Friday, April 10, 2026

Chapter 9 Vishnu kills Madhu Kaitabhu by the grace of Sridevi - అధ్యాయము 9 శ్రీదేవి దయచే విష్ణువు మధుకైటభుల పరిమార్చుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 9

శ్రీదేవి దయచే విష్ణువు మధుకైటభుల పరిమార్చుట

సూతు డిట్లనియెను : జగద్గురుడగు విష్ణుని దేహమందలి కన్నులు ముక్కు నోరు గుండె ఱొమ్ములనుండి నిద్ర తొలగిపోయెను. అపుడా తామసశక్తి హరి మేను విడనాడి గగనసీమపై నొప్పుచుండెను. ఆ హరియు మాటి మాటి కావులించుచు మేలుకాంచెను. మహాతేజుడు శ్రీహరి భయపీడితుడైన బ్రహ్మను గనుంగొని మేఘగంభీర భాషలతో నతని కిట్లు పలికెను: 

"ఓ భగవానుడా! కమలజా! నీ తపము వదలి యిటకేల యరుగుదెంచితివి? మఱియు చింతా తరుడవై భయభీతుడవై వైక్లబ్యమున నేలయుంటివి? 

బ్రహ్మ యిట్లనియెను: ఓ దేవా! నీ చెవుల మలమునుండి భీకరాకారులు బలవంతులు మధుకైటభులను దనుజులను పుట్టిరి. జగత్పతీ! దేవా! వారివలన భయమున నేను నీ సన్నిధి చేరితిని. నేను భయగ్రస్తుడను-విచేతనుడను. నన్ను త్వరగా కాపాడుము. 

విష్ణు విట్లనియెను: నీ విచటనే యుండుము. నేనేగి వారి యంతు తేల్చుకొందును. ఆ మూఢుల కాయువు మూడినది. లేనిచో నాతోడ నేల బోరవత్తురు? 

సూతు డిట్లనియెను: ఆ దేవేశుడట్లు పలికినంతనే యా మదమత్తులు విక్రమవంతులు నగు రక్కసులు వేల్పు పెద్దను వెదకుచు నచటి కేతెంచిరి. ఓ మునులారా! ఆ సంద్రమునందు నిరాధారులై విగతజ్వరులై మదగర్వమున విఱ్ఱవీగు దైతేయులు బ్రహ్మతో నిట్లనిరి: 

"మానుండి పరుగెత్తి నీ వితని చెంత కెల వచ్చితివి? మాతో రణము సల్పుము. ఈ పురుషుడు చూచుచుండగనే యిపుడే నిన్ను బరిమార్తుము. ఆ పిదప పాపసెజ్జపై పరున్న యితనిని హతమార్తుము కాన నీవు మాతో బోరుము. లేక మీకు దాసుడనైతి ననుము.

సూతు డిట్లనియెను : వారి పలుకులు విని జనార్దనుడు వారి కిట్లనియెను: 

"ఓ దైత్యులారా! మీరు నాతో సంగర మొనరింపుడు. మహాబలులారా! మదయుతులగు మీ కండకావరమంతయు నిపుడే యంతమొందింతును. మీ కిష్టమైనచో నాతో సంగర మొనరింపుడు. 

సూతు డిట్లనియెను : హరి మాటలు విని వారు క్రోధమున నెఱ్ఱబారిన గుండెలతో నిరాధారమైన నీటిలోనే యుండి యుద్ధము సేయ దలపెట్టిరి. అంత మధువు శ్రీహరితో రణ మొనర్ప నాయత్తమయ్యెను. కైటభుడూరుకుండెను. వారు మత్తమల్లవీరులవలె పోరదొడగిరి. మధు వలసట జెందగనే కైటభుడు హరితో నాలము సల్పుచుండెను. ఆ మధుకైటభు లొకరి తరువాత నొకరు రాగాంధులై ప్రభవిష్ణువగు విష్ణునితో బాహుయుద్ధమునకు దలపడిరి. ఆకసమునుండి శ్రీదేవియు బ్రహ్మయు నిరువురును వారి పోరితము తిలకించుచుండిరి. దురము సలుపు దానవు లెంతకు నలయుటలేదు. కాని హరి డస్సిపోయెను. ఈ రీతిగ నాలము జరుగుచుండగ నైదు వేలేండ్లు గడచినవి. భగవంతు డంతట వారి వధోపాయమునుగూర్చి తన మదిలో నీ రీతి విచారించదొడగెను: 

"నేను వీరితో నైదు వేలేండ్లుగ బోరితిని. ఐనను వీరికి శ్రమ గలుగుటలేదు. కాని నేనలసితిని. ఇదంతయు జూడగ నాకచ్చెరువు గలుగుచున్నది. నా బలవీర్యములు నేడేమైనవి? వీరింకను కుశలముగనే యున్నారు. ఇందులకేమి కారణమో?" ఇట్లు హరిని గని మదోన్మత్తులగు దనుజులు సంతసమున మేఘగంభీర నిస్వనమున హరితో నిట్లనిరి: 

"విష్ణూ! నీలో బలముడిగినచో రణములో నలసట చెందినచో నేను మీ దాసుడనైతినని తలపై దోయిలించుము. కాక నీకు లావే యున్నచో తిరిగి మాతో గయ్యము సేయుము. మొదట నిన్ను జంపి పిదప నలుమోములుగల యీ మహాపురుషుని నంతమొందింతుము."

సూతు డిట్లనియెను : వారి మాటలు విని భగవంతుడు సామపూర్వకముగ నింపుసొంపు దనరు పలుకులతో సాగర మందున్న దానవులకిట్లనియెను : 

"మహావీరులు జంకిన - యలసిన - శస్త్రము వదలినవానిపైగాని బాలునిపైగాని దెబ్బకొట్టరు. ఇది సనాతన ధర్మము. మీతో నే నైదు వేలేండ్లు బోరితిని. మీరిరువురును సమబలులు, సోదరులు. ఎడతెరపి లేక బోరువారు. నేను మాత్ర మొక్కడనే! మీరు నట్ట నడుమ సేద దీర్చుకొని కయ్య మొనర్చుచున్నారు. ఇక మీదట నేను సైత మలసట దీర్చుకొని పిమ్మట మీతో తప్పక పోరు సల్పుదును. కనుక నేను విశ్రమించి వచ్చి న్యాయమార్గమున రణము సలుపు దనుక బలశాలురు మదోత్కటులు నగు మీరు తాలిమి బూనుడు. 

సూతు డిట్లనియెను : ఆ హరి వాక్కులు విని రాక్షసులు అతనిపై విశ్వాసముంచి విష్ణుడు విశ్రాంతినొందిన పిమ్మట మరల సమరము కొనసాగించదలచి దూరముగ తొలగియుండిరి. చతుర్భుజుడగు వాసుదేవుడు రక్కసులను దూరమందే కాంచి వారి చావు కారణమును తన మనస్సులో నిట్లు విచారించుచుండెను. అంతలో హరి కీ విధముగ జ్ఞానోదయమయ్యెను. శ్రీదేవీ వరము నుసరించి వీరు స్వచ్ఛందమరణులు. వీరు నశింపరు. నేను వీరితో వ్యర్థముగ రణమొనర్చితిని. నా పడిన శ్రమయంతయు వమ్మైనది. ఇక ముందెట్లు వీరిని గెలువగలనో తెలియుట లేదు. నేనెదిరించినచో వరమదగర్వితులగు వీరిచ్చోటు వీడి కదలరు. చావకున్నచో వీరు మరింత దుఃఖకారకులగుదురు. భగవతి వీరి కొసగిన వరమతి దుర్భరమైనది. ఎంత దుఃఖితుడైనను తాను స్వయముగ చావగోరుకొనడు గదా! రోగియై యుండియు దీనుడైయున్నను నెవ్వడును చావగోరడు. ఇంక నీ బలమదోన్మత్తులు తమ చావు తామే యేల కోరి తెచ్చుకొందురు? కనుక నిత్తఱి కామప్రదాయినియగు శ్రీ విద్యాశక్తిని నేను శరణు వేడుదును. ఆమె సుప్రసన్న కానిదే కోరికలు సిద్ధింపవు.

ఇట్లు తలంచి హరి నింగిపై నున్న మనోహర శివ స్వరూపిణియగు యోగనిద్రను దర్శించెను. అమేయాత్ముడు యోగవిదుడునగు హరి ఆ రాక్షసులను చంపుటకై వరదాయినియు త్రిభువనేశ్వరియు నగు యోగనిద్రను దోయిలించి ఇట్లు సంస్తుతించెను : 

"దేవీ! మహామాయా! సృష్టి సంహారకారిణీ! అనాదినిధనా! చండీ! భుక్తి ముక్తి ప్రదాయినీ! నీకు నా వందనములు. దేవీ! నీ సగుణ నిర్గుణ స్వరూపములు నే నెఱుంగజాలను. నీ విచిత్ర చరిత్రము లనంతములు. వాని నన్నిటి నెవ్వడు పేర్కొనగలడు? నీ దుర్ఘటమైన ప్రభావ విశేషము లెఱింగితిని. నేను నిద్రయందుండగ చేష్టలు దక్కియుంటిని. అపుడు బ్రహ్మ నన్ను మేలుకొలుపుటకు పలుమారు యత్నములు జరిపెను. కాని నా యింద్రియములు చేతలుడిగియుండుటచే మేల్కొనజాలకుంటిని. నీ ప్రభావముననే నిద్రించితిని. మరల నీ మూలముననే మేలుకొంటిని. ఈ ఘోర సంగర మొనర్చితిని. ఇందు నేనే యలసితిని గాని నీ వర మహిమ గల యీ దానవుల లయలేదు. ఇంతేకాక వారు బ్రహ్మను చంపుటకు బూనుకొనిరి. నేను వారిని ద్వంద్వ యుద్ధమునకు బురికొల్పితిని. వారితో మహాసాగరమునం దతి ఘోరముగ బోరు సల్పితిని. కాని వారి చావునకు నీ వరమడ్డుగ గలదని తెలిసికొంటిని. ఇపుడు సర్వశరణ్యవగు నిన్నే నే శరణుగోరుచున్నాను. ఓ దేవార్తి వినాశినీ! ఈ దానవులు వరదాన దర్పితులు. నేను యుద్ధముచే ఖిన్నుడనైతిని. కాన నాకిపుడు సాయపడుము. ఆ పాపులు నన్ను జంపన సమకట్టి యున్నారు. నేనేమి చేతును? ఎక్కడి కేగుదును? ఇట్లు హరి వాక్కులు విని అతి దీనముగ ప్రణమిల్లుతున్న దేవదేవుడు వాసుదేవుడు సనాతనుడునగు హరిని గని దేవి నగి యిట్లనియెను : 

"దేవదేవా! నీవు మరల స్వయముగ యుద్ధ మొనరించుము. వీరిని మోసముతో జంపుము. నేను నా మాయాశక్తిచే వీరి బుద్ధులను మోహింపజేయుదును. అపుడా శూరులు మాయా మోహితులగుదురు. నీవు వెంటనే వారిని చంపుము."

ప్రీతి పూర్వకములగు శ్రీదేవి పలుకులు హరి వినెను. అంతలో ఆ మహావీరులగు దానవులు యుద్ధకాములై మహాసాగరమందలి సమరస్థలము జేరిరి. వారట విష్ణుని గని సంతసిల్లి "ఓ మహాకామా!చతుర్భుజా! నిలునిలుము. మాతో యుద్ధ మొనరింపుము. నిజముగ జయాపజయములు దైవాధీనములు. బలవంతుడే సాజముగ గెలుపొందును. కాని యొకొక్కప్పుడు దుర్బలుడును దైవబలమున జయమందును. కనుక మహాత్ము డెప్పుట్టునను హర్షశోకములందరాదు. తొలుత పెక్కురు రక్కసులు దేవతల చేతులలో మడిసిరి గదా! ఇప్పడు నీవు మాత్రము మాతో బోరుచు పరాజయమొందితివి" అనిరి. ఇట్లు పలికి మహాబలులగు దైత్యులు సమరమునకు తలపడిరి. అద్భుతకర్ముడగు హరి వారిని గాంచి తన బలముకొలది పిడికిట వారిని పోటు పొడిచెను. అపుడా పోటు మొనగాండ్రు హరిని మరల పిడికిళుతో పొడిచిరి. ఇట్లు వారికి పరస్పరము దారుణ రణము సంఘటిల్లెను. నారాయణుడా వీర్యవంతుల యుద్ధ నైపుణ్యము గాంచి దీనదృక్కులతో తన సమక్షమునందున్న భగవతిని దర్శించుచుండెను. 

సూతుడిట్లనియె : అపుడు దేవి కరుణ భావమున కందుచున్న హరిని పరికించి వెంటనే మరులు రేకెత్తించు వాడితూపులవంటి చూపులతో దానవులను జూచెను. ఒకేసారి పెద్దగ నవ్వెను. చిరునగవు నెయ్యము చిందులాడు దేవి నెమ్మొగముగాంచి యాపాపాత్ములు మోహమాదాంధులైరి. వారు నిర్మలకాంతులీను దేవీ రూపమునే మాటి మాటికి మనసుందు దలంచుచు మదనబాణహతులై యామెనే చూడ దొడగిరి. ఆ మహాదేవి మహిమవలన వారు మోహితులైరని కార్యకుశలుడగు భగవాను డూహించెను. అతడు నవ్వుచు మేఘగంభీర ఘోషముతో వారికిట్లనియెను; 

"మీరలు మహావీరులు. పరమడుగుడు. మీ యుద్ధమునకు సంతుష్టుడనైతిని. మీకు వరమీయదలచితిని. నాతో తొలి పెక్కురు రక్కసులు బోరిరి. కాని మిమ్ముబోలు వీరాధివీరులను నేను గనలేదు, వినలేదు. అందుచే మీ మేటిబలమునకు సంతసించితిని. మీరు సమబలులు, సోదరులు, మీకోరిన వరమిత్తును." విష్ణువు వచనములు వినగనే వారికభిమానము మెండయ్యెను. వారు మదనపరవశులునైరి.

