి పవిత్ర మనస్కులై తపస్సు ప్రారంభించారు. ఆ సమయంలో వారి వద్దకు నారదుడు వచ్చి ఇలా అన్నాడు.

నారదుండు హర్యశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

Saturday, March 7, 2026

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి

దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివరి నాడు జరిపే పండగే రంగ పంచమి.

హోలీ మాదిరిగానే ఈ పండగకు కూడా రంగులు చల్లుకుని సంతోషంగా గడుపుతారు. అయితే ఈ పండగకు మరో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రంగ పంచమి నాడు స్వయంగా దేవతలు భూమి మీదకు దిగి వచ్చి, హోలీ ఆడతారని నమ్ముతారు. అందుకే ఈ పండగను దేవ పంచమి అని కూడా అంటారు. ఈ రోజున రంగులతో ఆడుకోవడం వల్ల, ప్రపంచవ్యాప్తంగా దేవతల సాత్విక శక్తి వ్యాప్తి చెందుతుందని, దీని ద్వారా జనాలు, దేవతల స్పర్శను అనుభూతి చెందుతారని పండితులు చెబుతున్నారు.

ఈ రోజున గ్రహ స్థానాలు సరైన క్రమంలో ఉండి ప్రాణ శక్తిని మేల్కొలిపి సమతుల్యత మరియు ఆధ్యాత్మిక వృద్ధిని ఇస్తాయని నమ్ముతారు. సాంప్రదాయ రంగ పంచమిలో మూలికలు, పువ్వులు మరియు సహజ వర్ణద్రవ్యాలతో కలిపిన రంగులను నిర్దిష్ట క్రమంలో పూయడం జరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక శక్తి మార్గాలైన నాడులను శుభ్రపరుస్తుంది, వాటిలో నిద్రాణమైన ప్రాణ శక్తిని మేల్కొలిపి జాగృతం చేస్తుంది. అంతేకాక మనలో దాగి ఉన్న సహజ శక్తులను కూడా మేల్కొల్పుతుంది.

పూర్వం రంగులు మూలికలు మరియు ప్రత్యేకమైన వృక్షాల బెరడులతో తయారు చేసేవారు.
పాల్గుణ పౌర్ణమి నుండి క్రమంగా వేసవి కాలం ప్రారంభం కావున మూలికలతో తయారు చేసిన రంగులను మరియు రంగు నీళ్లను చల్లుకోవడం వల్ల వేసవి ఉష్ణోగ్రతల వల్ల చర్మ సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు రాకుండా మనకు సహాయకారిగా ఉంటుంది.

కానీ ప్రస్తుత కల్తీ ప్రపంచంలో రసాయనాలతో తయారయిన రంగుల వల్ల మేలు కన్నా కీడు జరుగుతుంది కావున రంగుల విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతో వుంది.

అయితే ఈ రంగ పంచమి దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరుపుకోరు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మధుర, బృందావనం ప్రాంతాల్లో ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

ముఖ్యంగా గుజరాత్ లో ఈ పండుగను గర్బా మరియు దాండియా నృత్యాలతో జరుపుకుంటారు, ఇక్కడ బహిరంగ ప్రదేశాలలో వేదికలు ఏర్పాటు చేసి సాంప్రదాయ ఆచారాలను ప్రదర్శిస్తూ ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటారు.

రాజస్థాన్ లో జానపద నృత్యాలు, సామూహిక విందులు మరియు రంగుల తో జరుపుకుంటారు. ఉదయపూర్ మరియు జైపూర్‌లలో, యువకులు భక్తిగా హోలీ పాటలు పాడుతూ వీధుల్లో తిరుగుతూ, స్థానిక దేవతలకు రంగులను సమర్పిస్తారు.

మధ్యప్రదేశ్ లో ఐక్యత మరియు సామూహిక కలయికను సూచిస్తూ పెద్ద రంగుల ఊరేగింపులు నిర్వహిస్తారు.

మహారాష్ట్ర (షిమ్గా/షిమ్గో) - సాంప్రదాయ పాల్ఖీ నృత్యాలు మరియు జానపద ప్రదర్శనలు నిర్వహిస్తారు. వ్యవసాయ ప్రారంభాన్ని చిహ్నంగా జరుపుకుంటారు. అంతేకాక సామూహికంగా జరుపుకోవడం వల్ల కాలానుగుణ మార్పులతో ముడిపడి ఉన్న ధైర్యం మరియు బలాన్ని పొందుతామని భావిస్తారు.

గోవా (షిగ్మో పండుగ) లో ఆలయ ఆచారాలను సాంస్కృతిక పద్దతులతో కలిపే పెద్ద షిగ్మో ఉత్సవాల్లో భాగంగా రంగ పంచమిని జరుపుకుంటారు.

బృందావనం మరియు మధుర ఆలయలో  హోలీ వేడుకలు రంగ పంచమితో ముగుస్తాయి, కృష్ణభక్తులు రాధా కృష్ణులకు రంగులు సమర్పించి ఆశీర్వాదాలు పొంది ఈ పండుగను ముగిస్తారు.
రేపల్లెలో స్వయంగా పూజారులే కృష్ణ ప్రసాదంగా రంగులను భక్తులపై కురిపిస్తారు. అది చూడడానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. అది చూసి పాల్గొని అనుభవించవలసిందే.

గ్రామీణ ఉత్తర భారతదేశం - హోలీ వేడుకల కొనసాగింపుగా, గ్రామాలు ఉత్సవాలు, ఊరేగింపులు మరియు సామూహిక ప్రదర్శనలు నిర్వహిస్తారు, అయితే నృత్యం, సంగీతం మరియు స్థానిక ఆచారాలు సామాజిక బంధాలను బలోపేతం చేస్తాయి.

రంగ పంచమి రోజున దేవతలు హోలీ ఆడటం కోసం భూమి మీదకు వస్తారని ప్రతీక. అలా వచ్చిన దేవతలు భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తారని నమ్ముతారు. ఈ రంగ పంచమి రోజున దేవుళ్లతో హోలీ ఆడటం వల్ల మన జీవితంలోని కష్టాలు, బాధలు తొలగిపోతాయని, జీవితంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తారు. రంగ పంచమి నాడు రంగులు పైకి ఎగరవేయడం ద్వారా భక్తులు, దేవతలతో కలిసి హోలీ ఆడతారని, ఫలితంగా, భక్తుల జీవితంలోని కోరికలన్నీ తీరి కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.


నిత్య స్తోత్రావళి

పంచాంగం

The Story of Prachetas Daksha refers to the Prajapati Daksha - ప్రజాపతి దక్షుడి పునర్జన్మ

ప్రజాపతి దక్షుడి పునర్జన్మ

ప్రాచేతసుని కుమారులైన ప్రాచీన బర్హిషులు పదిమంది ఒకనాడు సముద్ర గర్భంనుండి బుద్ధిపూర్వకంగా బయటకు వచ్చి భూమిపై సర్వత్రా వ్యాపించిన చెట్లను చూచి కోపగించి వారి నోటినుండి గాలితో కూడిన అగ్నిని పుట్టించి ఆ చెట్లను సమూలంగా దహించబోయారు. అది చూచిన చంద్రుడు భయపడి వారి కోపాన్ని పోగొట్టడానికి వారితో మృదువుగా మాట్లాడుతూ ఓ మహాత్ములారా! ఏ దిక్కూలేని ఈ చెట్లను నాశనం చేయడం ఉచితమేనా? అని ప్రశ్నించాడు.

(ఓషధులు మొదలైన వృక్షసంతతికి చంద్రుడు అధిపతి. అందుకే అతణ్ణి ఓషధీపతి అంటారు. కనుకనే పై సంఘటనలో చంద్రుడు స్పందించవలసి వచ్చింది.)

పూర్వం అభ్యుదయంపొందుతూ ఉన్న మిమ్మల్ని భగవంతుడు దయామూర్తులైన సృష్టికర్తలుగా పేర్కొన్నాడు. సృష్టికి మూలమైన అటువంటి మీరు ఈ విధంగా చెట్లను నశింపచేయడం తగునా? (తగదు).

