Tuesday, April 7, 2026

Lord Krishna swallowing a fire (Karchichu) and saving the cows and cowherds - శ్రీ కృష్ణుండు దావాగ్నిని మ్రింగి గో గోపకసంఘమును కాపాడుట

శ్రీ కృష్ణుండు దావాగ్నిని మ్రింగి గో గోపకసంఘమును కాపాడుట

ఈ విధంగా గోపాలురు ఆటల సందడిలో మునిగి ఉండగా, ఆవులు ఆ అడవిలో ఉన్న రకరకాల పచ్చికలు మెస్తూ మేస్తూ దూరంగా ఉన్న మరొక అడవిలో ప్రవేశించాయి. అంతలో అక్కడ కార్చిచ్చు చెలరేగింది. ఆ వేడికి అవి తట్టుకోలేక వణికిపోయి, దాహంతో అంబారవాలు చేస్తూ ఆక్రోశించగా

ఆ గొల్లకుఱ్ఱవాళ్లు అందరూ ఆర్తిగావున్న ఆవుల మొరలను ఆలకించారు. కుఱ్ఱతనంచేత నిమగ్నమైన ఆటలలోని ఆసక్తిని విడిచిపెట్టి, ఆవులున్న చోటుకి వేగంగా బయలుదేరారు. ఆవుల కాళ్లగిట్టల చేత నలిగి, దంతాలచేత కొరకబడి దారిలోపడి ఉన్న గడ్డి తునుకల ఆనవాళ్లనుబట్టి వెంటనే ఆ ఆవులు వెళ్లినదారిలో వెళ్లి, దావాగ్ని అంటుకున్న అడవినుండి మంచిచోటుకి ఆవుల్ని నేర్పుతో మళ్లించారు.

శ్రీకృష్ణుడు ఉరుమువంటి గంభీర ధ్వనితో ఆవుల్ని పేరుపేరున పిలిచాడు. ఆ పిలుపులకు 'అంబా' అని మారుపలుకుతూ ఆ ఆవులన్నీ వెనక్కు మళ్లాయి.

ఆ అడవిలో విధివశంవల్ల పుట్టిన కార్చిచ్చు, గాలితీవ్రతకు ప్రజ్వరిల్లి ఆకాశాన్ని అంటుతోంది. కొండలు చెట్లు అనే తేడా లేకుండా అన్నింటినీ కాల్చివేస్తూ అన్ని వైపులా అలము కొంది. అది చూచి గొల్లపిల్లల గుండెలు గుభిల్లుమన్నాయి. చచ్చిపోతామేమో అని భయం పట్టుకున్నది. బలరామునితో కలిసి ఉండే శ్రీకృష్ణునికి సాష్టాంగపడుతూ నమస్కరించి, వారు ఈ విధంగా విన్నవించారు.

ఓ కృష్ణా! చూడు. ఆ కార్చిచ్చు తన పొగలతో ఆకాశాన్ని ఆవరించింది. భయంకరంగా పెద్ద పెద్ద నిప్పురవ్వల్ని విరజిమ్ముతోంది. పెద్ద పెద్దమంటలు పైపైకి ఎగసి లోకాలన్నిటినీ కాల్చి పారేస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి.

చంద్రునివలె చల్లనివాడవయి ఆహ్లాదం కలిగించె కృష్ణా! తండ్రీ! నీ బంధువులకు కష్టాలు కలుగవు కదా! మేమంతా నీ బంధువులమే కదా! నీ సేవ చేయడం తప్ప మాకు ఇంకేమీ తెలియదే. కానీ నేడేమిటి ఈ దురవస్థ? ఈ కార్చిచ్చు నుండి ఎలా బయటపడగలం? అన్నివైపులా మంటలు కమ్ముకొనడంచేత ఆపదనొంది అలమటించే మమ్మల్ని చూచి రక్షించుము.

ఈ విధంగా గొల్లపిల్లలంతా కృష్ణుని ప్రార్ధించారు. ఆ తర్వాత

చుట్టాలయిన గొల్లవారందరు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు. విశ్వమంతా తన రూషమే అయిన శ్రీకృష్ణుడు వారితో 'బంధువులార మీరు మీ కళ్లు మూసుకోండి. తిరిగి తెరిచే లోపున ఈ కార్చిచ్చును అణచివేస్తాను' అని అన్నాడు. గొల్లలంతా అలాగే చేశారు. శ్రీకృష్ణుడు పెచ్చుపెరిగిన కార్చిచ్చును పట్టుకొని వేడుకగా నోటితో త్రాగేశాడు.

శ్రీకృష్ణుడు ఈ విధంగా తన యోగమహిమచేత కార్చిచ్చును త్రాగివేసి ఆ గొల్లవారందరిని నిమిషంలో భాండీరకమనే పేరుగల వటవృక్షం క్రిందికి చేర్చాడు. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశాన్ని కళ్లారా చూస్తూ వారు శ్రీకృష్ణునియోగశక్తివల్ల కార్చిచ్చు అణగిపోయింది గదా! అని అతణ్ణి ప్రశంసిస్తూ, తమ మనస్సులలో...

'ఒక సామాన్య మానవునికి ఇటువంటి దావాగ్నిని ఆర్పివేసే శక్తి ఉంటుందా? ఈ వేళ శ్రీకృష్ణుడు ఈ కార్చిచ్చును ఆర్పివేసి మనల్ని అందరినీ రక్షించాడు. ఇతడు మామూలు గొల్లపిల్లవాడు కాదు. బ్రహ్మగాని విష్ణువుగాని, రుద్రుడుగాని అయ్యుంటాడు' అని ఆ గొల్లపిల్లలందరు తమ తమ మనస్సులలో

ఈ విధంగా గొల్లపిల్లలు ఊహించారు. సాయంకాలం శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి, వేణువు ఊదుతూ, వారిచే ప్రశంసలు అందుకొంటూ మందలో ప్రవేశించాడు. ఆ సమయంలో

శ్రీకృష్ణుడు దగ్గరగా లేని ఒక నిముషం అయినా గోపికలకు నూరు యుగాలుగా అనిపించింది. అందువల్ల వారు గబ గబా వచ్చి శ్రీకృష్ణుణ్ణి చూచి, పరమానందం పొందారు.

అప్పుడు అడవినుండి వచ్చిన గోపాలకులు ఇళ్ల దగ్గరున్న పెద్దవారితోను, ఆడవారితోను బాలరామకృష్ణుల రాక్షస సంహారాది మానవాతీత చేష్టలను గురించి చెప్పగా, వారు ఆ బలరామకృష్ణులు అనేక ఘనకార్యాలు చేయడానికి భూమిమీద అవతరించిన దేవతా శ్రేష్ఠులు అనీ, సామాన్య మానవులు కారనీ భావించారు.

వర్షర్తు వర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Balabhadra (Balarama) killing the demon Pralambasura - బలభద్రుండు ప్రలంబాసురుని వధించుట

బలభద్రుండు ప్రలంబాసురుని వధించుట

ఈ విధంగా బలరామకృష్ణులు నదీనదాలు, సరస్సులు, కొండలు, సెలయేళ్లు, మడుగులు, పొదలు మొదలయినవానికి సమీపంలో ఎక్కడెక్కడ చిక్కని పచ్చికబయళ్లు ఉన్నాయో అక్కడంతా ఆవులను మేపుతున్నారు. అపుడు ప్రలంబుడు అనే పేరుగల బలవంతుడయిన రాక్షసుడు వారిని బాధించడం కోసమని గోపబాలునిరూపంలో వచ్చి, వారిలో కలిసిపోయాడు. సర్వజ్ఞుడయిన శ్రీకృష్ణుడు ఈ సంగతి తెలిసికూడ తెలియనట్టుగా

అపుడు శ్రీకృష్ణుడు ప్రలంబాసురుణ్ణి నమ్మించి చంపడంకోసం, వానితో రమ్మని, పొమ్మని ఆటలు ఆడుతూ విడవలేనట్లుగా స్నేహం చేశాడు.

శ్రీకృష్ణుడు ప్రలంబాసురునితో ఈ విధంగా స్నేహం చేస్తూ, మిగిలిన గొల్లవారితో ఈ విధంగా అన్నాడు.

మనకు కాలక్షేపం అవడం లేదు. అందుకని మనమందరం ఒకచోట చేరి, రెండు పక్షాలుగా విడిపోయి, రాళ్లను లక్ష్యాలుగా ఏర్పరచుకొని బంతు లాడుదాం. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో తేల్చుకొందాం రాండి.

ఈ రీతిగా అనుకొని శ్రీకృష్ణుడు బలరాముడు చెరొక పక్షానికి ముఖ్యనాయకులుగా నిలబడ్డారు. మిగిలిన గొల్లపిల్లలందరు రెండు చిన్న జట్లుగా చీలి, ఆ యిద్దరివైపు చేరారు. గడ్డితో, కొయ్యలతో, రాళ్లతో లక్ష్యాలు ఏర్పరచుకొని, వాటిల్ని బంతులతోను, రాళ్లతోను కొడుతూ, కొట్టినవారు నెగ్గినట్లు, కొట్టలేనివారు ఓడినట్లు నిర్ణయం చేసికొన్నారు. ఓడినవారు నెగ్గిన వారిని భుజాలమీదికి ఎక్కించుకొని మోయాలి. ఇదే ఆటతీరు! ఈ విధంగా ఆడుతున్నారు. అపుడు శ్రీకృష్ణుడు బలరాముడికి ప్రలంబాసురుడు మారువేషంతో వచ్చి తమలో ఒకడుగా చేరిన విషయం రహస్యంగా చెప్పాడు. గొల్లలంతా ఆవుల్ని తోలుకొంటూ వెళ్లి 'భాండీరకము' అనే పేరుగల మఱ్ఱిచెట్టు క్రిందికి చేరారు. ఆటలో ఓడిన శ్రీదాముడు నెగ్గిన శ్రీకృష్ణుణ్ణి, అలాగే భద్రసేనుడు వృషభుణ్ణి, ప్రలంబాసురుడు బలరాముణ్ణి భుజాలమీది కెక్కించుకొని మోస్తున్నారు. ఆ సమయంలో

పూర్వం మహాబలవంతుడయిన తృణావర్తుడు శ్రీకృష్ణుణ్ణి సంహరించాలని వచ్చి అతణ్ణి ఆకాశంలోనికి ఎత్తుకొనిపోయి, భరించలేక చివరికి అతనిచేతిలోనే ప్రాణాలు విడిచిపెట్టాడు. కాబట్టి శ్రీకృష్ణుణ్ణి ఎత్తుకొనిపోవడం తెలివైన పని కాదని భావించి, రాక్షసాంతకుడైన బలరాముణ్ణి తేలికగా చంపవచ్చని ప్రలంబాసురుడు అనుకొని అతణ్ణి కొండ దాటించి తీసుకొనిపోయాడు.

ఈ విధంగా ఆటకోసం వాహనంగా మారిన ప్రలంబాసురుడు బలరాముణ్ణి తీసుకొనిపోతూ ఉండగా

ప్రలంబాసురుడు బలరాముణ్ణి మోసికొని పోతూ ఉండగా బలరాముడు మహాపర్వతమంత బరువు పెరిగినాడు. బలరాముణ్ణి మోయలేక రాక్షసుని గమనవేగం తగ్గింది. దానితో ఇంక లాభం లేదని వాడు మానవరూపం విడిచిపెట్టి తనదైన భయంకరమైన రాక్షసరూపం ధరించాడు. బంగారు కడియాలతో అలంకరింపబడి, మెరుపుతీగలతోకూడిన చంద్రబింబంలాగా ప్రకాశిస్తున్న బలరాముణ్ణి ఎత్తుకొని, ఆ రాక్షసుడు నీలిమేఘంలాగా కన్పిస్తూ వెళ్లాడు.

ఆ ప్రలంబాసురుని మూపుమీద బలరాముడు ఏమరుపాటుకు లేకుండ కూర్చుండి, వాణ్ణే గమనిస్తున్నాడు. బంగారంతో చేసిన రత్నాలు పొదిగిన కిరీటంతోను, చెవులకు పెట్టుకొన్న కుండలాలతోను వాని శిరస్సు ప్రకాశిస్తోంది. బొమముడితో కూడిన కళ్లు, నోటిలో కోరలు భయంకరంగా కనబడుతున్నాయి. పొగరెక్కి పరాక్రమానికి నిలయమా అన్నట్లుగా ఉన్నాడు.

బలరాముడు చూశాడు. వీడు రాక్షసుడా అని సందేహించాడు. అయినా భయపడకుండా

ఆ బలరాముడు తనను ఆకాశంలో వేగంగా తీసికొనిపోయే ప్రలంబుడితల పగిలేలా వెంటనే గట్టిగా వేగంగా బలంగా పిడికిలితో పొడిచాడు.

బలరాముని పిడికిటిపోటుతో ప్రలంబాసురుని తల పగిలింది. శరీరంలో ఉన్న కన్ను ముక్కుమొదలయిన నవరంధ్రాలనుండి నెత్తురుకారింది. చివరకు వాడు మొర్రో అని అరుస్తూ - దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టడంచేత కూలిన పర్వతంలాగ నేలకూలాడు.

ఆ గొల్లవారు ఈ సంఘటన చూచి 'బలే! బలే! మన బలరాముడు ఒంటరిగా చాలా బలవంతుడైన రాక్షసుణ్ణి ఒక్కదెబ్బతో చంపేశాడు. ఇది ఎంత ఆశ్చర్యకరం' అనుకున్నారు. ఏ దెబ్బ తినకుండా వచ్చిన బలరాముణ్ణి చూచి, చచ్చిన తమ తోబుట్టువు బ్రతికి వస్తే ఎలా సంతోషిస్తారో అలా సంతోషించారు. అతణ్ణి సత్కరించి ఎన్నో దీవెనలిచ్చారు.

బలవంతుడయిన ప్రలంబాసురుడు బలరాముని పిడికిలిపోటుతో చచ్చాడు. ఇంక మనం సుఖంగా బ్రతుకవచ్చు నని ఇంద్రాది దేవతలందరూ సంతోషంతో బలరాముని మీద పూలవాన కురిపించారు.

శ్రీ కృష్ణుండు దావాగ్నిని మ్రింగి గో గోపకసంఘమును కాపాడుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Grishamarthu Varnana - గ్రీష్మర్తువర్ణనము

గ్రీష్మర్తువర్ణనము

గ్రీష్మ ఋతువులో పగళ్లు పొడవవుతున్నాయి. సూర్యుడు ఉత్తరాయణంలో సాగుతున్నాడు. అంతకంతకు ఎండ చుఱ్ఱుమనిపిస్తోంది. వేడిగాడ్పులు వీస్తున్నాయి. నేలమీదనుండి దుమ్ములేచి ఆకాశంలో వ్యాపిస్తోంది. నదులు, సరస్సులు ఎండిపోయాయి. బాటసారులు చలివేంద్రాలలో చతికిలబడుతున్నారు. పాములు పందిళ్ల చాటుకు చేరి దాగుకొంటున్నాయి. చెట్లనుండి పూవులు, ఆకులు రాలిపోతున్నాయి. దంపతులకు రతిమీద ఆసక్తి పెరిగింది. సమస్తప్రాణికోటికి బాధ కలిగించే వేసవిరాకవల్ల అడవులు అంటుకొని కాలిపోతున్నాయి.

బ్రహ్మదేవుడు వేసవికాలంలో బ్రహ్మాండమనే కుండను సలసలమరిగే నీటితో నింపాడా అన్నట్లుగా ప్రజలు ఉష్ణబాధతో కలగుండు పడిపోతున్నారు.

ఈ విధంగా భయంకరమైన వేసవికాలం వచ్చింది. మహానుభావులయిన బలరామకృష్ణులు అక్కడ నివసిస్తూ ఉండడంవల్ల వేడిగాడ్పులు లేకుండా చల్లగా ఉంది. కొండలమీదనుండి ఎడతెగకుండ సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి. వాటినుండి పుట్టే నీటితుంపరలు తెరలు తెరలుగా వస్తూ ఉంటే అక్కడి చెట్టు, తీగలు, చిగురించి, పూలు పూస్తున్నాయి. ఆ పూలవాసనలు గాలులతో కలిసి అన్నివైపులా వ్యాపిస్తున్నాయి. అచటి చెరువులలోను, నదులలోని లోతైన మడుగులలోను పూచిన తామరపువ్వులు, కలువలు పిల్లగాలులకు ఇటూ అటూ తలలూపుతున్నాయి. నదుల మడుగులలోని అలలనుండి జలకణాలు ఎగిరివచ్చి, సమీపప్రదేశాల్ని బురదబురదగా మారుస్తున్నాయి. ఆ బురదలో పచ్చికలు, పొదరిళ్ళు పెరుగుతున్నాయి. అక్కడ అందమైన మృగాలు, పక్షులు సంచరిస్తున్నాయి. ఆ బృందావనం అంతా జనమనోహరంగా ఉండి, ఇది వేసవికాలం కాదు, వసంతకాలమే అన్న భావనను కలిగిస్తోంది. అట్టి వేసవిలో

ఆ బృందావనంలో కోకిలల కూతలు, చిలుకల కలకలాలు, నెమళ్ల కేకలు, తుమ్మెదల ఝంకారాలు వినసాంపుగా ఉన్నాయి.

ఆ యమునా నదిలోను, ఆ వనంలోని అక్కడి చెరువులలోను రేగిన కెరటాలు అక్కడి తామరపూలను తడుపుతున్నాయి. తడిసినవి, సువాసనలను వెదజల్లేవి అయిన ఆ తామరపూల మీదనుండి వీచినగాలులు ఆ చల్లదనాన్ని పరిమళాన్ని మోసికొనివచ్చి అక్కడివారికి అడవి వేసవిలో అంటుకొనడంవల్ల కలిగిన తాపాన్ని పోగొట్టాయి.

ఈ విధంగా వసంతఋతుశోభతో మనోహరంగా ఉన్న బృందావనానికి బలరామకృష్ణులు ఆవులను తోలుకొని వెళ్లారు. మిగిలిన గొల్లపిల్లవాళ్లతో కలిసి, పరిహాసాలాడుకుంటూ, ఎగతాళి చేసుకుంటూ, పెద్ద పెద్ద కేకలువేస్తూ, ఎవరయినా మీదికి వస్తూ ఉంటే ప్రక్కకు తప్పుకొనిపోతూ, గిరగిర తిరుగుతూ, చెట్లసందులలో దూరుతూ, దాగుడుమూత లాడుతూ, పాటలు పాడుతూ, పిల్లనగ్రోవులు ఊదుతూ, నాట్యంచేస్తూ, కాళ్లు తడబడినట్లుగా ప్రక్కకు ఒరుగుతూ, కుప్పిగంతులు వేస్తూ చప్పట్లు కొడుతూ, పైకెగిరి కప్పల్లా దూకుతూ, ఉసిరికాయలను మారేడుకాయలను పైకి ఎగురవేస్తూ, చెట్లకొమ్మలు ఊపుతూ, జంతువుల్ని బెదిరిస్తూ, తేనెపట్టులను చిందరవందర చేసి తేనెటీగలను ఎగురగొడుతూ, తేనెలు త్రాగుతూ, సోలిపోతూ, గురుశిష్యుల్లా నటిస్తూ వారికి తగిన చేష్టలు చేస్తూ, పిల్లజుట్లు ముందుకు వేసికొని పిడికిళ్లతో పొడుచుకొంటూ, పందేలు కాసుకొంటూ, పిట్టల్లా అరస్తూ, చాలావిధాల వేషాలు వేస్తూ, పైకెగిరి తన్నుతూ, యజమానుడు సేవకుడు, మిత్రుడు శత్రువు అనేవిధంగా కల్పించుకుంటూ, ఉత్సాహంతో ఎన్నోవిధాలుగా వినోదించారు. ఆ ఆటల సందర్భంలో

మా పక్షానికి బలరామకృష్ణులే రాజులు అనీ ఎగిరి గంతులువేస్తూ, కేకలుపెడుతూ, బలరామకృష్ణులకు సంతోషం కలిగిస్తూ వారిని తీగలతో చేసిన అందలాల మీద కూర్చుండ బెట్టుకొని మోస్తున్నారు.

ఆ గొల్లపిల్లలంతా ఉత్సాహంగా, ఆడుతూ బలరామకృష్ణుల వెనుక నడుస్తూ వారిని వందిమాగధులవలె స్తుతిస్తున్నారు.

ఆ ఆడవిలో చెట్ల నీడలలో గొల్లపిల్లలందరు గానం చేస్తూ ఉంటే, యశోదకొడుకయిన శ్రీకృష్ణుడు వారి పాటల కనుకూలంగా నవ్వుతూ చేతులు త్రిప్పుతూ నర్తిస్తున్నాడు.

ఆదిశేషుడు బలరాముడుగాను, శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడుగాను భూమిమీద అవతరించారు. వారిని సేవించడం కోసం దేవతలు గోపకులుగా అవతరించారు. బలరామకృష్ణులు నాట్యం చేస్తూండగా గోపకులరూపంలో ఉండే దేవతలు సంతోషించి, వేణువులు, కొమ్ముబూరాలు ఊదుతూ, తలలు త్రిప్పుతూ నటులవలె అభినయిస్తూ బలరామకృృష్ణుల్ని స్తుతిస్తారు.

బలభద్రుండు ప్రలంబాసురుని వధించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Kali's Preface - కాళియుని పూర్వకథ

కాళియుని పూర్వకథ

శుకునిమాటలు విన్న పరీక్షిన్మహారాజు 'కాళియుడు ఏ కారణంచేత పాములకు నివాసస్థానమయిన రమణక ద్వీపాన్ని విడిచిపెట్టి వచ్చాడు? అక్కడ ఇంకా ఎన్నో పాములు ఉంటూ ఉండగా కాళియుడొక్కడే గరుత్మంతునివిషయంలో ఏమి అపరాధం చేశాడు?' అని ప్రశ్నించాడు. అందుకు శుకుడు ఈవిధంగా సమాధానం చెప్పాడు.

పూర్వం పాములకు భయపడిన ప్రజలు, అవి తమజోలికి రాకుండా ఉండడంకోసం, రుచికరంగా ఉండే పదార్దాలు పాముల పుట్టలున్న చెట్ల మొదళ్లవద్ద, వాటికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేవారు. ఆ పాములు తమను చంపి తినే గరుత్మంతుడు తమజోలికి రాకుండా ఉండడంకోసం ఆ నైవేద్యంలో తలకొక కొంత గరుత్మంతునికి సమర్పిస్తూ ఉండేవి. కానీ కాళియుడుమాత్రం 'విషబలం అధికంగా ఉన్న తనను ఎవరు ఏమి చేయగలరులే' అనే పొగరు తలకెక్కి తనవంతులో కాంచెంకూడ గరుత్మంతునికి సమర్పించకుండా తానే తినేస్తూ ఉండేవాడు. అది తెలిసిన గరుత్మంతుడు కోపంతో వీణ్ణి పట్టుకొని, వీని పడగలు, శరీరం చీల్చి చెండాడి, ప్రాణాలు తీస్తానని బయలుదేరాడు.

గరుత్మంతుడు తన బంగారు రెక్కలను ఆడిస్తూ, కాళియుణ్ణి దండించడానికని బయలుదేరి వస్తూండగా, అతని రెక్షలనుండి వేగంగా బయలు వెడలిన గాలి తీవ్రతకు మహాపర్వతాలు కంపించిపోయాయి.

ఈ విధంగా వచ్చిన గరుత్మంతుణ్ణి చూచి, కాళియుడు తలవంచలేదు. సరికదా తన పెద్దపడగలను బాగా విస్తరింపజేశాడు. గరుత్మంతుని రాక చూచి, అప్పటికే తనలో ఉన్నదానికి తోడుగా కొత్తగా విషం ఊరింది. అది కనుకొనలనుండి బయటకు ప్రవహిస్తూ నిప్పురవ్వల్ని రాలుస్తోంది. కాళియుడు నాలుకలను తీవ్రంగా అల్లల్లాడిస్తున్నాడు. ముక్కులనుండి అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. తానే ముందుకు పరుగెత్తుకొని వెళ్లి, గరుత్మంతుణ్ణి గట్టిగా కాటువేశాడు.

కాళియుడు కాటు వేయడంతో గరుత్మంతుడు రెచ్చిపోయాడు. కాళియుణ్ణి తరుముకొని వెళ్లి, బంగారుచాయలు విరజిమ్మే తన ఎడమరెక్కతో అణగగొట్టాడు. దానితో కాళియుని కోరలు విరిగిపోయాయి. నోళ్లనుండి రక్తం కక్కుకొన్నాడు. పడగలు చీలికలు పేలికలు అయిపోయాయి.

ఈ విధంగా గరుత్మంతుని దెబ్బతిన్న కాళియుడు భయంతో పారిపోయివచ్చి, ఈ లోతైన మడుగులో దాగుకొన్నాడు. ఈ సందర్భంలో చెప్పవలసిన వృత్తాంతం మరొకటి ఉంది.

పూర్వం సౌభరి అనే ముని ఈ మడుగులో తపస్సు చేసికొంటూ ఉండేవాడు. ఒకనాడు గరుత్మంతుడు ఆకలితో వచ్చి, ఈ మడుగులో ఉన్న చేపలరాజును ఒడిసి పట్టుకొని, భక్షించాడు. అది చూచిన మిగిలిన చేపలన్నీ దుఃఖంతో ఉసూరుమంటూ ఉండడం చూచిన సౌభరికి దుఃఖం కలిగింది. వెంటనే కోపం వచ్చింది. 'ఇక మీదట ఎప్పుడయినా గరుత్మంతుడు ఈ మడుగులోకి వచ్చి, ఇందులో ఉన్న చేపలను తినాలని అనుకొన్నాడో, వెంటనే మరణిస్తాడు' అని శపించాడు. అందువల్ల కాళియుడు గరుడునిబాధ లేకుండా చేసుకొనడంకోసం ఈ మడుగులోనికి వచ్చి, దాగుకొన్నాడు. ముని శపించిన విషయం ఒక్క కాళియునికి మాత్రమే తెలుసు. మిగిలిన పాములకు తెలియదు. అందువల్లనే అవేవీ ఈ మడుగులోనికి రాలేదు.

సౌభరిముని ఇచ్చిన శాపంవల్ల గరుత్మంతుడు ఆ మడుగులోనికి రాలేడు అనే ధైర్యంచేత, కాళియుడు ఆ మడుగులోనికి ప్రవేశించాడు. అతని మూలంగా ఆవులకు, మనుష్యులకు ఉపద్రవం కలుగకుండా ఉండడంకోసం, శ్రీకృష్ణుడు అతణ్జి మడుగునుండి బయటకు వెళ్లగొట్టాడు. కాళియుడు సమర్పించిన దివ్యమైన గంధాలు, వస్త్రాలు, రత్నాభరణాలు ధరించిన శ్రీకృష్ణుడు మడుగులోనుండి బయటకు వచ్చాడు. పోయిన ప్రాణం తిరిగివస్తే ఇంద్రియాలకు చైతన్యం కలిగినట్లుగా, మరణించాడనుకొన్న శ్రీకృష్ణుడు తిరిగి రాగానే యశోద, రోహిణి మొదలయిన ఆడువారు, నందుడు, సునందుడు మొదలయిన మగవారు, తేరుకొని, తెప్పరిల్లి, పరమానందాన్ని పొందారు. బలరాముడు సంతోషంతో శ్రీకృష్ణుణ్ణి కౌగిలించుకొన్నాడు. అప్పుడు

శ్రీకృష్ణుడు తిరిగి రావడంతో ఆబోతులు గర్వంతో రంకెలు వేశాయి. లేగదూడలు అటూ ఇటూ చెంగుచెంగున దూకాయి. ఆవులు సంతోషంతో పొంగిపోయాయి. చెట్లు చిగురించాయి.

ఓ పరీక్షిన్మహారాజా! అప్పుడు బ్రాహ్మణదంపతులు నందుణ్ణి చూచి, 'నీ కొడుకు పామునుండి విడుదల పొందాడు, నీ భాగ్యం స్థిరమైంది. గొప్పది. దానికి తిరుగులేదు' అని ఆశీర్వదించారు.

యశోద కృష్ణుణ్ణి ఒడిలో కూర్చుండబెట్టుకొని, తలను ప్రేమతో నిమురుతూ, నాయనా! నిన్ను ఆ భయంకరమైన పాము కరచినపుడు నన్ను ఏమని పిలిచావో గదా! భయపడిపోలేదు గదా! రా నాయనా! అని ప్రేమతో కన్నీరు కారుస్తూ శ్రీకృష్ణుని శిరస్సును మూర్కొంటూ ప్రేమతో అతణ్ణి కౌగిలించుకొంది.

ఈ విధంగా జరిగినదానికి సంతోషించి ఆ సాయంకాలం గొల్లలంతా ఆ యమునానది ఒడ్డు మీదే ఉండిపోయారు. ఆకలిదప్పికలకు తట్టుకోలేక అలసి, సాలసి అక్కడే ఆలమందలతో పరుండిపోయారు. అర్ధరాత్రంలో కార్చిచ్చు పుట్టి విశాలమైన ఆ అడవిని అన్నివైపులా దహిస్తూ వచ్చింది. గొల్లల ఒళ్లు కాలాయి, దానితో ఉలిక్కిపడి, లేచి, వారు మాయా బాలకుడుగా అవతరించిన శ్రీకృష్ణుణ్ణి శరణువేడి ఈ విధంగా అర్ధించారు.

కమలాలవంటి కన్నులు గల కృష్ణా! మహాపరాక్రమా బలరామా! ఈ కార్చిచ్చు చుట్టుముట్టి మమ్మల్ని అందరినీ కాల్చివేయడానికి దూసుకొని వస్తోంది. పొగలతో, నిప్పురవ్వలతో, మంటలతో భయంకరంగా ఉంది. మాకు మీరు తప్ప వేరుదిక్కు లేదు. ఈ కార్చిచ్చును అణచి, మమ్మల్ని రక్షించండి.

ఓ కృష్ణా! నిన్ను నమ్మినవారికి ఆపదలు కలుగవు. భయంకరంగా అన్నివైపుల నుండి కమ్ముకొని వచ్చే ఈ కార్చిచ్చు మా జోలికి రాకుండా చెయ్యి.

ఈ విధంగా మొర పెట్టుకుంటున్న గొల్లలందరిమీద శ్రీకృష్ణుడు జాలి చూపించాడు. సర్వలోకాలకు ప్రభువయినవాడూ అనంతమైన సామర్థ్యం కలవాడూ, కనుక ఆ కార్చిచ్చును మంచినీళ్లప్రాయంగా తాగేశాడు. గొల్లలంతా పదిదిక్కులు పిక్కటిల్లేలాగ అతని గొప్పతనాన్ని వర్ణిస్తూ పాటలు పాడారు. పిమ్మట కృష్ణుడు ఆవులమందలతోను, బంధువులతోను కలిసి నెమ్మదిగా నడచుకొంటూ వ్రేపల్లెకు వెళ్లాడు. ఈ విధంగా బలరామకృష్ణులు మాయామానుషరూపంతో వినోదిస్తూ ఉండగా

గ్రీష్మర్తువర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Kaliya's wives Nagaamganalu praying to Lord Krishna - కాళియుని భార్యలైన నాగాంగనలు శ్రీకృష్ణుని నుతించుట

కాళయుని భార్యలైన నాగాంగనలు శ్రీకృష్ణుని నుతించుట

ఈ విధంగా శ్రీకృష్ణుడు కాళియుని పడగలమీద తాండవం చేయడంచేత, తీవ్రమైన ఆతని కాలితాపులకు కాళియుని పడగలన్నీ చితికిపోయాయి. కాళియుడు బాధతో కదలిక లేక శవంలాగ పడి ఉన్నాడు. అటువంటి దీనావస్థలో ఉన్న తమభర్తను చూచి, కాళియునిభార్యలమనస్సులు శోకంతో కలవారపాటుకు లోనయ్యాయి. 

కాళియుని భార్యలు శ్రీకృష్ణుణి దర్శించడానికి బయలుదేరారు. ఆ తొందరలో ముడుచుకొన్నవారి కొప్పులు విడివడి పోయాయి. అలంకారాలు చెదరిపోయాయి. పాలిండ్లబరువుకు తీగలాగ సన్నంగా సుకుమారంగా ఉన్న నడుములు అల్లాడిపోయాయి. పైటకొంగులు జారిపోయాయి. దిక్కుతోచక, భ్రాంతితో కలవరపడిపోయారు. ఏడుస్తూ ఉండే తమ పిల్లల్ని ముందుంచుకొని, జంకుగొంకులకు లోనవుతూ, భక్తిభావంతో, మంచి గుణాలు కలవాడయిన శ్రీకృష్ణుణ్ణి దర్శించారు.

కాళియునిభార్యలు శ్రీకృష్ణుణ్ణి దర్శించి, సాష్టాంగనమస్కారాలు చేసి, నుదుటిమీద చేతులు జోడించి, ఈ విధంగా విన్నవించుకొన్నారు.

సకలసద్గుణసంపన్నుడవైన ఓ శ్రీకృష్ణా! దుష్టశిక్షణ చేయడంకోసం భూమిమీద అవతరించినవాడివి నువ్వు, దుర్మార్గుడయిన ఈ కాళియుణ్ణి శిక్షించడం గుణమే కాని దోషం కాదు.

సర్వలోకాలకు ఆధారభూతుడవయిన ఓ పరమేశ్వరా! శత్రువుల కొడుకులయందు గూడ సమభావంతో దయ చూపే వాడవు. అట్టి నీకు ఎవరిమీదను పగ ఉండదు. దుష్టుల్ని శిక్షించడం లోకసంరక్షణంకోసం తప్ప మరేమీ కాదు.

విషం నోట్లోను, మనస్సులో కోపం ఉంచుకొని తిరిగేవారం అయిన మమ్మల్ని శిక్షించడం వాస్తవానికి దండనం కాదు. ఒకవిధంగా మాకు మేలు కలిగించడమే. నీవు చేసిన ఈ పనితో మాకు విషం కలవారమనే పొగరు దిగిపోయింది.

ఈ కాళియసర్పరాజు పూర్వజన్మంలో ఎంతగొప్పతపస్సు చేశాడో? ఎటువంటి పుణ్యకార్యాలు ఆచరించాడో? ఎటువంటి సత్యవాక్యాలు పలికాడో? ఎంతటి మహానుభావులకయినా ఒనగూడని పరమేశ్వరుడవైన నీవు వేడుకతో ఈతని పడగలమీద నాట్యం చేశావంటే అదెంతటి అదృష్టమో గదా!

ఓ పరమేశ్వరా! స్త్రీలందరిలోను శ్రేష్ఠురాలయిన లక్ష్మీదేవి నిన్ను పొందడంకోసం, చాలకాలం తపస్సుచేసి, ఎన్నో గొప్ప గొప్ప నోములు నోచి, మహాతేజస్సుతో ప్రకాశించే నీ పాదాల ధూళిలో ఒక కణాన్ని మాత్రమే స్పృశించే అర్హతను సంపాదించుకొనింది. ఈ కాళియుడు ఏ తపస్సు చేయకుండానే, ఏ నోములు నోచకుండానే, నీ పాదాల పూర్ణస్పర్శకు నోచుకొన్నాడంటే ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం!