ఆ జగదానంద కారిణియగు మహామాయను కామపరవశులై చూచుచు వారు విష్ణువుతో నిట్లనిరి: "ఓ హరీ! మేము యాచకులము గాము. నీకే మేము వరమీయగలము, మేమే దాతలము. కోరుకొమ్ము. నీకే మేము వరమిత్తుము. హృషీకేశా! వాసుదేవా! నీ మనస్సులోని కోరిక దెలుపుము. నీ విచిత్ర యుద్ధమునకు మేమెంతయు సంతసించితిమి." అను దానవుల మాటలు విని హరి వారికిట్లు మారు పలికెను: 

"మీరు నా యెడల ప్రసన్నులైనచో మీరు నా వధ్యులుగండు." 

సూతుడిట్లనియె: ఆ హరి వచనములు విని వారు విస్మితులై మనము వంచింపబడితిమని శోకమున వ్యాకులచిత్తులైరి. అది అంతయును నీటిమయమే. నేలయెచ్చోటను లేదు. అది యెఱింగి దనుజులు హరికిట్లనిరి: 

"దేవా! జనార్దనా! మొదట నీవే మాకు వరమిత్తునంటివి. కనుక సత్యపరాక్రముడనేని నీవే మాకు ముందుగ వరమొసంగుము. నీరు లేనిచోట నీవు మమ్ము వధించుము. అపుడు మేము వధ్యులమగుదుము, ఆ రీతిగ చేసి నీ సత్య ప్రతిజ్ఞను నిలువబెట్టుకొనుము."

అంత చక్రియగు హరి తన చక్రమును మది దలంచి వారితో నవ్వుచు నిట్లు పలికెను : 

"మహాభాగులారా! నీరులేని చోటుననే మిమ్ము హతమార్చగలను. దేవదేవేశుడట్లు పలికి తన పెందొడలను మరింత వెడల్పు చేసి యిదే నీరు లేనిచోటని చూపి వారికిట్లనియెను: 

"ఓ దనుజులారా! నా తొడలపై మీ తలలు విడిచెదరుగాక! అపుడు మీరును నేనును సత్య ప్రతిజ్ఞల మగుదుము. అదివిని మది విచారించి దనుజులు తమ మేనులు వేయి యోజనములంత పెంచిరి. దాని కచ్చెరుమంది భగవంతుడును తన పెందొడలు దానికి రెండింతలు పెంచెను. అపుడు వా రా పరమాద్భుతమైన పెందొడలపై తమ తలలుంచిరి. ప్రభ విష్ణువు తన చక్రముచే వారి తలలు ద్రుంచెను. ఇట్లు మధుకైటభులు ప్రాణములు గోల్పోయిరి. వారి మేదస్సుచే సాగరమంతయు నిండినది. ఆనాటి నుండి భూమికి మేదినియను మరొక పేరు గలిగెను. మునులారా! ఆ కారణముననే మన్ను తినదగనిదైనది. ఈ ప్రకారముగ మీరడగినదంతయును వివరించితిని. కనుక బుధులు నిరంతరము శ్రీ మహామాయా రూపయగు శ్రీ విద్యను సముపాసించ వలయును. ఎల్లసురాసురులు నాపరమ కళ్యాణ శక్తిని సమారాధించవలయును. ఇంతకు మించిన భాగ్యమీముల్లోకములందును మరేదియును లేదు. కనుక సగుణనిర్గుణాత్మిక యగు పరాశక్తి సతతము పూజనీయ అని యెల్ల వేదశాస్త్రార్థములందును వచింప బడినది. ఇది ముమ్మాటికి నిజము నిజము.

అధ్యాయము 10 వ్యాసుడు పుత్రార్థియై శివుని గూర్చి తపమొనర్చుట

పంచాంగం

Thursday, April 9, 2026

Chapter 8 The embodiment of omnipotence is called the goddess of worship - అధ్యాయము 8 సర్వశక్తి స్వరూపిణి యారాధ్య దేవతయనుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 8

సర్వశక్తి స్వరూపిణి యారాధ్య దేవతయనుట

ఋషులిట్లనిరి : మహానుభావా! వేదశాస్త్ర పురాణములను పండితుల వచనములను వినుటవలన మా హృదయము లందొక నిశ్చయమై యున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మువ్వురే సనాతనదేవతలు. ఈ బ్రహ్మాండములందు వీరిని మించిన దెద్దియును లేదని మా నిశ్చయము. కాల పాకవశమున తమ్మిచూలి లోకములు నిర్మించును. తమ్మికంటి బ్రోచును. ముక్కంటి లయింపజేయును. వీరే యన్నిటికి కారణభూతులు. పూర్వమొకటే సద్రూపముండెను. అదే మువ్వురు దేవతలుగ మారెను. ఆ ముగ్గురును సత్త్వము రజస్సు తమస్సను గుణములుగలవారు. వారే బ్రహ్మ హరి హరులు. సకల కార్యకరణ దక్షులు. ఆ మువ్వురిలోన శ్రీ విష్ణుభగవానుడు శ్రేష్ఠతముడు. ఆతడే యాదిదేవుడు - పురుషోత్తముడు - మాధవుడు - జగన్నాథుడు - కార్యదక్షుడు అని పేరొందెను. ఆ మహాతేజస్వియగు హరి యెదుట నిలువబడి యతనిని కాదని యెవ్వడు నేదియు జేయనోపడు. అంతటి లోకైకనాథుని సైతము వివశునిగజేసి యోగమాయ నిద్రపుచ్చినది. ఆ విష్ణుని యద్భుతమైన లీలలును విజ్ఞానమును కార్యాచరణసమర్థతయు నేడేమైనవి? మాకీ విషయమై సందియము గలుగుచున్నది. కనుక మా మనస్సులకు నచ్చునట్టు ఈ సందియమును తీర్చుము. భగవంతుడగు హరిని గూడ జయించిన మా మహాశక్తి యెవరు? ఆమె యెవరి మూలమున నంతగొప్పది యైనది? ఆమెకు అంత సామర్థ్యమెక్కడిది? ఆమెను మహాశక్తియని యేల పిలుతురు? సర్వేశ్వరుడు సచ్చిదానంద విగ్రహుడు పరమాత్మ పరానందుడు వాసుదేవుడు జగద్గురువు శ్రీ విష్ణువు. సకల కర్త - సర్వవ్యాప్తి - పరాత్పరుడు - విరజుడు - పావనుడునగు శ్రీ హరి నిద్రకెట్లు లొంగిపోయెను? మాకిదంతయును మిగుల నాశ్చర్యమును సందేహమును గొల్పుచున్నది. నీ తెలివియను కత్తితో మా యీ సందియమును ఛేదించుము.

సూతు డిట్లనియె : ఈ చరా చర ప్రపంచములందీ సందియమును దీర్పగలవాడొక్కడునులేడు. బ్రహ్మతనయులగు సనాతనమునులే దీనికి ముగ్ధులైరి. నారదుడు కపిలుడు మున్నగువారలే యీ ప్రశ్నను సమాధానించలేక పోయిరి. ఇక దీనిని విమర్శించుటకు నే నెవడను? ఆ విష్ణువే సర్వగుడు సర్వపాలకుడునని వేదములందు గలదు. ఆతని వలననే యీ చరా చర విరాడ్రూపము పుట్టినదని యందు వర్ణింప బడెను. వేలుపు లెల్లరును శ్రీ మన్నారాయణుడు విశ్వాకారుడు హృషీకేశుడు జనార్దనుడు మేఘవర్ణుడునగు విష్ణునకు దోసిలియొగ్గి యుపాసింతురు. కొందఱు చంద్రమౌళి ముక్కంటి పంచవక్త్రుడు వృషవాహనుడు మహాదేవుడు వామదేవుడు సకల నిగమసన్నుతుడు కపర్ది గౌరీదేహార్ధధారి సర్వశక్తి యుక్తుడు దక్షయాగ విధ్వంసకుడునగు శ్రీ సాంబసదా శివుని నిచ్చలు నభిషేకాదులతో సేవించుచుందురు. మఱి కొందఱు వేదవేత్తలు మూడు సంధ్యలందును పెక్కు స్తోత్రములతో పరమసత్య స్వరూపుడగు సవితృదేవుని ధ్యానించి జపింతురు. వేదములన్నియును సూర్యోపాసనమే యుత్తమమనియు సూర్యనారాయణుడే పరమాత్మయనియు నొక్కి వక్కాణించినవి. ఇంకను కొందఱు బ్రహ్మ విదులు నిగమములు పలికిన విధముగ నగ్నిని లోకపాలకుడగు నింద్రుని వరుణుని సంస్తుతింతురు. ఎల్ల ప్రవాహములతో గలిసి ప్రవహించు పావనగంగ నదులలో నుత్తమోత్తమమై యలరును. అఖిల దేవగణములందు పద్మనాభుడు పురుషోత్తముడై తనరును అని మహర్షులు వచింతురు. ఇక ప్రమాణములు ముత్తెఱంగులని పండితులు వాక్రుత్తురు. అవి ప్రత్యక్షము-అనుమానము-శబ్దముననబడును. కొందఱు వానిలో నుపమానమును జేర్చి నాలుగందురు. మఱి కొందఱు వానిలో నర్థాపత్తిని గలిపి ప్రమాణము లైదని పలుకుదురు. మనీషులు వానితో నితిహాసమును పురాణమును గలిపి సప్త ప్రమాణములు గలవందురు. ఇన్ని ప్రమాణములచే గూడ నా పరబ్రహ్మము పరాశక్తి వారికెంతమాత్రమును తెలియబడదు.

స్థితప్రజ్ఞుడు తన నిశ్చయాత్మక బుద్ధిచే వేదాంతార్థములచే నాత్మతత్త్వమును గూర్చి తనయందే స్వాత్మతత్త్వం విచారణ చేయుచుండవలయును. ప్రత్యక్షవస్తు విజ్ఞానముచే బుద్ధిమంతుడు మాటి మాటికిని విత్కరించుచు ఆత్మ చింతన చేయవలయును. తాను దృష్టాంతములతో తన నిజ స్వరూపమును విమర్శించుకొన వలయును. ఆప్తులుదెలుపు సత్య మార్గమున నడువవలయును. ఈ విధముగ స్వాత్మదర్శనము విషయమున పండితులు నుడుపుదురు ఎల్లపురాణములందు నిట్లే కలదు. బ్రహ్మయందు సృజనశక్తి శ్రీ విష్ణువునందు పరిపాలన శక్తి గలదు. రుద్రునియందు సంహారక శక్తి సూర్యునిలోన ప్రకాశన శక్తి శేషునందు కూర్మమునందు భూభరణ శక్తి అగ్నియందు దహనశక్తి వాయువునందు ప్రేరణశక్తి మున్నగు నీ శక్తులన్నియు నా మహాశక్తి పరిణామ స్వరూపములే. కుండలినీ శక్తికి దూరమైనచో శివుడును శవత్వమందును. శక్తి రహితుని పండితులు వీడు చేతకాని వాడని దెప్పుదురు. కాన నీ స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండ మందు గడ్డి మొదలు బ్రహ్మ వఱకుగల భూతములన్నిటి యందు నిటులే శక్తి నిండి యిమిడి వెలుగొందును. అట్టి శక్తిలేని చరాచర వస్తువులు పనికిమాలినవే. శక్తిహీనుడు నడచుటకును తినుటకును పరుల గెలుచుటకును పనికిరాడు. అట్టి సర్వగత మగు శక్తినే పరబ్రహ్మమందురు. ఆ విశ్వశక్తి నాత్మరతితో తెలివివెలుగుతో విచారించి పెక్కుగతుల నిత్యము నుపాసింప వలయును. విష్ణునందు సాత్విక శక్తి గలదు. దానినతడు గోల్పోయినచో నతని యాట కట్టినట్లే. బ్రహ్మయందు రాజస శక్తి గలదు. అది లోపించినచో నతని రచన యాగినట్టే. శివునియందు తామస శక్తి గలదు. దానిచే నతడు సంహారమొనర్పగల్గును అని యిట్లు చక్కగ నెఱింగి వ్యక్తి తన శక్తిని దాను తెలిసి కొనవలయును.

ఆ మూలాధార శక్తియే యీ చరాచర బ్రహ్మాండములను నిర్మించును - పోషించును - సంహరించును. ఆ శక్తి బలమే లేనిచో బ్రహ్మ హరి శివుడు రవి వహ్ని వరుణుడు మున్నగు దేవతలు శక్తిహినులగుదురు. దాన వారి పనులు కుంటుపడినట్లే. దేవత లెల్లరును శక్తియుక్తులైననే తమ తమ పనులు చక్కగ నెరవేర్చుకొందురు. ఆ శక్తియే యన్ని కార్య కారణములందును ప్రత్యక్షముగ వెల్లడి యగుచుండును. ఆ శక్తినే మనీషులు సగుణయనియు నిర్గుణయనియు రెండుగ దెల్పిరి. రాగవంతులు సగుణశక్తిని విరాగులు నిర్గుణశక్తిని గొలుతురు. ఆ శక్తియే ధర్మార్థ కామ మోక్షము లీజాలు స్వామిని. ఆ దేవిని విధి విధానమున నారాధించినచో నామె మనయెల్ల కామితార్థము లీడేర్చగలదు. జడమతులు మాయకు లొంగుటచే నా శక్తి మహిమ నెఱుగ జాలరు. కొందఱాశక్తినే కొలదిగ తెలిసికొందురు. కాని, వారితరులకు దానిని తెలుపనేరక వారిని భ్రమలో ముంతురు. మందమతులగు పండితులు కొందఱు కలిప్రేరితులై పొట్టకూటికై చేయరాని పనులుచేసి పాషండులగుదురు. ఈ కలికాలమున ననేక విపరీతములు తలలెత్తును. కాని యితర యగములం దధర్మములు లేనేలేవు. విష్ణువు దేవి దయకై పెక్కేండ్లు తీవ్ర తపమాచరించు చుండును. స్వయంభువు శంభువు నాధ్రువ శక్తి దయ సంపాదింప నిరంతరముగ ధ్యానింతురు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోననేమేమో కోరికల పుట్టలు పెంచుకొని యనేక యజ్ఞములు సలుపుదురు. వారా పరశక్తిని పరబ్రహ్మమునుగా సనాతనగా పరాత్మికగ నిత్యగా నిత్యము తమ చేతములందు ధ్యానింతురు. కనుక నన్నియు తెలిసిన విద్వాంసులా పరమశక్తినే నిత్యము సంసేవింప వలయును. ఇదే సకల శాస్త్రముల సారమని తెలియవలయును. నిజముగ సకలశాస్త్రము లందును దెలిసికొనదగిన దాశక్తియే. ఇదంతయును నేను శ్రీ వ్యాసుని వలన వ్యాసుడు నారదుని వలన దేవర్షి తన తండ్రి బ్రహ్మ వలన విష్ణుని వలన నెఱింగితిమి. పండితు లితరుల మాటలు వినరాదు - తలంపరాదు. కృతనిశ్చయులగు ధీరులా సత్యశక్తినే సంసేవింప వలయును. అశక్తుని యందలి సత్తువ యెంతటిదో కన్నులార చూచిన గాని తెలియదు. కావుననే సకల భూతము లాపరశక్తినే యెఱగి నిత్యము సమారాధించవలయును.

అధ్యాయము 9 శ్రీదేవి దయచే విష్ణువు మధుకైటభుల పరిమార్చుట

పంచాంగం

Chapter 7 Vishnu's sermon - అధ్యాయము 7 విష్ణుప్రబోధము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 7

విష్ణుప్రబోధము

సూతు డిట్లనియె: ఆ బలశాలురగు మధుకైటభ రాక్షసులను జూచి బ్రహ్మ సర్వతంత్రజ్ఞుడగుటవలన సామదానభేదదండో పాయములను గూర్చి యాలోచింపదొడంగెను: 

"వీరికి బలమెంతగలదో నిశ్చయముగ నాకు తెలియదు. కనుక నెదుటివాని బలాబలము లెఱుగక పోరుసలుపుట మేలుగాదు. దుర్మార్గులు మదమత్తులునగు వీరిని నేనిపుడు పొగడినచో నా చేతకానితనము నా చేతనే ప్రకాశింప చేయబడినట్లగును. నా దౌర్బల్యము బట్టబయలైనంతనే వీరిలో నొక్కడే నన్ను దునుమాడగలడు. వీరు దానముచేతను వశముగారు. ఇక వీరిపై భేదోపాయమునెట్లు ప్రయోగింపగలను? కాన నేనిపుడు శేషశయనుడగు భగవంతుని మేలుకొలుపుదును. ఆతడు మహాసత్త్వుడు - జనార్దనుడు - చతుర్భుజుడు - ఆతడే నా వెతలు బాపగలవాడు.'' 

ఈ విధముగ నెమ్మది దలంచి కమలాసనుడగు బ్రహ్మ వేగమే శోకనాశకుడు సర్వము తానయైనవాడు నగు వాసుదేవుని శరణు జొచ్చెను. ఆ జగత్పతి యోగనిద్రలో మునిగి కదలకుండెను. అట్టి నారాయణుని మేలుకొలుపుటకు బ్రహ్మ పలు మేలైన సంబోధనలతో హరి నిట్లు సంస్తుతించెను: 

"ఓ దీననాథా! శ్రీహరీ! మాధవా! వామనా! భక్తత్రాణపరాయణా! జగత్పతీ! మేలుకోగదవయ్యా! సర్వాంతర్యామీ! అమేయాత్మా! వాసుదేవా! విపక్షశిక్షా దక్షా! చక్రగదాధరా! విశ్వాధారా! హృషీకేశా! మేలుకోగదవయ్యా. సర్వజ్ఞా! లోకేశా! సర్వశక్తి సమన్వితా! శోకనాశనా! దీనపరిపాలకా! లేలెమ్ము-మేలుకోగదవయ్యా. ఓ విశ్వంభరా! విశాలాకారా! పుణ్యశ్రవణకీర్తనా! నిరాకారా! లోక సృష్టి స్థిత్యంతకారకా! మేలుకోగదవయ్యా! నీవఖిలాధారుడవే! నీకిదంతయును దెలియుటలేదా! శ్రీ మహావిష్ణో! శరణార్థిని దీనుని దుఃఖితుని నన్నే యుపేక్షించినచో నింకమీదట నీ పాలకత్వమునకు భంగము వాటిల్లదా?" అని పెక్కుభంగుల సన్నుతించినను హరి యోగనిద్రావశుడై మేల్కొనలేదు. అపుడు బ్రహ్మ మరల తన యెదలో నిట్లు తలంచెను:

"ఈ హరియొక మహాశక్తికి లోబడి యుండుటచేత యోగనిద్రకు వశుడయ్యెను. కనుకనే యీ ధర్మాత్ముడెంతకును మేల్కొనుట లేదు. నేను దిక్కు మొక్కు లేని దీనుడను. ఇపుడేమి చేయగలను? ఈ మదమత్తులు దానవులు నన్ను వెన్నాడి చక్కాడ దలచుచున్నారు. ఇపుడేమి చేతును? ఎక్కడికేగుదును? నాకభయమొసంగునాథుడే యింక లేడా?" ఇట్లు బ్రహ్మ తన మదిలో దలపోసిపోసి తుదకేకాగ్ర చిత్తముతో యోగమాయను సంతోషపఱచవలయునని నిశ్చయించుకొనెను. ఏ విశ్వశక్తి మూలమున హరి యచేతనుడై కదలకుండెనో, యా శక్తియే నను బ్రోవ సమర్థురాలగునని నిశ్చయించుకొనెను. ప్రాణము లేనివాడు శబ్దాది విషయము లెఱుగలేనట్లు యోగనిద్రలో నరమోడ్పు గన్నులవాడగు హరియు నేమియు నెఱుగలేకున్నాడు. ఇట్లెన్నెన్ని రీతుల కీర్తించినను హరి తనకూర్కును వదలుటలేదు. అందువలన కునుకితని వశమందులేదు. ఇతడే కున్కునకు వశీభూతుడయ్యెనని తోచుచున్నది. ఎవడెవని వశమున వర్తించుచుండునో వాడు వానికెల్లప్పుడు కింకరుడగును. ఈ కారణమున మాపతియగు హరికి యోగనిద్ర స్వామిని యగును. ఆ జలనిధి కన్యక సైతము హరిని తనవశమందుంచు కొనెను. కనుక నీ బ్రహ్మాండగోళములన్నియును సర్వశక్తుల కాదిశక్తియగు భగవతిచేతి కీలుబొమ్మలే. శ్రీహరి హరుడు రమ పార్వతి భారతి మేమెల్లరము నా శ్రీభగవతికి దాసానుదాసులమే. ఇందేమియు సందియము లేదు. ఆ హరియే సామాన్య మానవుని పగిది నిద్రా దేవతకు వశుడయ్యెను. ఇతర మహాత్ముల గుఱించి వేరుగ జెప్పెడి దేమి గలదు? కనుక నేనిపుడా యోగమాయనే ప్రస్తుతింతును. అపుడుగాని దేవి దయవలన హరి మేల్కాంచి వైరులతో సమరమొనరింపడు.''

అని యిట్లు పద్మాసనుడగు బ్రహ్మతలచి విష్ణునంగములందున్న యోగనిద్ర నిట్లు ప్రస్తుతింపదొడంగెను: 

"ఓ దేవీ ! నీవే యీ యెల్లజగముల కన్నతల్లివని వేదములు పలుకగా చక్కగా నిక్కువ మెఱింగితిని. ఎల్లలోకములను పరమ వివేకమున బాలించు పురుషోత్తముడే నీ ప్రభావమువలన నిపుడు నిద్రావశుడయ్యెను. నీ మోహన విలాసలీల లెవడెరుంగగలడు? హరియును వివశుడై నిదురించుచున్నాడు. నేను మూర్ఖుడను. సకల భూతహృదయములలో నిండియుండు చైతన్యజ్యోతి నీవే. నిర్గుణాత్మికవగు నీ ప్రతిభా ప్రభావములు విబుధకోటులలో నెంత కోవిదుడైన నెఱుగ జాలడు. సాంఖ్యులు నిన్ను పురుష ప్రకృత్యాత్మికగ చైతన్య భావరహితనుగ లోకజనయిత్రిగ భావింతురు. నీవు నిక్కముగ నట్టిదానవా? కావు. నీవు ముమ్మాటికి చైతన్యజ్యోతిఃస్రవింతివే. కనుకనే నేడు విష్ణువు నీ మూలముననే చైతన్యము లేక పడియున్నాడు. నీవు సగుణరూపములతో బహుభంగుల మాయా జగన్నాటక సూత్రధారివై తనర్తువు. నీ కార్యప్రణాళిక నెట్టివాడును గ్రహింపజాలడు. నిన్ను మునులు సంధ్యాదేవతవని పిలుతురు. వారు నీ దివ్యసుగుణములను రేయనక పగలనక నీమముతో ధ్యానించుచు జపించుచుందురు. కనుక నీ విజ్ఞాన వినోదలీల లనంతములు. 

ఓ జననీ! నీవే యెల్లజగములకు తెలివి వెలుగు జూపు జ్ఞానరూపవు. దేవతలకు నిత్యసుఖకారిణియగు శ్రీవి. సకల ప్రాణులందలి శ్రద్ధ-బుద్ధి-మతి-ధృతి-కీర్తి-కాంతి-రతి- యివన్నియు నీవే. ఇంతకు మిక్కిలిగ తర్కవితర్కములతో బనియేమి? లోకముల కన్నిటికి నీవే మూలకారణ శక్తివి. నాకు దుఃఖము గలుగుటకును హరి నిద్రాళుడై యుండుటకును నీవే కారణమని నాకు ప్రత్యక్ష ప్రమాణము గోచరించుచున్నది. వేదమాతా! నీవు వేదవిదులకే తెలియరావు. ఆ వేదములు సకలార్థములను వెల్లడించగలవు. ఐన నవి నిన్నెఱుగజాలవు. ఏలయన, నన్నియును వేదమాతవగు నీ నుండియే యావిర్భవించినవిగదా! ఇట్లు సర్వకార్యములు నాకు ప్రత్యక్షముగ దోచుచున్నవి. నీ చరితమును తుదముట్ట తెలిసినవా డెవ్వడు? ఆ వైకుంఠుడు కైలాసవాసి సురలు నా కొమరులగు మునులు నేను నీ మహోజ్జ్వలమహిమ నర్థము చేసికొననేరము. ఎల్ల లోకములకే నీ మహిమ యందరానిది. ఓ పరాదేవీ! యజ్ఞములందు 'స్వాహా' యని నీ నామధేయమే పలుకబడును. అట్లు పలుకనిచో నమరులకు వారి భాగధేయము వారికి లభించదు. కనుక నెల్లదేవతల బ్రతుకుదెరువులు నీ చేతిలోనే కలవు.

ఓ వరదాయినీ! తల్లీ! తొల్లిటి కల్పమందు నీవు నన్ను గాపాడితివి. ఇపుడీ ఘోర క్రూర దానవులను గన్నంతనే నా గుండె జలదరించుచున్నది. వారి భయమున నిన్నే శరణనుచున్నాను. నన్ను బ్రోవుము. ఈ సమయమున హరి నా మొఱ వినునట్టులేడు. అతని తనువు నీ వశమందే కలదు. కనుక నీవు హరి నిద్రా ప్రమత్తతను వదలింపుము. కాదేని యీ దానవులనైన హతమార్చుము. నే జెప్పనేల? నీ కెట్లు ఇష్టమైన అట్లు చేయుము. నీ యపార పరమప్రబావ మెఱుంగని మందమతులు హరిహరులనే కొలిచెదరు. ఆ విష్ణువే యిట వివశుడై నిద్రించుటచే నీ మహిమ నా కిపుడు ప్రత్యక్షముగ బోధపడినది. ఆ లక్ష్మియును నీ కధీనయే. కనుక నామెయును హరిని మేలుకొలుపజాలదు. ఆ లక్ష్మిని సైతము నీవే నీ శక్తితో నీ వశమందుంచుకొంటివని తలంతును. నీవే విశ్వజననివని కోర్కెలుకురియు కామధేనువవని భక్తిపరులు నిష్కామముగ నీ పదకమలములచే నమ్మి నీయందు లీనమై నిన్నే నిచ్చలు సేవింతురు. అట్టివారితరదేవతలను గొలువరు. అట్టివారే ధన్యులు. బుద్ధి కాంతి కీర్తి శుభవృత్తి మున్నగు దివ్యకల్యాణ గుణములు నీ యందే చోటుచేసికొని యున్నవి. ఆ విష్ణువు నందలి సద్గుణములు నే డేమయ్యెనో తోచుటలేదు. నీవు మానవతులలో వన్కెకెక్కినదానవు. అట్టి నీ నిద్రాశక్తికి హరి నేడు పరతంత్రు డయ్యెను. ఈ యెల్ల జగములందు నఖిల ప్రభావముగల పరాశక్తివి నీవే. నీ సంకల్పమాత్రముననే లోకము లన్నియును నిర్మింపబడినవి. నటుడు నాటకమందు స్వేచ్ఛగ విహరించును. నీవు నట్లే నీచే నిర్మితమగు మోహజాలమందు క్రీడించు చుందువు. మున్ను యుగాదియందు నీవే యీ విష్ణువును సృజించి యతినికి లోక రక్షణకై నీ విమల సత్త్వశక్తి నొసంగితివి. ఆతడే యిపుడిట వివశుడై యున్నాడు. నీవు సర్వపరిపాలన దక్షవు. నీ కేది మేలని తోచిన నదియే చేయును. నన్ను నీవే పుట్టించితివి. నన్ను నలుగురిలో నగుబాటుపాలు చేయుటకా? నీ యభిమతమిదియేనా? భవానీ! నీ యచ్చెరువుగొలుపు కార్యములను నేను కొంతకొంత యెఱిగితిని. ఈ యెల్ల భువనములను నీవే స్వతంత్రించి సృజించి యానందింతువు. తుదకు నీ యందే లయ మొనర్చుకొందువు. అట్లే యిపుడు నీవే నా చావు కోరుచున్నచో మంచిదే. ఇందు వింతలేదు. జగదంబికా! నన్ను నీవే వధించిన నాకు మేలే. నా కిక మరణదుఃఖమే యుండదు. మున్ను నీ చేతనే నేను సృష్టికర్తనుగ ప్రకటింపబడితిని. అట్టి నాకే యొక దానవుని చేతిలో చావుగలిగెననిన యపకీర్తి నీకే కల్గును. నీ కది గలుగకుండుగాక! నీవు వెనువెంటనే లెమ్ము. భీకరమూర్తివి గమ్ము. నీ కిష్టమైనచో రక్కసులనే చక్కాడుము. లేదా నన్ను నుగ్గాడుము. కాక హరిని నిద్దుర నుండి మేలుకొల్పుము. ఈ దనుజులను హరియే దునుమాడగలడు. ఇంతకీ సర్వకార్యములును నీ చేతనే సులభసాధ్యము లగును. 

సూతు డిట్లనియె : అని బ్రహ్మ యిట్లు తామసీదేవిని సంస్తుతించెను. దేవి వెంటనే నారాయణుని దేహమునుండి వెడలి యతనిచెంత నిలుచుండెను. ఇట్లు పరమదేవియగు యోగనిద్ర దనుజుల నాశనమునకై అతుల తేజోనిధియగు విష్ణుని దేహావయవములనుండి తొలగినది. అపుడు జనార్దనునకు స్ఫూర్తిగలిగి మేను మెల్లగ గదలెను. అది గనుంగొని బ్రహ్మ పరమానందభరితుడయ్యెను.

అధ్యాయము 8 సర్వశక్తి స్వరూపిణి యారాధ్య దేవతయనుట

Chapter 6 Madhu Kaitabhu's war efforts - అధ్యాయము 6 మధుకైటభుల యుద్ధ ప్రయత్నములు

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 6

మధుకైటభుల యుద్ధ ప్రయత్నములు

ఋషులిట్లనిరి : సూతమునివర్యా! శ్రీహరికి మధుకైటభులతో మహావారాశిలో నైదువేలేండ్లు ఘోరముగ పోరాటము జరిగెనంటివి. దేవతల కజేయులై దుర్ధరులగు నాదానవవీరులు సంద్రమున నెట్లు పుట్టిరి. భగవానుడు వారినెట్లు హతమార్చగల్గెను? మా కా పరమాద్భుత చరిత్ర వెల్లడించుము. మేము సత్కథా శ్రవణ కుతూహలులము. మీరు బహుశ్రుతులు. మహా ప్రవక్తలు. మీ బోటి మహా మునులతో మాకు దైవయోగమున నానందకర సంగమము గల్గినది. మొఱటు వానితో కలియుట విషముకన్న దుర్భరము. సహృదయుడగు రసజ్ఞుతోడి సాంగత్యమమృతరససమము. పశువులన్నియును తమకు స్వభావవిహితమగు ఆహారము దినుచు నొండొంటితో గలియుచు బ్రతుకుచుండును. రతి సుఖమును ననుభవించును. కాని వానికి నిత్యానిత్య వస్తువివేకముగాని మోక్షదాయకమగు జ్ఞానము గాని యుండదు. శ్రీ హరి సత్కథలు విననేరని వానినా పశువుకన్న నీచునిగ నెంచవలయును. జింకలు మున్నగు జంతువులు చెవుల కింపు చేకూర్చు మధురనాదము వినగోరును. ఆ చెవులు లేని పాములు మధుర నాదస్వర మాలించినంతన తన్మయత నందును. జ్ఞానేంద్రియములలో కన్నులు చెవులు ఈ రెండే మంచి మేలొన గూర్చునవి. చెవుల వలన వస్తువునెఱుగు తెలివిగల్గును. చూపుల వలన నుల్లము రంజిల్లును. శ్రవణము సాత్త్వికము. సాహిత్య శ్రవణము రాజసము. యుద్ధవార్తలు నిందలు వినుట తామస శ్రవణము. పండితోత్తములు మరల సాత్త్విక శ్రవణమును ముత్తెఱంగుల విభజించిరి. అవి యుత్తమము మధ్యమము నధమమున నబడును. ఉత్తమము ముక్తి నొసంగును. మధ్యమము స్వర్గసీమ జేర్చును. అధమము భోగదాయకము. నవరస భరితమై రాజసమగు సాహిత్య శ్రవణమును మువ్విధములు స్వీయతోడి రతి విషయమును ప్రతిపాదించునది యుత్తమము. వారాంగనా సంగమ విషయకము మధ్యమము. పరస్త్రీగమన విషయక మధమము.

తామస శ్రవణమును మూడు విధములు. చంపదగిన వారితో బోరుట సాత్త్వికము. పాండవేయుల పగిది విద్వేష కారణముగా పోరుట మధ్యమము. కారణము లేక వివాదములకు కాలుద్రవ్వుట యధమము. ఇన్నిటిలోన నీ పురాణశ్రవణమే ముఖ్యమైనది. అది బుద్ధి వికాసము గల్గించును. పుణ్యప్రదము. పాప ప్రణాశకము. నీవు మున్ను వ్యాసుని వలన సకలార్థ సాధకము శుభకరమునగు పురాణ కథలను వింటివి. వానినే మాకిపుడు వినిపింపుము. 

సూతుడిట్లనెను : ఓ మహాభాగులారా! మీరు సత్కథలు వినగోరుచున్నారు. నేనును మీకు వానిని ప్రవచింప దలంచితిని. కనుక నీ భూతలమున మీరు ధన్యులరు. నేనును ధన్యుడను. పూర్వము ప్రళయకాలమున ముజ్జగములు లయమంది లోకమేకార్ణవమయ్యెను. అప్పుడు శేషశయ్యపై దేవదేవుడగు విష్ణువు యోగనిద్రలో నుండెను. ఆ విష్ణుని చెవి మలము నుండి మహాబలులగు మధుకైటభులను దానవులు పుట్టిరి. వా రా మున్నీటి నీటిలో పెంపొందిరి. అందాస్థూల కాయు లిటునటు తిరుగాడుచు క్రీడాసక్తులై యుండిరి. ఆ దానవ సోదరులు తమ మనములందిట్లు దలపోసిరి: 

"కారణము లేక కార్యము సంభవించదు అను నానుడి లోకమున సహజము. ఆధారములేనిచో నాధేయమును లేదు. కనుక నాధారాధేయములం గూర్చిన భావము మా మనములందు గల్గుచ్న్నుది. ఈ యనంత జలరాశి సుఖము గొల్పుచు నపారమై యున్నది. దీనికి మూలమేది? దీనినెవ్వరెట్లు సృజించిరి? మేమీ మున్నీటిలోన నేల మునిగి యున్నాము? మేమెట్లు పుట్టితిమి? మమ్ము పుట్టించిన తల్లి తండ్రులెవరు? వారెక్కడ? అను విషయములు మాకు దెలియుట లేదు."

సూతు డిట్లనియె : ఇట్లెంతగ నాలోచించినను వారొక నిర్ణయమునకు రాలేకపోయిరి. తుదకు కైటభుడు తన చెంత నున్న మధువును గని యిట్లనియెను : 

"అన్నా ! మన మీ జలమందుండుట కొకానొక మహాశక్తి కారణముగావచ్చును. ఆ శక్తి యచలమైనది. మహాబలముగలదియని నా యభిప్రాయము. మన యునికి కామెయే హేతువుగావచ్చును. ఈ కన్నుచూపు మేరలో నిండి కనిపించు నీ మహాజల మంతటి కామెయే మూలాధారము. ఆమె యాధారముననే జలమంతట నిండియున్నది. ఆ పరమశక్తియే మనకును మూలాధారముగావచ్చును. ఇట్లు చైతన్యవంతులై వారిరువురు తలచుచున్న సమయమున గగన సీమనుండి వాగ్బీజరూపమగు నొక ధ్వని వారి చెవుల బడెను. వారానాదము విని పట్టుదలతో దానినభ్యసింప నారంభించిరి. అంతలో నాకసమున తళుక్కుమను నొక్క మెఱుపు మెఱసి కనబడెను. మనము విన్నది మహామంత్రము. మన ధ్యానమే సగుణమై వెలుగు రూపుదాల్చి పొలిచినది. ఇందు సందియము లేదని వారు తలంచిరి. వారపు డన్నపానీయములు ముట్టక జితేంద్రియులై తన్మయులై వేయేండ్లతిఘోరముగ జపధ్యానములు చేసి తపము సాగించిరి. అంత వారిపై పరమ శక్తికి దయగలిగెను. ఆ క్రూర దానవులింకను పట్టుదలతో తపము సేయ నిశ్చయించుకొనిరి. ఆ రక్కసులు దీనులై యుండుటగని కనికరింపదలచి దేవి యశరీర వాక్కులతో వారితో నిట్లు పలికెను: 

"ఓ దానవులారా! మీ తపమునకు సంతసించితిని. మీ వాంఛితము తెలుపుడు. తప్పక ఈడేర్తును."

సూతు డిట్లనియె : ఆ దేవి వాక్కులు విని దానవు లిట్లనిరి : 

"ఓ దేవీ! మాకు స్వచ్ఛంద మరణము వరముగ నిమ్ము. వాణి యిట్లు పలికెను. ఓ దానవులారా! నా దయచే మీకు స్వచ్ఛంద మరణమే గల్గును. దేవదానవులకు మీ రజేయుల గుదురు. సందియము లేదు. 

సూతు డిట్లనియె : అట్లు దేవి వలన వరములు బడసి యా క్రూరులు మదగర్వితులై నీటిలోని జలచరములతో స్వేచ్ఛగ క్రీడించుచుండిరి. కొంతకాలమునకు తరువాత కమలాసనము నందున్న ప్రజాపతియగు బ్రహ్మ వారి కంటబడెను. ఆ యిరువురు బలశాలురు బ్రహ్మనుగాంచి సంతసించి యుద్ధకాముకులై బ్రహ్మ కిట్లనిరి : 

"మాకు యుద్ధమను గ్రహింపుము. కానిచో నీ వీ కమలము వదలి వేరొక చోటి కేగుము. నీవు కడు దుర్బలుడవు. నీకీ శుభాసనము తగదు. ఇచ్చోటు వీర భోగ్యము. నీవు పిరికివాడవైనచో మమ్ము వదలి యేగుము. దానవుల మాటలు విని బ్రహ్మ చింతాక్రాంతుడయ్యెను. మహాబలవంతులగు వారినిగని నేనిపుడేమి చేయవలయును? అని తాపసుడగు బ్రహ్మ మదిలో చింతింప సాగెను.

అధ్యాయము 7 విష్ణుప్రబోధము

Chapter 5 Description of the incarnation of Sri Hayagriva - అధ్యాయము 5 శ్రీ హయగ్రీవావతారవర్ణనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 5

శ్రీ హయగ్రీవావతారవర్ణనము

ఋషుయిట్లనిరి: ఓ సూత మహర్షీ! లోకములకు వింత - యచ్చెరువు గొలుపు కత మాకు వినిపించితివి. అది విని మా మనంబులు సంశయ సాగరమున కొట్టుమిట్టాడుచున్నవి. ఆ భగవానుడు మాధవుని తల శరీరమునుండి తెగిపడినదనియు ఆ విశ్వకర్తయగు జనార్దనుడు హయగ్రీవ రూపము దాల్చెననియు అంటివి. దేవతలెల్ల రేదేవ దేవుని ప్రస్తుతింతురో విబుధులెల్లరు సర్వము తానయైన యే విష్ణువు నాశ్రయింతురో అతడే జగన్నాథుడు - ఆదిదేవుడు - సర్వకారణ కారణుడును. అట్టివాని తలయును ఎట్టి విధియోగమున దెగిపడినది? ఆ కథయంతయును మాకు విశదముగ తెలుపుము. 

సూతుడిట్లనియె: ఓ మునులారా! దేవదేవుడును పరమతేజస్వియగు శ్రీ మహావిష్ణుని పావన చరిత సావధానముగ చెవులార వినుడు. సనాతనుడును భగవానుడు నగు జనార్దనుడు తొల్లి పదివేలేండ్లు భీకరమైన పోరాటము సలిపి మిక్కిలి యలసట జెందెను. అపుడతడు సమప్రదేశమున పద్మాసనముపై కూర్చుండి ఎక్కు పెట్టిన విల్లు తన కంఠ పురోభాగమునకు నానించుకొని అలసట చెందియుండుటచే వింటికొనపై తన మేనిబరువంతయు నుంచి నిదురించెను. కొంతకాలము గడిచిన పిమ్మట నింద్రుడు మున్నగు దేవతలెల్లరును బ్రహ్మతోగూడి యొక యాగము సేయదలంచిరి. మహాయజ్వయగు విష్ణువే దేవకార్యము నెరవేర్చుటకును యాగాధిపత్యము వహించుటకును సమర్థుడని తలచి బ్రహ్మాదులు జనార్దనుని దర్శింప వైకుంఠమేగిరి.

అచట వారికి హరి కనబడలేదు. వారు జ్ఞానదృష్టితో విష్ణుడున్న జాడ నెఱిగి యచ్చోటి కరిగిరి. నిశ్చలముగ యోగనిద్రలో మునిగిన జగత్పతిని విభుని ఈశానుని గనుంగొనిరి. బ్రహ్మ రుద్రుడు మొదలగు దేవతలు పరమచింతాక్రాంతులైరి. 

అంత నింద్రుడు వారి కిట్లనియె : ఓ సురలారా! ఇపుడు మన కర్తవ్యమేమి? ఆ హరికి నిద్రాభంగము చేయుట తగదు. అది మహాదోషము. కనుక మీరలెట్లేని యజ్ఞకార్యము కొనసాగింపుడు. 

బ్రహ్మ యిట్లనియె : "నేను చెదపురుగును పుట్టించి యీ నేలనున్న వింటికొనను తినుటకు దాని నాదేశింతును. చెద పురుగు వింటికొనను తినగా నారి తెగును. అపుడు గాని యీ దేవదేవుడు నిదురనుండి మేలుకొనడు! దానివలన దేవకార్యము నెరవేరును. ఇందు సంశయము లేదు." అని దేవదేవుడగు బ్రహ్మ చెద పురుగు నాదేశించెను. 

చెద పురు గిట్లనెను : రమాపతియు జగద్గురుడునగు దేవదేవునకు నేను నిద్రాభంగమెట్లు గల్గింతును? ఎవ్వరికైనను నిద్ర చెడగొట్టుట సత్కథలు వినకుండ చేయుట భార్యాభర్తల నడుమ కలతలు పుట్టించుట తల్లినుండి శిశువును వేరు చేయుట - ఇవి బ్రహ్మహత్యాసమములని స్మృతులు వక్కాణించును. ఆ దేవదేవుని నిద్రాసుఖమున కెట్లు నేను భంగము కల్గింతును? దానిని తినుట వలన నాకు వచ్చెడి ఫలితమేమి? నేను పాపినగుటయే కదా? లోకములన్నియు తఱచుగ స్వార్థపీడితములై ఘోరదురితములు చేయుచుండును. అట్టి స్వార్థ మాశించియే నేనును తినవలయునా?

బ్రహ్మయిట్లనియె : యాగములో నీకు కొంత భాగమేర్పరతుము. కనుక నీవు వెంటనే విష్ణుడు మేల్కొనునట్లు చేయుము. మా కార్యము నెరవేర్చుము. యజ్ఞములందు వేల్చునపుడు హవిస్సునుండి కొంత ప్రక్కలకు బడును. అది నీ భాగమని తెలిసికొనుము. ఇక త్వరగ నీ పని కొనసాగింపుము. 

సూతుడిట్లనియె : ఆ విధముగ బ్రహ్మ పలుకగా చెదపురుగు వెనువెంటనే వింటి నారిని కొరికెను. వెంటనే వింటి నుండి నారి తెగిపడెను. తత్ఫలితముగ విల్లు నేలపై బడినది. పడుటయే తడవుగ ఘోర శబ్ద ముప్పతిల్లెను. అది విని దేవతలందఱును భయపడిరి. బ్రహ్మాండము దద్దరిల్లెను. భూమి కంపించెను. సంద్రము లల్లకల్లోలమందెను. జలజంతువు లదరిపడెను. పెనుగాలులు వీచెను. గిరులు గ్రక్కదలెను. దుఃఖసూచకములును మహోత్పాతములునగు ధూమకేతువులు రాలిపడెను. ఎల్లదెసలు ఘోర రూపము దాల్చెను. సూర్యు డస్తమించెను. ఇట్టి దుర్దినమున నేమి మూడునో కదా! యని వేల్పులెల్లరు పెల్లుగ జింతిల్లిరి.

అమరులిట్లు చింతించుచుండగనే దేవదేవుడగు విష్ణునియొక్క కిరీటకుండలములతో శోభిల్లు తల అదృశ్యమయ్యెను. కొంతవడికి వెఱపుగొలుపు పెంజీకట్లు విరిసెను. బ్రహ్మరుద్రాదిదేవతలపుడు తలలేని హరి మొండెమును గని విస్మితులై శోకసాగరమున మునిగి యిట్లు వాపోయిరి : 

"జగన్నాథా, ప్రభూ! ఇది నీ యమానుషలీలా రూపమా యేమి? సనాతనా! దీనివలన వేల్పులకందఱకును వంత మిక్కుటమైనది. నీవు అచ్ఛేద్యుడవు - ఆదాహ్యుడవు - అక్లేద్యుడవు - అశోష్యుడవు - నిత్యుడవు. ఇంతటి నీ తల తెగుట కేదేవతమాయ హేతువో కదా! నీ విటుల తలలేకున్నచో దేవత లెల్లరు వసువులు గోల్పోవుదురు. మాకు నీయందిం కెటుల ప్రీతి గల్గును? కావున మేము మా స్వార్థము గోరి శోకించుచున్నాము. రమావల్లభా! ఇంతటి ఘోరమే దైత్యులచేగాని యక్షులచేతగాని రాక్షసులచేగాని సాధ్యము కాదు. ఇది దేవతల వలననే జరిగి యుండును. కావున నెవరిని నిందించగలము? ఎవరిని దూషించగలము! దేవేశా! మేమెల్ల దేవతలము పరతంత్రులము. మేమిపుడేమి చేయవలయునో యెచటి కేగవలయునో - మూఢమతులమగు మాకింక శరణ్యమెవ్వరో ఏమియును దోచుట లేదు. విష్ణువు మాయాపతి యగుట వలన సత్త్వరజస్తమ శ్శక్తులు గల మాయ యీ జగద్గురుని తల ఛేదింపనోపదు". శివుడు మున్నగు దేవతలీతీరున వాపోవుచుండిరి. 

అదంతయు విని వేదవిదుడగు దేవగురుడు వారి బిట్టేడ్పు చల్లార్పదలచి వారి కిట్లు పలికెను : ఓ మహాభాగులారా! ఇట్లు రోదించుటవలన నేమి ప్రయోజనము? ఇపుడెల్ల విధముల చక్కని బుద్ధితో నుపాయ మాలోచించుటయే మన కర్తవ్యము. ఇంద్రా! అదృష్టము పురుషకారమును రెండును సమానములే. కనుక మతిమంతుడు తొలుత నుపాయ మాలోచించవలయును. పిదప తప్పక దైవ మనుకూలించును.

ఇంద్రు డిట్లనెను : దైవమే బలవత్తరమైనది. పురుషార్థ మనర్థమునకు దారితీయును. అది వ్యర్థము. మనకండ్ల యెదుటనే విష్ణువంతటి వాని తల తెగిపడెనుగదా! 

బ్రహ్మ యిట్లనియె: కాలానుగుణముగ మంచిగాని చెడుగాని యేది ప్రాప్తించిన దానిని తప్పక యనుభవించి తీరవలయును. ఎట్టివాడును దైవమును మీరలేడుగదా! దేహధారియగు జీవుడు సుఖ దుఃఖములనుభవించి తీరవలయును. ఇందు సందియమే లేదు. నేనును కాలబద్ధుట నగుట చేతనే నా తల శివునిచేత ద్రుంప బడినది. శాపకారణమున హరుని లింగము పతనమందినది. నేడును హరితల తెగి లవణ సాగరమున బడినది. దేవేంద్రునంతటి వానికిని సహస్రభగుడగు దుఃఖము తప్పలేదు. అతడును పదభ్రుష్టుడై మానస సరస్సులో తల దాచుకొనెను. ఇంతటి వారే దుఃఖములు గఱచు చుండగ నిక దుఃఖించని మనుజు డెవ్వడు? ఈ ఘోర దుఃఖ సంసార సాగర మేరికిని దాటశక్యము గాదు. కాన తెలివి గల మానవుడు ఆపదలో దుఃఖింపరాదు. అందుచే మన మిపుడా మహామాయ శ్రీ విద్యామయి సనాతన పరా ప్రకృతియగు నిర్గుణదేవిని సంస్మరింతముగాక. ఆ దేవ దేవియే మనయెల్ల కార్యకములు చక్కగ సమకూర్చ గలదు. ఆమెయే బ్రహ్మ విద్య - జగద్ధాత్రి - విశ్వజనయిత్రి - చరా చరాత్మకమైన ముల్లోకములకు తల్లి. ఆ లోకములన్నియు నామెచేతనే నిలిచి వ్యాప్తమై వెలుగొందుచున్నవి.

సూతు డిట్లనియె : అని యీ ప్రకారముగ బ్రహ్మ దేవతలతో పలికెను : పిదప బ్రహ్మ వేదముల నాదేశింపగ నవియు దేవకార్యము సాధించుటకు శరీరములు దాల్చి యతని యెట్టయెదుట నిలుచుండెను. మీరు సర్వ కార్యములు సఫల మొనరించి పరాభట్టారికయు పురాతన బ్రహ్మ విద్యయు గూఢాంగియు మహామాయయు నగు మహాదేవిని సంస్తుతింపుడు అని వేదములను బ్రహ్మ యాదేశించెను. బ్రహ్మ వచనానుసారము సర్వాంగ సుందరములైన వేదములు విశ్వస్థితి కారణియు జ్ఞానగమ్యయునగు మహామాయ నీ విధముగ సంస్తుతింప దొడగినవి : 

"సకల భూతేశ్వరీ! శివకామినీ! విశ్వజననీ! శివాత్మికా! మహామాయాదేవీ! నీకు మా నమస్కారములు! నీవే సర్వభూతములకు మూలాధారమవు. నీవే ప్రాణుల ప్రాణమవు. శ్రీ -క్షమ - బుద్ధి - కాంతి - శాంతి - శ్రద్ధ - మేధ - ధృతి - స్మృతి - ఇవన్నియు నీవే. ప్రణవమందలి బింద్వర్ధ చంద్రస్వరూపమగు నర్థమాత్రవు నీవే. శ్రీగాయత్త్రీ దేవతవు సప్త వ్యాహృతులు జయ - విజయ - ధాత్రి - లజ్జ - కీర్తి - దయ - స్పృహ - ఇవన్నియు నీవే. దయామృత తరంగిణీ! విశ్వమాతా! ముల్లోకముల సృష్టించు భవభవ భంజనీ! వరేణ్యా! మహావిద్యా స్వరూపిణీ! వాగ్బీజ నివాసినీ! ఓ అమ్మా! నిన్ను రేయైన పగలైన సంస్తుతింతుమమ్మా హరిహర బ్రహ్మలు - ఇంద్రాగ్నులు! రవి - సరస్వతి - లోకాధిపతులును నీచేతనే సృజింపబడిరి. ఇంతేకాదు. ఈ స్థావర జంగమముల కన్నింటికి నీవే జనయిత్రివి! నీవీ జగములనెల్ల నిర్మించనెంచి త్రిమూర్తులను సృజించి వారిచే సృష్టి స్థితి లయము లొనరింప జేయుచున్నావు. ఐనను నీవేకాత్మవై తేజరిల్లుటచేత నీలో నీ సంసారవికారవాసనలు లేశమాత్రమున పొడసూపవు.