ఓ ప్రచేతసులారా! సృష్టికి ప్రారంభంలో ప్రజాపతులకు అధిపతి అయిన శ్రీమన్నారాయణుడు వనస్పతులనూ ఓషధులనూ సృష్టించాడు. అఖిలలోకాధినాథుడూ అచ్యుతుడూ అయిన ఆ పద్మలోచనుడు జీవులకు పోషకంగా ఇష్టమైన ఆహారం కోసమూ, శరీరానికి శక్తి ఇవ్వటం కోసమూ ఈ వృక్షాలను ఏర్పాటు చేశాడు. చరాలూ పాదచారులూ అయిన జీవులకు అచరాలూ, పాదరహితాలూ అయిన వాటిని ఆహారంగా కల్పించాడు. రెండుచేతులు, రెండుకాళ్లు గల ప్రాణులకు నాలుగు కాళ్ల జంతువులనూ, వృక్షాలనూ ఆహారంగా ఏర్పాటు చేశాడు. అందువలన మీరు ఈ విధంగా చెట్లను కాల్చివేయటం న్యాయం కాదు. అదీగాక మీరు తపస్సుచేసి పుణ్యవంతులై ఉండటానికి ఆ దయామయుడైన నారాయణుని అనుగ్రహమే గదా కారణం. ఆ మహానుభావుడైన అచ్యుతుడేగదా మీకు లోకమంతటా “అనఘులు” అనే ప్రఖ్యాతిని కల్పించింది.

నిజానికి బ్రహ్మదేవుడు మిమ్మల్ని సృష్టి చేయడానికి నియమించాడు. అలాంటి మీకు సృష్టి నాశనంచేయాలని, ఈ వృక్ష దహనం మీద కోరిక ఎలా కలిగింది?

ఎల్లప్పుడూ గొప్ప సత్త్వగుణాలను కలిగివుంటూ సత్పురుషులుగా పేరు పొందండి. మీ తండ్రులు, తాతలు, పెద్దలు ఏనాడూ పొందని కోపతాపాలకు మీరు లోనుకాకండి. కోపంతో కూడిన పాపపు ఆలోచనలను విడిచి అదిగో జాలి చూపులతో భీతిల్లుతున్న వృక్షసమూహాలపై కరుణ చూపించండి.

బిడ్డలకు తల్లిదండ్రులు, కళ్ళకు కనురెప్పలు, భార్యకు భర్త, ప్రజలకు పాలకుడు, యాచకునికి ఇంటి యజమాని, మూర్ఖులకు జ్ఞాని మొదలగువారు నిజమైన క్షేమాన్ని కోరే ఆప్తబాంధవులు. అంతే తప్ప ఆపద సమయంలో ఆదుకోలేని కఠినచిత్తులు నిజమైన బంధువులు కానేకారు.

ఇంకా చంద్రుడు ప్రాచేతసులను ఇట్లా వేడుకొన్నాడు - సమస్త జీవరాసుల దేహాలలోపల సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఆత్మస్వరూపంలో ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. అట్లా తెలుసుకొని సర్వత్ర నిండి ఉన్న ఆ ఇందిరారమణుడైన గోవిందుని లోచూపులతో తనివితీరా చూడాలి. అట్లా చూచినట్లయితే పరిశుద్దాత్ములూ జ్ఞానస్వరూపులూ అయిన మిమ్మల్ని ఆ భగవంతుడు ఎంతో మెచ్చుకుంటాడు. అట్లా మెచ్చుకొన్న పరాత్పరుడు మీరు చూచే ప్రదేశమంతటా అన్నిట్లోనూ ఉన్నాడని తెలుసుకొని మీరు మీ కోపాన్ని శాంతింపజేసుకోవాలి. ఆగ్రహాన్ని త్యజించినవారై మీరు దహింపగా మిగిలిన వృక్షాలను ఇకనైనా సంతోషంగా బ్రతుకనీయాలి. ఓ పుణ్యాత్ములారా! మీరు నా ప్రార్థనను అంగీకరించాలి.

ఈ చెట్లకు కలిగిన ఆపదను పోగొట్టినందుకుగాను అప్పరస కుమార్తెయైన, వృక్షప్రుత్రిక అయిన మారిష అనే కన్యను మీకు భార్యగా ఇస్తున్నాను. కాదనక స్వీకరించి ఆనందించండి.

చంద్రుడు వారికి వీడ్కోలు పలికి మారిష అనే అప్పరసను ఆ ప్రాచీన బర్హిషులకు అప్పగించి వెళ్ళాడు. ఆ తరువాత

ఆ ప్రాచేతసులు ఆ మారిషను వివాహం చేసుకొన్నారు. వారికి ధైర్యవంతుడు, బ్రహ్మతో సమానుడు అయిన దక్షప్రజాపతి పుట్టాడు.

ఎవరి సంతానం ఈ లోకమంతా ఆవరించిందో ఆ దక్షుడు, కుండలో నీటిని సంపూర్ణంగా నింపినట్లుగా ఈ భూమండలమంతటా తన సంతానాన్ని పుట్టించాడు.

కూతురంటే ఇష్టపడే దక్షప్రజాపతి తన ఆత్మశక్తితో కొన్ని జీవరాశుల్ని పుట్టించాడు. మరికొన్ని జీవరాసుల్ని సయంగా కన్నాడు. వీటితోపాటు కొన్ని ఆకాశగమనం కలవి, మరికొన్ని భూమిపై తిరుగాడేవి, అడవుల్లో సంచరించేవి, నీళ్లలో జీవించేవి, రాత్రిళ్లు తిరిగేవి, పగటిపూట సంచరించేవి అయిన జీవులను, జంతువులను దక్షుడు పుట్టించాడు.

దక్షుడు నిశ్చలమైన బుద్ధితో దేవ, రాక్షస, మానవ, యక్ష, కిన్నర, నాగ, గరుడ, పక్షులను, వృక్షాలను, పర్వతాలను ఇలా వరుసగా అనేక జీవ, అజీవ జాతులను క్రమంగా సృష్టించి విశాలమైన యశస్సును సంపాదించాడు.

దక్షుడు ఈ విధంగా పలురకాలుగా, అనేక విధాలైన, జీవజాలాన్ని సకల లోకాలలోను ఆవిర్భవింపజేసినప్పటికీ ఏ కారణంచేతనో తృప్తినిమాత్రం పొందలేకపోయాడు.

ఈ విధంగా ప్రాణుల సృష్టితో నిండిపోయిన లోకాన్ని చూచి దక్షుడు బాధపడి ఇంకా సృష్టి చేయాలన్న కోరికను వదిలిపెట్టి పరమ పురుషుని ఆశ్రయించాలని తలచాడు.

ఈ విధంగా తాను చేసిన సృష్టి తనకే సంతృప్తి కలిగించనందువల్ల దక్షప్రజాపతి బాధపడుతూ శ్రీహరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నవాడై

ఆనందకరమైన, దుఃఖహరమైన, శబరస్త్రీల శృంగారచేష్టలతో కూడిన వీక్షణాలతో వివిధసుఖాలకు ఆస్పదమై ఒప్పుతున్న వింధ్య పర్వత ప్రాంతం వద్దకు వెళ్ళాడు.

దక్షుడు వింధ్య పర్వతం లోయలో సకల పాపహరమైన “అఘమర్షణం” అనే తీర్ధం చేరి అందు నిత్యం యజ్ఞకర్మలు

చేస్తూ నిష్టగా అతి తీవ్రమైన తపస్సు చేశాడు. దానికి సంతోషించి సాక్షాత్కరించిన శ్రీహరిని 'హంసగుహ్యం' అనే శ్రేష్ఠమైన స్తోత్రంతో ఆ ప్రజాపతి ఇలా స్తుతించాడు.

('అఘమర్షణం'= పాపపరిహారకమైంది.)


దక్షుడు కావించిన హంసగుహ్యం బను స్తవరాజము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...