Thursday, April 9, 2026

Chapter 6 Madhu Kaitabhu's war efforts - అధ్యాయము 6 మధుకైటభుల యుద్ధ ప్రయత్నములు

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 6

మధుకైటభుల యుద్ధ ప్రయత్నములు

ఋషులిట్లనిరి : సూతమునివర్యా! శ్రీహరికి మధుకైటభులతో మహావారాశిలో నైదువేలేండ్లు ఘోరముగ పోరాటము జరిగెనంటివి. దేవతల కజేయులై దుర్ధరులగు నాదానవవీరులు సంద్రమున నెట్లు పుట్టిరి. భగవానుడు వారినెట్లు హతమార్చగల్గెను? మా కా పరమాద్భుత చరిత్ర వెల్లడించుము. మేము సత్కథా శ్రవణ కుతూహలులము. మీరు బహుశ్రుతులు. మహా ప్రవక్తలు. మీ బోటి మహా మునులతో మాకు దైవయోగమున నానందకర సంగమము గల్గినది. మొఱటు వానితో కలియుట విషముకన్న దుర్భరము. సహృదయుడగు రసజ్ఞుతోడి సాంగత్యమమృతరససమము. పశువులన్నియును తమకు స్వభావవిహితమగు ఆహారము దినుచు నొండొంటితో గలియుచు బ్రతుకుచుండును. రతి సుఖమును ననుభవించును. కాని వానికి నిత్యానిత్య వస్తువివేకముగాని మోక్షదాయకమగు జ్ఞానము గాని యుండదు. శ్రీ హరి సత్కథలు విననేరని వానినా పశువుకన్న నీచునిగ నెంచవలయును. జింకలు మున్నగు జంతువులు చెవుల కింపు చేకూర్చు మధురనాదము వినగోరును. ఆ చెవులు లేని పాములు మధుర నాదస్వర మాలించినంతన తన్మయత నందును. జ్ఞానేంద్రియములలో కన్నులు చెవులు ఈ రెండే మంచి మేలొన గూర్చునవి. చెవుల వలన వస్తువునెఱుగు తెలివిగల్గును. చూపుల వలన నుల్లము రంజిల్లును. శ్రవణము సాత్త్వికము. సాహిత్య శ్రవణము రాజసము. యుద్ధవార్తలు నిందలు వినుట తామస శ్రవణము. పండితోత్తములు మరల సాత్త్విక శ్రవణమును ముత్తెఱంగుల విభజించిరి. అవి యుత్తమము మధ్యమము నధమమున నబడును. ఉత్తమము ముక్తి నొసంగును. మధ్యమము స్వర్గసీమ జేర్చును. అధమము భోగదాయకము. నవరస భరితమై రాజసమగు సాహిత్య శ్రవణమును మువ్విధములు స్వీయతోడి రతి విషయమును ప్రతిపాదించునది యుత్తమము. వారాంగనా సంగమ విషయకము మధ్యమము. పరస్త్రీగమన విషయక మధమము.

తామస శ్రవణమును మూడు విధములు. చంపదగిన వారితో బోరుట సాత్త్వికము. పాండవేయుల పగిది విద్వేష కారణముగా పోరుట మధ్యమము. కారణము లేక వివాదములకు కాలుద్రవ్వుట యధమము. ఇన్నిటిలోన నీ పురాణశ్రవణమే ముఖ్యమైనది. అది బుద్ధి వికాసము గల్గించును. పుణ్యప్రదము. పాప ప్రణాశకము. నీవు మున్ను వ్యాసుని వలన సకలార్థ సాధకము శుభకరమునగు పురాణ కథలను వింటివి. వానినే మాకిపుడు వినిపింపుము. 

సూతుడిట్లనెను : ఓ మహాభాగులారా! మీరు సత్కథలు వినగోరుచున్నారు. నేనును మీకు వానిని ప్రవచింప దలంచితిని. కనుక నీ భూతలమున మీరు ధన్యులరు. నేనును ధన్యుడను. పూర్వము ప్రళయకాలమున ముజ్జగములు లయమంది లోకమేకార్ణవమయ్యెను. అప్పుడు శేషశయ్యపై దేవదేవుడగు విష్ణువు యోగనిద్రలో నుండెను. ఆ విష్ణుని చెవి మలము నుండి మహాబలులగు మధుకైటభులను దానవులు పుట్టిరి. వా రా మున్నీటి నీటిలో పెంపొందిరి. అందాస్థూల కాయు లిటునటు తిరుగాడుచు క్రీడాసక్తులై యుండిరి. ఆ దానవ సోదరులు తమ మనములందిట్లు దలపోసిరి: 