ఓ శ్రీకృష్ణా! మంచివీ, చక్కనివీ అయిన నీపాదాల ధూళికణాలు సోకాయి అంటే, ఇంక వారికి పుట్టుక ఉండదు. అట్టివారు పూర్ణకాములయి, ఇంక కోరదగినదేదీ లేని కృతార్థులౌతారు. అందువల్ల వారు దేవేంద్రపదవిని గాని, బ్రహ్మపదవినిగానీ, మహారాజపదవినిగానీ, పాతాళలోకాధిపత్యాన్ని గాని, హఠయోగ రాజయోగ సిద్ధులను గాని వేటినీ అంగీకరింపరు.

ఈ కాళియుడు తమోగుణం కలవాడు. క్రోధం కలవాడు. అయినప్పటికిని, చావుపుట్టుకలకు, కామక్రోధాదులకు, సుఖదుఃఖాలకు లోనవుతూ ఆలుబిడ్డలతో జీవించే సంసారు లెవ్వరికీ కోరడానికి కూడ శక్యం కానట్టి శ్రీకృష్ణపాదస్పర్శరూపమైన ప్రయోజనాన్ని ప్రత్యక్షంగా పొందింది.

దేవా! నీవు నశించే స్వభావంగల జీవులందరిలోనూ నశింపనివాడివై, అక్షరరూపుడవయి అంతర్యామి అనే పేరుతో ఉన్న పరమపురుషుడివి. దేశకాలవస్తువుల పరిమితులకు లోబడని మహాత్ముడవు. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలకును, వానిచే నేర్పడిన సకలవస్తు సముదాయాలకును ఆధారమైనవాడగుటవలన భూతావాసుడివి. పంచభూతాలే రూపంగా గలవాడవగుటచే భూతశబ్దమునకు అర్థమైనవాడివి. అన్ని కారణములకు కారణమయిన మూలప్రకృతికి గూడ అతీతమైన పరమాత్ముడవు. ఆత్మజ్ఞానం, ప్రాపంచికజ్ఞానంకూడ పరిపూర్ణంగా కలవాడివి. సత్త్వరజస్తమోగుణసంబంధం లేనివాడివి. పుట్టుట, పెరుగుట, రూపం మారుట, ముదురుట, తరుగుట, చచ్చుట అను ఆరువిధాలయిన వికారాలు లేని పరబ్రహ్మవు. మాయాశక్తిని అధీనంలో ఉంచుకొని, సృష్టి స్థితిలయాలు కొనసాగిస్తూ అనంతమైన సామర్థ్యం కలవాడవయి, ఆ మాయతో కొంచెంకూడ సంబంధం లేనివాడివి. అఖండమైన కాలాన్ని సంవత్సరాలు, అయనాలు, ఋతువులు, మాసాలు మొదలయిన భేదాలతో చక్రంలాగ త్రిప్పుతూ ఉన్నవాడివి. కాలస్వరూపుడవు. కాలశక్తికి ఆధారమైనవాడివి. సృష్టిస్థితి సంహారాలనే, కాలవిభాగాలయిన సంవత్సరాదులను గమనిస్తూ కూడ వానితో ఏ విధమైన సంబంధంలేకుండా ఉండే సర్వసాక్షివి. నీకు నమస్కరిస్తున్నాము. ఇంకా

మాయాతీతుడవైన ఓ శ్రీకృష్ణా! ఈ ప్రపంచం అంతా నీ రూపమే. దీనికి సృష్టికర్తవు నువ్వే, ఉదాసీనంగా ఉండి, దీనినంతనూ గమనిస్తూ ఉన్నవాడివీ నువ్వే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలు, వానికి విషయాలయిన శబ్దస్పర్శరూపరసగంధాలు, ప్రాణం, మనస్సు, బుద్ధి, చిత్తం అనే అంతఃకరణ భేదాలు అన్నీ నీ రూపమే. సత్త్వరజస్తమోగుణాలచేత ఆవరింపబడుతూ, నీ అంశలుగా పుట్టిన ప్రాణులకు సుఖదుఃఖానుభవం కలిగించేవాడివి నువ్వే, వాస్తవానికి సత్త్వరజస్తమోగుణాలకు లోబడక, ఏ విధమైన వికారాలు పొందకుండగా, ఇంద్రియాలకు గోచరించకుండా, సూక్ష్మరూపంలో ఏకరూపంగా ఉన్నవాడివి, సర్వజ్ఞుడవు. నీకు నమస్కరిస్తున్నాము. మా మనవి చిత్తగించు.

(కూటస్థుడు - పంచభూతాత్మకమైన శరీరంలోని జీవుణ్ణి నడిపించేవాడు = పరమాత్మ. అంటే ఏ వికారాలూ లేక నిశ్చలంగా ఉండే ఆత్మ కూటము= దాగలి. దీనిపై ఎన్ని వస్తువులు పెట్టి కొట్లూ - ఏ రూపాలుగా మారుస్తున్నా - వాటిగుణం కానీ, మార్పుకానీ చెందక, తన స్థితిలోనే నిర్వికారంగా ఉంటుంది. ఆత్మకూడా - దాగలి వంటిదే.)

ఓ శ్రీకృష్ణా! మాయకు లోబడిన ప్రజలు నిన్నుగురించి అనేకవిధాలవాదాలకు లోనవుతూ ఉంటారు. దేవుడు ఉన్నాడని భక్తులు మొదలయినవారివాదం. అసలే లేడని చార్వాకులు మొదలయినవారి వాదం. ఏకరూపుడు-కాదు అనేక రూపుడు, అన్నీ తెలిసినవాడుకాదు, కొంచెమే తెలిసిన జీవరూపుడు, మాయకు లోబడినవాడు కాదు, మాయకు అతీతుడు. ఈ విధంగా నీ మాయాప్రభావంవల్ల ఎందరో ఎన్నో విధాలుగా వాదిస్తూ ఉంటారు. అన్నివాదాలకు అనుకూలంగా ఉన్నట్లే కనబడుతూ ఉంటావు. పదాలు(సంకేతాలు), వాని అర్ధాలు, వాని స్వభావాలు, వానిలోని తారతమ్యాలు మొదలగువానిచేత సర్వజ్ఞత్వం, అల్పజ్ఞత్వం మొదలయిన మహిమలతో గూడినవాడివి. జ్ఞానసాధనాలయిన చక్షురాదులు అయిన ఇంద్రియాలు నీరూపమే. ఇంద్రియా పేక్షలేని జ్ఞానం ఉన్నవాడివగుటచే పరమాత్మవు. వేదాలను నిశ్శ్వాసరూపంగా వెలువరించావు కనుక వేదాలకు జన్మస్థానం నువ్వే ('శాస్త్రయోనిత్వాత్' - బాదరాయణుని వేదాంతసూత్రం) (యస్య ని
శ్శ్వాసితం వేదాః శ్రుతి). అంతఃకరణ దశా భేదాలయిన అహంకారం - బుద్ధి - మనస్సు- చిత్తం అనే వానికి అధిదేవతలయిన సంకర్షణుడు - వాసుదేవుడు - ప్రద్యుమ్నుడు - అనిరుద్దుడు అను నలుగురు నీ వ్యూహరూపాలవారే. భక్తజనుల్ని రక్షించేవాడివి నువ్వే. జీవులఅంతఃకరణాన్ని ఇంద్రియాలద్వారా విషయాలమీదకు మళ్లిస్తూ ఉంటావు. నిన్ను సేవించేవారికి తగిన ఫలాలు ఇవ్వడంకోసం సత్త్వరజస్తమోగుణాలతో ప్రపంచాన్ని ఆవరించి ఉన్నావు. సాత్త్విక - రాజసిక - తామసిక కర్మలకు తగిన సాత్త్విక - రాజసిక - తామసిక ఫలాలు ఇస్తూ ఉంటావు. జీవుల అంతఃకరణవృత్తులద్వారా తెలియదగిన సత్త్వరజస్తమో గుణాలకు సాక్షివిగా ఉంటూ, జనులకు గోచరించకుండా ఉంటావు. ఊహకందని అభివృద్ధి కలవాడివి కనుక బ్రహ్మవు. నిరాఘాటమైన ప్రవర్తన కలవాడవు. అవ్యక్తం మొదలుకొని సకలస్థావర జంగమ సృష్టికి కారణమైనవాడివి. మనస్సును ఇంద్రియాలద్వారా ప్రవర్తింపజేయడంవల్ల జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు నీవే అధిపతివి. జప మంత్ర యోగాదులచేత స్వాధీనంకాని ఆత్మయందే క్రీడిస్తూ ఉంటావు కనుక ఆత్మారాముడవు. మౌనాన్ని ఆశ్రయించిన వాడవు. స్థూల సూక్ష్మభూతాల గతులు గుర్తిస్తూ, దేనితోనూ సంబంధం లేకుండా ఉంటావు. ఈ ప్రపంచం నీ రూపం కాదు. కానీ సమస్తమూ నీవే. ఈ ప్రపంచంయొక్క స్థితిలయాలకు సాక్షివి నీవే. జ్ఞానాజ్ఞానాలకు నీవేకారణం. నీకు నమస్కారం.

సమస్త జగత్తులకు ప్రభువైన శ్రీకృష్ణా! నీవు యశస్సు, వీర్యం మొదలగు ఆరువిధాలయిన ఐశ్వర్యం కలవాడివి. కాలస్వరూపుడివి. ఏ విధమయిన కోరిక లేకుండానే లీలామాత్రంగా చతుర్ముఖబ్రహ్మ రూపం ధరించి విశ్వసృష్టినీ, విష్ణురూపం ధరించి స్థితినీ, రుద్రరూపం ధరించి నాశాన్నీ చేస్తూ ఉంటావు.

ఓ పరమేశ్వరా! ఈ శరీరాలు ఎంతకూ శాంతిలేనివి. అంతేకాక అజ్ఞానంతో కూడుకొన్న మూర్ఖమైన జన్మలు ఇవి. కాని నీవు ప్రశాంతతను అనుభవిస్తున్న మంచివాళ్లలోమాత్రమే ధర్మానికి మేలు కలిగించేందుకు అనుభవానికి వస్తూ ప్రకాశిస్తూ ఉంటావు.

కృపానిధీ! శ్రీకృష్ణా! నీలో ఏ తప్పు లేదు. తప్పు చేసిన మా భర్తను శిక్షించడం నీ తప్పు కాదు. మా పెనిమిటి ఆలోచనలలోను, చేతలలోనే పొరపాట్లు ఉన్నాయి. లోకంలో కుమారులు ఎటువంటి తప్పు చేసినా తల్లిదండ్రులు క్షమిస్తూ ఉంటారు గదా! రాజులు కూడ తప్పు చేసినవారిని ఒక్కొక్కసారి దండించకుండా విడిచిపెడుతూ ఉంటారు. నీవు జగత్తునకే ఈశ్వరుడవు. దయకు గనివంటివాడవు. అటువంటి నీవు మా భర్తను దయ తలచి కాపాడుమయ్యా!

మా పెనిమిటి మంచివాడని సమర్ధించలేము. ముమ్మాటికీ ఇతడు మూర్ఖుడు. ముక్కోపి,దుర్మార్గుడు. అయినప్పటకీ ఇతణ్ణి నీవు సంహరిస్తే మేము వైధవ్యదుఃఖం అనుభవించవలసి వస్తుంది. దాన్ని మేము భరించలేము. నీవు తప్ప మాకు మరొక దిక్కులేదు. కాబట్టి దయతో మా భర్తను మన్నించి, మా భర్త పడగలమీద కాళ్లతో త్రోక్కడం చాలించి, మాకు పతిభిక్షను ప్రసాదించు స్వామీ!

సర్వలోకాలవారు తమకు ఏ ఆపద వచ్చినా నిన్ను ఆశ్రయించవలసిందే. నీవు భక్తులకు అభయ మిచ్చేవాడివి. లక్ష్మీదేవికి భర్తవు. ఓ కృష్ణా! ఇదిగో చూడు. ఇప్పటికే మా భర్త శరీరం అంతా నలిగిపోయింది. పడగలన్నీ పగిలి పోయాయి. ప్రాణాలు వస్తూ పోతూ ఉన్నట్టుగా సొమ్మసిల్లి పోయాడు. ఇతణ్లి దయతో చూచి, ఇంక బాధించక విడిచి పెట్టవయ్యా!

భక్తులకు కోరిన వరాలిచ్చి అనుగ్రహించే ఓ శ్రీకృష్ణా! మా ప్రాణనాథుని ప్రాణాలు ప్రసాదించి, ఆతనితో మళ్లీ మాకు వివాహం జరిపించు. నీవు జరిపించే ఈ పెండ్లియే శాశ్వతంగా నిలిచేది. శుభాలు కలిగించేది. అంతేగాని మాకు చిన్నప్పుడు జరిగిన పెండ్లి పెండ్లే కాదు. (నిజమే కదా! మనం చేసే పెండ్లికంటే సర్వమంగళప్రదుడైన భగవంతుడు చేసేపెండ్లి శుభప్రదం, శాశ్వతం అవుతుంది. దంపతులు చిరకాలం వర్ధిల్లుతారు)

నీ మీద ఒట్టు పెట్టి మరీ చెబుతున్నాము. ఈనాటినుండి ఇంక ఎవ్వరినీ బాధించడు. ఇంతకు ముందులాగ భయపెట్టి పాపపు పనులు చేయడు. నీ చెప్పుచేతలలో ఉంటాడు. కాబట్టి మా పెనిమిటి ప్రాణాలు మాకు ప్రసాదించవయ్యా!

శరణుచొచ్చినవారిని రక్షించే స్వభావంకల శ్రీకృష్ణుడు - తమ భర్త జీవితాన్ని కోరే కాళియునిభార్యలను అనుగ్రహించాడు. కాళ్లతో తొక్కడం చాలించి, పక్కకు తప్పుకొన్నాడు. దాంతో కాళియుడు తన ప్రాణాల్ని, ఇంద్రియాల్ని పగిలిన పడగల్నీ చాలా కష్టంమీద కూడ తీసికొని, ఆయాసపడుతూ శ్రీకృష్ణునికి నమస్కారం చేసి, పశ్చాత్తాపంతో ఈ విధంగా అన్నాడు.

తామరరేకులవంటి కళ్లు గలవాడివి పరమేశ్వరుడివి, అయిన శ్రీ కృష్ణా! మా నడకలు తిన్ననైనవి కావు. మా నోళ్లలో భయంకరమైన విషం ఉంటుంది. దుర్మార్గులం. కోపం గర్వం కలిగి ఉంటాం. ఇటువంటి మేము మంచివాళ్లం ఎందుకు అవుతాం? ప్రాణులు పుట్టుకతో వచ్చినగుణాలను ఎక్కడయినా విడిచిపెడతాయా? మా మనోవికారాలు అందరికీ తెలిసినవే! సర్వజ్ఞుడవైన నీకు ఇవి వింతగా ఎందుకు కనబడతాయి? మాలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ దయతలచి మాకు ఉపకారం చేశావు.

సమస్తలోకాలకు ప్రభువయిన శ్రీకృష్ణా! అనేకవిధాలయింది ఈ ప్రపంచం. దీనికి నీవు సృష్టికర్తవు. జన్మ మొదలయిన షడ్భావవికారాలు, రూపాలు, శక్తులు, బీజరూపాలయిన సంస్కారాలు, ఆలోచనలు నీవు నిర్మించిన ఈ ప్రపంచంలోని అంశాలే - అన్నీ కూడా నీవే!. మేము కూడ ఆ ప్రపంచంలోని వాళ్లమే. మేము సహజంగా కోపస్వభావం కలవాళ్లం. ఎలాపడితే అలాగ ప్రాకులాడే స్వభావం కలవాళ్లం. మహాయోగులకు గూడ అంతుబట్టనిది నీ మాయ. అటువంటి దాన్ని మేము ఏవిధంగా దాటగలం? నువ్వు సర్వజ్ఞుడివి. మమ్మల్ని రక్షించాలి అనిపిస్తే రక్షించు. శిక్షించాలి అనిపిస్తే శిక్షించు. ఈ సమస్త విశ్వం నీదే. మాది అంటూ ఒకచోటు లేదు. నీవు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాము.

(పుట్టుట, ఉండుట, మారుట, పెరుగుట, తరుగుట, నశించుట అనేవి షడ్భావవికారాలు.)

ఓ శ్రీకృష్ణా! సనకాది మహాయోగీశ్వరులకు కూడా దుర్లభమైన నీ పాదధూళి నాకు లభించింది. నా భాగ్యం ఎంతటిదో కదా! ఇంక నేను ఎక్కడ ఉన్నా నాకు మంచే జరుగుతుంది.

ఈ విధంగా మనవి చేసిన కాళియునిమాటలు విన్న శ్రీకృష్ణుడు, కరుణతో స్థిరనిశ్చయానికి వచ్చి, అతనితో ఇలాగ అన్నాడు.

ఓ కాళియుడా! ఈ మడుగులోని నీటిని ఆవులమందలు, మనుష్యులు త్రాగుతూ ఉంటారు. నీవు ఇంక ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఈ వేళే నీవు -నీ భార్యలు, బిడ్డలు, బంధువులతో కలిసి సముద్రంలోకి వెళ్లిపొండి.

ఓ కాళియుడా! ఎవరైతే నేను నిన్ను శిక్షించిన ఈ కథను, నన్ను మనస్సులో ధ్యానం చేస్తూ ఉదయమూ, సాయంకాలమూ, పారాయణ చేస్తూ, స్తుతిస్తూ ఉంటారో, వారికి ఎప్పుడైనా, ఎక్కడైనా మీ సర్పజాతివల్ల భయం కలుగదు. మీ విషం వారికి ఏవిధమైన హానీ కలిగించదు.

ఈ క్షణంనుండి ఏ మానవులు ఈ యమునలోని కాళిందీ మడుగులో స్నానంచేసి, ఉపవాసం ఉండి, స్థిరభక్తితో నన్నే ధ్యానిస్తూ పూజిస్తూ దేవతలకు, పితరులకు, ఋషులకు తర్పణాలు విడుస్తూ ఉంటారో, వారు సర్వపాపాలనుండి విముక్తులయి, నిర్మలమైన మనస్సు కలవారయి మేలు పొందుతారు.

ఇంతకుమునుపు నీవు రమణక ద్వీపంలో ఉండేవాడవు. గరుత్మంతుడు నిన్ను పట్టుకొని తింటాడేమోననే భయంతో వచ్చి, అతనికి కనబడకుండా ఉండడంకోసం లోతైన ఈ మడుగులో దాగుకొన్నావు. నేను నీ మీద నాట్యం చేయడంవల్ల నా పాదాల ముద్రలు నీ పడగలమీద పడ్డాయి. వాటిల్ని చూచి, గరుత్మంతుడు ఇంక నీ జోలికి రాడు. నిర్భయంగా ఉండు.

ఎవరికీ అంతు చిక్కకుండా విహరించే శ్రీకృష్ణుడు ఈ విధంగా ఆజ్ఞాపించగానే, కాళియుడు అలా చేయడానికి అంగీకరించాడు. తన భార్యలతో కలిసి తాను క్రొత్తవి, దేవలోకంలో మాత్రమే లభ్యమటయ్యేవి అయిన వస్త్రాలు, ఆభరణాలు, మణిసరాలు బహుమతిగా ఇచ్చాడు. తుమ్మెదలకు ఆశ్రయమై, తేనెలు వెల్లివిరిసే నల్లకలువల దండను భక్తితో సమర్పించాడు. భార్యలు, కొడుకులు, స్నేహితులతో కలసి శ్రీ కృష్ణుణ్ణి చాలా పర్యాయాలు స్తోత్రం చేసి, సాష్టాంగ దండప్రణామ ప్రదక్షిణలుచేసి, లేచి నమస్కరించి, శ్రీకృష్ణునివద్ద సెలవు తీసుకొని, సముద్రంలోని ద్వీపానికి వెళ్లిపోయాడు. ఈ ప్రకారంగా

కాళియుణ్ణి యమునానదినుండి దూరంగా సముద్రంలోకి వెళ్లగొట్టడం ఎంతటి గొప్పవారికీ సాధ్యంకాని పని. అటువంటి పనిని శ్రీకృష్ణుడు అలవోకగా చేశాడు. దానితో యమునానది అమృతంవంటి నీటితో అందరికీ ప్రీతిపాత్రమై వెలుగొందింది.

కాళియుని పూర్వకథ

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Vatuka Bhairava - Batuka Bhairava - వటుక భైరవుడు - బటుక భైరవ


వటుక భైరవుడు (బటుక భైరవ)

వటుక భైరవుడు (బటుక్ భైరవ్) శివుని భైరవ రూపం యొక్క సౌమ్యమైన, బాల స్వరూపం. ఈయన సాధకులకు రక్షకుడిగా మరియు సంరక్షకుడిగా ప్రసిద్ధి పొందాడు. ఆటంకాలను తొలగించడానికి, భయాన్ని తగ్గించడానికి మరియు దురదృష్టాలను అధిగమించడానికి పూజించబడే ఈ 'తామసిక' రూపం, తాంత్రిక సంప్రదాయంలో మరియు శాక్తోపాసనలో ప్రసిద్ధి చెందింది.

వటుక భైరవుని కీలక అంశాలు:
రూపం మరియు స్వరూపం: ఈయన రూపం యువ బాలుడిగా లేదా తేజోవంతమైన శిశువుగా ఉంటుంది. సామాన్యంగా వటుక భైరవుని రూపం నగ్నంగా ఒక కుక్కతో కూడి ఉంటుంది. స్వామి 'కాళి' కుమారుడు గా మరియు ఆమె భక్తుల సంరక్షకుడిగా పరిగణించబడతాడు.

ప్రాముఖ్యత: శీఘ్ర అనుగ్రహానికి, అపార కరుణకి మరియు రక్షణను ప్రసాదించడంలో ప్రసిద్ధి. స్వామితో భక్తులు ప్రేమపూర్వకమైన, పిల్లల వంటి బంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు.

ఆరాధన - మంత్రం: విపత్తులను అధిగమించడానికి వటుక భైరవుని (బటుక్ భైరవ) మూల మంత్రం "ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు  వటుకాయ 
వం హ్రీం ఓం స్వాహా

వటుక భైరవ గాయత్రి మంత్రం
ఓం భైరవాయ విద్మహే
వటుకాయ ధీమహి
తన్నో భైరవః ప్రచోదయాత్

ఈయన శక్తోపాసన(దేవత ఆరాధన)లో ముఖ్యుడు.

అపదుద్ధరణ: భక్తులను కష్ట పరిస్థితుల నుండి రక్షించడానికి అపదుద్ధరణ వటుక భైరవ రూపాన్ని పూజిస్తారు.

సమయం: ఆయన ఉపాసనకు దుర్గాష్టమి మంచి సమయం.

ఈయనను దేవాలయాలలో క్షేత్రపాలకుడుగా దర్శనమిస్తాడు. అంతేకాక ఉపాసకుడి (సాధకుడి)మార్గంలోని అడ్డంకులను తొలగించడానికి శివుడు ఆయనను అవతరింపజేసాడని నమ్ముతారు.

రూపం: హిందూ ప్రతిమాశాస్త్రం(Iconography)లో బటుక భైరవుడు లేదా వటుక భైరవుడు శివుని యొక్క ఉగ్ర రూపం, ఇది ఆయన భైరవ అవతారం. తాంత్రిక సంప్రదాయంలో శివుని ఈ రూపాన్ని ఉగ్రమైన, నగ్న యువకుడిగా చిత్రిస్తారు, సాధారణంగా భైరవుడితో పాటు ఒక కుక్క కూడా ఉంటుంది.

రూపమండనం(శిల్పశాస్త్ర గ్రంథం)లో, బటుక భైరవుడిని ఎనిమిది చేతులతో చిత్రీకరించాలని నిర్దేశించబడింది. వాటిలో ఆరు చేతులు ఖట్వాంగం (గద), పాశం (కొరడా), శూలం (ఈటె), డమరుకం, కపాలం మరియు ఒక పామును పట్టుకొని ఉంటాయి. మిగిలిన రెండు చేతులు ఒక మాంసపు ముక్కను మోస్తూ అభయ ముద్రను ప్రదర్శిస్తాయి. దేవతామూర్తి రంగులోనే ఉన్న ఒక కుక్కను సమీపంలో చిత్రీకరించినట్లు పేర్కొనబడింది.

శారదాతిలక తంత్ర గ్రంథం దేవతల యొక్క సత్వ, రజో, మరియు తమో గుణాలను బట్టి వివిధ రకాల ఆకారాలను తెలుపుతుంది.

భైరవ అనేది గణం. పక్షి, మృగ, మనుష్య, రాక్షస జాతులు ఉన్నట్లే, భైరవ కూడా అలాంటి ఒక గణం.

భైరవ మాత్రమే కాదు – కాళి, చాముండ, భైరవి, డాకిని, లాకిని, కాకిని, యాకిని, రాకిని, హాకిని, పిశాచి, వేతాళి, పూతన, యక్షిణి, యోగిని, కట్టేరి, బ్రహ్మరాక్షసులు అనేవి దేవతల వంశ రూపాలు.

ప్రతి వంశం కింద, విభిన్న నామాలు, విభిన్న స్వభావాలు, విభిన్న మనస్తత్వాలు, విభిన్న పరిమాణాలు, విభిన్న రంగులు, విభిన్న రూపాలతో వాటికి లెక్కలేనన్ని రూపాలు ఉంటాయి; మనం 'మనుష్య' అనే వర్గంలో ఉన్నట్లే! కొన్నిసార్లు వాటికి ఒకే పేర్లు కూడా ఉంటాయి; కానీ అవి విభిన్నంగానే ఉంటాయి; మన పేరుతో ఇంకొకరు ఉన్నట్టు.

ఉదాహరణ కి మనం సాధారణంగా డాకిని అని పిలిచినప్పుడు ఏ డాకిని వస్తుందో మనకు తెలియదు. అలాగే మిగిలిన దేవతా స్వరూపాలకు కూడా వర్తిస్తుంది.

భైరవుడు – కాపాలిక వంశం క్రింద ఉన్న భైరవ కులానికి కాల భైరవుడు నాయకుడు. ఈ కాపాలికులు సమాజంతో అస్సలు సంబంధం కలిగి ఉండరు, ఎందుకంటే వారి నియమాలు లేదా వారి ఆచారాలు ఆధునిక సామాజిక కట్టుబాట్లకు విరుద్ధంగా ఉంటుంది. అంతేకాక, కాల భైరవుని క్రింద ఉన్న కాపాలిక వశం మనల్ని సంసారం నుండి బయటకు తీసుకురావడానికి సహాయపడుతుంది, కాబట్టి, అటువంటి సాధకులను సమాజంలో ఉండనివ్వరు, ఎందుకంటే ఆధునిక సమాజానికి సరిపడదు.

సమాజంలో నివసించే ప్రజలకు, భైరవ కులానికి సంబంధించిన స్వర్ణాకర్షణ భైరవుడు నాయకుడు.  మహా భైరవుడు అనే పదం కేవలం స్వర్ణాకర్షణ భైరవుడిని మాత్రమే సూచిస్తుంది, కాల భైరవుడిని కాదు. కాల భైరవుని విద్య గురించి మనం పూర్తిగా తెలుసుకోలేము. ఎందుకంటే, కాలభైరవుడు సామాన్యుల కోసం ఉద్దేశించినవాడు కాదు, అందుకే ఇది రహస్యంగా ఉంచబడింది. కానీ, వటుక భైరవుడు మరియు స్వర్ణాకర్షణ భైరవుడు గురించిన వివరాలు తెలుసుకోగలం. 

వటుక భైరవుడు ఎవరు?

శ్రీ విద్య మరియు కాళికా విద్యలలో వటుక భైరవునికి తనదైన స్థానం ఉంది. అందువల్ల, శ్రీ విద్యకు సంబంధించిన అనేక గ్రంథాలు అందుబాటులో ఉన్నందున, ఆచార్యులు ఆయనకు సంబంధించిన కొన్ని విద్యలను లిఖించారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడానికి వటుక భైరవ విద్య తప్పనిసరి అని చెప్పబడినప్పటికీ, కొన్ని సంవత్సరాల సాధన తర్వాత మాత్రమే గురువులు వటుక భైరవ విద్యను ఉపదేశిస్తారు. మంత్రశాస్త్రంలో 
వటుక భైరవ విద్య మహత్త్వం మరియు ప్రాముఖ్యత అలాంటిది.

సామాన్యులకు స్వర్ణాకర్షణ భైరవుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. మంత్రశాస్త్ర విద్యలలో దీక్ష పొందిన ఉపాసకులకు వటుక భైరవుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు.

వటుక అంటే బాలుడు!. వటుక భైరవుడు అంటే కాల భైరవుని బాల రూపం; అందుకే వటుక భైరవ అనేది దీక్ష పొందిన ఉపాసకులకు మాత్రమే నిర్ధేశించబడింది.

భైరవుడు వటుక రూపమే కాదు, బ్రహ్మ, వేతాళ, విష్ణువు వటుక రూపాలను ధరించి తాంత్రిక విద్యలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. వటుక 
వేతాళ శ్మశాన కపాలిని కుమారుడు. అతను వటుక భైరవుడి వలె క్షిప్రప్రస్తి.

స్వర్ణాకర్షణ భైరవ యొక్క నివాసం భక్తుని యొక్క హ్రదయం. కాల భైరవ యొక్క నివాసం శ్మశానం. అందువలన, వటుక భైరవ యొక్క నివాసం కూడా 
శ్మశానం.

తాంత్రికవిద్యలో, స్వర్ణాకర్షణ భైరవ కూడా వటుక రూపాన్ని కలిగి ఉంటాడు.

ఈ వటుక భైరవ లేదా కాల భైరవులు క్షేత్రపాలకులుగా వుండరు.

క్షేత్ర పాలకుడు అనేది ఒక బిరుదు. కేవలం ఒక క్షేత్రాన్ని లేదా నిర్దిష్ట ప్రదేశాన్ని చూసుకునే వ్యక్తిని 
క్షేత్ర పాలకుడు అంటారు.

కాబట్టి, క్షేత్ర పాలకుడిని వటుక భైరవ లేదా కాల భైరవ అని సాధారణీకరించడం తప్పుడు అర్థం.

ఈ వటుక భైరవుడు కాపాలిక లేదా భైరవ విద్య యొక్క ప్రాణం కాగా, కాల భైరవుడు కాపాలిక లేదా భైరవ విద్య యొక్క నాయకుడు.

మనం నోటితో, మనస్సుతో తినే ఆహారంపైనే మన ఆలోచనలు ఎల్లప్పుడూ ఆధారపడి ఉంటాయి.. మన చర్యలే మన ఆలోచనలపై ఆధారపడి ఉంటాయి!!

అందువల్ల ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి.

భైరవుడు వేతాళం యొక్క శక్తితో, వేడి మరియు చలి అనే తీవ్రమైన గుణాలతో భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటాడు. అందువల్ల, వేతాళ మూర్తి, భైరవుని హృదయం వంటిది. అంతేకాక వేతాళం అనేది ఒక గోత్రనామం. ఈ వేతాళ మూర్తి ఆరు తలలు కలిగిన మహా వేతాళ స్వామి. ఈయన చరాచర వస్తువులను నాశనం చేయడంలో కాలాగ్ని రుద్రునికి ఏమాత్రం తీసిపోడు.

కాల భైరవగా గంభీరంగా నిలబడినప్పుడు, వటుక భైరవ అనేక అంబాలకు తండ్రిగా ఉంటాడు, అలాగే అనేక అంబాలకు కుమారుడు అవుతాడు. వటుక భైరవలో అపదుద్ధారణ వటుక భైరవ అనే ఒక ప్రత్యేక రూపం ఉంది. ఆయనను పూజించినప్పుడు, ఆయన చాముండ మాతృకతో పాటు వస్తాడు.

వటుక భైరవకు కాల వటుక భైరవ వంటి మరికొన్ని రూపాలు ఉన్నాయి. క్రోధ వటుక భైరవ, వీరా వటుక భైరవ, చండ వటుక భైరవ, వక్ర వటుక భైరవ, కపాలి వటుక భైరవ, భూతేశ వటుక భైరవ, ఘోర వటుక భైరవ, కాలవటుక భైరవ, విఘ్నా వటుక భైరవ, సిద్ధ వటుక భైరవ, ఆనంద వటుక భైరవ, అఘోర వటుక భైరవ, ధూమ్రేష వటుక భైరవ, శక్తి వటుక భైరవ, ఉచ్చిష్ట వటుక భైరవ, పిశాచ వటుక భైరవ; ఈ భైరవ తత్త్వం ఆధునిక సాధకుల అవగాహనకు అందనిది.

పైన పేర్కొన్న వటుక భైరవుల ప్రతి రూపాలకి ఆ స్వరూపానికి సంబంధించిన మంత్రం మరియు పూజలు ఉంటాయి.

వటుక భైరవుల ఈ రూపాలన్నింటికీ కఠినమైన బ్రహ్మచర్యం అవసరం. ఇక్కడ వామాచారం లేదా దక్షిణాచారం గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే స్వామియే స్వయంగా కఠినమైన బ్రహ్మచర్య స్వరూపం. మనకు తెలియని భైరవ తత్త్వం ఎంతో ఉంది, దురదృష్టవశాత్తు, మనకు తెలిసినదే  నిజం అని భ్రమలో ఉంటాము, మనకు తెలియనిది, తెలుసుకోవలసినది చాలా ఉంది ఈ కారణంగానే, దత్తాత్రేయుడు మనల్ని జడ వస్తువు కన్నా కూడా హీనమైన వారమని అంటారు. ఎందుకంటే, మనకు చేతన వరం ఉన్నప్పటికీ, స్వామి పూర్తి చైతన్యాన్ని తెలుసుకోవడానికి సాధన చేయడానికి మనం ఇష్టపడము.

ఈ రూపాలన్నింటికీ శునకం వాహనం.

ఈ శునకానికి వర్ణన తాత్త్వికమైనది కాదు, ఆత్మరతికి సంబంధించినది కూడా కాదు; కానీ మన మంత్ర శాస్త్రం ప్రకారం

ఈ శునకానికి నాలుగు కాళ్ళు నాలుగు వేదాలు, తోక మీమాంస శాస్త్రం. హృదయం షట్ శాస్త్రం (షడ్-దర్శనాలు) ఏర్పడింది. దాని మెడ కాలజ్ఞానం; దాని రెండు కళ్ళు శివఆగమాలు; దాని రెండు చెవులు జ్యోతిష శాస్త్రాన్ని కలిగి ఉంటాయి మరియు ఈ శునకం ప్రళయాన్ని అధిగమించి సృష్టి, స్థితి మరియు సంహారాలకు సాక్షిగా నిలుస్తుంది.

ఈ విధంగా, ఈ శునకం ఒక్కటే సమస్త శత్రు బాధలు, గృహ ఉపద్రవాలు, వ్యాధులు, దారిద్య్రం  వంటి ప్రాపంచిక కష్టాల నుండి రక్షించి, ముక్తిని మరియు త్రికాల జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇప్పుడు, ఈ శునక అధిపతి అయిన భైరవునికి ఎలాంటి పరాక్రమం ఉందో మీరే ఊహించుకోండి!

ఈ శునకం మంత్ర దృష్టి సాక్షాత్తు బ్రహ్మదేవుడే!!

పరశురామ కల్ప సూత్రోక్త తంత్రం, కేరళీయ తంత్రం, కాపాలిక తంత్రం మరియు మాంత్రిక క్రమం ప్రకారం, భైరవుల వివిధ రూపాలకు అనేక భైరవ పూజలు చేస్తారు.


కాలభైరవాష్టకం

తీక్షణ ద్రష్ట కాలభైరవ అష్టకం

దశ మహా విద్యలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Monday, April 6, 2026

Lord Krishna performing Kaliyamardana - శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట

శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట

ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడు ఒక్క బలరాముడు తప్ప, శ్రీకృష్ణుడు మిగిలిన గొల్లపిల్లలు అందరు తన వెన్నంటి రాగా, ఆవులను తోలుకొని అడవికి వెళ్లాడు. ఎండలో తిరగడంచేత కొంత సమయం గడిచేటప్పటికి ఆవులకు గొల్లలకు దప్పిక కలిగింది. యమునానదికి వెళ్లి, నదిలోని విషం కలిగిన నీటిని తాగి, ప్రాణాలు పోగొట్టుకొన్నారు. వెంటనే కృష్ణుడు తన చూపులు అనే అమృతధారలను వారిపై కురిపించి, వారిని బ్రదికించాడు. అపుడు వారందరు శ్రీకృష్ణుని దయవల్లనే తాము బదికినట్లు తెలిసికొని, సంతోషంతో గొల్లపల్లెకు వెళ్లారు.

ఓ పరీక్షిన్మహారాజు! అపుడు శ్రీకృష్ణుడు కాళియసర్పవిషంచేత కలుషితమైన యమునానదిని స్వచ్చమైన దాన్ని చేయాలని సంకల్పించి ఆ కాళియుణ్జి ఆ నదినుండి దూరంగా తరిమివేశాడు.

అని శుకమహర్షి చెప్పగా విన్న పరీక్షిన్మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠా! చాలా లోతైన ఆ యమునానది మడుగులో ఉన్న పాముపొగరును శ్రీకృష్ణుడు ఏ విధంగా అణచాడు? ఎలా బయటకు వెళ్లగొట్టాడు? అక్కడే ఆ పాము చాలాకాలం ఉండడానికి కారణం ఏమిటి? అంతా వివరంగా తెలియజెప్పు.

ఓ శుకమహర్షీ! ఆవులను కాపాడిన శ్రీకృష్ణుని కథామృతాన్ని చెవులారా ఎంతవిన్నా అమాయకులకైనా కూడ తనివి తీరదంటే ఇంక మాబోటి భక్తుల విషయం చెప్పేదేమిటి? కావున మరింతగా విస్తరించి వినిపింపవయ్యా!

అని పరీక్షిన్మహారాజు పలుకగా శుకమహర్షి మళ్లీ ఈ విధంగా అన్నాడు.

ఓ పరీక్షిన్మహారాజా! యమునా నదిలో మిక్కిలి లోతైన పెద్దమడుగు ఉంది. అందులో కాళియుడు అనే పేరుగల పెద్ద పాము ఉంది. అది తన విషాగ్ని జ్వాలలతో, ఆ నదినీటిని మరుగుతూ ఉప్పాంగేలా చేస్తూ ఉంటుంది. ఆ మడుగుమీదుగా ఎగిరివెళ్లే పక్షులు ఆ వేడి సోకి అందులో పడి చచ్చిపోతూ ఉంటాయి. ఆ మడుగులోని కెరటాల మీదుగా వచ్చిన గాలి సోకిందంటే చాలు. ఎటువంటి బలం కల ప్రాణి అయినా సరే చచ్చిపోవలసిందే. దుష్టసంహారం చేయడంకోసం భూమిమీద అవతరించిన శ్రీకృష్ణుడు, సర్పవిషంతో కూడిన ఆ నదిలోని నీటిని, స్వచ్చమైన దాన్నిగా చేస్తాను అని సంకల్పించాడు.

ఈ విధంగా మనస్సులో నిశ్చయించుకొన్న వాడయి శ్రీకృష్ణుడు ఒడ్డున ఉన్న కడిమిచెట్టు మీదికి ఎక్కాడు. అది శ్రీకృష్ణుని అడుగుల స్పర్శను నోచుకోవడానికి తగినంత పుణ్యం గత జన్మలలో చేసికొని ఉంది. అది పెద్దవి చిన్నవి అయిన కొమ్మలతోను రెమ్మలతోను కూడుకొని ఉంది.

(ఈ మడుగు మీది విషపు గాలి తగిలి ఆకాశంలో ఎగిరిపోయే పక్షులే చచ్చిపోతున్నాయి కదా! అటువంటిది యమున ఒడ్డుమీద ఈ కడిమిచెట్టు ఎలా బతికి ఉంది అనే సందేహం కలుగవచ్చు. గత జన్మలో అది శ్రీకృష్ణుని అడుగులు సోకడానికి తగినంత పుణ్యం చేసుకుంది. పాదస్పర్శ జరగాలంటే అది జీవించి ఉండాలి. ఇంతకీ దాని పూర్వపుణ్యం కారణం. ఇదే కవి సమర్థనం.)

శ్రీకృష్ణుడు నడుముమీది బట్టను బిగించి కట్టుకొని, నెమిలి పింఛాన్ని జుట్టుముడితో బంధించి, ఉత్సాహంతో జబ్బలు చరుస్తూ, రెండు పాదాలు కూడతీసికొని, ఆ కడిమి చెట్టుకొమ్మ కొననుండి మడుగులోనికి దూకాడు. ఆ అదురుపాటుకు నాలుగు దిక్కులు పిక్కటిల్లాయి. మడుగులో గుభగుభ ధ్వనులు హెచ్చైపోయాయి.

మహాప్రతాపవంతుడైన శ్రీకృష్ణుడు దూకగానే, ఆ వేగానికి ఆ మడుగు కలతపడిపోయింది. విషమయమైన తరంగాలచేతను, కుతకుత ఉడికే నీటి బిందువులచేతను, నీటి బుడగలచేతను భయాన్ని కలిగిస్తూ కల్లోలమై పొంగుతూ నాల్గువందలమూరల మేర వ్యాపించింది.

పూర్వం మత్స్యావతారాన్ని ఎత్తి, సముద్రంలో బాగా ఈదిన అనుభవం ఉన్నవాడు కనుక శ్రీకృష్ణుడు ఆ మడుగులో పెద్ద పెద్ద అలలు పైకి లేచేటట్లు నదిని కలచివేస్తూ, అటూ ఇటూ భయంకరంగా ఈదాడు. దానితో కాళియుని మనస్సులో కోపాగ్ని జ్వాలలు ఎగదోసినట్లయింది.

ఆ సమయంలో, వీడు చిన్నపిల్లవాడు. పైగా ఒంటరివాడు. ఇటువంటివాడు అయివుండి, నా మడుగును క్షోభింపజేశాడు. నేను ఈ మడుగులోపల ఉన్నాననే సంగతి వీనికి తెలిసి ఉండదు. నాకు కోపం వచ్చిందంటే ఎంత తీవ్రంగా ఉంటుందో, లోకానికి తెలియజేయడానికి ఇదే అదను. నా క్రోధాగ్నిజ్వాలలతో ఇతణ్ణి బూడిద చేసి, వీనిప్రాణాలు తీస్తాను.

అని ఈ విధంగా అనుకొని, ఇంకా విజృంభిస్తూ, కాళియుడు సర్పసైన్యంతో కలిసి, విషాగ్ని జ్వాలలకాంతులు అంతట వ్యాపిస్తూ ఉండగా, వేగంగా వెళ్లి, శ్రీకృష్ణుణ్ణి కాటు వేశాడు. ఆ శ్రీకృష్ణుడు నీలమేఘంలా ఉన్నాడు. జంకు గొంకు లేకుండా ఆ మడుగునీళ్లలో స్వేచ్చగా విహరిస్తున్నాడు. ధైర్యగాంభీర్య గుణాలు కలిగి ఉన్నాడు. బంగారురంగు గల పట్టు వస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు.

సర్పరాజయిన కాళియుడు శ్రీ కృష్ణుణ్ణి కాటువేసి, అంతటితో ఊరుకోకుండా, తన నోటినుండి విషపుమంటలు వెలిగ్రక్కుతూ, జంకూ గొంకూ లేకుండా తన పొడవైన శరీరంతో శ్రీకృష్ణుణ్ణి వేగంగా బంధించివేశాడు.

ఈ రీతిగా శ్రీకృష్ణుడు కాళియసర్పంచేత బంధింపబడి, కాళ్లుచేతులు ఆడనందువల్ల కదలిక మెదలిక లేకుండా ఉండడం చూశారు గొల్లపిల్లలు. అతడు తమకు ప్రాణస్నేహితుడు. అతని మహిమలు వారికి తెలియవు. తమ సంపదలు, భార్యలు, కోరికలు మనస్సులు అన్నింటిని శ్రీకృష్ణునికి సమర్పించి, సర్వస్వం శ్రీకృష్ణుడే అని నమ్మినవారు కావున

అదిగో! ఆ పాము మన కృష్ణుణ్ణి కరచింది, అంతటితో వదలిపెట్టకుండా, పొగరుబోతు తనంతో అతని శరీరమంతా చుట్టుకొని కదలకుండా బంధించివేసింది. ఇంక ఇప్పుడేమి చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? దీన్ని లొంగదీయగల సమర్థులెవరు? ఏమిటి ఉపాయం? అని గొల్లపిల్లలంతా శోకంతో బొబ్బలు పెడుతూ నేలమీద పడిపోయారు.

శ్రీకృష్ణుణ్ణి కాళియసర్పం కరవడంచూచిన ఆవులు, ఎద్దులు, దూడలు అన్నీ దుఃఖంతో మేత మేయడం మానేసి అరుస్తూ ఉండిపోయాయి.

ఓ రాజా! కాళియుడు శ్రీకృష్ణుణి కరచి చుట్టివేయడంతో, ఎన్నో ఉత్పాతాలు సంభవించాయి. భూమి కంపించింది. ఆకాశంనుండి నిప్పురవ్వలు రాలుతూ కనిపించాయి. గొల్లపల్లెలో ఉండే ఆడవారికి కుడికన్నులు, మగవారికి ఎడమ కన్నులు అశుభాన్ని సూచిస్తూ అదిరాయి.

గొల్లపల్లెలో ఉన్న నందుడు యశోద మొదలయిన గొల్లవారు ఆడవారు, మగవారు అందరు ఆ దుశ్శకునాలు చూచి, భయపడిపోయారు. శ్రీకృష్ణుని సామర్థ్యం తెలియక, గొల్లపిల్లలు ఆవులమందలతో కలిసి ఉన్న శ్రీకృష్ణుడు, ఎక్కడయినా ఆపదలో చిక్కుకొన్నాడేమో అని ఆరాటపడ్డారు. మిక్కిలి ప్రేమతో పిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరు పెద్దపెట్టున ఆక్రందన చేస్తూ గొల్లపల్లె నుండి బయలుదేరారు.

ఓ రాజా! ఈ విధంగా గొల్లపల్లెలోని వారంతా, శ్రీకృష్ణునిశక్తి తెలియక, అజ్ఞానంతో అతనిజాడ తెలుసుకొనడంకోసం వెడుతూ ఉంటే, అతనిశక్తి తెలిసినవాడైనా బలరాముడు వారిని ఆపు చెయ్యలేదు. పైగా పకపక నవ్వుకొంటూ, వారిని గమనిస్తూ ఊరుకున్నాడు.

బలరాముడు నందుడు మొదలయిన గొల్లలు అడవిదారిలో శ్రీకృష్ణుణ్ణి వెదుకుతూ వెళ్లుతున్నారు. ఆవులను కాచే గోపబాలుర అడుగుజాడలు, ఆవుల అడుగుజాడల నడుమ శ్రీకృష్ణుని అడుగుజాడలు కనబడుతున్నాయి. వాటి అడుగుల జాడలలో ఉత్తమ సాముద్రిక చిహ్నాలయిన యవరేఖ, అంకుశరేఖ, హలరేఖ, కమల రేఖ, కులిశరేఖ, చక్రరేఖ, చాపరేఖ, ధ్వజరేఖ మొదలయిన రేఖలు ఆ అడవిదారికి ఆభరణాలుగా అందంగా ఉన్నాయి. ఆ జాడల వెంబడి దారి తప్పకుండా వెళ్లి, కాళియుని భయంవల్ల అక్కడికి వెళ్లడానికి అందరూ భయపడే కాళిందీనది ఒడ్డుకు చేరారు. ఏటినడుమ ఎవరికీ లొంగని బలంకల కాళియుడు కరవడంచేత చేష్టలుడిగి, ఆ పాము శరీరంతో శరీరమంతా చుట్టుకొన్నందువల్ల, సొమ్మసిల్లిపడి ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూచి, ఒడ్డున నిలబడి, దుఃఖం ఆపుకోలేక, కృష్ణా! కృష్ణా! అని గొంతెత్తి విలపిస్తూ తమ దురదృష్టాన్ని తిట్టుకొనే కృష్ణుని తోడివారయిన గొల్లకుఱ్ఱల్ని చూశారు. మేతలు మాని, రెప్ప వేయకుండా, దుఃఖంతో శ్రీకృష్ణుణ్ణే చూస్తూ ఉండే గోవుల్ని దూడల్ని చూశారు. (ఈ గొల్లపిల్లలు, ఆవులు ఆనాటి ఉదయమే శ్రీకృష్ణునితోబాటుగా, గొల్లపల్లినుండి అడవికి వచ్చినవారన్నమాట,) ఈ సన్నివేశం అంతా చూచిన గోపికలు యశోదను కౌగిలించుకొని, శ్రీ కృష్ణునిచేష్టలు తలచుకొని, ఈ విధంగా విలపిస్తున్నారు.

శ్రీకృష్ణా! మేము నీకు ఎదురుగా వస్తే నీవు మాకు ఎదురు వచ్చేవాడవు. ఈ వేళ మేము వచ్చినా నీవెందుకు ఎదురు రావడం లేదు? మేము నీకేసి చూస్తే చాలు. నీవు దయతో మా వైపునకు చూచేవాడవు. నేడు మేము నిన్ను చూస్తూ ఉన్నా నీవు మాకేసి చూడడం లేదు. మేము కృష్ణా! అని పిలిస్తే చాలు 'ఓ' అని వెంటనే గట్టిగా ఉత్సాహంతో బదులు పలికేవాడవు. నేడు మేము ఎంత పిలిచినా నీవు పలకడం లేదు. మేము నిన్ను తలచుకొంటే చాలు. మమ్మల్ని గురించి తలచేవాడవు. ఈనాడు ఆ ఆలోచనే నీకు రావడం లేదు అని గోపికలు భక్తితో పరవశించిన భక్తురాళ్లవలె పలికి ఒళ్లు మరచిపోయారు.

అప్పుడు నందుడు యశోద మొదలైన గొల్లవారంతా అధికమైన శోకంతో శ్రీకృష్ణుణ్ణి చూచి, ఈ విధంగా అన్నారు.

తామరపూలవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! విషాన్ని రొమ్ములలో దాచుకొని వచ్చిన దుష్టరాక్షసి పూతన ఇచ్చిన పాలు త్రాగి అరిగించుకొన్న అద్భుతమైన శక్తి కలిగినవాడివి గదా! అటువంటి నీకు ఈ పాము విషం ఎక్కిందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయమో కదా!

అయ్యో! బిడ్డా! భయంకరమైన ఆ సర్పం కోపంతో నిన్ను కరుస్తూ ఉంటే ఎంతగా వణికిపోయావో? నీ దౌర్భాగ్యాన్ని ఎంతగా తిట్టుకొన్నావో? మాకోసం ఎంతగా పలవరించిపోయావో గదా?

బిడ్డా! ఈ పాము మమ్మల్ని కరవకుండా నిన్నెందుకు కరచిందో కదా! నీవు క్షేమంగా ఉంటే మాకు ఏ ఆపదలూ రాకుండా కాపాడుతూ ఉంటావు. నాయనా! నీకు ఆపద కలిగితే నిన్ను మేము రక్షించలేము కదా!

ఓ కృష్ణా! ఈ వేళ ఎప్పటిలాగ మమ్మల్ని గౌరవంగా ఎందుకు చూడవు? స్నేహితులతో ఏకాంతంగా ఎందుకు మాటాడవు? చెవులకు ఇంపుగా కాళ్లగజ్జెలు మ్రోగేవిధంగా తల్లుల ఎదుటకు వచ్చి ఎందుకు నాట్యం చేయవు? గొల్ల పడుచులచో పరిహాస ప్రసంగాలు ఎందుకు చేయవు?

తండ్రీ! కృష్ణా! నీవు ఈ విధంగా పాముకు చిక్కిపోయావే! ఇంక మా చెవులు సఫలములయ్యేలా మాతో ఎవరు మాటాడుతారు? మా కాళ్లు చేతులు ధన్యములయ్యే విధంగా ఎత్తుకోమని మా పైకి ఎవరు ఎగబ్రాకుతారు? మా కళ్లు చల్లగా ఎవరు చిరునవ్వులు చిందిస్తారు? నోటికింపుగా మా చేత మంచి పాటలు ఎవరు పాడిస్తారు? ఇటుపైన మా ఆలనా పాలనా చూచే వారెవరు? నీ యందే మా మనస్సులు లగ్నమైపోయాయి. నిన్ను విడిచి వెళ్లలేము. ఇంక మాకు ఇళ్లు వాకిళ్లు అక్కరలేదు. నీవు ఎక్కడ ఉంటే అదే మా ప్రపంచం. నీవు లేని ఈ లోకం మాకెందులకు?

ఈ విధంగా నందాదులయిన గొల్లవారంతా ఒకరి నొకరు పట్టుకొని దుఃఖిస్తున్నారు. కృష్ణుణ్ణి విడిచి బ్రతుకలేక దుఃఖంతో కాలిపోతూ అతనితో బాటే మనంకూడా మడుగులోపడి ప్రాణాలు విడిచి పెట్టేద్దాం - అని మడుగులో దూకడానికి సిద్ధమయ్యారు. భగవంతుని అంశావతారమైనవాడు, శ్రీకృష్ణునిశక్తిసామర్థ్యాలు తెలిసినవాడు అయిన బలరాముడు వారిని ఆపు జేసి, ముందు ముందు ఏమి జరుగబోతోందో మీకు తెలియదు. కనుక ధైర్యం విడిచి పెట్టకండి. ఓర్చుకొని వేచిచూడండి అని చెప్పాడు.

గొల్లపల్లెలో ఉండే గొల్లలందరు, తమ ఆలుబిడ్డలతో వచ్చి, తనకోసం విలపించడం చూచి, శ్రీకృష్ణడు ఏమీ చేతకాని సామాన్య మానవునివలె రెండుగడియల సమయంమాత్రం ఊరుకున్నాడు.

అపుడు శ్రీకృష్ణుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. కాళియుని చుట్టలు విడిపోయాయి. పాము శరీరం బాగా వేడెక్కి పోయింది. దానితో కరవడం మానేశాడు. అలసిపోయాడు. పెద్దగా నిట్టూరుస్తూ పడగలు పైకెత్తాడు. ముక్కులనుండి విషం చిమ్ముతూ, ఏమీ చెయ్యలేక, కృష్ణుణ్ణి విడిచి, దూరంగా నిలబడ్డాడు. పాగచూరిన కట్టెలాగ కాంతిని కోలుపోయాడు.

మహాపరాక్రమ వంతుడయిన ఆ శ్రీకృష్ణుడు, జంకుగొంకు లేకుండా, ఆ పాముపడగలమీద చేతితో ఒక్క చరపు చరిచాడు. గరుత్మంతునివలె ఆ పాము రెండుదౌడలు చిక్కబట్టి. కళ్లనుండి విషాగ్నులు బయటకు ప్రసరిస్తూ ఉండగా, దాన్ని పైకెత్తి గిరగిర త్రిప్పి విసరివేశాడు. దానితో ఆ భయంకరమైన సర్పం యొక్క గర్వం చాలా భాగం అణగిపోయింది.

ఈ విధంగా పామును విసరికొట్టి, రెట్టించిన వేగంతో జగదేక వీరుడయిన శ్రీకృష్ణుడు కదిలాడు.

శ్రీకృష్ణుడు అనే ప్రసిద్ధనర్తకుడు కాళియుని పెద్ద పెద్ద పడగలమీదికి ఎక్కి మిక్కిలి నేర్పుతో నాట్యం చేశాడు. ఆ సమయంలో ఆ పాము పడగలు, కెంపులు మొదలయిన రతనాలు పొదిగిన విశాలమయిన నాట్యమండపంలా ప్రకాశించాయి. యమునానదిలోని పెద్దపెద్ద కెరటాలచప్పుళ్లు, ఆ నాట్యానికి సహకారం అందించే మద్దెలచప్పుళ్లవలె ఉన్నాయి. ఆ బృందావనంలో తిరిగే తుమ్మెదలయొక్క ఝంకారం, వీనులవిందుగా ప్రక్కనున్న గాయకులు అందించే సహకారగానంలా ఉంది. ఆ నదిలోని రాజహంసలు, బెగ్గురు పక్షులుచేసే శ్రావ్యమైన ధ్వనులు, తాళాల మ్రోతలవలె ఉన్నాయి. ఆ రమణీయ సన్నివేశాన్ని ఆకాశంలో ఉన్న దేవతలు, గంధర్వులు సభలో సుఖంగా కూర్చుండి, నాట్యం చూస్తూవున్న ప్రేకకులవలె ఉన్నారు.

తన కడుపులో లోకాలన్నీ దాచుకొన్న గోపాలకృష్ణుడు రాక్షస సంహారం చెయ్యడంకోసం భూమిమీద అవతరించాడు. అతడు కాళియునిపడగలను రంగస్థలంగా చేసుకొని, తరగనిదర్పంతో నాట్యం చేశాడు. ఆడాడు, పాడాడు, కేకలు వేశాడు, కేరింతలు కొట్టాడు. ఆతనిఅడుగుల తాకిడికి కాళియునితలప్రాణం తోకకు వచ్చినట్లయింది.

సిద్దులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు, దేవతలు, మునులు, మున్నగువారి భార్యలు ఆ పిల్లనగ్రోవులు మొదలైనవి సంతోషం కలిగించేలా ఊదుతూ నాట్యం చేస్తున్న శ్రీకృష్ణునిమీద పూలవానలు కురిపించారు.

ఈ విధంగా దుర్మార్గులను శిక్షించడంలో యమునివంటివాడయిన శ్రీకృష్ణుడు. వడిగలిగిన కాళియుని పడగలమీద తాండవం చేశాడు. కాళియుని చేవ చచ్చింది. వరుసగా ఉన్న పడగలనుండి రక్తమాంసాలు వెలిగ్రక్కాడు. కళ్లనుండి విషం కారిపోయింది. చొరవ తగ్గి నీరసించిపోయాడు. ప్రాణాలు పైపైకి రాగా తనలో ఈ విధంగా అనుకొన్నాడు.

దేవతలైనా సరే! నా విషాగ్ని జ్వాలలు తాకాయంటే చాలు, గిలగిల లాడుతూ ప్రాణాలు విడిచిపెట్టేస్తారే! ఈ వేళ ఈ పిల్లవాడు ఇదేమిటి? భయంకరమైన నా విషాగ్ని జ్వాలలను సహించడంమాత్రమే కాక తిరిగి నా నూరు పడగలను చితికి చెల్లా చెదరు చేస్తూ, నిర్భయంగా నాట్యం కూడ చేస్తున్నాడే? ఎంతటి ఆశ్చర్యం?

ఓ పరీక్షిన్మహారాజా! బాగా అలసిపోయిన కాళియునికి వివేకం కలిగింది. ఈతడు సామాన్యబాలుడు కాదు. సమస్త చరాచరప్రాణికోటికి ప్రభువు. భగవంతుడు. భక్తికి సంతోషించేవాడు అయిన శ్రీమహావిష్ణువే అయి ఉంటాడని భావిస్తూ భయంతో అతణ్ణి శరణు వేడినాడు.

కాళియుని భార్యలైన నాగాంగనలు శ్రీకృష్ణుని నుతించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...