నీ యనంత నామములును నీ దివ్య స్వరూపమును నీ వస్తుతత్త్వమును నెఱుంగ జాలినవాడు భువనంబు లన్నింటిలో నెవడును లేడు. ఒక చిన్న నీటి పడియను దాటజాలనివాడు సత్యప్రతిజ్ఞుడై మున్నీటి నెట్లు దాటగలడు? ఈ యెల్ల వేల్పులం దొక్కండును నీ యనంత దివ్యవిభూతు లెఱుంగ గలవాడు లేనేలేడు. నీ శ్రీమాతృదేవినామ మెంతయో మధురాతిమధురము, ఈ మిథ్యా జగముల నెల్ల రచించుటకు నీవొక్కతెవే చాలు ననుటకు వేదవాక్కులు ప్రమాణభూతములు. నీవే కోర్కెలును లేనిదానవు. ఎల్ల భువనములకు కారణభూతురాలవు. కాన నో భగవతీ! నీ విచిత్ర చరిత్ర మా మది కద్భుతముగ దోచుచున్నది. వేదములన్నియు నొక్కటైనను మనోవాక్కుల కతీతమైన నీ మహోజ్జ్వల ప్రతిబ నెఱుగలేవు. ఇక మేమేమి గ్రహింపగలము? ఈ విష్ణు శిరము అదృశ్యమగుట నీకు తెలియదా? కాక నీవెఱింగియు తిరిగి తెలిసికొన దలంతువా? కాదేని మధువైరి బలమెంతయో తెలిసికొన జూతువా? హరియం దేదేని బలవత్తరమైన దోషమున్నదందుమా? అదియును సరికాదు, ఏలన - నీ పావన చరణ కమలములు గొల్చువారిని పాతకము తాకనైన తాకలేదు. ఓ విశ్వమాతా! ఈ హరి యెల్ల వేల్పులలో చాల దొడ్డవాడు. ఇతని విషయ ముపేక్షింప దగదు. ఇతని తల తెగిపడుట చూడగ నబ్బురముగ నున్నది. మదిలో వంత గల్గించుచున్నది. ఓ అమ్మా! ఈ చావు పుట్టుకల వలని వంతలనెడి తీగలను త్రుంచుట కీవే సమర్థురాలవు. మరియు మధుసూదనుని తల మరల నతికించుటకు జాగేల యెనరింతువో తెలియుటలేదు. దేవతలును దోష యుతులే యని యెంచి వారి దోషమునకు ఫలముగ హరిశిరమును ద్రుంచితివో! లేక నరుల పాపము రాజునకు సంక్రమించునుగాన నరుల - దేవతల పాతకముల వలన నితని తల తెగిపడినదో! కాక మధుకైటభులను చంపుటచే నితనికి గర్వము బలిసెనని తలచి యతని తలను ఛేదించితివో! దీని కారణమేమో మేమూహింపజాలకున్నాము. భవానీ! రణమున నోటుపడిన రక్కసులు విమల తీర్థములందు తపములు సేయగ వారికి వరములొసంగితివో! కాదయేని తలలేని వాసుదేవునిగని వినోదింపదలచితివో! నీవిందేమనుకొనుచున్నావో కాని మాకు మాత్రము హరి తల కనబడుట లేదు. సనాతనీ! కానిచో లక్ష్మిపై కోపించి యిట్లొనర్చితివో! ఐనచో పతిలేని యామె మొగమెట్లు చూడగలవు? నీ యంశమున బుట్టిన కడలి రాపట్టి చేసిన నేరమును క్షమింపవలయును గదా! కావున నిపుడీ హరిని లేపి మాకానందము జేకూర్చుము తల్లీ!

మేము కార్యకుశలురము. ప్రభావ సంపన్నులము. దేవతలము. రేయైన పగలైన నీ చరణములే నమ్ముదుము. ఓ దేవదేవీ! ఈ లోకాధినాథుని బ్రతికించి మమ్మీ శోకవారిధి నుండి దాటించుము. శ్రీహరి శిరమేమయ్యెనో మాకు దోచుట లేదు. మేమిక మనుట యెట్లో తెలియుట లేదు. అమరులకు జీవనదాన మొసగు దివ్యామృత మూర్తిని నీవే కదా! ఈ జగములకు బ్రతుకు వెలుగు చూపింపగదవే! 

సూతుడిట్లనియె ; ఈ ప్రకారముగ సాంగములగు వేదములతో సామగులు సామగానము సలిపి తన్ను సన్నుతింపగా గుణాతీత - మహేశ్వరి - పరమమాయ పరమానంద భరితురాలయ్యెను. అంతలో నంతరంగముల కభిరామమైన యశరీరవాణి సుస్వరమున వేల్పుల నుద్దేశించి యిట్లు పలికెను. అమరులారా! నేను ప్రాజదవుల చేత ప్రస్తుతింపబడి ప్రసన్నమైతిని. మీరలు చింత - వంత వదలుడు. స్వస్థులుగండు, నా మాట నమ్ముడు. ఎవ్వడీ భూమిపై నన్నీ దివ్యస్తోత్రమున సంస్తుతించునో, భక్తి యుక్తుడై దీనిని చదువునో, వానియెల్ల కోర్కులు తప్పక ఫలించును. వేదస్తోత్రము వేద తుల్యము. కనుక నెవడేని మూడు కాలములందును పరమభక్తి నిండార నీ వేదస్తోత్రము పారాయణమొనరించునో వాడు దుఃఖరహితుడై సుఖించగలడు.

లోకమందు కారణము లేక కార్యము లేదు. కనుక నీ హరి శిరము తెగుటకు గల కారణమాలింపుడు. మున్నొకప్పుడు కడలిరాచూలి హరిప్రియురాలు హరి చెంతనే యుండెను. అత్తఱి మనోరమమగు నామె పద్మవదనముగని హరి నవ్వెను. నన్ను జూచి యూరకే మాధవుడేల నవ్వును? తప్పక యేదేని వికారము నా మొగమందా ప్రభునకు బొడగట్టి యుండనోపును. అకారణముగ నవ్వేల వచ్చును? ఇతని నెమ్మదిలో నన్య వనిత నాకు సవతిగ నిల్చి యుండనోపునని లచ్చి తలంచెను. ఆమె మేనియందప్పుడు తామస శక్తి యావేశించి యుండెను. అందుచే నా మహాలక్ష్మి తమోగుణముచే కోపవంతురాలయ్యెను. ఆ సమయమున దైవయాగమునను దేవకార్యమునకు నామె శరీరమందు దారుణమైన తామసశక్తి నిండి మెండుకొని యుండినందున తదావేశముచే "నీ తలతెగి పడిపోవుగాక!" యని లక్ష్మి మెల్లగ హరితో ననెను.

మునుపు మహావీరుడగు హయగ్రీవుడను దైత్యుడుండెను. అతడు సరస్వతీనదీ తీరమున ఘోరముగ తపమొనర్చెను. అతడన్నపానములు సుఖభోగములు విడనాడి విజితాత్ముడై మాయాబీజమగు నేకాక్షర మంత్రరాజమును జపించుచు లలిత భూషణ భూషితమగు నా తామసిక శక్తి ననుధ్యానించుచు వేయేండ్లతి దారుణమైన తపస్సు చేసెను. అతడెట్టి తామసరూపమును ధ్యానించెనో నేనదే తామసరూపమున నతని యెదుట ప్రత్యక్షమైతిని. సువ్రతా! నీకు వరమొసంగుదును. ఏదేని గోరుకొమ్మని సింహాసనాసీననై నేనతనితో దయదలచి పలికితిని. అతడు నా మాటలు విని బత్తితో నాకు ప్రదక్షిణించి సాగిలపడి మ్రొక్కెను. అతడు నా దివ్యస్వరూపముగాంచి కనులనిండ నానంద బాష్పములునిండ నన్నుకీర్తించెను. 

హయగ్రీవుడిట్లనె : కామమోక్షములొసగు మహామాయాదేవీ! భక్తాసు గ్రహస్వరూపిణీ! సృష్టిస్థిత్యంతకారిణీ! నీకు నమః సహస్రములు. నింగి గాలి నిప్పు నీరు నేలలకును శబ్దస్పర్శరూపరస గంధములకును నీవే మూలమైనదానవు. త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వాఘ్రాణములలో వాక్పాణి పాద పాయూపస్థలును శక్తి చేత తమతమ పనులు జేయుచున్నవి.

శ్రీదేవి యిట్లనియెను : ఓ దానవా! నీ యద్భుత తపమునకు నీ పరభక్తికిని మెచ్చితిని. నీ కెట్టి కోర్కియున్నను తీర్చెద. వరమడుగుము. 

హయగ్రీవుడనియె : అమ్మా! సురాసురుల కజేయుడనై యోగినై యమరుడనై చావకుండునట్లు వరము నా కిమ్ము. 

శ్రీదేవి యిట్లనియె : పుట్టిన ప్రాణి తప్పక గిట్టును. గిట్టినదెల్ల తిరిగి పుట్టును. ఇది లోకమర్యాద. దీనికి విరుద్ధముగ నెట్లు జరుగగలదు? కావున చావు తప్పదని నిశ్చయించుకొని మరేదేని వరమడుగుము. 

హయగ్రీవుడనె : తల్లీ! నా చావు కేవలమొక్క హయగ్రీవుని వలననే జరుగవలయును. ఇతరుని చేత కూడదు. ఇదే నా కోర్కి. నాయీ కోర్కి తీర్చుము. 

శ్రీదేవి యిట్లనియె : ఓ మహాభాగా! నీవిక నీయింటికేగి సుఖముండుము. హయగ్రీవుడుగాక యితరునివలన నీవు చావవు అని పరాంబిక మహామాయ వరమొసగి అదృశ్యయయ్యెను. ఆ రక్కసుడును ప్రమోదించి తన యింటికేగెను. నాటినుండి యతడు వేదవిప్రులను మునినరులను బాధింపదొడగెను. ముల్లోకములలో నతని నెదుర్కొని తెగటార్చువాడెవ్వడును లేకుండెను. కావున దేవతలారా! మీరిపుడొక గుఱ్ఱము తలతెచ్చిఇండు. దానినీ మొండెమున కతికించి హరిని త్వష్ట మరల బ్రతికించును. అపుడా శ్రీ హయగ్రీవ భగవానుడా పాపిష్ఠుడును క్రూరుడునగు హయగ్రీవ దానవుని దప్పక దునుమాడగలడు. 

సూతుడిట్లనియె : ఈ విధముగ శ్రీభువనేశాని పలికి మౌనమూనెను. దేవతలును మోదమలర దేవశిల్పియగు త్వష్టతో శ్రీహరి మొండెమునకు గుఱ్ఱము తల నతికింపుము. ఆ శ్రీ హయగ్రీవుడు హయగ్రీవుని దెగటార్చును. ఇట్లు దేవతల కార్యము సాధింపుము అని వేడిరి. 

సూతుడిట్లనియె : ఆ దేవతల వచనములు విని త్వష్ట సంతసించి వెంటనే వారి సమక్షముననే యొక్క హయము తల ద్రుంచి దానిని హరిమొండెమున కతికించెను. అంత మహామాయ దయవలన హరి హయగ్రీవుడయ్యెను. కొన్ని దినముల పిదప నా శ్రీ హయగ్రీవుడు యుద్ధమున మదగర్వితుడు దేవవైరియగు హయగ్రీవుని నేలగూల్చెను. ఈ సుందరమైన కథను వినిన మానవుడు సర్వదుఃఖములు బాసి సుఖించగలడు. సందేహము లేదు. ఈ శ్రీ మహామాయాదేవి చరిత్ర పవిత్రము, పరమ పావనము, పాపనాశనము. దీనిని చదివిన వారికిని వినిన వారికిని మేలి కలుములు చేకూరును. ఇది ముమ్మాటికి నిజము.

అధ్యాయము 6 మధుకైటభుల యుద్ధ ప్రయత్నములు

Chapter 4 Sri Vyasa Maharshi's longing for a son - అధ్యాయము 4 శ్రీ వ్యాసమహర్షి పుత్త్ర సంతతికై పరితపించుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 4

శ్రీ వ్యాసమహర్షి పుత్త్ర సంతతికై పరితపించుట


ఋషు లిట్లనిరి: ఓ సౌమ్యా! ఈ పురాణసంహితను వ్యాసునివలన పఠించిన శుకుడెట్టివాడు? వ్యాసుని యే భార్యయందీతడు జన్మించెను. నీవు శుకు డయోనిజుడని యరణి సంజాతుడని వచించితివి. ఈ విషయమై మాకు సందియము గల్గుచున్నది. కనుక శుకుని జన్మవృత్తాంతము వివరించి మా సందేహము బాపుము. మహాతపస్వియగు శుకుడు గర్భయోగియని మేము వింటిమి. అత డీ విస్తృతమగు పురాణమెట్లు వినగలిగెను? 

సూతు డిట్లనియె: ఒకానొకప్పుడు సత్యవతి సుతుడగు వ్యాసుడు సరస్వతీ నదీ తీర మందొక యాశ్రమమున నివసించుచుండెను. అచ్చటనున్న రెండు గోరువంకలను చూచి వ్యాసుడు విస్మయమొందెను. ఆ పక్షులు గ్రుడ్డునుండి యప్పుడే వెడలిన తమ ఱక్కలురాని పిల్లను గూటిలోనే వదలినవి. దాని ముక్కెఱ్ఱగ నున్నది. దానికింకను తోక యీకలు రానేలేదు. అది యెంతయో చూడ ముచ్చట గొల్పుచున్నది. ఆ పిట్టల జంట తమ సంతానమునకు భక్ష్య మందించుట కాసక్తితో పూనుకొనెను. అవి తమ ముక్కుపుటములతో మెతుకులు దెచ్చి దెచ్చి తమ పిల్లనోటిలో మాటిమాటికి పెట్టుచుండెను. అవి తమ యంగములతో దాని యంగములు తాకుచు దాని యెఱ్ఱని ముద్దులు గారు మోమును పలుమారు ప్రేముడితో ముద్దిడుకొనుచు సంబరము పడుచుండెను. ఇట్లా పక్షులు రెండును తమబిడ్డపై చూపు ప్రేమను గని వ్యాసుడు చింతాతురుడై నెమ్మది నిట్లు తలపోయసాగెను: 

'ఆహా! తిర్యగ్జంతువులు సైతము తమ పుత్త్రులపై గుండెనిండిన ప్రేమను గురియునుగదా! ఇంక సేవాఫలమాశించి తమ పుత్రులను ప్రేమించు మానవులలో నిదియుండు ననుటలో వింత యేమున్నది? ఈ పక్షులు తమ పుత్త్రునకు సుఖసాధనమగు పెండ్లి జరిపి తమ కోడలి యందాల మోముగాంచి సంతసించునా?

ఈ పక్షి శాబకము ధర్మమతితో పున్నెము బడయగోరి తన ముదుసలి తల్లిదండ్రులను పూలలోబెట్టి పూజించి వారిని ప్రసన్నులను చేయజాలునా? డబ్బు గడించిన తన తల్లిదండ్రులను తృప్తిపఱచునా? అవి చనిపోవగా వానికిది యుత్తర క్రియలు నెరవేర్చునా? గయకేగి గయాశ్రాద్ధ మాచరించునా? తన పితరుల నుద్దేశించి సక్రమమున నీల వృషోత్సర్జనము జరుపునా? పుత్త్రునంగములు నిమిరి ముద్దిడి లాలించి బుజ్జగించి పుత్త్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుటయే తల్లిదండ్రుల కీ ప్రపంచమం దుత్తమోత్తమ సుఖము సేకొనుటని పెద్దలు నొక్కి వక్కాణింతురు. పుత్త్రులు లేనివారికి సద్గతులు గలుగ నేరవు. స్వర్గము లభించదు. కనుక పరలోకము జేరుటకు పుత్త్రుల బడయుట కంటె వేరొండు సాధనము గనిపించదు. పుత్త్రవంతుడే స్వర్గసీమ నలంకరించగలడు. పుత్త్రహీనుడు దానిని జేరజాలడని ఎల్ల ధర్మశాస్త్రములయు మన్వాదిమునులయు వచనము. పుత్త్రవంతుడే సకల దురిత బంధములనుండి విముక్తుడగు ననుటకు శాశ్వతమైన యాప్తవచనమగు వేదమును సాక్ష్యముగ నున్నది. ఈ విషయము సందేహించుట కెంతమాత్రము వీలులేదు. చావు మొగముతో నున్నవాడు భూశయనము సేయబడియు తానపుత్త్రకుడగుటను గూర్చి చింతాకులుడై లోలోన వగచి వగచి కుమిలి కుమిలి యిట్లు పొగులు చుండును. ''నేడు నా యీ గృహము ధనధాన్య రాసులతో పెక్కు విధములగు పాత్ర పుంజములతో కలకల లాడుచున్నది. దీని కికముందు ఎవడు స్వామి కాగలడో గదా!'' అని యిట్టు లా పుత్త్రహీనుని మనస్సు దుఃఖమున పరిపరి విధముల పరిభ్రమించు చుండును. అత్తఱి నట్టి వ్యాకుల చిత్తునకు దుర్గతులు గా కింకేమి గల్గును!

ఇటుల సత్యవతీ సుతు డనేక విధముల చింతించి వేడినిట్టూర్పులు నిగుడించెను. విమనస్కుడయ్యెను. వ్యాసుడట్లు కొంతతడవాలోచించి తుదకు మేరుగిరిపై నుగ్రతప మాచరించుటకు నెమ్మదిలో గట్టిగ నిశ్చయించుకొనెను. నే నిపు డేదేవత నుపాసించవలయును? వరములు గురియుటలో నే దేవత సమర్థురాలు? ఏ దేవి త్వరితగతిని వాంఛితార్థము లీడేర్చగలదు? అని వ్యాసుడు విత్కరించుకొనుచుండెను. శ్రీ గణపతి బ్రహ్మ విష్ణువు మహేశుడు రవి వరుణుడు సురేంద్రుడు సుబ్రహ్మణ్యుడు అగ్ని-వీరలలో నే నెవ్వరి నారాధించవలయును? అని వ్యాసుడు తలంచుచుండు నంతలోనే నిర్మలాత్ముడు మునిసత్తముడునగు నారదుడు చేత మహతిబూని యాదృచ్ఛికముగ నట కరుగుదెంచెను. అంత వ్యాస మహర్షి దేవర్షిని సందర్శించి ప్రసన్నుడై యతనిని గూర్చుండ నియోగించి అర్ఘ్యపాద్యాది విధుల సత్కరించి కుశల మడిగెను. కుశల ప్రశ్నములైన పిమ్మట నారదుడు వ్యాసున కిట్లనియెను: ఓ ద్వైపాయనా! నీవేల చింతాకులుడవై కనిపించుచున్నావు? నాకంతయు వేగమే తెలుపుము.

వ్యాసుడిట్లనెను: సంతానము లేనివానికి సద్గతులు గలుగవు. వాని యాత్మకు శాంతియును గలుగదు. అందులకే నేనును చింతించుచు పలుమారు విలపించుచున్నాను. సంతతి బడయుటకు నే నేదేవతను ప్రసన్ననుగా చేసికొనవలయును? సకలార్థము లొసగు దేవి యెవ్వరనునది తెలియక విచారించుచున్నాను. ఆ విషయము తెలుపుమని నిన్నే శరణు వేడుచున్నాను. మహర్షీ! నీవు దయగలవాడవు. సర్వజ్ఞుడవు. నే నేదేవతను శరణువేడిన ఆమె సుప్రసన్నయై త్వరగ నాకు పుత్రుని ప్రసాదించగలదో తెలుపుము. 

సూతుడిట్లనియె: అటుల వ్యాసుడడుగగా వేదవిదుడు నారదుడు పరమప్రీతితో నతని కీ ప్రకారముగ సమాధానము నొసగెను. 

నారదుడిట్లనియె: ఓ మహాభాగా! పారాశర్యా! నీవు నన్నడిగిన ప్రశ్ననే నా తండ్రి బ్రహ్మ తొల్లి మధుసూదను నడిగెను. నా తండ్రియగు బ్రహ్మ ధ్యానమున మునింగి శ్రీనాథుడు జగత్పతి దేవేశుడునగు శ్రీహరిని సందర్శించి విస్మయమంది యతని నుతించుచు నిట్లనియెను. ఆ హరి చతుర్భుజుడు. శంఖ చక్ర గదా పద్మధరుడు. పీతాంబరుడు. కౌస్తుభ మణి ప్రభలు దీపిల్లువాడు. దివ్య శ్రీవత్సాంకితమైన వెడదఱొమ్మువాడు. సకలలోక శరణ్యుడు దేవదేవుడు జగన్నాథుడు విశ్వగురుడు మహాతపుడునగు శ్రీహరియు తపమొనర్చుచుండగా జూచి యతనిని నా తండ్రి శరణు వేడెను. 

బ్రహ్మ యిట్లనెను: ఓ జగన్నాథా! నీవు దేవేశుడవు. భూత భావి వర్తమానములపై నధికారముగల ప్రభువవు. నీవేరిని గూర్చి తపించుచున్నావు? ఏ పరతత్త్వమును ధ్యానించుచున్నావు ? అఖిల జగత్ప్రభుడవగు నీవే ధ్యానము చేయుచున్నావే. దీనిని మించిన యాశ్చర్యకర మేమున్నది? నాకిదంతయు వింతగ దోచుచున్నది. నీ బొడ్డుతమ్మినుండి పుట్టిన నేనే యీ విశ్వమునకు సృష్టికర్తను. ఇంక నీకంటె నధికుడెవడైన నున్నచో వానిని గూర్చి నాకు తెలుపుము. నీవే యీ లోకముల కన్నిటికిని కర్తవు భర్తవు హర్తవు. సర్వకారణములకు నీవు మూలకందము. సర్వ కార్యదక్షుడవు నీవే యని నేను బాగుగ నెఱుగుదును. నీ సంకల్ప బలముననే నే నీ జగములు రచింప శక్తుడనైతిని. ఆ హరుడును లయకాలమున నీ కోరికమేరకే లోకములనెల్ల సమయింపజాలును. నీ యాజ్ఞ చేతనే నింగిపై వేవెలుగు భ్రమించుచున్నాడు. వాయువు చల్లగా వెచ్చగా వీచును. అగ్ని ప్రజ్వలించును. మేఘము వర్షించును. నిన్ను మించిన పరదైవతమును నేనీ ముల్లోకములందింతకు ముందు చూచి యెఱుగను. అట్టి నీవును ధ్యానమున నుండుట జూడగ నాకు గొప్ప సందియము గలుగుచున్నది. నేను నీకు పరమ భక్తుడను. నాపై దయదలచి నాకంతయును తేటతెల్లముగ దెలుపుము. మహాత్ములకు తఱచుగ తెలుపరాని రహస్యములుండవని స్మృతి పలుకును.

అను బ్రహ్మ వినయవాక్కులు విని హరి యతనికిట్లు పలికెను: వత్సా! ఏకాగ్ర చిత్తమున నాలకింపుము. నా మనోగతమును వెల్లడించుచున్నాను. నీవీ యెల్లలోకములను పుట్టించువాడవని నేను పోషకుడనని రుద్రుడు సంహారకుడని నీవు దలంచుచున్నావు. సకల సురాసురులు మనుజులు నట్లే తలంతురు. నీవీ యెల్ల భువనములు పుట్టించుటకును నేను పెంచుటకును హరుడు ద్రుంచుటకును కారకులము. ఐనను వేదపారగులగు మహాశయులీ సర్వ మొకేమూలప్రకృతి - పరాశక్తి - మూలమున జరుగుచున్నదని భావింతురు. ఈ లోకములెల్ల పుట్టించుటకు నీయందు రాజసశక్తియు పెంచుటకు నాలోన సత్త్వశక్తియు త్రుంచుటకు హరునియందు తామస శక్తియు గలదని శాస్త్రమున చెప్పబడియున్నది.

ఆ మహత్తరశక్తియే లోపించినచో నీవు సృష్టి కృత్యమును జేయజాలవు. నేను పరిరక్షింపనోపను. హరుడు దెగటార్ప నశక్తుడు. మనమెల్లరమా దివ్యపరశక్తికి పరతంత్రులమై వర్తింతుము. దీనినిగూర్చి ప్రత్యక్ష పరోక్ష ప్రమాణములును గలవు, వినుము. నేను ప్రళయకాలమునందు పరతంత్రుడనై శేషశయ్యపై యోగనిద్రంజెందుదును. మరల కాలవశుండనై తగిన సమయము వచ్చినపుడు మేల్కాంతును. ఆ దేవికి వశుడనై నే నెల్లకాలమును తపమాచరించుచుందును. ఒక్కొక్కప్పుడు శ్రీ లక్ష్మితోడ యథా సుఖముగ విహార మొనర్చుచుందును. ఒక్కొక్కతఱి క్రూరదానవులతో దారుణము సర్వలోకభీకరమునై దేహములను నింద్రియములను బాధించు సమరము జరుపుదును. మున్ను నేను మహాజలరాశిపై నైదు వేలేండ్లు ఘోర బాహుయుద్ధము సలిపితిని. అది నీకు ప్రత్యక్ష విదితమేగద! నా చెవులమలమునుండి పుట్టి మదమున విఱ్ఱవీగిన మధుకైటభులను దుష్టదానవులా దేవదేవి దయవలననే నాచే దనుమబడిరి. ఆనాటి నా విజయశ్రీకి కారణము నీ వెఱుంగవా? ఓ మహాభాగా! ఆ పరాత్పర శక్తియే దానికి మూలకారణము. అట్టి శక్తిగూర్చి పదేపదే ఏల యడుగుదువు? ఆమె ఇచ్ఛ చేతనే నేను మొదట మణి ద్వీపమున స్త్రీరూపమునుండి అనంతరము సముద్రమున పుం రూపమున విష్ణుడనై విహరించుచున్నాను. ఆ తల్లి దయవలననే గదా యుగయుగమున కూర్మ వరాహ నరసింహాద్యవతారములు దాల్చుచుందును. ఈ తిర్యగ్యోనులందు పుట్టుట కెవ్వడిచ్చగించును? నాకే స్వేచ్ఛయున్నచో వరాహాది యోనులందు నేనేల జన్మింతును? లక్ష్మితోడి వినోదవిహారములు వదలి చేప మున్నగు నీచయోనులందు బుట్టుట కెవ్వనికి మనసొప్పును? పాపఱని సెజ్జవదలి గరుత్మంతుని మూపుపైనెక్కి స్వతంత్రేచ్ఛతో ఏవాడు బవరమొనర్ప నుత్సహించును? మునుపొకప్పుడు నీవు చూచుచుండగనే వింటి యల్లెత్రాటిచేత నా తల తెగిపడినదిగదా! శిల్పనిపుణుడగు త్వష్ట వెనువెంటనే గుఱ్ఱముతలదెచ్చి నా మొండెమున కతికించెను. ఆనాటి నుండి నన్ను హయగ్రీవుడనుచున్నారు. ఇదంతయును లోకవిడంబనమేసుమా! నా కాత్మ స్వాతంత్య్రమే యున్నచో నిట్లెట్లు జరుగును? కాన నేను స్వతంత్రుడనుగాను. సర్వవిధముల శక్తి పరతంత్రుడను. అందుచేత నేనా శక్తినే రేయింబవళ్లెడతెగక ధ్యానించుచుందును. ఇంతకుమించి నాకేమియు తెలియదు. 

నారదుడిట్లనియె: ఈ ప్రకారముగ విష్ణువు బ్రహ్మతో బలికెను. ఓ వ్యాసమునీ! నేనా బ్రహ్మవలన సర్వము వింటిని. కనుక నీవును నిత్యకల్యాణ ప్రదమగు పురుషార్థ ప్రాప్తికి బూనుకొని ఆ దేవీ పదకమలములను నీ హృదయారవిందమున నిరంతరము భజింపుము. నీవు కోరినదెల్ల ఆ తల్లియే ప్రసాదించుచుండును. ఇందు సందియ మావంతయును లేదు. 

సూతు డిట్లనియె: నారదుడీవిధముగ దెలుపగా వ్యాసుడా దేవి దివ్యచరణారవిందములను లోనిడెందమున దలంచుచు తపము చేయుటకు పర్వతము జేరెను.

అధ్యాయము 5 శ్రీ హయగ్రీవావతారవర్ణనము

Chapter 3 Details about the Puranas and Vyasas - అధ్యాయము 3 పురాణములను-వ్యాసులను గుఱించిన వివరములు

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 3

పురాణములను-వ్యాసులను గుఱించిన వివరములు

సూతుండిట్లనియె :
ఓ మునులారా! సత్యవతీ తనయుడగు వ్యాసమహర్షి వలన నేను సకలపురాణములను వింటిని. వానిని మీకు చెప్పుదును. మీ రెల్లరును కడు శ్రద్ధగా నాలకింపుడు. మకారము మొదటి యక్షరముగా గల పురాణములు రెండు. భకారము తొలుత గలవి రెండు. బ్రకారము మొదట గలవి మూడు. వకారము ముందుగలవి నాలుగు. ఇవికాక అ-నా-ప-లిం-గ-కూ-స్క అను నక్షరములు ముందుగల వేరువేరు పురాణములు గలవు. వీనిలో మొదటిది మత్స్యపురాణము. ఇది పదునాలుగు వేల శ్లోకములలో వ్రాయబడినది రెండవది మార్కండేయ పురాణము. ఇది అత్యద్భుతమైనది. ఇందు తొమ్మిదివేల శ్లోకములు గలవు. భవిష్య పురాణమునందు పదునాల్గువేల యైదువందల శ్లోకములు గలవు. శ్రీ మహాభాగవతము పదునెనిమిదివేల శ్లోకములతోను బ్రహ్మపురాణము పదివేల శ్లోకములతోను విలసిల్లుచున్నవి. బ్రహ్మాండ పురాణ మందలి శ్లోకసంఖ్య పండ్రెండు వేల యొకవంద. బ్రహ్మవైవర్త పురాణమందలి శ్లోక సంఖ్య పదునెనిమిదివేలు. వామన పురాణమందు పదివేల శ్లోకములును వాయు పురాణమునందు నిరువది నాలుగువేల యారువందల శ్లోకములును గలవు. శ్రీ విష్ణు పురాణము మహాద్భుతమైనది. అది యిరువది మూడువేల శ్లోకములతో నొప్పారుచున్నది. పరమాశ్చర్యకరమైన వరాహ పురాణమందు శ్లోకము లిరువదినాల్గువేలు గలవు. అగ్ని పురాణమున మొత్తము శ్లోకములు పదారు వేలును నారద పురాణమున నిరువదైదువేల శ్లోకములు నలరుచున్నవి. శ్రీ పద్మపురాణ మేబది యైదువేల శ్లోకములతో విస్తృతమైయున్నది. లింగ పురాణమునందు పదునొకండువేల శ్లోకములు గలవు. శ్రీహరి గరుడ పురాణమును పందొమ్మిదివేల శ్లోకములలో వెల్లడించెను. కూర్మ పురాణమందు పదునేడువేల శ్లోకములు గలవు. స్కంద పురాణ మెనుబది యొక్క వేల శ్లోకములతో తనరారు చున్నది. ఇది పురాణములయు వానియందలి శ్లోకసంఖ్యలయు వివరణము.

ఇపుడు ఉప పురాణముల గూర్చి వినుడు. సనత్కుమారము నారసింహము నారదీయము శైవము దౌర్వాసము కాపిలము మానవము ఔశనసము వారుణము కాలికము సాంబము నందికృతము పారాశరుడు విపులముగ చెప్పిన యాదిత్యపురాణము మాహేశ్వరము భాగవతము వాసిష్ఠము ననుపేరులతో నుపపురాణములు పదునెనిమిది గలవని మహాత్ములు వాక్రుచ్చుచున్నారు. ఈ విధముగ సత్యవతీ తనయుడగు శ్రీ వ్యాసభగవానుడు పదునెనిమిది మహాపురాణములను వివరించెను. ఆ పిదప వానినన్నిటి సారమును గైకొని శ్రీ మహాభారతమను పేర ప్రసిద్ధమైన గ్రంథమును విరచించెను. ప్రతి మన్వంతరమునందును ద్వాపర యుగములు వచ్చుచుండును. ద్వాపరము వచ్చినపుడెల్ల ధర్మాద్వైతమతితో వ్యాసుడు యథావిధిగా పురాణములను ప్రపంచించు చుండును. ప్రతి ద్వాపరమందును శ్రీ హరియే వ్యాసుడుగ నవతరించి జనులకు మేలుబాట చూపుటకు ప్రతియొక వేదమును అనేకములగు ఉప భాగములుగ విభజించును. ప్రతి కలియుగమునను బ్రాహ్మణులల్పాయువులు నల్పమతులునై యుందురు. వ్యాసుడు వారి కందరికిని మేలు వెలుగు చూపగోరి యుగయుగమునందును పావన పురాణ సంహితలను ప్రకటించును. స్త్రీలకును శూద్రులకును ద్విజబంధువులకును వేదము వినుట కధికారము లేదు. అట్టివారి హితము గోరి పురాణములు రచింపబడినవి. ఇపుడేడవ వైవస్వత మన్వంతరము జరుగుచున్నది. ఈ మన్వంతరమందలి యిరువదెనిమిదవ ద్వాపరము ప్రాప్తించగా నా గురుడు ధర్మవిదుడు నగు సత్యవతీ సుతుడు వ్యాసుడు వ్యాసపీఠమలంకరించి యున్నాడు. ఇక మీదట ఇరువది తొమ్మిదవ ద్వాపరమున ద్రోణపుత్రుడగు అశ్వత్థామ వ్యాసపదము నలంకరించును. ఇట్లిప్పటికిరువదేడుగురు వ్యాసులు వచ్చి వెళ్ళిరి. వీరు ప్రతి ద్వాపరమందును పురాణ సంహితలు వ్రాసిరి.

ఋషులిట్లనిరి: మహాభాగుడవగు సూతమునిచంద్రా! ప్రతి ద్వాపరయుగమునందును పురాణ సంహితలు వెలయించిన వ్యాసమహర్షుల పేరులు దయతో మాకు తెలుపుము. సూతుడిట్లనియె: మొదటి ద్వాపరమున బ్రహ్మయే స్వయముగ వ్యాసుడై వేద విభజన గావించెను. రెండవ ద్వాపరమునందు ప్రజాపతి వ్యాస కృత్యము నెఱపెను. మూడవ ద్వాపరమందు శుక్రుడును నాలవ యైదవ యాఱవ ద్వాపరములందు వరుసగ గురు రవి మృత్యులును వ్యాసపదవులందు శోభిల్లిరి. ఇంద్రు డేడవ ద్వాపరమున వసిష్ఠు డెనిమిదవ ద్వాపరమున సారస్వతుడు తొమ్మిదవ ద్వాపరమున త్రిధాముడు పదవ ద్వాపరమున వ్యాసకార్యములు నిర్వహించిరి. పదునొకండవ ద్వాపరమున త్రివృషుడు పండ్రెండవ ద్వాపరమందు భరద్వాజుడు పదుమూడవ ద్వాపరంబున నంతరిక్షుడు పదునాల్గవ ద్వాపరమున ధర్ముడు పదునైదవదానిలో త్రైయారుణి పదునారవ దానిలో ధనంజయుడు పదునేడవ ద్వాపరమునందు మేధాతిథి పదునెనిమిదవ ద్వాపరమున వ్రతియును పందొమ్మిదవ ద్వాపరమున అత్రియు నిరువదవ ద్వాపరమున గౌతముడును నిరువది యొకటవ ద్వాపరమున నుత్తముడగు హర్యాత్ముడును ఇరువది రెండవ ద్వాపరమునందు వేనుడు వాజశ్రవుడు నిరువది మూడవ దానిలో సోముడాముష్యాయణుడును నిరువది నాలుగవ ద్వాపరములో తృణబిందువు నిరువది యైదవ ద్వాపరమున భార్గవుడును ఇరువదియారవ ద్వాపరములో శక్తియు ఇరువదేడవ ద్వాపరములో జాతుకర్ణియు ఇరువదెనిమిదవ ద్వాపరమునందు కృష్ణద్వైపాయనుడగు వ్యాసుడును వ్యాసపీఠమలంకరించిరి. ఇట్లు మీకిరువదియెనిమిది ద్వాపరములందును వచ్చిన ఇరువది యెనిమిదిమంది వ్యాసులను గుఱించి తెలిపితిని.

వారిలో శ్రీకృష్ణ ద్వైపాయనుడగు వ్యాసుడు శ్రీదేవీభాగవతపురాణము ప్రవచించగా నేను వింటిని. ఆ పురాణము పుణ్యకరమైనది. ఈ కలి సంసార పాతకములను బాపజాలినది. ఆ పురాణము కామదము ముక్తిదము. అది సకలాగమ సారముతో నవరసములతో చమత్కారముతో వెలయుచున్నది. ముముక్షులకది యెంతేని ప్రీతికరమైనది. శ్రీవేదవ్యాసుడు అతి శుభకరమగు ఆ పురాణమును రచించి దానిని మహాత్ముడు వైరాగ్యసంపన్నుడు అరణి సంజాతుడు శుకనామధేయుడు అగు తన పుత్రునిచే అధ్యయనము చేయించెను. అయోనిజుడు అద్భుతధీశాలి తన పుత్రుడనగు శుకునకు వ్యాసుడు మహా మహిమాన్వితమైన యీ పురాణ రాజమును బోధించు నపుడు నే నచ్చోటనే యుంటిని. కావున ఆ వ్యాసగురుని యనుగ్రహమున నాదేవీ పురాణ రహస్యము సర్వము నేనును విను భాగ్యము పొందితిని. ఈ శ్రీమద్దేవీభాగవతము వేదకల్ప వృక్షమున ఫలించిన దివ్యఫలము. దుర్గమ సంసార సాగరమును దాటించు నావ. ఈ పురాణామృతసారము పెక్కు లాఖ్యానములతో నొప్పుచున్నది. దానిని శుకుడు ప్రేమభక్తి నిండార తన కర్ణపుటములు తనివార గ్రోలెను. అట్టి యద్భుత దివ్యకథలు వినిన ప్రతివాడును కలి భయమునుండి ముక్తుడగును. ఇది ముమ్మాటికిని సత్యము. పాపులలో నతిపాపియైనను వేదధర్మ రహితుడైనను స్వధర్మముల బాటించని వాడైనను ఎట్టివాడైన నేనెపముతో నైనను ఈ పరమోత్తమ శ్రీదేవీ పురాణమును భక్తిప్రపత్తులతో వినినచో నట్టివా డిచ్చోటనే విపుల భోగభాగ్యము లనుభవించి పిదప పరమపావని యగు భగవతి సుప్రసాదమున యోగులనుభవించు నక్షయ దేవీ లోకము లందగలడు. ఏ మానవు డీ పరమమగు శ్రీదేవీ పురాణమును నిరంతరమును చక్కగ వినుచుండునో వాని హృదయకమలమందు ధ్యానగమ్యయు సత్పురుషులకు ప్రియతమయు నిర్గుణయు శ్రీవిద్యారూపయు హరిహరాదులకు నలభ్యయు నగు సర్వకారణ కారణ భగవతి ప్రత్యక్షమగుచుండును. ఇతర ప్రాణులవలె కాక సర్వావయవములతో నొప్పు ఈ దేహమును ధరించిన యీ నరజన్మ కడు దుర్లభమైనది. ఇంతటి ఉత్తమ జన్మమునెత్తియు మంచి వాక్కులు గల్గియు మూఢుడీ సంసారసాగరమును దాటించగలిగి ముక్తి నొసగజాలినట్టి యీ దేవీ భాగవతమను నావనుగాంచియు దాని నుపయోగించుకొనజూడనిచో వాడు విధివంచితుడు. ఎవ్వడు మానవజన్మము పొంది వినుటకు సమర్థములగు రెండు చెవులుండియు రాగియై పరనిందలే వినగోరునో - పురుషార్థము లొసంగునదియు నవరసభరితమును నిర్మలమును నగు నీ శ్రీదేవీ భాగవతమును చెవులార వినగోరడో వాడు మందమతి-తనకుతాను నాశము కలిగించుకొనువాడు; కానిచో ముక్తిశ్రీ నొసంగు దీని నేలవినడు?

అధ్యాయము 4 శ్రీ వ్యాసమహర్షి పుత్త్ర సంతతికై పరితపించుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...