"కారణము లేక కార్యము సంభవించదు అను నానుడి లోకమున సహజము. ఆధారములేనిచో నాధేయమును లేదు. కనుక నాధారాధేయములం గూర్చిన భావము మా మనములందు గల్గుచ్న్నుది. ఈ యనంత జలరాశి సుఖము గొల్పుచు నపారమై యున్నది. దీనికి మూలమేది? దీనినెవ్వరెట్లు సృజించిరి? మేమీ మున్నీటిలోన నేల మునిగి యున్నాము? మేమెట్లు పుట్టితిమి? మమ్ము పుట్టించిన తల్లి తండ్రులెవరు? వారెక్కడ? అను విషయములు మాకు దెలియుట లేదు."

సూతు డిట్లనియె : ఇట్లెంతగ నాలోచించినను వారొక నిర్ణయమునకు రాలేకపోయిరి. తుదకు కైటభుడు తన చెంత నున్న మధువును గని యిట్లనియెను : 

"అన్నా ! మన మీ జలమందుండుట కొకానొక మహాశక్తి కారణముగావచ్చును. ఆ శక్తి యచలమైనది. మహాబలముగలదియని నా యభిప్రాయము. మన యునికి కామెయే హేతువుగావచ్చును. ఈ కన్నుచూపు మేరలో నిండి కనిపించు నీ మహాజల మంతటి కామెయే మూలాధారము. ఆమె యాధారముననే జలమంతట నిండియున్నది. ఆ పరమశక్తియే మనకును మూలాధారముగావచ్చును. ఇట్లు చైతన్యవంతులై వారిరువురు తలచుచున్న సమయమున గగన సీమనుండి వాగ్బీజరూపమగు నొక ధ్వని వారి చెవుల బడెను. వారానాదము విని పట్టుదలతో దానినభ్యసింప నారంభించిరి. అంతలో నాకసమున తళుక్కుమను నొక్క మెఱుపు మెఱసి కనబడెను. మనము విన్నది మహామంత్రము. మన ధ్యానమే సగుణమై వెలుగు రూపుదాల్చి పొలిచినది. ఇందు సందియము లేదని వారు తలంచిరి. వారపు డన్నపానీయములు ముట్టక జితేంద్రియులై తన్మయులై వేయేండ్లతిఘోరముగ జపధ్యానములు చేసి తపము సాగించిరి. అంత వారిపై పరమ శక్తికి దయగలిగెను. ఆ క్రూర దానవులింకను పట్టుదలతో తపము సేయ నిశ్చయించుకొనిరి. ఆ రక్కసులు దీనులై యుండుటగని కనికరింపదలచి దేవి యశరీర వాక్కులతో వారితో నిట్లు పలికెను: 

"ఓ దానవులారా! మీ తపమునకు సంతసించితిని. మీ వాంఛితము తెలుపుడు. తప్పక ఈడేర్తును."

సూతు డిట్లనియె : ఆ దేవి వాక్కులు విని దానవు లిట్లనిరి : 

"ఓ దేవీ! మాకు స్వచ్ఛంద మరణము వరముగ నిమ్ము. వాణి యిట్లు పలికెను. ఓ దానవులారా! నా దయచే మీకు స్వచ్ఛంద మరణమే గల్గును. దేవదానవులకు మీ రజేయుల గుదురు. సందియము లేదు. 

సూతు డిట్లనియె : అట్లు దేవి వలన వరములు బడసి యా క్రూరులు మదగర్వితులై నీటిలోని జలచరములతో స్వేచ్ఛగ క్రీడించుచుండిరి. కొంతకాలమునకు తరువాత కమలాసనము నందున్న ప్రజాపతియగు బ్రహ్మ వారి కంటబడెను. ఆ యిరువురు బలశాలురు బ్రహ్మనుగాంచి సంతసించి యుద్ధకాముకులై బ్రహ్మ కిట్లనిరి : 

"మాకు యుద్ధమను గ్రహింపుము. కానిచో నీ వీ కమలము వదలి వేరొక చోటి కేగుము. నీవు కడు దుర్బలుడవు. నీకీ శుభాసనము తగదు. ఇచ్చోటు వీర భోగ్యము. నీవు పిరికివాడవైనచో మమ్ము వదలి యేగుము. దానవుల మాటలు విని బ్రహ్మ చింతాక్రాంతుడయ్యెను. మహాబలవంతులగు వారినిగని నేనిపుడేమి చేయవలయును? అని తాపసుడగు బ్రహ్మ మదిలో చింతింప సాగెను.

అధ్యాయము 7 విష్ణుప్రబోధము

No comments:

Post a Comment

Chapter 19 Sri Sukuni's married life - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడ...